ఆ కరపత్రాలు నిజమైనవే!
♦ దుర్గామాతను దూషిస్తూ జేఎన్‌యూలో లభ్యమైన పత్రాలపై రిజిస్ట్రార్ నిర్ధారణ
♦ నకిలీవంటున్న విద్యార్థి సంఘాలు
న్యూఢిల్లీ: జేఎన్‌యూలో సంఘ వ్యతిరేక శక్తులున్నాయనేందుకు రుజువులుగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చూపిన కరపత్రాలు నిజమైనవేనని వర్సిటీ రిజిస్ట్రార్ భూపీందర్ మంగళవారం నిర్ధారించారు. వర్సిటీలో మహిషాసుర సంస్మరణ కార్యక్రమం సందర్భంగా దుర్గామాతను దూషిస్తూ కరపత్రాలు ప్రచురించారంటూ వాటిలోని అంశాలను లోక్‌సభలో స్మృతి చదవడం వివాదమవడం తెలిసిందే. కరపత్రాలకు సంబంధించి అప్పుడు స్థానికంగా పోలీసు కేసు నమోదైందని, వర్సిటీ నుంచి నిజ నిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. అయితే, తాను అప్పుడు రిజిస్ట్రార్ కాదు.. కనుక ఆ బృందం నివేదిక గురించి తనకు తెలియదని చెప్పారు. అయితే, ఆ కరపత్రాలు, పోస్టర్లు నకిలీవని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు.
ఆ వీడియోల్లో మార్పులుచేర్పులు
ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరిని వ్యతిరేకిస్తూ జేఎన్‌యూలో జరిగిన వివాదాస్పద కార్యక్రమ వీడియోల్లో రెండు పూర్తిగా అసలైనవి కావని, వాటిలో మార్పుచేర్పులు జరిగాయని తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా.. సంబంధిత ఏడు వీడియోలను ఢిల్లీ సర్కారు ఫొరెన్సిక్ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ట్రూత్ ల్యాబ్స్‌కు పంపించింది. వీటిలో రెండింటిలో ట్యాంపరింగ్ జరిగిందని పరీక్షల్లో తేలింది.
జైలా? బెయిలా?
కన్హయ్య బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. మరోవైపు, జేఎన్‌యూ విద్యార్థులు ఖాలిద్, అనిర్బన్‌లకు కోర్టు మంగళవారం 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌ను విధించింది.
‘కన్హయ్య మా వాడైనందుకు గర్విస్తున్నాం’
న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నె హ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ కన్హయ్య కుమార్ తమ వాడైనందుకు గర్వపడుతున్నామని ఆయన మామ రాజేంద్ర సింగ్, సోదరుడు మణికాంత్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా మద్దతు చూస్తుంటే తమకు గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. జేఎన్‌యూలో సోమవారం రాత్రి విద్యార్థులను ఉద్దేశించి రాజేంద్ర సింగ్ మాట్లాడారు. తమ గ్రామస్తులు స్వాతంత్య్రోద్యమంలో బ్రిటీషర్లను ఎదిరించి పోరాడారని.. కన్హయ్య అలాంటి ఘనచరిత్ర ఉన్న గ్రామం వాడన్నారు. తనను తాను చాయ్ వాలాగా చెప్పుకొనే మోదీ.. ఓ రైతు కొడుకు అయిన కన్హయ్యపై ఆరోపణలు వస్తుంటే ఏం మాట్లాడటం లేదని ఆయన విమర్శించారు.
కన్హయ్యకు న్యూయార్క్ వర్సిటీ విద్యార్థుల సంఘీభావం
కన్హయ్య కుమార్‌కు అమెరికాలోని రెండు ప్రముఖ యూనివర్సిటీ విద్యార్థులు తమ సంఘీభావం తెలిపారు. న్యూయార్క్ యూనివర్సిటీ, కూపర్ యూనియన్ విద్యార్థులు ఫిబ్రవరి 27న కన్హయ్యకు మద్దతుగా వర్సిటీ క్యాంపస్‌లో బైఠాయించారు. అసంతృప్తిని వ్యక్తం చేయడం హక్కు అవుతుంది కానీ నేరం కాదని వారు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో ‘స్టాండ్ విత్ జేఎన్‌యూ’ పేరుతో పోస్ట్ చేసింది.