విద్యార్థులు జైలుకు.. వీసీ వర్సిటీలోకా?
♦ హెచ్‌సీయూలో ఘటనలపై కేంద్ర మాజీ హోంమంత్రి షిండే
♦ అట్రాసిటీ కేసు నమోదైనా అప్పారావు వర్సిటీలోకి ఎలా వచ్చారు?
♦ విద్యార్థులను కొట్టి, హింసించి, జైల్లో పెట్టిస్తారా?
♦ విద్యార్థులకు పరామర్శ
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో ఉండాల్సిన విద్యార్థులు జైలుకు ఎందుకు వెళ్లారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీ అప్పారావు తిరిగి విశ్వవిద్యాలయంలోనికి ఎలా రాగలిగారని కేంద్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీని యర్ నేత సుశీల్‌కుమార్ షిండే వ్యాఖ్యానిం చారు. హెచ్‌సీయూలో విద్యార్థులపై పోలీ సుల దాడిని, అరెస్టులను ఆయన ఖండించారు. దళి తులను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు పాల్పడుతోందని ఆరోపించా రు. విద్యార్థులెవరూ భయపడవద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సోమవారం హైదరాబాద్‌లోని చర్లపల్లి జైల్లో ఉన్న విద్యార్థులను, ప్రొఫెసర్లను షిండే పరామర్శిం చారు. అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, మల్లు భట్టి విక్రమార్క, గీతారెడ్డి, రోహిత్ తల్లి రాధిక తదితరులతో కలసి లక్డీకాపూల్‌లోని ఓ హోటల్ లో మీడియాతో మాట్లాడారు. ‘‘అప్పారావుకు సెలవు ఇచ్చిందెవరు? కేంద్ర ప్రభుత్వమా లేక తనకు తానే స్వయంగా సెలవు తీసుకుని మళ్లీ విశ్వవిద్యాలయంలోకి వచ్చారా? ఇంత జరిగాక తిరిగి ఎలా రాగలిగాడు. రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ అప్పారావే కారణమంటూ ఆయనపై అట్రాసిటీ కేసు నమోదైనా, ఇంత మంది విద్యార్థులు వీసీగా ఆయనను తిరస్కరించినా కూడా తిరిగి వర్సిటీలోకి ఎలా వచ్చారో అర్థం కావడం లేదు..’’ అని వ్యాఖ్యానించారు.
అంబేద్కర్ ఆశయాల కోసం, వివక్షకు వ్యతిరేకంగా రోహిత్ వేముల పోరాడారని, అటువంటి బిడ్డని కోల్పోయిన తల్లి దుఃఖం ఎవరూ తీర్చలేనిదని షిండే పేర్కొన్నారు. హెచ్‌సీయూలో విద్యార్థులపై పోలీసుల దాడిని, అరెస్టులను షిండే తీవ్రంగా తప్పుబట్టారు. పవిత్ర విద్యాక్షేత్రంలో విద్యార్థులను దారుణంగా కొట్టి, హింసించడం, జైల్లో పెట్టించడమేమిటంటూ దుయ్యబట్టారు. పోలీసులు తమపై ఒత్తిడి తెచ్చి, భయపెట్టి, బల వంతంగా సంతకం చేయించుకున్నారని విద్యార్థులు తనతో చెప్పారని షిండే తెలిపారు. వీసీ అప్పారావుకు ఏమాత్రం పశ్చాత్తాపమున్నా పదవికి రాజీనామా చేయాలన్నారు.
దళితులను అణచివేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాహుల్‌గాంధీ తరఫున చెబుతున్నానని, తామంతా విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చా రు. మంగళవారం రాష్ట్రపతిని కలసి ఈ సమస్యకు పరిష్కారాన్ని కోరుతామని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అనంతరం పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. హెచ్‌సీయూ ఘటనలకు సంబంధించి అసెం బ్లీలో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పాశవిక దాడిపై విచారణ జరిపించి, బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. విద్యార్థులపై కేసులను ఎత్తివేయాలని కోరారు.
రోహిత్‌ను చంపింది వీసీయే: రోహిత్ తల్లి రాధిక
తన కుమారుడిని చంపింది వీసీ అప్పారావేనని రోహిత్ తల్లి రాధిక ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినా అప్పారావును ఎందుకు అరెస్టు చేయలేదన్నందుకు విద్యార్థులను జైలు పాలు చేశారని మండిపడ్డారు. ‘‘ఆడపిల్లల హాస్టళ్లలోకి చొరబడిన పోలీసులు వారిని అత్యాచారం చేస్తామని బెదిరించారు. తిండి, నీళ్లు లేకుండా బాధపడుతున్న విద్యార్థులకు వంట చేస్తున్న విద్యార్థి ఉదయభానుని తీవ్రంగా కొట్టారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి వివక్షని ప్రశ్నించినందుకే నా కుమారుడిని వీసీ అప్పారావు చంపేశాడు. నా కుమారుడిని సస్పెండ్ ఎందుకు చేశారు? చేసినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం రాలేదు’’ అని రాధిక పేర్కొన్నారు.