అరాచకాన్ని అడ్డుకోండి
రాష్ట్రపతిని కోరిన రాహుల్
* రోహిత్ ఆత్మహత్యకు కారణం అణచివేతనే అని వెల్లడి
న్యూఢిల్లీ: జేఎన్‌యూలో వివాదం, పాటియాలా హౌస్ కోర్టులో హింస ఘటనలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయని, ఈ అరాచకాన్ని కట్టడి చేసేందుకు వెంటనే జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్.. రాష్ట్రపతిని కోరారు. ప్రజాస్వామ్య హక్కుల అణచివేతను అడ్డుకోవాలని అభ్యర్థించారు. ప్రభుత్వం విద్యాసంస్థలను నాశనం చేస్తోందని, విద్యార్థుల భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తోందని రాహుల్ ఆవేదన వ్యక్తంచేశారు.
దేశంలోని విద్యార్థులపై ఆరెస్సెస్ తన తప్పుడు భావజాలాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గురువారం రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలసి వినతిపత్రం ఇచ్చింది. బీజేపీ తనను జాతి వ్యతిరేకుడిగా ముద్ర వేయడంపై రాహుల్ మండిపడ్డారు. దేశం ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకుందని, రాజధాని నడిబొడ్డున కోర్టు ఆవరణలో జరిగిన అరాచక ఘటనలు దేశ ఉత్తమ ప్రజాస్వామ్య విలువలను కాలరాచేలా ఉన్నాయని ఆ ప్రతినిధి బృందం వినతిపత్రంలో పేర్కొంది.
జేఎన్‌యూ, హెచ్‌సీయూ, అలాగే దేశవ్యాప్తంగా ఇతర విద్యాసంస్థల్లోనూ విద్యార్థులను అణగదొక్కుతున్నారని చెప్పారు. హెచ్‌సీయూలో దళిత స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఘటననూ రాహుల్ ప్రస్తావించారు. ప్రభుత్వం అణచివేతవల్లనే ఆయన ఆత్మహత్యకు ఒడిగట్టారన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. విద్రోహులకు మద్దతు ఇవ్వడాన్ని రాహుల్ ఎలా సమర్థించుకుంటారని బీజేపీ ఎదురుదాడి చేసింది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాను పక్కదారి పట్టించేందుకే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది.