శక్తి భారత్ నిర్మాణమే లక్ష్యం
వికాస్‌పర్వ్ సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
సాక్షి, విజయవాడ బ్యూరో: శక్తిమంతమైన భారతదేశాన్ని తయారుచేయడమే తమ లక్ష్యమని, అందుకోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. రెండేళ్ల నుంచి అవినీతి రహిత పాలనను అందిస్తున్నామన్నారు. ఎన్డీయే రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మంగళవారం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాలులో బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో వికాస్‌పర్వ్ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ వార్షికోత్సవాలప్పుడు ముఖ్యమంత్రులు, పెద్దలకు విందులిచ్చేవారని, కానీ స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి ఎన్డీయే ప్రభుత్వం ప్రజలవద్దకొచ్చి చేసిన పనులను చెబుతోందన్నారు.
యూపీఏ పాలనలో పేదవాడి కోసం రూపాయి విడుదల చేస్తే పది పైసలు మాత్రమే అతనికి చేరేదని, కానీ ఎన్డీఏ హయాంలో ప్రతి పైసా పేదవాడికి చేరేందుకు జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. దేశమంతా పరిశుభ్రంగా ఉండేందుకు స్వచ్ఛ భారత్‌ను అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. విజయవాడలో కాఫీకి పది రూపాయలు ఖర్చుపెడుతుంటే.. సురక్ష బీమా యోజనను ఒక రూపాయికే ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని స్మృతి తెలిపారు. ఏపీలో ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్‌ఐటీ, నిట్, సెంట్రల్ యూనివర్సిటీకి ఒక్క తన శాఖ నుంచే మూడు వేల కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. ఈ విషయాలన్నింటినీ బీజేపీ నేతలు, కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కేంద్ర షిప్పింగ్, రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రి పొన్ను రాధాకృష్ణన్ మాట్లాడుతూ విజయవాడ బెంజి సర్కిల్ ఫ్లైఓవర్‌ను నిర్మలా కాన్వెంట్ జంక్షన్ నుంచి రమేష్ ఆస్పత్రి జంక్షన్ వరకు పొడిగించే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.
సీఎం అడిగినవి చేయడానికి సిద్ధం
సీఎం చంద్రబాబు అడిగినవి చేయడానికి ప్రధాని సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. ఎన్డీయే రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, విజయాలను వివరించేందుకు విజయవాడకు వచ్చిన మంత్రి మంగళవారం స్థానిక కాకరపర్తి భావనారాయణ (కేబీఎన్) కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 45 నిమిషాలపాటు ప్రత్యేక హోదా, నీట్ తదితర అంశాలకు సంబంధించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ప్రధాని మోదీ, చంద్రబాబు ఇద్దరి నాయకత్వంలో రానున్న కాలంలో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని స్మృతి చెప్పారు.