నిషేధాలే గానీ సేవలు గుర్తుండవా? | Ban lifted on RSS | Sakshi
Sakshi News home page

నిషేధాలే గానీ సేవలు గుర్తుండవా?

Published Sat, Jul 27 2024 4:34 AM | Last Updated on Sat, Jul 27 2024 4:34 AM

Ban lifted on RSS

58 ఏళ్ల కిందట నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలలో పాల్గొననకుండా ప్రభుత్వోద్యోగులపై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని మొన్న జూలై 9న కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దానితో ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. సంస్థ భావజాలం, కార్యకలాపాలు నచ్చితేనే ఎవరైనా చేరడమో లేదా పరోక్షంగా మద్దతు ఇవ్వడమో చేస్తారు. చైనాతో జరిగిన యుద్ధంలో భారత సైన్యానికి తోడుగా ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక పాత్ర పోషించింది. ప్రకృతి వైపరీత్యాల కాలాల్లో సేవలు అందించింది. గాంధీ హత్య ఘటనలో పోలీసుల దర్యాప్తు, కోర్టు విచారణ అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌పై వచ్చిన ఆరోప ణలన్నీ సత్యదూరమని తేలిపోయింది. అయినాకూడా ఆర్‌ఎస్‌ఎస్‌ను ఇప్పటికీ మహాత్మగాంధీ హత్యతో ముడిపెట్టడం ఎంత దారుణమో ఆలోచించాలి.

గోవధను వ్యతిరేకిస్తూ లక్షలాది ప్రజల మద్దతును కూడగట్టిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)ను నిలువరించేందుకు 1966 నవంబర్‌ 30న, అంటే 58 ఏళ్ల కిందట నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలలో పాల్గొననకుండా ప్రభుత్వోద్యోగులపై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని మొన్న జూలై 9న కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దానితో ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మీద విధించిన నిషేధాల గురించే తప్ప... ఆ నిషేధాల ఎత్తివేత గురించి గానీ, పాకిస్తాన్, చైనా మన దేశం పైన యుద్ధం చేసిన సమయాల్లో, ప్రకృతి వైపరీత్యాల కాలాల్లో సామాన్య ప్రజలకు స్వయంసేవకులు అందించిన సేవలను మరిచిపోయారు. 

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పినట్టు... మహాత్మా గాంధీ హత్యానంతరం 1948 ఫిబ్రవరి 4న ఆర్‌ఎస్‌ఎస్‌పై పటేల్‌ విధించిన నిషేధాన్ని 18 నెలల తర్వాత ఆయనే హోంమంత్రి హోదాలో ఎత్తివేశారు. గాంధీ హత్య ఘటనలో పోలీసుల దర్యాప్తు, కోర్టు విచారణ అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌పై వచ్చిన ఆరోపణలన్నీ సత్య దూరమని తేలిపోయింది. అప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌గా ఉన్న గురూజీ (ఎంఎస్‌ గోల్వాల్కర్‌)కి పటేల్‌ రాసిన లేఖలో సంఘ్‌ సేవలను ప్రశంసించడమే గాక, స్వయంసేవకులు కాంగ్రెస్‌లో చేరి సేవలను కొనసాగించాలని ఆహ్వానించారు. 1948 సెప్టెంబర్‌ 11న సర్దార్‌ పటేల్‌ రాసిన ఈ లేఖ ‘జస్టిస్‌ ఆన్‌ ట్రయల్‌’ పుస్తకంలో ఉంది. 

ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖను మహాత్మా గాంధీ సందర్శించిన సంఘటనను మనం గుర్తు చేసుకోవాలి. గాంధీజీ 1936లో వార్ధాకు దగ్గరలో జరిగిన సంఘ్‌ శిబిరాన్ని సందర్శించారు. ఆ తరువాతి రోజు ఆయన్ని కలుసు కోవడానికి డా. హెడ్గేవార్‌ వారి నివాసానికి వెళ్లారు. అక్కడ వారితో జరిపిన సుదీర్ఘమైన సంభాషణ వివరాలు పుస్తకరూపంలో లభిస్తు న్నాయి. దేశ విభజన సమయంలో ఢిల్లీలోని తన నివాసానికి దగ్గరగా ఉన్న సంఘ్‌ శాఖకు గాంధీజీ మరోసారి వచ్చారు. స్వయంసేవకులతో మాట్లాడారు. ఈ వివరాలు 1947 సెప్టెంబర్‌ 27 నాటి ‘హరిజన్‌’ పత్రికలో ప్రచురితమయ్యాయి. స్వయంసేవకుల క్రమశిక్షణాయుత, కులభేదాలకు అతీతమైన వ్యవహారశైలిని ఆయన మెచ్చుకున్నారు. 

1939 మే 12న పూనా నగరంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల శిబిరానికి సంఘ్‌ కార్యకర్తల ఆహ్వానం మేరకు బాబాసాహెబ్‌ అంబే డ్కర్‌ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌సంస్థాపకులు డా.కేశవరావు హెడ్గేవార్, ఇతర ఆర్‌ఎస్‌ఎస్‌ స్థానిక ప్రముఖులు, అంబేడ్కర్‌ అనుయాయి బాలాసాహెబ్‌ సాలుంకే ఉన్నారు. వీరు 1957–62 మధ్య లోక్‌సభ సభ్యులు. వీరి ఆత్మకథలో ఈ ఘటనను పేర్కొన్నారు. 1957 ఏప్రిల్‌ 1 ఉగాది రోజున పూనాలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఉత్సవంలో ఈ ఘటనను వారు బహిరంగ సభలో తెలియజేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను అంబేడ్కర్‌ ఎక్కడా విమర్శించినసందర్భాలే లేవు.

చైనాతో జరిగిన యుద్ధంలో భారత సైన్యానికి తోడుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతో కీలక పాత్ర పోషించింది. అది చూసిన నాటి ప్రధాని నెహ్రూ ఎంతో ప్రభావితం అయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌లోని ఒక దళం పూర్తి యూనిఫాం, బ్యాండ్‌తో 1963 గణతంత్ర దినోత్సవ పెరేడ్‌లో పాల్గొనేందుకు ఆహ్వానించారు. 1965 నాటి ఇండో–పాక్‌ యుద్ధ కాలంలో కూడా భారత సైన్యానికి ఆర్‌ఎస్‌ఎస్‌ అందించిన సేవలను గుర్తించి నాటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి అప్పటి ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ ఎం.ఎస్‌.గోల్వాల్కర్‌ను ప్రశంసించారు.

ఇందిరా గాంధీ ప్రభుత్వం 1975లో విధించిన అత్యవసర పరిస్థితి సందర్భంలో ఒకసారి... అనంతరం 1992లో బాబ్రీ మసీదు ఘటన సందర్భంలో మరోసారి ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధాలు విధించడం... వివిధ ప్రభుత్వ శాఖల దర్యాప్తులు, న్యాయస్థానాల విచారణల అనంతరం ఎత్తివేయడం జరిగింది. సంఘ్‌ మీద ఏ సందర్భంలో నిషేధం విధించినా అవన్నీ రాజకీయ కారణాల వల్ల అప్పటి ప్రభు త్వాలు విధించినవే తప్ప ఒక్క ఆరోపణ కూడా కోర్టు విచారణల్లో రుజువు కాలేదు. 

ఇందిర సర్కారు నిషేధం విధించడానికి ముందే ఈ అంశంపై కోర్టు తీర్పులను పరిశీలిస్తే... పంజాబ్‌ ఉద్యోగి రాంపాల్‌ అనే వ్యక్తి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడనే కారణంతో ఉద్యోగం నుంచి తొలగించగా... ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ పార్టీ కాదంటూపంజాబ్‌ – హరియాణా కోర్టు అతని తొలగింపు సమర్థనీయం కాదని తీర్పునిచ్చింది. మరో సంఘటన కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాకు సంబంధించినది. 1966లో అక్కడ అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌గా ఉన్న రంగనటచార్‌ అనే వ్యక్తి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో పాల్గొంటు న్నాడనే కారణంతో ఆయన పదోన్నతికి ఆటంకం కలుగగా... ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ సంస్థ కాదనీ, హిందువేతరులకు అది వ్యతిరేకం కాదనీ 1966 జూలై 6న మైసూర్‌ హైకోర్టు తీర్పునిచ్చింది.

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలలో పాల్గొనే విషయంలో ప్రభుత్వో ద్యోగులపై నిషేధం ఉన్నా, లేకపోయినా.. సంస్థ సిద్ధాంతం, భావ జాలం, కార్యకలాపాలు తమకు నచ్చితేనే ఎవరైనా చేరడమో లేదా పరోక్షంగా మద్దతు ఇవ్వడమో చేస్తారు తప్ప, నిషేధం ఎత్తివేసినంత మాత్రాన దేశంలోని ప్రభుత్వోద్యోగులందరూ మూకుమ్మడిగా ఏసంస్థ కార్యకలాపాల్లోనూ పాల్గొనరు గదా? అందువల్ల  ప్రభుత్వోద్యో గులపై ఇన్నేళ్లు ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినందుకు ఏదో జరిగిపోతుందన్నట్టు గగ్గోలు పెట్టడంలో అర్థం లేదు.

కాంగ్రెస్‌లో ఒకప్పటి అగ్రనేత, ఆ పార్టీ సర్కారులో కేంద్రమంత్రి, దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ 2018లో ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంసేవకుల తృతీయ వర్ష ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాటి కాంగ్రెస్‌ వర్గాలు ఎంత వ్యతిరేకించినా ప్రణబ్‌ ఈ వేడుకలో భాగస్వామి అయ్యారు. ‘నేను ఈ రోజున భరతమాత గొప్ప సంతానమైన డా. కేశవ బలిరామ్‌ హెడ్గేవార్‌కు అంజలి సమర్పించ డానికి వచ్చాను’ అని రాశారు. 

అదే ఏడాది కేరళలోని కొట్టాయంలో డిసెంబర్‌ 31న జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాథమిక శిక్షవర్గ ముగింపు కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ థామస్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘భారత్‌లో ప్రజలు ఎందుకు సురక్షితంగా ఉన్నారని ఎవరైనా నన్ను అడిగితే – మొదట రాజ్యాంగం,రెండవది ప్రజాస్వామ్య వ్యవస్థ, మూడు సైన్యం, నాలుగు ఆర్‌ఎస్‌ఎస్‌ వల్ల అని జవాబు చెపుతాను’ అన్నారు. వీరేగాక లోకమాన్య జయ ప్రకాశ్‌ నారాయణ్, శాస్త్రవేత్తలైన జి.మాధవన్‌ నాయర్, కె. రాధాకృష్ణన్, కె.కస్తూరి రంగన్‌ వంటి పెద్దలు సైతం సంఘ్‌ కార్యకలాపాలను ప్రశంసించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ పైన నిషేధాన్ని ఎత్తివేసిన రెండు దశాబ్దాల తరువాత ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం మహాత్మగాంధీ హత్యకు జరి గిన కుట్రపై విచారణ జరిపేందుకు ఒక కొత్త జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జె.జె. కపూర్‌ను చైర్మన్‌గా నియమించారు. ఆ కమిషన్‌ దాదాపు వందకు పైగా సాక్షులను విచా రించి 1969లో నివేదిక సమర్పించింది. ‘నేరస్థులు ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యు లన్న విషయం ఎక్కడా రుజువు కాలేదు. 

ఆ సంస్థకు హత్యలో భాగం ఉందని నిరూపితం కాలేదు’ అని కపూర్‌ కమిషన్‌ (సంపుటి –1, పేజీ–186) స్పష్టీకరించింది. దేశ విదేశాలలో కోట్లాదిమంది స్వయం సేవకులు ప్రతిరోజూ ప్రాతఃస్మరణంలో గాంధీజీ పేరును తలుచుకుంటారు. అయినప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ను మహాత్మాగాంధీ హత్యతో ముడి పెట్టడం ఎంత దారుణమో ఆలోచించాలి. ఈ నిరాధారమైన ఆరో పణలు చేసేవారిని శిక్షార్హులుగా ప్రకటించి చట్టపరమైన చర్యలు తీసు కోవాల్సిన సమయం ఆసన్నమైంది. 

- వ్యాసకర్త మహారాష్ట్ర మాజీ గవర్నర్‌
- చెన్నమనేని విద్యాసాగరరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement