విధిలేని పరిస్థితుల్లోనే విద్యార్థుల సస్పెన్షన్ | Situation , forcing the suspension of a student:Registrar to the High Court | Sakshi
Sakshi News home page

విధిలేని పరిస్థితుల్లోనే విద్యార్థుల సస్పెన్షన్

Published Wed, Jan 27 2016 2:53 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

విధిలేని పరిస్థితుల్లోనే విద్యార్థుల సస్పెన్షన్ - Sakshi

విధిలేని పరిస్థితుల్లోనే విద్యార్థుల సస్పెన్షన్

హైకోర్టులో హెచ్‌సీయూ రిజిస్ట్రార్ కౌంటర్ దాఖలు
భవిష్యత్తులో పునరావృతం కాకూడదనే కఠిన నిర్ణయం
యూనివర్సిటీ నుంచే పంపేయాలని బోర్డు సిఫారసు చేసింది
అయితే మేం వారి పట్ల ఉదారంగా వ్యవహరించాం
వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సస్పెన్షన్ ఎత్తేశాం
హాస్టళ్లలో ప్రవేశం, ఎన్నికల్లో పోటీకి మాత్రమే సస్పెన్షన్‌ను వర్తింపజేశాం

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్‌పై జరిగిన దాడి వ్యవహారంలో ఐదుగురు పరిశోధక (పీహెచ్‌డీ) విద్యార్థులను యూనివర్సిటీ నుంచే పంపేయాలని ప్రొక్టోరియల్ బోర్డు సిఫారసు చేసిందని వర్సిటీ రిజిస్ట్రార్(ఇన్‌చార్జ్) ఎం.సుధాకర్ హైకోర్టుకు నివేదించారు. అయితే వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎంతో ఉదారంగా వ్యవహరించామని, అందులో భాగంగానే పూర్తిస్థాయి సస్పెన్షన్‌ను రద్దు చేశామని తెలిపారు.

ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు, మిగిలిన విద్యార్థులకు గుణపాఠం కావాలన్న ఉద్దేశంతోనే విధిలేని పరిస్థితుల్లోనే ఐదుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశామన్నారు. యూనివర్సిటీలో అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసు మేరకే సస్పెన్షన్‌ను ఎత్తివేశామని కోర్టుకు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రతిదీ యూనివర్సిటీ నిబంధనల మేరకే జరిగిందన్నారు.

 యూనివర్సిటీ తమపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పీహెచ్‌డీ విద్యార్థులు దొంత ప్రశాంత్ తదితరులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ తాజాగా కౌంటర్ దాఖలు చేశారు.

అది స్వచ్ఛంద క్షమాపణ కాదు
సుశీల్ కుమార్ తమకు స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పారని పిటిషనర్లు పేర్కొనడంలో వాస్తవం లేదని రిజిస్ట్రార్ తన కౌంటర్‌లో పేర్కొన్నారు. ‘‘అంబేద్కర్ విద్యార్థి సంఘానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరుతూ ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్‌లో సుశీల్‌కుమార్ ఉన్న గదికి 30 మంది వరకు విద్యార్థులు వెళ్లినట్లు 2015 ఆగస్టు 4 రోజు వేకువజామున మాకు సమాచారం వచ్చింది.

సుశీల్‌ను అతని రూం నుంచి సైకిల్ షెడ్ వరకు తీసుకొచ్చి రాతపూర్వక క్షమాపణలు తీసుకున్నారు. గది నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలో పిటిషనర్లు అతనిపై భౌతిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఒత్తిడిలో సుశీల్‌కుమార్ క్షమాపణలు చెప్పారు. యూనివర్సిటీ భద్రతా సిబ్బంది తమ వాహనంలో సుశీల్‌కుమార్‌ను మెయిన్‌గేట్ సమీపంలోని సెక్యూరిటీ పోస్ట్ వద్దకు తీసుకొచ్చారు. పిటిషనర్లు, ఇతరులు అక్కడకు వచ్చి ఫేస్‌బుక్‌లో తన క్షమాపణలను సుశీల్‌కుమార్‌తోనే అప్‌లోడ్ చేసేలా చేశారు. సుశీల్‌కుమార్ తన క్షమాపణలను శాంతిపూర్వకంగా, స్వచ్ఛందంగా చెప్పారన్న పిటిషనర్ల వాదనలను ఖండిస్తున్నా.

అసలు అంత మంది ఓ విద్యార్థి హాస్టల్ గదికి వెళ్లి, బలవంతంగా బయటకు తీసుకురావడం న్యాయబద్ధం కాదు. అసలు భౌతిక హింసే జరగలేదని అనుకున్నా.. మొత్తం వ్యవహారం ప్రజాస్వామ్యయుతంగా, శాంతిపూర్వకంగా జరిగిందని పిటిషనర్లు చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఈ ఘోర తప్పిదానికి పిటిషనర్లే కారణం. వారు తమ పాత్రను ఎంత మాత్రం తోసిపుచ్చలేరు’’ అని రిజిస్ట్రార్ వివరించారు.

 చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు
‘‘సుశీల్‌కుమార్ ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యల వల్ల తమకు ఇబ్బంది ఉందని భావిస్తే పిటిషనర్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయాల్సింది. అంతే తప్ప చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు’’ అని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ‘‘ఆ రోజు సుశీల్‌కుమార్ ఫోన్ చేయడంతో పోలీసులు హాస్టల్‌కు చేరుకున్నారు. తర్వాత పిటిషనర్లపై అదేరోజు కేసు నమోదు చేశారు.

ఈ మొత్తం వ్యవహారంలో అటు యూనివర్సిటీని, ఇటు పోలీసులను ఎవరో తప్పుదోవ పట్టించారంటూ పిటిషనర్లు చేస్తున్న వాదనలో ఎంత మాత్రం వాస్త వం లేదు. ప్రొక్టోరియల్ బోర్డు నిర్వహించిన విచారణలో ఈ మొత్తం ఘటన వెనుక పిటిషనర్ల పాత్ర ఉన్నట్లు తేలింది. బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు సుశీల్‌కుమార్ తల్లి, ఇతరుల సమక్షంలో వైస్ ఛాన్స్‌లర్‌ను కలిసిన మాట నిజమే. బాధ్యులైన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరిన మాట కూడా నిజం.

ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి చేసిన ఫిర్యాదుకు కౌంట ర్‌గా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు కూడా ఫిర్యాదు చేసి సుశీల్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలన్నారు. ఈ రెండు ఫిర్యాదుల ను యూనివర్సిటీలో విద్యార్థుల క్రమశిక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే ప్రొక్టోరియల్ బోర్డుకు నివేదించాం. పిటిషనర్లకు కూడా నోటీసులు జారీ చేసి బోర్డు ముందు హాజరు కావాలన్నాం.

 వారి వాంగ్మూలాలు నమోదు చేశాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సుశీల్‌కుమార్ విచారణకు హాజరు కాలేదు. అయినా బోర్డు విచారణను కొనసాగించి, ఆగస్టు 12న మధ్యంతర నివేదిక ఇచ్చింది. వర్సిటీ వర్గాలకు ఫిర్యాదు చేయకుండా సుశీల్‌కుమార్ గదికి వెళ్లి గొడవకు దిగిన పిటిషనర్లకు గట్టి హెచ్చరికలు చేయాలని బోర్డు తన నివేదికలో సిఫారసు చేసింది.

సుశీల్‌కుమార్, ఇతర సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసేం దుకు బోర్డు మరోసారి సమావేశమై ఆగస్టు 31న తుది నివేదిక సమర్పించింది. సుశీల్‌కుమార్‌పై పిటిషనర్లు భౌతికంగా దాడి చేశారని, అందువల్ల వారిని యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయాలని సిఫారసు చేసింది. అందులో భాగంగానే సెప్టెంబర్ 8న పిటిషనర్లను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశాం. ఈ ఘటనలో వారు ఎక్కడా తమ పాత్రను తోసిపుచ్చలేదు. అయితే విద్యార్థుల నుంచి వచ్చిన వినతి మేరకు సెప్టెంబర్ 11న వారి సస్పెన్షన్‌ను ఎత్తివేశాం’’ అని రిజిస్ట్రార్ కోర్టుకు తెలిపారు.

ఉదారంగా వ్యవహరించాం
‘‘ప్రొక్టోరియల్ బోర్డు నివేదికను వైస్ ఛాన్సలర్ ఏర్పాటు చేసిన సబ్ కమిటీ పరిశీలించి, అందులో చేసిన సిఫారసులతో ఏకీభవించింది. తన నివేదికను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందు ఉంచింది. ప్రొక్టోరియల్ బోర్డు, సబ్ కమిటీల నివేదికను పరిశీలించిన కౌన్సిల్ విద్యార్థుల విద్యా, ఆర్థిక పరిస్థితులను దృష్టి పెట్టుకుని వారి పట్ల ఉదారంగా వ్యవహరించాలని నిర్ణయించింది.

యూనివర్సిటీ నుంచి కాకుండా హాస్టళ్లు, పరిపాలన భవనాల్లో ప్రవేశానికి, ఎన్నికల్లో పోటీ చేయకుండా మాత్రమే పిటిషనర్లను అనర్హులుగా చేస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది’’ అని రిజిస్ట్రార్ తన కౌంటర్‌లో వివరించారు. ‘‘పిటిషనర్లలో ఒకరైన వేల్పుల సుంకన్న ఇప్పటికే పీహెచ్‌డీ థీసిస్ సమర్పించారు. అయితే సస్పెన్షన్ అతని విద్య కొనసాగింపునకు అడ్డంకి కాదు. తరగతులకు, సెమినార్లకు, వర్క్‌షాపులకు, గ్రంథాలయానికి హాజరు కాకుండా అతన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు.

విషయపరంగా ఓ అంశంపై ఆరోగ్యకరమైన చర్చలు విద్యార్థి జీవితంలో భాగం. అయితే రెచ్చిపోయి ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగడాన్ని సహించం. అందుకే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో పిటిషనర్లను హాస్టళ్ల నుంచి సస్పెండ్ చేశాం’’ అని రిజిస్ట్రార్ వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement