
దీర్ఘకాలిక సెలవుపై వీసీ అప్పారావు
ఇన్‌చార్జి వీసీగా బిపిన్ శ్రీవాస్తవ నియామకం
సాక్షి, హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో అట్టుడుకుతున్న హెచ్‌సీయూలో మరో కొత్త వివాదం మొదలైంది. యూనివర్సిటీ వీసీ పొదిలె అప్పారావు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో భౌతికశాస్త్ర విభాగం ప్రొఫెసర్ బిపిన్ శ్రీవాస్తవను ఇన్‌చార్జి వీసీగా నియమిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అప్పారావును సస్పెండ్ చేసిన తర్వాతే.. మరో వీసీని నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి. శ్రీవాస్తవ పై గతంలో అనేక ఆరోపణలున్నాయని, ఆయన నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ సబ్ కమిటీయే రోహిత్ సస్పెన్షన్‌కు కారణమని విద్యార్థులు చెబుతున్నారు. 2008లో శ్రీవాస్తవ వేధింపుల వల్లే తమిళనాడుకి చెందిన సెంథిల్ కుమార్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొంటున్నారు.
ఇద్దరు విద్యార్థుల మృతికి కారణమైన శ్రీవాస్తవని వీసీగా ఎలా నియమిస్తారని విద్యార్థి జేఏసీ, ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం, ఆఫీసర్స్ ఫోరం ప్రశ్నించాయి. పందులు పెంచుకునే కుటుంబం నుంచి వచ్చిన సెంథిల్‌కు గైడ్‌ని కేటాయించకుండా శ్రీవాస్తవ వేధించాడని, కావాలని తక్కువ మార్కులు వేసి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ చేసినందునే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ‘పందులు పెంచుకునేవాడికి ఇక్కడేం పని? ఊరికెళ్లి పందులు కాసుకో..’ అంటూ సెంథిల్‌ను నాడు శ్రీవాస్తవ అవమానించారని ఫోరం ఆరోపిస్తోంది. సెంథిల్ తన ఆత్మహత్య లేఖలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు ఫ్యాకల్టీ సభ్యులు అంటున్నారు.
ఆ సూచనలు అమలు చేసి ఉంటే..
సెంథిల్ ఆత్మహత్య ఘటన తర్వాత వర్సిటీలో దళిత విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం, వివక్షపై ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ కి అధ్యక్షుడిగా వ్యవహరించిన వినోద్ పావురాల ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘సెంథిల్ ఆత్మహత్య తర్వాత యూనివర్సిటీలో జరుగుతున్న వివక్షపై మా కమిటీ ఇచ్చిన గైడ్‌లైన్స్‌ని సజావుగా అమలు చేసి ఉంటే ఈ రోజు రోహిత్ మరణం సంభవించి ఉండేది కాదు. పీహెచ్‌డీ విద్యార్థులకు సత్వరమే గైడ్‌ని కేటాయించాలని సూచించాం.
గైడ్‌తోపాటు ఇద్దరు సభ్యులతో డాక్టోరల్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పాం. వారిద్దరూ సంబంధిత విద్యార్థికి సహాయ సహకారాలు అందుతున్నాయో లేదో చూడాలి అని సూచించాం’’ అని ఆయన వివరించారు. విద్యార్థులకు సంబంధించిన అంశాల్లో సైన్స్ ఫ్యాకల్టీ మరింత సున్నితంగా వ్యవహరించాలని కూడా తమ కమిటీ సూచించిందని చెప్పారు.
రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి...
శ్రీవాస్తవ నియామకంతో వర్సిటీలో మరోసారి హిందూత్వ రాజకీయాలు బట్టబయలయ్యాయని రోహిత్‌తో పాటు సస్పెన్షన్‌కు గురైన ప్రశాంత్, సుంకన్న, విజయ్, శేషయ్య ఆరోపించారు. ‘‘హంతకులకు తప్ప మరొకరికి ఈ యూనివర్సిటీలో వీసీ అయ్యే అర్హత లేదని మరోసారి రుజువు చేశారు. శవాల గుట్టలతో విశ్వవిద్యాలయాలను నింపాలనుకుంటే మేం చూస్తూ ఊరుకోం. రోహిత్ మరణమే చివరి మరణం కావాలి’’ అని వారు పేర్కొన్నారు. శ్రీవాస్తవ నియామకాన్ని వ్యతిరేకిస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టాలని వర్సిటీ ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం, టీచర్స్ ఫోరం యోచిస్తోంది.
ఆమరణ దీక్షలో మరో ఏడుగురు
యూనివర్సిటీలో మరో ఏడుగురు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రోహిత్ మృతికి కారణమైనవారిపై చర్యలతోపాటు ఐదు డిమాండ్లతో ఏడుగురు విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు శనివారం భగ్నం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దీక్షకు కొనసాగింపుగా ఆదివారం నుంచి ఆగ్నిస్ అమల, ఎం.కిరణ్, ప్రమీల, హరిక్రిష్ణ, పాటిథిక్ భౌమిక్, ముబషిర్, దేవీ ప్రసాద్ విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగారు.