Rohit suicide
-
అధికారులను తప్పించేందుకే కులంపై చర్చ
రోహిత్ కేసుపై చుక్కా రామయ్య సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారణాలు కనుగొని, వివక్షకు పరిష్కారాన్ని చూపాల్సింది పోయి అతడి కులంపై ఏకసభ్య కమిషన్ అనవసర చర్చకు తెరలేపిందని విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. హెచ్‌సీయూ అధికారులను కేసు నుంచి తప్పించడానికే కులంపై చర్చన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ గురవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామయ్య మాట్లాడారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. మాజీ సీఎస్ కాకి మాధవరావు మాట్లాడుతూ హెచ్‌సీయూ ఘట నలపై ఏకసభ్య కమిషన్ తన పరిధిలు దాటి రోహిత్ కులంపై చర్చించడం దురుద్దేశపూరితమేనన్నారు. రోహిత్ తల్లి రాధిక మాట్లాడుతూ.. పెళ్లయిన ఐదేళ్ల తరువాత భర్త నుంచి విడిపోయానని, ఓ ఎస్సీ కాలనీలో ఉంటున్న తన వద్దే తన పిల్లలు పెరిగారన్నారు. అటువంటప్పుడు ఏ సంబంధమూ లేని వ్యక్తి కులం తన పిల్లలకు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. దళిత్ స్టడీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
రోహిత్ ఆత్మహత్యపై నివేదిక సమర్పణ!
న్యూఢిల్లీ : హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రిటైర్డ్ జస్టిస్ ఏకే రూపన్వాల్ కమిషన్ తన నివేదికను యూజీసీకి సమర్పించినట్లు తెలుస్తోంది. మంత్రి ప్రకాష్ జవదేకర్, నివేదిక ఇంకా తన వద్దకైతే రాలేదని చెప్పారు. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఈ కమిటీని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఈ ఆత్మహత్య అప్పట్లో పెద్ద సంచలనాన్ని రేపింది. అన్ని పార్టీలూ మూకుమ్మడిగా ఎన్డీఏ ప్రభుత్వంపై దాడి చేశాయి. -
విద్యార్థులు జైలుకు.. వీసీ వర్సిటీలోకా?
♦ హెచ్‌సీయూలో ఘటనలపై కేంద్ర మాజీ హోంమంత్రి షిండే ♦ అట్రాసిటీ కేసు నమోదైనా అప్పారావు వర్సిటీలోకి ఎలా వచ్చారు? ♦ విద్యార్థులను కొట్టి, హింసించి, జైల్లో పెట్టిస్తారా? ♦ విద్యార్థులకు పరామర్శ సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో ఉండాల్సిన విద్యార్థులు జైలుకు ఎందుకు వెళ్లారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ అప్పారావు తిరిగి విశ్వవిద్యాలయంలోనికి ఎలా రాగలిగారని కేంద్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీని యర్ నేత సుశీల్‌కుమార్ షిండే వ్యాఖ్యానిం చారు. హెచ్‌సీయూలో విద్యార్థులపై పోలీ సుల దాడిని, అరెస్టులను ఆయన ఖండించారు. దళి తులను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు పాల్పడుతోందని ఆరోపించా రు. విద్యార్థులెవరూ భయపడవద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని చర్లపల్లి జైల్లో ఉన్న విద్యార్థులను, ప్రొఫెసర్లను షిండే పరామర్శిం చారు. అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, మల్లు భట్టి విక్రమార్క, గీతారెడ్డి, రోహిత్ తల్లి రాధిక తదితరులతో కలసి లక్డీకాపూల్‌లోని ఓ హోటల్ లో మీడియాతో మాట్లాడారు. ‘‘అప్పారావుకు సెలవు ఇచ్చిందెవరు? కేంద్ర ప్రభుత్వమా లేక తనకు తానే స్వయంగా సెలవు తీసుకుని మళ్లీ విశ్వవిద్యాలయంలోకి వచ్చారా? ఇంత జరిగాక తిరిగి ఎలా రాగలిగాడు. రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ అప్పారావే కారణమంటూ ఆయనపై అట్రాసిటీ కేసు నమోదైనా, ఇంత మంది విద్యార్థులు వీసీగా ఆయనను తిరస్కరించినా కూడా తిరిగి వర్సిటీలోకి ఎలా వచ్చారో అర్థం కావడం లేదు..’’ అని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ ఆశయాల కోసం, వివక్షకు వ్యతిరేకంగా రోహిత్ వేముల పోరాడారని, అటువంటి బిడ్డని కోల్పోయిన తల్లి దుఃఖం ఎవరూ తీర్చలేనిదని షిండే పేర్కొన్నారు. హెచ్‌సీయూలో విద్యార్థులపై పోలీసుల దాడిని, అరెస్టులను షిండే తీవ్రంగా తప్పుబట్టారు. పవిత్ర విద్యాక్షేత్రంలో విద్యార్థులను దారుణంగా కొట్టి, హింసించడం, జైల్లో పెట్టించడమేమిటంటూ దుయ్యబట్టారు. పోలీసులు తమపై ఒత్తిడి తెచ్చి, భయపెట్టి, బల వంతంగా సంతకం చేయించుకున్నారని విద్యార్థులు తనతో చెప్పారని షిండే తెలిపారు. వీసీ అప్పారావుకు ఏమాత్రం పశ్చాత్తాపమున్నా పదవికి రాజీనామా చేయాలన్నారు. దళితులను అణచివేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాహుల్‌గాంధీ తరఫున చెబుతున్నానని, తామంతా విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చా రు. మంగళవారం రాష్ట్రపతిని కలసి ఈ సమస్యకు పరిష్కారాన్ని కోరుతామని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అనంతరం పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. హెచ్‌సీయూ ఘటనలకు సంబంధించి అసెం బ్లీలో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పాశవిక దాడిపై విచారణ జరిపించి, బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. విద్యార్థులపై కేసులను ఎత్తివేయాలని కోరారు. రోహిత్‌ను చంపింది వీసీయే: రోహిత్ తల్లి రాధిక తన కుమారుడిని చంపింది వీసీ అప్పారావేనని రోహిత్ తల్లి రాధిక ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినా అప్పారావును ఎందుకు అరెస్టు చేయలేదన్నందుకు విద్యార్థులను జైలు పాలు చేశారని మండిపడ్డారు. ‘‘ఆడపిల్లల హాస్టళ్లలోకి చొరబడిన పోలీసులు వారిని అత్యాచారం చేస్తామని బెదిరించారు. తిండి, నీళ్లు లేకుండా బాధపడుతున్న విద్యార్థులకు వంట చేస్తున్న విద్యార్థి ఉదయభానుని తీవ్రంగా కొట్టారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి వివక్షని ప్రశ్నించినందుకే నా కుమారుడిని వీసీ అప్పారావు చంపేశాడు. నా కుమారుడిని సస్పెండ్ ఎందుకు చేశారు? చేసినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం రాలేదు’’ అని రాధిక పేర్కొన్నారు. -
కదంతొక్కిన విద్యార్థులు
♦ హెచ్‌సీయూలో తరగతుల బహిష్కరణ.. జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ♦ వీసీగా అప్పారావు ఉన్నంతకాలం ఆందోళన చేస్తామని స్పష్టీకరణ ♦ వర్సిటీలో పరిస్థితులపై హెచ్చార్సీకి వివరణ అందజేసిన వీసీ అప్పారావు హైదరాబాద్: హెచ్‌సీయూ వీసీ అప్పారావు తిరి గి వర్సిటీలోకి రావడం, విద్యార్థులపై పోలీ సు లు లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ సోమవారం విద్యార్థులు కదంతొక్కారు. విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తరగతులను బహిష్కరిం చి.. ర్యాలీని నిర్వహించారు. వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ధర్నా నిర్వహిం చారు. వీసీని తొలగించాల్సిందేని, అప్పటివరకు ఆందోళన విరమించబోమని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. రోహిత్ ఆత్మహత్య సహా అనేక పరి ణామాలకు కారణమైన వీసీని విధుల తొలగిం చాల్సిందేనని, అరెస్టు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని విద్యార్థి జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని.. పోలీసులను క్యాం పస్ నుంచి పంపించాలని డిమాండ్ చేశారు. బెయిల్‌పై హర్షం హెచ్‌సీయూలో అరెస్టై రిమాండ్‌లో ఉన్న విద్యార్థులు, ప్రొఫెసర్లకు మధ్యంతర బెయిల్ రావడంతో విద్యార్థులంతా హర్షం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం క్యాంపస్ నుంచి ప్రధాన ద్వారం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల సహకారంతోనే బెయిల్ మంజూరైం దని విద్యార్థి నేత జుహెల్ కేపీ పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థులు తరగతులను బహిష్కరించడంతో వీసీ నివాసం వద్ద పోలీసు బందోబస్తును తగ్గించారు. వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద హెచ్‌సీయూ భద్రతా సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఐడీ కార్డులున్న విద్యార్థులు, సిబ్బందిని లోపలికి అనుమతిస్తున్నారు. హెచ్చార్సీకి నివేదిక అందజేసిన వీసీ రోహిత్ ఆత్మహత్య తదనంతర పరిణా మాల్లో వర్సిటీ విద్యార్థులకు కనీస సదుపాయాలు కూడా అందడం లేదన్న ఫిర్యాదుపై మానవ హక్కుల కమిషన్ సోమవారం విచారణ చేపట్టింది. మధ్యాహ్నం 12.30 గంట లకు గట్టి పోలీసు బందోబస్తు మధ్య వీసీ అప్పారావు ఈ విచారణకు హాజరయ్యారు. వర్సిటీలోని పరిణామాలపై హెచ్చార్సీ చైర్మన్ జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూకు ఒక నివేదికను అందజేశారు. వర్సిటీలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. బయటకు వచ్చిన అనంతరం మీడియా ప్రతినిధులు వీసీ అప్పారావును వివరాలడిగే ప్రయత్నం చేయగా... మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. -
పోలీసుల తీరు దారుణం
హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై సభలో చర్చలో విపక్షాలు ♦ విద్యార్థులపై లాఠీచార్జి, అరెస్టు గర్హనీయమంటూ ధ్వజం ♦ వీసీ అప్పారావుపై కఠిన చర్యలకు డిమాండ్ సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై శనివారం అసెంబ్లీ అట్టుడికింది. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి, అరెస్టులను ప్రతిపక్షం తప్పుబట్టింది. వర్సిటీలో వివక్షను ఆపాలని, రోహిత్ మృతికి కారకులను శిక్షించాలని డిమాండ్ చేసింది. అయితే ఈ సందర్భంగా సభ్యుల పరస్పర విమర్శలు, దూషణలతో చర్చ వేడెక్కింది. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల మృతిపై వివాదం, వర్సిటీ వీసీ అప్పారావుకు తిరిగి పగ్గాలు చేపట్టడం తదితర పరిణామాలపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు తీవ్ర స్థాయిలో వాదులాడుకోగా విద్యార్థులపై పోలీసుల చర్య విషయంలో ప్రభుత్వ తీరును ఎంఐఎం, వైఎస్సార్ కాంగ్రెస్ తప్పుబట్టాయి. హెచ్‌సీయూ, ఓయూ ఉదంతాలపై సభలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటన చేశారు. ఆ ప్రకటనపై జరిగిన చర్చలో పలు పార్టీల సభ్యులు మాట్లాడారు. వారేమన్నారంటే... కన్హయ్య కోసమే అప్పారావును తెచ్చారు జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ఈ నెల 23న హెచ్సీయూకు వస్తున్నారనే సమాచారంతో విద్యార్థులను రెచ్చగొట్టేందుకే 22న సెలవులో ఉన్న వర్సిటీ వీసీ అప్పారావును విధుల్లోకి తెచ్చారు. వర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీసీ అప్పారావును రీకాల్ చేసి జైలుకు పంపాలి. హెచ్‌సీయూలో యుద్ధ వాతావరణం లేకుండా చూడాలి. - రవీంద్ర కుమార్, సీపీఐపక్ష నేత వీసీని విధుల్లోకి తీసుకోవడమే గొడవలకు కారణం హెచ్‌సీయూ వీసీ అప్పారావును తిరిగి విధుల్లోకి తీసుకోవడమే గొడవలు రాజుకోవడానికి కారణం. అప్పారాావు చేరికను వ్యతిరేకించిన 25 మందిని పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ చిత్రహింసలకు గురి చేసి జైల్లో పెట్టడం సమంజసమా? హెచ్‌సీయూ ఘటనలకు కారకులైన అప్పారావుపై కేసు నమోదు చేయాలి. ఓయూలో ఎమ్మెల్యే సంపత్‌ను పోలీసులు చితకబాదడం శోచనీయం. - పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీపక్ష నేత సీఎం మాట్లాడుతున్నప్పుడు ఎంఐఎం కూర్చోలేదు హెచ్సీయూకు సంబంధించి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చూసింది. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సమస్యలను సృష్టించడం మంచిది కాదు. సీఎం మాట్లాడుతుంటే మేం అందరం కూర్చుంటాం. కనీసం ఎంఐఎం సభ్యులు కూర్చోలేదు. మిత్రపక్షమని చెబుతూనే సీఎం లేచినప్పుడు కూడా మాట్లాడారు. - గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీసీని రీకాల్ చేయాలి వీసీ అప్పారావును రీకాల్ చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసి ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. కన్హయ్యను రోహిత్ తల్లి కలిసేందుకూ పోలీసులు అవకాశమివ్వాలి. మతసామరస్యాన్ని కాపాడాలి. - సున్నం రాజయ్య, సీపీఎంపక్ష నేత రాజకీయ విషవలయంలో పార్టీలు ఒక విద్యార్థి చనిపోతే శవరాజకీయాలు చేయ డం అలవాటుగా మా రింది. రాజకీయ విష వలయంలో పార్టీలు కూరుకుపోయాయి. తెలంగాణ ఉద్యమంలో 1,200మంది ఆత్మబలి దానాలు చేసుకున్నప్పుడు పరామర్శించేం దుకు రాని వాళ్లు రోహిత్ మరణాన్ని రాజకీయంగా వాడుకున్నారు.ఉస్మానియా వర్సిటీలో ఎమ్మెల్యే సంపత్, టీడీపీ నేత రాజారాం యాదవ్‌పై దాడిపై డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. - రేవంత్‌రెడ్డి, టీడీఎల్పీ నేత రాహుల్‌ది రాజకీయ యాత్ర కాదు.. రోహిత్ మరణం సమాజాన్ని జాగృతం చేసే అలారం గంట వంటిది. దేశంలో బాధ్యతగల పాలకులు వివక్ష లేని పాలన అందించాలని రోహిత్ సమాజాన్ని హెచ్చరించారు. అతని మరణం వెనుకగల నిజాలను వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రోహిత్ మరణంతో కుంగిపోయిన అతని తల్లిని ఓదార్చేందుకే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హైదరాబాద్ వచ్చారే తప్ప, రాజకీయాల కోసం కాదు. మా పార్టీ వాళ్లనెవరినీ యూనివర్సిటీకి రావద ్దని చెప్పారు. రాజకీయాల కోసమే ఆయన వచ్చిఉండుంటే యూనివర్సిటీని దిగ్బంధం చేసేవాళ్లం. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీయే ఈ అంశంపై పార్లమెంటులో రాజకీయం చేశారు. రోహిత్ మరణంపై సీఎం స్పందించలేదని, 12 గంటల వరకు వైద్యం అందలేదని స్మృతి పార్లమెంటులో చెప్పారు. కానీ ఈ విషయంపై ఎంపీ జితేందర్ రెడ్డి పార్లమెంటు మాట్లాడుతూ డ్యూటీ డాక్టర్ రాజేశ్వరి ఫోన్ వచ్చిన ఐదు నిమిషాల్లోనే యూనివర్సిటీలో ఉన్నట్లు చెప్పారని అన్నారు. ఈ నేపథ్యంలో జరిగిందేంటో స్పష్టం చేయాలి. రోహిత్ దళితుడే కాదని హోంమంత్రి చెప్పడం విచారకరం. వీసీ అప్పారావు విషయంలో విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్లను చితకబాది కేసులు పెట్టి జైలుకు పంపారు. అంబేద్కర్ స్టడీ సెంటర్ డెరైక్టర్ రత్నంను చెంపదెబ్బలు కొట్టారు. ఇవి అంబేద్కర్ వాదులందరికీ తగిలిన దెబ్బలు. వర్సిటీలో వివక్షను ఆపాలి. రోహిత్ మరణానికి కారకులైన వారిని శిక్షించాలి. సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తున్నానని చెప్పే సీఎం కేసీఆర్ హెచ్సీయూకు ఒక్కరోజూ వెళ్లలేదు. దేశ సమగ్రతపై బీజేపీ నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఓయూలో ఎమ్మెల్యే సంపత్ కుమార్‌పై పోలీసుల తీరును ఖండిస్తున్నా. - భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సభ్యుడు అవును పక్కా రాజకీయమే.. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంతోమంది దళిత విద్యార్థులు, విద్యార్థియేతరులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు రాని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ రోహిత్ ఆత్మహత్య తర్వాత రెండు మార్లు హెచ్సీయూకు ఎందుకొచ్చారు? తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రోహిత్ లేఖలో పేర్కొన్నప్పటికీ కొందరు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చి ఉద్రిక్తతలను రెచ్చగొట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమ ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలే కారణమని లేఖలో రాసి చాలా మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నా కనీసం పరామర్శకు రాని కాంగ్రెస్ నాయకులు రోహిత్ ఆత్మహత్యను అవకాశంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాల కోసం నైతికంగా ఎంతకైనా దిగజారేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధపడతారు. (ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీజేపీ పక్ష నేత లక్ష్మణ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది). మెడపై కత్తి పెట్టి భారతమాతకు జై అనమంటే అననంటూ వ్యాఖ్యానించిన ఎంపీ (అసదుద్దీన్‌ను ఉద్దేశించి) కూడా హెచ్‌సీయూకి వెళ్లి రాజకీయాలు చేయటం సిగ్గుచేటు. సుప్రీం కోర్టు ఉరిశిక్ష వేసిన ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడిన వీరిపై చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాది శవయాత్రలో పాల్గొన్న వీరి వల్ల తెలంగాణకు అవమానం కలిగింది. విశ్వనగరంగా హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం అంటుంటే ఇలాంటి ద్రోహులు మరోరకంగా హైదరాబాద్‌ను ప్రపంచం ముందు నిలుపుతున్నారు. ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగింస్తున్న వారిపై ఎందుకు కేసులు నమోదు చేయటం లేదు. ఓయూలో ఎమ్మెల్యే సంపత్‌పై దాడిని ఖండిస్తున్నా. - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ సభ్యుడు కావాలంటే నన్ను చంపండి.. అంబేడ్కర్ భావజాలంతోపాటు దళితులను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న దమనకాండకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించేలా ప్రస్తుతం జరుగుతున్న పరిణామలు ఉన్నాయి. కావాలంటే నన్ను చంపండి కానీ దళితులను ఎందుకు వేధిస్తారు. హెచ్‌సీయూలో పరిస్థితిని ప్రశాంతంగా మార్చేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని పార్లమెంటులో టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి చెప్పారు. కానీ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉందంటే జితేందర్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టించినట్టే కదా. వర్సిటీలో పరిస్థితి గురించి మాట్లాడేందుకు గంటపాటు ఎదురుచూసినా ముఖ్యమంత్రి నుంచి స్పందన రాలేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటులో పేర్కొన్నార ంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. దళితుల్లో ఆత్మస్థైర్యం నింపేది ఇలాగేనా? హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై హోంమంత్రి ప్రకటన కూడా సరిగా లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో లభించిన యువకుడి మృతదేహం విద్యార్థిది కాదనటానికి ఆధారాలు చూపాలని డిమాండ్ చేసిన విద్యార్థులపై పోలీసులు దాడి చేశారు. నేను అక్కడికి వెళ్లి పోలీసులతో మాట్లాడి పరిస్థితిని పరిశీలించాను. మృతదేహాన్ని వ్యాన్‌లో ఎక్కించేవరకు పోలీసులు బాగానే ఉన్నా ఆ తర్వాత వారి అసలు నైజం బయటపడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు గళం విప్పే అవకాశం ఉందని గ్రహంచి ఆ నినాదాలు రాకుండా వారిని అక్కడి నుంచి తరిమేందుకు పోలీసులే విద్యార్థులపై రాళ్లు రువ్వి పరిస్థితి చేయిదాటేలా చేశారు. నాతోపాటు వచ్చిన కొందరు నేతలు, విద్యార్థులు లక్ష్యంగా వందమంది పోలీసులు పనిచేశారన్నారు. ఎమ్మెల్యేగా నా హక్కులకు భంగం కలిగింది. దీనిపై నేను రిప్రజెంటేషన్ ఇస్తా. - సంపత్ కుమార్, కాంగ్రెస్ సభ్యుడు -
మళ్లీ జ్వాల
వీసీ అప్పారావుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన విద్యార్థులు పోలీసుల లాఠీచార్జి కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న హెచ్‌సీయూ మరోసారి భగ్గుమంది. రణరంగంగా మారింది. వీసీ ప్రొఫెసర్ అప్పారావు మళ్లీ బాధ్యతలు చేపట్టడం వివాదానికి దారి తీసింది. విద్యార్థుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. విధ్వంసానికి పాల్పడ్డారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. విద్యార్థులు వారిపై రాళ్ల దాడికి దిగారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు గాయపడ్డారు. మంగళవారం రోజంతా వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరోసారి భగ్గుమంది. సుదీర్ఘ సెలవుల తర్వాత వీసీ అప్పారావు బాధ్యతలు చేపట్టడం పట్ల పలు విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. వీసీ అప్పారావును తొలగించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా బుధవారం జేఏసీ వర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఎస్ఏ తదితర సంఘాలు మద్ధతు పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్సిటీలు, జిల్లా కేంద్రాల్లో వీసీ అప్పారావు దిష్టిబొమ్మలు దహనం చేసేందుకు పిలుపునిచ్చాయి. హెచ్సీయూకు కన్హయ్యకుమార్ రానున్న నేపథ్యంలో.. ఆయన సమక్షంలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించాయి. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు హైదరాబాద్ వర్సిటీ ఘటన వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కుట్ర ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇన్ని రోజులు శాంతియుతంగా ఆందోళనలు జరగగా.. ఒక్కసారిగా వర్సిటీ రణరంగం కావడం వారి ప్రోద్భలమే. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పారావును తిరిగి వీసీగా పంపడమూ వారి పనే. అప్పారావును వెంటనే వీసీ పదవి నుంచి తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎట్టిపరిస్థితుల్లో హైదరాబాద్ వర్సిటీలో బహిరంగ సభ నిర్వహిస్తాం. అన్ని వర్సిటీలతోపాటు జిల్లా కేంద్రాల్లో వీసీ అప్పారావు దిష్టిబొమ్మలను దహనం చేస్తాం. నల్లజెండాలతో నిరసన తెలుపుతాం. - శివరామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వీసీపై చర్యలు తీసుకోవాలి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వీసీ అప్పారావుపై చర్యలు తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం. ఏకసభ్య కమిషన్ విచారణ నివేదిక అందజేయకముందే వీసీ అప్పారావు బాధ్యతలు చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బహిష్కరణకు గురైన ఐదుగురు విద్యార్థులను ఒక్కసారి కూడా పరామర్శించని అప్పారావు.. వీసీగా అనర్హుడు. - వెంకటేష్ చౌహాన్, హెచ్‌సీయూ జేఏసీ చైర్మన్ ‘రోహిత్ చట్టం’ సాధిస్తాం పార్లమెంట్లో రోహిత్ చట్టం ఆమోదించే వరకు ఆందోళనలు నిర్వహిస్తాం. ఒక వైపు విచారణ జరగుతున్న సమయంలో విచారణను ఎదుర్కొనే వ్యక్తే వీసీ బాధ్యతలు అప్పగించడం దారుణం. దీనిపై ఐక్య పోరాటాలు నిర్వహిస్తాం. తన కొడుకును ఎందుకు బహిష్కరించావో చెప్పాలని రోహిత్ తల్లి రాధిక అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వని వీసీ అప్పారావు ఆ కుర్చీలో కూర్చోవడం సిగ్గుచేటు. - దొంత ప్రశాంత్, జేఏసీ నేత వీసీని తొలగించాల్సిందే రోహిత్ ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పారావుకు తిరిగి వీసీ బాధ్యతలు అప్పగించడం దారుణం. ఆ పదవి నుంచి శాశ్వతంగా తొలగించే వరకు వర్సిటీలో తరగతులు కొనసాగనివ్వం. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై కేసులు నమోదు చేసి వదిలేశారు. రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వర్సిటీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం. అరెస్టయిన విద్యార్థులను విడుదల చేయాలి. - నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు -
వివక్షకు వ్యతిరేకంగా జాతీయ సదస్సు
విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాతీయ సదస్సు జరగనుంది. వర్సిటీలోని దళిత్-ఆదివాసీ స్టడీస్, అంబేడ్కర్ స్టడీ సెంటర్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిసున్నట్టు తెలిపారు. ICSSR ఛైర్మన్ సుఖదేవ్ థోరట్, కేంద్రప్రభుత్వ మాజీ కార్యదర్శి పిఎస్.క్రిష్ణన్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉమాచక్రవర్తి, సీనియర్ జర్నలిస్ట్ సీమా ముస్తఫా లతో కూడిన బృందం ఈ సదస్సుకి ముఖ్య అథిదులుగా హాజరుకానున్నారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఐఐఎంలు, ఐఐటిలతో సహా 40 ఉన్నత విద్యాసంస్థల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో నెలకొన్న కుల వివక్షపై సమగ్రసమాచారాన్ని సేకరించి, నిర్దిష్టమైన నివేదికను తయారుచేయడమే జాతీయ సదస్సు లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. హెచ్‌సియులో వివక్ష కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్, అతనితో పాటు మరో నలుగురు విద్యార్థుల రస్టికేషన్ నేపధ్యంలో వెల్లువెత్తిన విద్యార్థి ఉద్యమం దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లోని వివక్షను తెరపైకి తెచ్చింది. ఈ నేపధ్యంలోనే దేశంలోని పలు ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షలు వెలుగులోకి వచ్చాయి. వాటన్నింటిపై ఆయా విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు, అధ్యాపకులు స్పష్టమైన రిపోర్టును అందించనున్నారు. ఈ సదస్సులో వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న వివక్షపై ఒక డాక్యుమెంటును రూపొందించే యోచనలో ఉన్నారు. ఈ డాక్యుమెంటరీని ఢిల్లీలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని రాష్ట్ర పతి, ప్రధానులకు, అన్ని రాజకీయ పక్షాలకు అందించనున్నారు. -
వచ్చే వారం 12 బిల్లులు
ఉభయ సభల్లో కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం న్యూఢిల్లీ: రోహిత్ ఆత్మహత్య, జేఎన్‌యూ వివాదాలతో అట్టుడుకుతున్న పార్లమెంటులో వచ్చే వారం ఆర్థిక, పాలనా అంశాలకు చెందిన 12 కీలక బిల్లులు చర్చకు రాబోతున్నాయి. అందులో లోక్‌సభలో ఏడు, రాజ్యసభలో ఐదు బిల్లులున్నాయి. సోమవారం(శివరాత్రి) సెలవు ఉండడంతో వచ్చే వారంలో నాలుగు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు ఉంటాయి. మళ్లీ శని, ఆదివారాలు సెలవు అనంతరం మార్చి 16 వరకు మరో మూడు రోజులు సమావేశాలతో తొలిదశ ముగియనుంది. ఈ లోగానే లోక్‌సభలో శత్రు ఆస్తులు (సవరణ, క్రమబద్ధీకరణ) బిల్లు, ఆధార్ (ఆర్థిక, ఇతర సబ్సిడీలు, ప్రయోజనాలు, సేవల బదిలీ) బిల్లు, రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వుల సవరణ బిల్లు, రైల్వేలకు, ఇతర సాధారణ డిమాండ్లు, గ్రాంట్లకు సంబంధించిన 4 వినియోగ బిల్లులు చర్చకు రానున్నాయి. రాజ్యసభలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిల్లు, విజిల్ బ్లోయర్స్ రక్షణ (సవరణ) బిల్లు, బాల కార్మికుల (నిరోధం, నియంత్రణ) సవరణ బిల్లుతో పాటు రైల్వే, సాధార ణ బడ్జెట్లకు సంబంధించిన వినియోగ బిల్లులు చర్చకు రానున్నాయి. వీటితోపాటు రియల్ ఎస్టేట్ (అభివృద్ధి, నియంత్రణ) బిల్లును కూడా రాజ్యసభలో చర్చించే అవకాశముందని పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి నఖ్వీ పేర్కొన్నారు. -
స్మృతిపై చర్యలు తీసుకోవాల్సిందే!
లోక్‌సభలో విపక్షాల ఆందోళన న్యూఢిల్లీ: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సభను తప్పుదారి పట్టించారంటూ విపక్షాల ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. ఇరానీపై తాము ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై మాట్లాడేందుకు అవకాశమివ్వాలంటూ కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభలో గందరగోళం సృష్టించారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. తరువాత కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ... రోహిత్ ఆత్మహత్యాయత్నం అనంతరం ఆయనకు వైద్యం అందించలేదని స్మృతి చెప్పారని, కానీ అది అవాస్తవమని పేర్కొన్నారు. -
హక్కుల తీర్మానాల హోరు!
స్మృతి ఇరానీపై హక్కుల ఉల్లంఘన తీర్మానానికి పట్టుబట్టిన కాంగ్రెస్ పార్లమెంటు ఉభయ సభల్లో ఇరు పక్షాల నినాదాలు, ఆరోపణలు సాక్షి, న్యూఢిల్లీ: అధికార, ప్రతిపక్ష సభ్యుల హక్కుల ఉల్లంఘన తీర్మానాల హోరుతో మంగళవారం పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనకు సంబంధించి సభకు తప్పుడుసమాచారం అందించారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై విపక్షాలు హక్కుల ఉల్లంఘన తీర్మానమిచ్చి, చర్చకు పట్టుబట్టగా... దీనికి ప్రతిగా కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింధియా గత నెల 24న సభకు అవాస్తవాలు వెల్లడించారంటూ బీజేపీ హక్కు ల నోటీసు ఇచ్చింది. తొలుత గత నెల 24న లోక్‌సభలో జరిగిన చర్చలో హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ తీవ్రవాదని, జాతి వ్యతిరేక భావజాలం ఉన్నవాడని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారంటూ జ్యోతిరాదిత్య సింధియా సభకు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా సింధియా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, దీనిపై హక్కుల తీర్మానాన్ని చేపట్టాలని లోక్‌సభలో బీజేపీ చీఫ్ విప్ రామ్ మేఘ్వాల్ స్పీకర్‌ను కోరారు. సింధియా వ్యాఖ్యలతో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని, రోహిత్ విషయంలో తానెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని దత్తాత్రేయ పేర్కొన్నారు. స్మృతి ఇరానీకి రాసిన లేఖలో కూడా తాను రోహిత్ పేరును ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. ‘‘నేను ఓబీసీ వర్గానికి చెందిన ఓ పేద కుటుంబం నుంచి వచ్చాను. నా తల్లి ఉల్లిపాయలు అమ్ముతుండేది. నేనేంటో తెలంగాణ, ఏపీల్లో అందరికీ తెలుసు. నా ప్రతిష్టను సింధియా దిగజార్చారు.’’ అని పేర్కొన్నారు. తాను ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ఆమోదించాలని స్పీకర్‌ను దత్తాత్రేయ కోరారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చారు. ఇరానీపై అంతకు ముందే తాము ఇచ్చిన హక్కుల ఉల్లంఘన తీర్మానం నోటీసుపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ పట్టుబట్టారు.పార్లమెంటు ఉభయ సభలనూ ఆమె తప్పుదోవ పట్టించారని, ఇది చాలా విచారకర విషయమని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్‌కు జేడీయూ నేత శరద్ యాదవ్ మద్దతు ప్రకటించారు. -
రోహిత్ అమ్మమ్మ మృతి
గుంటూరు(నెహ్రూనగర్): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) విద్యార్థి వేముల రోహిత్ అమ్మమ్మ బాణాల అంజనీదేవి(74) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి ఒత్తిళ్ల కారణంగానే ఆమె మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ‘మమ్మల్ని పెంచిన ఆమె ఇకలేరు. హృద్రోగి అయిన అమ్మమ్మకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. రోహిత్ ఆత్మహత్యపై స్థానిక అధికారులు రోజుకి ఐదారుగంటల పాటు ప్రశ్నించడంతో హృద్రోగి అయిన ఆమె ఒత్తిడికి గురైంద’ని రోహిత్ సోదరుడు రాజా ఢిల్లీలో వెల్లడించారు. -
కేంద్ర మంత్రుల ఒత్తిడి లేదు!
‘హెచ్‌సీయూ’ వివాదంపై నిజ నిర్ధారణ కమిటీ నివేదిక విద్యార్థుల సస్పెన్షన్ నుంచి ఆత్మహత్యదాకా బాధ్యత వర్సిటీ అధికారులదే సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో విద్యార్థుల సస్పెన్షన్‌కు కేంద్ర మంత్రుల జోక్యం కారణం కాదని కేంద్రం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది. పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు, వర్సిటీలో వివాదాలకు యూనివర్సిటీ యాజమాన్యం వైఫల్యమే కారణమని కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. వర్సిటీ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్, స్టూడెంట్స్ వె ల్ఫేర్ డీన్ ప్రకాష్‌బాబు, తదితరులతో మాట్లాడిన మీదట... మానవ వనరుల శాఖ నుంచి వచ్చిన లేఖలను హెచ్‌సీయూ అధికారులు సీరియస్‌గా తీసుకోలేదని అభిప్రాయపడుతున్నట్లు నివేదికలో వెల్లడించింది. అందువల్ల హెచ్‌సీయూ అధికారులపై మంత్రుల ఒత్తిడి లేదని భావిస్తున్నట్టు పేర్కొంది. హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్య అంశం దుమారం రేపడంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్ఆర్డీ) షకీలా శంషు, సూరత్‌సింగ్‌లతో ద్విసభ్య నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ వర్సిటీలో పరిస్థితులను పరిశీలించింది. అధికారులు, విద్యార్థులతో మాట్లాడి... హెచ్ఆర్డీకి తన నివేదికను అందజేసింది. హెచ్‌సీయూలో విద్యార్థుల సస్పెన్షన్, వివాదాలు, రోహిత్ ఆత్మహత్య తదితర ఘటనలకు వర్సిటీ యాజమాన్యం వైఫల్యమే కారణమని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. రోహిత్‌తో పాటు ప్రశాంత్, విజయ్, సుంకన్న, శేషులపై సస్పెన్షన్ వేటుకు కేంద్ర మంత్రుల జోక్యం కారణం కాదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో వర్సిటీ యాజమాన్యం చర్చలు జరపకపోవడాన్ని కమిటీ తప్పు పట్టింది. వర్సిటీ మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్టులోనూ, 2015 ఆగస్టు 3, 4 తేదీల్లో వర్సిటీ ప్రాక్టోరియల్ బోర్డు చేపట్టిన విచార ణలోనూ తప్పులు దొర్లినట్లు విశ్లేషించింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు గానీ, సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వ్యవస్థగానీ వర్సిటీలో లేని కారణంగా... ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు తాము వివక్షకు గురవుతున్నట్లు భావిస్తున్నారని పేర్కొంది. కమిటీల సూచనలు అమలు చేయలేదు.. హెచ్‌సీయూలో జరుగుతున్న కొన్ని విషయాల్లో త్వరగా స్పందించి, చర్యలు తీసుకోవాలంటూ 2014 న వంబర్‌లో పార్లమెంటు సభ్యులు లేఖ రాసిన విషయాన్ని కూడా నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. వర్సిటీలో జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో 2008లో నియమించిన వినోద్ పావురాల కమిటీ సూచనలనుగానీ, ప్రొఫెసర్ కృష్ణ కమిటీ సూచనలనుగానీ, 2014లో నియమించిన జస్టిస్ రామస్వామి కమిటీ నివేదికనుగానీ వర్సిటీ యాజ మాన్యం లక్ష్యపెట్టలేదని, ఎక్కడా వాటిని అమలు చేయలేదని కమిటీ స్పష్టం చేసింది. దీంతోపాటు వివిధ అంశాలపై వర్సిటీలో నిర్దిష్టమైన విధివిధానాలు లేవని... దాంతో అప్పటికప్పుడు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు విద్యార్థుల్లో అపోహలకు, అనుమానాలకు తావిచ్చాయని తెలిపింది. అయితే కోర్సులు పూర్తిచేసుకున్న చాలా మంది విద్యార్థులు ఇంకా హాస్టళ్లలోనే ఉండడం వర్సిటీలో అనేక సమస్యలకు కారణమవుతోందని కమిటీ పేర్కొంది. -
అరాచకాన్ని అడ్డుకోండి
రాష్ట్రపతిని కోరిన రాహుల్ * రోహిత్ ఆత్మహత్యకు కారణం అణచివేతనే అని వెల్లడి న్యూఢిల్లీ: జేఎన్‌యూలో వివాదం, పాటియాలా హౌస్ కోర్టులో హింస ఘటనలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయని, ఈ అరాచకాన్ని కట్టడి చేసేందుకు వెంటనే జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్.. రాష్ట్రపతిని కోరారు. ప్రజాస్వామ్య హక్కుల అణచివేతను అడ్డుకోవాలని అభ్యర్థించారు. ప్రభుత్వం విద్యాసంస్థలను నాశనం చేస్తోందని, విద్యార్థుల భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తోందని రాహుల్ ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలోని విద్యార్థులపై ఆరెస్సెస్ తన తప్పుడు భావజాలాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గురువారం రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలసి వినతిపత్రం ఇచ్చింది. బీజేపీ తనను జాతి వ్యతిరేకుడిగా ముద్ర వేయడంపై రాహుల్ మండిపడ్డారు. దేశం ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకుందని, రాజధాని నడిబొడ్డున కోర్టు ఆవరణలో జరిగిన అరాచక ఘటనలు దేశ ఉత్తమ ప్రజాస్వామ్య విలువలను కాలరాచేలా ఉన్నాయని ఆ ప్రతినిధి బృందం వినతిపత్రంలో పేర్కొంది. జేఎన్‌యూ, హెచ్‌సీయూ, అలాగే దేశవ్యాప్తంగా ఇతర విద్యాసంస్థల్లోనూ విద్యార్థులను అణగదొక్కుతున్నారని చెప్పారు. హెచ్‌సీయూలో దళిత స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఘటననూ రాహుల్ ప్రస్తావించారు. ప్రభుత్వం అణచివేతవల్లనే ఆయన ఆత్మహత్యకు ఒడిగట్టారన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. విద్రోహులకు మద్దతు ఇవ్వడాన్ని రాహుల్ ఎలా సమర్థించుకుంటారని బీజేపీ ఎదురుదాడి చేసింది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాను పక్కదారి పట్టించేందుకే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించింది. -
ఒరిజినల్ రికార్డులు కోర్టు ముందుంచండి
‘రోహిత్’ కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం జిరాక్స్ ప్రతులు ఇవ్వడంపై ఆగ్రహం.. విచారణ 24కు వాయిదా సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో నమోదైన కేసుకు సంబంధించిన ఒరిజినల్ రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. గతంలోనే ఈ విషయాన్ని చెప్పినా జిరాక్స్ ప్రతులను తమ ముందుంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయాలని కోరుతూ హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ అప్పారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాజ్యంపై ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఒరిజినల్ రికార్డులు సమర్పించకపోవడంతో కోర్టు పైవిధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం రోహిత్ ఆత్మహత్య లేఖను ఎందుకు ఇవ్వలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే అది ఫోరెన్సిక్ ల్యాబ్ వద్ద ఉందని ఏజీపీ చెప్పడంతో... తదుపరి విచారణకు ఒరిజినల్ రికార్డులను తమ ముందుంచాలని ఆదేశించారు. -
రోహిత్ చట్టం తేవాలి
- పౌర సంఘాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం - రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు హైదరాబాద్: బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వ శక్తుల కుట్రలో భాగంగానే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య జరిగిందని పలువురు వక్తలు ఆరోపించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ద్వారా నాటకాలాడుతూ దళిత విద్యార్థులను ఎదగనివ్వకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. నిర్భయ చట్టం తరహాలో రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్, బండారు దత్తాత్రేయ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారమిక్కడ తెలంగాణ డెమోక్రటిక్, సెక్యులర్ అలయెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘రోహిత్ ఆత్మహత్య-జరుగుతున్న పరిణామాలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అలయెన్స్ కన్వీనర్ డాక్టర్ కొల్లూరి చిరంజీవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సియాసత్ ఉర్దూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్, తామీరే మిల్లత్ ఉపాధ్యక్షుడు జియా ఉద్దీన్ నయ్యర్, ప్రొఫెసర్ నాగేశ్వర రావు, జమాతే ఇస్లామీ ప్రతినిధి అజారుద్దీన్, న్యాయవాది కె.ఎం.రాందాస్, ఏఐసీసీ సభ్యులు ఖలీ ఖుర్ రెహ్మాన్, జూపాక సుభద్రలతో పాటు మరో 40 సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. రోహిత్ ఆత్మహత్యపై ఢిల్లీ, ముంబై, కేరళలోని నగరాల్లోనే ఆందోళనలు జరుగుతున్నాయని,హైదరాబాద్‌లో కేవలం హెచ్‌సీయూ క్యాంపస్‌కే పరిమితమయ్యాయని కొల్లూరి చిరంజీవి అన్నారు. పౌరసంస్థలతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి సిద్ధం కావాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు పేర్కొన్నారు. -
రోహిత్ ఘటనపై బస్సుయాత్ర ప్రారంభం
హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా హెచ్‌సీయూ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయాల బస్సుయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఈ యాత్రను ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవివక్షకు వ్యతిరేకంగా పార్లమెంట్లో రోహిత్ చట్టం తీసుకువచ్చేందుకు విద్యార్థులు పోరాడాలన్నారు. ఈ నెల 16 వరకు కొనసాగే ఈ బస్సు యాత్రలో హెచ్‌సీయూ, ఓయూ, పలు తెలంగాణ వర్సిటీల విద్యార్థులు భాగస్వాములవుతారని చెప్పారు. అనంతరం హెచ్‌సీయూ నుంచి బస్సుయాత్ర నేరుగా ఉర్దూ వర్సిటీకి చేరుకుంది. అటు ఏపీలో శుక్రవారం నుంచి జేఏసీ బస్సుయాత్ర ప్రారంభమవనుంది. కాగా, మొదటిరోజు హెచ్‌సీయూ నుంచి మొదలైన బస్సుయాత్ర ఉర్దూ వర్సిటీ, వికారాబాద్మీదుగా పాలమూరు వర్సిటీ వరకు కొనసాగింది. శుక్రవారం మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మీదుగా నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీ వరకు యాత్ర కొనసాగుతుంది. 13న కాకతీయ వర్సిటీకి, 14న ఆదిలాబాద్‌కు, 15న నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని జేఎన్టీయూకు బస్సుయాత్ర చేరుకుంటుంది. 16న జేఎన్టీయూతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ, పొట్టి శ్రీరాములు, నిజాం కాలేజి, కోఠి ఉమెన్స్ కాలేజి, ఇఫ్లూ మీదుగా ఓయూకి చేరుకుంటుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓయూలో బస్సుయాత్ర ముగింపు సభ నిర్వహిస్తారు. -
జేఎన్‌యూలో గరంగరం
‘అఫ్జల్‌గురు ఉరితీత’కు వ్యతిరేకంగా విద్యార్థుల కార్యక్రమం ♦ ఏబీవీపీ ఆందోళనతో విచారణకు ఆదేశించిన వర్సిటీ పాలకవర్గం ♦ ముందుగా నిరసన ప్రదర్శనకు అనుమతి పొందిన నిర్వాహకులు న్యూఢిల్లీ: పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్షకు గురైన అఫ్జల్ గురు ఉరితీతకు వ్యతిరేకంగా, కశ్మీరీ ప్రజల పోరాటానికి మద్దతుగా.. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో మంగళవారం సాయంత్రం పలువురు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించటంపై వర్సిటీ పాలకవర్గం క్రమశిక్షణా విచారణకు ఆదేశించింది. ఆ కార్యక్రమం దేశ వ్యతిరేకమైన కార్యక్రమమని..అనుమతి రద్దు చేసినా కార్యక్రమాన్ని నిర్వహించారని, అందుకు బాధ్యులైన విద్యార్థులను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ సభ్యులు బుధవారం వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో పాలకవర్గం విచారణకు ఆదేశించింది. దేశ విభజనకు సంబంధించి ఎటువంటి మాటలైనా జాతీయత కాబోదని, విద్యార్థుల చర్య క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తుందని పేర్కొంటూ.. ఆ కార్యక్రమంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా జేఎన్‌యూ చీఫ్ ప్రోక్టార్ సారథ్యంలోని కమిటీకి నిర్దేశించింది. ఆ కార్యక్రమం వీడియో దృశ్యాలను చీఫ్ ప్రోక్టార్ పరిశీలిస్తారని, సాక్షులతో మాట్లాడతారని.. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా వర్సిటీ తగిన చర్యలు చేపడుతుందని వీసీ జగదీశ్‌కుమార్ విద్యార్థులతో మాట్లాడాక పేర్కొన్నారు. కార్యక్రమం అఫ్జల్‌కు సంబంధించి ఉంటుందని.. అనుమతి దరఖాస్తులో ప్రస్తావించలేదని, ఒక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నామని మాత్రమే పేర్కొన్నారని వర్సిటీ రిజిస్ట్రార్ భూపీందర్‌జుత్షీ చెప్పారు. అఫ్జల్, మక్బూల్‌భట్‌లను ‘చట్టబద్ధంగా హత్యచేయడాన్ని’ వ్యతిరేకిస్తూ నిరసన, కశ్మీరీల స్వీయ నిర్ణయాధికార పోరాటానికి సంఘీభావంగా ప్రదర్శనలో పాల్గొనాలని విద్యార్థి నిర్వాహకులు మంగళవారం వర్సిటీ క్యాంపస్ అంతటా పోస్టర్లు అతికించారు. ఈ కార్యక్రమానికి ఏబీవీపీ అభ్యంతరం వ్యక్తం చేసి వీసీకి లేఖరాయడంతో ఆ ప్రదర్శనను రద్దే చేయాలని పాలకవర్గం ఆదేశించింది. అనుమతిని రద్దు చేసినా కూడా.. నిర్వాహకులు నిరసన కార్యక్రమానికి బదులుగా సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా, జేఎన్‌యూ విద్యార్థి సంఘం కార్యదర్శి, ఆ సంఘంలో ఏకైక ఏబీవీపీ సభ్యుడు అయిన సౌరభ్‌కుమార్.. ‘‘ప్రజాస్వామ్య ఆలయంపై దాడి చేసిన అఫ్జల్‌గురుపై ఒక కార్యక్రమాన్ని వర్సిటీలో ఎలా నిర్వహించగలరు? ప్రదర్శన నిర్వహించకుండా ఆపేందుకు మేం ప్రయత్నించినపుడు నాకు తుపాకీ చూపించారు’ అని ఆరోపించారు. వారిని బహిష్కరించాలని కేంద్రాన్ని కోరతామని ఏబీవీపి తెలిపింది. ‘హైదరాబాద్ చర్యల పునరావృతమే’ తమ సొంత సిద్ధాంతానికి వ్యతిరేకమైన ప్రతిదాన్నీ ఏబీవీపీ ‘దేశ వ్యతిరేకం’గా అభివర్ణిస్తుందని ఆ కార్యక్రమ నిర్వాహకులు తప్పుపట్టారు. ‘‘మేం అనుమతి తీసుకుంటాం.. చివరి రోజున ఏబీవీపీ వస్తుంది. పాలకవర్గం అనుమతిని రద్దు చేస్తుంది.. ఇది పరిపాటి. హైదరాబాద్ వర్సిటీలో రోహిత్ ఆత్మహత్యకు కారణమైన ఏబీవీపీ చర్యల పునరావృతమే ఇది’’ అని నిర్వాహకుల్లో ఒకరైన అనీర్బన్‌భట్టాచార్య విమర్శించారు. -
వర్సిటీల్లో వివక్షపై భేటీ
18న వీసీలంతా హాజరు కావాలని కేంద్రం ఆదేశం న్యూఢిల్లీ: దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో కుల వివక్ష నిర్మూలనపై చర్చించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వైస్ చాన్స్లర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 18న వర్సిటీల వీసీలంతా హాజరు కావాలని ఆదేశించింది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో కుల వివక్షపై ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రోహిత్ ఆత్మహత్య విషయంలో కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలు ఆరోపణలు ఎదుర్కొంటుండం తెలిసిందే. వర్సిటీల్లో సున్నితమైన ఘటనలు చోటు చేసుకున్నప్పుడు పరిష్కరించేందుకు వీసీలు, సీనియర్ అడ్మినిస్ట్రేటర్లు చొరవచూపాల్సిన అసవరం ఉందని కేంద్రం పేర్కొంది. వార్డెన్లు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, రిజిస్ట్రార్లకు కూడా వివక్ష రూపుమాపేందుకు వీలుగా తరగతులను నిర్వహిస్తామని పేర్కొంది. వర్సిటీల్లో కుల వివక్ష నిర్మూలనకు, ఏవైనా ఘటనలు జరిగినప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు వివరించింది. ‘సంస్కృత వర్సిటీలకు ప్రత్యేక నిధులివ్వండి..’ సంస్కృత వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఇతర సబ్జెక్టుల అధ్యాపకుల ఇస్తున్న విధంగా సంస్కృతం చెప్పే వారికీ వేతనాలు ఇవ్వాలని గోపాలస్వామి కమిషన్ సూచించింది. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గోపాలస్వామి నేతృత్వంలో నియమితమైన ఈ కమిషన్ గత గురువారం నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం కేంద్రం అధీనంలో 2, రాష్ట్రాల పరిధిలో 12 వర్సిటీలు ఉన్నాయి. ‘బోధన’పై నేడు విద్యాశాఖ మంత్రుల భేటీ ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలను పెంచే చర్యలపై చర్చించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో ఢిల్లీలో సోమవారం రాష్ట్రాల విద్యా శాఖా మంత్రుల సమావేశం నిర్వహించనున్నారు. -
రోహిత్ ఆత్మహత్యపై రాజకీయాలు
హెచ్‌సీయూ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్ ఆరోపణ సాక్షి, న్యూఢిల్లీ: రోహిత్ ఆత్మహత్యపై పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయని హెచ్‌సీయూలో ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్ ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్య ఘటనలో వాస్తవాలు చెప్పడానికి విద్యార్థి పరిషత్ నాయకులతో పాటు తాను కూడా విశ్వవిద్యాలయాలకు వెళ్లి వివరించే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. సుశీల్ కుమార్ గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రోహిత్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని, వాస్తవాలు అందరికీ తెలియాలని చెప్పారు. ఇప్పటి వరకూ విశ్వవిద్యాలయాల్లో జరిగిన ఘటనలన్నింటిపైనా పారదర్శక విచారణ చేపట్టి వాస్తవాలను బహిరంగపర్చాలన్నారు. వర్సిటీల్లో సామాజిక వివక్ష ఉందా లేదా అనేదానిపై కూడా విచారణ జరగాలని చెప్పారు. యాకూబ్ మెమెన్ ఉరికి వ్యతిరేకంగా జరిగిన ఘటనలను దళితులు, దళితేతరుల అంశంగా మార్చారని, రోహిత్ ఆత్మహత్య తర్వాత హెచ్సీయూకు వచ్చేవారందరికీ వాస్తవాలు తెలియవని పేర్కొన్నారు. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని అడ్డుకోబోమని, విద్యార్థి జెఏసీకి ఆ హక్కు ఉందని ఆయన చెప్పారు. అంబేడ్కర్ అందరివాడని, ఆయన పేరు చెప్పకుని ఏది చేసినా చెల్లుతుందంటే కుదరదని స్పష్టం చేశారు. -
ఒక కులం కోసం పార్టీ పెట్టలేదు
♦ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టీకరణ ♦ ప్రజల తరపున పోరాడతా.. దేశ సమగ్రతే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చా ♦ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి ♦ రిజర్వేషన్లు దక్కవనే ఆందోళన కాపుల్లో ఉంది ♦ కాపు గర్జన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరం సాక్షి, హైదరాబాద్: తాను ఒక కులం కోసం రాజకీ య పార్టీ పెట్టలేదని సినీ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒక కులం కోసం పోరాడనని, ప్రజల కోసం పోరాడతానని చెప్పారు. దేశ సమగ్రతే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమో కాదో ప్రభుత్వం ప్రకటించాలన్నారు. సాధ్యమైతే ఎలా సాధ్యం, కాకపోతే ఎలా అసాధ్యమో వివరిస్తే తరువాత ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అప్పుడు చూసుకోవచ్చన్నారు. రిజర్వేషన్లు తమకు దక్కవనే ఆం దోళన, తమను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారనే అసంతృప్తి కాపు సామాజికవర్గంలో ఉందని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై పవన్ కల్యాణ్ సోమవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో స్పందించారు. ఎవరి ప్రోద్బలం ఉందో చెప్పలేను ‘‘తునిలో రైలు దగ్ధం ఘటనలో అసాంఘిక శక్తుల పాత్ర ఉంది. 12 బోగీలున్న రైలు ఒక్క అగ్గిపుల్ల గీసేస్తే కాలిపోయేది కాదు. ఎవరో ప్రొఫెషనల్స్ ఈ పని చేశారు. ఘటనకు పాల్పడిన వారిని వీడియో కెమెరాల సాయంతో గుర్తించి చర్యలు తీసుకోవాలి. దీని వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో నేను చెప్పలేను. తునిలో పెద్ద సభ జరుగుతున్నపుడు ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ తదితర ప్రాంతాల్లో కుల రిజర్వేషన్ ఉద్యమాల సందర్భంగా జరిగిన సంఘటనలను గమనించి ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుండేది. మేము ఆడియో విడుదల ఫంక్షన్లు నిర్వహించినపుడు అన్ని అనుమతులు ఉన్నాయా అని లక్షా తొంభై వివరాలు అడిగే పోలీసులు ఇప్పుడు అలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? పోలీసులు నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరం. ఏ ఉద్యమం అయినా శాంతియుతంగా నిర్వహిస్తే విజయవంతం అవుతుంది’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కమిషన్లపై కాపుల్లో నమ్మకం పోయింది ‘‘కాపులకు రిజర్వేషన్లు అనే డిమాండ్ ఇప్పటిది కాదు. గతంలో కొనసాగించి మధ్యలో ఆపివేశారు. కాపులకు రిజర్వేషన్ల వల్ల కలిగే లబ్ధి ఏమిటో నాకు తెలియదు. రిజర్వేషన్లు కల్పిస్తామని అన్ని పార్టీలూ కాపులకు హామీనిస్తున్నాయి. అలానే 2014 ఎన్నికల్లో టీడీపీ కూడా హామీ ఇచ్చింది. రిజర్వేషన్లు వస్తాయో లేదోననే అనుమానం కాపుల్లో ఉంది. గతంలో జస్టిస్ పుట్టుస్వామి కమిషన్ వేసినా నివేదిక ఇవ్వలేదు. వీటిపై కాపుల్లో నమ్మకం పోయింది. ఏదైనా సమస్యకు సామరస్యపూర్వకంగా పరిష్కారం వెతకాలి’’ అని పవన్ సూచించారు. తునిలో ఏం జరిగిందో నాకు తెలియదు ప్రస్తుతం రిజర్వేషన్లను అనుభవిస్తున్న బీసీలకు ఎలాంటి నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు వర్తింపజేసినపుడే వారికి న్యాయం చేసినట్లు అవుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు.తుని ఘటనలకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు కారణమని సీఎంతో సహా మంత్రులు, టీడీపీ నేతలు ఆరోపిస్తుండడాన్ని ఒక విలేకరి ప్రస్తావించగా... వారికి ఉన్న సమాచారం ఏమిటో తనకు తెలియదని చెప్పారు. అక్కడేం జరిగిందో తనకు తెలియదన్నారు. మీరు కాపులకు ప్రతినిధా? ఏపీకి ప్రతినిధా? అని ప్రశ్నించగా... నన్ను ఏపీ ప్రతినిధి అని ఎలా అంటారు, ఎవరి ప్రతినిధి అని ఎలా అడుగుతారని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ చేస్తేనే కాపులకు రిజర్వేషన్లు సాధ్యమని చెప్పకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. కాపుల ఉద్యమానికి మీ మద్దతు ఉందా? లేదా? మీరు అనే విషయాల్లో సీఎం చంద్రబాబుకు ఆపద్బాంధవుడిలా వ్యవహరిస్తున్నారని విలేకరులు ప్రస్తావించగా... పవన్ కల్యాణ్ స్పందించలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం తనను బాధించిందని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఉందని చెప్పారు. -
హెచ్ సీయూలో తరగతులు ప్రారంభం
♦ శాంతించిన విద్యార్థులు.. 8 ప్రధాన డిమాండ్లతో వినతిపత్రం ♦ పది రోజుల్లో పరిష్కరించకుంటే మళ్లీ ఉద్యమిస్తామని హెచ్చరిక ♦ డిమాండ్లపై సానుకూలంగా వ్యవహరిస్తాం: ఇన్చార్జి వీసీ పెరియస్వామి సాక్షి, హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్యతో ఉద్రిక్తంగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. దాదాపు రెండు వారాల అనంతరం సోమవారం తరగతులు ప్రారంభం అయ్యాయి. వర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్ పెరియస్వామి విజ్ఞప్తి మేరకు విద్యార్థులతో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది యధావిధిగా విధులకు హాజరయ్యారు. ఇక విద్యార్థులు ఎనిమిది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇన్చార్జి వీసీ పెరియస్వామికి అందజేశారు. పది రోజుల్లోగా తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని కేంద్ర మానవ వనరుల శాఖ తమకు సూచించిందని ఇన్చార్జి వీసీ పెరియస్వామి తెలిపారు. ఇక విద్యార్థుల డిమాండ్లపై సానుకూలంగా వ్యవహరిస్తున్న ఇన్చార్జి వీసీ పెరియస్వామికి కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్లు హెచ్‌సీయూ ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు, రోహిత్ ఉద్యమానికి అనుకూలంగా ఉన్న ఇతర అధ్యాపకులు పేర్కొన్నారు. అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి వేతనాలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు సోమవారం విడుదలైనట్లు తెలిపారు. మరోవైపు సోమవారం కూడా ముంబై, ఢిల్లీల్లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. డిమాండ్లను పరిష్కరిస్తాం: ఇన్చార్జి వీసీ విద్యార్థుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాల్సిందిగా మానవ వనరుల అభివృద్ధి శాఖ తనకు సూచించిందని ఇన్చార్జి వీసీ పెరియస్వామి తెలిపారు. ఆ డిమాండ్లలో తన పరిధిలో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. వర్సిటీ వీసీ అప్పారావును తొలగించే అంశం తన పరిధిలోది కాదని, విచారణ కమిటీ నివేదిక అనంతరం కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. రోహిత్ తమ్ముడు రాజుకు ఆయన విద్యార్హతలను బట్టి ఎక్కడ అవకాశం కల్పించగలమనే దానిని వర్సిటీ పాలకమండలి పరిశీలిస్తోందన్నారు. అలాగే 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించే అంశాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పరిశీలిస్తున్నట్లు తెలిసిందని... వర్సిటీ అధ్యాపకులు సైతం కొంత సాయం చేయాలని యోచిస్తున్నారని తెలిపారు. ఇక గతంలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు, నష్టపరిహారం చెల్లింపు అంశాలపై పాలక మండలి ఒక నివేదికను తయారు చేస్తుందన్నారు. సుశీల్ అరెస్ట్ వద్దు: హైకోర్టు రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో హెచ్‌సీయూ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్, కార్యదర్శి కృష్ణ చైతన్య, సుశీల్ బాబాయి దివాకర్‌లను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. అయితే ఈ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులయ్యారంటూ పీహెచ్డీ విద్యార్థి ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు... వర్సిటీ వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి దత్తాత్రేయలతో పాటు సుశీల్‌కుమార్, కృష్ణచైతన్య, దివాకర్లపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ సుశీల్‌కుమార్ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. రోహిత్, ప్రశాంత్ తదితరులపై సుశీల్‌కుమార్ తొలుత పోలీసులకు ఫిర్యాదు చేశారని, దానికి కౌంటర్‌గానే సుశీల్ తదితరులపై ప్రశాంత్ ఫిర్యాదు చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి... పిటిషనర్లను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల డిమాండ్లు.. ♦ హెచ్‌సీయూ వీసీ అప్పారావును పదవి నుంచి తొలగించాలి. ♦ {పొఫెసర్ శ్రీవాస్తవను కూడా బాధ్యతల నుంచి తప్పించాలి. ♦ రోహిత్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి హెచ్‌సీయూలో ఉద్యాగావకాశం ఇవ్వాలి. ♦ పెండింగ్‌లో ఉన్న రోహిత్ స్కాలర్షిప్ను తక్షణమే విడుదల చేయాలి. ♦ రోహిత్ స్మారకోపన్యాసాన్ని విశ్వవిద్యాలయమే అధికారికంగా నిర్వహించాలి. ♦ రోహిత్‌తో పాటు సస్పెండ్ చేసిన నలుగురికి విశ్వవిద్యాలయం యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలి.ఉన్నత విశ్వవిద్యాలయాల్లో వివక్షను నిర్మూలించడం కోసం థోరట్ కమిటీ చేసిన సిఫార్సులను అన్ని విశ్వవిద్యాలయాల్లో అమలు చేయాలి. ♦ ఉన్నత విద్యాలయాల్లో వివక్షను నివారించేందుకు రోహిత్ చట్టం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్‌సీయూ పాలక మండలి విజ్ఞప్తి చేయాలి. ♦ అలోక్పాండేను తొలగించాలి. ప్రాక్టోరియల్బోర్డును పునర్వ్యవస్థీకరించాలి. వివక్షకు వ్యతిరేకంగా, విద్యార్థులకు సంఘీభావంగా అధికారిక పదవులకు ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు చేసిన రాజీనామాలను పాలక మండలి అంగీకరించవద్దు. వారిని యధావిధిగా కొనసాగించాలి. -
రాహుల్ క్షమాపణ చెప్పాలి
♦ ఏబీవీపీ డిమాండ్.. ట్యాంక్‌బండ్ వద్ద ఆందోళన ♦ ఉగ్రవాదులకు మద్దతుదారైన రోహిత్‌ను మహాత్ముడితో పోలుస్తారా? ♦ రాజకీయ మనుగడ కోసం రాహుల్ నీచమైన చర్యలు చేపడుతున్నారు సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాది యాకూబ్ మెమెన్‌కు మద్దతుగా ప్రదర్శనలు చేసిన వారిని జాతిపిత మహాత్మాగాంధీతో పోల్చడం తీవ్రమైన నేరమని.. దీనిపై రాహుల్‌గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్య ఘటనపై రాహుల్ శవ రాజకీయాలు, కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడింది. రాహుల్ రెండుసార్లు హెచ్‌సీయూను సందర్శించడాన్ని నిరసిస్తూ ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. కొన్ని పార్టీలు, నాయకులు రాజకీయంగా లబ్ధి పొందేందుకు రోహిత్‌ను దళితుడిగా చిత్రీకరించారని ఏబీవీపీ నేతలు మండిపడ్డారు. అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్ (ఏఎస్ఏ) పేరుతో కొందరు తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు తెలుపుతున్నారని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప ఆరోపించారు. ఉగ్రవాదులు మెమెన్, అఫ్జల్‌గురు, కసబ్‌లను చట్టబద్ధంగా ఉరి తీశారని.. దానిని నిరసిస్తూ కార్యక్రమాలు చేపట్టిన వారు ఆ ఉగ్రవాదులకు మద్దతుదారులేనని చెప్పారు. అలాంటివారిని మహాత్ముడితో పోల్చడం తీవ్ర నేరమన్నారు. జాతిపితను అవమానించిన రాహుల్‌గాంధీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులతో పోరాడి నేలకొరిగిన జవాన్ల కుటుంబాలను పరామర్శించడానికి సమయం కేటాయించని రాహుల్.. హెచ్‌సీయూను సందర్శించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ మనుగడ కోసం నీచమైన చర్యలకు ఒడిగట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. రోహిత్ తన సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న ఏఎస్ఏ, ఎస్ఎఫ్ఐ నాయకులపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ విద్యార్థుల్లో కొందరు ప్రొఫెసర్లు విషబీజాలు నాటుతున్నారని, అటువంటి వారిని గుర్తించి సమగ్ర విచారణ జరపాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నిరంజన్, మట్ట రాఘవేందర్, దిలీప్, హైదరాబాద్ నగర కార్యదర్శి వెంకట్‌రెడ్డి, ప్రవీణ్, జగన్, యాదగిరి, ఎల్లాస్వామి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో ఎవరూ సెటిలర్లు కాదు: వెంకయ్య
హైదరాబాద్ : హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాల రాజకీయాలతో రోహిత్ ఆత్మ బాధపడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో వెంకయ్యనాయుడు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ...ఐసిస్ సానుభూతిపరులు మాపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని పరోక్షంగా ఎంఐఎంపై మండిపడ్డారు. హెదరాబాద్లో ఎవరూ సెటిలర్లు కాదని.... అందరూ భారతీయులే అని వెంకయ్య స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ముంపు మండలాలు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కో ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. సమాజంలో దళితులు, దళితేతరులు అంటూ చర్చ తేవడమే దారణమన్నారు. అభివృద్ధి విషయంలో సమాజంలో అన్ని వర్గాలను మోదీ గౌరవిస్తారని వెంకయ్య గుర్తు చేశారు. ఒక్క ఏడాదిలోనే 20 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరచిన ఘనత నరేంద్ర మోదీదే అని చెప్పారు. అలాగే రూ. 12 తో ప్రజలకు బీమా సౌకర్యం కల్పించిన ఘనత కూడా మోదీ ప్రభుత్వానిదే అని వెంకయ్య నాయుడు తెలిపారు. -
'రోహిత్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటు'
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో విద్యార్థుల ఆమరణ దీక్షకు తిరుపతి ఎంపీ వరప్రసాద్ సంఘీభావం తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రోహిత్ మరణం అతని కుటుంబానికి తీరని లోటని అన్నారు. రోహిత్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని వరప్రసాద్ డిమాండ్ చేశారు. కాగా, హెచ్‌సీయూలో సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు విద్యార్థుల్లో గుంటూరుకు చెందిన వేముల రోహిత్ అనే పీహెచ్డీ విద్యార్థి కలత చెంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సెంట్రల్ యూనివర్సిటీలో ఏడుగురు విద్యార్థులు కొన్నిరోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి విధితమే. -
రోహిత్ మృతికి కేంద్రమే బాధ్యత వహించాలి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ జిల్లా కేంద్రంలో దీక్షకు దిగారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతిఇరానీలను వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
రోహిత్ ఆత్మహత్యపై న్యాయవిచారణ జరిపించాలి
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై న్యాయవిచారణ జరిపించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు డిచ్పల్లి మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద ఒక రోజు రిలే నిరాహార దీక్షకు దిగారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాద్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. -
విధిలేని పరిస్థితుల్లోనే విద్యార్థుల సస్పెన్షన్
-
విధిలేని పరిస్థితుల్లోనే విద్యార్థుల సస్పెన్షన్
• హైకోర్టులో హెచ్‌సీయూ రిజిస్ట్రార్ కౌంటర్ దాఖలు • భవిష్యత్తులో పునరావృతం కాకూడదనే కఠిన నిర్ణయం • యూనివర్సిటీ నుంచే పంపేయాలని బోర్డు సిఫారసు చేసింది • అయితే మేం వారి పట్ల ఉదారంగా వ్యవహరించాం • వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సస్పెన్షన్ ఎత్తేశాం • హాస్టళ్లలో ప్రవేశం, ఎన్నికల్లో పోటీకి మాత్రమే సస్పెన్షన్‌ను వర్తింపజేశాం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్‌పై జరిగిన దాడి వ్యవహారంలో ఐదుగురు పరిశోధక (పీహెచ్డీ) విద్యార్థులను యూనివర్సిటీ నుంచే పంపేయాలని ప్రొక్టోరియల్ బోర్డు సిఫారసు చేసిందని వర్సిటీ రిజిస్ట్రార్(ఇన్చార్జ్) ఎం.సుధాకర్ హైకోర్టుకు నివేదించారు. అయితే వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎంతో ఉదారంగా వ్యవహరించామని, అందులో భాగంగానే పూర్తిస్థాయి సస్పెన్షన్‌ను రద్దు చేశామని తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు, మిగిలిన విద్యార్థులకు గుణపాఠం కావాలన్న ఉద్దేశంతోనే విధిలేని పరిస్థితుల్లోనే ఐదుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశామన్నారు. యూనివర్సిటీలో అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసు మేరకే సస్పెన్షన్‌ను ఎత్తివేశామని కోర్టుకు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రతిదీ యూనివర్సిటీ నిబంధనల మేరకే జరిగిందన్నారు. యూనివర్సిటీ తమపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పీహెచ్డీ విద్యార్థులు దొంత ప్రశాంత్ తదితరులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఇన్చార్జ్ రిజిస్ట్రార్ తాజాగా కౌంటర్ దాఖలు చేశారు. అది స్వచ్ఛంద క్షమాపణ కాదు సుశీల్ కుమార్ తమకు స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పారని పిటిషనర్లు పేర్కొనడంలో వాస్తవం లేదని రిజిస్ట్రార్ తన కౌంటర్లో పేర్కొన్నారు. ‘‘అంబేద్కర్ విద్యార్థి సంఘానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరుతూ ఎన్ఆర్ఎస్ హాస్టల్లో సుశీల్‌కుమార్ ఉన్న గదికి 30 మంది వరకు విద్యార్థులు వెళ్లినట్లు 2015 ఆగస్టు 4 రోజు వేకువజామున మాకు సమాచారం వచ్చింది. సుశీల్‌ను అతని రూం నుంచి సైకిల్ షెడ్ వరకు తీసుకొచ్చి రాతపూర్వక క్షమాపణలు తీసుకున్నారు. గది నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలో పిటిషనర్లు అతనిపై భౌతిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఒత్తిడిలో సుశీల్‌కుమార్ క్షమాపణలు చెప్పారు. యూనివర్సిటీ భద్రతా సిబ్బంది తమ వాహనంలో సుశీల్‌కుమార్‌ను మెయిన్‌గేట్ సమీపంలోని సెక్యూరిటీ పోస్ట్ వద్దకు తీసుకొచ్చారు. పిటిషనర్లు, ఇతరులు అక్కడకు వచ్చి ఫేస్బుక్లో తన క్షమాపణలను సుశీల్కుమార్తోనే అప్లోడ్ చేసేలా చేశారు. సుశీల్‌కుమార్ తన క్షమాపణలను శాంతిపూర్వకంగా, స్వచ్ఛందంగా చెప్పారన్న పిటిషనర్ల వాదనలను ఖండిస్తున్నా. అసలు అంత మంది ఓ విద్యార్థి హాస్టల్ గదికి వెళ్లి, బలవంతంగా బయటకు తీసుకురావడం న్యాయబద్ధం కాదు. అసలు భౌతిక హింసే జరగలేదని అనుకున్నా.. మొత్తం వ్యవహారం ప్రజాస్వామ్యయుతంగా, శాంతిపూర్వకంగా జరిగిందని పిటిషనర్లు చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఈ ఘోర తప్పిదానికి పిటిషనర్లే కారణం. వారు తమ పాత్రను ఎంత మాత్రం తోసిపుచ్చలేరు’’ అని రిజిస్ట్రార్ వివరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు ‘‘సుశీల్‌కుమార్ ఫేస్బుక్లో చేసిన వ్యాఖ్యల వల్ల తమకు ఇబ్బంది ఉందని భావిస్తే పిటిషనర్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయాల్సింది. అంతే తప్ప చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు’’ అని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ‘‘ఆ రోజు సుశీల్‌కుమార్ ఫోన్ చేయడంతో పోలీసులు హాస్టల్‌కు చేరుకున్నారు. తర్వాత పిటిషనర్లపై అదేరోజు కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో అటు యూనివర్సిటీని, ఇటు పోలీసులను ఎవరో తప్పుదోవ పట్టించారంటూ పిటిషనర్లు చేస్తున్న వాదనలో ఎంత మాత్రం వాస్త వం లేదు. ప్రొక్టోరియల్ బోర్డు నిర్వహించిన విచారణలో ఈ మొత్తం ఘటన వెనుక పిటిషనర్ల పాత్ర ఉన్నట్లు తేలింది. బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు సుశీల్‌కుమార్ తల్లి, ఇతరుల సమక్షంలో వైస్ ఛాన్స్‌లర్‌ను కలిసిన మాట నిజమే. బాధ్యులైన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరిన మాట కూడా నిజం. ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి చేసిన ఫిర్యాదుకు కౌంట ర్గా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు కూడా ఫిర్యాదు చేసి సుశీల్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలన్నారు. ఈ రెండు ఫిర్యాదుల ను యూనివర్సిటీలో విద్యార్థుల క్రమశిక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే ప్రొక్టోరియల్ బోర్డుకు నివేదించాం. పిటిషనర్లకు కూడా నోటీసులు జారీ చేసి బోర్డు ముందు హాజరు కావాలన్నాం. వారి వాంగ్మూలాలు నమోదు చేశాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సుశీల్‌కుమార్ విచారణకు హాజరు కాలేదు. అయినా బోర్డు విచారణను కొనసాగించి, ఆగస్టు 12న మధ్యంతర నివేదిక ఇచ్చింది. వర్సిటీ వర్గాలకు ఫిర్యాదు చేయకుండా సుశీల్‌కుమార్ గదికి వెళ్లి గొడవకు దిగిన పిటిషనర్లకు గట్టి హెచ్చరికలు చేయాలని బోర్డు తన నివేదికలో సిఫారసు చేసింది. సుశీల్‌కుమార్, ఇతర సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసేం దుకు బోర్డు మరోసారి సమావేశమై ఆగస్టు 31న తుది నివేదిక సమర్పించింది. సుశీల్‌కుమార్‌పై పిటిషనర్లు భౌతికంగా దాడి చేశారని, అందువల్ల వారిని యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయాలని సిఫారసు చేసింది. అందులో భాగంగానే సెప్టెంబర్ 8న పిటిషనర్లను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశాం. ఈ ఘటనలో వారు ఎక్కడా తమ పాత్రను తోసిపుచ్చలేదు. అయితే విద్యార్థుల నుంచి వచ్చిన వినతి మేరకు సెప్టెంబర్ 11న వారి సస్పెన్షన్‌ను ఎత్తివేశాం’’ అని రిజిస్ట్రార్ కోర్టుకు తెలిపారు. ఉదారంగా వ్యవహరించాం ‘‘ప్రొక్టోరియల్ బోర్డు నివేదికను వైస్ ఛాన్సలర్ ఏర్పాటు చేసిన సబ్ కమిటీ పరిశీలించి, అందులో చేసిన సిఫారసులతో ఏకీభవించింది. తన నివేదికను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందు ఉంచింది. ప్రొక్టోరియల్ బోర్డు, సబ్ కమిటీల నివేదికను పరిశీలించిన కౌన్సిల్ విద్యార్థుల విద్యా, ఆర్థిక పరిస్థితులను దృష్టి పెట్టుకుని వారి పట్ల ఉదారంగా వ్యవహరించాలని నిర్ణయించింది. యూనివర్సిటీ నుంచి కాకుండా హాస్టళ్లు, పరిపాలన భవనాల్లో ప్రవేశానికి, ఎన్నికల్లో పోటీ చేయకుండా మాత్రమే పిటిషనర్లను అనర్హులుగా చేస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది’’ అని రిజిస్ట్రార్ తన కౌంటర్లో వివరించారు. ‘‘పిటిషనర్లలో ఒకరైన వేల్పుల సుంకన్న ఇప్పటికే పీహెచ్డీ థీసిస్ సమర్పించారు. అయితే సస్పెన్షన్ అతని విద్య కొనసాగింపునకు అడ్డంకి కాదు. తరగతులకు, సెమినార్లకు, వర్క్‌షాపులకు, గ్రంథాలయానికి హాజరు కాకుండా అతన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. విషయపరంగా ఓ అంశంపై ఆరోగ్యకరమైన చర్చలు విద్యార్థి జీవితంలో భాగం. అయితే రెచ్చిపోయి ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగడాన్ని సహించం. అందుకే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో పిటిషనర్లను హాస్టళ్ల నుంచి సస్పెండ్ చేశాం’’ అని రిజిస్ట్రార్ వివరించారు. -
తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ధర్నా
హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ) జేఏసీ విద్యార్థులు మంగళవారం ధర్నా నిర్వహించారు. వేముల రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు సచివాలయం ముందు బైఠాయించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ ఆత్మహత్య చేసుకుని పది రోజులు కావొస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడాన్ని ఖండిస్తున్నామని తెలంగాణ విద్యార్థి జేఏసీ నేత భాస్కర్ అన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, వీసీ అప్పారావులపై కేసు నమోదైనా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. -
కదం తొక్కిన విద్యార్థులు
చలో హెచ్‌సీయూ విజయవంతం రేపు యూనివర్సిటీల బంద్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల చలో హెచ్‌సీయూ విజయవంతమైంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వేలాది మంది విద్యార్థులు కదం తొక్కారు. విశ్వవిద్యాలయాల్లో వివక్షను సాగనివ్వబోమని నినదించారు. ఈ నెల 27న దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల బంద్‌కు పిలుపునిచ్చారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను, వీసీ అప్పారావును తొలగించాలని డిమాండ్ చేశారు. అఖిల భారత స్థాయిలో విద్యార్థి జేఏసీని ఏర్పాటు చేసి సమైక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని ప్రకటించారు. ఈ నెల 28 లోపు విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించకపోతే... నాగ్‌పూర్‌లోని అంబేడ్కర్ దీక్షా స్థలం నుంచి దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు చేపట్టాలంటూ విద్యార్థి జేఏసీ ఇచ్చిన చలో హెచ్‌సీయూ పిలుపు విజయవంతమైంది. హెచ్‌సీయూలో ప్రారంభమైన ఉద్యమానికి సంఘీభావం పలికేందుకు సోమవారం తొమ్మిది రాష్ట్రాల నుంచి నాలుగైదు వేల మంది ప్రతినిధులు తరలివచ్చారు. వివిధ ప్రజాసంఘాలు, మహిళా, విద్యార్థి సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని వారంతా ముక్తకంఠంతో నినదించారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను తక్ష ణమే పదవి నుంచి తొలగించాలని, సెలవులో వె ళ్లిన వీసీ అప్పారావును శాశ్వతంగా పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇన్చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన విపిన్ శ్రీవాత్సవ తక్షణమే వైదొలగాలన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హెచ్‌సీయూ జేఏసీ నాయకులు ప్రశాంత్, వెంకటేశ్ చౌహాన్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న వివక్షను రోహిత్ ఆత్మహత్య ఉదంతం తెరపైకి తెచ్చిందని, ఈ ఉద్యమం విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులను ఐక్యం చేసిందని వారు పేర్కొన్నారు. అందులో భాగంగానే అఖిల భారత స్థాయిలో విశ్వవిద్యాలయాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రశాంత్, సుంకన్న, విజయ్, శేషన్న తదితరులు ప్రకటించారు. హెచ్‌సీయూ ఉద్యమానికి సంఘీభావంగా వివిధ విద్యాసంస్థల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఐక్య ఉద్యమ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు. దేశంలో నెలకొన్న హిందూత్వ, మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, అందుకు కలసివచ్చే అన్ని వర్గాలను కలుపుకొనిపోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడారు. విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలి.. రోహిత్ ఆత్మహత్య విశ్వవిద్యాలయాల్లో అడుగడుగునా నెలకొన్న వివక్షను బహిర్గతం చేసిందని యూజీసీ మాజీ చైర్మన్ సుఖ్‌దేవ్ థోరట్ పేర్కొన్నారు. దేశంలోని వర్సిటీల్లో జరిగిన 25 ఆత్మహత్యల్లో 23 దళితులవే కావడం వివక్ష స్వరూపాన్ని బట్టబయలు చేస్తోందన్నారు. సామాజిక అవగాహనను, పరమత సహనాన్ని పెంచేలా విద్యావ్యవస్థలో మార్పులు తేవాలని చెప్పారు. వర్సిటీల్లో దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షపై ఒక కమిటీని నియమించాలన్నారు. వర్సిటీలను బ్రాహ్మణ అగ్రహారాలుగా తయారు చేయొ ద్దని... విద్యాసంస్థల్లో వివక్షను నిరోధించేం దుకు ‘రోహిత్ చట్టం’ చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన స్మృతి ఇరానీని, దత్తాత్రేయని మంత్రి పదవుల నుంచి తొలగించాలన్నారు. సమాజంలో లోపించిన మానవీయ సంబంధాలను, సమాజంలో నెలకొన్న అసహనాన్ని రోహిత్ మరణం లేవనెత్తిందని ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పారు. వివక్ష మూలాలను వెతకకుండా, సమాజంలో మార్పు రాకుండా వర్సిటీల్లో మార్పుని ఆశించలేమన్నారు. బీజేపీ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను హిందూత్వ భావజాలంతో నింపాలనుకుంటే విద్యార్థులు ఇకపై సహించరని వ్యాఖ్యానించారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని, సంఘటితంగా వివక్షను ఎదుర్కొంటామని సభకు హాజరైన విద్యార్థులతో ప్రొఫెసర్ కంచ ఐలయ్య ప్రమాణం చేయించారు. మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ... ఇది సమానత్వానికి, కులతత్వానికి మధ్య పోరాటమని వ్యాఖ్యానించారు. వ్యవస్థలో ఉన్న అసమానతలపై రోహిత్ తిరుగుబాటు చేశాడని ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. దేశంలోని అన్ని వర్సిటీల్లో వివక్ష జరుగుతోందన్నారు. హెచ్‌సీయూలో ప్రారంభమైంది సైద్ధాంతిక యుద్ధమని అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ అభివర్ణించారు. విద్యార్థులపై హిందూత్వ రాజకీయాలను రుద్దడం ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. రోహిత్ మరణానికి కారకులైన వారిపై చర్య తీసుకోకపోతే తన కథల పుస్తకానికి వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని వెనక్కిచ్చేస్తానని పసునూరి రవీందర్ ప్రకటించారు. విద్యార్థులకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ, విరసం నేత కాశీం, ముంబై యూనివర్సిటీ ప్రొఫెసర్ ముంగేకర్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు వెంకటరెడ్డి, డీఎస్ఎస్ అధ్యక్షురాలు గెడ్డం ఝాన్సీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకట్, ప్రగతి శీల మహిళా సంఘం నాయకురాలు వి.సంధ్య తదితరులు సంఘీభావం ప్రకటించారు. సస్పెన్షన్ రద్దు ఉత్తర్వులు మా ముందుంచండి హెచ్సీయూకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: పీహెచ్డీ విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఆ ఉత్తర్వుల కాపీని పిటిషనర్లకు కూడా అందచేయాలని స్పష్టం చేసింది. అలాగే ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో పురోగతికి సంబంధించి ఏవైనా వివరాలుంటే వాటిని అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తన కుమారుడు సుశీల్‌కుమార్‌పై దాడి జరిగిందని, అందువల్ల అతనికి తగిన భద్రత కల్పించేలా అధికారులను ఆదేశించాలంటూ వినయ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ పీహెచ్డీ విద్యార్థులు దొంత ప్రశాంత్ తదితరులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యలను న్యాయమూర్తి సోమవారం విచారించారు. ఈ సందర్భంగా హెచ్‌సీయూ తరఫు న్యాయవాది ఎన్.వి.సుమంత్ స్పందిస్తూ పీహెచ్డీ విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేశామని కోర్టుకు నివేదించారు. విద్యార్థుల తరఫు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం సస్పెన్షన్ కొనసాగుతోందని, సస్పెన్షన్ రద్దు ఉత్తర్వులు తమకు అందలేదన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ ఒకవేళ సస్పెన్షన్ అలాగే ఉందని భావిస్తే, ఈ వ్యాజ్యంలో పిటిషనర్లలో ఒకరిగా ఉన్న రోహిత్ మృతి చెందినందున, ఆ మేర పిటిషన్లో సవరణలు చేయాలని సూచిస్తూ విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేశారు. -
సుమిత్రది మనువాద తత్వం
లక్నో/న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యలను బీఎస్పీ చీఫ్ మాయావతి, జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ ఖండించారు. ఆమె అభిప్రాయాలు మనువాద మనస్తత్వానికి అద్దం పడుతున్నాయన్నారు. అహ్మదాబాద్‌లో పార్లమెంట్, అసెంబ్లీ ప్రిసైడింగ్ అధికారుల భేటీలో సుమిత్ర మాట్లాడుతూ ‘పదేళ్లు కోటా ఉండాలని, ఈలోగా స్వతంత్ర భారత్‌లో అందరూ సమానమే అన్న సమాజాన్ని సృష్టించుకోగలమని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ భావించారు’ అని అన్నారు. కులాధార రిజర్వేషన్లపై సమీక్షించాలని సుమిత్ర అన్నారని, మనువాద మనస్తత్వం వల్లే అలా మాట్లాడగలిగారని మాయావతి విమర్శించారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో రాజ్యాంగపరంగా ఉన్నతస్థానంలో ఉన్న మహిళ ఇలా అనడం అగ్నికి ఆజ్యం పోయడమేనన్నారు. రాజకీయ రిజర్వేషన్లు(పార్లమెంటు, అసెంబ్లీలు) మాత్రమే అంబేడ్కర్ సమీక్షించాలన్నారని శరద్‌యాదవ్ చెప్పారు. -
దీర్ఘకాలిక సెలవుపై వీసీ అప్పారావు
ఇన్చార్జి వీసీగా బిపిన్ శ్రీవాస్తవ నియామకం సాక్షి, హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో అట్టుడుకుతున్న హెచ్‌సీయూలో మరో కొత్త వివాదం మొదలైంది. యూనివర్సిటీ వీసీ పొదిలె అప్పారావు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో భౌతికశాస్త్ర విభాగం ప్రొఫెసర్ బిపిన్ శ్రీవాస్తవను ఇన్చార్జి వీసీగా నియమిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అప్పారావును సస్పెండ్ చేసిన తర్వాతే.. మరో వీసీని నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి. శ్రీవాస్తవ పై గతంలో అనేక ఆరోపణలున్నాయని, ఆయన నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ సబ్ కమిటీయే రోహిత్ సస్పెన్షన్‌కు కారణమని విద్యార్థులు చెబుతున్నారు. 2008లో శ్రీవాస్తవ వేధింపుల వల్లే తమిళనాడుకి చెందిన సెంథిల్ కుమార్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొంటున్నారు. ఇద్దరు విద్యార్థుల మృతికి కారణమైన శ్రీవాస్తవని వీసీగా ఎలా నియమిస్తారని విద్యార్థి జేఏసీ, ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం, ఆఫీసర్స్ ఫోరం ప్రశ్నించాయి. పందులు పెంచుకునే కుటుంబం నుంచి వచ్చిన సెంథిల్‌కు గైడ్‌ని కేటాయించకుండా శ్రీవాస్తవ వేధించాడని, కావాలని తక్కువ మార్కులు వేసి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ చేసినందునే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ‘పందులు పెంచుకునేవాడికి ఇక్కడేం పని? ఊరికెళ్లి పందులు కాసుకో..’ అంటూ సెంథిల్‌ను నాడు శ్రీవాస్తవ అవమానించారని ఫోరం ఆరోపిస్తోంది. సెంథిల్ తన ఆత్మహత్య లేఖలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు ఫ్యాకల్టీ సభ్యులు అంటున్నారు. ఆ సూచనలు అమలు చేసి ఉంటే.. సెంథిల్ ఆత్మహత్య ఘటన తర్వాత వర్సిటీలో దళిత విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం, వివక్షపై ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ కి అధ్యక్షుడిగా వ్యవహరించిన వినోద్ పావురాల ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘సెంథిల్ ఆత్మహత్య తర్వాత యూనివర్సిటీలో జరుగుతున్న వివక్షపై మా కమిటీ ఇచ్చిన గైడ్‌లైన్స్‌ని సజావుగా అమలు చేసి ఉంటే ఈ రోజు రోహిత్ మరణం సంభవించి ఉండేది కాదు. పీహెచ్డీ విద్యార్థులకు సత్వరమే గైడ్‌ని కేటాయించాలని సూచించాం. గైడ్‌తోపాటు ఇద్దరు సభ్యులతో డాక్టోరల్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పాం. వారిద్దరూ సంబంధిత విద్యార్థికి సహాయ సహకారాలు అందుతున్నాయో లేదో చూడాలి అని సూచించాం’’ అని ఆయన వివరించారు. విద్యార్థులకు సంబంధించిన అంశాల్లో సైన్స్ ఫ్యాకల్టీ మరింత సున్నితంగా వ్యవహరించాలని కూడా తమ కమిటీ సూచించిందని చెప్పారు. రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి... శ్రీవాస్తవ నియామకంతో వర్సిటీలో మరోసారి హిందూత్వ రాజకీయాలు బట్టబయలయ్యాయని రోహిత్‌తో పాటు సస్పెన్షన్‌కు గురైన ప్రశాంత్, సుంకన్న, విజయ్, శేషయ్య ఆరోపించారు. ‘‘హంతకులకు తప్ప మరొకరికి ఈ యూనివర్సిటీలో వీసీ అయ్యే అర్హత లేదని మరోసారి రుజువు చేశారు. శవాల గుట్టలతో విశ్వవిద్యాలయాలను నింపాలనుకుంటే మేం చూస్తూ ఊరుకోం. రోహిత్ మరణమే చివరి మరణం కావాలి’’ అని వారు పేర్కొన్నారు. శ్రీవాస్తవ నియామకాన్ని వ్యతిరేకిస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టాలని వర్సిటీ ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం, టీచర్స్ ఫోరం యోచిస్తోంది. ఆమరణ దీక్షలో మరో ఏడుగురు యూనివర్సిటీలో మరో ఏడుగురు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రోహిత్ మృతికి కారణమైనవారిపై చర్యలతోపాటు ఐదు డిమాండ్లతో ఏడుగురు విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు శనివారం భగ్నం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దీక్షకు కొనసాగింపుగా ఆదివారం నుంచి ఆగ్నిస్ అమల, ఎం.కిరణ్, ప్రమీల, హరిక్రిష్ణ, పాటిథిక్ భౌమిక్, ముబషిర్, దేవీ ప్రసాద్ విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగారు. -
'మోదీపై ఉన్న భయంతోనే మాట్లాడటం లేదు'
హైదరాబాద్ : హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ మౌనం వహించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం హైదరాబాద్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రోహిత్ మృతిపై అందరూ స్పందిస్తున్నారు... కానీ చంద్రబాబు, కేసీఆర్ మాత్రం స్పందించడం లేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న భయంతోనే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడటం లేదని కె.రామకృష్ణ విమర్శించారు. -
నా బిడ్డ మరణానికి కారకులెవ్వరు?
నా బిడ్డ మరణానికి కారకులెవ్వరు?: రోహిత్ తల్లి రాధిక నా తమ్ముడిని ఆత్మహత్యకు పురిగొల్పి హత్య చేశారు: రోహిత్ సోదరి సాక్షి, హైదరాబాద్: ‘‘నా కొడుకు మరణానికి కారకులెవరో తేల్చాలి. నా ప్రశ్నలు వేటికీ కూడా వైస్ చాన్స్‌లర్ అప్పారావు సమాధానం చెప్పలేదు. నా కొడుకు మరణం గురించి ప్రశ్నిస్తే కులం ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు..?’’ అని రోహిత్ తల్లి రాధిక సూటిగా ప్రశ్నించారు. శనివారం ఆమె సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల దీక్షాస్థలి వద్ద మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. రోహిత్ కులంపై చెలరేగిన వివాదానికి తెరదించుతూ... ‘‘అవును.. నా భర్త వడ్డెర కులస్తుడే. కానీ నేను, నా బిడ్డలు మాత్రం మాల కులానికి చెందినవారం’’ అని స్పష్టంచేశారు. రోహిత్‌తో పాటు తన మరో ఇద్దరు పిల్లలు మాలల మధ్యే పెరిగారని, మాలల ఆచార వ్యవహారాలే పాటించారని చెప్పారు. తనను ఐదేళ్ల వయసులో వడ్డెర కులస్తుల వద్ద తన తల్లిదండ్రులు వదిలి వెళ్లారని, అప్పట్నుంచీ ఆలనా పాలనా వాళ్లే చూశారని రాధిక వివరించారు. తాను మాల కులస్తులకు జన్మించినా.. వడ్డెర కులస్తుల దగ్గర పెరిగానని తెలిపారు. అందువల్ల వడ్డెర కులస్తుడికి ఇచ్చి 1985లో తన వివాహం జరిపార ని పేర్కొన్నారు. రోహిత్, నీలిమ, రాజు చక్రవర్తి పుట్టిన తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల భర్తతో విడిపోయినట్లు చెప్పారు. తాను స్వతహాగా ఎస్సీ మాల కులానికి చెందిన వ్యక్తిని కనుక.. మాలలు నివసించే ప్రాంతంలోనే తన బిడ్డలతో బతికానని రాధిక వెల్లడించారు. ఢిల్లీలో నిర్భయ దుర్ఘటన జరిగిన తర్వాత ఆమె కులం ప్రస్తావన రాలేదు.. కానీ తన బిడ్డ మరణించాక తమ కులం గురించి ఎందుకు ఆరా తీస్తున్నారని ప్రశ్నించారు. ‘‘యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అప్పారావు మాకు రూ.8 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. రూ.8 కోట్లు ఇచ్చినా కూడా మాకు అక్కర్లేదు. మొదట నా బిడ్డ మరణానికి కారణమేంటో చెప్పండి. సస్పెన్షన్ తర్వాత కూడా మాకు ఎందుకు సమాచారం అందించలేదో వీసీ సమాధానం చెప్పాలి. అసలు నా బిడ్డను మీరు చంపారా? తానే చనిపోయాడా ఇప్పుడు తేల్చాలి’’ అని రాధిక అన్నారు. తన కొడుకు మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నా తమ్ముడు పిరికివాడు కాదు: రోహిత్ సోదరి నీలిమ రోహిత్ సోదరి నీలిమ మాట్లాడుతూ... వీసీ మీడియా ముందుకొచ్చి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ‘‘నా తమ్ముడి మరణానంతరం నలుగురు దళిత విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నామని వీసీ చెప్పారు. దీనిద్వారా సస్పెన్షన్ ఎత్తివేత ఎవరి చేతిలో ఉందో స్పష్టమవుతోంది. సంతాపం తెలియజేయడానికి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి ఐదు రోజులు పట్టాయి. ఆమె కూడా తల్లే కదా? మహిళే కదా? ఆమెకు ఓ తల్లి బాధ అర్థం కాలేదా’’ అని ప్రశ్నించారు. తన తమ్ముడు పిరికివాడు కాదని, ఆత్మహత్యకు పాల్పడే తత్వం కాదని చెప్పారు. అతడిని ఆత్మహత్యకు పురికొల్పి, హత్య చేశారని ఆరోపించారు. మొదట ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్‌కి, ఆ తర్వాత వీసీకి శిక్షపడాలని అన్నారు. ఫేస్బుక్లో ఎదుర్కోలేక తన అధికారం, కేంద్ర మంత్రుల జోక్యంతో కేసులో ఇరికించారని చెప్పారు. అందుకు కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ, వీసీలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ఐదు రోజులుగా ఎందుకు మాట్లాడలేదు: రోహిత్ సోదరుడు ‘‘ప్రధాని మోదీని అనేంతటి వాడిని కాదు కానీ గత ఐదు రోజులుగా.. ఆయన నా అన్న చావు గురించి ఎందుకు మాట్లాడలే దు? రోహిత్ మరణంపై విద్యార్థులు ప్రశ్నించిన తర్వాత భరత మాత ముద్దుబిడ్డని కోల్పోయిందనడంలో అర్థమేముంది?’’ అని రోహిత్ సోదరుడు రాజు చక్రవర్తి అన్నారు. తన అన్న రోహిత్.. ఏనాడూ ఎస్సీ రిజర్వేషన్ ద్వారా విద్యాసంస్థల్లో ప్రవేశం పొందలేదని, అతను మెరిట్ స్టూడెంట్ అని, జనరల్ కేటగిరీలోనే ఈ క్యాంపస్‌లో ప్రవేశం పొందాడని వివరించారు. ఎమ్మెస్సీలో ఆల్ ఇండియా లెవల్లో ఆరో ర్యాంకు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘మా నాన్న నాకు తండ్రే కానీ తన దగ్గర మేమెప్పుడూ పెరగలేదు. మాలలుగానే పెరిగాం. మాలలుగానే తిన్నాం. మాలలుగానే వివక్ష ఎదుర్కొన్నాం. చివరకు నా అన్న అదే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి మరణించాడు’’ అని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రశ్నలకు వీసీ తక్షణమే సమాధానం చెప్పాలని, రోహిత్ మరణానికి కారణమైన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
‘అసహనం వల్లే రోహిత్ మృతి’
జైపూర్: దేశంలో ఇప్పటికీ అసహనం స్థాయి ఎక్కువగానే ఉందని ఆ పరిస్థితుల వల్లే హెచ్‌సీయూ దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రముఖ రచయిత, కవి అశోక్ వాజ్‌పేయి వ్యాఖ్యానించారు. జైపూర్‌లో జరుగుతున్న లిటరరీ ఫెస్టివల్ (జేఎల్ఎఫ్)కు హాజరైన ఆయన రోహిత్ ఆత్మహత్యపై మాట్లాడారు. మోదీ ఈ ఘటనపై విచారాన్ని వ్యక్తం చేసినప్పటికీ దళిత అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం చాలా తాపీగా స్పందించిందన్నారు. ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసిన సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. వ్యవస్థే హత్య చేసింది: కవి సచ్చిదానందన్ జేఎల్ఎఫ్కు హాజరైన ప్రముఖ కవి కె. సచ్చిదానందన్ రోహిత్ హత్యను వ్యవస్థ చేసిన హత్యగా అభివర్ణించారు. దళిత విద్యార్థుల నిరంతర అణచివేత నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. సెంథిల్ కుమార్ ఘటన నుంచి ఇప్పటివరకూ హెచ్‌సీయూలో ఇది ఎనిమిదో ఆత్మహత్య అన్నారు. ఇది దళితులు, దళితేతరుల పోరుకు సంబంధించిన అంశం కాదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతీ ఇరానీ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. బాలీవుడ్లో ఎలాంటి అసహనం లేదు: నటి కాజోల్ బాలీవుడ్లో ఎలాంటి అసహనం లేదని జేఎల్ఎఫ్కు హాజరైన నటి కాజోల్ అన్నారు. కాజోల్ స్నేహితుడు కరణ్ జోహార్ అసహనంపై వ్యాఖ్యలు చేసి వివాదాస్పదమైన నేపథ్యంలో ఆమె అసహనంపై ఆచితూచి స్పందించారు. సమాజంలో ఏం జరిగినా అది సినీ పరిశ్రమలో ప్రతిబింబిస్తుందన్నారు. బాలీవుడ్లో కులం, మతం అంటూ విభేదాలేవీ లేవని.. అసహనం అంతకన్నా లేదని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రధాని మోదీ వారం రోజులు ఆలస్యంగా స్పందించటం దారుణమని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ విమర్శించారు. మరోవైపు, ముంబైలోని అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కార్యాలయ సామగ్రిని ధ్వంసం చేశారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో శనివారం కార్యాలయంపై దాడి జరిగింది. -
రోహిత్ కేసును నీరుగార్చే యత్నాలు!
♦ రోహిత్ ఎస్సీ కాదని చూపేందుకు యత్నిస్తున్న పోలీసులు ♦ గుంటూరు కార్పొరేషన్లో రోహిత్ అమ్మమ్మ సర్వీస్ రిజిస్టర్ మాయం ♦ పోలీసులకు పదవీ విరమణ ♦ ధ్రువీకరణ పత్రం మాత్రమే ఇచ్చిన అధికారులు సాక్షి, గుంటూరు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం విదితమే. కేంద్ర మంత్రిపై కూడా కేసు నమోదు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ అసలు దళితుడు కాదని, వడ్డెర కులానికి చెందినవాడని చిత్రీకరించే కుట్ర జరుగుతోందని దళిత సంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ అమ్మమ్మ, తాతయ్యల కులంపై పోలీసు అధికారులు విచారణ జరుపుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. గుంటూరులోని ప్రకాశంనగర్కు చెందిన బోణాల ముసలయ్య, చల్లా అంజనీదేవి అలియాస్ పాపాయమ్మ దంపతుల కుమార్తె రాధిక. అయితే వారిలో ఎవరైనా ఎస్సీకి చెందినవారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. వీరిరువురూ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు కావడంతో వీరు గతంలో పనిచేసిన కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తున్నారు. రాధిక తండ్రి బోణాల ముసలయ్య ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తల్లి చల్లా అంజనీదేవి గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలోని జలగం రామారావు మున్సిపల్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయురాలిగా చేస్తూ 2001 జనవరి 31న పదవీ విరమణ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ (ఎస్ఆర్)లో కులం పొందుపరిచి ఉంటుంది. వీటిని పరిశీలిస్తే అందులో వారి కులం వివరాలు తెలుసుకోవచ్చని భావించిన పోలీసు ఉన్నతాధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంజనీదేవి సర్వీస్ రిజిస్టర్ మాయం రాధిక తల్లి అంజనీదేవి కులం వివరాలు సేకరించేందుకు రెండ్రోజుల క్రితం పోలీసు అధికారులు నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చారు. రికార్డులు వెతికిన నగరపాలక సంస్థ అధికారులు అంజనీదేవి సర్వీస్ రిజిస్టర్ కనిపించడం లేదని చెప్పినట్లు తెలిసింది. అంజనీదేవి 2001 జనవరి 31న పదవీ విరమణ చేసినట్లు ధ్రువీకరణపత్రం మాత్రం పోలీసు అధికారులకు ఇచ్చి పంపారు. అందులో ఆమె కుల ప్రస్తావన లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే అంజనీదేవి సర్వీస్ రిజిస్టర్ నిజంగా కనిపించడం లేదా... ఉన్నతస్థాయి ఒత్తిళ్ల నేపథ్యంలో మాయం చేశారా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాధిక తండ్రి బాణాల ముసలయ్య సర్వీస్ రిజిస్టర్‌ను సైతం అధికారులు బయటకు రానీయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రోహిత్ తల్లి రాధికది మాల కులమని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ ఉద్ఘాటించారు. శుక్రవారం రాత్రి గుంటూరులో జరిగిన రోహిత్ సంతాప సభలో ఆయన మాట్లాడుతూ రోహిత్ తండ్రి వడ్డెర కులానికి చెందిన వాడైనా, తల్లి రాధిక దళితురాలు కావడంతో రోహిత్‌కు తల్లి కులం వచ్చిందని చెప్పారు. -
రోహిత్ ఆత్మహత్య కన్నీరు పెట్టించింది
-
కేంద్రమంత్రులు వైదొలగాల్సిందే
-
గొప్పోడవుతాడనుకుంటే బూడిదగా మార్చారు
రోహిత్ సంతాప సభలో రోదించిన తల్లి రాధిక సాక్షి, గుంటూరు: ‘గొప్పవాడు అవుతాడనే ఆశతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నా బిడ్డను పంపితే బూడిదగా మార్చి నాకు పంపారు’ అని బలవన్మరణానికి పాల్పడిన రోహిత్ తల్లి రాధిక కన్నీటి పర్యంతమయ్యారు. రోహిత్ సొంత జిల్లా కేంద్రం గుంటూరులోని వైన్‌డీలర్స్ కల్యాణ మండపంలో శుక్రవారం రాత్రి రోహిత్ సంతాప సభ జరిగింది. రాధిక మాట్లాడుతూ చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులను తండ్రిలా చూసుకోవాల్సిన వైస్ చాన్స్‌లర్ ఇలా చేశాడంటూ రోదించింది. రోహిత్ ఆశయాలు నెరవేర్చేందుకు అందరూ పోరాడాలని సంతాప సభకు హాజరైన వారికి చేతులు జోడించి అర్థించారు. రోహిత్ తమ్ముడు రాజ చైతన్యకుమార్ మాట్లాడుతూ అన్న చనిపోయినా అతని ఆశయాన్ని నెరవేరుస్తానని చెప్పారు. తమ కుటుంబానికి న్యాయం చేస్తే చాలన్నారు. రోహిత్ దళితుడిగానే వివక్షకు గురయ్యాడని, దళితుడిగానే వేధింపులకు గురయ్యాడని, దళితుడిగానే మృతి చెందాడని ఆవేదనపూరితంగా మాట్లాడారు. బలహీన వర్గాల మనుగడకే ముప్పు.. సంతాప సభలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ రోహిత్ మృతిచెందిన తీరు చూస్తుంటే బడుగు, బలహీన వర్గాల మనుగడకే ముప్పు వాటిల్లుతుందనే భావన కలుగుతోందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 200 పైచిలుకు దళితుల అణచివేత సంఘటనలు జరిగాయన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ రోహిత్ మృతి తమ బాధ్యతారాహిత్యాన్ని గుర్తు చేసిందని, మేమూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉందన్నారు. నాడు విద్యార్థులు కోరుకున్నట్లు తాను, గద్దర్ వారి శిబిరం వద్దకు వెళ్లి ఉంటే రోహిత్లో మనోస్థైర్యం కలిగి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చి ఉండేది కాదేమోననే బాధ తనను కలచివేస్తుందన్నారు. మతవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ రోహిత్ మరణం దేశవ్యాప్తంగా పలు ప్రశ్నలను లేవనెత్తిందని, ఆయన మరణం వృధా కాకూడదన్నారు. రోహిత్ మృతిపై అన్ని వర్గాలూ స్పందించి మహోద్యమంగా మారుతుందని గ్రహించిన కేంద్రం తలవంచిందని, నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత, ప్రధాని నోరువిప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. మతవాద శక్తుల భావజాలానికి వ్యతిరేకంగా పోరాడటానికి వైఎస్సార్సీపీ ముందుంటుందన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ రోహిత్ తల్లి కులం మాల కుల మేనని ఉద్ఘాటించారు. అవకాశం ఉంటే రోహిత్ తమ్ముడు రాజచైతన్యను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. -
సమస్యలపై సరిగా వ్యవహరించలేదు
♦ ఆత్మహత్యకు ముందు పరిణామాలను అధికారులు పట్టించుకోలేదు ♦ అణగారిన వర్గాల విద్యార్థుల సమస్యలపై వెంటనే స్పందించాలి ♦ కేంద్ర ప్రభుత్వానికి నిజనిర్ధారణ కమిటీ నివేదిక న్యూఢిల్లీ: రోహిత్ వేముల ఆత్మహత్యకు ముందు వర్సిటీలో చోటుచేసుకున్న సమస్యలను పరిష్కరించడంలో హెచ్‌సీయూ అధికారులు సరిగ్గా వ్యవహరించలేదని ఈ ఉదంతంపై కేంద్రం ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ పేర్కొంది. దాని ఫలితంగానే రోహిత్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు షకీలా శంషు, సూరత్ సింగ్‌లతో కూడిన ద్విసభ్య కమిటీ శుక్రవారం తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ‘‘ఆత్మహత్యకు ముందు కొన్ని అంశాలపై వర్సిటీ అధికారులు సున్నితంగా వ్యవహరించి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు’’ అని నివేదికలో పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల సమస్యలను సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేసింది. వారు విద్యాసంస్థల్లో ఎదుర్కొంటున్న సమస్యల పట్ల వర్సిటీ అధికారులు కూడా సరైన రీతిలో స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రోహిత్ ఆత్మహత్య అనంతరం హెచ్సీయూకు వచ్చిన ఈ కమిటీ విద్యార్థులు, విద్యావేత్తలు, వర్సిటీ అధికారులతో సమావేశమై వారి అభిప్రాయాలు సేకరించింది. -
కేంద్రమంత్రులు వైదొలగాల్సిందే
♦ వీసీని తొలగించాల్సిందే! ♦ డిమాండ్లన్నింటినీ అంగీకరించాలి.. విద్యార్థుల స్పష్టీకరణ ♦ హెచ్‌సీయూలో కొనసాగుతున్న ఆందోళనలు ♦ మూడోరోజుకు చేరిన ఆమరణ దీక్ష ♦ ముగ్గురు విద్యార్థులకు తగ్గిన బీపీ, షుగర్ లెవల్స్ ♦ సంఘీభావం ప్రకటించిన {తిపుర సీఎం, ఎంపీలు త్యాగి, సీమ సాక్షి, హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్యపై హెచ్‌సీయూలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చే దాకా పోరు ఆగబోదని విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) శుక్రవారం తేల్చిచెప్పింది. రోహిత్ మరణానికి కారకులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, వైస్ చాన్స్‌లర్‌ను తొలగించాలని స్పష్టం చేసింది. కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీని తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు తమ డిమాండ్ల సాధన కోసం ఏడుగురు విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడోరోజుకు చేరుకుంది. శుక్రవారం వారికి ైవె ద్యులు పరీక్షలు నిర్వహించారు. వారిలో ముగ్గురి షుగర్ లెవల్స్, బీపీ తగ్గినట్లు తెలిపారు. దీక్ష కొనసాగితే ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతుందన్నారు. దీంతో వర్సిటీ అధికారులు దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేసినా అందుకు విద్యార్థులు ససేమిరా అన్నారు. మరోవైపు విద్యార్థులు తరగతులు బహిష్కరించి సౌత్ క్యాంపస్ నుంచి మెయిన్ క్యాంపస్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. 25న యథాతథంగా చలో హెచ్‌సీయూ తమ డిమాండ్ల సాధన కోసం ఈనెల 25న దేశంలోని అన్ని వర్సిటీల విద్యార్థులతో తలపెట్టిన ‘చలో హెచ్‌సీయూ’ కార్యక్రమం యథాతథంగా జరుగుతుందని విద్యార్థులు తెలిపారు. దేశంలోని పలు వర్సిటీల నుం చి విద్యార్థులు ఇక్కడికి వచ్చేందుకు సిద్ధమయ్యారని జేఏసీ నాయకుడు వెంకటేష్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రముఖుల సంఘీభావం హెచ్‌సీయూలో పోరుబాట పట్టిన విద్యార్థులకు మద్దతు వెల్లువెత్తుతోంది. శుక్రవారం త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ , జేడీయూ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు కేసీ త్యాగి, కేరళకు చెందిన ఎంపీ సీమ, కాంగ్రెస్ నేత మధుయాష్కీ, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ తదితరులు ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీమ మాట్లాడుతూ.. తాను వర్సిటీ కోర్ట్సభ్యులుగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానన్నారు. జస్టిస్ చంద్ర కుమార్, కాకి మాధవరావు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య నేతృత్వంలో ఏర్పడిన కమిటీ ఫర్ నేషనల్ రెస్పాన్సిబిలిటీ సభ్యులు కూడా విద్యార్థులను పరామర్శించారు. ఈ కమిటీ శనివారం మధ్యాహ్నం ఇందిరాపార్క్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. ఫ్యాకల్టీకి విద్యార్థుల విన్నపం రోహిత్ మరణానికి కారణాలను, అనంతరం జరిగిన పరిణామాలను విద్యార్థులు శుక్రవారం వర్సిటీ అధికారుల బృందం ముందుంచారు. అత్యంత పేదరికం నుంచి ఉన్నత విశ్వవిద్యాలయాలకు వస్తున్న దళిత విద్యార్థులకు ఎదురవుతున్న చేదు అనుభవాలను వివరించారు. తమపట్ల వివక్షాపూరితంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సమానత్వాన్ని శ్వాసించిన అంబేడ్కర్ భావజాలాన్ని, సిద్ధాంతాన్ని అనుసరిస్తున్న తమను తీవ్రవాదులని ముద్రవేస్తున్నారని దుయ్యబట్టారు. రోహిత్ మరణానికి ముందే విద్యార్థులపై సస్పెన్షన్‌ను ఎత్తి వేస్తే అతడు ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు కాదని అన్నారు. రోహిత్ చనిపోయాక సస్పెన్షన్ ఎత్తివేసి రక్తపు చేతులు కడుక్కోవడం విడ్డూరంగా ఉందని అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు ప్రశాంత్, విజయ్‌కుమార్, సుంకన్న, శేషయ్య మండిపడ్డారు. రోహిత్ వంటి దళిత మేధావులను అడ్డుకునేందుకు వీసీ అప్పారావులాంటి వారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధ్యాపక బృందం నిజానిజాలు తేల్చుకోవాలనుకుంటే తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించవచ్చని అన్నారు. -
రోహిత్ మృతిపై న్యాయ కమిషన్
సాక్షి, న్యూఢిల్లీ: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై అధ్యయనానికి న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిషన్ మూడు నెలల్లోగా నివేదిక అందజేస్తుందని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(హెచ్ఆర్డీ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. రోహిత్ ఆత్మహత్యపై ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీ నివేదిక ఆధారంగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, వర్సిటీ ప్రాంగణాల్లో ఎలాంటి వివక్షకు తావులేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటనలో పేర్కొంది. ఇందుకు వర్సిటీల వైస్ చాన్స్లర్లు, విశ్వవిద్యాలయాల్లోని సీనియర్ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మార్గదర్శనం చేయనుంది. ‘‘ఇటీవల సెంట్రల్ వర్సిటీలో జరిగిన పరిణామాల క్రమం, అందుకు దారితీసిన పరిస్థితులను న్యాయ కమిషన్ అధ్యయనం చేస్తుంది. ఇక ముందు ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది’’ అని హెచ్ఆర్డీ శాఖ తన ప్రకటనలో వివరించింది. ఉన్నత విద్యాసంస్థల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కూడా మానవ వనరుల అభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు, వాటిని వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అణగారిన విద్యార్థుల సమస్యల పరిష్కారం, వర్సిటీ ప్రాంగణాల్లో వివక్షకు తావు లేకుండా ఏం చర్యలు తీసుకోవాలన్న అంశాలపై త్వరలోనే దేశంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు, వాటిలో పనిచేసే సీనియర్ అధికారులకు ప్రత్యేకంగా ఒక చార్టర్‌ను విడుదల చేయాలని నిర్ణయించినట్లు ప్రకటనలో తెలిపింది. గాంధీనగర్ ఐఐటీలో అనుసరిస్తున్న పీర్ గ్రూప్ అసిస్టెడ్ లెర్నింగ్(పీఏఎల్) విధానాన్ని దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో అమలు చేస్తామని పేర్కొంది. ఈ విధానంలో సామాజికంగా, ఆర్థికంగా, వెనుకబడిన విద్యార్థులకు విద్యాపరంగా సాయం అందించడంతోపాటు వారు సవాళ్లను ఎదుర్కొని నిలబడేందుకు వీలుగా ప్రత్యేకంగా మెంటార్లను ఏర్పాటు చేస్తారు. -
రోహిత్‌పై ప్రధానిది మొసలి కన్నీరు
కేంద్ర మంత్రులపై చర్యలు తీసుకోకపోవడం పట్ల విపక్షాల ఆగ్రహం న్యూఢిల్లీ: హెచ్‌సీయూ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. రోహిత్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా ప్రధాని ఆవేదన వ్యక్తం చేయటం వల్ల ఏం ఉపయోగమని ప్రశ్నించాయి. కేంద్రమంత్రులు ఇరానీ, బండారు దత్తాత్రేయ రాజీనామా చేయాల్సిందే అని పట్టుపట్టాయి. మీరు ఏం చర్యలు తీసుకున్నారో.. రోహిత్ తల్లిదండ్రులకు.. దళితులకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి టామ్ వాడక్కన్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని మిగతా మంత్రులకు ప్రధాని చెప్పాలని సూచించారు. రోహిత్ మరణంపై స్పందించేందుకు మోదీ ఇంతకాలం ఎందుకు తీసుకున్నారని, దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగితేగానీ ప్రధాని స్పందించకపోవడం బాధ్యతా రాహిత్యమని సీపీఎం నేత ఎండీ సలీమ్ మండిపడ్డారు. రోహిత్ మృతికి కారణమైన ఇరానీ, హెచ్‌సీయూ యంత్రాంగం పైన చర్యలు తీసుకోకపోవడాన్ని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ తప్పుపట్టారు. అయితే, రోహిత్ ఆత్మహత్యను కొన్ని పార్టీలు రాజకీయం చేయడం దురదృష్టకరమని బీజేపీ పేర్కొంది. వారికి సమాధానం చెప్పేందుకే కేంద్రం జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది. రాజస్థాన్ వర్సిటీ వీసీపై కేసు: రాజస్థాన్ సెంట్రల్ వర్సిటీ వీసీ అరుణ్‌కుమార్ పుజారితో పాటు మరో ఆరుగురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దళిత స్కాలర్ ఉమేశ్‌కుమార్ జోన్వాల్పై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో గురువారం కిషన్‌గఢ్ కోర్టు ఆదేశాల మేరకు అజ్మీర్ జిల్లా బందర్ సిందారీలో పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
రోహిత్ ఆత్మహత్యపై టీఆర్ఎస్ మౌనం
హైదరాబాద్: హెచ్ సీయూ పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై అధికార టీఆర్ఎస్ పార్టీ మౌనం రాజకీయ వర్గాల్లో చర్చ రేకిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై 'గులాబీ' నేతలు గళం విప్పకపోవడం విస్మయం కలిగిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ కు విద్యార్థులు దన్నుగా నిలిచారు. అలాంటి ఉద్యమ పార్టీ విద్యార్థి ఆత్మహత్యపై తగిన రీతిలో స్పందికపోవడం పట్ల స్టూడెంట్ యూనియన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్ సీయూలో జరుగుతున్న విద్యార్థుల పోరాటానికి పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, వామపక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ) నేతలు విద్యార్థులలతో పాటు పలు ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, వామపక్షాల అగ్రనేతలు స్వయంగా విచ్చేసి హెచ్ సీయూను సందర్శించారు. విద్యార్థులకు మద్దతు తెలిపారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ రాజీనామాలకు పట్టుబట్టారు. రోహిత్ ఆత్మహత్యకు మోదీ సర్కారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత దీనిపై స్పందించారు. ఆమె నేతృత్వంలో నడుస్తున్న తెలంగాణ జాగృతికి చెందిన కార్యకర్తలు దత్తాత్రేయ ఇంటి వద్ద ఆందోళన నిర్వహించారు. అయితే టీఆర్ఎస్ అగ్రనేతలెవరూ గట్టిగా మాట్లాడలేదు. దళిత కమ్యునిటీ సెంటిమెంట్స్ తో ముడిపడిన ఈ ఉదంతాన్ని తాము రాజకీయం చేయాలనుకోవడం లేదని సీనియర్ నేత, తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావులపై చర్యలు తీసుకోవాలని తమ పార్టీ ఎంపీ కవిత డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగానే మౌనం దాల్చారని తెలుస్తోంది. దీనిపై తాము స్పందిస్తే మాటల యుద్ధానికి తెర లేచే అవకాశముందని, కీలకమైన జీహెచ్ ఎంసీ ఎన్నికల తరుణంలో కేసీఆర్ వివాదాలను కొని తెచ్చుకోవడానికి సుముఖంగా లేని కారణంగానే ఆయన మౌనంగా ఉన్నట్టు విశ్వనీయ వర్గాల సమాచారం. సీఎం సైలెంట్ గా ఉండడంతో మంత్రులు కూడా నోరు మెదపడం లేదు. టీఆర్ఎస్ స్పందిచక పోవడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పిన విషయాన్ని మళ్లీ తిరగదోడుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనపై అధికార టీఆర్ఎస్ నేతలు మౌనం దాల్చడం శోచనీయమని విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే గులాబీ నేతలు సైలెంట్ గా ఉన్నారని ఆరోపిస్తున్నాయి. -
హెచ్ సీయూలో మరో వివాదం
హైదరాబాద్: పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యతో అట్టుడుతున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్ సీయూ)లో మరో వివాదం చోటుచేసుకుంది. విద్యార్థుల ఆందోళన ఉధృతమవుతుండడంతో హెచ్ సీయూలో ఇంటర్నెట్, వై ఫై నిలిపివేశారు. కంప్యూటర్, లైబ్రరీలకు తాళం వేశారు. దీని గురించి వర్సిటీ వర్గాలను విద్యార్థులు ప్రశ్నించగా ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశానుసారం ఇంటర్నెట్ తొలగించామని సమాధానం వచ్చింది. ఆడిటోరియంకు సమీపంలో ఉన్న క్యాంపస్ నెట్ వర్క్ ఫెసిలిటీ(సీఎన్ఎఫ్) సెంటర్ ద్వారా విద్యార్థులు, సిబ్బందికి ఇంటర్నెట్, వై ఫైతో పాటు ఇతర ఐటీ సేవలు అందిస్తున్నారు. విద్యార్థుల హాస్టళ్లు, కామన్ ఏరియాలో ఇంటర్నెట్, వై ఫై నిలిపివేయాలని బుధవారం రాత్రి ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయని సీఎన్ఎఫ్ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. దీంతో గురువారం ఉదయం నుంచి క్యాంపస్ లో పూర్తిగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. తమ ఆందోళన ఉధృతం కాకుండా అడ్డుకునేందుకే ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా విద్యార్థులు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారని గ్రహించిన ఉన్నతాధికారులు క్యాంపస్ లో అంతర్జాలం అందుబాటులో లేకుండా చేశారు. అయితే కుయుక్తులు పన్నినా తమ పోరాటం ఆగదని విద్యార్థులు అంటున్నారు. -
10 మంది హెచ్ సీయూ ప్రొఫెసర్ల రాజీనామా
హైదరాబాద్: పీహెచ్ డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 10 మంది ఎస్టీ, ఎస్సీ ప్రొఫెసర్లు అడ్మినిస్ట్రేటివ్ పదవులకు రాజీనామా చేశారు. పరిపాలనా సంబంధిత పదవుల నుంచి తప్పుకుంటున్నామనీ, విద్యా బోధనలు కొనసాగిస్తామని వారు గురువారం మీడియాకు లేఖ విడుదల చేశారు. రాజీనామాలతో తాము అడ్మినిస్ట్రేషన్‌పై ఒత్తిడి తేగలమని పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారంగానూ తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని అధ్యాపకులు ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్య ఘటనపై వెలువెత్తిన నిరసనలకు తాము సంఘీభావం తెలపుతున్నామన్నారు. అంతేకాక ఇప్పటివరకూ విద్యార్థులపై సస్పెన్షన్, నమోదైన పోలీస్ కేసులను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. కాగా, ఆదివారం వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనతో దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో విద్యార్థులు, రాజకీయ పార్టీల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
రేపు తెలంగాణ బంద్‌కు దళిత జేఏసీ పిలుపు
నాగోలు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ మృతికి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ దళిత సంఘాల జేఏసీ రేపు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. దళిత సంఘ నాయకులు బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రోహిత్ మృతికి ఏబీవీపీ నాయకులు, కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ, వీసీ అప్పారావుల వేధింపులే కారణమని ఆరోపించారు. బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దళిత సంఘాల జేఏసీ ఛైర్మన్ ఈదుల పరశురాం, నాయకులు శ్రీధర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
దత్తాత్రేయ ఇంటిని ముట్టడించిన ఏఐఎస్ఎఫ్ఐ
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై బుధవారం రాంనగర్‌లోని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిని ఏఐఎస్ఎఫ్ఐ విద్యార్థులు ముట్టడించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ యూనివర్సిటీకి లేఖ ఇవ్వడం వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు యూనివర్సిటీ, ఉన్నత అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఐదుగురి సస్పెన్షన్ చేయడం జరిగిందన్నారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ బండారు దత్తాత్రేయ తన పదవికి రాజీనామా చేసి బహిరంగ క్షమాపణలు చెప్పాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వేణు, నాయకులు శివరామకృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. -
'రాజకీయ పార్టీల జోక్యం వల్లే రోహిత్ ఆత్మహత్య'
హైదరాబాద్: రాజకీయ పార్టీల జోక్యం వల్లే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. రోహిత్ ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో సీతారం ఏచూరీ మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ రాజీనామ చేయాలన్నారు. హెచ్‌సీయూ వైస్ చాన్సలర్ అప్పారావును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కోసం సమగ్ర కమిటీని వేయాలని సీతారం ఏచూరి కోరారు. -
వీసీ, కేంద్ర మంత్రుల తీరుతోనే..
-
దళిత విద్యార్థులకు మనుగడే లేదా?
రోహిత్ ఆత్మహత్యపై ఉప్పులేటి కల్పన ఆవేదన సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, సృ్మతీ ఇరానీ, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ వైస్ చాన్స్‌లర్ శర్మపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం ఉప నాయకురాలు ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ వర్సిటీలో జరిగిన చిన్నపాటి ఘటనకు రాజకీయ రంగు పులిమి సైంటిస్ట్ కావాలని కలలు గన్న ఓ దళిత విద్యార్థిని బలిగొన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దళిత విద్యార్థులకు సమాజంలో మనుగడే లేదా? అని ప్రశ్నించారు. -
వర్సిటీలో ఆగ్రహజ్వాలలు
మూడోరోజూ అట్టుడికిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ♦ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు ♦ తరలివచ్చిన వివిధ వర్సిటీలు, కాలేజీల విద్యార్థులు ♦ కేంద్రమంత్రి దత్తాత్రేయ, వీసీ రాజీనామా చేయాలంటూ నినాదాలు ♦ విచారణకు వచ్చిన ద్విసభ్య కమిటీని అడ్డుకున్న విద్యార్థులు ♦ పోలీసుల సాయంతో లోనికి వెళ్లిన కమిటీ సభ్యులు ♦ రోహిత్ తల్లిని పరామర్శించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ♦ దత్తాత్రేయ ఇంటి ఎదుట తెలంగాణ జాగృతి కార్యకర్తల ఆందోళన ♦ వర్సిటీకి వచ్చిన బీజేపీ నేత ప్రకాశ్‌రెడ్డి.. కారు అద్దాలు ధ్వంసం చేసిన విద్యార్థులు సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మూడోరోజూ దద్దరిల్లింది. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యపై విద్యార్థుల నిరసన జ్వాలలు మిన్నంటాయి. వైస్ చాన్స్‌లర్ అప్పారావు, కేంద్రమంత్రి దత్తాత్రేయ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు నినదించారు. వివిధ విద్యార్థి సంఘాలతో ఏర్పడిన సామాజిక న్యాయ సాధన ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులు బహిష్కరించారు. రోహిత్ తల్లి రాధికతోపాటు బోధన, బోధనేతర సిబ్బంది, వివిధ వర్సిటీలు, కాలేజీలకు చెందిన విద్యార్థులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రజా సంఘాల కార్యకర్తలతో వివిధ పార్టీలకు చెందిన నేతలు విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు దారి తీసిన ఘటనలపై విచారించేందుకు వచ్చిన ద్విసభ్య కమిటీని విద్యార్థులు క్యాంపస్ లోనికి అనుమతించలేదు. వైస్ చాన్స్‌లర్ రాజీనామా చేసిన తరువాతే రావాలంటూ ద్విసభ్య కమిటీని హెచ్చరించారు. కమిటీ సభ్యులు పోలీసుల సాయంతో క్యాంపస్ ఆవరణలోకి ప్రవేశించాల్సి వచ్చింది. ఇక సాయంత్రం యూనివర్సిటీకి వచ్చిన బీజేపీ నేత ప్రకాశ్‌రెడ్డి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయినా లోనికి వచ్చేందుకు యత్నించడంతో ప్రకాశ్‌రెడ్డి కారు అద్దాలను పగులగొట్టారు. ప్రముఖుల పరామర్శ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ యూనివర్సిటీకి వచ్చి రోహిత్ తల్లి రాధిక, ఇతర కుటుంబ సభ్యులు, ఆందోళన చేస్తున్న విద్యార్థులను పరామర్శించారు. ఆయన విశ్వవిద్యాలయంలో ఉన్నంతసేపు విద్యార్థులు బీజేపీకి వ్యతిరేకంగా నినదించారు. టీఆర్ఎస్ లోక్‌సభ సభ్యుడు విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, విద్యావేత్త చుక్కా రామయ్య, సీనియర్ పాత్రికేయులు మల్లెపల్లి లక్ష్మయ్య, సీపీఐ ఫ్లోర్ లీడర్ రవీంద్రనాయక్, గుండా మల్లేశ్, పీవోడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి సంధ్య తదితరులు ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలసి పరామర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉప్పల్ వెళ్లి రోహిత్ తల్లి రాధిక, సోదరుడిని పరామర్శించారు. బుధవారం ఆయన హెచ్సీయూకు వెళ్లి విద్యార్థులకు సంఘీభావం తెలపనున్నారు. మరోవైపు తాజా పరిణామాలతో బీజేపీ ఇబ్బందిలో పడింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన తమకు ఇబ్బంది తెచ్చిపెడుతుందేమోనని ఆ పార్టీ నేతలు ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. ఈ ఘటనతో కేంద్రమంత్రి దత్తాత్రేయకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రోహిత్ ఆత్మహత్యకు దత్తాత్రేయ కారణమన్న ఆరోపణలను ఆయన ఖండించారు. విద్యార్థి సంఘం నేతలు ఇచ్చిన ఓ వినతిపత్రాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ దృష్టికి తీసుకువెళ్లారని, ఇది అత్యంత సహజంగా జరిగిన వ్యవహారమని చెప్పారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రాజకీయ పార్టీలు కావాలని బీజేపీపై దుష్ర్పచారం చేస్తున్నాయని మండిపడ్డారు. హెచ్ఆర్డీ లేఖలను లీక్ చేసిన వర్సిటీ అధికారులు కేంద్రానికి ఐబీ నివేదిక దళిత విద్యార్థులను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు దత్తాత్రేయతోపాటు మానవ వనరుల శాఖ రాసిన లేఖలను విద్యార్థి సంఘాలకు లీక్ చేసినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. రోహిత్ ఆత్మహత్య ఘటన నుంచి బయటపడేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు ఇలా చేసి ఉంటారని నివేదికలో పేర్కొంది. మూడు రోజులుగా వర్సిటీలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయని ఐబీ తన నివేదికలో వివరించింది. గత ఆరు మాసాలుగా కల్లోల పరిస్థితులు ఉన్నా విశ్వవిద్యాలయ పాలకవర్గం తగిన రీతిలో వాటిని పరిష్కరించలేకపోయిందని ఐబీ కేంద్రం దృష్టికి తెచ్చింది. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు తెలుసుకునేందుకు వచ్చిన హెచ్ఆర్డీ ఓఎస్డీ షకీలా శంషూ, ఆ శాఖ ఉప కార్యదర్శి సూరత్ సింగ్‌లతోనూ ఐబీ అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. బుధవారం మరికొంత సమాచారం సేకరించి ద్విసభ్య కమిటీ హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీకి నివేదిక సమర్పించనుంది. విద్యార్థుల ప్రధాన డిమాండ్లు ► రోహిత్ ఆత్మహత్యకు కారకులైన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావు, ఏబీవీపీ నేత సుశీల్‌కుమార్, బీజేవైఎం నేత విష్ణు, ఎమ్మెల్సీ రామచంద్రరావులపై చ ట్టపరమైన చర్యలు తీసుకోవాలి ► వీసీని వెంటనే విధుల నుంచి తొలగించాలి ► రోహిత్ కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి ► విద్యార్థులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించాలి ► విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి -
పోరాటాన్ని కొనసాగిస్తాం
హెచ్‌సీయూ విద్యార్థుల స్పష్టీకరణ గుర్తింపు కార్డులు ఉన్న వారికే అనుమతి ►‘మొన్నటి వరకు మా మధ్య తిరిగిన రోహిత్.. కొన్ని మతతత్వ శక్తుల వల్ల దూరమయ్యాడు. ►ఆ బాధ మా గుండెలను బద్దలు చేస్తోంది. తలచుకుంటేనే జీవితం భారమనిపిస్తోంది. ►అతని మరణం... ‘వెలివాడ’ మాకు మార్గదర్శనం చేస్తున్నాయి. భవిష్యత్‌లో వర్సిటీల్లో కుల, మత ►భేదాలకు తావులేని వ్యవస్థకు పునాదులు నిర్మిస్తాం. ఆత్మహత్యకు కారకులైన వారికి శిక్ష పడే వరకు, ►బాధిత కుటుంబానికి న్యాయం అందేదాకా మా పోరాటం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటుంద’ ని హెచ్‌సీయూ విద్యార్థులు స్పష్టం చేశారు. సిటీబ్యూరో/సెంట్రల్ యూనివర్సిటీ: విద్యార్థుల నిరసనలు, ఆందోళనలతో హెచ్‌సీయూ రణరంగాన్ని తలపించింది. పీెహ చ్‌డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో మూడో రోజు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిశాయి. విద్యార్థులు ప్ల కార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది వీరికి సంఘీభావంగా నిరసనలో పాల్గొన్నారు. హెచ్‌సీయూకి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ చ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిష్కరణకు గురైన విద్యార్థులకు మద్దతుగా ఇతర ప్రాంతాల నుంచి సామాజిక కార్యకర్తలు, వామపక్ష, ముస్లిం నేతలు హాజరయ్యారు. వీరితో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, కళాశాలల నుంచి వందలాది మంది విద్యార్థులు చేరుకున్నారు. తనిఖీల తర్వాతనే వీరిని వర్సిటీలోకి పోలీసులు అనుమతించారు. గుర్తింపు కార్డులు ఉంటేనే లోపలికి పంపించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూ విద్యార్థులను లోనికి అనుమతించకపోతే.. తామే బయటకు వెళ్లి గేట్లను బద్దలుగొడతామని హెచ్‌సీయూ విద్యార్థులు హెచ్చరించారు. ఈ విషయమై మాదాపూర్ డీసీపీ కార్తికేయకు విద్యార్థులు విజ్ఞప్తి చేయగా.. బయట ఉన్న వారిని లోపలికి అనుమతించారు. సంఘటనపై రాహుల్ ఆరా బహిష్కరణకు గురై... షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ‘వెలివాడ’ పేరిట విద్యార్థులు చేపట్టిన దీక్షా శిబిరంలో రాహుల్ గాంధీ దాదాపు 20 నిమిషాలు గడిపారు. రోహిత్ ఆత్మహత్యకు కారణాలను బహిష్కృత పీహెచ్డీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ‘ముజఫర్ నగర్ అల్లర్లు’ డాక్యుమెంటరీపై వర్సిటీలో నిరసన కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి రోహిత్ ఆత్మహత్య వరకు జరిగిన పరిణామాలను ఆయనకు విద్యార్థులు వివరించారు. ‘దేని ఆధారంగా మిమ్మల్ని బహిష్కరించారు? నావంతుగా నేనేం సాయం చేస్తానని మీరు భావిస్తున్నారు? నిజ నిర్ధారణ కమిటీ రాకతోనూ మీకు న్యాయం జరగకుంటే ఏం చేద్దామనుకుంటున్నారు?’ అని రాహుల్ వారిని ప్రశ్నించారు. ఏకపక్షంగా... విచారణ లేకుండా నివేదిక తయారు చేసి రాజకీయ పలుకుబడి ఉపయోగించి తమను సాంఘిక బహిష్కరణ చేశారని వారు బదులిచ్చారు. అనంతరం రోహిత్ కుటుంబ సభ్యులకు రాహుల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీడియాకు అనుమతి నిరాకరణపై అభ్యంతరం హెచ్‌సీయూలో ‘వెలివాడ’ వద్ద ఏర్పాటు చేసిన సమావేశం కవరేజ్ విషయంలో డీసీపీ కార్తీకేయ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాటామాటా అనుకున్నారు. 144 సెక్షన్ కొనసాగుతుండడంతో మీడియాకు అనుమతి లేదని డీసీపీ అనడంతో అక్కడే ఉన్న భట్టి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియా కవర్ చేయకపోతే ఎలా అని డీసీపీని ప్రశ్నించారు. శాంతి భద్రతల దృష్ట్యా అనుమతికి నిరాకరించక తప్పదని డీసీపీ బదులిచ్చారు. అనుమతించకపోతే ఊరుకోబోమని భట్టి తేల్చి చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీడియా చూసుకోవాలని డీసీపీ విజ్ఞప్తి చేయడంతో ఈ స్వల్ప వివాదం సద్దుమణిగింది. పదవుల నుంచి తొలగించండి హెచ్‌సీయూ నుంచి రోహిత్‌ను బహిష్కరించి... ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎస్సీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఎంహెచ్ఆర్డీకి లేఖ రాసిన కేంద్రమంత్రి దత్తాత్రేయ, వీసీ అప్పారావుల తీరు కారణంగానే విద్యార్థి బలయ్యాడని ఆ సంఘం ఆరోపించింది. వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు... పదవుల నుంచి తొలగించాలని కోరింది. విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని విజ్ఞప్తి చేసింది. కఠినంగా శిక్షించండి కవాడిగూడ: రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని... యూనివర్సిటీలలో మతతత్వ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిప్పర్తి యాదయ్య డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో తెలంగాణ విద్యావంతుల వేదిక గ్రేటర్ అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్, ఓట్ ఫర్ నీడ్ గ్యారెంటీ అధ్యక్షురాలు సొగరా బేగంలతో కలిసి మాట్లాడారు. దళిత విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని యాదయ్య డిమాండ్ చేశారు. సమావేశంలో రామగిరి ప్రకాశ్, డాక్టర్ రమేష్, డి.శ్యామ్ సుందర్, కంటి సాయన్న, వినయ్ కుమార్, రాజా నర్సింగ్‌రావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రోహిత్‌కు ఘన నివాళి రాయదుర్గం: హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌కు గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ యూనవర్సిటీ (మనూ)లో మంగళవారం రాత్రి ఘనంగా నివాళులు అర్పించారు. వర్సిటీలోని సీపీడీయూఎంపీ భవనం నుంచి ప్రధాన గేట్ వరకు విద్యార్థులు, అధ్యాపకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సీపీడీయూఎంపీ ఆడిటోరియంలో సంతాప సభ నిర్వహించారు. -
వీసీ, కేంద్ర మంత్రుల తీరుతోనే..
రోహిత్ ఆత్మహత్యపై రాహుల్‌గాంధీ ఫైర్ ♦ వర్సిటీల్లో పక్షపాత ధోరణితో విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయి ♦ విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు వేదికలుగా మారుస్తున్నారు ♦ రోహిత్ కుటుంబానికి పరిహారం ఇవ్వాలి ♦ హెచ్‌సీయూలో రోహిత్ తల్లికి పరామర్శ.. విద్యార్థులతో సమావేశం సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్, కేంద్రమంత్రుల తీరుతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. యూనివర్సిటీల్లో వివక్ష, పక్షపాత ధోరణి కారణంగా విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వ విద్యాలయాలను రాజకీయాలకు వేదికలుగా మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏ అభిప్రాయం అయినా వ్యక్తపరిచే స్వేచ్ఛ విద్యార్థులకు ఉండాలన్నారు. వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే అతడి కుటుంబాన్ని పరామర్శించే నైతిక బాధ్యత వైస్ చాన్స్‌లర్‌కు లేదా ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ తల్లి రాధికను మంగళవారం ఆయన వర్సిటీ ఆవరణలో పరామర్శించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. రోహిత్ ఆత్మహత్యకు సంబంధించిన పరిణామాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ నాయకుడిగా రాలేదు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్.. నేరుగా గచ్చిబౌలిలోని వర్సిటీకి వెళ్లారు. తొలుత రోహిత్ స్మారకస్తూపం వద్ద నివాళులర్పించారు. రోహిత్ తల్లి రాధిక, ఇతర కుటుంబ సభ్యులతోపాటు యూనివర్సిటీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నలుగురు విద్యార్థులను పరామర్శించారు. దాదాపు 2 గంటల పాటు రాహుల్ వర్సిటీలోనే ఉన్నారు. చివర్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ... ఉన్నత విద్యాభ్యాసానికి నిలయాలైన విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు వేదికలుగా మార్చుకోవద్దని కోరారు. దళిత విద్యార్థులపై కొనసాగుతున్న వివక్ష, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి ఓ యువకుడిగానే ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. యూనివర్సిటీలో జరిగిన సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుందని ప్రశ్నించారు. స్వయం ప్రతిపత్తి సంస్థలైన యూనివర్సిటీల్లో కేంద్ర మంత్రులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ ఘటనల్లో వర్సిటీ వైస్ చాన్స్‌లర్, కేంద్రమంత్రుల వ్యవహారం సరిగా లేదని, వారి తీరుతోనే రోహిత్ ఆత్మహత్య జరిగిందని దుయ్యబట్టారు. ఈ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని, ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీనిచ్చారు. ఏబీవీపీ నేతల అరెస్ట్ రాహుల్ పర్యటనను అడ్డుకునేందుకు బేగంపేటలో ఏబీవీపీ విద్యార్థులు ప్రయత్నించారు. రాహుల్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బేగంపేట ఫ్లై ఓవర్ వద్ద రాహుల్ కాన్వాయ్కి అడ్డుపడేందుకు విద్యార్థి సంఘం నేతలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుని, అరెస్టు చేశారు. సిట్టింగ్ జడ్జితోవిచారణ: పొంగులేటి హెచ్‌సీయూలో సంఘటనలపై సమగ్ర విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉప నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో దోషులెవరైనా కఠినంగా శిక్షించాలని కోరారు. పార్లమెంటులో ప్రస్తావిస్తా.. రోహిత్ ఆత్మహత్యకు కారణాలు, యూనివర్సిటీల్లోని సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తానని ఏఐసీసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీనిచ్చారు. రోహిత్ తల్లి, సస్పెన్షన్‌కు గురైన విద్యార్థులతో సమావేశం అనంతరం రాహుల్ విద్యార్థులతో సుమారు అరగంటపాటు చర్చించారు. యాకూబ్ మెమన్ ఉరితీత సందర్భంగా యూనివర్సిటీలో చోటుచేసుకున్న సంఘటనలు, బీజేపీ నేతల జోక్యం, దళిత విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల నిలిపివేత, సస్పెన్షన్ వంటి చర్యలకు పాల్పడ్డారని విద్యార్థులు రాహుల్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పార్లమెంటులో వీటిని ప్రస్తావిస్తానని హామీనిచ్చారు. మధ్యాహ్నం 12.30కు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ కు టీపీసీసీ నేతలు ఘనస్వాగతం పలికారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు కె.జానా రెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, జె.గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, నేరెళ్ల శారద, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కేంద్రానికి టీ సర్కారు నివేదిక న్యూఢిల్లీ:హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పంపిన నివేదికను కేంద్రం అందుకుంది. రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు చేపట్టిన విచారణ, తీసుకున్న చర్యలను వివరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నివేదిక పంపిందని కేంద్ర హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు.