విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాతీయ సదస్సు జరగనుంది. వర్సిటీలోని దళిత్-ఆదివాసీ స్టడీస్, అంబేడ్కర్ స్టడీ సెంటర్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిసున్నట్టు తెలిపారు. ICSSR ఛైర్మన్ సుఖదేవ్ థోరట్, కేంద్రప్రభుత్వ మాజీ కార్యదర్శి పిఎస్.క్రిష్ణన్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉమాచక్రవర్తి, సీనియర్ జర్నలిస్ట్ సీమా ముస్తఫా లతో కూడిన బృందం ఈ సదస్సుకి ముఖ్య అథిదులుగా హాజరుకానున్నారు.
దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఐఐఎంలు, ఐఐటిలతో సహా 40 ఉన్నత విద్యాసంస్థల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో నెలకొన్న కుల వివక్షపై సమగ్రసమాచారాన్ని సేకరించి, నిర్దిష్టమైన నివేదికను తయారుచేయడమే జాతీయ సదస్సు లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
హెచ్‌సియులో వివక్ష కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్, అతనితో పాటు మరో నలుగురు విద్యార్థుల రస్టికేషన్ నేపధ్యంలో వెల్లువెత్తిన విద్యార్థి ఉద్యమం దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లోని వివక్షను తెరపైకి తెచ్చింది. ఈ నేపధ్యంలోనే దేశంలోని పలు ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షలు వెలుగులోకి వచ్చాయి. వాటన్నింటిపై ఆయా విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు, అధ్యాపకులు స్పష్టమైన రిపోర్టును అందించనున్నారు. ఈ సదస్సులో వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న వివక్షపై ఒక డాక్యుమెంటును రూపొందించే యోచనలో ఉన్నారు. ఈ డాక్యుమెంటరీని ఢిల్లీలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని రాష్ట్ర పతి, ప్రధానులకు, అన్ని రాజకీయ పక్షాలకు అందించనున్నారు.
వివక్షకు వ్యతిరేకంగా జాతీయ సదస్సు
Published Thu, Mar 17 2016 7:52 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement