Union Minister Smriti Irani
-
మోదీ మళ్లీ వస్తేనే దేశాభివృద్ధి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రధాని నరేంద్ర మోదీ పేదల సంక్షేమానికి పెద్ద పీట వేశారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. రాను న్న పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని సోమ వారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో స్మృతి ఇరానీ పాల్గొని మాట్లాడారు. దేశ సంక్షేమం కోసం, అవినీతిపరుల నుండి డబ్బును కక్కించేందుకు బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరముందన్నారు. మోదీ మళ్లీ వస్తేనే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు. అగ్రవర్ణ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దానిపై టీఆర్ఎస్ సర్కార్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయమై బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంకుఠిత దీక్షతో పని చేయాలని పిలుపునిచ్చారు. పేదల ఆరోగ్యం కోసం, రూ.5 లక్షల వరకు వైద్య చికిత్సలను పూర్తి ఉచితంగా అందించేందుకు కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెడితే రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం దానిని నీరుగార్చేందుకు కుట్రలు చేసిందన్నారు. కాంగ్రెస్ నాయకులు విదేశాల్లో ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. బీజేపీ మహిళలకు గౌరవం ఇచ్చి గౌరవించిందన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ కొన్ని పార్టీల కారణంగా రాజకీయాల్లో విలువలు నశించిపోతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
పత్రికల సమస్యలు పరిష్కరించండి
న్యూఢిల్లీ: దేశంలో పత్రికలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతీఇరానీకి ఇండియన్ న్యూస్‌పేపర్స్ సొసైటీ (ఐఎన్ఎస్) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐఎన్ఎస్ అధ్యక్షురాలు అఖిలా ఉరంకార్ నేతృత్వంలో పలు పెద్ద, చిన్న పత్రికలకు చెందిన ఎనిమిది మంది ప్రతినిధుల బృందం ఇటీవల కేంద్ర మంత్రిని కలసి వినతిపత్రం అందజేసింది. న్యూస్‌ప్రింట్ ధరల పెరుగుదల, ప్రకటనలు తగ్గిపోవడం తదితర సమస్యల కారణంగా చిన్న పత్రికలు మూతపడే స్థితికి చేరుకున్నాయని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల రేట్లను పెంచి తమను ఆదుకోవాలని కోరింది. ఈ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ సానుకూలంగా స్పందించారని ఐఎన్ఎస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
కేంద్రమంత్రికి అవమానం..గాజులతో దాడి
అహ్మదాబాద్: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఓ వ్యక్తి ఝలక్ ఇచ్చాడు. గుజరాత్‌లోని ఆమ్రేలీలో నిర్వహించిన ఓ ఫంక్షన్లో ఆమె మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమెపైకి గాజులు విసిరేశాడు. వందేమాతరం అంటూ గట్టిగా నినాదాలు చేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అమ్రేలీలో వేడుక నిర్వహిస్తుండగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అక్కడికి అతిథిగా వచ్చారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుండగా కాస్వాలా అనే వ్యక్తి లేచి రెండు మూడు గాజులు అనూహ్యంగా ఆమెపైకి విసిరాడు. అనంతరం వందేమాతరం అంటూ నినాదాలు చేశాడు. అయితే, ఆ వ్యక్తికి స్మృతి ఇరానీకి మధ్య కాస్త దూరం ఉండటంతో ఆమెను తాకలేదు. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని బయటకు తీసుకెళ్లారు. ఆ వ్యక్తికి భండారియా అనే గ్రామంగా గుర్తించారు. అయితే, రైతులపై రుణమాఫీ, అప్పుల విషయాన్ని కేంద్రమంత్రి చెప్పే ప్రయత్నంలో భాగంగా అతడు అలా చేశాడని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పగా పోలీసులు తోసిపుచ్చారు. -
గుడిసెలో పుట్టి పెరిగా : కేంద్ర మంత్రి
సాక్షి, చెన్నై : గుడిసెలో పుట్టి పెరిగాను...కష్టం అంటే ఏమిటో తెలిసిన దాన్ని అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. ఈషా యోగా కేంద్రంలో జరిగిన సదస్సులో పలువురు సందించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, తన జీవితంలో ఎదురైన కష్టాలను గుర్తు చేసుకున్నారు. కోయంబత్తూరు పర్యటనకు వచ్చిన స్మృతి ఇరానీ తెగిన చెప్పును కుంటించుకున్న అనంతరం ఈషా యోగా కేంద్రానికి వెళ్లారు. అక్కడ జరిగిన సదస్సులో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఓ యువకుడు సంధించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో చిన్నతనంలో పడ్డ కష్టాలను వివరించారు. ఢిల్లీలోని గుడిసె ప్రాంతంలో పుట్టి, పెరిగానని పేర్కొన్నారు. తన తండ్రి కష్ట జీవి అని, తల్లి హోటల్లో పనిచేసి తీసుకొచ్చే ఏదేని పదార్థాలే తన తో పాటుగా ముగ్గురు అక్కలకు ఆహారంగా వ్యాఖ్యానించారు. పుట గడవడమే కష్టంగా ఉన్న కుటుంబంలో నుంచి వచ్చిన తన మీద దేవుడు కరుణ చూపించాడని, కష్ట పడి పైకి వచ్చానని, కష్టం ఏమిటో తెలిసిన వ్యక్తిగా పేర్కొన్నారు. దేవుడు కరుణించి ఉన్నత స్థితిలో కూర్చోబెట్టాడని, జీవితంలో ఇది చాలు అన్నట్టు స్పందించారు. తాను పుట్టి పెరిగిన గుడిసె ప్రాంతానికి ఎదురుగానే ప్రస్తుతం బంగళాలలో ఉన్నట్టు పేర్కొన్నారు. -
శక్తి భారత్ నిర్మాణమే లక్ష్యం
వికాస్‌పర్వ్ సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సాక్షి, విజయవాడ బ్యూరో: శక్తిమంతమైన భారతదేశాన్ని తయారుచేయడమే తమ లక్ష్యమని, అందుకోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. రెండేళ్ల నుంచి అవినీతి రహిత పాలనను అందిస్తున్నామన్నారు. ఎన్డీయే రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మంగళవారం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాలులో బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో వికాస్‌పర్వ్ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ వార్షికోత్సవాలప్పుడు ముఖ్యమంత్రులు, పెద్దలకు విందులిచ్చేవారని, కానీ స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి ఎన్డీయే ప్రభుత్వం ప్రజలవద్దకొచ్చి చేసిన పనులను చెబుతోందన్నారు. యూపీఏ పాలనలో పేదవాడి కోసం రూపాయి విడుదల చేస్తే పది పైసలు మాత్రమే అతనికి చేరేదని, కానీ ఎన్డీఏ హయాంలో ప్రతి పైసా పేదవాడికి చేరేందుకు జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. దేశమంతా పరిశుభ్రంగా ఉండేందుకు స్వచ్ఛ భారత్‌ను అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. విజయవాడలో కాఫీకి పది రూపాయలు ఖర్చుపెడుతుంటే.. సురక్ష బీమా యోజనను ఒక రూపాయికే ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని స్మృతి తెలిపారు. ఏపీలో ఐఐటీ, ఐఐఎం, ట్రిపుల్ఐటీ, నిట్, సెంట్రల్ యూనివర్సిటీకి ఒక్క తన శాఖ నుంచే మూడు వేల కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. ఈ విషయాలన్నింటినీ బీజేపీ నేతలు, కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కేంద్ర షిప్పింగ్, రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రి పొన్ను రాధాకృష్ణన్ మాట్లాడుతూ విజయవాడ బెంజి సర్కిల్ ఫ్లైఓవర్‌ను నిర్మలా కాన్వెంట్ జంక్షన్ నుంచి రమేష్ ఆస్పత్రి జంక్షన్ వరకు పొడిగించే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. సీఎం అడిగినవి చేయడానికి సిద్ధం సీఎం చంద్రబాబు అడిగినవి చేయడానికి ప్రధాని సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. ఎన్డీయే రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, విజయాలను వివరించేందుకు విజయవాడకు వచ్చిన మంత్రి మంగళవారం స్థానిక కాకరపర్తి భావనారాయణ (కేబీఎన్) కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 45 నిమిషాలపాటు ప్రత్యేక హోదా, నీట్ తదితర అంశాలకు సంబంధించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ప్రధాని మోదీ, చంద్రబాబు ఇద్దరి నాయకత్వంలో రానున్న కాలంలో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని స్మృతి చెప్పారు. -
స్మృతిపై చర్యలు తీసుకోవాల్సిందే!
లోక్‌సభలో విపక్షాల ఆందోళన న్యూఢిల్లీ: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సభను తప్పుదారి పట్టించారంటూ విపక్షాల ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. ఇరానీపై తాము ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై మాట్లాడేందుకు అవకాశమివ్వాలంటూ కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభలో గందరగోళం సృష్టించారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. తరువాత కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ... రోహిత్ ఆత్మహత్యాయత్నం అనంతరం ఆయనకు వైద్యం అందించలేదని స్మృతి చెప్పారని, కానీ అది అవాస్తవమని పేర్కొన్నారు. -
హక్కుల తీర్మానాల హోరు!
స్మృతి ఇరానీపై హక్కుల ఉల్లంఘన తీర్మానానికి పట్టుబట్టిన కాంగ్రెస్ పార్లమెంటు ఉభయ సభల్లో ఇరు పక్షాల నినాదాలు, ఆరోపణలు సాక్షి, న్యూఢిల్లీ: అధికార, ప్రతిపక్ష సభ్యుల హక్కుల ఉల్లంఘన తీర్మానాల హోరుతో మంగళవారం పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనకు సంబంధించి సభకు తప్పుడుసమాచారం అందించారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై విపక్షాలు హక్కుల ఉల్లంఘన తీర్మానమిచ్చి, చర్చకు పట్టుబట్టగా... దీనికి ప్రతిగా కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింధియా గత నెల 24న సభకు అవాస్తవాలు వెల్లడించారంటూ బీజేపీ హక్కు ల నోటీసు ఇచ్చింది. తొలుత గత నెల 24న లోక్‌సభలో జరిగిన చర్చలో హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ తీవ్రవాదని, జాతి వ్యతిరేక భావజాలం ఉన్నవాడని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారంటూ జ్యోతిరాదిత్య సింధియా సభకు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా సింధియా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, దీనిపై హక్కుల తీర్మానాన్ని చేపట్టాలని లోక్‌సభలో బీజేపీ చీఫ్ విప్ రామ్ మేఘ్వాల్ స్పీకర్‌ను కోరారు. సింధియా వ్యాఖ్యలతో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని, రోహిత్ విషయంలో తానెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని దత్తాత్రేయ పేర్కొన్నారు. స్మృతి ఇరానీకి రాసిన లేఖలో కూడా తాను రోహిత్ పేరును ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. ‘‘నేను ఓబీసీ వర్గానికి చెందిన ఓ పేద కుటుంబం నుంచి వచ్చాను. నా తల్లి ఉల్లిపాయలు అమ్ముతుండేది. నేనేంటో తెలంగాణ, ఏపీల్లో అందరికీ తెలుసు. నా ప్రతిష్టను సింధియా దిగజార్చారు.’’ అని పేర్కొన్నారు. తాను ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ఆమోదించాలని స్పీకర్‌ను దత్తాత్రేయ కోరారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చారు. ఇరానీపై అంతకు ముందే తాము ఇచ్చిన హక్కుల ఉల్లంఘన తీర్మానం నోటీసుపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ పట్టుబట్టారు.పార్లమెంటు ఉభయ సభలనూ ఆమె తప్పుదోవ పట్టించారని, ఇది చాలా విచారకర విషయమని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్‌కు జేడీయూ నేత శరద్ యాదవ్ మద్దతు ప్రకటించారు. -
ఆ కరపత్రాలు నిజమైనవే!
♦ దుర్గామాతను దూషిస్తూ జేఎన్‌యూలో లభ్యమైన పత్రాలపై రిజిస్ట్రార్ నిర్ధారణ ♦ నకిలీవంటున్న విద్యార్థి సంఘాలు న్యూఢిల్లీ: జేఎన్‌యూలో సంఘ వ్యతిరేక శక్తులున్నాయనేందుకు రుజువులుగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చూపిన కరపత్రాలు నిజమైనవేనని వర్సిటీ రిజిస్ట్రార్ భూపీందర్ మంగళవారం నిర్ధారించారు. వర్సిటీలో మహిషాసుర సంస్మరణ కార్యక్రమం సందర్భంగా దుర్గామాతను దూషిస్తూ కరపత్రాలు ప్రచురించారంటూ వాటిలోని అంశాలను లోక్‌సభలో స్మృతి చదవడం వివాదమవడం తెలిసిందే. కరపత్రాలకు సంబంధించి అప్పుడు స్థానికంగా పోలీసు కేసు నమోదైందని, వర్సిటీ నుంచి నిజ నిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. అయితే, తాను అప్పుడు రిజిస్ట్రార్ కాదు.. కనుక ఆ బృందం నివేదిక గురించి తనకు తెలియదని చెప్పారు. అయితే, ఆ కరపత్రాలు, పోస్టర్లు నకిలీవని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. ఆ వీడియోల్లో మార్పులుచేర్పులు ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరిని వ్యతిరేకిస్తూ జేఎన్‌యూలో జరిగిన వివాదాస్పద కార్యక్రమ వీడియోల్లో రెండు పూర్తిగా అసలైనవి కావని, వాటిలో మార్పుచేర్పులు జరిగాయని తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా.. సంబంధిత ఏడు వీడియోలను ఢిల్లీ సర్కారు ఫొరెన్సిక్ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ట్రూత్ ల్యాబ్స్‌కు పంపించింది. వీటిలో రెండింటిలో ట్యాంపరింగ్ జరిగిందని పరీక్షల్లో తేలింది. జైలా? బెయిలా? కన్హయ్య బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. మరోవైపు, జేఎన్‌యూ విద్యార్థులు ఖాలిద్, అనిర్బన్లకు కోర్టు మంగళవారం 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌ను విధించింది. ‘కన్హయ్య మా వాడైనందుకు గర్విస్తున్నాం’ న్యూఢిల్లీ: జవహర్లాల్ నె హ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ కన్హయ్య కుమార్ తమ వాడైనందుకు గర్వపడుతున్నామని ఆయన మామ రాజేంద్ర సింగ్, సోదరుడు మణికాంత్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా మద్దతు చూస్తుంటే తమకు గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. జేఎన్‌యూలో సోమవారం రాత్రి విద్యార్థులను ఉద్దేశించి రాజేంద్ర సింగ్ మాట్లాడారు. తమ గ్రామస్తులు స్వాతంత్య్రోద్యమంలో బ్రిటీషర్లను ఎదిరించి పోరాడారని.. కన్హయ్య అలాంటి ఘనచరిత్ర ఉన్న గ్రామం వాడన్నారు. తనను తాను చాయ్ వాలాగా చెప్పుకొనే మోదీ.. ఓ రైతు కొడుకు అయిన కన్హయ్యపై ఆరోపణలు వస్తుంటే ఏం మాట్లాడటం లేదని ఆయన విమర్శించారు. కన్హయ్యకు న్యూయార్క్ వర్సిటీ విద్యార్థుల సంఘీభావం కన్హయ్య కుమార్‌కు అమెరికాలోని రెండు ప్రముఖ యూనివర్సిటీ విద్యార్థులు తమ సంఘీభావం తెలిపారు. న్యూయార్క్ యూనివర్సిటీ, కూపర్ యూనియన్ విద్యార్థులు ఫిబ్రవరి 27న కన్హయ్యకు మద్దతుగా వర్సిటీ క్యాంపస్‌లో బైఠాయించారు. అసంతృప్తిని వ్యక్తం చేయడం హక్కు అవుతుంది కానీ నేరం కాదని వారు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో ‘స్టాండ్ విత్ జేఎన్‌యూ’ పేరుతో పోస్ట్ చేసింది.