హక్కుల తీర్మానాల హోరు!
స్మృతి ఇరానీపై హక్కుల ఉల్లంఘన తీర్మానానికి పట్టుబట్టిన కాంగ్రెస్
పార్లమెంటు ఉభయ సభల్లో ఇరు పక్షాల నినాదాలు, ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ: అధికార, ప్రతిపక్ష సభ్యుల హక్కుల ఉల్లంఘన తీర్మానాల హోరుతో మంగళవారం పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనకు సంబంధించి సభకు తప్పుడుసమాచారం అందించారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై విపక్షాలు హక్కుల ఉల్లంఘన తీర్మానమిచ్చి, చర్చకు పట్టుబట్టగా... దీనికి ప్రతిగా కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింధియా గత నెల 24న సభకు అవాస్తవాలు వెల్లడించారంటూ బీజేపీ హక్కు ల నోటీసు ఇచ్చింది.
తొలుత గత నెల 24న లోక్‌సభలో జరిగిన చర్చలో హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ తీవ్రవాదని, జాతి వ్యతిరేక భావజాలం ఉన్నవాడని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారంటూ జ్యోతిరాదిత్య సింధియా సభకు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా సింధియా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, దీనిపై హక్కుల తీర్మానాన్ని చేపట్టాలని లోక్‌సభలో బీజేపీ చీఫ్ విప్ రామ్ మేఘ్వాల్ స్పీకర్‌ను కోరారు. సింధియా వ్యాఖ్యలతో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని, రోహిత్ విషయంలో తానెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని దత్తాత్రేయ పేర్కొన్నారు. స్మృతి ఇరానీకి రాసిన లేఖలో కూడా తాను రోహిత్ పేరును ప్రస్తావించలేదని స్పష్టం చేశారు.
‘‘నేను ఓబీసీ వర్గానికి చెందిన ఓ పేద కుటుంబం నుంచి వచ్చాను. నా తల్లి ఉల్లిపాయలు అమ్ముతుండేది. నేనేంటో తెలంగాణ, ఏపీల్లో అందరికీ తెలుసు. నా ప్రతిష్టను సింధియా దిగజార్చారు.’’ అని పేర్కొన్నారు. తాను ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ఆమోదించాలని స్పీకర్‌ను దత్తాత్రేయ కోరారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చారు. ఇరానీపై అంతకు ముందే తాము ఇచ్చిన హక్కుల ఉల్లంఘన తీర్మానం నోటీసుపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ పట్టుబట్టారు.పార్లమెంటు ఉభయ సభలనూ ఆమె తప్పుదోవ పట్టించారని, ఇది చాలా విచారకర విషయమని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్‌కు జేడీయూ నేత శరద్ యాదవ్ మద్దతు ప్రకటించారు.