కదం తొక్కిన విద్యార్థులు | Universities strike tomorrow | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన విద్యార్థులు

Published Tue, Jan 26 2016 3:42 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

కదం తొక్కిన విద్యార్థులు - Sakshi

కదం తొక్కిన విద్యార్థులు

చలో హెచ్‌సీయూ విజయవంతం
రేపు యూనివర్సిటీల బంద్

 
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల చలో హెచ్‌సీయూ విజయవంతమైంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వేలాది మంది విద్యార్థులు కదం తొక్కారు. విశ్వవిద్యాలయాల్లో వివక్షను సాగనివ్వబోమని నినదించారు. ఈ నెల 27న దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల బంద్‌కు పిలుపునిచ్చారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను, వీసీ అప్పారావును తొలగించాలని డిమాండ్ చేశారు. అఖిల భారత స్థాయిలో విద్యార్థి జేఏసీని ఏర్పాటు చేసి సమైక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని ప్రకటించారు. ఈ నెల 28 లోపు విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించకపోతే... నాగ్‌పూర్‌లోని అంబేడ్కర్ దీక్షా స్థలం నుంచి దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు.

 రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు చేపట్టాలంటూ విద్యార్థి జేఏసీ ఇచ్చిన చలో హెచ్‌సీయూ పిలుపు విజయవంతమైంది. హెచ్‌సీయూలో ప్రారంభమైన ఉద్యమానికి సంఘీభావం పలికేందుకు సోమవారం తొమ్మిది రాష్ట్రాల నుంచి నాలుగైదు వేల మంది ప్రతినిధులు తరలివచ్చారు. వివిధ ప్రజాసంఘాలు, మహిళా, విద్యార్థి సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని వారంతా ముక్తకంఠంతో నినదించారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను తక్ష ణమే పదవి నుంచి తొలగించాలని, సెలవులో వె ళ్లిన వీసీ అప్పారావును శాశ్వతంగా పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన విపిన్ శ్రీవాత్సవ తక్షణమే వైదొలగాలన్నారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హెచ్‌సీయూ జేఏసీ నాయకులు ప్రశాంత్, వెంకటేశ్ చౌహాన్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న వివక్షను రోహిత్ ఆత్మహత్య ఉదంతం తెరపైకి తెచ్చిందని, ఈ ఉద్యమం విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులను ఐక్యం చేసిందని వారు పేర్కొన్నారు. అందులో భాగంగానే అఖిల భారత స్థాయిలో విశ్వవిద్యాలయాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రశాంత్, సుంకన్న, విజయ్, శేషన్న తదితరులు ప్రకటించారు. హెచ్‌సీయూ ఉద్యమానికి సంఘీభావంగా వివిధ విద్యాసంస్థల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఐక్య ఉద్యమ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు. దేశంలో నెలకొన్న హిందూత్వ, మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, అందుకు కలసివచ్చే అన్ని వర్గాలను కలుపుకొనిపోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడారు.

 విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలి..
 రోహిత్ ఆత్మహత్య విశ్వవిద్యాలయాల్లో అడుగడుగునా నెలకొన్న వివక్షను బహిర్గతం చేసిందని యూజీసీ మాజీ చైర్మన్ సుఖ్‌దేవ్ థోరట్ పేర్కొన్నారు. దేశంలోని వర్సిటీల్లో జరిగిన 25 ఆత్మహత్యల్లో 23 దళితులవే కావడం వివక్ష స్వరూపాన్ని బట్టబయలు చేస్తోందన్నారు. సామాజిక అవగాహనను, పరమత సహనాన్ని పెంచేలా విద్యావ్యవస్థలో మార్పులు తేవాలని చెప్పారు. వర్సిటీల్లో దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షపై ఒక కమిటీని నియమించాలన్నారు. వర్సిటీలను బ్రాహ్మణ అగ్రహారాలుగా తయారు చేయొ ద్దని... విద్యాసంస్థల్లో వివక్షను నిరోధించేం దుకు ‘రోహిత్ చట్టం’ చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు.

రోహిత్ ఆత్మహత్యకు కారణమైన స్మృతి ఇరానీని, దత్తాత్రేయని మంత్రి పదవుల నుంచి తొలగించాలన్నారు. సమాజంలో లోపించిన మానవీయ సంబంధాలను, సమాజంలో నెలకొన్న అసహనాన్ని రోహిత్ మరణం లేవనెత్తిందని ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పారు. వివక్ష మూలాలను వెతకకుండా, సమాజంలో మార్పు రాకుండా వర్సిటీల్లో మార్పుని ఆశించలేమన్నారు. బీజేపీ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను హిందూత్వ భావజాలంతో నింపాలనుకుంటే విద్యార్థులు ఇకపై సహించరని వ్యాఖ్యానించారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని, సంఘటితంగా వివక్షను ఎదుర్కొంటామని సభకు హాజరైన విద్యార్థులతో ప్రొఫెసర్ కంచ ఐలయ్య ప్రమాణం చేయించారు. మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ... ఇది సమానత్వానికి, కులతత్వానికి మధ్య పోరాటమని వ్యాఖ్యానించారు.

వ్యవస్థలో ఉన్న అసమానతలపై రోహిత్ తిరుగుబాటు చేశాడని ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. దేశంలోని అన్ని వర్సిటీల్లో వివక్ష జరుగుతోందన్నారు. హెచ్‌సీయూలో ప్రారంభమైంది సైద్ధాంతిక యుద్ధమని అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ అభివర్ణించారు. విద్యార్థులపై హిందూత్వ రాజకీయాలను రుద్దడం ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. రోహిత్ మరణానికి కారకులైన వారిపై చర్య తీసుకోకపోతే తన కథల పుస్తకానికి వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని వెనక్కిచ్చేస్తానని పసునూరి రవీందర్ ప్రకటించారు. విద్యార్థులకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ, విరసం నేత కాశీం, ముంబై యూనివర్సిటీ ప్రొఫెసర్ ముంగేకర్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు వెంకటరెడ్డి, డీఎస్‌ఎస్ అధ్యక్షురాలు గెడ్డం ఝాన్సీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకట్, ప్రగతి శీల మహిళా సంఘం నాయకురాలు వి.సంధ్య తదితరులు సంఘీభావం ప్రకటించారు.
 
 సస్పెన్షన్ రద్దు ఉత్తర్వులు మా ముందుంచండి
 హెచ్‌సీయూకు హైకోర్టు ఆదేశం
 సాక్షి, హైదరాబాద్: పీహెచ్‌డీ విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఆ ఉత్తర్వుల కాపీని పిటిషనర్లకు కూడా అందచేయాలని స్పష్టం చేసింది. అలాగే ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో పురోగతికి సంబంధించి ఏవైనా వివరాలుంటే వాటిని అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

తన కుమారుడు సుశీల్‌కుమార్‌పై దాడి జరిగిందని, అందువల్ల అతనికి తగిన భద్రత కల్పించేలా అధికారులను ఆదేశించాలంటూ వినయ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ పీహెచ్‌డీ విద్యార్థులు దొంత ప్రశాంత్ తదితరులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యలను న్యాయమూర్తి సోమవారం విచారించారు. ఈ సందర్భంగా హెచ్‌సీయూ తరఫు న్యాయవాది ఎన్.వి.సుమంత్ స్పందిస్తూ పీహెచ్‌డీ విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేశామని కోర్టుకు నివేదించారు. విద్యార్థుల తరఫు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం సస్పెన్షన్ కొనసాగుతోందని, సస్పెన్షన్ రద్దు ఉత్తర్వులు తమకు అందలేదన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ ఒకవేళ సస్పెన్షన్ అలాగే ఉందని భావిస్తే, ఈ వ్యాజ్యంలో పిటిషనర్లలో ఒకరిగా ఉన్న రోహిత్ మృతి చెందినందున, ఆ మేర పిటిషన్‌లో సవరణలు చేయాలని సూచిస్తూ విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement