18న వీసీలంతా హాజరు కావాలని కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో కుల వివక్ష నిర్మూలనపై చర్చించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వైస్ చాన్స్‌లర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 18న వర్సిటీల వీసీలంతా హాజరు కావాలని ఆదేశించింది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో కుల వివక్షపై ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
రోహిత్ ఆత్మహత్య విషయంలో కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలు ఆరోపణలు ఎదుర్కొంటుండం తెలిసిందే. వర్సిటీల్లో సున్నితమైన ఘటనలు చోటు చేసుకున్నప్పుడు పరిష్కరించేందుకు వీసీలు, సీనియర్ అడ్మినిస్ట్రేటర్లు చొరవచూపాల్సిన అసవరం ఉందని కేంద్రం పేర్కొంది. వార్డెన్లు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, రిజిస్ట్రార్లకు కూడా వివక్ష రూపుమాపేందుకు వీలుగా తరగతులను నిర్వహిస్తామని పేర్కొంది. వర్సిటీల్లో కుల వివక్ష నిర్మూలనకు, ఏవైనా ఘటనలు జరిగినప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకునేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు వివరించింది.
‘సంస్కృత వర్సిటీలకు ప్రత్యేక నిధులివ్వండి..’
సంస్కృత వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఇతర సబ్జెక్టుల అధ్యాపకుల ఇస్తున్న విధంగా సంస్కృతం చెప్పే వారికీ వేతనాలు ఇవ్వాలని గోపాలస్వామి కమిషన్ సూచించింది. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గోపాలస్వామి నేతృత్వంలో నియమితమైన ఈ కమిషన్ గత గురువారం నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం కేంద్రం అధీనంలో 2, రాష్ట్రాల పరిధిలో 12 వర్సిటీలు ఉన్నాయి.
‘బోధన’పై నేడు విద్యాశాఖ మంత్రుల భేటీ
ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలను పెంచే చర్యలపై చర్చించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో ఢిల్లీలో సోమవారం రాష్ట్రాల విద్యా శాఖా మంత్రుల సమావేశం నిర్వహించనున్నారు.
వర్సిటీల్లో వివక్షపై భేటీ
Published Mon, Feb 8 2016 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM
Advertisement