అధికారులను తప్పించేందుకే కులంపై చర్చ
రోహిత్ కేసుపై చుక్కా రామయ్య
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారణాలు కనుగొని, వివక్షకు పరిష్కారాన్ని చూపాల్సింది పోయి అతడి కులంపై ఏకసభ్య కమిషన్ అనవసర చర్చకు తెరలేపిందని విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. హెచ్‌సీయూ అధికారులను కేసు నుంచి తప్పించడానికే కులంపై చర్చన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ గురవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామయ్య మాట్లాడారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు.
మాజీ సీఎస్ కాకి మాధవరావు మాట్లాడుతూ హెచ్‌సీయూ ఘట నలపై ఏకసభ్య కమిషన్ తన పరిధిలు దాటి రోహిత్ కులంపై చర్చించడం దురుద్దేశపూరితమేనన్నారు. రోహిత్ తల్లి రాధిక మాట్లాడుతూ.. పెళ్లయిన ఐదేళ్ల తరువాత భర్త నుంచి విడిపోయానని, ఓ ఎస్‌సీ కాలనీలో ఉంటున్న తన వద్దే తన పిల్లలు పెరిగారన్నారు. అటువంటప్పుడు ఏ సంబంధమూ లేని వ్యక్తి కులం తన పిల్లలకు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. దళిత్ స్టడీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.