chukka ramaiah
-
అక్షర యజ్ఞం
పేదబిడ్డల జీవితాల్లో విద్యా వెలుగులు నింపాలని.. వారికి నాణ్యమైన విద్య అందాలని దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ సంస్థ అక్షర యజ్ఞం చేస్తోంది. అభాగ్యులకు అక్షరాలు నేర్పించి సమాజంలో నిలబెట్టాలని సంకల్పించింది. బడిఈడు పిల్లలకు సంస్కారవంతమైన చదువునిచ్చి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో పనిచేస్తోంది ‘వందేమాతరం ఫౌండేషన్’. – తొర్రూరుతొర్రూరు కేంద్రంగా..మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంగా కొనసాగుతున్న వందేమాతరం ఫౌండేషన్ ఎందరో సామాన్య పేదబిడ్డలను అసామాన్యులుగా తీర్చిదిద్దింది. అక్షరాస్యత పెరుగుతోంది..అరాచకాలు తగ్గలేదు. ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి.. నిర్భాగ్యులు ఉంటూనే ఉన్నారు. ఈ విషయాలే తొర్రూరు నివాసి తక్కెళ్లపల్లి రవీంద్రను ఆలోచనలో పడేశాయి. దీనికోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే 2005లో వందేమాతరం ఉద్యమానికి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈమేరకు తన విద్యా ఉద్యమానికి ‘వందేమాతరం’ అని పేరుపెట్టారు. దీనిలో భాగంగా ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. దీంట్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతోపాటు గ్రామస్తుల్ని భాగం చేశారు. ‘వందేమాతరం ఫౌండేషన్’ కార్యక్రమాలు నచ్చి తొర్రూరులో ఎన్నారై డాక్టర్ అశోక్‌రెడ్డి తన కుమారుడు నితిన్ జ్ఞాపకార్థం కట్టించిన సామాజిక భవనాన్ని ఫౌండేషన్ కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి ఇచ్చారు. ఏటా ‘పది’విద్యార్థులకు ఉచిత శిక్షణ శిబిరంఅనేకానేక కారణాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు మార్కుల్లో కార్పొరేట్ విద్యాసంస్థల విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. ఆ పరిమితులను అధిగమించడానికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదోతరగతి పిల్లలకు వార్షిక పరీక్షల ముందు 45 రోజులపాటు విద్యా శిబిరాలు ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, జీవన నైపుణ్య శిక్షకుల చేత మెళకువలు నేర్పిస్తున్నారు. తొమిదేళ్లుగా చేపడుతున్న ఈ శిబిరంలో ఏటా 500 మంది విద్యార్థులకు భోజన, వసతి కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది. ఎంతోమంది విద్యార్థులు పదికి పది గ్రేడ్ తెచ్చుకొని ట్రిపుల్ ఐటీల్లో చేరుతున్నారు. ఈ శిక్షణకు హాజరైన రాయపర్తి మండలం పెర్కవేడు గ్రామానికి చెందిన పుల్లూరు శరత్ ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. ఈ విధానం మెచ్చి పలు జిల్లాల కలెక్టర్లు ఇలాంటి శిబిరాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. » ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఫౌండేషన్ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభా పురస్కారాలు అందిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. రవీంద్ర కృషిని ముఖ్యమంత్రి ప్రశంసించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం పురస్కారాలు అందిస్తుందని సీఎం ప్రకటించారు. » వీఎంఎఫ్ సంస్థ నిర్వహించే ఉచిత శిక్షణ శిబిరాల్లో శిక్షణ పొందిన వారిలో దాదాపు 680 మంది ఐఐటీలకు, 1,500 మంది పేరుమోసిన కళాశాలల్లో ఫ్రీ సీట్లకు అర్హత పొందారు. » అక్షరాభ్యాసం కార్యక్రమం ద్వారా పదేళ్లలో పలు జిల్లాలకు చెందిన 1,93,500 మందికి పైగా విద్యార్థులను పాఠశాలకు దూరం కాకుండా ఉండేందుకు తోడ్పడింది. » రాష్ట్రంలో చదువుపై అమితాసక్తి, చాలా ఉత్సాహవంతులైన ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలను ‘కలాం–100’అనే కార్యక్రమం ద్వారా ఎంపిక చేసి వారికి మెడిసిన్, ఐఐటీ, ఇతర పోటీ పరీక్షలకు అవసరమైన ఉచిత శిక్షణను ఫౌండేషన్ అందిస్తోంది. ఆరో తరగతిలో ఉన్నప్పుడే ఎంపిక చేసిన పిల్లలకు దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘకాలం పాటు శిక్షణ అందించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతోంది. » సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 70 గ్రామాల్లో స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి పేద బిడ్డలకు విద్యనందిస్తున్నారు. » ఎస్సీఆర్టీతో కలిసి విద్యా ముసాయిదాను తయారు చేశారు. » అక్షరాభ్యాసం మొదలు తల్లిదండ్రులకు వందనం వంటి కార్యక్రమాల ద్వారా స్ఫూర్తిగా నిలిచింది. » బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమ ముసాయి దాకు ఫౌండేషన్ రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.7,200 కోట్లు కేటాయించేందుకు మూలమైంది. » ఫౌండేషన్‌లో శిక్షణ పొందిన 680 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. రూ.2.80 కోట్ల ఉపకార వేతనాలు అందుకున్నారు. » గత కొన్నేళ్లలో 903 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు, 47 మంది ఐఐటీలకు ఎంపికయ్యారు. వివిధ ఎన్ఐటీల్లో 105 మంది, 2,400 మంది విద్యార్థులు పాలిటెక్నిక్‌కు, 4వేల మంది ఇంటర్ ఉచిత విద్య అవకాశాలను అందిపుచ్చుకున్నారు. 280 మంది ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు. » సంస్థ కార్యక్రమాలు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోనూ కొనసాగుతున్నాయి. » వందేమాతరం ఫౌండేషన్‌కు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు రావాలి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రతిభలో ఎవరికీ తీసిపోరు. వారికి తగిన తోడ్పాటు అందించకపోవడమే వారి ప్రతిభకు ప్రతిబంధకంగా మారుతోంది. వారిలోని నైపుణ్యాలను వెలికితీసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకే ఏటా ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం. దాతల సహాయంతో శిబిరం విజయవంతంగా నడుపుతున్నాం. విద్యతోపాటు జీవితంపై పలురకాల నైపుణ్య అంశాలపై విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నాం. ప్రభుత్వం సైతం ఇలాంటి శిబిరాలను నిర్వహిస్తే పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. – తక్కెళ్లపల్లి రవీంద్ర, వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ ఫౌండేషన్ కృషితో లక్షలాది మంది జీవితాల్లో వెలుగులుపేద బిడ్డల అభ్యున్నతికి వందేమాతరం ఫౌండేషన్ చేస్తున్న కృషి వెలకట్టలేనిది. అక్షరాలు అందిస్తే పేద బిడ్డలు అత్యున్నత స్థాయికి ఎదుగుతారని రవీంద్ర అభిలాష. ఆయన సంకల్పానికి 2009 నుంచి తోడుగా ఉన్నాను. నా శేష జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చే సేవ ఇదే. విద్యార్థులు చదువుతో సంస్కారం, క్రమశిక్షణ నేర్చుకోవడం మంచి పరిణామం. – చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త -
చుక్కా రామయ్యకు జీవిత సాఫల్య పురస్కారం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు తెలంగాణ వేదిక్ మ్యాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారం అందచేశారు. శుక్రవారం శ్రీత్యాగరాయ గాన సభలోని కళా దీక్షితులు కళావేదికపై తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ తదితరులు అవార్డును అందచేశారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ చుక్కా రామయ్య గణితశాస్త్రానికే ప్రతిరూపం లాంటి వారని, ఆయన తెలుగు రాష్ట్రాలలో ఐఐటీని ఇంటింటికీ తీసుకెళ్లారని కొనియాడారు. అవార్డుల స్థాయి కన్నా ఎత్తుకు ఎదిగిన రామయ్య నుంచి లెక్కలు మాత్రమే కాదు..జీవితం సక్రమంగా నడిచే లెక్కలు కూడా నేర్చుకోవాలన్నారు. త్వరిత గణిత విధానంలో రికార్డు సాధించిన సాయి కిరణ్ సారథ్యంలో ఉన్నత ప్రతిభ చూపిన చంద్రయ్య, నరసింహారావులకు గణిత రత్న అవార్డు బహూకరించారు. బాల సాహిత్య రచయిత చొక్కాపు రమణ అధ్యక్షత వహించారు. -
ఏప్రిల్ 3న ‘ప్రగతి– డాక్టర్ చుక్కా రామయ్య’ టెస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రగతినగర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలకు ‘ప్రగతి– డాక్టర్ చుక్కా రామయ్య’ టెస్ట్‌ను ఏప్రిల్ 3న నిర్వహించనున్నట్లు ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య చెప్పారు. శుక్రవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించేందుకు ప్రగతి నగర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో తమవంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రగతినగర్ సొసైటీల్లో ఐఐటీ, జేఈఈ, నీట్ అకాడమీలో ప్రవేశం కోసం ఏప్రిల్ 3న తెలంగాణలోని జిల్లాల్లో ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఏప్రిల్ 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు 91000 92345ను సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎ. నర్సిరెడ్డి, ప్రగతి నగర్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు కె. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పి. చంద్రశేఖర్‌రెడ్డి, కరస్పాండెంట్ డి. దయాకర్‌రెడ్డి, విద్యాసంస్థల ప్రతినిధి సాంబశివరావు పాల్గొన్నారు. (క్లిక్: ఆర్టీసీ చార్జీల బాదుడు.. ఏ స్టాప్‌కు ఎంత పెంచారంటే?) -
చుక్కా రామయ్యకు ప్రొటెమ్ చైర్మన్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యుడు చుక్కా రామయ్యను శాసనమండలి ప్రొటెమ్ చైర్మన్ భూపాల్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. మాజీ ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డితో కలిసి విద్యానగర్‌లోని రామయ్య నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో తన సొంత నిధులతో నిర్మించిన గీతాభూపాల్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీని సందర్శించాల్సిందిగా భూపాల్‌రెడ్డి కోరారు. నేటితరం విద్యార్థులకు రామయ్య వంటి విద్యావేత్త మార్గదర్శనం అవసరముందని వ్యాఖ్యానించారు. -
కేంద్రం నియంత పాలన
కవాడిగూడ: రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ కేంద్రం నియంత పాలన కొనసాగిస్తోందని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య విమర్శించారు. ప్రజల పక్షాన గొంతువిప్పుతున్న ఉద్యమకారులను అర్బన్ నక్సలైట్ పేరుతో జైళ్లలో పెడుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలపై నిర్బంధాన్ని, అక్రమ కేసులను, అక్రమ అరెస్టులను ఖండిద్దాం.. ఉపా చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో నిర్బంధ వ్యతిరేక వేదిక–తెలం గాణ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా అరెస్టు చేసిన 17 మంది ప్రజా ఉద్యమకారుల కుటుంబ సభ్యులను సభకు పరిచయం చేశారు. ప్రొ.హరగోపాల్ అధ్యక్షతన ఈ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ.. తాను స్వాతంత్య్ర, సాయుధ, తెలంగాణ పోరాటం లో పాల్గొన్నానని ఏనాడూ అర్బన్ నక్సలైట్ అనే పదం వినలేదన్నారు. ప్రధాని మోదీని హత్య చేయడానికి కుట్ర చేశారని విరసం నేత వరవరరావును అరెస్టు చేసి జైల్లో పెట్టారని, తనకు తెలిసి ఆ కుటుంబంలో ప్రతి బిడ్డా దేశభక్తుడేనని అన్నారు. అచ్చోసిన ఆంబోతులుగా ట్రంప్, మోదీ పదే పదే కౌగిలించుకుంటున్నారని.. ఇది ఒక అసాంఘిక లైంగిక చర్య అని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా.. లేదా.. అని చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రొ.హరగోపాల్ అన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావవ్యక్తీకరణ కల్పించిందని, ఈ హక్కుతో ప్రతి ఒక్కరికీ రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటం నేరం కాదని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొ.కోదండరాం చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎవరైనా గొంతువిప్పితే నేరం, దేశద్రోహులంటూ జైల్లో పెడుతున్నారని అన్నారు. దేశం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నదే లేదని, నలుగురు కూర్చొని మాట్లాడితే 144 సెక్షన్ అమలు చేస్తున్న పరిస్థితి ఉందని ప్రొ.విశ్వేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, న్యూడెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, రమ, సీపీఎం రాములు, వేదిక సమన్వయకర్తలు రవిచందర్, లక్ష్మణ్, చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యావ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి
వ్యవస్థని సజీవంగా ఉంచడంలో రెండు విషయాలు ప్రధానమైనవి. ఒకటి ఆరోగ్యం, రెండు విద్య. ఈ రెండింటినీ సేవాదృక్పథంతో చూశారు కనుకనే వైద్యుడినీ, గురువునీ గౌరవించని వారుండరు. కానీ కొర్పొరేట్ వ్యవస్థ ఈ రెంటినీ మార్కెట్‌గా మార్చేసింది. పిల్లలకీ కొన్ని ఆశలుంటాయి. వారేం చదవాలో పూర్తిగా వారికి అర్థం కాకపోయినా వారికి ఇష్టం లేనిదేంటో వారికి తెలుస్తుంది. వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి. అమెరికా అవసరాలకూ, సిలికాన్ వ్యాలీ కలలకూఅనుగుణంగా మాత్రమే భారత విద్యావిధానం రూపుదిద్దుకుంది. ఓటమి సైతం జీవితంలో భాగమేనని పిల్లలకు నేర్పించాలి. పిల్లల మానసిక, శారీరక, కుటుంబ సమస్యలతో సహా ఉపాధ్యాయుడికి అర్థం కావాలి. అన్నింటికన్నా ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రుల ఎదుట ఏదీ దాచకుండా అన్నింటినీ మనసువిప్పి చెప్పే సంస్కృతిని అలవాటు చేయాలి. సగం సమస్యలు దీంతో తీరిపోతాయి. విద్యారంగాన్ని 1 నుంచి 12 వరకు ప్రక్షాళన చేయాల్సిన తక్షణావసరం ఉంది. ముక్కుపచ్చలారని పసిబిడ్డలు. అల్లారు ముద్దుగా పెరిగిన వారు. తల్లిదండ్రులను వీడి ఒక్క క్షణమైన ఉండలేని వాళ్ళు అక్షర నిబద్ధులై కఠోరశ్రమకోర్చి, రేయింబవళ్ళు నిద్రాహా రాలు మాని తపోనిశ్చయంతో చదివి పరీక్షలు రాశారు. తాము పడిన కష్టానికీ, తామూహించిన ఫలితాలకూ సంబంధం లేదు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 26 మంది బలవంతంగా ప్రాణాలు విడిచారు. మార్కుల గారడితో పసిమనసులను ఎప్పుడో ఛిద్రం చేసిందీ కార్పొరేట్ విద్యావిధానం. విద్యార్థుల్లో మనోనిబ్బరాన్ని నింపే నికార్సైన విద్యావ్యవస్థ కరువయ్యింది. నిజానికి ఇంటర్మీడియట్ ఫలితాల్లో గోల్మాల్ కేవలం ఒక పరీక్షకు సంబంధించిన నిర్లక్ష్యం కారణంగానే కాదు. యావత్ విద్యావ్యవస్థలోని లోపాలే ఈ విపరీతానికి దారితీశాయి. ఈ గందరగోళం కేవలం ఇంటర్ ఫలితాల వరకే ఉండకపోవచ్చు. నిరుద్యోగం మరింత తీవ్రమైన పరిణామాలకు కారణం కావచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభు త్వం మొత్తం విద్యావ్యవస్థనే పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రప్రభుత్వం పాఠశాల విద్య, ఇంటర్ విద్యను పునర్వ్యవస్థీకరించాలి. వ్యవస్థని సజీవంగా ఉంచడంలో రెండు విషయాలు ప్రధానమైనవి. ఒకటి ఆరోగ్యం, రెండు విద్య. ఈ రెండింటినీ సేవాదృక్పథంతో చూశారు కనుకనే వైద్యుడినీ, గురువునీ గౌరవించని వారుండరు. కానీ కొర్పొరేట్ వ్యవస్థ ఈ రెంటినీ మార్కెట్‌గా మార్చేసింది. దాని ఫలితంగా విద్యావ్యాపారం విద్యార్థులను పరిజ్ఞానంతోనో, తెలివితేటలతోనో కొలవడం కాకుండా మార్కులతో తూచడం మొదలయ్యింది. ఈ మార్కుల మాయాజాలం ఆరోగ్యకరమైన విద్యావ్యవస్థని దారి మళ్లించింది. కనీస పరిజ్ఞానం కూడా లేకుండా కోళ్ళ ఫారాల్లో కోళ్లను పెంచినట్టు పిల్లల్ని బాహ్యప్రపంచానికి దూరంగా భ్రమల్లో బతికేలా చేస్తున్నారు. అవే భ్రమల్లో వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లలకీ కొన్ని ఆశలుంటాయి. వారేం చదవాలో పూర్తిగా వారికి అర్థం కాకపోయినా వారికి ఇష్టం లేనిదేంటో వారికి తెలుస్తుంది. వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి. అలా కాకుండా వారికి ఇష్టం లేని, సంబంధంలేని విషయాల్లో వారిని బలవంతంగా తోసి వారిపై ఒత్తిడి తేవడం ఎంత మాత్రం సమంజసం కాదు. అయితే డాక్టరో, లేదా ఇంజనీరింగో అనే సంకుచితార్థంలో విద్య కుంచించుకుపోయింది. ప్రపంచం అత్యంత విశాలమైనదని మన పిల్లలకు అర్థం చేయించడంలో మనం విఫలం అయ్యాం. దాన్ని సొమ్ము చేసుకోవడంలో విద్యావ్యాపార సంస్థలు సఫలీకృతం అయ్యాయి. అమెరికా అవసరాలకూ, సిలికాన్ వ్యాలీ కలలకూ అనుగుణంగా మాత్రమే భారత విద్యావిధానం రూపుదిద్దుకుంది. దాని ఫలితంగా మన దేశ అవసరాలకు తగినట్టుగా కాకుండా విదేశీ కంపెనీలకు ఊడిగం చేసేలా మార్చేశారు. అనారోగ్యకరమైన కృత్రిమ పోటీని సృష్టించి పిల్లల్లో ఓటమి అంటేనే భయపడే స్థితికి చేర్చారు.సమాజంలో అసమానతలు మారనంత కాలం, దళిత, అణగారిన వర్గాలను సమాజం చూసే దృష్టిలో మార్పు రానంత కాలం మార్కుల్లో అంతరాలు కొనసాగుతాయి. సమాజంలో ఆఖరిమెట్టున ఉన్న వాడికి కూడా అందరితో సమానమైన అవకాశాలు అందినప్పుడు వాడి ఆలోచనల్లోనో, పరిజ్ఞానంలోనూ, పోటీపడే తత్వంలోనూ మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఓటమి సైతం జీవితంలో భాగమేనని పిల్లలకు నేర్పించాలి. పిల్లల మానసిక, శారీరక, కుటుంబ సమస్యలతో సహా ఉపాధ్యాయుడికి అర్థం కావాలి. అందుకు తరగతి గదుల్లో మందలు మందలుగా విద్యార్థులను తోలడం కాకుండా, సరిపడా తరగతి గదులూ, అందుకు తగిన ఉపాధ్యాయులూ ఉండాలి. పిల్లల్లో మానసిక ఒత్తిడిని జయించే ఆటలు లేవు. సంగీతం లేదు. నృత్యం లేదు. కళల్లేవు. ఒట్టి కలవరం తప్ప. ఆట ఆడే వాడికే ఓటమి ఉంటుందని అర్థం అవుతుంది. క్రీడాస్ఫూర్తి అంటేనే ఆటలో గెలు పోటములు బొమ్మా బొరుసూలాంటివని నేర్పించడం. ఓటమిని అంగీకరించడం కూడా అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రుల ఎదుట ఏదీ దాచకుండా అన్నింటినీ మనసువిప్పి చెప్పే సంస్కృతిని అలవాటు చేయాలి. సగం సమస్యలు దీంతో తీరిపోతాయి. విద్యారంగాన్ని 1 నుంచి 12 వరకు ప్రక్షాళన చేయాల్సిన తక్షణావసరం ఉంది. ఏ తరగతిలో రావాల్సిన నైపుణ్యాలు ఆ తరగతిలో రాకుండా పై తరగతులుకు ప్రమోట్‌చేయడం వల్ల తీవ్ర అయోమయం నెలకొంటుంది. పిల్లల్లో అవగాహనా శక్తి లేకపోతే చెప్పిందంతా వృథాయే. ఆశలకు తగిన ప్రమాణాలు లేక, ఆశించిన ఫలితాలు రాక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. జిల్లాల మధ్య, పాఠశాలల మధ్య పోటీతత్వం ప్రమాణాలను మరింత దిగజారుస్తుంది. తరగతులకు అనుగుణంగా ప్రమాణాలున్నాయో లేదో చూసుకోవాలి. వెనుకబడిన పిల్లలకు ఆ క్లాస్‌లోనే రిపీట్ చేయించడం, శాండ్విచ్ కోర్సులు ప్రవేశపెట్టడం వల్ల పై తరగతులకు అర్హతలను సంపాదించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వం వివిధ రంగాల్లో జరిపిన అధ్యయనం అభినందించాల్సిందే. కానీ సమాజానికి ఇంధనంగా ఉన్న విద్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ముమ్మాటికీ సరికాదు. తక్షణమే కారణాలను అన్వేషించి శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాలి. విద్యావ్యవస్థ ఇలా బీటలు వారడానికి కారణమెవరన్న చర్చ అనవసరం. పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే చెప్పగలను. సమస్యని వాయిదా వేయడం ఎప్పటికీ పరిష్కారం కాదు. ఏటా సుమారు పదిలక్షల మంది విద్యార్థులు పది పూర్తిచేసి ఇంటర్లోకి వస్తున్నారు. విద్యారంగంలోని ఉన్నతాధికారులు, ఉపా«ధ్యాయులు అంతా కలిసి పిల్లలకు ప్రమాణాలు కల్గిన విద్యను అందించగల్గితే మనం ఆశించిన సామాజిక పరివర్తన సాధ్యమవుతుంది. అలా చేస్తే మీరు చరిత్రలో నిలిచిపోతారు. ప్రమాణాలు గల విద్యను ఇవ్వాలంటే ఒప్పంద అధ్యాపకులతో కుదరని పని. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేసి విద్యార్థుల ప్రమాణాలపై దృష్టి సారించడం తక్షణావసరం. చుక్కారామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ -
వరవరరావు విడుదలకు ఆదేశించండి
సాక్షి, హైదరాబాద్: విప్లవ రచయిత, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరావు విడుదలకు ఆదేశించాలని కోరుతూ ఆయన సతీమణి హేమలత భారత ప్రధాన న్యాయమూర్తికి బహిరంగలేఖ రాశారు. 79 ఏళ్ల వయో భారం, అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుపై కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఈ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు దేశ, విదేశాల ప్రముఖులు సంఘీభావం తెలిపారు. బహిరంగలేఖకు మద్దతు ప్రకటిస్తూ ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ రమా మెల్కోటే, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, ఐజేయూ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, వసంత కన్నబీరన్, వీక్షణం సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ ఈ సమావేశంలో మాట్లాడారు. ఫాసిజం వేగంగా విస్తరిస్తోంది... ప్రజాస్వామ్యం పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదని, గత ఐదేళ్లుగా దేశంలో ఫాసిస్ట్ పాలన కొనసాగుతోందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. వరవరరావును విడుదల చేయాలని కోరినవారిలో ఆయన అభిప్రాయాలతో, నమ్మకాలతో విభేదించేవాళ్లు సైతంఉన్నారని చెప్పారు. దేశంలో ఫాసిజం అత్యంత వేగంగా విస్తరిస్తోందని, భవిష్యత్తులో అది మరింత ప్రమాదకరంగా మారుతుందన్నారు. పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సికింద్రాబాద్ కుట్రకేసు మొదలుకొని గత నాలుగున్నర దశాబ్దాలుగా వరవరరావుపై ప్రభుత్వం అనేక కేసులు పెట్టిందని, అన్నింటిలోనూ ఆయనే గెలిచారన్నారు. అక్రమకేసులు మోపినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వరవరరావును వెంటనే విడుదల చేయాలని కోరారు. చుక్కా రామయ్య మాట్లాడుతూ వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావును జైల్లో ఉంచడం తగదన్నారు. సమావేశంలో జహీరుద్దీన్ అలీఖాన్, కె.కాత్యాయని, దేవీప్రియ, ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి, వసంత కన్నబీరన్ తదితరులు లేఖకు మద్దతుగా మాట్లాడారు. ఆయన నిర్దోషి... గత 45 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న వరవరరావు నిర్దోషి అని, ఆయనపై ఇప్పటివరకు బనాయించిన 25 కేసుల్లో 13 కేసుల్లో నిర్దోషి అని న్యాయస్థానాలు ప్రకటించాయని హేమలత తెలిపారు. మిగిలిన 12 కేసులు విచారణ స్థాయికి రాకముందే పోలీసులు ఉపసంహరించుకున్నారన్నారు. పుణే పోలీసులు బనాయించిన భీమా కోరేగావ్ కేసులోనూ ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని విశ్వా సం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాస్వామికవాదులు, మేధావులతోపాటు అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, శ్రీలంకకు చెందిన పలువురు రచయితలు, మేధావులు సంఘీభావం తెలుపుతూ ఆన్లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారని చెప్పారు. -
మౌన సంస్కృతి ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి
కారణాలు ఏవైనా కావచ్చు. కారకులు మీరంటే మీరని రాజకీయ పార్టీలూ, నాయకులూ పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో పొద్దు గడపవచ్చు. దురదృష్టవశాత్తూ మన దేశంలో మౌన సంస్కృతి పవనాలు వేగంగా వీస్తున్నాయి. మౌనం సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రజలు తమలోని భావాల్ని, ఆలోచనల్ని స్వేచ్ఛగా బయటకు ప్రకటించుకొనే హక్కులను గౌరవించి, వాటిని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలే వాటిని కాలరాసేలా వ్యవహరిస్తున్నాయి. బలప్రయోగంతో సమాజంలో నెలకొల్పుతున్న అనారోగ్యకరమైన మౌనాన్ని తొలగించి ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడు జలుబు రావాలి. అప్పుడే శరీరంలో ఉన్న మలినమంతా బయటకు పోతుంది. అందువల్ల జలుబు రావడం మంచిది. లేకపోతే ఊపిరితిత్తులు నాశనమై మానవ దేహాన్నే అది కబళిస్తుంది. అలాగే మనిషి తన ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకోగలగాలి. అదే ప్రజాస్వామ్యం. దేశాన్ని మౌన సంస్కృతి (సైలెన్స్ కల్చర్) కమ్ముకుంటోంది. ప్రజల్లో, విశ్వవిద్యాలయాల అధ్యాపకుల్లో, యువకుల్లో, పలు రాజకీయ పార్టీల నాయకుల్లోనూ.. ఇలా ఎక్కడ చూసినా ఈ సైలెన్స్ వాతావరణమే కనబడుతోంది. దేశంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వాలు తీసుకుంటోన్న పలు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ మాట్లాడే వారి సంఖ్య పరిమితమైపోతోంది. ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడితే తమకు ఎటువైపు నుంచి ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయమే అందుకు కారణమని చెప్పక తప్పదు. అందువల్ల మౌనమే శ్రీరామరక్ష అనుకుంటూ దేశంలో ఏం జరుగుతున్నా మనకెందుకులే అనుకునే ధోరణి జనంలో పెరుగుతోంది. దీంతో ఎక్కడ ఏం జరుగుతున్నా మౌనంగా ఉండే వారి సంఖ్య దినదినం పెరుగుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా చెప్పుకుంటున్న మన దేశంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం తీవ్ర ఆందోళనకరం. ఇలాంటి మౌనం సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. తమ ఆకాంక్షలను, అభిప్రాయాలను ప్రతి బింబించేలా ప్రభుత్వాలు పనిచేయాలనే కోరిక ప్రతి పౌరుడికీ ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పనిచేస్తే జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. దురదృష్టవశాత్తు, మన దేశంలో విచిత్రమైన, విపరీతమైన పోకడలు విస్తరిస్తున్నాయి. ప్రజలు తమలోని భావాల్ని, ఆలోచనల్ని స్వేచ్ఛగా బయటకు ప్రకటించుకునే హక్కులను గౌరవించి, వాటిని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలే వాటిని కాలరాసేలా వ్యవహరిస్తున్నాయి. ప్రతిపక్షాలే లేకుండా ప్రయత్నాలు చేయడం, ప్రశ్నించే తత్వాన్నే భరించలేకపోవడం వంటి అవాం ఛనీయ పోకడలు నేటి రాజకీయ వ్యవస్థలో ప్రవేశిం చాయి. ఇలాంటి ధోరణులు ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి. అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వాలైనా ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వాలి. నూరు పూలు వికసించనీ.. వేయి ఆలోచనలు సంఘర్షించనీ చందంగా ప్రభుత్వాలు పనిచేస్తే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. లేకపోతే పాలకులు ఎక్కడ తప్పు చేస్తున్నారో, పాలన గురించి ప్రజలేం అనుకుంటున్నారో, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటో ఎలా తెలుస్తాయి? ఫలితంగా ప్రజావిశ్వాసాన్ని కోల్పోవడమే కాదు.. జనాగ్రహం తప్పదు. అధికారంలో ఉన్నంతవరకూ ప్రజల్ని, వారి ఆలోచనల్ని భయపెట్టి నియం త్రించే వీలు పాలకులకు ఉండొచ్చేమోగానీ.. అధికారం శాశ్వతం కాదు. భయంలేని సమాజాన్ని సృష్టించగలిగినప్పుడే ఏ ప్రభుత్వమైనా మరింత పదునుదేలుతుంది. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించగలుగుతుంది. అలాంటి వాతావరణం కల్పించినప్పుడే ప్రజలు హద్దులు లేని ఆలోచనలతో ముందుకుసాగుతారు. తద్వారా ప్రగతిశీలతతో, రెట్టింపు ఉత్సాహంతో ఈ సమాజం మరింత పురోగమనంలో దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినూత్న రాజకీయ పంథాలను అనుసరిస్తూనే ప్రజల సహకారంతో పనిచేసినప్పుడే దేశాన్ని అనాదిగా పట్టిపీడిస్తున్న పేదరికం, నిరుద్యోగం, అవినీతి వంటి మహమ్మారిల బారి నుంచి విముక్తి చేయగల్గుతాం. లేకపోతే ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి. జనం ఓట్లేస్తారు. గెలిచిన పార్టీ అధికారం చెలాయిస్తుంది. ఓడిపోయిన పార్టీ మళ్లీ అధికారంలోకి ఎలా రావాలో, ప్రజల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఆలోచిస్తాయి తప్ప ప్రజల జీవితాల్లో ఏమాత్రం మార్పులు కనబడవు. ఈ రోజు దేశ ప్రజలు కోరుకుంటున్నది ఇది కాదు. తమ జీవితాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ప్రపంచంలో జరుగుతున్న పరి ణామాలను అనునిత్యం పరిశీలిస్తున్న సగటు భారతీయ పౌరుడు అగ్రదేశాల సరసన భారత్ సగర్వంగా నిలవాలని అభిలషిస్తున్నాడు. సాంకేతిక యుగంలో వస్తోన్న విప్లవాత్మక మార్పులతో ప్రతిమనిషీ చైతన్యమంతమవుతున్నాడు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా నిమిషాల్లోనే తెలుసుకోగలుగుతున్నారు. అంతలా సాంకేతికత వృద్ధి చెందింది. కానీ మన నాయకుల్లో మాత్రం ఇంకా మూస పద్ధతులే కొనసాగుతున్నాయి. ప్రజల్ని నియంత్రించాలని, భయపెట్టాలని ప్రయత్నిస్తే ఆ చర్యలు తమకే ఇబ్బందులు తెచ్చిపెడతాయని గుర్తించలేకపోతున్నారు. అంతేకాదు, కార్యనిర్వాహక వ్యవస్థలు, స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోతోంది. కార్యనిర్వాహక వ్యవస్థల పనితీరును రాజకీయ వ్యవస్థలు పరిశీలించాలే తప్ప నియంత్రించాలని చూడటం సరికాదు. విశ్వవిద్యాలయాలు మౌనంగా ఉండాలి. అక్కడ పనిచేసే ప్రొఫెసర్లూ ఏమీ మాట్లాడొద్దంటే కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు ఎలా వస్తాయి? ఇలాంటి పరిస్థితులతో వచ్చే తరమే మారిపోతుంది. ఏం జరుగుతున్నా, ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా సగటు మనిషి నాకెందుకులే అనుకుంటూ ఏమీ మాట్లాడకపోతే సమాజాన్ని అది పెద్ద దెబ్బకొడుతుంది. ఈ మౌనం ఏదో ఒక రోజు అగ్నిపర్వతంలా బద్దలవుతుంది. అన్ని వ్యవస్థలూ స్వతంత్రంగా ఎవరిపని వారు చేసుకుంటూ ముందుకెళ్తేనే అందరికీ క్షేమం. దురదృష్టవశాత్తూ మన దేశంలో మౌన సంస్కృతి పవనాలు వేగంగా వీస్తున్నాయి. ఈ మౌనం తొలగించి ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడు జలుబు రావాలి. అప్పుడే శరీరంలో ఉన్న మలినమంతా బయటకు పోతుంది. అందువల్ల జలుబు రావడం మంచిది. లేకపోతే ఊపిరితిత్తులు నాశనమై మానవ దేహాన్నే అది కబళిస్తుంది. అలాగే దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో నిజమైన మార్పులు రావాలంటే అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేయాలి. మనిషి స్వేచ్ఛగా తన ఆలోచనల్ని ఇతరులతో పంచుకోగల్గినప్పుడే ప్రజాస్వామ్యం మరింతగా వికసించడమే కాదు మరింత సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. డా.చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త సామాజిక విశ్లేషకులు -
‘సమస్యలపై పోరాడే వారికే ఓటు’
హైదరాబాద్: పైసలు ఇచ్చే వాడికి ఓటు వేయను, సమస్యలపై పోరాడే వారికే ఓటేస్తామని చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఓటర్ల్లకు విజ్ఞప్తిచేశారు.ఓట్ల కోసం వచ్చే రాజకీయ నేతలను నిలదీద్దాం, ప్రజాస్వామిక తెలంగాణను సాధిద్దాం అంటూ నవంబరు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రజాఫ్రంట్ చేపట్టిన ప్రజా చైతన్యయాత్ర ముగింపు నేపథ్యంలో మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ప్రజా అసెంబ్లీ, ధర్నా జరిపింది. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడారు.సీఎం కేసీఆర్‌కు ఉద్యమాలను నేర్పి, అధికార కుర్చీలో కూర్చోబెట్టిన ధర్నాచౌక్‌లో దాదాపు రెండేళ్ల తర్వాత హైకోర్టు సడలింపుతో తిరిగి ఆందోళనలు సాగుతున్నాయని అన్నారు.ఎన్నికల వేళ ఓటుకు రూ.4 వందలు ఇస్తా అని ఒకరంటే రూ.15 వందలు అంటూ ఇంకొకరు వస్తున్నారని, డబ్బు ఉన్నవారే పోటీ చేయాలా? వారే అసెంబ్లీకి పోవాలా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజలు చదువుకు, భూమికి నోచుకోవడంలేదని, ఓటుకు డబ్బు ఇచ్చి గెలిచే నేతలు ఆ తర్వాత మూడు రెట్లు ఎక్కువ సంపాదించుకుంటారు తప్పా, సేవ చేయరని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఏ దేశాన్నీ ప్రగతి పథంలోకి తీసుకురాలేదని, స్వతహాగా బతికే విధానాలు తేవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పక్షాలపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో వాటిని తీర్చక పోవడం వల్లే ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. రైతులు అప్పులపాలు కాని విధానం కావాలంటే రైతు బంధు అంటున్నారని, ఉద్యోగాలు వచ్చే శిక్షణ, నైపుణ్యం, ప్రమాణాలతో కూడిన చదువు కావాలంటే నిరుద్యోగభృతి అని మభ్యపెడుతున్నారన్నారు. కొత్తగా దాదాపు 20శాతం మంది యువకులు మద్యానికి అలవాటయ్యారని తెలిపారు. మద్యాన్ని నియంత్రిస్తామని ఏ పార్టీ చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పక్షాలు గ్రామ, అసెంబ్లీ స్థాయిలో సమస్యల వారీగా మేనిఫెస్టోలను ప్రకటించాలన్నారు. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంటుల్లో నిబంధనల ప్రకారం సమావేశాలు జరగడం లేదని అన్నారు. అరుణోదయ విమలక్క మాట్లాడుతూ తెలంగాణలో ఈ నాలుగున్నరేళ్లూ నియంత పాలన సాగించారని విమర్శించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని సీఎం కేసీఆర్ నాశనం చేశారన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు నల్లమాస కృష్ణ మాట్లాడుతూ జైళ్లలో ఉండాల్సిన వారు ప్రజల్లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ప్రజల్లో ఉండాల్సిన ప్రజాస్వామికవాదులను జైళ్లలో పెడుతున్నారన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రజా అసెంబ్లీని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఖాసిం, పాశం యాదగిరి, ప్రొఫెసర్ లాల్టూ, వీక్షణం వేణుగోపాల్, లతీఫ్‌ఖాన్, టీపీఎఫ్ ఉపాధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి, ప్రధానకార్యదర్శి పరమేష్ తదితరులు పాల్గొని మాట్లాడారు. -
విశ్వవిద్యాలయాల నోరునొక్కితే.. దేశానికే నష్టం
సమాజంలో జటిలమౌతున్న సామాజిక సమస్యల తీవ్రతకు పరిష్కారాలని చూపగలిగే పరిశోధనలు జరుగుతున్నాయా? జరిగితే ఎక్కడ జరగాలి? మన విశ్వవిద్యాలయాల్లోనే అది సాధ్యం. సమాజంలో వచ్చే మార్పులని గమనించి వాటి తీవ్రతని అంచనా వేసే శక్తి సామాజిక శాస్త్రాలకు మాత్రమే ఉన్నది. ఈ సామాజిక శాస్త్ర పరిశోధన ముందుకు తెచ్చే సమస్యలకు సైన్స్ అండ్ టెక్నాలజీలు పరిష్కారాలను చూపే ప్రయత్నం చెయ్యాలి. కానీ మన దేశంలో సామాజిక శాస్త్రాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. యూనివర్సిటీల్లో సామాజిక శాస్త్రాలకు ప్రోత్సాహం లభించటంలేదు. అసలు పరిశోధన వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసమా? లేక ప్రజాప్రయోజనార్థం జరగాలా? అనే అంశంపై చర్చ జరగాలి. మానవ నాగరికతా పరిణామంలో గత శతాబ్దకాలంలో ఎన్నో మార్పులు సంభవించాయి. విద్యవైజ్ఞానిక రంగాల్లో జరిగిన అభి వృద్ధీ, పెరిగిన శాస్త్రీయ ఆలోచనలూ, సామాజిక చైతన్యం వెరసి అసాధ్యమనుకున్నవెన్నో సుసాధ్యమవుతున్నాయి. మానవ వనరుల అభివృద్ధితో పాటు మనిషి సగటు ఆయుర్దాయం పెరిగింది. స్త్రీలకు విద్యావకాశాలు పెరిగాయి. ప్రాథమిక విద్య అయినా కనీసం అందరికీ అందుబాటులోకి వచ్చింది. తలసరి ఆదాయంలో గణనీయమైన అభివృద్ధి కనపడు తోంది. పట్టణీకరణ, ఉపాధి అవకాశాల మెరుగు ప్రజలను సాంకేతికత దరికి చేర్చింది. దాదాపు 50 శాతం మంది జనం మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఖండాంతరాల్లో ఉపాధి అవకాశాలు రావడంతో సరిహద్దులు చెరిగిపోతున్నాయి. సుదూర తీరాలకు మన యువతరం ఎగిరిపోతోంది. అయితే ఇదంతా నాణే నికి ఒకవైపు మాత్రమే. సంపద, విజ్ఞానం, టెక్నాలజీ, ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నా మరోవైపు నిశితంగా పరిశీలిస్తే విషాదకరమైన పరిస్థితి గోచరిస్తోంది. పైకి అభివృద్ధి కనిపిస్తోన్నా లోపల అంధ కారం గోచరిస్తోంది. ప్రపంచ జనాభాలో 120 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. కొద్దో గొప్పో బాగా ఉంటాయనుకున్న బ్యాంకాక్, మలే íసియా రాజధాని కౌలాలంపూర్లలో సైతం పేద కుటుంబాల్లో పిల్లలకు మంచి ఆహారాన్ని కొనుక్కో లేని స్థితిలో ఉన్నారు. బ్యాంకాక్‌లో మూడోవంతుకుపైగా చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నట్టు 2017 గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్లోనైతే దేశం మొత్తంలో కేవలం నాలుగు శాతం మంది పిల్లలు మాత్రమే కనీస ఆహారాన్ని పొందగలుగుతున్నట్టు అక్కడి ప్రభుత్వమే నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయ్యింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 కల్లా ఆకలిని జయించాలంటే, పౌష్టికాహార లోపాలన్ని అధిగమించాలంటే ఈ రీజన్లో ప్రతి రోజూ 1,10,000 మంది ప్రజలకు సరైన ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. కనీస పారిశుద్ధ్య వసతు ల్లేక, ఆహార భద్రతకరువై 79 మిలియన్ల మంది ఐదేళ్ళలోపు చిన్నారులు ఈ రీజన్లో వయస్సుకు తగిన ఎదుగుదల లేక అనారోగ్యంతో బాధపడుతున్నారు. మన దేశంలోని ఐదేళ్ళలోపు చిన్నారుల్లో 38 శాతం మందికి వయసుకు తగ్గ ఎదుగుదల లేదు. 21 శాతం మంది ఐదేళ్ళలోపు చిన్నారులు వయసుకి తగ్గ బరువు తూగడంలేదు. మనదేశంలో స్త్రీల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. తాజా గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్టు 2017 జాబితాలో భారతదేశం అట్టడుగు భాగంలో ఉంది. భారత్‌లో 51 శాతం మంది సంతానోత్పత్తి దశలో రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాగే ప్రతి ఐదుగురిలో ఒకరికంటే ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. రక్తహీనత విషయంలో మన తరువాతి స్థానాలు చైనా, పాకిస్తాన్, నైజీరియా, ఇండోనేíసియాలు ఆక్రమించాయి. 2016 గణాంకాల ప్రకారం మన దేశంలోని స్త్రీలలో 46 శాతం మందిని రక్తహీనత బాధిస్తోంది. కనీసం మరుగుదొడ్ల సదుపాయం లేదు. పారిశుద్ధ్య లోపంతో అనారోగ్య, స్త్రీల సామాజిక సమస్యలకు కారణమవుతోంది. ఇక విద్య సంగతి చెప్పక్కర్లేదు. కనీస జీవన అవసరాలను తీర్చుకోగలిగేపాటి నైపుణ్యం కూడా విద్యార్థులకు ఈ చదువు అందించలేకపోతోంది. ఆకలి, ఆత్మహత్యల నివారణకు చర్యలు మృగ్యమ య్యాయి. అమెరికాలాంటి సంపన్నదేశాల్లో సైతం దారిద్య్రం తొంగిచూస్తోంది. యూరప్‌లో నిరుద్యోగం తాండవిస్తోంది. సమాజంలో జటిలమౌతున్న ఈ సామాజిక సమస్యల తీవ్రతకు పరిష్కారాలని చూపగలిగే పరిశోధనలు జరుగుతున్నాయా? జరిగితే ఎక్కడ జరగాలి? అంటే మన విశ్వవిద్యాలయాల్లోనే అది సాధ్యం. సమాజంలో వచ్చే మార్పు లని గమనించి వాటి తీవ్రతని అంచనా వేసే శక్తి సామాజిక శాస్త్రాలకు మాత్రమే ఉన్నది. ఈ సామా జిక శాస్త్ర పరిశోధన ముందుకు తెచ్చే సమస్యలకు సైన్స్ అండ్ టెక్నాలజీలు పరిష్కారాలను చూపే ప్రయత్నం చెయ్యాలి. కానీ మన దేశంలో సామాజిక శాస్త్రాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. యూనివర్సిటీల్లో సైన్స్ మరియు టెక్నాలజీలకు ఇచ్చే ప్రోత్సాహం సామాజిక శాస్త్రాలకు లభించటంలేదు. అసలు పరిశోధన వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసమా? లేక ప్రజాప్రయోజనార్థం జరగాలా? అనే అంశంపై చర్చ జరగాల్సి వుంది. విదేశాల్లో వ్యాపార సంస్థల పరిశోధనా ఖర్చును సదరు సంస్థలే చూసుకుంటుంటే మన దేశంలో మాత్రం ప్రజాధనంతో పరిశోధన జరిపే విధానం చోటు చేసుకుంది. దేశంలో సామాజిక శాస్త్రాల్లో ప్రతిష్టాత్మక పరిశోధనలు చేసిన జెఎన్‌యు లాంటి యూనివర్సిటీని ధ్వంసం చేసుకుంటున్నాం. ప్రతి రోజూ దానిని వివాదాస్పద అంశాలకు కేంద్ర బిందువుని చేసి అక్కడ స్వేచ్ఛగా జరగాల్సిన మేథోమథనాన్ని ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నాం. కేంద్ర యూనివర్సిటీల్లో ప్రభుత్వ జోక్యం పెచ్చుమీరిపోయింది. దళిత బడుగువర్గాల పిల్లలు ఇప్పుడిప్పుడే వాటి గడప తొక్కుతుంటే వారికి అంతరాయం కల్పించే పరిస్థితులు సృష్టించబడుతున్నాయి. పరిశోధక విద్యార్థులకి అందే ఉపకార వేతనాలు కత్తిరించివేస్తున్నారు. ప్రఖ్యాత ఆర్థిక వేత్త అమర్త్యసేన్ లాంటి వారు సామాజిక శాస్త్రాల వృద్ధి కోసం నలందా యూనివర్సిటీని ఒక నమూనాగా ముందుకు తీసుకురాగా దానికి ఆదిలోనే గండి కొట్టారు. ఈ దేశంలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ తన పాత్రని ప్రతిభావంతంగా పోషించింది. దాని ఏర్పాటు కోసం తయారుచేయబడిన నియమాలు ప్రైవేటు యూనివర్సిటీల ప్రోత్సాహానికి ఆటంకంగా మారాయని, దానిని రద్దు చేసి ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేశారు. పరిశోధనలు వాటి విచక్షణ మేరకుగాక మార్కెట్ ప్రయోజనాల కోసం జరిగితే ప్రమాదం మరింత పెరుగు తుంది. వీటిల్లో అధ్యాపకుల నియామకాల్లో కూడా రిజర్వేషన్ అమలు నీరుగారిపోయే ప్రమాదముంది. విశ్వవిద్యాలయాలు సమాజపు ఉమ్మడి మెదడు లాంటివి. సామాజిక శాస్త్రాలు ఉమ్మడి మేధ స్సులాంటిది. ఇలాంటి విశ్వవిద్యాలయాలను ఆలోచించకుండా చేసే ప్రయత్నాలు ఈ దేశానికి ఎనలేని నష్టాన్ని తెచ్చిపెడతాయి. సామాజిక శాస్త్రాల మూలాలను తొలగించడం అంటే సమాజంలో అశాంతిని పెంచి పోషించడమే. దేశంలో అశాంతి పెరిగితే ఈ దేశాన్ని గ్లోబల్ పవర్‌గా తయారు చేయలేకపోగా, ఇప్పటికే సాధించిన ఈ మాత్రం అభివృద్ధినీ వెనక్కి తీసుకెళ్ళడానికి ఎంతో కాలం పట్టదు. వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య -
పెట్టుబడిదారుల ఉచ్చులో కేజీ టు పీజీ?
మార్కెట్ యుగంలో టెక్నాలజీ ఎంత పెరుగుతున్నదో సామాజిక సంఘర్షణ సైతం అదే స్థాయిలో పెరుగుతోంది. అభివృద్ధి చెందిన శాస్త్రసాంకేతిక ఫలితాలు సామాన్యుడి దరికి చేరడం లేదు. టెక్నాలజీతో పెరిగిన సంపద సైతం వారికి అందుబాటులోకి రావడం లేదు. ఈ పరిజ్ఞానం అంతా ఎవరి ఖాతాలోకి వెళుతోంది అంటే అధికాదాయ వర్గాలకు చేరు తోంది. మురికివాడల్లోనూ, పూరి గుడిసెల్లోనూ ఉండే సామాన్యుడికి అందాలంటే ఇంకా విద్యకి ఆమడదూరంలో ఉన్న ఆయా వర్గాల ప్రజలు అత్యధికస్థాయిలో ఆధునిక విద్యాపరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే స్థితికి చేరాలి. సంపద లాగే జ్ఞానం కూడా అందరికీ సమంగా అందు బాటులోకి రావాలి. అది జరగాలంటే ఏ వర్గాలైతే అణచివే తకు గురౌతున్నాయో, ఏ వర్గాలైతే విద్యకీ, సమాజంలోని సకల సౌకర్యా లకీ దూరమౌతున్నాయో వారే జ్ఞానసంప న్నులు కావాలి. అప్పుడే ఇన్నాళ్ళూ ఒక వర్గ ప్రజలకే అందు తోన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నూటికి తొంభైశాతంగా ఉన్న పేదలకూ, అట్టడుగు వర్గాలకూ అందుబాటులోకి వస్తుంది. వారే ఈ పేదరికానికీ, అసమానతలకూ, అణచివే తకూ భిన్నమైన సమాజాన్ని సృష్టించగలుగుతారు. సమాన తను అందరికీ పంచగలుగుతారు. సమాజ పరివర్తనకు మార్గనిర్దేశనం చేయగలుగుతారు. సరిగ్గా ఇదే విషయాన్ని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కూడా అంటారు. ఆయన అభి ప్రాయంలో సామాజిక విప్లవం పాఠశాలల్లోనే ప్రారంభం కావాలి. అదే స్ఫూర్తిని గ్రామాలకు విస్తరించడానికి ఇదే సరైన సమయం అని భావించారు విద్యాపరిరక్షకులు. అది జరగా లంటే కామన్ స్కూల్ సిస్టమ్ ఒక ఉన్నతమైన పరిష్కార మార్గమని భావించి దేశవ్యాప్తంగా ఉద్యమించారు. దానికి మన రాష్ట్రం నుంచి ప్రముఖ మేధావి, విద్యావేత్త హరగోపాల్ లాంటి విద్యాపరిరక్షకులు పోరాడుతున్నారు. కామన్ స్కూల్ సిస్టమ్ కోసమే ఉపాధ్యాయ ఉద్యమం నడుంబిగించింది. దానికి సారథ్యం వహిస్తోన్న హరగోపాల్ ద్వారా ఆ ఉద్య మానికి అంకురార్పణ చేసే అవకాశం నాకు దొరికింది. అది కూడా ఒక పవిత్రమైన స్థలంలో, ఎందరో వీరులు అమరు లైన ఉద్యమ ప్రాంగణంలో, తెలంగాణ పోరాటపతాకగా భావించే గన్‌పార్క్‌లో ఈ ఉద్యమాన్ని నాతో ప్రారంభిం పజేశారు. కేజీ టు పీజీ విద్య చింకిపాతల జీవితాలను బాగు చేస్తుందా? టెక్నాలజీ విద్యావ్యాప్తికి కారణం అయ్యింది. నిజమే. కేజీ నుంచి పీజీ స్కూళ్ళు వచ్చాయి. కానీ ఎవరి లాభం కోసం? లేక చింకిపాతల జీవితాలను బాగుచేయడానికా? కొన్ని రాజకీయ పార్టీల నినాదాల్లో ఇవి భాగం అయ్యాయి. కేజీ టు పీజీ వెనుక సైతం ఒక పెట్టుబడిదారీ వర్గం కూడా వచ్చింది. స్కూల్స్ పైన పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించడమే కాకుండా పసిపిల్లల మనసుల్లో కూడా చిన్నప్పటి నుంచే విద్యని ఒక క్యాపిటల్‌గా భావించే ఆలోచనలను చొప్పిస్తున్నారు. త్రీడీ టెక్నాలజీని విద్యావిషయాల్లో ఉపయోగించుకోవడం కూడా హర్షించాల్సిందే కానీ ఆ త్రీడీ స్కూల్స్‌లో చదువుకోవాలను కునే విద్యార్థులు ఎన్ని లక్షలు వెచ్చించాల్సి వస్తోంది? సామా న్యుడికి ఈ విధానం అందుబాటులో ఉందా? కేజీ టు పీజీ కూడా క్యాపిటల్ సమాజంలో ఒక గొలుసు వ్యవస్థగా మారింది. లక్షలు ఖర్చు చేసి విజ్ఞానాన్ని కొనుక్కోవాలి. ఉన్నత విద్యలో సీటు సంపాదించాలి. ఉద్యోగాలకోసం ఎంతో ప్రయాసపడాలి. చివరకు చదువుకి వెచ్చించిన దాన్ని మొత్తం ఉద్యోగం సంపాదించాక రాబట్టుకోవాలి. దానితో మరో క్యాపిటల్ సమాజానికి అంకురార్పణ చేయాలి. ఇదే వ్యవస్థ ప్రతిసారీ పునరావృతం అవుతోంది. కేజీ టు పీజీ విద్య నిర్వ హణ ఎవరి చేతిలో ఉండాలి? ఎవరికి సీట్లివ్వాలి? ఎవరిని యోగ్యులుగా మార్చాలి. నైపుణ్యాలను వెలికితీయాల్సింది ఎవరిలో? అంటే కచ్చితంగా పేదరికంలో మగ్గుతున్న వారికి క్వాలిటీ చదువు అందించాలి. ఎక్స్‌లెన్సీ సమత్వంపై ఆధార పడి ఉంటుంది. ఏ కొందరికో ఎక్స్‌లెన్సీ వస్తే సరిపోదు. కుగ్రామాల్లో నివసిస్తున్న నిరుపేదకు సైతం ఇది అందాలి. అప్పుడే శ్రీమంతుడికీ, సామాన్యుడికీ ఒకేరకమైన చదువు అందుబాటులోకి వస్తుంది. సరిగ్గా ఇవే విషయాలపై గళ మెత్తారు హరగోపాల్. విద్యావ్యవస్థలో ఉన్న అంతరాలే సమాజంలోని అంతరాలకు మూలమని గ్రహించారు. తెలంగాణ ఈ ఆకాంక్షలకోసమే ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించినవాడు గనక తెలం గాణ రాష్ట్రం ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించి కామన్ స్కూల్ సిస్టమ్‌పై ఉద్యమిస్తున్నాడు. ఇప్పుడే ఎందుకీ ఉద్యమం? అయితే ఇప్పుడే ఎందుకు ఉద్యమిస్తున్నారు అనే ప్రశ్న ఉద్భ విస్తోంది. దానికి ఒక బలమైన కారణం ఉంది. సామాన్యుడి సమస్యలన్నీ రాజకీయ పార్టీలు వినేది ఒక్క ఎన్నికల సమయంలోనే. అంతేకాకుండా పేద, అణగారిన వర్గాలకు అందని పండుగా తయారౌతోన్న విద్య, ప్రత్యేకించి కామన్ స్కూల్ సిస్టమ్ రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లోకి చేరాలంటే ఉద్యమం ఒక్కటే మార్గం. అందుకే ఈ ఉద్యమం ఇప్పుడే ప్రస్తుతమని భావించారు. చైతన్యవంతమైన వారు ఈ ఉద్య మాలకు స్పందిస్తారనీ, అభ్యుదయ ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటారనీ, దీక్షాపరులైన శాసనసభ్యులు ఎన్నికవుతా రనీ ఈ ఉద్యమానికి సారథ్యం వహిస్తోన్న హరగోపాల్ అభిప్రాయం. కానీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని అందుకోవడం కోసమే డబ్బు వెదజల్లుతూ, దానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకునేవారు ఈ ప్రచారానికి అడ్డంకిగా తమ పవర్‌ను ప్రయోగించారు. పోలీసు బలగాలను ఉపయోగిం చారు. ఈ ఉద్యమం పెట్టుబడిదారీ వ్యవస్థకు ఆటంకం కాబోతున్నది కాబట్టి ప్రజల్లో భయోత్పాతం సృష్టించే ప్రయత్నం చేశారు. అధికారంతో ఉద్యమం నోరునొక్కే యాలనుకున్నారు. ఇదే నిన్నటి బలప్రయోగం యొక్క లక్ష్యం. కానీ తెలంగాణలో సామాజిక ఉద్యమం చాలా బలంగా ఉంది కాబట్టి దెబ్బలైనా తింటాం, కష్టాలైనా భరిస్తాం, కానీ మా గొంతులు మూగబోవని తేల్చి చెప్పారు ఉద్యమకారులు. ఇది తెలంగాణ గడ్డ, పోరాటాల గడ్డ. ఈ పోరాటం బలప్రయోగాలకు తలవంచదు. ఇదే విషయం హరగోపాల్ అరెస్టుతో తేలిపోయింది. ఈ ఉద్యమం రాబోయే ప్రజా ఉద్యమాలకు సంకేతం. నిన్నటి అఘాయిత్యం ప్రజల ఆశలను తుంచివేయడానికే. ప్రజాఉద్యమాల గొంతు నులిమి వేయడానికే తప్ప మరొకందుకు కాదు. అన్ని అభిప్రాయాలనూ స్వేచ్ఛగా వెల్లడించే ప్రజాస్వామిక వ్యవస్థకు ఈ ఎన్నికలు అంకు రార్పణ చేయాలి. అధికారం ప్రజా సేవకోసం కానీ, అధి కారం ఆస్తుల కోసమో, ఆధిపత్యం కోసమో కారాదు. ప్రజలు బాగుపడాలంటే విద్యారంగంలో ప్రక్షాళన జరగాలి. ఎన్ని కలు అధికార సోపానానికి మార్గం కాకూడదు. అసమానత లను కూకటివేళ్ళతో పెకిలించగలిగే శక్తివంతమైన ఆయు ధంగా మారాలి. వ్యాసకర్త: చుక్కారామయ్య, ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ. -
ప్రభుత్వ విద్యకు పునర్వైభవం
ఆరేళ్ల క్రితం 2012 డిసెంబర్ 2వ తేదీన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం వచ్చింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లలకు ఈ చట్టం చేసిన మేలు అంతా ఇంతా కాదు. దాని ఫలితమే వందల కొద్దీ రెసిడెన్షియల్ పాఠశాలలొచ్చాయి. ఈ వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకప్పుడు తిండికీ, బట్టకీ కూడా ఇబ్బందిపడే స్థితిలో ఉండేవారు. ఈ రోజు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఈ కష్టాలేవీ లేకుండా పూర్తిగా చదువుపై దృష్టి పెట్టగలుగుతున్నారు. ఫలితంగా ఈ పాఠశాలలు మహోజ్వలంగా విరాజిల్లే స్థాయికి చేరాయి. దీంతో ప్రైవేటు పాఠశాలలపై మోజుపెంచుకున్న మధ్యతరగతి వారు సైతం ఈ ప్రభుత్వ పాఠశాలలౖ వెపు రాకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెరిగిందన్న వార్త ప్రభుత్వ విద్యావ్యవస్థ పటిష్టం కోసం కలలుగం టోన్న నాలాంటి వారికెందరికో శుభవార్త. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సామాన్య ప్రజల సర్వ హక్కులనూ దోచుకుంటోన్న ప్రైవేటీకరణ నుంచి బయటపడే ప్రయత్నం రాష్ట్రంలో కొంతైనా జరుగు తున్నదనడానికి ఇదొక ఉదాహరణ. అయితే అంత టితో సంతృప్తి పడదామా? అదే మన విద్యావిధానం చివరి లక్ష్యమా? అంటే ముమ్మాటికీ కాదు. ఎందు కంటే పాఠశాల స్థాయిలో విద్యార్థుల సంఖ్య పెరిగి నంత మాత్రాన వారంతా ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్ళే స్థితి ఉన్నదా? లేదు. అందులో అత్యధిక భాగం డ్రాపౌట్స్‌గా మారుతున్నారు. సామాన్యుల పిల్లల విద్యాభివృద్ధి లక్ష్యానికి ముందు ఇంకా ఎన్నో సవాళ్ళు అడ్డొస్తూనే ఉన్నాయి. వాటన్నింటినీ ఒక్కొ క్కటిగా పరిష్కరించుకుంటూనే తెలంగాణ విద్యా విధానం కొత్త పుంతలు తొక్కుతుంది.. గత పదేళ్ళ కృషి ఫలితమే ఇది! పదేళ్ళ క్రితం వరకూ పేద, దళిత, వెనుకబడిన వర్గాల విద్యపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించ లేదు. విద్యకు పెద్దగా నిధులు సైతం కేటాయించ లేదు. ఆయా సామాజిక వర్గాల రిజర్వేషన్లను సైతం వినియోగించుకునే స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరగ లేదు. ఉపాధి అవకాశాలే అంతంత మాత్రం అంటే ఉన్నవాటిని చేరుకునే కనీస స్థాయి సైతం ఈ సమా జిక వర్గాలకు లేకుండా పోయింది. దీనంతటికీ కారణం వారిని తరగతి గదులకు పరిమితం చేసిన మన విద్యావ్యవస్థ. నాలుగు గోడల మధ్య చెప్పిందే చెప్పి ఓ పక్క పిల్లల మస్తిష్కాలను ఓ మూస పద్ధ తిలో తయారుచేసింది. విద్యార్థులు ఉన్నది ఉన్న ట్టుగా బట్టీకొట్టి విషయాలు ముక్కున పెట్టుకొని మూడు గంటల పరీక్షలో దించేస్తే సరిపోయేది. ఆ తరువాత విద్యార్థికి తానేం చదివిందీ గుర్తుండదు. పరీక్షల్లో మాత్రం ఫస్టు మార్కులు ఖరారు. కానీ గత పదేళ్లుగా ఆయా సామాజిక వర్గాల విద్యార్థుల ఉన్న తికి ప్రత్యేక కృషి జరిగింది. దానికి తోడు ఆరేళ్ల క్రితం 2012 డిసెంబర్ 2వ తేదీన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం వచ్చింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్ల లకు ఈ చట్టం చేసిన మేలు అంతా ఇంతా కాదు. దాని ఫలితమే వందల కొద్దీ రెసిడెన్షియల్ పాఠశాల లొచ్చాయి. ఈ వర్గాలకు చెందిన విద్యార్థులు ఒక ప్పుడు తిండికీ, బట్టకీ కూడా ఇబ్బందిపడే స్థితిలో ఉండేవారు. ఈ రోజు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఈ కష్టాలేవీ లేకుండా పూర్తిగా చదువుపై దృష్టి పెట్టగలుగుతున్నారు. ఫలితంగా ఈ పాఠశా లలు మహోజ్వలంగా విరాజిల్లే స్థాయికి చేరాయి. ఇంతకు ముందు వరకూ ప్రైవేటు పాఠశాలలపై మోజుపెంచుకున్న మధ్యతరగతి వర్గం వారు సైతం ఈ ప్రభుత్వ పాఠశాలల వైపు రాకతప్పని పరిస్థితి ఏర్పడింది. పురుషుల కోణంలోనే విద్యావ్యవస్థ ఇప్పటి వరకూ పాఠ్యాంశాలు కావచ్చు. పాఠశాలల నిర్మాణం కావచ్చు. హాస్టళ్ల విషయం కావచ్చు– వీట న్నింటినీ పురుషుడి కోణం నుంచే చూసింది మన విద్యావిధానం. మన ఇళ్లలోని బాలికలు బడిమెట్లు కూడా ఎక్కకుండా తరాలు గడిచిపోయాయి. కాలం చెల్లిన ఆలోచనలు, సంప్రదాయాలు దీనికి కారణం. అయితే అంతకు మించి విద్యావిధానంలో తిష్టవేసిన పురుషాధిపత్య భావజాలంపై ఇంతవరకూ దృష్టి సారించలేదు. ఇప్పుడిప్పుడే అది జరుగుతోంది. ప్రధానంగా దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చే బాలికలకూ, అన్ని వర్గాల ఆడపిల్లలకూ విద్య అందనంత దూరంలో ఉండడానికీ, అత్యధిక సంఖ్యలో బాలికలు మధ్యలోనే చదువులు మాను కుని ఇంటికే పరిమితం కావడానికీ ప్రధాన కారణం టాయ్లెట్లు. అవి లేకపోవడమే ఆడపిల్లలు మధ్య లోనే చదువు మానేయడానికి ప్రధాన కారణమని జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు తేల్చి చెప్పాయి. సుప్రీంకోర్టు సైతం పదే పదే ఇదే విష యంపై ప్రభుత్వాలను హెచ్చరించింది. విద్యాహక్కు చట్టంలోనే టాయ్లెట్లు, ఇతర మౌలిక అవసరాలు తీర్చే సౌకర్యాలు లేకుండా పాఠశాల నిర్మాణమే జరగ డానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని కొన్ని మీడియా సంస్థలు స్వచ్ఛందంగా వెలుగులోకి తెచ్చాయి. విద్యార్థినులు ఎదుర్కొంటున్న మానసిక, భౌతిక వేదన, టాయ్లెట్లు లేకపోవడం వల్ల వారికి ఎదురౌతున్న సమస్యలపై విస్తృతంగా ప్రచారం చేశాయి. సుప్రీంకోర్టు సైతం పదే పదే మొట్టికాయలు వేసింది. దీని ఫలితంగా ఈ రోజు ఆడపిల్లల కోసం కొద్దో గొప్పో టాయ్లెట్ల నిర్మాణం జరుగుతోంది. ఇంకా అనుకున్న స్థాయిలో, అవసరాల మేరకు మరు గుదొడ్లు ఏర్పాటు చేయడం లేదన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం. సమాజంలో మాదిరి గానే విద్యావ్యవస్థలోనూ స్త్రీల దృక్కోణం ఇప్పుడి ప్పుడే వెల్లివిరుస్తోంది. అందులో భాగంగానే ïస్త్రీ, పురుష సమానత్వాన్ని బోధించే పాఠ్యాంశాలను సైతం డిగ్రీ స్థాయిలో ప్రవేశపెడుతున్నారు. అన్వేషి లాంటి స్వచ్ఛంద సంస్థలు ఆ ప్రయత్నం చేశాయి. జెండర్ సెన్సిటివిటీని పెంపొందించే అంశంపై పాఠ్య పుస్తకాన్ని రూపొందించాయి. గ్రామాల పునర్నిర్మాణం దిశగా అడుగులు పట్టణీకరణ మనకు సరికాదన్న విషయం ఏనాడో రుజువయ్యింది. ఆర్థికావసరాలతో పాటు వలసలకు మరో కారణం విద్య. పిల్లల చదువుల కోసం ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు తరలివస్తున్నారు. అక్కడ జీవనోపాధి కష్టమై ఆర్థికంగా చితికిపోయి, తిరిగి కోలుకోలేని స్థితికి చేరుతున్నారు. దీనికి తోడు ప్రైవేటు విద్య ఖర్చు భరించలేని స్థాయికి పెరిగి పోతోంది. ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి ప్రభుత్వ విద్యాసంస్థలు బలోపేతం కావడం, వారి వారి ప్రాంతాల్లోనే అవి అందుబాటులోకి రావడం కొంత ఊరటనిచ్చింది. గ్రామాల్లో వసతుల కల్పన, విద్యావకాశాలను పెంపొందించడంతోపాటు మొత్తంగా గ్రామాల పునర్నిర్మాణంపై దృష్టి కేంద్రీ కరించడం అవసరం. ప్రపంచంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు తగినట్టుగా విద్యావిధా నాన్ని మెరుగుపర్చుకోవాలి. ప్రైవేటు స్కూళ్లలో కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సామర్థ్యం ఎక్కువన్నది ఇప్పటికే రుజువైన సత్యం. మంచి టీచర్లు ఉన్నారు. కానీ, బోధనా పద్ధతులు మాత్రం పాతవే. ఈ విషయంలో మార్పు అత్యవ సరం. ప్రపంచవ్యాప్తంగా అమలులోకి వచ్చిన ఆటో మేషన్‌ను తట్టుకోగలిగే సామర్థ్యాన్ని వీరు అందిపు చ్చుకోవాలి. ఈనాటి విద్యార్థులకు సమాచారాన్ని అందించేది కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాదు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వారికి ఎంతో విజ్ఞా నాన్ని అందిస్తోంది. అందులో చెడు కూడా ఉంటోంది. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కొత్త టెక్నా లజీని పిల్లలు ఉపయోగిస్తారు. అయితే, ఈ విచక్షణా జ్ఞానాన్ని వారికి అందించే పనిని చేయాల్సింది ఉపా «ధ్యాయులే. అలాగే విద్యాభ్యాసంలో మూస విధా నాన్ని విడనాడి, మెదడుకు పదునుపెట్టే కార్యక్రమం విద్యార్థులకు ఇవ్వాలి. ఇప్పటికే íసీబీఎస్సీ విధా నంలో ఆ పద్ధతి ఉంది. విద్యార్థుల్లో విమర్శనాత్మక దృష్టిని పెంచాలి. వారిలో సృజనను పెంపొందించే కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలి. ఒక ప్పుడు చదువూ, ఆటలూ ఒకదానికొకటి ముడిపడి ఉండేవి. ఇప్పుడు కూడా ఆటలున్నాయి. కానీ అవి మొబైల్ ఫోన్లకే పరిమితమవుతున్నాయి. శారీరక వ్యాయమం పూర్తిగా లేకుండా పోయింది. పాఠశాల లన్నీ నడిచేది బహుళ అంతస్తుల భవనాల్లోని ఇరుకు గదుల్లోనే. ఆటస్థలాలున్న పాఠశాలలు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే మనలోని క్రీడాసక్తి ఎంతో ఇట్టే తేలిపోతుంది. పాఠశాల స్థాయిలో వ్యాయామోపాధ్యాయుడిగా ఒక్కరినే నియమి స్తున్నారు. ప్రతి పాఠశాలలో కనీసం ముగ్గురు వ్యాయామ ఉపాధ్యాయులను నియమించడం అవ సరం. ప్రాథమిక స్థాయిలోనే ఆటలపై ఆసక్తిని ప్రోత్సహించలేనప్పుడు ఆసియా క్రీడల్లో పతకాలను ఆశించడం అత్యాశే అవుతుంది. సోషల్ మీడియా విశిష్ట పాత్ర కేరళ వరదల్లో సైన్యం పాత్రనూ, అక్కడి సహాయక చర్యలనూ సామాజిక మాధ్యమాలు విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చాయి. ఎందరో స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహాయకచర్యల్లో పాల్గొనేలా చేశాయి. అలా సాయపడిన వారిలో ఐఐటీ విద్యార్థులూ, ఐటీ ఉద్యోగులూ మొదలుకొని సాధారణ మత్స్యకారుల వరకూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లలు సైతం తమకు తోచిన రీతిలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారిలో సామాజిక సేవాతత్పరతను పెంపొందించింది అక్కడి విద్యావిధానం కావచ్చు. అలాగే ముంబైలో ఓ బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ప్రమాదం నుంచి ఓ పదేళ్ల చిన్నారి ఎంతో మందిని కాపాడింది. ఆ అమ్మాయి అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రాజెక్టుని మనసు పెట్టి చేయడమే కారణం. ప్రాక్టి కల్గా దాన్ని అర్థం చేసుకుంది. సందర్భాన్ని బట్టి తన బుర్రని ఉపయోగించిందా చిన్నారి. దాన్ని సరిగ్గా ఆచరణలో చేసి చూపించింది. ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. ఇలాంటి విద్యావిధానమే నిజంగా ఇప్పుడు మనకు కావాల్సింది. ప్రస్తుతం మనకు కావాల్సింది సంస్కరణల పేరుతో ఇచ్చే నగదు కాదు. భవిష్యత్ తరాల అవసరాల కోసం డబ్బును పెట్టుబడిగా ఖర్చు చేయాలి. విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలి. విద్యార్థులకు అవసరమైన లేబొరేటరీలూ, టాయ్‌లెట్లూ, ఇతర భవనాల నిర్మాణం కోసం డబ్బు వెచ్చించాలి. ఏవో సంస్కరణల పేరుతో నగదు ఇవ్వడం వల్ల దాని దుర్వినియోగం జరుగుతోంది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆ డబ్బు ఖర్చు చేయడం లేదు. ఆయా కుటుంబాల్లోని పురుషుల తాగుడుకే అది చెల్లిపోతోంది. కనుక ప్రజల డబ్బుని వారి భవిష్యత్ అవసరాలను తీర్చే ప్రణాళికల అమలుకోసం పెట్టు బడిగా పెట్టాలి. అటు వైపుగా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. తల్లిదండ్రులపై ప్రైవేటు భారం పడ కుండా కాపాడే విధానాలను రూపొందించాలి. చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, -
ఆ ‘పాదయాత్ర’ అసాధారణం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న పాదయాత్ర ప్రభావం అసాధారణంగా ఉందని ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ శిక్షకుడు చుక్కారామయ్య ప్రశంసించారు. ఇన్నాళ్లు పాదయాత్ర సాగుతున్నా జనం విసుక్కోవడం లేదని అదే దాని ప్రభావానికి నిదర్శనమన్నారు. ప్రధాన ప్రతిపక్షం చాలా బలంగా ఉండటం, బలంగా లేకపోవడమే ఆంధ్ర, తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమైన తేడా అని విశ్లేషించారు. దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో తెలుగు విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో ఆ పరిస్థితిని మార్చాలన్న తలంపే తనను ఐఐటీ శిక్షణ వైపునకు మళ్లించిందని చెప్పారు. పిల్లలకు తాను పాఠాలు చెప్పడం కంటే ఎక్కువగా వారినుంచే నేర్చుకున్నానని, ఇప్పటి పిల్లల ప్రతిభ, చురుకుదనం ముందు రామయ్యలు కూడా సరిపోరంటున్న చుక్కారామయ్య అభిప్రాయం ఆయన మాటల్లోనే... ‘ఐఐటీ రామయ్య’ అనే స్థాయికి ఎలా వచ్చారు? వరంగల్‌లోని మా ఊరు గూడూరులో మా ఇల్లు తప్పితే నాకు మరే ఆస్తీ లేదు. మన అభిప్రాయాలు వ్యక్తం చేయాలంటే ఒక మాధ్యమం అవసరం. విద్యే నాకు ఆ మాధ్యమంగా ఉపయోగపడింది. మీ చదువుకు పునాది ఎవరు? నాన్నకు నన్ను తనలాగే పౌరోహిత్యం చేయించాలని ఉండేది. కానీ అమ్మ మాత్రం ఆ మంత్రాలు వాడు చదవడు. ఆ చదువు వద్దు అని మొండికేసింది. మరి ఎక్కడికి పంపిస్తావు అని ఆయన అడిగితే నమ్మాళ్వారు వద్దకు పంపిస్తానంది. నమ్మాళ్వారు అంటే ప్రభుత్వ బడే లేని మా ఊళ్లో ఒక టీచరు. నమ్మాళ్వారు గారు చాలా గొప్ప టీచరు. పదేళ్లు కూడా రాకముందే మాకు చక్రవడ్డీ లెక్కలు వేయించేవారు. ఎందుకంటే, మా ఊళ్లో అప్పట్లో ఇద్దరు వడ్డీ వ్యాపారులు ఉండేవారు. ఎవరైనా వారి వద్ద అప్పు తీసుకుంటే వాళ్లు వడ్డీ సరిగా లెక్కిస్తున్నారా లేదా అని తేల్చుకోవడానికి జనం మా టీచరు వద్దకు వచ్చేవారు. జనం చూపిన ఆ లెక్కలు ఆయన చేయకుండా మా వద్ద చేయించేవారు. దాంతో మాకు చిన్నప్పుడే బారువడ్డీ అంటే ఏమిటో తెలిసింది. అలా లెక్కలపై మాకు ఆసక్తి పెరిగింది. విద్యకు సామాజిక లక్షణం ఏమిటో ఆయన చూపించారు. ఐఐటీ రామయ్యగా ఎలా మారారు? సామాజిక ఉద్యమాల్లో పాత్ర కారణంగా నన్ను సంవత్సరం పాటు జైల్లో పెట్టినప్పుడు అక్కడ పరిచయమైన ధర్మభిక్షం గారికి సూర్యాపేటలో హాస్టల్ ఉండేది. నేను కూడా అలాంటి హాస్టల్ ఏర్పర్చాలి అనే ఆలోచనతో బోన్గిరిలోనే ఒక హాస్టల్ తెరిచాను. 40 మంది పిల్లలుండేవారు. అప్పుడే ఉర్దూకు బదులు తెలుగు మీడియం రావడంతో చదువుకోవాలని పిల్ల లకు చాలా ఉత్సాహం కలిగింది. అందుకే పరీక్ష రాస్తే 40మందిలో 12 మంది ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. టీచరు మంచోడే కానీ పిల్లలను రాజకీయంగా ప్రభావితం చేస్తున్నాడని నాపై ఆరోపణలు రావడంతో నారాయణపేటకు నన్ను మార్చారు. అక్కడ నాలుగేళ్లు పనిచేశాను. అక్కడే టీచర్స్ యూనియన్‌లో చేరాను. ఆ నెపంమీద నన్ను సికిందరాబాద్ హైస్కూలుకు మార్చారు. అప్పటికి మా తమ్ముడు బాంబే ఐటీఐలో చదువుకుని అహమ్మదాబాద్‌లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఎమ్మెస్సీ చదవాలనే నా ప్రగాఢ వాంఛకు అతడు డబ్బులు సహాయం చేయడంతో స్కూల్ మానేసి ఎమ్మెస్సీలో చేరాను. అక్కడ క్లాసులో చెప్పేది నాకు అర్థమయ్యేది కానీ జ్ఞాపకం ఉండేదికాదు. లేటుగా చదవడం వల్ల జ్ఞాపక శక్తి లోపిం చింది. దాంతో నా తోటి విద్యార్థులను మా ఇంట్లో కూర్చోబెట్టి క్లాసులో లెక్చరర్లు చెప్పింది వారికి మళ్లీ చెప్పసాగాను. ఇలా ఒకటికి రెండుసార్లు చెప్పడం వల్ల నాకు పాఠం మొత్తం గుర్తుండిపోయింది. పాఠం చెప్పిన నేనూ గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను. నా పాఠం విన్న వాళ్లూ స్వర్ణపతకాలు తెచ్చుకున్నారు. పూర్తి అవగాహనతోనే ఐఐటీ కోచింగ్ సంస్థ పెట్టారా? ఐఐటీ సబ్జెక్టులు చాలా కష్టం కదా. మొదట్లో తెలిసేది కాదు. అందుకే తొలి సంవత్సరం నేను కోచింగ్ మొదలెట్టిన తొలి సంవత్సరం తొమ్మిదిమందికి శిక్షణ ఇస్తే ఒకరూ పాస్ కాలేదు. దీని అంతు ఏదో తేల్చాలనుకుని ఐఐటీ ప్రశ్నపత్రాలన్నింటినీ తీసి చదివాను. వాటిలో ఉన్న ప్రత్యేకత ఏదంటే ఏ ప్రశ్నను కూడా వారు పాఠ్యపుస్తకంలోంచి సెలెక్ట్ చేయరు. పైగా ఈ సంవత్సరం వచ్చిన ప్రశ్నపత్రం వచ్చే ఏడు రాదు. కాబట్టి ఐఐటీల్లో ఏ పుస్తకాలు చదువుతారో వాటిని మనం చదివితే తప్ప మనకు ప్రయోజనం లేదనుకున్నాం. ఖరగ్‌పూర్ వెళ్లి అక్కడ వారు చదువుతున్న పుస్తకాలు తీసుకొచ్చి సొంతంగా ప్రాక్టీసు చేశాను. రెండు మూడు గంటలు కష్టపడ్డాను. అప్పట్లో ఖరగ్‌పూర్ ఐఐటీలో సబ్జెక్టులన్నింటికీ చాలావరకు రష్యన్ పుస్తకాలను చదివేవారు. వాటిని నేను తీసుకొచ్చి గంటలపాటు కసరత్తు చేస్తూ ఉంటే పిల్లలు మాత్రం నాలుగు స్టెప్‌లలో సమాధానం చెప్పేవారు. నాకంటే పిల్లల్లోనే ఎక్కువ ప్రతిభ కనిపించింది నాకు. ఖరగ్‌పూర్ ఐఐటీ పుస్తకాలను పట్టుకున్న తర్వాతే రెండో ఏడాది నుంచి పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. నావద్ద శిక్షణ తీసుకున్న వారు పాస్ కావడం, ఉద్యోగాలు సాధించడంతో కాస్త పేరొచ్చింది. నా వద్ద శిక్షణ తీసుకున్న పిల్లలు ఉత్తీర్ణులై ముంబై ఐఐటీలో చేరాక, వారి ప్రతిభను చూసి ఎక్కడ చదువుకున్నారు అని లెక్చరర్లు అడగటంతో రామయ్య వద్ద చదువుకున్నానని చెప్పేవారు. దాంతో నేను ఐఐటీ రామయ్యని అయిపోయాను. ఆ గుర్తింపు నాకు ఆ పిల్లలే తీసుకొచ్చారు తప్ప నేను చదువుకుంటే వచ్చింది కాదు. విభజన అనంతర తెలంగాణ ఎలా సాగుతోంది? టెక్నాలజీకి ప్రాధాన్యమిచ్చిన అతిచిన్న దేశాలు సైతం ఇవ్వాళ అభివృద్ధిలో ముందున్నాయి. సింగపూర్, ఫిన్లాండ్, పోలెండ్, దక్షిణ కొరియా ఇవన్నీ చాలా చిన్న దేశాలే అయినా అమెరికా సరసన నిలబడుతున్నాయి. కారణం విద్య మాత్రమే. తెలంగాణలో, మరే రాష్ట్రంలోనైనా సరే.. విద్యకు ప్రాధాన్యత ఇచ్చే నాయకత్వం రావాలి. ప్రభుత్వ ప్రాధాన్యతలు, వాటి ఇబ్బందులు నాకు తెలుసు కానీ విద్యకు ప్రభుత్వాలు తగినంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదనిపిస్తోంది. ఏపీలో, తెలంగాణలో విపక్షం పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. తెలంగాణలో మాత్రం ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ప్రభుత్వాన్ని తట్టుకుని నిలబడేంత బలంగా ప్రతిపక్షం లేదు. తేడా ఇదే. ఏపీలో వైఎస్ జగన్ పాదయాత్ర ప్రభావం ఏమిటి? పాదయాత్రకు అసాధారణ ప్రభావం ఉంది. ఇన్ని నెలలుగా పాదయాత్ర చేస్తుంటే సామాన్యంగా జనం నిరసిస్తారు. కానీ ఆ ప్రభావం కొనసాగుతోంది కాబట్టి పాదయాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. (ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://bit.ly/2MeGq41 https://bit.ly/2w1GKbi -
చుక్కా రామయ్యతో మనసులో మాట
-
చదువంటే ఏబీసీడీలేనా?
సందర్భం మీరు విశ్లేషించాల్సిన, ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం ఏబీసీడీలు పెట్టండి చాలు అనే చందంగా కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. విద్యకు ప్రమాణం గుడ్డిగా ఏబీసీడీలు పెట్టడమా? ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నారు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆయనొక దార్శనికుడు. దేశ భవిష్యత్తుపట్ల దూరదృష్టితో ఆయనీ నినాదం ఇచ్చారు. ఈ దేశ భవిష్యత్తుకు ఇంధనం కచ్చితంగా నేటి బాలలే. అలాంటి అమూల్యమైన సంప దను సామాజిక విలువలు, బాధ్యత కల్గిన పౌరులుగా నైపుణ్యాలతో కూడిన పదునైన ఆయుధాలుగా మలచు కోవాల్సిన ఆవశ్యకత కచ్చితంగా నేటి సమాజానిదే. అందువల్ల విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచి సరి కొత్త ఆలోచనా విధానాన్ని, స్వతహాగా ఆలోచించే దృక్ప థాన్ని పెంపొందించేలా ప్రభుత్వాలు వ్యూహరచనలు చేయాలి. కానీ ఈ రోజు పాఠశాలల పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. పిల్లల్ని ఓ మూసలో పోసినట్టు తయారు చేయడంతో వారు మార్కుల సునామీలో కొట్టుకుపోతున్నారు. ధనార్జనే ధ్యేయంగా కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు పిల్లల్ని మార్కుల యంత్రా లుగా తయారు చేస్తున్నాయి. క్వశ్చన్ బ్యాంకులు, నిత్యం స్టడీ అవర్లతో ఆ చిన్నారులతో మార్కుల జపం చేయి స్తున్నాయి. ఇది దేశ భవిష్యత్తుకు పెను ముప్పు. విద్యార్థి ప్రతిభకు నేడు మార్కులే గీటురాయిగా మారిపోయాయి. ఆలోచనా విధానం, విశ్లేషణాత్మక సామర్థ్యంతో ఏ మాత్రం పని లేకుండా కేవలం మార్కు లకే ప్రాధాన్యం ఇవ్వడంతో విద్యా వ్యవస్థ రోజురోజుకీ సంక్షోభంలోకి కూరుకుపోతోందని చెప్పక తప్పదు. విద్యార్థి ప్రతిభకు ఆలోచనా విధానం, అతడి విశ్లేషణా త్మక సామర్థ్యమే కొలమానం తప్ప మార్కులు కారాదు. దురదృష్టవశాత్తు మన దేశంలో పరిస్థితి అందుకు భిన్నం. అందువల్ల మన పరీక్షల విధానంలోనే మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రోజు ప్రతి పాఠశాలలో వారం కాగానే పరీక్ష. పరీక్షలు పెట్టడం తప్పేం కాదు. కానీ, ఒక పరీక్ష, రెండో పరీక్షకు మధ్య జరగాల్సిన పునశ్చరణ మాత్రం లోపి స్తోంది. వెనకట ఓ పరీక్ష జరిగాక పిల్లల్లో ఏయే లోపాలు ఉన్నాయి? ఏయే పిల్లలు దేనిలో ముందంజలో ఉన్నారు? మిగతావారు దేంట్లో వెనుకబడిపోతున్నారు? అందుకు కారణాలేమిటో విశ్లేషించేవారు. తదనంతర కాలంలో అధ్యయనంలో లోపాల్ని గుర్తించి వాటిని సవ రించేవాళ్లు. కానీ ఈరోజు పరిస్థితి పూర్తి విరుద్ధంగా తయారైంది. పరీక్షలు పెడుతూ వాటి ద్వారానే విద్యలో నాణ్యతా ప్రమాణాలను అంచనా వేస్తున్నారు. ప్రైవేటు యాజమాన్యాలు తమ ఆధిక్యతను చూపించడం కోసం, తల్లిదండ్రులకు జవాబుదారీతనం కోసం పరీక్షల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. పరీక్షలు పెట్టడమే చదువు అనే భ్రమల్ని కల్పిస్తున్నారు. అంతేగాకుండా ప్రతివారం వాటిని మూల్యాంకనం చేసి మార్కుల ఆధారంగా గ్రేడ్లు నిర్ణయిస్తున్నారు. తద్వారా ఈ వారం ఒక విద్యార్థి ఒక సెక్షన్లో ఉంటే వచ్చే వారం అతడికి వచ్చిన గ్రేడ్ ఆధారంగా ఇంకో సెక్షన్లో పడేస్తు న్నారు. వారాంతపు పరీక్షల ఆధారంగానే ర్యాంకులు ఇస్తున్నారు. కాబట్టి పాఠ్య పుస్తకంతో చదువు చెప్పడా నికి బదులుగా క్వశ్చన్ బ్యాంకులు కొనుక్కోమని చెప్పడం పరిపాటిగా మారింది. పరీక్ష పేపర్లు కూడా తక్కువ సమయంలో వాల్యుయేషన్ కావాలని ఆబ్జెక్టివ్ టైప్‌లో పరీక్షలు పెడుతున్నారు. దీంతో పిల్లలు ఆలోచిం చనక్కర్లేదు. ఇచ్చిన ప్రశ్నను విశ్లేషించాల్సిన అవసరం అంతకన్నా లేదు. తమకు తోచిన విధంగా ఏబీసీడీలు పెట్టుకుంటూ పోతే ఎన్నో కొన్ని మార్కులు వస్తాయిలే అనుకొనే అవకాశమూ లేకపోలేదు. చదువంటే ఏబీసీ డీలు పెట్టడమా? పిల్లలు తమ ఆలోచనను స్వతహాగా వ్యక్తపరిచే సంప్రదాయాన్నే పూర్తిగా నిరాకరిస్తున్నారు. మీరు విశ్లేషించాల్సిన అవసరం లేదు. ఆలోచించా ల్సిన పరిస్థితి అంతకన్నా లేదు. కేవలం ఏబీసీడీలు పెట్టండి చాలు అనే చందంగా వారిని ప్రోత్సహిస్తుంటే ఎలాంటి వాతావరణం నెలకొంటుందో ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా విద్యార్థి ప్రతిభకు అద్దంపట్టేది అతడి విశ్లేషణాత్మక నైపుణ్య ధోరణి. కానీ, దాన్ని పక్కనబెట్టి సమయాభావం, ఇంకా ఇతర సమ స్యల కారణంగా పెద్ద పెద్ద పరీక్షలకు సైతం ఆబ్జెక్టివ్ టైప్ లోనే పరీక్షలు నిర్వహిస్తే పరిస్థితి గందరగోళంగా తయా రయ్యే అవకాశం ఉంది. పిల్లవాడు చదివిన దాన్ని అర్థం చేసుకొని పరీక్షలో జవాబులు రాయడానికి బదులుగా నేరుగా వెళ్లి ఏబీసీడీలు పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి వస్తోన్న పోకడల్ని చూస్తున్నాం. ఈ రోజు ఆలోచన పోయింది. రాత పోయింది. చదవడం పోయింది. కేవలం ఏబీసీడీలు రాయడం మాత్రమే పెరిగింది. అంటే పిల్లవాడికి ప్రశ్నపత్రం ఇవ్వగానే దాంట్లో ఏబీసీడీలు పెడదామనే ఆలోచిస్తాడు. అన్నీ ‘బి’లు పెట్టినా ఏ పది మార్కులో రావచ్చను కుంటున్నాడు. అయితే, ఈ ‘బి’ ఆలోచనతో పెట్టినవి కాదు. అందువల్ల ఇలాంటి పద్ధతుల ద్వారా విద్యార్థు లకు వచ్చిన మార్కులు అతడి ప్రతిభకు దక్కిన మార్కులు అని అంచనాకు రావడం సబబు కాదు. విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించే పద్ధతులను అవలం భించడం ద్వారా, నాణ్యమైన బోధనలతో విద్యార్థుల్లో బలహీనతల్ని రూపుమాపాలి తప్ప, వారి బలహీనత లతో ధనం సంపాదించడం సరైంది కాదు. ఈ డిజిటల్ యుగంలో కొత్త నైపుణ్యాలు కల్గిన మానవ సంపదను దేశానికి అందించడమే లక్ష్యంగా అంతా ముందుకెళదాం. - చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు -
సమత్వమే ’గురుకుల’ పునాది
అభిప్రాయం సామాజిక, ఆర్థిక అంతరాలున్నంత వరకూ విద్యార్జనలో అనేక అంతరాలు కొనసాగుతూనే ఉంటాయి. సర్కారీ స్కూళ్ళను గురుకులాలతో సమాంతరంగా పటిష్టం చేసే చర్యలు తీసుకుంటే విద్యా వ్యవస్థలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాలు సామాన్య ప్రజల, అణగారిన వర్గాల అభివృద్ధికి సంపూర్ణ సంక్షేమం అందించాలని ఆకాంక్ష. అందులో భాగంగానే ఇటు తెలంగాణలోనూ, అటు ఏపీలోనూ ప్రభుత్వాలు రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని తీసుకొచ్చాయి. అయితే కేవలం విద్యాలయాలు ఏర్పాటు చేయగానే ప్రజలకు సంక్షేమం పరిగెత్తుకు రాదనీ, దానితో పాటు సామాజిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఫలితాలు అందకుండా ఉండేందుకు చాలా అడ్డంకులు ఉంటాయనీ ప్రభుత్వాలు గుర్తించాయి. కనుకనే ఈ అవరోధాలు అధిగమించే సదుద్దేశంతో గురుకుల విద్యాసంస్థల వ్యవస్థ ముందుకు తేవడం అనేది ఆయా వర్గాలకు విద్యాసంబంధిత సంక్షేమ కార్యక్రమాలకు ఊతమిచ్చింది. కేవలం అణగారిన వర్గాలకు చదువు చెప్పడమే కాదు. ఆ చెప్పిన చదువు వారి జీవితాలను మార్చాలనే సంకల్పంతో ఈనాడు అనేక పథకాలను ప్రవేశ పెట్టడం కూడా జరిగింది. కానీ టెక్నాలజీని వారికి అందేలా చేయడం ఒక చాలెంజ్‌గా తయారయ్యింది. టెక్నాలజీ మార్కెట్ శక్తుల చేతుల్లో బందీ అయి వుంది. కాబట్టి సంక్షేమ లబ్ధిదారులకే కాకుండా ప్రతిభ పేరుతోనైనా మార్జినల్ సెక్షన్స్‌కి ఈ అవకాశాలు అందుబాటులోనికి వస్తాయో రావోననే అనుమానం కూడా వున్నది. కాబట్టి అణగారిన వర్గాల్లో ప్రతిభను వెలికితీసి, దానికి సాంకేతికతను జోడించి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పేద, అణగారిన వర్గాల విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా గురుకులాలను బలోపేతం చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వ విధానాన్ని నేను అభినందిస్తున్నాను. సమత్వమూ, ప్రతిభ.. రెండింటికీ మధ్య సంబంధం ఉన్నది. సమానత్వ భావనని పక్కన పెట్టి ప్రతిభను కొలవలేం. సమానత్వం లేకుండా ప్రతి భకు అర్థం లేదు. సమానత్వం లేకుండా పేద, అణగారిన వర్గాల ప్రతిభను వెలికితీయలేం. ఎవరైతే సమాజంలో అణచివేతకూ, అన్యాయానికీ గురవుతున్నారో ఆయా వర్గాల వారికి టెక్నాలజీ అనే ఖరీదైన వ్యవహారం అందుబాటులోనికి రాదు. కాబట్టి రెసిడెన్షియల్ వ్యవస్థను పటిష్టం చేయాలంటే బయట ఉన్న విద్యావ్యవస్థను కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలి. గురుకుల వ్యవస్థలో విద్యార్థులు సర్కారీ స్కూళ్ళ నుంచి వచ్చిన వారే. ఆ సర్కారీ స్కూళ్ళ నుంచి కనీసం గురుకులాలను అందుకోగలగాలంటే కూడా వారికి కనీసం ప్రాథమిక పునాది గట్టిగా ఉండాలి. ఆ వ్యవస్థలో సమర్థులైన ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ విద్యాబోధనలో సమత్వం లేదు. కాబట్టి ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే గురుకులాలను పటిష్టం చేస్తున్నదో, ఇంకా ఇంకా చేయాలనుకుంటున్నదో దానికి అనుబంధంగా సర్కారీ స్కూళ్లలో కూడా టీచింగ్ అండ్ లెర్నింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలి. విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించి, విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకునేందుకు లెర్నింగ్ ఎఫెక్టివ్‌గా చేయగలిగితే ఆశించిన ఫలితాలొస్తాయి. సమాజంలో సామాజిక, ఆర్థిక అంతరాలున్నంత వరకూ ఈ విద్యార్జనలోనూ, విషయసంగ్రహంలోనూ అనేక అంతరాలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే ఉన్నత విద్యాభ్యాసం చేస్తోన్న అణగారిన, దళిత, ఆది వాసీ బలహీన వర్గాల పిల్లలకు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక శిక్షణనివ్వాలని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయి. అదేవిధంగా కొంత ప్రత్యేక శిక్షణ ద్వారా, కొన్ని మినహాయింపుల ద్వారా ఆయా వర్గాల నుంచి వచ్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనను అందించేందుకు సైతం ప్రత్యేక శిక్షణ అవసరం. దానికోసం ప్రత్యేక ప్రణాళిక కూడా ప్రభుత్వాలకు ఉండాలి. పిల్లల్లో ఉన్న శూన్యతని తొలగించాలి. అయితే ఇది చాలా కష్టతరమైనది మాత్రమే కాకుండా తక్షణ ఫలితాలనివ్వకపోవచ్చు. ఈ ప్రక్రియని సుదీర్ఘకాలం అమలు చేస్తే దీర్ఘకాలంలోనైనా ఇది అణగారిన వర్గాల పిల్లలకు మెరుగైన విద్యను తద్వారా ఉన్నతమైన జీవితాలను సుసాధ్యం చేయగలుగుతుంది. కేవలం బోధన ద్వారానో, లేదా వారికి విషయగ్రహణలో ఎదురౌతోన్న సమస్యలను అధిగమించేందుకు ఇచ్చే మనోబలం ద్వారా మాత్రమే ఇది సాధ్యం కాదు. ఆయా వర్గాల ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో సైతం ఎప్పటికప్పుడు మార్పులను అంచనావేసి మెరుగైన ప్రమాణాల కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అభివృద్ధి చెందుతోన్న సాంకేతికతను వారు అందిపుచ్చుకునే ప్రత్యేక శిక్షణలు మిగిలిన సమాజానికి వారిని దూరం కాకుండా చూస్తాయి. వివిధ ఉపాధి అవకాశాలను సైతం వారు కోల్పోకుండా చూస్తాయి. కాబట్టి సర్కారీ స్కూళ్ళను గురుకులాలతో సమాంతరంగా పటిష్టం చేసే చర్యలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు వస్తాయి. వారి ప్రగతికి పాఠశాల విద్య ఒక బలమైన పునాదిగా మారుతుంది. సర్కారీ స్కూళ్ళను మెరుగుపర్చకుండా, సమర్థులైన ఉపాధ్యాయవ్యవస్థను సద్విని యోగం చేసుకోకుండా మార్పు రాదు. రాష్ట్రం ఎదుర్కొం టోన్న ఎన్నో సమస్యలను ముఖ్యమంత్రి కేసిఆర్‌గారు వజ్రసంకల్పంతో పరిష్కరిస్తున్నప్పుడు ఈ విషయంలో కూడా జాగ్రత్త వహిస్తే ఈ స్వప్నం సంపూర్ణం అవుతుం దని నా అభిలాష. - చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు -
చర్చలు రగిలించిన మానవతామూర్తి
నివాళి సాగర్‌లో రెసిడెన్షియల్ వ్యవస్థ అంత గొప్పగా ఉండటానికి కారణం వై.వి. రెడ్డి లాంటి ప్రిన్సిపాళ్లు ఉండటమే. ఒక విద్యాసంస్థను తీర్చిదిద్దడంలో సఫలీకృతులయ్యారు. ఉపదేశాలకు బదులు విద్యార్థుల్లో ఆలోచనలు రేపే చర్చలు రగిలించేవారు. ప్రతి ప్రిన్సిపాల్ తనకన్నా ముందున్న ప్రిన్సిపాళ్లను పిల్లలు విమర్శిస్తే సంతోషపడతారు. దాని వలన తన గౌరవం పెరుగుతుంది అనుకుంటారు. కానీ వై.వి రెడ్డి (వై. వెంకటరెడ్డి) తనకన్నా ముందున్న ప్రిన్సిపాళ్లను పొగిడితే సంతోషపడతాడు. ఈనాడు తన కుర్చీని పటిష్టంగా చేసింది వారే కదా అంటాడు. తన కన్న ముందున్న ప్రిన్సిపాళ్లను ఎంతో గౌరవంగా చూసేవాడు. ఆయనను నేను ప్రిన్సిపాల్‌గా, పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా చూశాను. తనతో ఏకీభవించనివాళ్లను వాళ్లముందే విమర్శిస్తాడు. కానీ వారు లేనప్పుడు వారి మంచితనాన్ని పొగుడుతాడు. ఇది చాలామందిలో ఉండదు. మానవత్వానికి ప్రతీక ఆయన. ఆయనే నాగార్జున సాగర్ ఎ.పి.రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీకి నా తర్వాత వచ్చిన ప్రిన్సిపాల్. అలాంటి మనిషి విద్యార్థులకే కాదు, నాలాంటి వారికి కూడా ఆదర్శనీయం. చనిపోయిన తర్వాత వచ్చే కీర్తి అది శాశ్వత కీర్తి. బతికున్నప్పుడు వచ్చే కీర్తి నీళ్ల మీద రాతలే. కొందరు వ్యక్తులు ఎక్కడికి వెళ్లినా ఏ ప్రాంతానికి వెళ్లినా, తమ పనిద్వారా, నడవడిక ద్వారా ప్రత్యేకముద్ర వేస్తారు. తరగతి గది అంటే అది సిలబస్‌కు, పరీక్షలు నిర్వహించటానికి మాత్రమే కేంద్రం కాదు. తరగతి గదిని పరీక్షలతో పాటుగా భవిష్యత్ సమాజంలో విద్యార్ధులు జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలకు కూడా సన్నద్ధం చేస్తారు. వై.వి. రెడ్డి నల్గొండ ఎన్.జి. కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నాకు సహ అధ్యాపకుడు. ఆయన ప్రతిరోజు దేశంలో, ప్రపంచంలో పత్రికల్లో వచ్చే వార్తలను విశ్లేషించి చెప్పేవాడు. వార్తల రూపం వెనుక ఏం జరిగి ఉంటుందని విశ్లేషించి చెప్పేవాడు. పలానా దేశంలో పరిస్థితులు ఏమిటి? అక్కడ ప్రజల చైతన్యస్థాయి ఏమిటి? ప్రజలు ఇలాంటి సమస్యలపై ఏ రకంగా ప్రతిస్పందిస్తారు అన్న అంశాలను నల్గొండ స్టాఫ్ రూమ్‌లో కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు మా మదిలో ఎప్పటికీ గుర్తుకు వస్తుంటాయి. వై.వి. రెడ్డి ప్రతిరోజు విద్యార్థుల అసెంబ్లీలో మాట్లాడే మాటల విశ్లేషణలు విన్నాను. విద్యార్థులకు ఆయన హితోపదేశాలు చేసేవాడు కాదు. విద్యార్థులు ఆలోచించుకోవటానికి అనుగుణమైన చర్చను మాత్రం వారిలో రగిలించేవాడు. సమస్యలకు పరిష్కారం చెప్పేవాడుకాదు. కానీ పిల్లలను పాత్రధారులను చేసేవారు. దాని వల్ల ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఈనాడు సైంటిస్టులుగా, పాలనా రంగంలో, వివిధ వృత్తుల్లో ఉన్నతమైన దశలో ఉన్నారు. ఏ సమస్యకైనా, ఏ సవాళ్లకైనా పరిష్కారాలు చెప్పే పాలనాదక్షులయ్యారు. అలా ఒక విద్యాసంస్థను తీర్చిదిద్దడంలో వై.వి. రెడ్డి సఫలీకృతులయ్యారు. ప్రిన్సిపాలే పరిష్కారం చెబితే అతని గొప్పతనం మాత్రమే బయటపడుతుంది. కానీ అందులో పిల్లలను నిమగ్నం చేస్తే వాళ్లు భవిష్యత్‌ను నిర్ణయిస్తారు. దాంతో భవిష్యత్ నిర్మాణం జరుగుతుంది. వై.వి. రెడ్డి దీర్ఘదృష్టి కలవాడు. కోదాడ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న సమయంలో అక్కడి విద్యార్థులకు.. సమాజానికి కాలేజీకి మధ్య సంబంధం ఎలా ఉంటుందో ఆయన ఆచరణ ద్వారా చెప్పగలిగాడు. నాగార్జునసాగర్‌లో ప్రిన్సిపాల్‌గా ఉండి దేశానికి అవసరమైన పాలనాదక్షులను తయారుచేయటానికి దోహదపడ్డాడు. ఖమ్మంలో ఆయనపైన నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిగా ముద్ర పడింది. ఎమర్జెన్సీ కాలంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. సాగర్‌లో డిగ్రీ చదువులో రెసిడెన్షియల్ వ్యవస్థ అంత గొప్పగా ఉండటానికి కారణం వై.వి. రెడ్డి లాంటి ప్రిన్సిపాళ్లు ఉండటమే. ఒక ప్రిన్సిపాల్‌ను అంచనా వేయాలంటే ఆయన పనిచేసిన కాలేజీలో లక్ష్యం ఏమేరకు చేరుకోగలిగారో అదే గీటురాయిగా చెప్పవచ్చు. పరిశోధన అంటే సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహన ఉండాలి. అంటే ప్రస్తుతం ఉన్న విజ్ఞానం నుంచి పరిశోధనాత్మకమైన దృక్కోణం రావాలి. దానికి కావాల్సింది సబ్జెక్టుపైన అవగాహనే. పరిశోధనాత్మక దృక్కోణం ఉన్న టీచర్లను తీసుకోవాలి. అదే కోణంలో ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీకాలేజీల్లో అధ్యాపకుల నియామకం జరిగింది. అంతకుముందే డిగ్రీ కాలేజీల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారిని తీసుకొన్నారు. ఇలాంటి మనుషులను తీసుకొన్నట్లయితే పరిశోధనకు అవసరమైన విద్యార్థులు తయారవుతారని దూరదృష్టితో ఈ రెసిడెన్షియల్ వ్యవస్థను నిర్మిం చారు. దీన్ని నిర్వహించే ప్రిన్సిపాళ్లకు కూడా ఈ లక్ష్యంవైపుకు తీసుకుపోయే శక్తిసామర్థ్యాలు ఉండాలి. ఆనాటి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ వ్యవస్థ విద్యార్థులను ఆర్ఈసీలకు, పిల్లలను ఐఐటీలకు పంపి సాంకేతిక మానవ సంపదను తయారుచేసేది. అదే విధంగా డిగ్రీల్లో మానవీయశాస్త్రాలు, సైన్స్ సబ్జెక్టులలో రీసెర్చ్ చేసే మనుషులను తయారుచేసింది. ఆ దారిలో సంస్థను ముందుకు నడిపించే దీక్షాదక్షత, శక్తి వై.వి.రెడ్డికి ఉన్నాయి. ఆయనకు సామాజిక చింతన ఉంది. లక్ష్యంకోసం పట్టు వదలకుండా పనిచేసే ధైర్యం ఉంది. పిల్లలను తీర్చిదిద్దగల నైపుణ్యం ఉంది. కొత్తకోణాలను ఆవిష్కరించగల శక్తి వై.వి. రెడ్డికి ఉంది. అలాంటి ప్రిన్సిపాళ్లకోసం సమాజం ఎప్పుడూ ఎదురుచూస్తుంది. వై.వి. రెడ్డి వృత్తికి అంకితమైన మహామనిషి. ఆయనకు అధ్యాపకులందరి తరపున స్మృత్యంజలి ఘటిస్తున్నాను. (నేటి సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట జిల్లా కోదాడలో, రేపు ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా యర్రంవారిపాలెంలో వై.వి. రెడ్డి సంతాపసభ, ఆయనపై ‘నిలువెత్తు పుస్తకం’ పుస్తకావిష్కరణ ఉంటాయి) - చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు -
పోరాట వీరుడి అరెస్టు బాధాకరం
హైదరాబాద్: ఉద్యమాలతో ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం ఒక పోరాట వీరుడిని అరెస్టు చేయడం బాధాకరమని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంద కృష్ణ మాదిగ అరెస్టు రాజకీయ సమస్య కాదని, సామాజిక సమస్యని అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాదిగ మేధావుల వేదిక, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంద కృష్ణ మాదిగను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ రాజకీయ విభేదాలున్నప్పటికీ ఒక పోరాట యో«ధుడిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళితులపై కక్ష కట్టిందని సామాజిక వేత్త ఉ.సాంబశివరావు విమర్శించారు. మనువాదులు, బహుళజాతి కంపెనీలు, భూస్వాముల ప్రయోజనాల కోసమే పాలక వర్గాలు పని చేస్తున్నాయని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ విమర్శించారు. కార్యక్రమంలో ఐఆర్ఎస్ అధికారి భరత్ భూషణ్, ప్రొఫెసర్ ఖాసీం, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, కామల్ల ఐలయ్య, విమలక్క, విశ్వేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
నగదు బదిలీతో బహుపరాక్
తక్కువలో తక్కువ కోటి మంది తెలంగాణ పేద ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యాన్నే తిని బతుకుతున్నట్టు స్పష్టం అవుతోంది. రేపు నగదు బదిలీతో ఏమౌతుంది! ఆ డబ్బుతో సన్న బియ్యం కొనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఆ డబ్బు ఎవరి చేతికొస్తుంది? దానే దానేపే ఖానేవాలే నామ్ లిఖా హువా థా’ ప్రతి బియ్యపు గింజపైన తినేవాడి పేరు రాసి ఉంటుందట. ఆ మాటేమో గానీ, ప్రజా పంపిణీ వ్యవస్థతో సమాజంలో తమ వంటి వారికి ఆకలితో అలమటించవలసిన అవసరం తప్పిందని ఇప్పటిదాకా పేదప్రజలు గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతున్నారు. ముతకవో, సన్నవో ఏవో ఒకరకం తిండిగింజలు రేపటి రోజున రేషన్ షాపులో ఇస్తారన్న భరోసా అది. కానీ అవినీతిలో కూరుకుపోయిన సమాజాన్ని శుద్ధిచేసే సాహసం చేయలేకో, ప్రత్యామ్నాయం ఆలోచించలేకో ప్రభుత్వం రేషన్ బియ్యం స్థానంలో నగదు బదిలీని అమలు చేసే దిశగా అడుగులు వేయడం ఇప్పుడు తెలంగాణ బిడ్డలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, లేదా కరువు కాటకాలలో, తిండి దొరకని పరిస్థితుల్లో ప్రజలకు పాలకులే కనీస ఆహారధాన్యాలను ఉచితంగా పంపిణీ చేసేవారు. తదనంతరం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లోనూ, కరువు పరిస్థితుల్లోనూ ప్రజలు ఆకలి మరణాలకు గురికాకుండా చూసేందుకు పాలకులు బియ్యం తదితర అత్యవసర సరుకులను ప్రజలకు ఉచితంగా ఇచ్చే విధానమూ ఉంది. ఆ తరువాత నక్సల్బరీ ప్రభావంతో వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాలు, విప్లవోద్యమాలు దేశంలో దళిత, ఆదివాసీలపై ఆర్థిక దోపిడీ అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ఇదే వారి అభ్యున్నతికి ఉద్యమాలు తెచ్చింది. పేదరికాన్ని తొలగించే కార్యాచరణకు మార్గం ఏర్పరిచింది. ఇందిర గరీబీ హఠావో నినాదం కూడా అందులో భాగమే. దీని ఫలితమే 1970వ దశకంలో ఇదే ప్రజాపంపిణీ వ్యవస్థ మరలా పేదవాడి ఆకలి తీర్చే కేంద్రమైంది. అప్పటినుంచి 2013 వరకు కేవలం సంక్షేమ పథకం రూపంలో ఉన్న ప్రజా పంపిణీ కార్యక్రమం సుదీర్ఘకాలం పాటు భారత ప్రజలను ఆకలి చావుల నుంచి ఓ మేరకైనా తప్పించ గలిగిందనడంలో సందేహం లేదు. సంక్షేమం పరి«ధిని దాటి, ఈ కార్యక్రమం 2013 ఆహార భద్రత చట్టంతో ప్రజల హక్కుగా మారింది. ప్రజలు ఆకలిదప్పులతో మరణించకుండా ఉండడమే ఈ పథకం లక్ష్యం. మూడు దశల్లో ఈ పథకం అమలు జరిగింది. 1939 నుంచి 1965 వరకు, 1965 నుంచి 1975 వరకు, 1975 నుంచి నేటి వరకు ఈ కార్యక్రమం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇందులో అనేక లొసుగులున్నమాట, అమలులో అవినీతి పేరుకుపోయిన మాట వాస్తవమే. కానీ దశాబ్దాలుగా పేదవాడి ఆకలితీరుస్తున్న ఏకైక పథకం ఇది. దీనితో ప్రధానంగా స్త్రీలు, భావిభారత పౌరులకు కనీస ఆహారం లభిస్తోంది. కేజీ ఒక్క రూపాయి లెక్కన ఒక్కొక్కరికి ఆరు కేజీలు, ఇంట్లో నలుగురుంటే 24 కేజీల బియ్యాన్ని ప్రభుత్వం సబ్సిడీతో రేషన్ ద్వారా అందిస్తోంది. కేవలం మన రాష్ట్రంలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నది 2 కోట్ల 79 లక్షల మంది. అంటే తెలంగాణ జనాభా మూడున్నర కోట్లలో ఇది 80 శాతం. నూటికి 20 శాతం మంది మాత్రమే సొంతంగా బియ్యం కొనుక్కొని తినగలుగుతున్నారని ప్రభుత్వమే తేల్చింది. మిగిలినవాళ్లంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారేనని ప్రభుత్వం అంచనావేసి, వారికి రేషన్ కార్డులు మంజూరు చేసింది. రేషన్ కార్డుల తనిఖీలు నిర్వహించి, వారికి సరిగ్గా సరుకులు అందుతున్నాయా లేదా అని పరిశీలించి, చివరకు నేరుగా లబ్ధిదారులకే రేషన్ బియ్యం తదితరాలు అందేలా, ఆధార్‌తో అనుసం«ధానం చేసి, బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇటువంటి తరుణంలో, ప్రభుత్వం రేషన్ స్థానంలో నగదు బదిలీ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు, హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి ప్రభుత్వం చెబుతున్న కారణాల్లో ఒకటి అవినీతి. మరొక ప్రధానమైన అంశం– లబ్ధిదారులు ఈ బియ్యం వినియోగించుకోకుండా అమ్ముకుంటున్నారని. ప్రజలు వెచ్చిస్తున్న ఒక్క రూపాయి సహా, ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో కలిపి మొత్తం పాతిక రూపాయలకు పైగానే ఒక కిలో బియ్యానికి ఖర్చు అవుతున్నది. కనుక ఎవరో వ్యాపారస్తులకు కాక, ప్రజలకే నేరుగా ఇప్పుడు ఖర్చు చేస్తున్న పాతికరూపాయలకు అదనంగా కొంత కలిపి, మొత్తం 900 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయాలన్నది ప్రభుత్వ యోచన. అలాగే కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో (పుదుచ్చేరి, చండీఘర్, దాద్రానగర్ అండ్ హవేలీ)ఈ నగదు బదిలీ అమలవున్నది. అది సత్ఫలితాలిస్తున్నదనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రభుత్వం పేదల మంచి కోసమే ఆలోచించే ఈ కార్యక్రమానికి పూనుకోవచ్చుగాక. కానీ ఆచరణలో ఇది అత్యంత ప్రమాదాన్ని కొనితెస్తుంది. మధ్యాహ్న భోజనం ఒక్కపూట మినహాయిస్తే మిగిలిన రెండు పూటలూ ఈ రేషన్ బియ్యంపైనే ఆధారపడి పిల్లలు బతుకుతున్నారు. ఈ పథకం మీద ఆధారపడి 60 శాతం మంది ప్రజలు బతుకుతున్నారని ఏ గ్రామాన్ని పరిశీలించినా అర్థం అవుతుంది. పోనీ సగం మందే ఈ పథకం ద్వారా వస్తున్న బియ్యాన్ని ఉపయోగించుకుంటున్నారనుకుందాం. అలా చూసినా తక్కువలో తక్కువ కోటి మంది తెలంగాణ పేద ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యాన్నే తిని బతుకుతున్నట్టు స్పష్టం అవుతోంది. రేపు నగదు బదలీతో ఏమౌతుంది! ఆ డబ్బుతో సన్న బియ్యం కొనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఆ డబ్బు ఎవరి చేతికొస్తుంది? పురుషాధిపత్య సమాజంలో ఎంత మంది స్త్రీలకు ఆర్థికాంశాల్లో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉన్నది? అసలు స్త్రీల చేతికి ఆ డబ్బు వస్తుందా? వచ్చినా నాలుగు తన్నులు తన్ని ఏ తాగుడుకో తగులబెట్టేవారు ఈ బియ్యం అవసరమైన కుటుంబాల్లోని వారే. మహిళలపై హింస పెట్రేగి, వారిని మరిన్ని సమస్యల్లోకి తోసివేసే ప్రమాదం నగదు బదిలీ ప్రక్రియలో ఉండదని హామీ ఇవ్వగలరా? ఓపెన్ మార్కెట్లో బియ్యం ధరలను విపరీతంగా పెంచే ప్రమాదం కూడా ఉంది. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? డిజిటల్ యుగంలో బయోమెట్రిక్ వంటి సాధనాలతో అవినీతిని కొంత మేరకైనా తగ్గించే అవకాశం ఉంది. పటిష్ట ప్రజాపంపిణీ వ్యవస్థ ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. అవినీతిని అరికట్టేందుకు పేదప్రజలపై అస్త్రాలు ప్రయోగించడం కాకుండా బడాబాబుల, వ్యాపారస్తుల మోసాలను అరికట్టడానికి, పథకం దుర్వినియోగాన్ని నిలువరించడానికి ప్రయత్నం చేయాలి. చివరగా ప్రభుత్వమే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇస్తున్న సన్న బియ్యాన్ని రేషన్ బియ్యానికి కూడా వర్తింపజేయాలి. ఇవన్నీ ప్రభుత్వం పరిధిలో ఉన్నవి. ప్రభుత్వం చేయగలిగినవి. చుక్కారామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు -
విషతుల్యమైపోతున్న విద్య
విశ్లేషణ ప్రభుత్వం చేయాల్సిన పనులలో మొదటిది విద్యార్థి వసతి గృహాల క్షాళన. ఇంకా, బోధన, పరీక్షా విధానం, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడం విషయంలో నీరజ కమిటీ నివేదికను అమలు పరచాలి. గతంలో చక్రపాణి కమిటీ చేసిన సిఫారసులను బైటపెట్టి చర్చించాలి. పేపర్ సెట్టింగ్ విధానం మారాలి. ఇంటర్నల్ మార్కులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. పరిపాలనా పరమైన దోషాలను నివారించాలి. తరగతి గది బోధనను శక్తిమంతం చేయాలి. ఇవన్నీ అమలు జరపగలిగితే విద్యార్థుల ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఏ తరగతి గదైనా విద్యార్థులను విద్య గురించి ఆలోచింపచేయాలి. భవిష్యత్తును గురించి భవ్యమైన కలలు కనేటట్టు ప్రేరేపించగలగాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ప్రస్తుతం చాలా తరగతి గదులలో విద్యార్థులు బయటకెళ్లి విషం తాగడం గురించీ, ఉరితాళ్లు పేనుకునే పద్ధతి గురించీ ఆలోచిస్తున్నారు. ఈ అక్టోబర్‌లో మూడు వారాలు గడిచాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలోను ఈ మూడు వారాలలోనే బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థుల సంఖ్య అక్షరాలా యాభై. రోజుకు ఒకరి కంటే ఎక్కువ మంది బడికి బదులు బలవన్మరణాన్ని ఎంచుకున్న సంగతి దాచేస్తే దాగని సత్యం. ఉన్నత పాఠశాలల విద్యార్థులు మొదలుకొని, కాబోయే ఇంజనీర్లు, మెడికోలు కూడా ఇలాంటి ఘోరమైన మార్గాన్ని ఎంచుకున్న వైనాలు మనసున్న ప్రతివారిని కలచివేస్తున్నాయి. మానవత్వం ఉన్న వారందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. అసలు ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచే ఇలాంటి అత్యంత దురదృష్టకర, విషాదకర పరిణామం ఆరంభమైపోయింది. అప్పటి నుంచి చూస్తే దాదాపు వందమంది విద్యార్థులు ఈ వినాశకాలపు విద్యా విధానానికి బలైపోయారు. నిజానికి గడచిన మూడేళ్లుగా ఇదే ధోరణి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనే నారాయణ, చైతన్య కళాశాలల్లో ఆ మూడేళ్లలో మరణించిన వారి సంఖ్య అరవై. 1995–2000 సంవత్సరాల మధ్య 1,400 మంది విద్యార్థులు బలవన్మరణం పాలైనారు. అంటే ఈ ధోరణి ఎంత బలపడుతున్నదో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో నాలుగు రోజుల తేడాలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం, ఆగస్ట్ 17, 2017న అనంతపురంలో ఒక మెడికో ఆత్మహత్య చేసుకోవడం ఈ సమస్య తీవ్రతలో మరో కోణాన్ని వెల్లడిస్తున్నాయి. కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులలో ఇంటర్మీడియెట్ విద్యార్థులే అత్యధికం. కార్పొరేట్ కళాశాలలే ఈ పాపాన్ని ఎలాంటి భీతి లేకుండా మూటగట్టుకుంటున్నాయి. మౌన ప్రేక్షకులమైపోతున్నామా? భావి భారతానికి నిజమైన సంపద పిల్లలు. వారికి చదువును సమాజం వరంగా ఇవ్వాలి. కానీ చదువు చెప్పే తరగతి గదులలో ఎదురవుతున్న ఒత్తిడికి వీరు ఆత్మహత్యలకు పాల్పడడమే వర్తమానకాలపు అతి పెద్ద విషాదం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న విద్యార్థుల బలవన్మరణాల పరంపర చూసి సమాజం ఇంకా మౌనంగా ఉండడం అంతకంటే పెద్ద విషాదం. రెండు రాష్ట్రాలను కుదిపివేస్తున్న ఈ సమస్యకు వెంటనే పరిష్కార మార్గాలను కనుక్కోవాలి. కార్పొరేట్ కళాశాలల్లో పోటీ పరీక్షలకు తయారయ్యేవారు ఆత్మహత్యలకు పాల్పడడం కొత్త కాదు. కానీ ఇంత జరుగుతున్నా ఆ కళాశాలలు ఏ విధంగా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాయో; సమాజం, మేధావులు కూడా వీటికి అలవాటు పడిపోయినట్టు వ్యవహరిస్తున్నారో గమనిస్తే మనసు మరింత వికలమవుతుంది. ప్రతిసారి సంఘటన జరగగానే పత్రికలలో దాని పైన సంపాదకీయాలు, వ్యాసాలు రావడం, చానల్స్‌లో దృశ్యాలు చూపిం చడం, ప్రభుత్వం కమిటీలు వేయడం, మూడునాలుగు రోజులకు ప్రజలు మర్చిపోవడం– ఇదే తంతు. సమస్య పరిష్కారం కోసం నియమించిన సంఘాలు నివేదికలు ఇస్తున్నాయి. కానీ వాటిని బుట్ట దాఖలు చేయడం సర్వసాధారణంగా మారింది. విద్యార్థుల ఆత్మహత్యల వంటి లోతైన సమస్య గురించి కూడా విచారణ సంఘాల పేరుతో నాన్చివేత ధోరణిని ప్రదర్శిం చడం ఏ ప్రభుత్వం విషయంలో అయినా క్షంతవ్యం కాబోదు. ఈ నాన్చివేత, పలాయనవాదం నిజం కాకపోతే ఇలాంటి సమస్య మీద సంఘాలు ఇచ్చిన సిఫారసులను ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు? ఇన్ని వందల మంది చనిపోతున్నా ఏ ఒక్కరినీ ఎందుకు బోనులో నిలబెట్టలేదు? ఇప్పటిౖకైనా సమస్య తీవ్రతను గురించి మనస్సాక్షితో ఆలోచించవలసిందే. విద్యారంగంలో పెరిగిపోతున్న దుష్పరిణామాల గురించి గతంలో నీరజ కమిటీ సమగ్ర నివేదిక ఇచ్చింది. అన్ని విద్యార్థి వసతి గృహాలను ఆ సంఘం స్వయంగా తిరిగి సమగ్ర నివేదికలను అందచేసింది. ఇప్పటికీ ఆ నివేదిక సిఫారసులు అమలుకు నోచుకోలేదు. అదే అమలు జరిగి ఉంటే విద్యార్థి వసతి గృహాల పరిస్థితులు చాలా వరకు మారేవేమో! పుండోదిక్కున ఉందంటే మందో దిక్కున పెట్టే అలవాటు మన వ్యవస్థది. పిల్లలు చదువు ఒత్తిడి వల్ల చనిపోతున్నారా? లేక వసతిగృహాలలో ఉండే వాతావరణానికీ, ఆయా కళాశాలల అసమర్థ నిర్వహణకూ బలవుతున్నారా? ముఖ్యంగా విద్యార్థినుల వసతి గృహాలను ఎలా నిర్వహించాలి? మొత్తంగా విద్యార్థినీ విద్యార్థుల మానసిక ఒత్తిడికి కారణాలేమిటి? మనసారా సాగవలసిన చదువు విద్యార్థిని ఎందుకు అంత దారుణమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నది? రోజుకు ఎన్నిగంటలు చదివిస్తున్నారు? ఒక విద్యార్థికి మానసిక వికాసానికి ఆ వసతి గృహాలలో ఉన్న వాతావరణం సరైనదేనా? నాలుగు గోడల మధ్య రోజుల కొద్దీ ఉండడం వల్ల పిల్లల మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? ఇలా, ఒక్కటి కాదు, ఈ అంశం బుర్రలోకి రాగానే ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ప్రశ్నావళి ఇది. సృజనకు సంకెళ్లు వేకువ నాలుగు గంటల నుంచి రాత్రి పది వరకు అప్పుడే ఎదుగుతున్న విద్యార్థుల మేధస్సుల మీద ర్యాంకులు, మార్కుల జమిలి రంపపు కోత యథేచ్ఛగా సాగుతుంది. ఆ వయసు తీవ్రంగా కాంక్షించే ఆటపాటలు ఉండవు. బయటి ప్రపంచంతో సంబంధం లేదు. ఒక్కొక్కగదిలో ఐదారు నుంచి నుంచి పదిమంది వరకు పిల్లలను కుక్కుతారు. రుచి మాట దేవుడెరుగు! భోజనం పరిశుభ్రత విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోరు. అన్నిటికంటే క్రూరమైనది చదువు ఒత్తిడి. గంటల కొద్ది బట్టీ పట్టించడం పెద్ద శిక్ష. పిల్లల సామర్థ్యం, యోగ్యతలను చూడకుండా అత్యాశతో యాజమాన్యాలు వేల సంఖ్యలో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. బందెల దొడ్డిలో పశువులను పెట్టిన తీరులో వారిని నిర్బంధిస్తారంటే అతిశయోక్తి అనిపించుకోదు. అక్కడ నుంచి నిత్యం ఒత్తిడే. పరీక్షలు దగ్గర పడేసరికి అది పతాకస్థాయికి చేరుకుంటుంది. అది తట్టుకోలేకే పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆ ఒత్తిడి గురించి వింటే చండామార్కుల వారి లీలలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి స్థితిలో చదువు మీదే కాదు, జీవితం మీద సయితం విరక్తి కలగడానికి కావలసిన అన్ని పరిస్థితులు అక్కడ ఉన్నాయని చెబితే తప్పా! హైదరాబాద్‌లోని నారాయణ కళాశాల బాధలు తట్టుకోలేక అదృశ్యమైన సాయి ప్రజ్వల తన లేఖలో చేసిన ఆరోపణలు ఇవే కదా! ‘నారాయణ కాలేజీ పిల్ల లను చదువు పేరుతో చంపుతోంది. పిల్లలను కాపాడండి!’ అంటూ ఆ బాలిక రాసిన లేఖ కనువిప్పు కలిగించాలి. ఈ నరకం విస్తృతి ఎంతో ఆలోచిస్తే గుండె తరుక్కుపోతుంది. ఏపీ విషయమే తీసుకుందాం. అక్కడ మొత్తం 3,500 కళాశాలలు ఉన్నాయి. ఇందులో 525 మాత్రమే ప్రభుత్వ కళాశాలలు. మిగిలినవి దాదాపు కార్పొరేట్ కళాశాలలే. అంటే ఆరేడు లక్షల మంది పిల్లలు నిత్యం ఇలాంటి నరక యాతననే అనుభవిస్తున్నారు. లేదా చూస్తున్నారు. లెక్కలేనన్ని లోపాలు కార్పొరేట్ కళాశాలల్లో వారం రోజులకొకసారి పరీక్షలు నిర్వహిస్తారు. నెలకొకసారి ఆ పరీక్షలు జరపండని కొందరు సూచిస్తున్నారు. ఇది సరైనా పరిష్కారామా? పరీక్షల గురించి ఆలోచించేటప్పుడు తరగతి గదిలోని అన్ని స్థాయిలలోని విద్యార్థులను దృష్టిలో ఉంచుకోవాలి. ఒకదశలో ఇంటర్నల్ మార్కులు కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఇది సమంజసమే. అది చాలా దేశాలలో అమలులో ఉన్నది. కానీ ఇక్కడ ఇంటర్నల్‌లో మార్కులు ఎక్కువగా వేస్తున్నారని ఈ పద్ధతికి స్వస్తి చెప్పారు. పరిపాలనాపరమైన దోషాలు కూడా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. దీనిని అడ్డం పెట్టుకుని ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఎత్తివేయటం ఎంతవరకు సమంజసం? దీనితో విద్యార్థులు తరగతిలో చెప్పే చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంసెట్‌కు వచ్చి క్వశ్చన్ పేపరు చూస్తే 3 గంటలు పేపరుంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థి ఆలోచనకన్నా సమాచారం కనుక్కోవడానికి ప్రశ్నలు రూపొందిస్తున్నారు. అందుకే సమాధానాలను బట్టీ పట్టిస్తున్నారు. లేకపోతే కాపీ విధానానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. పేపర్ సెట్టింగ్‌ను మార్చకుండా ఈ బట్టీ విధానాన్ని తొలగించలేం. ఈ విధానం 40 ఏళ్లుగా ఇదే మూస పద్ధతిలో కొనసాగుతున్నది. కొన్ని దేశాల్లో పేపర్ సెట్టింగ్‌ను ప్రతి ఏడాది సమీక్షించే విధానం ఉంది. దేశ అవసరాలు, విద్యా ప్రమాణాల మధ్య బేరీజు వేసుకుని ఎప్పటికప్పుడు పేపర్ సెట్టింగ్‌ను వారు మార్చుకుంటారు. సమాచారంపైననే పరీక్ష విధానం ఉంటే బట్టీ విధానం కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం ఈ పరీక్షా విధానాన్నే మార్చడానికి ప్రయత్నించాలి. అప్పుడే పిల్లలపై ఒత్తిడి తక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా, వృత్తి పరమైన కోర్సును ఎంచుకునే పద్ధతిలోనే లోపం ఉన్నది. వృత్తి విద్యా కోర్సుకు వెళ్ళాలంటే విద్యార్థికి ఒక పరీక్ష నిర్వహిస్తేనే సరిపోతుందా? ఒక్క టెస్ట్ పాసయితే సరిపోతుందా? అమెరికా, ఇంగ్ల్లండ్, యూరోపియన్ దేశాలలో వైద్య విద్యకు వచ్చే విద్యార్థి దృక్పథానికి నాలుగైదు కొలబద్దలు పెట్టారు. ఫలానా వృత్తిని ఎన్నుకుంటున్నాడంటే దాని వెనుక హేతువు ఏమిటో ఆ విద్యార్థి నుంచే తెలుసుకోవాలి. తల్లిదండ్రులకు ఫీజు కట్టే స్థోమత ఉంది కాబట్టి సదరు వృత్తి విద్యాకోర్సును ఎన్నుకుంటున్నాడా? ఆ విద్యార్థిలో ఆసక్తిని కనుక్కునేందుకు, సామాజిక స్పృహ కనుక్కునేందుకు ఈ అంశాన్ని కూడా ఒక కొలబద్దగా పెట్టుకున్నారు. తరగతి గదిలో ఆ విద్యార్థి అభివ్యక్తి, వ్యక్తీకరణ, ఇంటర్నల్ మార్కులు తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనులలో మొదటిది విద్యార్థి వసతి గృహాల క్షాళన. ఇంకా, బోధన, పరీక్షా విధానం, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడం విషయంలో నీరజ కమిటీ నివేదికను అమలు పరచాలి. గతంలో చక్రపాణి కమిటీ చేసిన సిఫారసులను బైటపెట్టి చర్చించాలి. పేపర్ సెట్టింగ్ విధానం మారాలి. ఇంటర్నల్ మార్కులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. పరిపాలనా పరమైన దోషాలను మొదట నివారించాలి. తరగతి గది బోధనను శక్తిమంతం చేయాలి. ఇవన్నీ సక్రమంగా అమలు జరుపగలిగితే విద్యార్థుల ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించవచ్చు. - చుక్కారామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు -
ఫిన్లాండ్ చెబుతున్న పాఠం
విశ్లేషణ ఈనాడు అన్ని వృత్తులకన్నా ఉపాధ్యాయ వృత్తి పట్ల ప్రజలు ఎక్కువ ఆకర్షితులు కావడం అక్కడ కనిపిస్తున్నది. ఫిన్లాండ్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం తమ దేశభక్తికి నిదర్శనమనుకుంటారు. నేను ప్రతిరోజు ఏదో ఒక స్కూలును సందర్శిస్తూ ఉంటాను. మీరు మాట్లాడే విషయాలు సమంజసంగానే ఉన్నాయి, కానీ పాఠశాలల్లో మీరనుకునే పరిస్థితి లేదు. అధికారులు స్కూలుకు రాగానే రిజల్టు ఎంత? స్కూలుకు ఎన్ని ఎ+ ర్యాంకులు వచ్చాయి? 100% రిజల్టు ఉందా?’ అని అడుగుతున్నారని అక్కడివారు చెబుతూ ఉంటారు. తల్లిదండ్రులు కనపడగానే ‘మా పిల్లలకు మంచి కాలేజీలో సీటురావాలి సార్. నేను డొనేషన్ కట్టలేను. ఏ కాలేజీకి వెళ్లినా డొనేషన్ అడుగుతారు. ఎ+ లేనిది ఫ్రీసీటు రాదు. ఎట్లనన్నా చేసి మా పిల్లలకు ఎ+ వచ్చేటట్లు చూడ’మని అడుగుతున్నారు. ఎ+ ర్యాంక్ పైన అధికారుల వైపునుంచి ఒక రకమైన దృష్టి ఉంటే, తల్లిదండ్రుల వైపునుంచి మరొరకమైన ఆశ కనిపిస్తుంటుంది. ‘మీరేమో కనిపిస్తే ప్రవచనాలు చెబుతారు. పిల్ల లకు విషయ పరిజ్ఞానం కావాలంటారు? ఆలోచనలు రేకెత్తించాలంటారు? సృజనాత్మకమైన ఆలోచనలు ఉండాలని రాస్తారు. కానీ ఆచరణలో మీలాంటి వాళ్లకూ మార్కులు, ర్యాంకులు ప్రధానమనే వారికీ మధ్య మేం నలిగిపోతున్నా’మని ఉపాధ్యాయులంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో చెప్పండని ఉపాధ్యాయులు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులు చెప్పేది నిజమే. మనదేశంలోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మార్కెట్, కార్పొరేట్ శక్తులు విద్యారంగాల్ని ఈ దశకు తీసుకువచ్చాయి. ఒకటి వాస్తవం– 21వ శతాబ్దంలో అద్భుత ప్రయోగాలు జరిగాయి. చిన్న చిన్న దేశాలు ఏర్పడ్డాయి. మలేసియా నుంచి సింగపూర్ విడిపోయింది. వనరులన్నీ మలేషియాలో ఉండేవి కానీ, ఈనాడు ప్రపంచంలో అమెరికాతో సమానంగా సింగపూర్ జీడీపీ ఉంది. అదే మాదిరిగా ఉత్తర కొరియాలో వనరులన్నీ ఉన్నాయి. కానీ కొరియా విడిపోయాక దక్షిణ కొరియా అభివృద్ధి చెందింది. స్వీడన్ ఒకనాడు ప్రపంచానికి గడియారాలిచ్చింది. కానీ, ఫిన్లాండ్ ప్రపంచంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నది. వనరులు లేవని నిరుత్సాహపడలేదు. స్వీడన్‌తో ఫిన్లాండ్ పోటీ పడలేదు. ఇది పోటీల కాలం కాదని, ఇది సహకార యుగమని ఫిన్లాండ్ విద్యా శాఖ మంత్రి స్వీడన్‌కు వెళ్లి అక్కడి విద్యారంగాన్ని పరిశీలించారు. అందరికీ విద్య, విద్యావకాశాలను సమకూర్చటమే స్వీడన్ అభివృద్ధి రహస్యమని కనుక్కున్నారు. కానీ, విద్యా ప్రమాణాలు పెరగటానికి అధిక గంటలు పనిచేసేవారు. పిల్లలకు ఎక్కువగా పరీక్షలు నిర్వహించేవారు. హోంవర్క్‌లు ఎక్కువగా ఇచ్చేవారు. కానీ, ఫిన్లాండ్ దేశం మాత్రం స్వీడన్‌లోని మంచి సంస్కరణలు తీసుకున్నది. పిల్లలపై భారం మాత్రం వేయలేదు. కొత్త ప్రక్రియను అవలంబించారు. వయోజన విద్యపైన ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. పెద్దలు చదివితే చిన్నపిల్లలపై ఆ ప్రభావం పడి రెట్టింపు శ్రద్ధతో చదువుతారని వయోజన విద్యను పటిష్టంగా అమలు జరిపారు. దాని వలన ఉన్నత ప్రమాణాలు గల టీచర్లు దొరికారు. ఈనాడు అన్ని వృత్తులకన్నా ఉపాధ్యాయ వృత్తి పట్ల ప్రజలు ఎక్కువ ఆకర్షితులు కావడం అక్కడ కనిపిస్తున్నది. ఫిన్లాండ్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం తమ దేశభక్తికి నిదర్శనమనుకుంటారు. జీతాలు పెంచటం వల్ల వారు ఉపాధ్యాయ వృత్తిలోకి రాలేదు. ముందుతరం అభివృద్ధి కావాలంటే పౌరుని మొదటి ప్రాధాన్యం ఉపాధ్యా వృత్తి కావాలని అనుకున్నారు. నేను ఫిన్లాండ్ వెళ్లినప్పుడు అక్కడి వారు ఎందుకు ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారో అడిగి తెలుసుకున్నాను. ‘‘దేశాభివృద్ధిలో వచ్చేతరం విద్యార్ధులదే కీలకపాత్ర. కాబట్టి విద్యారంగం చేసే పని భవిష్యత్తు నిర్మాణానికి మెట్టు అవుతుంది’’అన్నారు. కేజీ స్కూల్లో మహిళా టీచర్లు ఉన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ చదివినవారు టీచర్లుగా పనిచేస్తున్నారు. విద్యా ప్రమాణాలు పెరగటానికి అక్కడ ఎంతో కృషి జరి గింది. వయోజనుల ఆదర్శాలు పిల్లల విద్యాప్రమాణాలు పెరగటానికి తోడ్పడినాయి. ఈ విధంగా ఈ చర్యలు అందరికీ ఉన్నత ప్రమాణాలు గల చదువును ఇవ్వగలిగాయి. పెద్దలు చూపిస్తున్న శ్రద్ధ చిన్న పిల్లలకు స్ఫూర్తిని ఇస్తుంది. కొన్ని సంవత్సరాలకే ఉన్నతమైన ప్రమాణాలు తీసుకువచ్చి ఫిన్లాండ్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 10 సంవత్సరాల ఎస్ఎస్సి కోర్సును 9 సంవత్సరాలలో పూర్తి చేశారు. కానీ ప్రమాణాలలో మాత్రం రాజీలేదు. దీనివల్ల వారు ఇతర దేశాలకు ఆదర్శమయ్యారు. ఈనాడు ఫిన్లాండ్ ప్రపంచానికే ఆదర్శమైంది. దక్షిణæకొరియా, సింగపూర్ దేశాలు ఫిన్లాండ్ పద్ధతులను అవలంబించి విద్యారంగంలో ఉన్నతమైన ప్రమాణాలు సాధించుకున్నాయి. అక్కడ ఉపాధ్యాయులు, స్కూళ్ల మధ్య పోటీలేదు. ఒక స్కూలు ఇంకో స్కూలుకు సహకరిస్తుంది. తక్కువ ప్రమాణం గల స్కూళ్లను ప్రమాణాలను సాధించిన ఇతర స్కూళ్లతో సమంగా చేయడమనేది అక్కడ బాధ్యతగా భావిస్తారు. ఈనాడు ప్రపంచపటంలో ఫిన్లాండ్ స్థానం ఎంతో ఉన్నతమైనది. విద్యాప్రమాణాలు పెంచేవి ప్రజల సంకల్పం, ఉపాధ్యాయుల దీక్ష. ఈ ఆశయాలతో మనం చిన్న రాష్ట్రాలను ఏర్పరచుకున్నాం. మనం పాఠశాలల మధ్యన పోటీ కన్నా సహకారంతో విద్యా ప్రమాణాలు పెంచే అవకాశం ఉన్నదని చాలా దేశాల విద్యాయాత్రలు చెబుతున్నాయి. మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా విద్యారంగ ప్రముఖులు, రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల ఫిన్లాండ్లో పర్యటించి వచ్చింది. ఈనాడు విద్యను ఆర్థికరంగానికి శక్తిని ప్రసాదించే స్థాయికి తీసుకురావాల్సి ఉంది. విద్యా ప్రమాణాలు పెంచేది ప్రజలు, ఉపాధ్యాయుల ఉమ్మడి బాధ్యత. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు స్కూళ్లు ఊపిరులు ఇస్తాయి. వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు చుక్కా రామయ్య -
విద్యాహక్కును హరించే విధానం
విద్యార్థులను చదువు అనే ఏకైక మూసలోనుంచి చూడటం మానేయాలి. చదువుతోపాటు వారిలో ఉన్న ఇతర ప్రావీణ్యాలను వెలికి తీసే విద్యా విధానం కావాలి. సమాజానికి అన్ని రకాల అవసరాలు ఉంటాయి. వివిధ రంగాల్లో వారి నైపుణ్యానికి సానబట్టే వ్యవస్థలుండాలి. అతను ఏ విద్యలో ప్రావీణ్యుడో గ్రహించే సామర్థ్యం మన విద్యా విధానంలో ఉండాలి, తీసుకురావాలి. జీడీపీ రేట్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పైన ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి శ్రమ చేసేలా విద్య అందుబాటులో ఉండాలి. మధ్యలోనే చదువు మానేసి వెళుతున్న విద్యార్థుల సంఖ్య లక్షల్లోనేనంటే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇది నిజం. ప్రభుత్వం విద్యా పరిరక్షణకు చేపడుతున్న చర్యలను ఈ సంఖ్య ప్రశ్నార్థకం చేసింది. పేద, బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధి కోసం గణనీయంగా ఏర్పాటు చేస్తోన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలొకపక్క ఆశను రేకెత్తిస్తోంటే మరోవైపు గత పదేళ్లలో కనీసం 50 శాతం కూడా తగ్గని డ్రాపౌట్స్ శాతం ఆందోళనకి గురిచేస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల విడుదలైన సోషియో ఎకనమిక్ సర్వే ఖరారు చేస్తోంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా వివిధ కారణాలతో ఇప్పటికే చదువుకి దూరం అవుతోన్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ప్రభుత్వం తలపెడుతోన్న డిటెన్షన్ విధానం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఏ వర్గాలకోసం ఈ చదువులు... ఇరవయ్యవ శతాబ్దంలో చదువు లక్ష్యం వేరు. ఆ లక్ష్యాన్ని బట్టి అక్కడున్నటువంటి పదాల అర్థం సైతం మారిపోతుంది. ఆరోజుల్లో సమర్థవంతమైన (విధేయత కలిగిన) యంత్రాంగాన్ని సృష్టించడమే లక్ష్యంగా విద్యావిధానం ఉండేది. అది బ్రిటిష్ వారి ఎత్తుగడ. కేవలం వారి వర్గ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే విద్యగరిపేవారు. ఏ వర్గాలైతే ప్రభుత్వానికి విధేయులుగా ఉంటారో వారికే చదువు అందుబాటులో ఉంచడం, ఎవరైతే పాలకులను శంకిస్తారో వారిని దూరంగా, చదువుకి ఆమడ దూరంలో ఉంచడం జరిగేది. ఆనాడు చదువు ఒక ప్రివిలేజ్. కాబట్టి తాము అనుకున్న ప్రమాణాలు రాకపోతే నిర్బంధంగా అదే తరగతిలో కొనసాగించడం పరిపాటి. ఆనాడు విద్య హక్కు కాదు. పాలనావర్గం ప్రజలకిచ్చిన ప్రివిలేజ్‌గా మాత్రమే భావించేవారు. నేను అనుకున్న ప్రయోజనం రాలేదు కనుక నిన్ను నిర్బం ధించే అధికారం, అదే చదువు అర్థం అయ్యేవరకు అదే తరగతిలో ఉంచి కొనసాగించే అధికారం నాకుంది అన్నారు. నిర్బంధించడం(డిటైన్) అని వాడారు. కానీ ఇప్పుడు విద్య మనకొక హక్కుగా సంక్రమించాక సైతం ప్రభుత్వాలు డిటెన్షన్ విధానం అని మాట్లాడటం బాధాకరం. నిజానికి ఇప్పుడు ఓ విద్యార్థికి చదువు రాకపోవడానికి కారణం ఏమిటో? కారకులెవ్వరో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సమాజమా? తల్లిదండ్రులా? ఉపాధ్యాయులా? ప్రభుత్వ వ్యవస్థా? అనేది పరిశీలించాలి. ఎవరు ఓ విద్యార్థి పాస్కాకపోవడానికి కారణం అనేది తేల్చకుండా పిల్లవాణ్ణి దోషిగా నిలిపి అతడిని శిక్షించడం విద్యని హక్కుగా భావిస్తున్న తరుణంలో ఎంతవరకు సమంజసమో అర్థం కావడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో హైస్కూలు స్థాయిలో బాలికల చదువుకి ఎదురవుతున్న ఆటంకాలకి అనేక కారణాలున్నాయి. పిల్లల సంరక్షణా బాధ్యత ఆడపిల్లలను బడికి దూరం చేస్తోందని సోషియో ఎకనమిక్ సర్వే తేల్చింది. అలాగే బతుకుదెరువుకోసం వలసలెళ్లాల్సి రావడం కూడా ఆయా కుటుంబాల్లో బాలబాలికలిద్దరూ బడిమానేయాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నాయని ఈ సర్వే భావించింది. అలాగే అమ్మాయిల్లో శారీరక మార్పుల వల్ల ఏర్పడే అసౌకర్యాలు, ప్రకృతి వైపరీత్యాలు (కరువు తదితరాలు) కూడా డ్రాపౌట్స్కి కారణాలుగా సర్వే భావించింది. ఐసిడిఎస్‌లను 8 గంటలపాటు పనిచేయించడం వల్ల కూలినాలికి వెళ్లే తల్లులు లేనిసమయంలో చిన్న పిల్లల సంరక్షణ బాధ్యత బడి ఈడు పిల్లలపై పడకుండా జాగ్రత్తపడవచ్చని ఈ సర్వే భావించింది. పరీక్షా విధానంలో లోపం లేదా? మన విద్యావ్యవస్థలో పరీక్షా విధానం ఎలా ఉంది? మనం కేవలం సమాచారాన్నే పరీక్షిస్తున్నామా? లేక విద్యార్థి అవగాహనాస్థాయిని పరీక్షిస్తున్నామా? ఏడాదంతా చదివిన చదువుని మూడు గంటల్లో కక్కేయడానికి అతనేమీ మిషన్ కాదు. అలాగే మన పరీక్షలన్నీ అతడి జ్ఞాపక శక్తిని అంచనా వేయడానికే తప్ప, అతని పరిజ్ఞానాన్ని కాదు. కేవలం అతను బట్టీకొట్టిన విషయాలను రాబట్టడానికే ఈ పరీక్షలు సరిపోతున్నాయి. అయితే ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు తారీఖులు, దస్తావేజుల సమాచారాన్నంతా బుర్రలో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మొబైల్ కావచ్చు, ల్యాప్‌టాప్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు. మీట నొక్కితే సమాచారం మీ ముంగిట్లో ఉంటుంది. కానీ విద్యార్థికి విషయం పట్ల అవగాహన అవసరం. ఆ సమస్యని పరిష్కరించే మేధ విద్యార్థికి ఉన్నదా లేదా అనేది పరీక్షించాలి. కావాల్సింది సమాచారం కాదు, వివేచన, వేగవంతమైన ఆలోచనాశక్తి. దాన్ని పరీక్షించే నైపుణ్యం మనకు కావాలి. అటువంటి విధానం కావాలి. అటువైపుగా విద్యావ్యవస్థ పురోగమించాలి. అంతేకానీ అదేతరగతిలో ఉంచి మరింత అగమ్యగోచరంగా తయారు చేయడం కాదు. చదువు ఎందుకు రాదు... కారణాలేమిటి? ఒక విద్యార్థికి విషయం అర్థం కాకపోవడానికి అనేక కారణాలుంటాయి. ఆ విద్యార్థి మానసిక పరిస్థితి, అతని సామాజిక పరిస్థితి, అతని కుటుంబ వ్యవస్థ కారణాలే. అతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ పరిస్థితుల నుంచి వచ్చాడు? అతని కుటుంబ ఆర్థిక, సామాజిక పరిస్థితులేమిటి అనేవి అతని అవగాహనా శక్తి మీద ప్రభావం చూపుతాయి. చిన్నప్పటినుంచి అన్ని సదుపాయాలతో, అన్ని అవకాశాలనూ అందుకుంటూ ఉన్న పిల్లవాడు అయితే అతని అవగాహనా శక్తి కూడా అందుకనుగుణంగా ఉంటుంది. కానీ తినడానికి తిండి లేక, కనీసం పౌష్టికాహారం కూడా లేని స్థితి నుంచి వచ్చే విద్యార్థులు తరగతి గదిలో విషయాలను అర్థం చేసుకునే పరిస్థితికీ మిగిలిన విద్యార్థుల పరిస్థితికీ చాలా తేడా ఉంటుంది. దళిత, ఆదివాసీ సామాజిక వర్గాల నుంచి వచ్చే పిల్లలు, బాలికలు ఇప్పుడిప్పుడే బడిమెట్లను ఎక్కగలుగుతున్నారు. ప్రధానంగా ఈ వర్గాల నుంచి వచ్చేవారు తొలితరం విద్యార్హతనొందిన వారు. వారిని పాఠశాల స్థాయిలోనే డిటెన్షన్ పేరుతో నిలిపివేస్తే వారి విద్యాహక్కుని కాలరాసినట్టే అవుతుందనడంలో సందేహం లేదు. వీరికి యూనివర్సిటీ స్థాయిలో సైతం ప్రత్యేక తరగతులు అవసరమని థోరట్ కమిషన్ లాంటివి సిఫార్సు చేస్తే ఇప్పటికీ అమలు జరుగుతున్న దాఖలాలు లేవు. అటువంటప్పుడు ప్రాథమిక దశలోనే వారిని తరగతి దాటకుండా డిటెయిన్ చేయడం వల్ల వారి ఉపాధి హక్కుని, ప్రధానంగా రిజర్వేషన్లను పొందే పరిస్థితిని సైతం అడ్డుకుంటున్నట్టే అవుతుంది తప్ప మరొకటి కాదు. అవమాన భారంతో బడికే దూరం... తెలుగు పద్యం రానందుకు పదే పదే వేస్తున్న శిక్షను భరించలేక మూడవ తరగతి విద్యార్థి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మనకు తాజా ఉదాహరణ. అంత సున్నితమైన చిన్నారుల మనసెరిగి వారికి మరింత ప్రోత్సాహకంగా విద్యనందించే ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సింది పోయి డిటెయిన్ చేయడం వల్ల ఒరిగేదేముంటుంది? తన తోటి విద్యార్థులంతా పై తరగతులకు వెళ్తుంటే తాను మాత్రం అదే తరగతిలో కొనసాగడం వల్ల అవమానభారంతో అసలు చదువుకే స్వస్తి పలికి బడిమానేసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. లేదంటే పైన చెప్పుకున్న ఘటనలు పునరావృతం అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాలు, బాలికల ఇంటి వాతావరణాన్ని, పరిస్థితులను మెరుగుపర్చకుండా విద్యా వ్యవస్థలో మార్పును ఆశించడం సరి కాదు. సమాజం నిర్లక్ష్యం కారణంగానే చదువు రావడం లేదు తప్ప, విద్యార్థి అందుకు కారణం కానేకాదు. విద్యార్థి చేయని తప్పుకి అతడిని బలిచేయడం సమంజసం కాదు. అతని దారిద్య్రం, తరతరాలుగా వారి కుటుం బాలు చదువుకి దూరంగా ఉండడం, ప్రత్యేక శిక్షణ లేకపోవడం అతని వైఫల్యానికి కారణాలు, దానికితోడు మన విద్యావ్యవస్థ కూడా అందుకు దోహదం చేసేదిగానే ఉంది. విదేశాల్లో డిటెన్షన్ విధానం లేదు.... అన్నింటికీ విదేశాలను ఉదాహరణగా తీసుకునే మనం డిటెన్షన్‌లో మాత్రం మనదైన ప్రత్యేక పరిస్థితిని విదేశీయులు వదిలివెళ్లిన పద్ధతినే మోస్తున్నాం. విదేశాల్లో డిటెన్షన్ విధానాన్ని తొలగించారు. అక్కడ విద్య అంటే ఆలోచనా విధానం అని అంటారు. థింకింగ్ కెపాసిటీని పెంపొందించడానికి అనేక కార్యకలాపాలను ప్రవేశపెట్టి, అన్నింటికీ మార్కులు వేస్తారు. చదువుకి మాత్రమే కాదు. అతని పరిశోధనాశక్తికి, ఆలోచనాశక్తికి మార్కులు ఉంటాయక్కడ. సృజనను వెలికితీయడమే ధ్యేయంగా చదువులుంటాయి. విద్యార్థులను చదువు అనే ఏకైక మూసలోనుంచి చూడటం మానేయాలి. చదువుతోపాటు వారిలో ఉన్న ఇతర ప్రావీణ్యాలను వెలికి తీసే విద్యా విధానం కావాలి. సమాజానికి అన్ని రకాల అవసరాలు ఉంటాయి. వివిధ రంగాల్లో వారి నైపుణ్యానికి సానబట్టే వ్యవస్థలుండాలి. అతను ఏ విద్యలో ప్రావీణ్యుడో గ్రహించే సామర్థ్యం మన విద్యా విధానంలో ఉండాలి. జీడీపీ రేట్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పైన ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి శ్రమ చేసేలా విద్య అందుబాటులో ఉండాలి. అందులో వారికి ప్రత్యేక శిక్షణ అవసరం. సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో ఆ ప్రగతి కనిపిస్తోంది. అదే అందరికీ వర్తింప చేయడానికి కృషి జరగాలి. ప్రత్యామ్నాయాలను శోధిం చాలి. ప్రత్యామ్నాయాలను ఆలోచించడానికి బదులు శిక్షించడం నెగటివ్ థింకింగ్ అవుతుంది. మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం అవకాశాలను పెంచే విషయంపై ఆలోచించాలి. బోధనా పద్ధతులు మార్చాలి. సంపన్న వర్గాల కోసం తయారుచేసిన విద్యా వ్యవస్థకు స్వస్తి పలకాలి. అదే చదువు అందరికీ కుదరదు. తొలితరం విద్యావకాశాలను అందిపుచ్చుకుంటున్న వారికి విద్యా బోధనలో మరింత ప్రత్యేక శ్రద్ధ అవసరం. మార్పు కోసం ఇతర దేశాల్లో కొత్త విధానాలను వెతుకుతున్నారు. ఆఫ్రికా ఖండ దేశాలలో డిటెన్షన్ అనే విధానమే లేదు. బోధనా పద్ధతుల్లో రీసెర్చ్ చేయాలి. సమర్థవంతంగా బోధించండి. ఒక మూసలో ఒదగనప్పుడు ప్రత్యామ్నాయాలను ఆలోచించండి. ప్రతి వ్యక్తిలో దాగివున్న నైపుణ్యాలను వెలికితీయండి. మానసిక వికలాంగులకు, అంధులకు చదువుచెప్పే ప్రత్యేక పద్ధతులు ఉన్నప్పుడు ఈ రోజు వరకు బడిబాటనే ఎరుగని వర్గాల వారికి డిటెన్షన్ విధానం తీరని చేటు చేస్తుందనడంలో సందేహంలేదు. ఈ సాంకేతిక యుగంలో మావనవనరుల నిర్వహణ అనేది చాలా క్లిష్టమైన సమస్య. ఆ దృష్టితో పరిశీలించాలనేది నా మనవి. చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు -
చుక్కలు కలపండి
నేను నా దైవం చుక్కలు కలపండి! చిన్నపిల్లలకు చుక్కలు కలపడం అంటే భలే ఇష్టం ఆ చుక్కల్లో నుంచే ఓ అందమైన బొమ్మ బయటకు వస్తుందిచుక్కా రామయ్య జీవితంలో అలాంటి చుక్కలు కలిపిన సంఘటనలు ఎన్నో! ‘సరస్వతీ నమస్తుభ్యం’ అనుకున్నప్పుడు చుక్కలు కలిపితే అర్థమైంది... దైవం విద్యలో కాదు... ప్రశ్నించే విద్యార్థిలో ఉందని. రిటైర్మెంట్ తర్వాత అయోమయపు చుక్కలను బాసరలో కలిపితే... కొత్త జీవితం కనపడింది.చుక్కలు స్వయం ప్రకాశకాలు. అలాంటి స్టూడెంట్స్‌కి దారి కలిపిస్తే అదే దైవత్వం. ఒక లక్ష్యం చేరాలంటే.. ముందు లక్ష్యం కనపడాలి. ఆ లక్ష్యం కనపడాలంటే.. మీరూ ఆ చుక్కలను కలపాలి. లెక్కల్లో ఫార్ములాలతో కుస్తీ పట్టిన నిత్యవిద్యార్థి చుక్కా రామయ్య దైవం ఫార్ములాని ఎలా అర్థం చేసుకున్నారు. తొంభై ఏళ్ల వయసు అనుభవాలలో దైవాన్ని ఎలా దర్శించారు.. తెలుసుకోవడానికి హైదరాబాద్ నల్లకుంటలోని ఆయన నివాసానికి వెళ్లినప్పుడు వేల పుస్తకాల మధ్య ఇలా రుషిలా కనిపించారు. సర్, పుస్తకాల్లోనే దైవాన్ని చూస్తుంటారా? (నవ్వుతూ) పుస్తకాల్లో గతం ఉంటుందమ్మా! (ఇంటి లైబ్రరీలోని పుస్తకాలు చూపుతూ) ఇక్కడి చాలా పుస్తకాల్లో ఎన్నో మ్యాథమేటిక్స్‌కు సంబంధించిన ఫార్ములాలు ఉంటాయి. నా దైవం విద్యార్థే! గురువు దైవంతో సమానం. మీరు గురువు.. అలాంటిది విద్యార్థి దైవం అంటున్నారు?! నా వరకు విద్యార్థియే దైవం. వేల మంది విద్యార్థులు వేసే ఎన్నో ప్రశ్నల ద్వారా నన్ను నేను కొత్తగా నిర్మించుకున్నాను. వారితో పరిచయం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. నాకు పుస్తకాల జ్ఞానం ఉంది. కానీ, విద్యార్థుల్లో బాహ్య జ్ఞానం ఎక్కువ చూశాను. పదిహేనేళ్ల క్రితం అనుకుంటాను. ఒక రోజంతా కష్టపడి ఒక ఫార్ములాకి పది స్టెప్స్‌తో సొల్యూషన్ కనుక్కొని చెప్పాను. ఓ పిల్లవాడు కేవలం నాలుగు స్టెప్స్‌తో ఈ ఫార్ములాకి సొల్యూషన్ వస్తుంది అని చేసి చూపెట్టి ఆశ్చర్యపరిచాడు. మరొక విద్యార్థి... ఆదివారం స్పెషల్ క్లాసుకు రమ్మంటే రానన్నాడు. అతను చెప్పిన కారణం నన్ను అమితంగా ఆలోచింపజేసింది. అతడు చదువుకోవడానికి నాలుగురోజులకు సరిపడా మాత్రమే తిండి ఉంది. ఆ ఆదివారం ఊరెళ్ళి తెచ్చుకుంటే తప్ప మిగతా రోజులు గడవవు. అక్షరాల కోసం తాపత్రయపడే పిల్లల వెనక ఆర్థిక లేమినీ గమనించాను. పుస్తకాల కంటే జీవితం నేర్పే అనుభవాలు గొప్పవి. జీవితం గురించి చెప్పేవాడు, అందులోనూ అన్వేషించి చెప్పేవాడు గొప్పవాడు. అవన్నీ నా విద్యార్థుల్లో చూశాను. మీ విద్యార్థి జీవితంలో దైవం గురించి ఏం తెలుసుకున్నారు? చిన్నప్పుడు అమ్మనాన్న ఎలా చెప్తే అలా చేసేవాళ్ళం. దణ్ణం పెట్టుకో– అంటే పెట్టేవాళ్లం. బొట్టు పెట్టుకో– అంటే పెట్టుకునేవాళ్లం. ఎందుకు? అని అడిగింది లేదు. ఇక బడిలో విద్యార్థిగా విధేయత కలిగి ఉండటమే! అదే ఆనాటి విద్య లక్ష్యం. అప్పుడు టెక్ట్స్బుక్సే సర్వస్వం. తరగతి గదిలో ఎంత నిశ్శబ్ధంగా ఉంటే గురువు అంత బాగా చదువు చెబుతున్నాడని ఆ రోజుల్లో అనుకునేవారు. ఇప్పుడు పిల్లలు ఎంత ప్రశ్నిస్తే ఆ టీచర్ అంత ప్రావీణ్యుడు. ఇదే మంచిది. ప్రశ్నించడం, విశ్లేషించడం లక్ష్యంగా విద్య ఉండాలి. అప్పుడే దైవాన్ని కొత్తగా అర్థం చేసుకుంటాడు. సమాజంలో మీరు చూసిన దైవత్వం? స్వాతంత్య్ర ఉద్యమాలు ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. వాటిలో నేనూ పాల్గొనేవాణ్ణి. స్నేహితులతో కలిసి హరిజన వాడలకు వెళ్లి వీధులు ఊడ్చేవాళ్లం. వాళ్ళ ఇళ్లకు వెళ్లి భోజనాలు చేసేవాళ్లం. వాళ్లు దణ్ణం పెట్టి, ‘మాకు పాపం తగులుతుంది’ అనేవారు. తాము ఎన్ని బాధలను అనుభవిస్తున్నా మాకు మట్టి అంటకూడదన్న వారి తపన నన్ను కదిలించింది. దైవం వారిలోనే ఉందనిపించింది. హరిజనులతో కలుస్తున్నానని మా ఇంటిని కులం నుంచి ఏడాది పాటు బహిష్కరించారు. ఆ సమయంలో మా చెల్లెలు రజస్వల అయింది. ఇరుగుపొరుగు వారు వచ్చి జరపాల్సిన వేడుక అది. బహిష్కరణ కారణంగా ఎవరూ రాలేదు. మా చెల్లెలు వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడనిపించింది.. కొన్ని వేల సంవత్సరాల నుంచి హరిజన కుటుంబాలను సమాజం నుంచి బహిష్కరించి దూరం పెడితే వారెంత వెక్కి వెక్కి ఏడ్చి ఉంటారో అని.. ఆ ఆలోచనకే దుఃఖం వచ్చింది. దైవప్రార్థనలో మీ బాల్యానికి – ఇప్పటికీ వచ్చిన మార్పులు ఎలాంటివి? చిన్నప్పుడు నాకు గోళ్లు కొరికే అలవాటు ఉండేది. చూసినప్పుడల్లా అమ్మ కొట్టేది. గోళ్లు కొరికితే అమ్మ కొడుతుంది అనే భయంతో దానిని ఆపేసేవాడిని. వాళ్లకు వివరించి చెప్పడానికి అసలు విషయం తెలియదు. వాళ్ల పెద్దలు అలా చెప్పారు.. వీళ్లూ దాన్నే అనుసరించేవారు. ఈనాటి తల్లి అలా కాదు. పిల్లాడు గోళ్లు కోరికితే.. గోళ్లలో ఉన్నమురికి జీర్ణాశయంలోకి వెళ్లి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అని చెప్తుంది. దీంతో పిల్లవాడు కన్విన్స్ అవుతున్నాడు. ఆలోచించే దిశకు మార్చబడు తున్నాడు. నా చిన్నప్పటి మరో సంఘటన.. ఒకనాడు బడికెళ్లనని ఎవ్వరికీ తెలియకుండా వడ్లు పోసే గుమ్మిలో కూర్చొన్నాను. మధ్యాహ్నానానికి నన్ను వెతికి పట్టుకున్నారు. నేను బడికెళ్లను అని ఏడుస్తున్నాను. అప్పుడు మా చెల్లి ‘మా అన్న రానని ఏడుస్తున్నాడు. నేనొస్తా నాకు చదువు చెప్పండి’ అంది. ఆ మాట వినగానే మా అమ్మ ‘ఆడపిల్లవి.. నీకు చదువు కావాలా?!’ అంటూ కొట్టింది. దీంతో ఏది అడిగినా దండన ఉంటుంది.. అనే భావన ఉండేది. ఇలాగే దైవం అంటే ఎన్నో సందేహాలు, మూఢవిశ్వాసాలు ఉండేవి. తార్కికంగా ఆలోచించకుండా మూఢంగా ప్రవర్తించేవారు. కానీ, నేడు అలా కాదు. ఆడపిల్ల చదువుకుంటే సమాజంలో ఎంత పురోగతి వస్తుందో వివరించే రోజులు ఇవి. మీరు నిత్యం దైవపూజ చేస్తుంటారా? పూజ అనేది పూర్తిగా వ్యక్తిగతం. దానిని సామాజిక అంశాల మీదకు రానీయవద్దు. ఇప్పటికీ పూజ చేస్తాను. అయితే, అది ఏకాగ్రతకు సంబంధించింది. సబ్జెక్టులో ఏదైనా సమస్య వస్తుంది. అప్పుడు దాని మీదనే దృష్టి నిలుపుతాను. అది క్లియర్ అయ్యేవరకు మరోవైపు నా దృష్టి వెళ్లదు. చిన్నప్పుడు నాకు ఏకాగ్రత అంటే తెలియదు. మా అమ్మ పూజ చేసేటప్పుడు నన్నూ పక్కన కూర్చోమనేది. నేను దిక్కులు చూస్తుంటే ఎదురుగా ఉన్న ఏదో ఒక వస్తువు మీద దృష్టిపెట్టమనేది. దానినే చూస్తూ కొన్ని నిమిషాలు పాటు అలాగే ఉండిపోయేవాడిని. అది ఒక అలవాటుగా మారింది. ఏ సమస్య వచ్చినా దానిని పూర్తి చేయడానికి రకరకాల మార్గాలు వెతుకుతుంటాను. దృష్టి మరో వైపు వెళ్లదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అడిగిన ప్రశ్నకు ఇవ్వాల్సిన సమాధానం దీన్నుంచి దృష్టి మరలదు. అలా దైవ పూజ నాలో ఏకాగ్రతను పెంచింది. దైవాన్ని తలుచుకునేది కష్టంలోనా, ఆనందంలోనా?! కష్టంలోనే తలుచుకుంటాం. 55 ఏళ్ల వయసులో టీచర్‌గా రిటైర్ అయ్యాను. అప్పటికి నా కూతురు, కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నారు. చేతిలో పైసా లేదు. తిండికి కూడా అవస్థపడుతున్న రోజులవి. అప్పుడు అడ్వకేట్ వెంకటరామ ప్రసాద్ అని నా గురువులాంటి వారు ‘బాసర వెళ్లిరా’ అని చెప్పారు. వెళ్లి, వారం రోజులున్నాను. ఏదో శక్తి వచ్చినట్టు అనిపించింది. ఇంటికొచ్చాను. అంతకు ముందే మా అమ్మాయి ఐఐటి కౌన్సెలింగ్ కోసం మద్రాస్ వెళ్లి ఉన్నాను. అక్కడ ఐఐటిలో 400 సీట్లు ఉన్నాయి. వాటిలో తెలుగు పిల్లలు ఉన్నది కేవలం 20 మంది మాత్రమే. మిగతా అంతా తమిళియన్లే. తెలుగువారికి ఐఐటీలో ఎందుకు అవకాశాలు తక్కువ అనే మధనం నాలో ఉండేది. నేను మ్యాథ్స్ టీచర్ని కావడంతో బాసర నుంచి వచ్చాక ఐఐటి విద్య కోసం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. నేనేమీ ఐఐటిలో చదువుకోలేదు. కానీ, కోచింగ్ మొదలుపెట్టాను. బాసరలో ఉండే ఏదో శక్తి నన్నింతవరకు తీసుకువచ్చింది అని నమ్ముతాను. కష్టమే ఎన్నో సమస్యలకు పరిష్కారాలను చూపించింది. ఇందుకో మరో ఉదాహరణ నా జైలు జీవితం. స్వాతంత్రోద్యమ రోజులవి. జైలు జీవితం గడపాల్సి వచ్చింది. జైలుకు మొదటిసారి వెళ్లినప్పుడు నాకు చిత్రమైన అనుభవం ఎదురైంది. జైలులో ఉద్యమకారులు ఉన్నారు. ‘ఏం చదివావు?’ అని అడిగారు. నాకు తెలిసిన మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు చెప్పాను. వాళ్లు అవి కాదు సమాజాన్ని ప్రభావితం చేసే పుస్తకాలు అన్నారు. అవేంటో నాకు తెలియదన్నాను. అప్పుడు వాళ్లు ‘నా చేత డిస్కవరీ ఆఫ్ ఇండియా, లెటర్స్ టు ఇందిరాగాంధీ, మై ఇండియా..’ వంటి పుస్తకాలు ఇచ్చి చదవమన్నారు. అప్పటి వరకు నాణేనికి ఒక వైపే చూసిన నేను సమాజం గురించి అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఒక మనిషి పరిపూర్ణంగా ఎదగాలంటే అతనికి సాంకేతికత, సామాజికత ఈ రెండూ తెలియాలి. బాసర సరస్వతీ దేవి మీకు అపార శక్తిని ఇచ్చిందని నమ్ముతారా? ఇతర దైవ మందిరాలనూ దర్శించుకున్నారా? బాసరలో ఉన్న శక్తికి ఒక పేరుతో పరిమితం చేయలేను. కానీ, ప్రపంచంలో ఏ జిల్లాలో లేనన్ని వనరులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయని గమనించాను. అక్కడున్న పాజిటివ్ ఎనర్జీ సామాన్యమైనది కాదు. కారణాలు ఇవీ అని చెప్పలేను కానీ, ఇతర దేవాలయాలకు పెద్దగా వెళ్లింది లేదు. నిరాశ కలిగినప్పుడు దైవాన్ని తల్చుకున్న సందర్భం? మనలోని శక్తిని గుర్తించకపోతేనే నిరాశ ఆవరిస్తుంది. ఆ శక్తి పేరే దైవం. అందుకే మనల్ని మనం తెలుసుకోవాలి. రిటైర్ అయ్యాక సంపాదన లేక నిరాశలో ఉన్నప్పుడే కదా నేను నా శక్తిని తెలుసుకునే అవకాశం లభించింది. ఇప్పుడు పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని ఈ మధ్య వస్తున్న వార్తల ద్వారా తెలుసుకున్నాను. చాలా బాధ కలిగింది. విద్యార్థి సరైన దారిలో వెళ్లకపోతే అది సమాజానికి చేటు అవుతుంది. ఈ విషయమై కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్తోనూ మాట్లాడాను. ఈ పిల్లలకు సరైన శిక్ష ఉండాలి అన్నారు. నేను కాదన్నాను. పిల్లలకు విలువలు నేర్పాలి. జీవితమ్మీద నిరాశ కలిగినప్పుడు, అన్నీ ఆయాచితంగా అమరినప్పుడు వ్యసనాల పాలిట పడుతుంటారు. వీటి నుంచి పిల్లలను శిక్షణ వైపు మళ్ళించాలి. ప్రశ్నించే గుణాన్ని, చదువు పట్ల ఆసక్తిని పెంచాలి. ఆ పని తల్లిదండ్రులది, గురువులది. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి. అప్పుడు విద్యార్థి ఆలోచన పురోగతివైపుకు మళ్లుతుంది. ఇటీవల మీరు మీ తమ్ముణ్ణి కోల్పోయారు. ఇందుకు దేవుణ్ణి నిందిస్తుంటారా? అనారోగ్యం వల్ల ఎనిమిదేళ్లు మంచంమీదే ఉన్నాడు వెంకటయ్య (తమ్ముడు). ఇస్రోలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. అలై్జమర్స్ వాడికున్న జ్ఞానాన్ని, జ్ఞాపకాలను తుడిచిపెట్టేసింది. తర్వాత వచ్చిన పార్కిన్సన్స్ మంచానికే పరిమితం చేసింది. మరణంతో అన్నేళ్ల అవస్థ నుంచి వాడికి విముక్తి లభించిందనుకున్నాను. నా బాధల్లా ఒక్కటే. మా నాయిన పోయేనాటికి తమ్ముడికి మూడేళ్లు. ఈ చేతులతో ఎత్తుకొని, ఆడించి పెంచాను. వాడి ముందు నేను పోవాల్సింది. కానీ, వాడికి నేను చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాడి జ్ఞాపకాలు నన్ను చుట్టుముడుతుంటాయి. మా ఇద్దరికి పన్నెండేళ్ల వయసు తేడా. ఇద్దరు చెల్లెళ్లు. ఇంట్లో నేనే పెద్దవాడిని అవడంతో కుటుంబ భారం నా మీద పడింది. దరిద్రంలో భాగమవుతున్న కొద్దీ మా బాంధవ్యం కూడా బలపడుతూ వచ్చింది. నేను వేసుకున్న ప్యాంటును కత్తిరించి వాడు వేసుకునేవాడు. ఇంట్లో అందరూ సజ్జ గటక తిని, నా ఒక్కడికే సన్నబియ్యం అన్నం వండి వడ్డించేవారు. అప్పుడు తెలియలేదు. తర్వాత్తర్వాత నా తమ్ముడు, చెల్లెళ్లు నన్ను ఎంత గొప్పగా చూసుకున్నారోనని తెలుస్తూ వచ్చింది. వాడు మంచం పట్టేవరకు కూడా నేను ఫోన్ చేస్తే... కూర్చుని ఉన్న వాడు కాస్తా లేచి నిల్చొని మాట్లాడేవాడట. అక్కడున్నవాళ్లు ఆటపట్టించినా వినేవాడు కాదట... (దుఃఖంతో గొంతు పూడుకుపోయింది) అంత గౌరవం నేనంటే! తమాయించుకొని.. జీవి కణజాలానికి దేవునికి సంబంధం లేదు. కణాల ఆరోగ్యానికి మనం తీసుకునే ఆహారం, వంశపారంపర్యంగా వచ్చే జీన్స్ ఉపకరిస్తాయి. మరో బాధాకరమైన సంఘటన.. పదేళ్ల క్రితం నా భార్య తులసికోట దగ్గర దీపం వెలిగిస్తూ ఆ మంట అంటుకొని, కాలి చనిపోయింది. ఈ సంఘటనలకు ఎవరిన్నీ నిందించలేం. అది విధి, అంతే! – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
‘నా సోదరుడే నా స్ఫూర్తిప్రదాత’
సికింద్రాబాదు నుంచి రైలులో ఔరంగాబాద్ వెళ్లాలంటే రెండు రూపాయలు పెట్టి టిక్కెట్టు కొనాలి. కానీ ఆ తల్లీబిడ్డల దగ్గరున్నది మొత్తం రెండే రూపాయలు. అందుకే ఆ ఒక్క టిక్కెట్టు కొని దానితోనే ముగ్గురూ బిక్కుబిక్కుమంటూ ప్రయాణించారు. ఔరంగాబాద్ జైలులో ఉన్న తెలంగాణ బిడ్డ చుక్కా రామయ్యని చూసేందుకు తల్లి నర్సమ్మ, చెల్లి రామాబాయి, తమ్ముడు వెంకటయ్య సికింద్రాబాదు నుంచి బయలుదేరారు. టిక్కెట్టు లేదన్న భయం కంటే, నిండా 20 యేళ్లు లేని బిడ్డ జైలులో ఎలా ఉన్నాడోనని, ఏం తింటున్నాడోననే ఆందోళనే ఎక్కువ ఆ తల్లికి. ఇదే టిక్కెట్టులేకుండా ప్రయాణించేలా చేసింది. ఔరంగాబాదులో రైలు ఆగగానే ఇద్దరు పిల్లలు పక్కనున్న గూడ్సు రైలు కింద నుంచి దూరి వెనక నుంచి స్టేషన్ బయటకెళ్తే, టిక్కెట్టుతో బయటకొచ్చి బిడ్డలను కలుసుకుంది ఆ తల్లి. తెలంగాణ రైతాంగ పోరాటంతో ఉత్తేజితమై, ఉరకలు వేసిన ఉడుకునెత్తురది. దానితో జైల్లో బందీ అయిన అన్న చుక్కా రామయ్య కోసం టిక్కెట్టు లేకుండా ప్రయాణించిన ఆ ఎనిమిదేళ్ల పిల్లవాడే ఆ తరువాత అంతరిక్షానికి బాటలు వేసే స్పేస్ సెంటర్లో సైంటిస్ట్‌గా ఎదిగాడు. స్వప్నాలను సాకారం చేసుకోవాలంటే ముందుగా ‘కలలు కనాలని’ చెప్పిన అబ్దుల్ కలాంతో కలసి నడిచే స్థాయికి ఎదిగిన ఆ తెలంగాణ బిడ్డ రామయ్యగారి తమ్ముడు చుక్కా వెంకటయ్య. తెలంగాణ రైతాంగ పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న కాలంలో పుట్టి, తెలుగునేల గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగిన వెంకటయ్య గత నెల 28న బెంగళూరులో కన్నుమూశారు. తెలంగాణ బిడ్డలను దేశం గర్వించదగ్గ మనుషులుగా మలిచేం దుకు విద్యే కీలకంగా భావించి, అహరహం శ్రమించిన చుక్కా రామయ్య చెమర్చే కళ్లతో తమ్ముడి జ్ఞాపకాలను ‘సాక్షి’ ప్రతినిధి అత్తలూరి అరుణకు వివరించారు. అన్నదమ్ముల మధ్య 12 ఏళ్లు తేడా ఉంది. రామయ్య ఇంటికి పెద్ద. వెంకటయ్య చిన్నవారు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం, గూడూరులో, నిరుపేద కుటుంబంలో 1940లో పుట్టారు వెంకటయ్య. భువనగిరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనూ, నారాయణ్‌పేట, సుల్తాన్ బజార్ ఉన్నత పాఠశాలల్లోనూ చదువుకున్నారు. తరువాత ముంబై ఐఐటీలో చేరారు. విక్రం సారాభాయి స్పేస్ సెంటర్లో ఫిజికల్ రీసెర్ ల్యాబ్‌లో అవకాశం వచ్చింది. దీనితో బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో చేరారు. పరిశోధన కోసం సోవియట్ యూనియన్‌కు, తరువాత జర్మనీ వెళ్లారు. ‘దగాపడ్డ తెలంగాణలోని, నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి చేరిన వెంకటయ్య నా సోదరుడు కావడం యాదృచ్ఛికమే. తండ్రి మరణానంతరం కుటుంబ బాధ్యతలు మోయా ల్సివచ్చింది. జైలు నుంచి వచ్చాక మా ఆర్థిక పరిస్థితిని చూసి, కమ్యూనిస్టు పార్టీ చదువు కొనసాగించమని సూచించింది. హైదరాబాద్ లోనే కమ్యూనిస్టు నాయకుడు రాజ్‌బహద్దూర్ గౌర్ ఇంట్లో ఉండి బీఎస్సీ పూర్తి చేశాను. వెంటనే కుటుంబ పోషణ కోసం అన్ ట్రైన్డ్ టీచర్‌గా చేరాను. బాధ్యతలు ఎక్కువ, జీతం తక్కువ. నాకొక్కడికే సన్నబియ్యం. అమ్మ నర్సమ్మ, పెద్ద చెల్లెలు రామాబాయి, చిన్న చెల్లె లలిత, తమ్ముడు వెంకటయ్య సజ్జగడక తినేవారు. నాతో ఆకలినీ, దారిద్య్రాన్నీ పంచుకున్న వెంకటయ్య నా ప్యాంట్లు కత్తిరించుకొని నిక్కర్లుగా తొడుక్కునేవాడు. కటిక పేదరికం మమ్మల్ని అతలాకుతలం చేసింది. అందుకే విద్యకీ, ఆకలికీ సంబంధం ఉందంటాను. కడుపు నిండినప్పుడే విద్య గురించి ఆలోచిస్తాడు విద్యార్థి. పేద విద్యార్థి మీద వెచ్చించే ప్రతిపైసా ఈ సమాజాభివృద్ధికి ఉపయోగపడుతుందన్నది నా నమ్మకం. అంత దారిద్య్రంలోనూ ర్యాంక్ సాధించిన వెంకటయ్యను చూసి ఓ తండ్రిలా గర్వపడ్డాను. కానీ ఐఐటీలో చేరేందుకు ఫీజు కట్టడానికి నా దగ్గర పైసా లేదు. నాతోటి ఉపాధ్యాయుడు పూర్వాషాఢగారు తన కుమార్తెలు అశ్లేష, మృగశిరలకు చెప్పి ఫీజు కట్టించారు. వెంకటయ్య ఐఐటీ ద్వారా స్పేస్ ఇంజనీర్‌గా ఎదిగాడు. చదువంటే అమితంగా ఇష్టపడే నా సోదరుడు ఉద్యోగంలో చేరగానే ‘నేను ఇంటి బాధ్యతలు తీసుకుంటాను. నువ్వు ఎమ్మెస్సీ పూర్తి చెయ్యి’ అన్నాడు. నేను వాడిని ఆదుకున్నానా, వాడు నన్ను ఆదుకున్నాడా? అర్థం కాదు’ అంటూ కుటుంబంలో తమ్ముడి పాత్రను గుర్తు చేసుకున్నారు రామయ్య. బెంగళూరులో తెలుగు ప్రొఫెసర్‌గా చేస్తున్న దివాకర్ల వెంకటావధానిగారి రెండవ కూతురు రాజేశ్వరి. ఆమె కూడా ప్రొఫెసరే. మంచి సాహితీవేత్త. కన్నడ, తెలుగు భాషలలో ప్రావీణ్యం కలవారామె. ఆమెను వివాహం చేసుకున్నారు వెంకటయ్య. పిల్లాపాపలతో జీవితం అన్యోన్యంగా సాగింది. కష్టజీవి అయిన వెంకటయ్య మనవలు, మనవరాళ్లతో హాయిగా గడపాల్సిన సమయంలో అల్జీమర్స్ బారిన పడి ఈ బాహ్య ప్రపంచం నుంచి వేరుపడ్డారు. ఆ స్థితిలో కూడా భారత అంతరిక్ష కేంద్రం సాధించిన విజయం వెంకటయ్యను కదిపింది. ‘అల్జీమర్స్ ఎనిమిదేళ్లు నా తమ్ముడిని బాధిం చింది. చివరి నాలుగేళ్లు మంచానికి పరిమితం చేసింది. అతని భార్య రాజేశ్వరి ఉద్యోగాన్ని కూడా వదిలి సేవలు చేశారు. రోజురోజుకీ క్షీణిస్తోన్న అతని ఆరోగ్యం కలచివేస్తున్నా, భర్తే లోకంగా బతికింది. ఈ ఎనిమిదేళ్లలో నేను నెలకోసారైనా వెళ్లి నన్ను గుర్తు కూడా పట్టలేని తమ్ముడిని చూసి వచ్చేవాడిని. నేనొచ్చినట్టూ, వెళ్లినట్టూ కూడా అతనికి తెలియదు. కానీ ఆ మధ్య వెళ్లినప్పుడు భారతదేశం అంతరిక్షంలోనికి 20 ఉపగ్రహాలను ఒకేసారి ప్రవేశపెట్టిందన్న విషయాన్ని అతని ముందు ప్రస్తావించగానే నా తమ్ముడి కళ్ల నుంచి నీళ్లు టపటపా రాలాయి’. ఆపై రామయ్యగారికి మాటలురాలేదు. సజల నయనాలతో ఒకమాట చెప్పారు, ‘వాడు నాకే కాదు, నాలాంటి వారికెందరికో ప్రేరణ’. (నేడు బెంగళూరులో వెంకటయ్య ద్వాదశ దిన కర్మ) -
సామాజిక న్యాయమే బీఎన్ ధ్యేయం
సందర్భం పిడివాదాన్నీ, యథాతథవాద పంథానీ మార్చడం అంత సులభం కాదు. వామపక్ష శిబిరాలలో అయితే ఇది మరింత కష్టం. మార్పుకీ, పురోగతికీ చిరునామాగా చెప్పుకున్న ఆ పార్టీలు కూడా సామాజిక న్యాయం విషయంలో చతికిలబడిన సంగతి దాచేస్తే దాగని నిజం. దీనిని ఆలస్యంగా అయినా గుర్తించి ఇటీవల సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి ‘లాల్–నీల్’నినాదం ఇచ్చారు. కానీ సామాజిక న్యాయం కోసం పార్టీ మీద పోరాడిన వారు గతంలోనే ఉన్నారు. అందుకోసం పార్టీని వీడిన వారు వామపక్ష శిబిరాలలో ఉన్నారు. పోరాటం, సంస్కరణ, సామాజిక న్యాయ దృష్టి సమంగా ఉన్న భీంరెడ్డి నరసింహారెడ్డి (మార్చి 15, 1922–మే 9, 2008) ఇందుకు సాక్షిగా నిలబడతారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో ఆయనది విశిష్ట స్థానం. పోలీసు చర్య తరువాత సాగిన పార్లమెంటరీ రాజకీయాలలో ఆయన నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకం. తెలంగాణ సాయుధ పోరాటం మలిచిన యోధుడు భీంరెడ్డి నరసింహారెడ్డి. బీఎన్రెడ్డిగా చరిత్ర ప్రసిద్ధుడైన నరసింహారెడ్డి జీవితం, పోరాటం కొన్ని తరాలకు పాఠం. దొరతనానికి ఆలవాలమైన గడీలలో పుట్టారాయన. కానీ నిజాం పాలనలో మగ్గిపోతున్న పీడిత, తాడిత జనం విముక్తి కోసం తుపాకీ పట్టారు. దున్నేవానికే భూమి నినాదంతో గ్రామాలలో భూపంపిణీ చేపట్టిన విశాల హృదయుడు. భూస్వాముల మిగులు భూములను పేదలకు పంచిపెట్టే బృహత్తర కార్యక్రమాన్ని చరిత్రలో తొలిసారి చేపట్టిన విప్లవకారునిగా కూడా బీఎన్ సుప్రసిద్ధులు. బీఎన్ కుటుంబంలోనే ఒక సామాజిక దృక్పథం, స్పృహ కనిపిస్తాయి. వారిది సంపన్న రైతు కుటుంబం. అయినా చిన్నారి బీఎన్‌ను కుటుంబంలోని పెద్దలు కష్టజీవులతో కలసిమెలసి ఉండే విధంగా పెంచారు. బీఎన్ బాల్యమంతా వ్యవసాయ క్షేత్రంలోనే గడిచింది. ప్రాథమిక విద్య స్వగ్రామం కర్విరాల కొత్తగూడెం (ఉమ్మడి నల్లగొండ జిల్లా) లోనే ఆరంభమైంది. దృక్పథాన్ని ఇచ్చిన కాలం నిజాం పాలన పట్ల నిరసన పదునెక్కుతున్న కాలంలో బీఎన్ ఎనిమిదో తరగతి చదువుతున్నారు. నిజాం సంస్కృతిని బద్దలుకొట్టి, సామాజిక విప్లవం ద్వారా మొత్తం వ్యవస్థను మార్చాలని, బానిసత్వం నుంచి విముక్తం కావాలని నినదిస్తూ ఆంధ్రమహాసభ ఆవిర్భవించింది. నిజాం వ్యతిరేక శక్తులను ఏకం చేసిన అతి పెద్ద వేదిక ఆంధ్రమహాసభ. ఆ సంస్థ నాయకులు ఇచ్చిన ఉపన్యాసాలు బీఎన్‌ను ఉత్తేజితుడిని చేసేవి. మరొక వంక నిజాం వ్యతిరేక పోరాటంలో కీలకంగా ఉన్న ఆర్య సమాజ్ కార్యకలాపాలకు కూడా ఆయన హాజరయ్యేవారు. ఇలాంటి వాతావరణంలోనే ఆయన తొమ్మిదో తరగతి పూర్తి చేశారు. కానీ అప్పుడే తండ్రి (రామిరెడ్డి, తల్లి చొక్కమ్మ) మరణించడంతో ఇంటి బాధ్యత, సాగు బాధ్యత బీఎన్ భుజాల మీద పడింది. ఉద్యమం, సేద్యం మనసు మీద బలంగా ముద్ర వేసినా, చదువు మీద ఆయనకు మమకారం పోలేదు. పదో తరగతి చదవడానికి హైదరాబాద్ వచ్చారు. రెడ్డి హాస్టల్లో ప్రవేశం కోసం అప్పుడే కొత్వాల్ వెంకటరామారెడ్డిని కూడా కలుసుకున్నారు. ఫలితం లేకపోయింది. అయినా పదో తరగతి చదువు పూర్తి చేసి మళ్లీ స్వగ్రామం చేరుకున్నారు. అప్పుడే తన పొలంలో జరిగిన ఒక సంఘటన ఆయనను పేదరికం గురించి ఆలోచించేటట్టు చేసింది. ఆయన భవిష్యత్ ప్రణాళికను అప్పుడే సిద్ధం చేస్తున్నట్టు గోరంట్ల నుంచి దేవులపల్లి వెంకటేశ్వరరావు రహస్యంగా పంపిన ‘అక్టోబర్ విప్లవం సంచిక’అందింది. ఆయన చదివిన మొదటి కమ్యూనిస్టు పాఠం అందులోదే. ఆ సిద్ధాంతంతో పేదరికం పోతుందని, దోపిడీని నివారించవచ్చునని, అందరికీ తిండి, పని ఉంటాయని చెబుతూ చేసిన విశ్లేషణ బీఎన్‌ను కదిలించింది. దీనికి తోడు ‘పల్లెటూరి పేదలకు...’ అనే పుస్తకం, లెనిన్ రాసినది– మరో కోణం నుంచి ప్రభావితం చేసింది. అప్పుడే వరంగల్‌లో జరిగిన (1942–43) ఆంధ్రమహాసభ బీఎన్ లోని ఆవేశాన్ని ఆచరణ వైపు నడిపించింది. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా పోరాడారు. ఆయన మొట్టమొదటిసారి ‘కోసుకు వీసం’ పోరాటం చేశారు. కోసు దూరం బరువు మోసేవాళ్లకు ఆ రోజుల్లో అణా ఇవ్వాలనే నిబంధన ఉండేది. కానీ దాన్ని చాలామంది పాటించేవాళ్లు కాదు. తమ ఊరు నుంచే కోసుకు వీసం పోరాటాన్ని బీఎన్ ఆరంభించారు. పదకొండవ ఆంధ్రమహాసభ నాటి నుంచి పోరాటాలు ప్రజలను కదిలిం చాయి. అప్పటి వరకు విన్నపాలకు, వినతులకు పరిమితమైన ఆందోళనలను తీవ్రం చేసి రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వంటి కమ్యూనిస్టు యోధులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఐలమ్మ... వెనుక బీఎన్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో బడుగు వర్గాల పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచే ఘట్టం చాకలి ఐలమ్మ తిరుగుబాటు. సాయుధ పోరాట యోధుడు బీఎన్ ఆ తిరుగుబాటులో కీలకంగా నిలిచి ఐలమ్మ పేరు, పోరు ప్రపంచానికి వెల్లడయ్యేందుకు దోహదం చేశారంటే అతిశయోక్తి కాదు. అట్టడుగు వర్గాల ప్రజానీకం నిజాం పాలనలో ఎలాంటి దురవస్థను అనుభవించేవారో చెప్పడానికి ఐలమ్మ జీవితం కొండగుర్తు. ఆమె సాయుధ సమరంలో పాల్గొనలేదు. కానీ గొప్ప పోరాట యోధురాలిగా చరిత్రకెక్కింది. ఆ గొప్పతనం వెనుక బీఎన్ ఉన్నారు. ఆమె భర్తను దొంగగా చిత్రించి, అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసినప్పుడు తన పంటను కాపాడుకోవడం కోసం అనివార్యంగా పోరాటంలోకి వచ్చారు. కష్టపడి పండించుకున్న తిండిగింజలను దొరల గూండాలు తన్నుకుపోయేందుకు సిద్ధమయ్యారు. కల్లంలో ఉన్న వరికుప్పను కాపాడుకోవడం కోసం ఆమె గట్టిగా నిలబడింది. సరిగ్గా ఆ సమయంలో ఐలమ్మ పోరాటానికి మద్దతుగా నిలిచి గూండాలను తరిమికొట్టారు, బీఎన్. సహజంగానే బలాఢ్యుడాయన. ఐలమ్మ సాహసానికి తోడు, బీఎన్‌ను ఎదిరించే ధైర్యం లేక గూండాలు పారిపోయారు. అప్పుడైనా, ఇప్పుడైనా చితికిన రైతుల పక్షాన నిలబడి పోరాటాలు చేసేవాళ్లే గొప్ప వ్యక్తులవుతారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రైతును ఆదుకొనేవాళ్లు లేరు. అప్పుడు భూస్వాముల దాడుల నుంచి రైతును కాపాడే ఉద్యమాలు వచ్చినట్లే ఇప్పుడు గిట్టుబాటు కానీ ధరల మార్కెట్ దాడుల నుంచి రైతులను ఆదుకొనే పోరాటాలు చేపట్టవలసి ఉంది. మార్కెట్ మాయాజాలంలో పడి రైతులు పెద్ద ఎత్తున వేరుశెనగ పండించారు.అది ఎంతో కాలం నిలవలేదు. ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. రైతు దారుణంగా నష్టపోయాడు. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితే. మార్కెట్ మాయాజాలం మిర్చిని ముందుకు తెచ్చింది. అదే పరిస్థితి పునరావృతమవుతూ నాడు ఆవులను మలిపిన అర్జునుడిలా బీఎన్‌రెడ్డి రైతుల కోసం నిలబడి గూండాల దాడులను తిప్పికొట్టాడు. ఇప్పుడు గిట్టుబాటు ధరలు తెచ్చి రైతులను ఆదుకొన్నవాడే అర్జునుడవుతాడు. లాల్‌నీల్ నినాదం ఆనాటిదే.... పోలీసు చర్య తరువాత బీఎన్ నాగారం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1967లో మరోసారి ఎన్నికయ్యారు. మిర్యాలగూడ నుంచి 1971,1984, 1991లలో లోక్‌సభకు ఎన్నికయ్యారు. నిజానికి సీపీఎం ఇప్పుడు చెబుతున్న లాల్ నీల్ నినాదాన్ని ఆంధ్రమహాసభ ఆనాడు భువనగిరి సభలోనే ఎత్తుకుంది. లాల్ అంటే పోరాటం, నీల్ అంటే ఉత్పత్తిదారుడు. పంట పండించే రైతు. ఇప్పుడు వామపక్ష, ప్రజాస్వామిక శక్తులు; దళితులు ఏకం కావడం గురించి లాల్ నీల్ నినాదం ఇచ్చారు. ఇక్కడే ఒక విషయం గుర్తు చేసుకోవాలి. బీఎన్ మహోన్నత వ్యక్తిత్వాన్నీ, సామాజిక న్యాయం పట్ల ఆయనకున్న నిబద్ధతనీ తిరుగులేకుండా అది రుజువు చేస్తుంది. పార్టీ పరిధికి మించి కాలాతీతంగా ఆలోచించగలిగిన ఆయన దృష్టిని వెల్లడిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్లగొండ సీపీఎంకు బలమైన కేంద్రం. 1995 శాసనసభ ఎన్నికల సందర్భంగా సరిగ్గా ఆ జిల్లా పార్టీలోనే చీలిక వచ్చింది. ఆ చీలికకు సామాజిక న్యాయం కేంద్ర బిందువు. తుంగతుర్తి నియోజక వర్గం నుంచి మల్లు స్వరాజ్యం (రెడ్డి)ను నిలపాలని పార్టీ నాయకత్వం అభిప్రాయపడింది. అయితే ఆ స్థానాన్ని వర్ధెల్లి బుచ్చిరాములుకు (గౌడ్)కు కేటాయించాలని బీఎన్ చెప్పారు. ఆ స్థానాన్ని ఎప్పుడూ బీఎన్, స్వరాజ్యం, వీఎన్, కుశలవరెడ్డిల కేనా అని అధిష్ఠానాన్ని నిలదీసినవారు బీఎన్. పార్టీ నాయకత్వం ఆ స్థానం బుచ్చిరాములుకు కేటాయిచింది. కానీ బుచ్చిరాములు ఓడిపోయారు. ఇందుకు స్వరాజ్యం, మల్లు వెంకటనరసింహారెడ్డిలే కారణమంటూ సామాజిక న్యాయ బృందంగా ఉన్న దళత వర్గం సీపీఎం నుంచి చీలిపోయింది. సామాజిక న్యాయం పేరిట 1996లో సీపీఎం–బీఎన్‌గా చీలిక వర్గం కొత్త శిబిరం ఏర్పాటు చేసింది. ఇంత నిబద్ధతను అప్పుడే ఆయనలో జనం చూశారు. 1997లో బీఎన్ అన్ని కులాలను, వర్గాలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి రెండు లక్షల మందితో సభ నిర్వహించారు. మాదిగ దండోరా, మాల మహానాడు, బీసీ సంఘం, తుడుం దెబ్బ, గిరిజన సంఘం, దళిత, గిరిజన బీసీ, మైనారిటీ వర్గాలను ఆయన ఆ వేదిక మీదకు తెచ్చారు. అయితే 2000 సంవత్సరంలోనే సీపీఎం–బీఎన్ వర్గాన్ని ఓంకార్ స్థాపించిన ఎంసీపీఐలో విలీనం చేశారు. బీబీనగర్ నుంచి రామన్నపేట, చిట్యాల, నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా నడికుడి వరకు రైలు మార్గాన్ని సాధించిన ఘనత బీఎన్దే. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రెండోదశ కాలువ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయించిన ఘనత కూడా ఆయన సొంతం. ఈ సందర్భంలో బీఎన్ జీవిత భాగస్వామి సరోజిని గురించి చెప్పకపోతే ఒక లోటే. చిన్ననాడే భర్తను కోల్పోయారు సరోజిని. రావి నారాయణరెడ్డి సలహా మేరకు బీఎన్ ఆమెను వివాహం చేసుకున్నారు. రాజకీయాలు, ఉద్యమాల పట్ల పెద్దగా అవగాహన లేని ఆమె చివరకు నెలల పసికందును చంకను ఉంచుకుని తుపాకీ పట్టారు. అడవులలో ఒక బిడ్డను పొగొట్టుకుని కూడా పోరాటబాటను వీడని ధీరవనిత. బీఎన్ సంస్కర్త. విప్లవకారుడు. తుది ఊపిరి వరకు సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడు. (మే 9వ తేదీ బీఎన్ వర్ధంతి) వ్యాసకర్త: చుక్కా రామయ్య ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు -
ఎస్ఎఫ్ఐ మోడల్ ఎంసెట్ ప్రశ్నపత్రం విడుదల
-
పరీక్షలు విద్యార్థి నుదుటి రాతలు
విశ్లేషణ ప్రశ్నపత్రాలను కఠినంగా ఇవ్వవద్దు–తేలికగా ఉండాలన్న డిమాండ్ వల్ల మన యువతరం దీర్ఘకాలంలో దగా పడుతుందని మరువవద్దు. పబ్లిక్ పరీక్షల్లో విషయ అవగాహన, అనువర్తన (అప్లికేషన్)పై ప్రశ్నలు ఇచ్చినట్లయితే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్సీ బోర్డు ద్వారా నిర్వహించిన పదవ తరగతి భౌతిక శాస్త్రంలో ఇచ్చిన ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నా యని.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రశ్నలు పదవ తరగతి భౌతిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో లేవని అందువల్ల విద్యార్థులకు అన్యాయం జరిగి గ్రేడ్లు తగ్గి పోతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అందువల్ల భౌతిక శాస్త్రం పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల నుంచి వస్తోంది. దీనికి ప్రతిగా ప్రభుత్వం ఈ పేపర్‌కు నాలుగు మార్కులు కలుపుతున్నట్లుగా ప్రకటించింది. సాధారణంగా ఏ ప్రశ్న పత్రాన్నయినా విద్యార్థులు మార్కుల కల్ప వృక్షాలుగా భావిస్తారు. అందులో తప్పులేదు. వారి వయసు, అవగా హన రీత్యా వారిని తప్పుపట్టలేం. అయితే ప్రశ్నపత్రాలను మార్కులు, గ్రేడ్లు చిలికించే అమృత భాండాలుగా చూడలేం. ప్రతి తరగతి పాఠ్య పుస్తకానికి ఒక లక్ష్యం ఉన్నట్లుగానే ప్రశ్నపత్రాలకూ కొన్ని లక్ష్యాలుం టాయి. ఈ ఏడాది భౌతిక శాస్త్ర ప్రశ్నపత్రంలో ఇచ్చిన ప్రశ్నలలో సగం ప్రశ్నలు నేరుగా పాఠ్యపుస్తకం నుంచి రాకపోవడమే ప్రస్తుత కలవరానికి కారణం. సదరు ప్రశ్నలు పాఠ్య పుస్తకంలోని పాఠాలలో వెతికినా కన్పిం చనందున అవి పాఠ్య ప్రణాళిక పరిధిని దాటాయని, అలాంటి ప్రశ్నలకు విద్యార్థులు జవాబులు రాయడం ఎలా అన్న విమర్శలు తలెత్తాయి. సాధారణంగా ప్రశ్నపత్ర రూపకల్పన రెండు విషయాలపై ఆధార పడి ఉంటుంది. ఒకటి ప్రశ్నపత్ర బ్లూ ప్రింట్, రెండవది ప్రశ్నపత్ర లక్ష్యం. ప్రశ్నపత్ర రూపకల్పనకు ఏ ప్రాతిపదికలు పాటించాలన్నది బ్లూ ప్రింట్ నిర్ద్ధేశిస్తుంది. ప్రశ్నపత్రం రూపకల్పనలో సమాచార ఆధారిత ప్రశ్నలు, అవగాహన ప్రశ్నలు, అనువర్తన ప్రశ్నలు అన్న మూడు రకాల ప్రశ్నలు ఇవ్వాలని బ్లూ ప్రింట్ నిర్దేశిస్తుంది. న్యూటన్ గమన సిద్ధాం తాలలో రెండో నియమాన్ని రాయమంటే అది సమాచార ఆధారితప్రశ్న. న్యూటన్ గమన నియమాలు బట్టీపడితే చాలు ఈ ప్రశ్నకు జవాబు రాయవచ్చు. ఇవి జ్ఞాపకంపై ఆధారపడిన ప్రశ్నలు. ఇక రెండో తరహా ప్రశ్నలు విద్యార్థి అవగాహనను పరీక్షించే ప్రశ్నలు. ఇదే న్యూటన్ గమన సిద్ధాంతంపై ప్రశ్నను తుపాకి మీట నొక్కినప్పుడు గుండు వేగంగా దూసుకుపోవడంలో ఉన్న సూత్రం ఏమిటని అడిగితే అది విద్యార్థి అవ గాహనను తెలుసుకునేందుకు రూపొందించిన ప్రశ్నగా పరిగణిస్తాం. అనువర్తన ప్రశ్నలు అత్యంత కీలకమైనవి. అంటే విద్యార్థి చదివి తెలుసుకున్న జ్ఞానం నిత్య జీవితంలో ఎక్కడెక్కడ వినియోగపడుతున్నది పరిశీలన ద్వారా గుర్తించగలిగే సామర్థ్యాన్ని తెలుసుకునే ప్రశ్నలు. ఈ కోవకు చెందిన ప్రశ్నలే విద్యార్థిలో ఆలోచనల మ«థనాన్ని, విశ్లేషణ దృక్ప« థాన్ని, అనువర్తన నైపుణ్యాన్ని పెంచుతాయి. జాతీయ స్థాయి పోటీ పరీ క్షల్లో ఈ తరహా ప్రశ్నలే ఎక్కువ ఉంటాయి. వీటికి జవాబులు టెక్ట్స్ బుక్స్‌లో నేరుగా కన్పించవు. పదవ తరగతి భౌతిక శాస్త్ర ప్రశ్నపత్రంలో సగం ప్రశ్నలు ఈ శ్రేణికి చెందినవి కావడంతో వీటిని ‘అవుట్ ఆఫ్ సిలబస్’ (సిలబస్ పరిధిలో లేనివి) ప్రశ్నలుగా భావిస్తున్నారు. మనకు అప్రియమైనా ఒక నిజాన్ని పరిశీలిద్దాం. పాఠ్యపుస్తకం ఆధారంగా అందులో ఉన్న ప్రశ్నలనే ఇõ¯్త పేపర్ తేలికగా ఉందన్న భావన కలుగుతుంది. విద్యార్థులకు మంచి గ్రేడ్లు వస్తాయి. ఇది తాత్కా లికంగా కలిగే అనుభవం. ఆ తర్వాత ఇంటర్మీడియెట్‌కు వెళ్లిపోతారు. ఆపై జరిగే ప్రవేశ పరీక్షలన్నీ జాతీయ స్థాయిలో లక్షలాదిమంది పోటీ పడేవే. వాటిలో ఒక విషయంపై నేరుగా వచ్చే ప్రశ్నల కంటే విద్యార్థి అవగాహన, అనువర్తన స్థాయిని పరిశీలించే ప్రశ్నలే ఎక్కువ. అప్పటిక ప్పుడు ఆ స్థాయిని అందుకోవడం కష్టం.పదవ తరగతి నుంచే పునాది పడాలి. విద్యా ప్రమాణాల పెంపుదల పరీక్షల నుంచే మొదలవ్వాలి. ఒకప్పుడు ఇక్కడ కాస్త అటు ఇటుగా చదువుకొని, అమెరికా వెళ్లి అక్కడి విశ్వవిద్యాలయాలలో విశ్వ విజయ సూత్రాలు అలవర్చుకొని డాలర్ల పంటలు పండించవచ్చునన్న నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడా డాలర్‌డ్రీమ్స్ చెదిరిపోయాయి. ఇప్పుడు తమ గడ్డ మీదకు వచ్చి ప్రతి భను మెరుగుపరచుకోవాలనుకునే వారు తమకు అక్కర లేదని, తమ దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించక ముందే ప్రతిభావంతులైతేనే అవకాశం అని అమెరికా అధ్యక్షుడే హెచ్చరిసున్నారు. మరోప్రక్క మనం సేవా రంగంపై అతిగా ఆధారపడటం తగ్గించి తయారీ రంగం వైపు దృష్టి పెట్టాలన్నది ప్రభుత్వ విధానం. తయారీ యుగంలో నైపుణ్యాలు సంత రించుకొని రాణించాలంటే సృజనాత్మక ఆలోచనా సరళి ఏర్పడాలి. చది విన పాఠ్యాంశాల నిత్య జీవిత అనుసంధానం వల్లనే సృజనాత్మకత ఏర్ప డుతుంది. అందుకు ప్రశ్నపత్రాలే వేదిక. అందువల్ల ప్రశ్నపత్రాలను కఠి నంగా ఇవ్వవద్దు–తేలికగా ఉండాలన్న డిమాండ్ వల్ల మన యువతరం దీర్ఘ కాలంలో దగా పడుతుందని మరువవద్దు. ప్రభుత్వం, పరీక్షల విభాగం పరీక్షలను ఒక వార్షిక తంతుగా ముగించకుండా, లోపరహితమైన పరీక్ష విధానాన్ని తీసుకురావాలి. ఎప్పుడూ జరిగే క్రతువులా పరీక్షలు పెట్టేసి ఆపై విద్యా వర్గాల నుంచి ప్రతికూల స్పందన వస్తే నాలిక కరచుకొని నాలుగు మార్కులు విసిరేసి శాంతింపజేõ¯ పద్ధతిని మార్చుకోవాలి. పరీక్షలు విద్యార్థి నుదుటిరాతలు కాబట్టి వీటిని అత్యంత పారదర్శకంగా జరపాలి. ప్రశ్నపత్ర రూప కల్పనకు బ్లూ ప్రింట్ అనుసరించడం దగ్గర నుంచి పరీక్షలో ఇచ్చే ప్రతి ప్రశ్నకు బాధ్యత వహించాలి. అంతే తప్ప పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నలో సందిగ్ధత ఉందని మార్కులు కలపడం ఉపశమనమే కానీ ఇదొక సాంప్రదాయకం కాకూడదు. అలాంటి ప్రశ్నలకు జవాబులు రాబట్టేం దుకు విద్యార్థి పరీక్షలలో పడే వేదనను గుర్తించాలి. అలాగే పరీక్ష కాగానే ప్రశ్న పత్రాలను పరీక్షించేందుకు ఒక వ్యవస్థ ఉండాలి. ప్రశ్నపత్రం రూప కల్పనలో తగిన ప్రమాణాలు అనుసరించారా? ఇచ్చిన వ్యవధిలో పూర్తి చేయగలిగే స్థాయిలో ఉందా? పదవ తరగతి విద్యార్థి మానసిక స్థితి దృష్ట్యా ఆ ఉద్వేగాలకు సరిపడే రీతిలోనే ప్రశ్నపత్రం రూపకల్పన జరి గిందా? పదవ తరగతి పాఠ్యాంశాల లక్ష్యాలను ఈ ప్రశ్నపత్రం నెర వేర్చే పంథాలో ఉందా? అన్న విమర్శనాత్మక దృష్టితో పరిశీలించగలిగే వ్యవస్థ ఉండాలి. ఈ విధమైన విశ్లేషణ ద్వారా వచ్చిన అభిప్రాయాలను బట్టి జవాబు పత్రాల మూల్యాంకనం జరగాలి. తదుపరి సంవత్సరం ప్రశ్న పత్రాల రూపకల్పనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశ్న పత్రాలను, పరీక్షలను అటు ప్రభుత్వం ఇటు తల్లిదండ్రులు భవిష్యత్ తరాలను మలచే వేదికలుగా భావించాలి. - చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త ‘ శాసనమండలి మాజీ సభ్యులు -
నాటి దురాగతాలకు నేటి ప్రాయశ్చిత్తం
సందర్భం జనజీవన స్రవంతికి దూరంగా శాపగ్రస్త జీవితం గడిపిన దళితులకు ప్రాయశ్చిత్తంగా అదనపు సౌకర్యాలు ఇచ్చి ముందుకు తీసుకురావడం సమంజసమే. సబ్‌ప్లాన్ రూపంలో అధిక నిధులు కేటాయిస్తే దళిత వికాసం సాధ్యపడుతుంది ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా కొన్ని డిమాండ్ల సాధనకు ఈ మధ్య కొన్ని ప్రజా సంఘాలు, ఆ వర్గం నుంచి ఎదిగిన ఉన్న తాధికారులు, మాజీ అధికారులు ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి వెళ్లాను. ప్రస్తుతం ఈ సబ్ ప్లాన్ కింద ఎస్సీ, ఎస్టీ అభ్యున్నతికి వినియోగించిన నిధులు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే వినియోగించాలి. ఒకవేళ మిగిలిపోతే మరుసటి సంవత్సరానికి బద లాయించే అవకాశం లేదు. అవి అలాగే మురిగిపోతాయి. ఇలా కాకుండా మిగిలిన నిధులను మరుసటి ఏడాదికి మిగిల్చి, కొత్త సంవ త్సరంలో మళ్లీ కేటాయించే నిధులను వీటికి కలపాలన్న డిమాండ్ వ్యక్తమయింది. ఈ ప్లాన్ కింద జనాభా నిష్పత్తి ఆధారంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మొత్తం బడ్జెట్లో వాటాను కేటాయిస్తున్నారు. దీనితో పాటు ఈ వర్గాలకు తరతరాల నుంచి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వారిని ఇప్పటికైనా ప్రధాన జీవన స్రవంతిలో కలిపేందుకు అదనపు నిధులు కేటాయించాలన్న మరో డిమాండ్ వచ్చింది. వీటిపై వక్తలు తమ, తమ అభిప్రాయాలు చెబుతున్నారు. అయితే నేను ఈ సమావేశంలో పెద్దగా మాట్లాడలేదు. మౌనంగా వింటూ కూర్చున్నాను. సాధారణంగా నేను పాల్గొన్న ఏ సమావేశంలోనైనా నేను అభిప్రా యాలు చెప్పి వస్తాను. కానీ ఎందుకో ఈ సమావేశంలో మాట్లాడ లేకపోయాను. బహుశా నేను మాట్లాడని సమావేశంగా ఇది మిగిలి పోయిందేమో కానీ నాలో సుడులు తిరిగిన జ్ఞాపకాల నుంచి బయ టపడలేక నేను గళం విప్పలేదు. అయితే సమావేశంలో చర్చకు వచ్చిన రెండు డిమాండ్లు నాకు సమంజసంగానే అన్పించాయి. ముఖ్యంగా ఈ వర్గాలకు తరతరాల నుంచి జరిగిన అన్యాయానికి నేను ప్రత్యక్ష సాక్షిని. వరంగల్ జిల్లా ఘనపూర్‌కు 12 మైళ్ల దూరంలో ఉంది మా ఊరు. మా ఊరుకు పోస్ట్ ఘనపూర్ నుంచే వచ్చేది. అవి 1940 దశ కంలో రోజులు. ఏదైనా దుర్వార్త ఉంటే దానిని దళిత కులానికి చెందిన మనిషి గంట కొట్టుకుంటూ మా ఊరుకు మోసుకొచ్చేవాడు. అలా మా ఊరికి గంట కొట్టుకుంటూ ఒక మనిషి వచ్చాడు అంటే అది దుర్వార్త కింద ఊరంతా ఉలిక్కి పడేది. ఆ మనిషి ఏ గడప దగ్గర ఆగుతాడన్న కలవరపాటుకు గురయ్యేవారు. నిమ్న కులానికి చెందిన మనుషులు దుర్వార్తలను తీసుకొస్తూ అశుభానికి గుర్తుగా నిలిచే వారు. వారి నివాసం ఊరి చివరే. ఒకవేళ ఊళ్లోకి వస్తే చెప్పులు చేత్తో పట్టుకు నడవాలి. రహదారిపై ఉన్నత కులాల వారికి ఎదురు రాకూ డదు. సామాజికంగా మిగతా ఉన్నత కులాల వారితో ఎక్కడా సమా నంగా లేకుండా ఆచార వ్యవహారాలుండేవి. వాటిని ధిక్కరిస్తే కఠిన శిక్షలుండేవి. అలాగే దళితులు ఫత్తేదారు కావడానికి అవకాశం లేదు. ఫత్తేదారు అంటే భూయజమాని. ఆ అవకాశం ఉన్నత కులాల వారికే. కుంట నేలకైనా వీరు సొంత దారులు కాలేరు. భూ రిజిస్ట్రేషన్లకు వారు అర్హులు కారు. అందుకే వారికి సొంత ఆస్తి అనేది ఉండేది కాదు. ఆ విధంగా ఆర్థికంగా దళితులు సొంత కాళ్లపై నిలబడే అవ కాశం లేదు. ఎంతకాలమైనా ‘బాంచను దొర నీ కాల్మొక్తా’ అంటూ ఇతరులపై ఆధారపడి అశుద్ధ పనులకే అంకితం కావాలి. ఈ విధమైన అమానుష, దురాగతాలను ఈ జాతి ఎన్నో శతాబ్దాల పాటు మౌనంగా భరించింది. మేమప్పుడే స్కూలు చదువు పూర్తి చేసుకొని ఉన్నాం. అస్పృశ్యతా నివారణకు గాంధీజీ పిలుపునకు యావత్ జాతి స్పందించే కాలం. ఆ సమయంలో మా ఊళ్లో నేను కొంత మందితో కలసి మాదిగ వాడలలోకి వెళ్లి వారి యోగ క్షేమాలు తెలుసుకొనేవాళ్లం. అయితే వాళ్లు చాలా భయపడేవారు ‘వద్దు! మా ఇండ్లకు రావద్దు’ అని వారించేవారు ‘ ఏం పాపం చేశామో! మా బతుకులు ఇంతే. మీరు మా కొంపలకు వచ్చి పాపం అంటిం చుకోవద్దు’ అనేవారు అయినా మేము వారిని కలుపుకునేందుకు ప్రయత్నించే వాళ్లం. ఈ విషయం తెలిసి ‘కులం కట్టుబాటు తప్పావు’ అంటూ మా కుటుంబాన్ని వెలివేసారు. అదే సమయంలో మా ఇంట్లో ఒక శుభకార్యం వచ్చింది కానీ నేను అంటరాని వాళ్ల ఇంటికి వెళ్లానన్న నెపంతో మా ఇంటికి ఎవరూ రాలేదు. మా అమ్మ చాలా బాధ పడింది. అప్పటికే నాన్న చనిపోయాడు. అమ్మ బాధ చూడలేని వయస్సు నాది కానీ నేను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. నేను బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టి ఉండవచ్చు కానీ తోటి మనుషుల ఇళ్లకు వెళ్లడంలో తప్పేమిటి? ఇదే విషయం మా అమ్మ అడిగింది– ‘నా కొడుకు చేసిన పాపం ఏమిటి?’ అని ‘అస్పృశ్యుల ఇళ్లకు వెళ్లడమే నీ కొడుకు చేసిన అపరాధం’ అంటూ ‘పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేయించుకోవాలంటే బంగారు తీగను బాగా కాల్చి నాలుకపై అడ్డంగా కొద్దిసేపు ఉంచాలి. అదే శిక్ష’ అంటూ కుల పెద్దలు చెప్పారు. మా అమ్మ ‘నా కొడుకు ఏ తప్పు చేయలేదంటూ’ నాకు అండగా నిల బడింది. జనజీవన స్రవంతికి దూరంగా శాపగ్రస్త జీవితం గడిపిన దళి తులకు ప్రాయశ్చిత్తంగా అదనపు సౌకర్యాలు ఇచ్చి ముందుకు తీసుకురావడం సమంజసమే. ఇందుకు అనుగుణంగా డా. బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగంలో ఈ వర్గాలకు కొన్ని వెసులుబాటు కల్పిం చడం వల్ల విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు, సబ్‌ప్లాన్ వంటివి కార్యరూపం దాల్చాయి. ఫలితంగా సివిల్ సర్వీసెస్ నుంచి వివిధ రంగాలలో ఉన్నత స్థానాలలోకి దళిత ప్రతిభ వికసిస్తోంది. మాధ వరావు, మాజీ ఐఏఎస్ వంటి వారు పాలనా వ్యవస్థలో ఉన్నత స్థాయికి చేరారు. సబ్‌ప్లాన్ రూపంలో అధిక నిధులు కేటాయిస్తే దళిత వికాసం సాధ్యపడుతుంది. నిధులు రెండు రకాలుగా ఉంటాయి. సాధారణ అభివృద్ధికి ఉద్దేశించిన నిధి. రెండోది వేగవంతమైన అభి వృద్ధికి నిర్దేశించిన నిధి. ఈ రెండు మార్గాల్లో నిధులు కేటాయిస్తే దళితులకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది. ప్రస్తుత అవకాశాలు వినియోగించుకునేందుకు మద్దతు ఇవ్వడం ఒక మార్గమైతే గత తప్పులు, పాపాల దిద్దుబాటుకు మరికొంత అదనపు సహకారం అందివ్వడం ద్వారా వివక్ష లేని సమాజ అవతరణకు దారి ఏర్పడు తుంది. అందుకు సబ్‌ప్లాన్ బలమైన ఆయుధం కావాలి. - చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు. -
‘ముప్పు’నకు పరిష్కారం
విశ్లేషణ నేటిలా మన సేవారంగం అనిశ్చితిని ఎదుర్కోకుండా ఉండాలంటే దేశీయ అవసరాలపై దృష్టి పెట్టి, సర్కారీ విద్యాలయాలలోని మానవ వనరులను అభివృద్ధిపరస్తే దేశీయ సేవారంగానికి గట్టి పునాదులు పడతాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వంటి ఆధు నిక అతివాదుల దూకుడుకు కళ్లెం వేయగల మూలాలు మన విద్యా వ్యవస్థలో ఉన్నాయి. వేల కోట్ల డాలర్ల ఎగుమతులతో పెనవేసు కున్న మన సేవా రంగంలో ట్రంప్ విధానాల కారణంగా కుదుపులొస్తున్నాయని ఆందోళన పడుతున్నారు. అయితే మన విద్యా వ్యవస్థ మూలాల్లో ఉన్న బలాన్ని ఉపయోగించుకుంటే మన సేవా, ఉత్పత్తి రంగాలు ట్రంప్ వంటి అతివాదులకు జవాబు చెప్పగలవు. మనం జ్ఞాన యుగంలో ఉన్నాం. ఇలా శాస్త్ర, సాంకేతిక రంగాలలో జరుగుతున్న అన్వేషణ, పరిశో ధన కారణంగా మానవ ప్రగతికి దోహదం చేసే ఆవిష్కరణలను మనం చూస్తున్నాం. మానవ మేధస్సు, శ్రమ, సంపదగా మారితేనే దేశ ప్రగతికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు వ్యవసాయ దేశ ఆదాయంలో సింహభాగం వ్యవసాయరంగానిదే. సేవా రంగం అప్పుడు నామ మాత్రమే. అయితే క్రమంగా మానవ అవసరాలు పెరగడం, విజ్ఞాన మథనం జరగడంతో పారిశ్రామిక రంగం వృద్ధి మొదలైంది. ప్రపంచంలో పారిశ్రామికంగా పరుగులు పెడుతుండటంతో మనమూ ఆ ఫలాలను అందు కోవాలనే ప్రయత్నం చేశాం. దీనితో వ్యవసాయ రంగం ఆదాయం పారిశ్రామిక రంగం అధిగమిం చింది. అయితే పారిశ్రామిక రంగంలో ఉత్పత్తికి అపారంగా మానవ వనరులు. శ్రామిక శక్తిని తగ్గించి వ్యయ నియంత్రణ ద్వారా అధిక లాభాలని ఆర్జించాలన్న ఆలోచనతో ‘ఆటోమేషన్’ ప్రక్రియ మొదలైంది. ఆటోమేషన్ ద్వారా శ్రామికుల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు. అదే సమయంలో మన జీవితంలో ఎదురవుతున్న వివిధ సమస్యలకు పరిష్కారాన్ని సాధించే ప్రయత్నాలు ఊపందు కోవడంతో 20వ శతాబ్దంలో సేవా రంగం పుంజుకున్నది. దీనికి తోడు సేవా రంగ వ్యాప్తికి ఎల్లలు లేకపోవడంతో వాణిజ్య అవకాశాలు ఖండాలు, సము ద్రాలు దాటిపోయి విస్తృతమయ్యాయి. ప్రపంచంలోని మారుమూల అవకాశాన్నయినా ఆదుకునేందుకు ప్రపంచీకరణ వీలు కల్పించింది. మన సేవా రంగ వృద్ధి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను ఎప్పుడో దాటి పోయింది. కానీ అమెరికా గద్దెపై ట్రంప్ వంటి వారున్నప్పుడు సేవా రంగం తల్లడిల్లే ప్రమాదం ఉంది. దీనికి పరిష్కారం మనం వెకతవలసి ఉంది. ఇటువంటి సవాళ్లకు మన ప్రభుత్వ పాఠశాలల్లో సమాధానం ఉంది. గతంలో చదువులకు సంపన్న వర్గాల పిల్లలు వచ్చేవారు. అప్పుడు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునేది. కాబట్టి సర్కారీ స్కూల్స్ లోనే చేరేవారు. పాఠ్య పుస్తకాలల్లోని విజ్ఞనాన్ని తెలుసుకుని అవే ఆధారంగా ముందుకు వెళ్లేవారు. పాఠ్య పుస్తకాలలో పేదరికం గురించి చదువుకుని చలిం చి పేదరిక నిర్మూలనకు మార్గాల అన్వేషణ జరిగేది. అలాగే రైతాంగం వ్యవసాయంలో ఎంత దిగుబడి చేస్తుందో తెలుసుకుని దానిని పెంచే మార్గాలు ఆలో చించేవారు. ఇక్కడ ఒక పరిమితి ఉంది. సంపన్న వర్గాల పిల్లలకు స్వీయ అనుభవం ఉండేది కాదు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకు నేందుకు వస్తున్న పిల్లల నేపథ్యాలు వేరు, ఆర్థిక, సామాజిక పూర్వ రంగం వేరు. నేటి పిల్లలు శ్రామికవర్గం నుంచి, సామాజికంగా వెనుకబడిన తరగతుల నుంచి, అట్టడుగు శ్రేణి నుంచి వచ్చారు. నిర్బంధ ఉచిత విద్య హక్కు కారణంగా ఈ వర్గాల పిల్లలకు చదువుకునే అవకాశం వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు శ్రామిక వర్గం నుంచి వచ్చినందు వల్ల వారికి పేదరికం, వ్యవసాయ రంగంలోని సమస్యలు తెలుసు. శ్రామిక, అల్పాదాయ వర్గాల సమస్యలు తెలుసు. కాబట్టి ఆ సమస్యల పరిష్కారం పట్ల వారిలో ఆర్తి ఉంటుంది. వాటి పరిష్కారం పట్ల అంకిత భావం ఉంటుంది. దీనిని పాఠ్య పుస్తకాలకు మించిన జ్ఞానంగా మనం ఎందుకు పరిగణించకూడదు? ఈ వర్గం పిల్లలకు ఇప్పుడు చదువుకునే అవకాశం లభించి ఆలోచించే శక్తి, అభ్యసించే సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యం ఏర్పడతాయి. ఈ వర్గాలను గొప్ప మానవ వనరులుగా పరిగణించి పాఠ్య పుస్తక రచనలు, బోధనా వ్యూహాలు, పరిశోధనావకాశాలు కల్పిస్తే అద్భుత అవిష్కరణలు వెలుగుచూస్తాయి. తెల్లవారు జామున వెళ్ళి చీకటిలో కరెంట్ లేదనుకుని పైపును తాకి మరణించిన తండ్రి దుస్థితి మరో రైతుకు రాకూడదని కరెంట్ వస్తే వెలిగే లైటు, అలారం మోగే విధానాన్ని ఒక ఇంజనీరింగ్ విద్యార్థి రూపకల్పన చేశాడు. ఇలా స్థానిక పరిస్థితులు, వనరులు, అవసరాల రీత్యా ఎన్నో ఆవిష్కరణలకు అవకాశం ఉంది. ప్రస్తుతం మనం పరాయి దేశాల సమ స్యలకు పరిష్కారం చూపగల నైపుణ్యం గల యువత ను తయారు చేసే పనిలో ఉన్నాం. కానీ నేటిలా అనిశ్చితిని ఎదుర్కోకుండా దేశీయ అవసరాలపై దృష్టి పెట్టి, సర్కారీ పాఠశాలలు, కళాశాలల్లోని మానవ వనరులను ఇందుకు కార్యస్థలిగా పరిగణిస్తే మన సేవారంగానికి గట్టి పునాదులు పడతాయి. దీని ఆధారంగా పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగాలకు పూర్వ వైభవం వస్తుంది. - చుక్కా రామయ్య –వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు -
వాసి గల ఉపాధ్యాయులేరీ?
సందర్భం ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లు డ్రైవింగ్ లైసెన్స్‌లుగా మారాయి. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరు వాహనాలను నైపుణ్యంతో నడప గలరని అర్థం కాదు. నిజమైన నైపుణ్యాలుంటేనే మంచి వాహన చోదకుడవుతాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరి గిన జాతీయస్థాయి పబ్లిక్ స్కూల్స్ సదస్సు ఇచ్చిన పిలుపు దేశ భవిష్యత్తుకు మేలు కొలుపు. నాణ్యమైన ఉపాధ్యా యులను తయారుచేయడంపై ప్రభుత్వాలు దృష్టి సారించా లని 77వ ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ కాన్ఫరెన్స్ (ఐపీ ఎస్సీ) విజ్ఞప్తి చేసింది. 21వ శతాబ్దంలో విద్యే దేశ భవి ష్యత్తుకు చుక్కాని అని అందరూ గుర్తించడం వాస్తవమే కానీ, ఆ దిశగా గట్టిగా అడుగులు పడకపోవడంతో సదరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులే చివరకు ప్రాధే యపడాల్సి వచ్చింది. దేశం మొత్తం మీద 15 లక్షలకు పైచిలుకు స్కూల్స్ ఉన్నాయి. 38 వేల కళాశాలలు, 760 విశ్వవిద్యాల యాలు, 12 వేల శిక్షణా సంస్థలున్నాయి. పైగా ప్రభు త్వాలు అవసరం ఉన్నప్పుడు ఉపాధ్యాయ, అధ్యాపక నియామకాలు జరుపుతున్నాయి. సమస్యల్లా నాణ్యమైన ఉపాధ్యాయుల విషయంలోనే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగా లతో సంబంధం లేకుండా ఐదవ తరగతిలో ఉన్న విద్యార్ధి రెండో తరగతి పుస్తకాన్ని చదవలేకపోవడాన్ని పలు సర్వేలు ఎత్తిచూపాయి. దీనిని బట్టి ఉపాధ్యాయుల బోధన ఏ స్థాయిలో ఉన్నదో స్పష్టం అవుతోంది. గత దశాబ్దికాలంలో ప్రైవేట్ విద్యా రంగంలో మౌలిక వస తులకు కొదవలేదు. కానీ ఉపాధ్యాయ వర్గంలో విద్యా ప్రమాణాలకు నూతన భవంతులు, సాంకేతిక పరిజ్ఞానం గీటురాయి కాదు. పిల్లలకు చదువు బాగా రావాలంటే మంచి టీచరు ఉండాలని అందరూ అంగీకరిస్తారు. అయితే దీనిని అమలులోకి తీసుకురావడంలో చిత్తశుద్ధి కన్పించదు. ప్రభుత్వాల దృష్టిలో టీచర్ రిక్రూట్మెంట్, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఒక్కటే. నిరుద్యోగ లోకంలో అసంతృప్తి ప్రబలినప్పుడు ప్రభుత్వాల వద్ద ఉండే నియా మకాల ఆయుధాలివి. అంతే తప్ప ఉపాధ్యాయ నియా మకాలపై ఏ ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ కన్పించదు. మంచి విద్యార్థులు తయారు కావాలంటే మంచి ఉపాధ్యాయులను ఎంపిక చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి. విద్యార్థిలోని నిజమైన ప్రతిభను వెలికి తీయాలంటే మెరి కల్లాంటి టీచర్లు ఉండాలి. అసాధారణ తెలివితేటలు గల విద్యార్థులకు ఎవరైనా చదువు చెప్పగలరు. మామూలు విద్యార్థిలో నిద్రాణంగా ఉన్న ప్రతిభను బయటికి తీయా లంటే మంచి ఉపాధ్యాయులు కావాలి. మంచి టీచర్ క్లాస్ చెప్పడంతోనే తన పని అయిపోతుందని భావిం చడు. విద్యార్థిలో నిబిడీకృతమైన ప్రతిభను బయటికి తీసుకు వచ్చేందుకు ఉపాధ్యాయుడు ఎన్నో రూపాలలో వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. కొన్నిసార్లు విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టేందుకు సవాళ్లు విసురు తాడు. ఇన్ని ప్రక్రియల్లో ఆరితేరిన ఉపాధ్యాయులను ఎంపిక చేయడం మాటలు కాదు. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లు వాహ నాలకు ఇచ్చే డ్రైవింగ్ లైసెన్స్‌లుగా మారాయి. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరు వాహనాలను నైపుణ్యంతో నడపగలరని అర్థం కాదు. నిజమైన నైపు ణ్యాలుంటేనే మంచి వాహన చోదకుడవుతాడు. అలాగే ఉపాధ్యాయ శిక్షణ సర్టిఫికెట్లు ఉన్న వారిలో అందరికీ తగిన సామర్థ్యం ఉండకపోవచ్చు. ఇందుకు రెండు అంశాలు ముఖ్యం–ఒకటి ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి, ఈ వృత్తిలో ఇమిడిపోగల వారిని ఎంపిక చేయడం. ఈ ప్రక్రియను శిక్షణా సంస్థలకు పరిమితం చేయకుండా కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచే మొదలవ్వాలి. అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు తమ వృత్తిలో ఉపాధ్యాయు లుగా రాణించగలవారిని అక్కడే గుర్తించాలి. వారి ఆసక్తి, వ్యక్తీకరణ, విషయ జ్ఞానంపై అనురక్తి రీత్యా అటువంటి వారిని గుర్తించి ఉపాధ్యాయ శిక్షణకు వెళ్లమని ప్రోత్స హించాలి. ఉపాధ్యాయ ఎంపికలు రేపటి అవసరాలకు అనుగుణంగా జరిగితే ఉపాధ్యాయుడి సేవలు పదికాలా లపాటు ఉపయోగపడ తాయి. అందుకే ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కోసం ఐఐటీ, ఐఐఎం వంటి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు గల విద్యా సంస్థలను రూపొందించమని కోరింది. పుస్త కాల్లో లేని చదువులను విద్యార్థుల మస్తిష్కాల్లోకి పంప గలిగేవే ఐఐటీలు. భవి ష్యత్ అవసరాలను కూడా అర్థం చేసుకొని బోధన జరిపే అలాంటి వ్యవస్థను ఉపాధ్యా యుల శిక్షణకు నెలకొల్ప మని ప్రిన్సిపాల్స్ అడగడం అంటే అంతటి ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడమే. విద్యా వ్యవస్థకు ఇంతటి ప్రాధాన్యాన్ని ఇచ్చిన దేశాలు కాలం విసిరే సవాళ్లకు దీటుగా నిలబడుతు న్నాయి. ఉత్తర కొరియా తన దాయాది దక్షిణ కొరియాను అణ్వస్త్రాలతో భయపెట్టాలని చూస్తే దక్షిణ కొరియా తన విద్యావ్యవస్థే అస్త్రంగా దీటుగా జవాబు చెప్పగలిగింది. యూరప్‌లోని ఆర్థిక వ్యవస్థల పునాదులు కదిలి పేక మేడల్లా కూలిపోతుంటే విద్యా వ్యవస్థ పునాదిగా ఫిన్లాండ్ బలంగా నిలబడగలిగింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు మంచి మానవ వనరులను తయారు చేసుకొని అన్ని రంగాలలోను ప్రత్యేకత చూపగలుగుతు న్నాయి. ఇక మనదేశంలో 2013–14 ఆర్థిక సంవత్స రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.3 లక్షల 25 వేల కోట్లను విద్యారంగంపై ఖర్చుపెట్టిన నేపథ్యంలో మెరుగైన ఉపాధ్యాయులను ఈ వ్యవస్థలోకి తీసుకురాక పోతే ప్రపంచంలో 5వ బలమైన ఆర్థిక వ్యవస్థగా అవ తరించిన మన సంబరం ఎక్కువ కాలం నిలవదు. ప్రిన్సిపాల్స్ సదస్సు చేసిన విజ్ఞప్తిని ఇప్పుడైనా అంది పుచ్చుకుంటేనే స్వర్ణ భారత్‌ను అందించగలం. చుక్కా రామయ్య ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు -
పిల్లలు.. పరీక్షలు..!
సందర్భం ఈ ప్రత్యేక పరీక్షా క్యాంపులు తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ప్రభుత్వమే నిర్వహిస్తే బాగుంటుంది. ప్రతి జిల్లాలో ఇలాంటి క్యాంపులు పెడితే పేద పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలకు పరీక్షల కాలం వచ్చింది. ఒక ఏడాది మొత్తం చదివిన చదువుపై పరీక్షలు రాసి తమ అర్హతను ప్రకటించుకోవాల్సి ఉంది. పరీక్షలను మార్కులతో మాత్రమే కొలిచే దశ నుంచి మనం ఇంకా బయటపడలేదనుకుంటా! కానీ మారిన కాలంతో పరీక్షలను అంచనా కట్టి పరీక్షించుకోవాల్సి ఉంది. పరీక్షలంటే ఫలితాలలో వచ్చే ర్యాంకింగ్‌లు మాత్రమే కాదు. రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షల తేదీలు ప్రకటించడం జరిగింది. కానీ పరీక్షలతో నేర్చుకోవలసినటువంటి పాఠాలు మాత్రం ఇప్పటికీ మొదలు కాలేదు. ఫలితాలలో విశ్లేషణలు జరగటం లేదని చెప్పటం లేదు. జిల్లాలవారీగా పరీక్షల ఫలితాల లెక్కలు చెబుతున్నారు. అది కేవలం జిల్లాల మధ్య పోటీకి పనికొస్తుంది. కానీ సమాజంలో ఆర్థిక ఎత్తువొంపులలో తేడా ప్రభావం విద్యార్థులపై ఏ విధంగా పడుతుందో దానిపై విశ్లేషణ జరగటం లేదు. అది జరిగితే విద్య వల్ల ఎంత అభివృద్ధి జరుగుతుందో అంచనా వేయవచ్చును. పరీక్షల లక్ష్యం పోటీలను పెంచటం కాదు, విద్య వలన అభివృద్ధి ఎంత జరుగుతుంది? సమాజం పురోభివృద్ధికి మన చదువులను ఏ మేరకు మలుచుకోగలుగుతున్నాం? సమాజంలో అన్నీ వర్గాలను సమత్వంగా తీసుకువచ్చేందుకు ఈ చదువులను ఎలా ఉపయోగించుకోవాలి? చదువుకు పేదరికానికి సంబంధం ఉంది. ఆ క్రమంలోనే పేదరికానికి పరీక్షల ఫలితాలకు సంబంధం ఉంటుంది. కొందరు పిల్లలు గుడిసెల నుంచి; మురికి వాడల నుంచి వస్తున్నారు. వీరి సంసారమంతా ఒకే గదిలో జరుగుతుంది. సంసారంలో జరిగే అవకతవకలు, ఆర్థిక ఇబ్బందులు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఆహార రక్షణ భద్రత లేని కుటుంబాల ప్రభావం కూడా పరీక్షలు రాసే పిల్లలపై పడుతుంది. పరీక్షల సమయంలో పిల్లలు తీసుకునే పుష్టికరమైన ఆహార ప్రభావం కూడా పరీక్ష ఫలితాల్లో ఉంటుంది. తల్లిదండ్రుల చదువు ప్రభావం కూడా పిల్లల సాధనపై ఉంటుంది. తెలంగాణలోని చాలా మంది పిల్లలు చదువు విషయంలో మొదటి తరంగా ముందుకు వచ్చారు. కొన్ని కులాలు, సంచార జాతులకు చెందిన వారు, బలహీన వర్గాలలో కూడా బాగా వెనుకబడ్డ కులాల పిల్లలు మొదటి తరంగా చదువులోకి అడుగు పెడుతున్నారు. 10వ తరగతి దశకు వచ్చిన మొదటి తరం పిల్లలు ఉన్నారు. వారు ఆ కుటుంబంలోనే మొదటి తరం చదువుకున్న వారుగా చూడాలి. ఇవన్నీ గమనించే గత 15 సంవత్సరాల నుంచి వందేమాతరం అనే స్వచ్ఛంద సంస్థ ఈ పై లోపాలను సరిచేస్తూ పరీక్షలకు ముందు 45 రోజుల పరీక్షల క్యాంపును నిర్వహిస్తోంది. ఈ క్యాంపులో చదువుకునే పిల్లలు వెనుకబడిన వర్గాల పిల్లలు, మరీ ముఖ్యంగా సగం కంటే ఎక్కువ మంది ఆడపిల్లలున్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఈ క్యాంపుల నిర్వహణ కొనసాగుతోంది. మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లా తొర్రూర్ తదితర ప్రదేశాలలో ఈ వందేమాతరం సంస్థ చేసే పరీక్షల క్యాంపుల ఫలితాలను విశ్లేషించటం జరిగింది. చాలా మంచి ఫలితాలు కన్పించాయి. ఈ శిక్షణ పొందిన వారు మంచి మార్కులను తెచ్చుకోవడమే కాక ఉన్నత చదువుల వైపుకు వెళుతున్నారు. దీని వలన ట్రిపుల్ ఐటీలో గత ఏడాది 13 క్యాంపులు నిర్వహించారు. అది ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇలాంటి క్యాంపులు ప్రతి జిల్లాలోనూ నడిపించగలిగితే అది ఫలితాలపై ప్రభావం చూపిస్తుంది. పరీక్షలంటే పాస్, ఫెయిల్ అని ముద్రలు వేయడానికి కాదు. పరీక్షలంటే జవాబుదారీతనాన్ని వ్యక్తం చేయాలి. పేదరికానికి, చదువుకు ఉన్న సంబంధాన్ని విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరికి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయనకు జీవితం తెలుసు, అట్టడుగు బహుజన వర్గాల పేదరికం తెలుసు. ఈ ప్రత్యేక పరీక్షా క్యాంపులు తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాల్లో ప్రభుత్వమే నిర్వహిస్తే బాగుంటుంది. ప్రతి జిల్లా ఇలాంటి క్యాంపులు పెడితే పేద పిల్లలకు ఉపయోగపడుతుంది. పరీక్షల ఫలితాలతో పాటు పిల్లల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను గమనంలోకి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క రోజులో కుటుంబ సర్వేని నిర్వహించింది. ఆ లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాటి ఆధారంగా, ఆ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను ఆధారం చేసుకుని విశ్లేషిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని క్యాంపులు పెట్టాలో తెలుస్తుంది. ఇప్పుడున్న తక్కువ సమయంలో ఈ పరీక్షల నిర్వహణకు ఏ మేరకు పరీక్షల క్యాంపును ఏర్పాటు చేయగలిగితే ఆ మేరకు మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణ వెనుకబడిన వర్గాల పిల్లలకు ఈ పరీక్షల క్యాంపులు ఎంతో దోహదం చేస్తాయి. (వ్యాసకర్త : చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు) -
విద్య, వైద్య రంగాల చుక్కాని
సందర్భం మానవ వికాసానికి విద్య ప్రధానమని తొలినాళ్లలోనే గుర్తించిన నేతలలో క్యాస్ట్రో ఒకరు. గుర్తించడమే కాదు చిత్తశుద్ధితో ఆ రంగ అభివృద్ధికి పనిచేసిన నేత. అందరికీ వైద్యం.. నాణ్యమైన వైద్యం అందించి ప్రపంచ దేశాలు అచ్చెరువొందేలా చేశారు. ప్రపంచ పటంలో అంగుళం స్థలం కూడా తీసుకోని అతి చిన్న దేశం క్యూబా అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించింది. 50 ఏళ్లపాటు అమెరికా పక్కలో బల్లెంలా నిలిచింది. సైనిక బల గంతో గెలవాలని చూస్తే రెట్టిం చిన బలంతో నిటారుగా నిలి చింది. కుట్రలు, కుతంత్రాలు, హత్యాయత్నాలతో మట్టు పెట్టాలని చూస్తే కంటికి రెప్పలా కాపాడుకుంది. ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయాలని ప్రయ త్నిస్తే వటవృక్షంలా విస్తరించింది. ఇంత చిన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది? సైనిక పహారాలతోనా, ఫిరంగుల మోతలతోనా? ఎలా సంభవమైంది? ఇనుప సంకెళ్ళతో ఎంతోకాలం ఏ దేశం మనలేదు. భుజబలంతో ఏ రాజ్యం దీర్ఘకాల సుఖసంతోషాలను కొని తీసుకురాలేదు. క్యూబా చిన్నదేశమైనా అమెరికాలాంటి అగ్రరాజ్యం కబళించ లేకపోవడానికి కారణం మనిషి అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చిన వికాసం. ప్రజల బాగో గులు పట్టించుకొని వాటికే పట్టంకడితే చీమంత దేశాన్నయినా గద్దలాంటి పెద్ద దేశం ఏమీ చేయలేదని క్యూబా నిరూ పించి చూపించింది. తమ యోగక్షేమాలు చూసిన నాయకుడిని పరాయిదేశం తుద ముట్టించాలని చూస్తే ప్రజలు రక్షక కవ చంగా నిలవడంతో చిన్న దేశాల ఆత్మవి శ్వాసానికి పెద్ద సంకేతంగా మిగిలిపోయింది. ఫిడెల్ క్యాస్ట్రో చతురంగ బలంలోను, చతుర్విధ కుయుక్తులతో ఐదు దశాబ్దాల పాటు నెట్టుకురాలేదు. మనిషి ప్రాథమిక అవసరాలను గుర్తించి వాటిని కల్పించేం దుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. మానవ వికాసానికి ప్రాతిపదికగా నిలిచే ప్రాధాన్యత రంగాల అభివృద్ధికి శత విధాలా పనిచేశారు. ఆరోగ్య పరిరక్షణ, విద్యారంగాలపై ధనం, సమయం వెచ్చించి లాటిన్ అమెరికా దేశాలలోనే గొప్ప విజయాలు సాధించారు. అవసరంలో ఉన్న దేశాలకు నిష్ణాతులైన వైద్యులను పంపే ప్రాణదాతగా క్యూబాను క్యాస్ట్రో నిలిపారు. మానవ వికాసానికి విద్య ప్రధానమని తొలినాళ్లలోనే గుర్తించిన నాయకులలో కాస్ట్రో ఒకరు. ప్రపంచమంతా వైద్యరంగం వ్యాపారమయమైంది. ప్రభు త్వాలు ఎంత నియంత్రించినా కట్టడి చేయలేక పోయాయి. కానీ ఫిడెల్ క్యాస్ట్రో వైద్య రంగాన్ని పరిరక్షించుకున్నారు. అందరికీ వైద్యం అందించారు. అదీ నాణ్యమైన వైద్యం అందించి ప్రపంచ దేశాలు అచ్చెరువొందేలా చేశారు. ఒక వెనుకబడిన చిన్నదేశం వైద్య విద్యారంగంలో ప్రగతి సాధించి ఇతర దేశాలకు సైతం వైద్యులను పంపే స్థాయికి చేరడం ప్రపంచదేశాల ప్రశంసలందుకుంది. విద్యకు, వైద్యానికి గల పరస్పర సంబంధాన్ని ఫిడెల్ క్యాస్ట్రో అర్థం చేసుకున్న తీరు అమోఘం. క్యూబాలో పిల్ల లకు మంచి చదువు ఇచ్చారు. చదువుకొని కళాశాల ప్రాంగ ణాలు దాటి వచ్చిన తర్వాత ఉపయోగపడాల్సిన రంగా లను గుర్తించారు. ఏయే వృత్తుల్లో నిపుణులు అవసరమో అంచనావేసి ఆ రంగాలకు తగిన కోర్సులనే చేయించారు. ముఖ్యంగా సమాజంలో వైద్యుల అవసరాన్ని గుర్తించి వైద్య విద్యకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. పిల్లలను ప్రతిభా వంతులుగా తయారుచేయడానికి తరగతిలో ఉపాధ్యాయ బోధన, పటిష్ట విద్యా విధానంతోపాటు తల్లి గర్భంలో ఉండగానే శిశువుకు పోషకాహారాన్ని ధనిక, పేద తారత మ్యాలు లేకుండా అందేలా చూడటంతో క్యూబా విద్యా ప్రమాణాలు గొప్పగా పెరిగాయి. 1970 దశకంలోనే క్యూబా సంపూర్ణ అక్షరాస్యతతోపాటు అధిక శాతం పట్ట భద్రులుగల దేశంగా గుర్తింపు పొందింది. 1980వ దశకం ప్రారంభంలోనే 90 శాతం మంది విద్యావంతులకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ, ఉపాధి కల్పన చేయగలిగిన దేశంగా ప్రశంసలందుకున్నది. క్యూబాలో ఫిడెల్ క్యాస్ట్రో అనుసరించిన పంథా ఇతర చిన్న చిన్న దేశాలకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది. పోలండ్, దక్షిణ కొరియా, ఫిన్లాండ్, సింగపూర్ దేశాలు విద్యా వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చి క్యూబా తరహా విజయాల కోసం ప్రయ త్నిస్తున్నాయి. క్యూబా ప్రజల అభ్యున్నతికి, వికా సానికి ఫిడెల్ క్యాస్ట్రో చేసిన కృషి కార ణంగానే బాహ్య శక్తులు ఆయనను ఏమీ చేయలేకపోయాయి. క్యూబాను చావుదెబ్బ కొట్టాలని అమెరికా ఎన్ని విధాలుగా ప్రయ త్నాలు చేసినా క్యూబా ప్రతిసారీ రెట్టింపు శక్తితో లేచి నిలబడేది. పంచదార, పొగాకు, కాఫీ తదితర ఉత్పత్తులకు క్యూబా పెట్టింది పేరు. ఇతర దేశాలలో వీటికి మంచి గిరాకీ ఉండేది. కానీ వాటిని మరే దేశాలు కొనకుండా అమెరికా ఆంక్షలు విధిం చేది. అయితే నాటి సోవియట్ యూనియన్ కొండంత అండగా నిలిచేది. క్యూబా ఉత్పత్తులను తీసుకొని ఆ దేశా నికి పెట్రోల్ ఇచ్చేది. అమెరికా ఆర్థికంగాను, సైనికంగానూ క్యూబాను తొక్కేయాలని ప్రయత్నించినా ఫిడెల్ క్యాస్ట్రో తన దేశ ప్రజల అండదండలతోనే నిలబడగలిగారు. సోవి యట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పుడు క్యూబాకు క్లిష్ట పరి స్థితులు ఎదురయ్యాయి. క్యాస్ట్రోకు ప్రజలు మళ్ళీ అండగా నిలబడ్డారు. అప్పటి వరకు క్యూబా ఉత్పత్తులు తీసుకున్న సోవియట్ నుంచి సహాయం లేకపోవడంతో క్యూబా ఇక అంతమై పోయినట్టేనని అమెరికా భావించింది. అయితే క్యాస్ట్రో ఆదాయ వనరుల పెంపుదలకు పర్యాటక రంగాన్ని ఎంచుకొని వృద్ధి చేశారు. అందమైన కరీబియన్ దీవుల్లో భాగమెన క్యూబాలో పర్యాటక రంగం పుంజుకుంది. తుపాకీ గొట్టంతోనో, సైనిక పదఘట్టనలతోనో ఏ నేతా దీర్ఘకాలం నిలవలేడు. జన హృదయ వీధుల్లో స్థానం సంపాదించిన వారే నాలుగు కాలాలపాటు మనగలుగు తారు. మానవ వికాస రంగాలను గుర్తించి వాటి అభివృ ద్ధికి, క్యూబా పురోభివృద్ధికి పాటుపడినందువల్లనే ఫిడెల్ క్యాస్ట్రో తిరుగులేని నాయకుడయ్యాడు. చిన్న దేశాల స్వాభి మానానికి చిహ్నంగా నిలిచాడు. చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు -
ఉద్యమాల ఉపాధ్యాయుడు
సందర్భం పేదరిక నిర్మూలన కోసం దేశంలో జరి గిన అనేక సమరశీల పోరాటాల ఫలి తంగా ప్రభుత్వాలు పలు సంక్షేమ పథ కాలు నిర్వహిస్తున్నాయి. అయినా సమాజంలో దారిద్య్రం పోలేదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నుంచి నేటి చుక్కా రామయ్య వరకు అక్షర జ్ఞానమే ప్రజలకు అక్షయ సంపద అని, తరతరాల తలరాతలను మార్చి, మనిషి మౌలిక అవసరాలు తీర్చి, ఆత్మగౌర వంతో జీవింప చేసే చదువును అందరికీ పంచాలని భావించారు. అక్షరాన్ని సామాన్యుల దరికి చేర్చడమే ధ్యేయంగా జీవి తంలో అత్యధిక భాగాన్ని అర్పించినవారు– ప్రముఖ విద్యావేత్త డాక్టర్ చుక్కా రామయ్య. ఆ చదువుల తల్లి ముద్దుబిడ్డ 89వ ఏట అడుగుపెడుతున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘ ప్రయాణం చేస్తూ.. అనేక ప్రయోగాలు చేశారు. గణితంపై ఆయనకు ఉన్న పట్టు అపారమైనది. రామయ్య సాంఘిక సంక్షేమ గురుకుల కళా శాలకు ప్రిన్సిపల్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ట్యూషన్ మాస్టర్‌గా విద్యారంగానికి సేవలు ప్రారంభించారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కుటుంబం ఆర్థిక ఒడిదుడుకుల మధ్య ఉపాధి మార్గంగా ఆరంభించిన రామయ్య ఐఐటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ వందలాది మంది తెలుగు బిడ్డలకు వరమైంది. ఈ సంస్థ సానపెట్టిన ప్రతిభావంతులైన విద్యార్థులు 80కి పైగా దేశాల్లో రాణిస్తున్నారు. మన ఇస్రో మెుదలుకొని అమెరికాలోని నాసా వరకు అనేక రక్షణ పరిశోధన, వైజ్ఞానిక రంగాలలో నిష్ణాతులుగా, బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తు న్నారు. రామయ్య తపన, ఆరాటం, అలుపెరగని అధ్యయనం అపారమైన బోధనా నైపుణ్యాల ఫలితంగా ఐఐటిలలో తెలుగు బిడ్డల ప్రవేశాలు ఇతోధికంగా పెరిగాయి. ఈ ప్రయత్నం పరో క్షంగా రాష్ట్రానికి అపార ఆర్థిక సంపదగా మారింది. పోరాటాల పురిటిగడ్డ వరంగల్ జిల్లా, పాలకుర్తి మండలం, లింగాల గూడూర్ గ్రామంలో నవంబర్ 20, 1927న రామయ్య జన్మించారు. తండ్రి అనంతరామయ్య, తల్లి నర్సమ్మలకు రామయ్య పెద్దకొడుకు. వీరికి తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. దొరతనం దుర్మార్గాల గురించి ఆయనలో బాల్యంలోనే అంతర్మథనం మెుదలైంది. ఒక వైపు చదువు. మరోవైపు దొరల గడీల మీద సాయుధ పోరాటాలు. ఫలితంగా రామయ్యను నైజాం ప్రభుత్వం నిర్భందించి మూడేళ్లు ఔరంగాబాద్ జైలులో పెట్టింది. అక్కడే అభ్యుదయ, విప్లవ సాహిత్యాన్ని వంట పట్టించుకొన్న రామయ్య అప్పటికే పట్టభద్రులు. జైలు సూపరింటెండెంట్ పిల్లలకు పాఠాలు కూడా చెప్పేవారు. నిబద్ధత, నిజాయితీలకు నిలువుటద్దంగా నిలిచిన పుచ్చలపల్లి సుందరయ్య ప్రసంగాలకూ, వ్యక్తిత్వానికీ ఆకర్షితులైన రామయ్య ఒక దశలో పార్టీకి పూర్తి సమయం కార్యకర్తగా వెళ్లాలని అనుకున్నారు. కానీ బాల్యంలోనే తండ్రిని కోల్పోయి పుట్టెడు కష్టాలు, కన్నీళ్ల మధ్య; పొట్టకు పిడికెడు మెతుకులు లేక తల్లి, తమ్ముడు, చెల్లెలు పడుతున్న బాధల నుంచి తొలుత వారిని గట్టెక్కించాలని భావించారాయన. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుని, ఉద్యోగం చేస్తూనే అనేక ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. పని చేసిన ప్రతీచోట పాఠశాలలను సంస్కరిస్తూ సాగిన వారి జీవనంలో ఎన్నో మైలురాళ్లు కనిపిస్తాయి. తొలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి మలిదశ పోరు వరకు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఉద్యమ జేఏసీకి దిశదశలను నిర్దేశించిన గురుతుల్యులు రామయ్య. శాసనమండలికి ఎన్నికైన రామయ్య ప్రసంగాలు ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యులను ఎంతగానో ఆలోచింపచేసేవి. ‘పుట్టుక నీదీ, చావు నీది, బ్రతుకంతా దేశానిది’ అన్న కాళోజీ మాటలను సార్థకం చేసే విధంగా 89 ఏళ్ల వయోభారం, అనారోగ్యం వంటి ఇబ్బందులు ఉన్నా వారి ఉద్యమ చైతన్యయాత్ర ఆగలేదు. విద్యా సంస్కరణలు తేవడానికి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేయడానికి కృషి చేస్తూనే ఉన్నారు. బడుగుల బిడ్డలు చదువుకునే బడులు మూతపడితే ప్రజాస్వామిక విలువలు పతనమవుతాయని గట్టిగా నమ్మిన ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు తిరిగి వారి పరిశోధనలపై అధ్యయనం చేసి అరుదైన సమాచారాన్ని తెలుగు ప్రజలకు అందించారు. భవిష్యత్తు కోసం ఆరాటపడే విద్యార్థుల జీవితాలకు ఊతమిస్తూ, బడుగుల బిడ్డలు చదివే బడులతోనే బంగారు తెలంగాణ సాధ్యం కావాలన్న రామయ్య జీవన స్వప్నం నెరవేరాలని ఆశిద్దాం. (చుక్కా రామయ్య 89వ ఏట అడుగిడుగుతున్న సందర్భంగా నేడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఆత్మీయ మిత్రబృందం ‘సమత్వం, సామాజిక న్యాయం, విద్య ఒక సామాజిక న్యాయం’ అనే అంశం మీద ఆయన దార్శనికత ఆధారంగా విద్యా సదస్సు నిర్వహిస్తున్నారు.) వ్యాసకర్త సామాజిక కార్యకర్త‘ మొబైల్: 98490 54339 వందేమాతరం రవీంద్ర -
చదువుతోనే సామాజిక ప్రగతి
రంగారెడ్డి జిల్లా: విద్యారంగాభివృద్ధితోనే సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. శంషాబాద్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో జనాభా అధికంగా ఉన్నా నైపుణ్యాలు కొరవడినపుడు అది శాపంగా పరిణమిస్తుందన్నారు. యువతలో నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. అణగారిన వర్గాలు చదువుకోవడానికి ఎన్నో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం చిన్న జిల్లాల ఏర్పాటుతోనే సమస్యలకు పరిష్కారం లభించదన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో మార్పుతోనే పురోగతి సాధ్యమని చుక్కా రామయ్య స్పష్టం చేశారు. -
‘అక్షరవన’ విద్యావిప్లవం
సందర్భం విద్యార్థి తనకు ఏం కావాలో, ఎలా నేర్చుకోవాలో అర్థం చేయించే విద్యా పరిశోధన కేంద్రాలను అక్షరవనం పేరుతో స్థాపించిన వందేమాతరం ఫౌండేషన్ మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యా విప్లవానికి నాంది పలికింది. అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా విద్యా ప్రమా ణాలు మెరుగుపరుచుకొని అనూహ్యమైన ఆర్థి కాభివృద్ధితో అగ్రపథాన నిలిచాయి. ఆ దేశాల విద్యా విధాన పద్ధతులు పరిశీలిస్తే.. విద్యార్థులు స్వేచ్ఛాయుతంగా తమకు తాము నేర్చుకొనే అవకాశాలను కల్పించిన కార ణంగా ఫిన్‌ల్యాండ్, సింగపూర్, జపాన్, క్యూబా వంటి దేశాలు ముందుకెళుతున్నాయి. ఆ దేశాల తీరును మన పాలకులు, విద్యావేత్తలు అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. నూతనంగా ఏర్ప డిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పనితీరుపై చేసిన సమగ్ర సర్వే కూడా విద్యార్థులు పాఠాలు చదువలేని స్థితిలో ఉన్నట్లు చెప్పడం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు కనీస సామర్థ్యాలు లేకుండా పాఠాలు బోధించడంవల్ల అర్థంకాని విషయాలపట్ల పిల్లవాడికి అనాసక్తి ఏర్పడుతుంది. తరగతిలో మూడు రకాల విద్యార్థులుంటారు. వీరిలో ఒకరు బడికి రావడమంటే బాధగా భావిస్తాడు. ఇంకొకరు అమ్మా నాన్నల కోసం బడికి వచ్చేవారు. మరొకరు ఆసక్తి, అన్వేషణ, ఆనందం, అనుభూతితో బడికి వచ్చేవారు. ఈ నేపథ్యంలో.. విద్యార్థి తనకు ఏం కావాలో, ఎలా నేర్చుకోవాలో అర్థం చేయించే విద్యా పరిశోధన కేంద్రాలను ‘అక్షరవనం’ పేరుతో మొద లెట్టిన వందే మాతరం ఫౌండేషన్ మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యా విప్లవానికి నాంది పలికింది. ఇక్కడ జరుగుతున్న లిటిల్ లీడర్స్, లిటిల్ టీచర్స్ ప్రత్యేక నైపుణ్య శిక్షణ శిబిరాలను స్వయంగా నాలుగు పర్యాయాలు సందర్శించినప్పుడు అమిత మైన అనుభూతి చెందుతూ అరుదైన విద్యా ఒర వడిని గమనించగలిగిన 45 రోజులపాటు జరిగిన శిబిరంలో ఉపాధ్యాయులెవ్వరూ లేరు కానీ విద్యా ర్థులు భాష మీద పట్టు సాధించగలిగారు. స్వల్ప కాలిక వ్యవధిలో చతుర్విద గణిత ప్రక్రియలో అల వోకగా చేస్తూ భీజియ సూత్రాలపై పట్టు సాధించ గలిగారు. విద్యార్థులలో నిద్రాణంగా ఉన్న అనేక ప్రతిభ పాటవాలు వెలికితీస్తూ వాటికి పదును పెడుతూ ఆటపాటల మధ్య అలసట లేని బోధనతో అమ్మానాన్నలను, ఇల్లూ వాకిళ్లనూ వదిలి 45 రోజు లపాటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని 6 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ఆహ్లాదకరమైన అధ్య యనాన్ని ఆనందోత్సాహాల మధ్య కొనసాగిం చారు. అనూహ్యంగా ఉపాధ్యాయులు లేకుండా, విద్యార్థులు లేకుండా పెరిగిన విద్యా సామర్థ్యాలపై అధ్యయనం చేయవల్సిందిగా అప్పటి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవి గారు, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ కేంద్రానికి సిఫారసు చేయగా దాని డైరెక్టర్ కొద్దిమంది విషయ నిపుణులు, పాఠ్యపుస్తక రచయితలను అక్షరవనానికి పంపించారు. మూడు రోజులపాటు సమగ్రంగా పరిశీలించి విస్తృతమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే స్వయంగా విద్యా శాఖ సంచాలకులు అక్షర వనాన్ని సందర్శించి విద్యా బోధనలో నూతన ఆవిష్కరణలు అందించిన అక్షర వనాన్ని అభినందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిశోధ నను పరివ్యాప్తం చేయాలని నిర్ణయించారు. విద్య, ఉపాధి కోసం వలసలకు వెళ్లే పాల మూరు జిల్లాలో అంకురించిన అక్షరవన సందర్శ నకు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రంలోని అనేక పాఠ శాలల విద్యార్థులు దారులు కట్టారు. పాలమూరు జిల్లాకు అక్షరవనం ఒక విద్యా వరప్రదాయినిగా మారనుంది. అంతర్లీనంగా ఉన్న ప్రవృత్తులను ప్రభావితం చేస్తూ తమ వృత్తులలో నైపుణ్యాన్ని తీసుకువచ్చే విలాస విద్యగా పాఠ్యాంశాలకు, పాఠ్యే తర అంశాలకు మధ్య అంతరాలను అక్షరవనం తొలగించింది. ఈ ప్రయోగాన్ని విద్యాధికారులం దరూ ప్రయోగాత్మకంగా చేసి చూపారు. ఇందులో బాలసభ ఒకటి. ఇదో అద్భుతమైన ప్రయోగం. విద్యార్థి స్వేచ్ఛగా తన భావాలు పంచుకొనే వేదిక పిల్లల ఆనందడోలిక. వారమంతా బడి మానేసినా.. వారాంతంలో జరిగే బాలసభలో మాత్రం పిల్లలు బడిలో నిండుగా కనిపిస్తున్నారంటే, అలసటలేని చదువు ఆట, పాటల ఆనందోత్సాహాల మధ్య ఒత్తిడి లేకుండానే అనేక విషయాలను నేర్చుకొనే అవకాశం కల్పించే విధానం అక్షరవనం రూపొం దించింది. తన సామర్థ్యాలను అంచనా వేసి తనకు నేర్పే వారెవరని అన్వేషించే అవకాశం విద్యార్థికి కల్పించగలిగారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్ట డానికి ప్రభుత్వాలు టీచర్‌ను సంస్కరించే ప్రయ త్నాలు చేస్తున్నాయి. అక్షరవనం ప్రయోగ ఫలితాల ఆధారంగా టీచింగ్‌ను సంస్కరించే సత్ఫలితాలు సాధించే అవకాశముంది. ఈ దశగా మనం ఒక అడుగు ముందుకు వేసిన వాళ్లమవుతాము. విద్యార్థి నేర్చుకొనే విధానంపై దృష్టిసారిస్తే తెలంగాణ రాష్ట్ర విద్యా అభివృద్ధిలో దేశంలోకెల్లా అగ్రపథాన నిలు స్తుంది. ( వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు ) -
రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్తదా?
► రైతు అనిపించుకోవడమే అవమానంగా మారింది ► రైతు దీక్షలో టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ ► సంఘీభావం తెలిపిన పలు సంఘాలు, మేధావులు సాక్షి, హైదరాబాద్: రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడ్తదా అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ ప్రశ్నించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ‘రైతు దీక్ష’ను ఆదివారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలా అవమానం జరుగుతున్నదని, రైతు అనిపించుకోవడమే అవమానంగా మారిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతీ రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయాడని, సగటున ఒక్కో రైతుపై రూ.93 వేల అప్పు భారం ఉన్నట్టుగా ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని పేర్కొన్నారు. రైతుల పరిస్థితి దీనంగా ఉందని, వారి సమస్యలను ప్రపంచానికి చాటి చెప్పడానికే దీక్ష చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. రుణమాఫీ చేయడం లేదని, బ్యాంకులు కొత్తగా రుణాలను ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ విధానాలు కూడా రైతును కుంగదీస్తున్నాయని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమే వ్యవసాయమని, 60 శాతం మంది దానిపై ఆధారపడి బతుకుతున్నారన్నారు. వ్యవసాయం బాగుంటేనే వ్యాపారాలు నడుస్తాయన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం తేవాలి.. సమగ్ర వ్యవసాయ విధానం తీసుకురావాలని, విత్తన చట్టం, రైతులకు ఆదాయ భద్రత చట్టం తేవాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వానికి, రైతులకు మధ్య సమన్వయానికి అది ఉపయోగపడుతుందన్నారు. విచ్చలవిడిగా భూసేకరణ జరపాలని, అయితే రైతుకు భూమికి భూమి పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములు ఇస్తేనే కంపెనీలు వస్తాయని చెప్పడం అవివేకమని దుయ్యబట్టారు. వ్యవసాయ నిధి ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని కోదండరామ్ విమర్శించారు. అనివార్యమైన పరిస్థితుల్లోనే దీక్షకు దిగాల్సి వచ్చిందని, ఇందులో రాజకీయం ఏమీలేదని స్పష్టం చేశారు. మొన్నటి సర్వేతో ఓట్లు పడతాయో లేదో తెలియదు కానీ.. వ్యవసాయం విధానం తెస్తే రైతుల ఓట్లు కచ్చితంగా పడతాయని చెప్పారు. తుగ్లక్ పాలన: జస్టిస్ చంద్రకుమార్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, సీఎం కె.చంద్రశేఖర్‌రావుది తుగ్లక్ పాలన అని విమర్శించారు. ప్రభుత్వానికి రైతుల పట్ల సానుభూతి లేదని విమర్శించారు. నకిలీ విత్తన కంపెనీలకు, దళారులకు ప్రభుత్వమే ఏజెంటుగా పని చేస్తున్నదని ఆరోపించారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, సంఘటిత పోరాటాలు లేకపోవడం వల్లే రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, రైతాంగం విచ్ఛిన్నం అవుతున్నదన్నారు. కొత్త అభివృద్ధి నమూనాను రైతాంగ పోరాటాలు ప్రశ్నించేలా ఉండాలన్నారు. రైతులు ఆత్మహత్యలు కొనసాగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. రైతులు నిజాయితీపరులు కావడం వల్లే కేవలం రూ.10 వేల అప్పునకు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ తెలంగాణ కోసం త్యాగాలకు పాల్పడిన వారి గురించి ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. భూములను అమ్మేసుకునే పరిస్థితికి తీసుకువచ్చారని, ఇది కేసీఆర్‌కు మంచిది కాదని హెచ్చరించారు. దీక్షకు మాజీ మంత్రి పురుషోత్తమరావు, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర్రావు, సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, రైతు జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ జలపతిరావు, మాజీ ఎమ్మెల్సీ పి.జనార్దన్ రెడ్డి, మహిళా నేతలు సంధ్య, పశ్యపద్మ, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మిడి నర్సింహా రెడ్డి, గుమ్మడి నర్సయ్య, రైతు సంఘం నాయకులు అంజి రెడ్డి, జేఏసీ ముఖ్య నేతలు పిట్టల రవీందర్, జి.వెంకట రెడ్డి, ఇటిక్యాల పురుషోత్తం, పి.రఘు, ఎన్.ప్రహ్లాద్, బీజేపీ నేత ఎన్.వేణుగోపాల్ రెడ్డి, టీవీవీ అధ్యక్షుడు గురజాల రవీందర్ రావు, టీడీపీ ప్రతినిధి డి.పి.రెడ్డి, ప్రొఫెసర్ రమేశ్ రెడ్డి, రమా మెల్కోటె, వివిధ సంఘాల ప్రతినిధులు, నేతలు, మేధావులు, విద్యావంతులు సంఘీభావం ప్రకటించారు. -
అవినీతి రహిత పాలన అందించాలి
• మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తొర్రూరు: ప్రజల సౌలభ్యం కోసం కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయడమే కాకుండా అవినీతి రహిత పాలనను అందించాలని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా తొర్రూరులో విలేకరులతో మాట్లాడారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో పాలన అన్నివర్గాల ప్రజలకు తక్కువ సమయంలో అందించే అవకాశం ఉంటుందని, అయితే ప్రజలను యాచకులని అనుకోకుండా ప్రభుత్వ ఫలాలు అన్ని వర్గాలకు అందేలా పరిపాలన ఉండాలని సూచించారు. అప్పుడే చిన్న జిల్లాలతో ఫలితాలు వస్తాయన్నారు. విద్యా వ్యవస్థలో కుడా అనేక మార్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా ఉంచాలన్నారు. -
వివక్ష ఉంటే విముక్తి ఎక్కడిది?
సందర్భం తిరిగి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్న ధోరణి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కారణమయింది. ఈ ఉద్యమం ఏ స్వరూపం తీసుకున్నదో నేను మరోసారి మననం చేయదల్చుకోలేదు. కానీ అణచివేత ఉన్నంతవరకూ ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయనీ, దోపిడీ ఉన్నంతవరకూ పోరాటాలు ఉద్భవిస్తూనే ఉంటాయనీ మలి తెలంగాణ పోరాటం రుజువు చేసింది. సమస్యను అర్థం చేసుకోవడానికి బదులుగా, ప్రజా ఆవేశాన్ని అర్థం చేసుకోవడానికి బదులుగా అణగదొక్కడమే పరిష్కారం అనుకొన్నారు. ఏటా సెప్టెంబర్ 17 వస్తుంది. ఆ రోజును మాలాంటి వారు విమోచన దినం అనీ, విముక్తి దినమనీ, విప్లవమనీ వర్ణిస్తూ ఎవరికి నచ్చిన పదాలు, వారి వారి అభిప్రాయాల మేరకు అన్వయిస్తున్నాం. ఆర్భాటంగా ఉపయోగి స్తున్నాం. కానీ ప్రపంచ చరిత్రను సమగ్రంగా చదివితే అలాంటి పదాలకు ఉండే అర్థాలు చాలా విస్తృత స్థాయిలో కనిపిస్తాయి. చాలా లోతులకు మన ను తీసుకువెళతాయి. కానీ మన తెలంగాణకు సంబంధించినంత వరకు సెప్టెం బర్ 17 సందర్భాన్ని ఏ పదంతో స్మరించుకోవాలో నాకర్థం కాలేదు. విమోచనైనా, విముక్తి అయినా... ఒకసారి నేను గతానికి వెళితే ఈ నా పుట్టుకలో నాతో పాటు గ్రామాల్లో ఉండే ప్రజలు బాంచెన్ దొర తీరులో జీవనం సాగించిన వైనం నా కళ్ల ముందు కదులుతూ ఉంటుంది. కాబట్టే ఆ పదానికి ఉన్న అర్థం అంత లోతుగా కనిపి స్తుంది. సామాన్య తెలంగాణ వాసి అనుభవించిన బానిసత్వం, ఆ ఘోర చరిత్ర ఆ పదంలో ప్రతిబింబిస్తుంది. ప్రతిధ్వనిస్తుంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణ బిడ్డ దొర ముందు సాగిలపడేలా చేసిన ఒక దుస్థితికి చారిత్రక ఆనవాలు ఆ పదం. దొరతనాన్ని ధిక్కరిస్తూ, బానిసత్వాన్ని తిప్పికొడుతూ అక్కడ ఆరంభమైన పోరాటమే, మరింత విస్తృతమై నీళ్ళు, నిధులు, కొలు వులు అనే పోరాటానికి మార్గం చూపింది. ఇంకా ఈ ఉద్యమం ఎంత దూరం ప్రయాణించాలో, ఎన్ని మలుపులు తిరగాలో నాకు అర్థం కావడం లేదు. ఈ సందిగ్ధం గురించి ప్రస్తావిస్తే కొంతమంది సాయుధ పోరాటం నుంచి వివ రణ ఆరంభిస్తారు. కానీ ఆనాడు ఆయుధాలు గురిపెట్టింది ఎవరు? నా అను భవం మేరకు ఆనాడు మొదట ఆయుధాలు ఎక్కుపెట్టిన వారు సాధారణ ప్రజలు మాత్రం కాదు. తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రపంచ ఖ్యాతి ఉన్నమాట వాస్తవం. అయినా మరొక అంశం కూడా వాస్తవమే. ఆ పోరాట వేళలోనే కాదు మొద టిగా ఎప్పుడూ ప్రజలు ఆయుధాలు పట్టిన దాఖలాలు నాకు తెలియదు. ఎందుకంటే సాధారణ ప్రజలు కల్లోలాలని ఆహ్వానించాలని అనుకోరు. కాలం మీద గాయాన్ని మిగల్చాలని భావించరు. వారికి కావాల్సింది బాని సత్వానికి చోటు లేని స్వేచ్ఛా జీవితం. అందుకు తుపాకులే అవసరం లేదు. కానీ ఆ పోరులో తూటాలకు బలైనది మాత్రం ప్రజలే. అదైనా పోలీసు తూటాలకు కాదు. భూస్వాముల ఆయుధాలకు బలయ్యారు. అప్పుడు తమను కాపాడుకోవడానికి ఆయుధాలు పట్టే పరిస్థితి వచ్చింది. అంతకంటే ఆ పరిస్థితిని నాటి పాలకులు, పాలక వర్గం తీసుకువచ్చిందనడం సబబు. అది భూపోరాటమే, మత ఘర్షణ కాదు కానీ చరిత్ర మీద ఆ పోరాటం జాడ ఏ రూపంలో ఉంది? ప్రజలే సాయుధ పోరాటం చేశారని ప్రచారం చేశారు. కానీ అది భూపోరాటంగా ఆరంభమైన మాట నిజమే. ఆ తరువాత సాయుధ పంథాను తీసుకున్నది. ఓ పక్క వేల ఎకరాల భూస్వాములు. తిండి లేక ఆకలికి అలమటిస్తున్న ప్రజలు మరోవైపు. తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతి బిడ్డకూ అనుభవంలోకి వచ్చిన అసాధారణ అంతరాలివి. శ్రమించే రైతులున్నారు. కష్టపడే ప్రజలున్నారు. శ్రమ శక్తిని నమ్ముకున్న యువకులున్నారు. పండించేందుకు భూమి మాత్రం వారి చేతిలో లేదు. భూమి ఉన్న వారికి పై లక్షణాలేవీ లేవు. అందుకే ప్రజలు వెట్టిచాకి రిలో మగ్గిపోతున్నారు. అప్పుడే భూమి ఒక చోట, శ్రమ ఒకచోట కాదు; శ్రమించే వాడికే భూమిపై హక్కుండాలన్నారు. ‘దున్నేవాడికే భూమి’ అనే నినాదం ముందుకొచ్చింది. దానికి కమ్యూనిస్టులు అండగా నిలిచారు. ఆ నినాదమే తెలంగాణ ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చింది. అణచివేతకు గురైన ప్రజలు అదే నినాదంతో భూస్వాముల అఘాయిత్యాలను, దుర్మార్గాలను ఎదుర్కొ న్నారు. ఈ నేపథ్యంలోనే మరొక వాస్తవాన్ని కూడా గమనించవలసి ఉంది. ఆ పోరాటం ముస్లింల వ్యతిరేక పోరాటంగా భావించడం సరికాదు. ముస్లిం పాలకుడు కనుక అతనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడారనడమూ తప్పే. అది ముస్లిం వ్యతిరేకపోరాటమైతే బందగీ ఎందుకు చనిపోయినట్టు? అదే నిజమైతే షోయబుల్లాఖాన్ ఎందుకు హత్యకు గురైనట్టు? ప్రజాపోరాటాలు తీవ్రమైనప్పుడు దానికి మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తారు. అది స్వాతంత్య్ర పోరాటం మొదలు, నేటి వరకూ కొనసాగుతోంది. ఆనాడైనా, ఈనాడైనా ఈ రెండు మతాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టడం కొందరి ప్రయోజనం కోసమే. మూడు రోజుల కథ తెలంగాణ ప్రజలు పిడికెడు భూమి కోసం ప్రాణాలర్పించారు. దొరల నుంచి, భూస్వాముల నుంచి ప్రజలు భూమిని స్వాధీనం చేసుకున్న మాట కూడా వాస్తవమే. నాటి నైజాం ప్రభుత్వం ప్రజాభూపోరాటాలను ఎదర్కోలేక కాశీం రజ్వీని ప్రతిష్టింపజేసింది. అతనిద్వారా ప్రైవేటు సైన్యంతో ప్రజల్లో విధ్వం సకాండను సృష్టించింది. చరిత్రలో ప్రభుత్వాధినేతలు ప్రజా ఉద్యమాలను అణచడానికి ప్రభుత్వ ముద్రలేకుండా ఉండేందుకు, తమ ఆధిపత్యాన్ని నిల బెట్టుకునేందుకు ప్రైవేటు వ్యక్తులతో దుర్మార్గాలు చేయిస్తారు. అది దుర్మా ర్గమే అనుకుంటే దాన్ని ఆపడం వారికి పెద్ద కష్టమేం కాదు. కానీ అధికార ముద్ర ఉన్నప్పుడు అదే స్వయంగా దాడులకు పాల్పడుతుంది. అటువంటిదే బైరాన్‌పల్లి పరిణామం. మనుషులను నిలబెట్టి కాలుస్తుంటే ఆపడం నైజాంకి కష్టమేమీ కాదు. కానీ అది రాజముద్ర గల దాడి కాబట్టి ఆపలేకపోయారు. ప్రజలు బలయ్యారు. ఇలాంటి సంఘటనలు తెలంగాణ పోరాటంలో కోకొ ల్లలు. రాజు గారికి భారత ప్రజలతో కలసి ఉండడం ఇష్టం లేక రజాకార్ల పేరుతో తన అభీష్టాన్ని పరిపూర్తి చేసుకునే ప్రయత్నం చేశారు. అది భారత దేశ స్వాతంత్య్రమనే ఉన్నత లక్ష్యానికి అడ్డంకి అని ప్రజలు గుర్తించి తమ భూపోరాటాన్ని ఆ స్వాతంత్య్రోద్యమంతో అనుసంధానించారు. వందల మంది ప్రాణత్యాగాలు చేశారు. భారత సైన్యం జోక్యం తప్పలేదు. కానీ ఇదంతా మూడు రోజుల్లోనే ముగిసింది. ప్రజల సహకారం ఏ స్థాయిలో అందినందువల్ల హైదరాబాద్‌పై త్రివర్ణ పతాకం రెపరెపలాడగలిగింది? జన రల్ చౌదరి కమాండర్ అయ్యాడు. కానీ ప్రజలు సాధించుకున్నటువంటి భూమిని తిరిగి భూస్వాములకు అప్పగిస్తుంటే భారత సైన్యం ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి, భూస్వాముల పక్షాన నిలిచింది. దీంతో ప్రజలు ప్రాణాలర్పించడానికి వెనుకాడలేదు. ఉద్యమంలో తాడో పేడో తేల్చుకోవడా నికి సిద్ధపడ్డారు. అది భూపోరాట విస్తరణ కాదా? అని నేను ప్రశ్నిస్తున్నాను. సెప్టెంబర్ 17 విమోచనమే అయితే ప్రజలు కష్టాల నుంచి విముక్తి అయ్యారా? అని నేను ప్రశ్నిస్తున్నాను. కచ్చితంగా కాలేదు. స్పష్టమైన జవాబుల కోసం ఆరాటం ఈ పోరాటమంతా భూమి మీద హక్కు కేంద్రంగా సాగింది. అందుకే అన్ని ప్రాణ త్యాగాలు జరిగాయి. చిన్నా పెద్దా, స్త్రీపురుష భేదం లేకుండా రణ రంగంలోకి దిగారు. అంతటి త్యాగాలు చేశారు. చివరకు భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపి 1952లో దీన్ని విర మణ చేయించలేదా? అన్నది నా ప్రశ్న. కాబట్టి ప్రజల భూపోరాటాలే పార్లమెంటరీ పంథాగా మార్పు చెందాయి. దాని ఫలితమే భూ సంస్కరణలు. ఆ భూ సంస్కరణలు చిత్త శుద్ధితో అమలు జరపకపోవడమే ప్రజల అశాంతికి కారణమయింది. అదే ప్రజా ఉద్యమానికి దారితీసింది. అంతేకాకుండా హైదరాబాద్‌ని ఒక ఆక్రమిత ప్రాంతంగా పరిగణించే ధోరణిని హైదరాబాద్ ప్రజాస్వామికవాదులు భరించలేకపోయారు. అదే 1969 తెలంగాణ ఉద్యమంగా వచ్చింది. దాని కొనసాగింపే సిక్స్ పాయింట్ ఫార్ములా. కానీ తిరిగి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్న ధోరణి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కారణ మయింది. ఈ ఉద్యమం ఏ స్వరూపం తీసుకున్నదో నేను మరోసారి దాన్ని మననం చేయదల్చుకోలేదు. కానీ అణచివేత ఉన్నంత వరకూ ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయనీ, దోపిడీ ఉన్నంత వరకూ పోరాటాలు ఉద్భవిస్తూనే ఉంటాయనీ మలి తెలంగాణ పోరాటం రుజువు చేసింది. సమస్యను అర్థం చేసుకోవడానికి బదులుగా, ప్రజా ఆవేశాన్ని అర్థం చేసుకోవడానికి బదులుగా అణగదొక్కడమే పరి ష్కారం అనుకొన్నారు. దాన్నే శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయం ద్వారా అమలు చేయాలని చూశారు. ప్రజలకు త్యాగాలు అలవాటేనన్న విషయం పాలకులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. తుపాకీ గుండ్లు గుండెల్లో దిగుతున్నా దిగమింగ డమూ ప్రజలకు ఎవరూ నేర్పక్కర్లేదు. మలి తెలంగాణ ఉద్యమాన్ని శాంతి యుతంగా నడపాలని ప్రయత్నించారు. అన్నీ సహించారు. ఉద్యమం హింసా త్మకంగా మారకుండా చాలా ఓర్పునీ, సహనాన్ని ప్రదర్శించారు. చివరకు దెబ్బలు తిన్నారు. కానీ ప్రభుత్వాలకు ఎప్పటి మాదిరిగానే శాంతి కన్నా పోలీస్ బలగాల పైనే నమ్మకం ఎక్కువ. దీంతో ప్రజలు తమకు తామే ప్రాణత్యాగాలకు పాల్పడ్డారు. ఆత్మ బలిదానాలు చేశారు. ఏ ఉద్యమంలో అయినా ఇన్ని ఆత్మత్యాగాలు చూశామా? ఒక్క పిలుపుతో మిలియన్ మార్చ్ జరుగుతుందా? నెక్లెస్ రోడ్‌పై వానలో తడుస్తూ కూడా ప్రజలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. సాగరహారానికి చివరి వరకు అనుమతివ్వకపోయినా సాగర హారాన్ని విజయవంతం చేసుకున్నారు. వీటిలో ఏ ఉద్యమాన్ని మనం విముక్తి పోరాటం అందాం? ఏ ఉద్యమాన్ని మనం విమోచన పోరాటంగా పిలుద్దాం? తెలంగాణ ఉద్యమంలో ఎన్నో రోజులు విమోచన దినాల వంటివే. అందులో ఎన్నో సెప్టెంబర్ 17లు ఉన్నాయి. త్యాగాలకు సిద్ధమైన జాతికి దేశం కోసం, రాష్ట్రం కోసం బలి అవటమే ఆనందం. ఇది పోరాటాల గడ్డ. ప్రజల జీవితాలు పోరాటాలతో ముడిపడి ఉన్నాయి. అన్యాయాన్ని ధిక్కరించడం ప్రజలకు నేర్పక్కర్లేదు. అణచివేత ఉన్నంత వరకూ, వివక్ష కొనసాగినంత కాలం, ఆర్థిక అంతరాలు కొనసాగి నంత కాలం, దోపిడీ ఉన్నంత వరకూ ఉద్యమాలు కూడా వాటి వెన్నంటే ఉంటాయి. కాకపోతే కాస్త అటూ ఇటూగా ప్రారంభమవుతాయి. అంతే తేడా. ప్రజాస్వామ్యంలో పోరాటాలకు చివరి రోజు ఉండదు. ముగింపు కూడా ఉండదు. రక్త తర్పణ చేసినప్పుడే మాకు పండుగ. కాబట్టి సెప్టెంబర్ 17 చరిత్రలో ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు. కానీ అదే ఉద్యమానికి ముగింపు కాదు, కాకూడదు. (నేడు తెలంగాణ విమోచన దినం) చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు -
అధికారులను తప్పించేందుకే కులంపై చర్చ
రోహిత్ కేసుపై చుక్కా రామయ్య సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారణాలు కనుగొని, వివక్షకు పరిష్కారాన్ని చూపాల్సింది పోయి అతడి కులంపై ఏకసభ్య కమిషన్ అనవసర చర్చకు తెరలేపిందని విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. హెచ్‌సీయూ అధికారులను కేసు నుంచి తప్పించడానికే కులంపై చర్చన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ గురవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామయ్య మాట్లాడారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. మాజీ సీఎస్ కాకి మాధవరావు మాట్లాడుతూ హెచ్‌సీయూ ఘట నలపై ఏకసభ్య కమిషన్ తన పరిధిలు దాటి రోహిత్ కులంపై చర్చించడం దురుద్దేశపూరితమేనన్నారు. రోహిత్ తల్లి రాధిక మాట్లాడుతూ.. పెళ్లయిన ఐదేళ్ల తరువాత భర్త నుంచి విడిపోయానని, ఓ ఎస్సీ కాలనీలో ఉంటున్న తన వద్దే తన పిల్లలు పెరిగారన్నారు. అటువంటప్పుడు ఏ సంబంధమూ లేని వ్యక్తి కులం తన పిల్లలకు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. దళిత్ స్టడీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి లేదు... సొంత ఎజెండానే!
ప్రభుత్వాల తీరుపై చుక్కా రామయ్య సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి నినాదంతో ఎన్నికల్లో గెలిచిన రాజకీయ పార్టీలు, గద్దెనెక్కాక సొంత ఎజెండాలనే తెరపైకి తెస్తున్నాయని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య అన్నారు. దళిత వర్గాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రంలో విద్యారంగ సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ప్రకటన నిమిత్తం గురువారం ఇక్క డ జరిగిన టీఎస్‌యూటీఎఫ్ సమావేశంలో రామయ్య మాట్లాడా రు. ప్రస్తుతం అసెం బ్లీలో రాజకీయాల భాష మారిపోయిందని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూడా రాజకీయ నాయకులకు తామేమీ తీసిపోలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాణిక్‌రెడ్డి... వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా పి.మాణిక్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి ప్రకటించారు. టీఎస్‌యూటీఎఫ్‌తో పాటు ఎస్టీఎఫ్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు, ఎయిడెడ్, కాంట్రాక్ట్ టీచర్స్, యూనివర్సిటీ టీచర్స్ తదితర సంఘాలన్నీ మాణిక్‌రెడ్డి అభ్యర్థిత్వానికి ఏకగ్రీవంగా మద్దతు పలికాయన్నారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి చావ రవి పాల్గొన్నారు. -
విద్యారంగంలో ప్రక్షాళన
సందర్భం నాలుగు దశాబ్దాల క్రితం నాటి ఎంసెట్ విధానాన్ని ఈనాటికీ కొనసాగి స్తున్నారు. అడిగే ప్రశ్నలకు కంఠస్థం చేస్తేనే విద్యార్థులు సమాధానాలు రాయగలుగుతారు. ఇది పిల్లల మెదళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రభుత్వంలో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ఎన్నో పార్శ్వాలతో పరిశీలి స్తారు. ప్రభుత్వ యంత్రాంగం ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. అది చాలా క్లిష్టంగా ఉంటుంది. కానీ దాన్ని పరిష్కరించటంలో ప్రభుత్వ సామర్థ్యం కూడా కనిపిస్తుంది. దానికి ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజ్ సమస్యను ఎదుర్కోవటంలో ప్రభుత్వం ప్రదర్శించిన వైఖరే అందుకు తార్కాణం. విద్యా రంగం ఊహించనంత అవినీతిమయంలో కూరుకు పోయింది. ఈ లీకేజీ తాత్కాలిక సమస్య. గత 25 ఏళ్లుగా ప్రశ్నాపత్రాలు లీక్ అవటం వలన దాన్ని నామమాత్రపు ఎంక్వయిరీలతో దాటవేయటం నేర స్తులకు అది పరోక్ష ప్రోత్సాహంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం అది అడుగులోనే తన వైఖ రిని, పట్టుదలను ప్రదర్శించింది. రాష్ట్ర ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈ కేసును డీజీపీ అను రాగ్‌శర్మకు త్వరితగతిన అప్పగించారు. వృత్తిరీత్యా అనుభవం, విద్యారంగంపై ఆయనకున్న అనుబం ధంతో పట్టుదలతో విచారించారు. కేసీఆర్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి అటు న్యాయస్థా నంలో లీగల్ వ్యవహారాలు చూస్తూ.. సమస్య పరి ష్కారానికి జాగ్రత్తగా అడుగులు వేశారు. ఈ సమస్యను గత ప్రభుత్వాల తీరుగా దాట వేయకుండా, విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలనే తలంపు తెలంగాణ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపి స్తుంది. విచారణ ఎంత నిజాయితీగా జరిగిందో, ప్రభుత్వ నిర్ణయం కూడా అంతే పట్టుదలతో జరి గింది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందిం చాలి. విధాన నిర్ణేతలను అభినందించాలి. మీడి యాను అభినందించాలి. గతంలో కార్పొరేట్ రంగానికి అనుగుణంగా మీడియా ప్రచారం చేసింది. కానీ మీడియా ఇపుడు సమస్యను పరిష్క రించే వాతావరణాన్ని సృష్టించింది. ముఖ్యంగా రెండుసార్లు పరీక్షరాసిన విద్యార్థుల త్యాగం వారి నిజాయితీకి నిదర్శనం. తల్లిదండ్రుల ఆవేదనతో కొంత అలజడికి గురైనా దీర్ఘకాలిక సామాజిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 3వసారి ఎంసెట్ పరీక్ష రాసేందుకు పిల్లలు సిద్ధమయ్యారు. ఇందుకు విద్యార్థుల, తల్లిదండ్రుల మానసిక పరి పక్వతను అభినందించాలి. ఇలాంటి లీకేజీ సమస్య తెలంగాణలో చివరిది కావాలనే నా కోరిక. వైద్య విద్య అత్యంత కీలకమైనది. అదొక పెద్ద పరిశ్రమగా తయారైంది. మేనేజ్మెంట్ మెడిసన్ సీటు కోటి రూపాయల ధర పలుకుతుంది. మేనే జ్మెంట్ సీట్లపైన ఏదో ఒక నియంత్రణ లేకుంటే రాబోయే డాక్టర్లు తమ సీటు కోసం ఇచ్చిన డబ్బును ఏ విధంగానో భర్తీ చేసుకునే పరిస్థితి ఉంటుంది. మేనేజ్మెంట్ సీట్ల వ్యవహారం జనరల్ కేటగిరీపై కూడా పడుతుంది. కాబట్టి యాజమాన్య కోటా సీట్లను సంస్కరించుకోకుంటే ప్రస్తుత పరి స్థితి తిరిగి పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ఈ పరీక్ష అయిన తర్వాత యాజమాన్య కోటా సీట్ల విషయమై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 4 దశాబ్దాల క్రితం ఎంసెట్ ఏ ప్యాట్రన్‌ను ఇచ్చారో ఈనాటి వరకు అదే పద్ధతి కొనసాగుతోంది. 3 గంటల్లో 160 ప్రశ్నలను చేస్తే 159 మార్కులు వస్తున్నాయి. విద్యార్థులు ప్రశ్నలకు కంఠస్థం చేస్తేనే సమాధా నాలు రాయగలుగుతారు. ఇది పిల్లల మెదళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల విద్యార్థు లలో సహజత్వం దెబ్బతింటుంది. ఈ విధానం వల్ల రొటీన్‌గా ఆలోచించే డాక్టర్లే తయారవుతారు. మెడిసిన్ విద్య ప్రపంచంలో వేగవంతంగా మార్పులకు గురవుతుంది. కానీ డాక్టర్‌గా తయా రయ్యే వ్యక్తి మార్పులను అందుకునే పదును కలిగి ఉండాలి. అడ్మిషన్ పాలసీ మారనంతవరకు మన డాక్టర్లు మారుతున్న వైద్యరంగం వేగాన్ని అందు కోలేరు. ఒరిజినాలిటీ చూడాలి. కంటెంటుతోపాటు ఆలోచించేవారిగా పిల్లలను తయారు చేయాలంటే ఎంట్రెన్స్ విధానంలోనే సంపూర్ణ మార్పులు చేయాలి. ఈ 3వ ఎంసెట్ పరీక్ష అయ్యాక ఒక కమిటీనీ నియమించి అడ్మిషన్ పాలసీని కూడా మార్చాలి. దీనికోసం వివిధ దేశాల్లో ఏ పద్ధతి అవలంబిస్తున్నారో దానిపై అధ్యయనం జరగాలి. ఇది కుదరకపోతే ‘నీట్’ వ్యవస్థకైనా అప్పగించాలి. మెడికల్ అడ్మిషన్లలో కూడా మార్పులు తీసు కురావాలి. దీనితో సహా నీట్ పరీక్ష అంటే ఉన్న భయాన్ని తొలగించాలి. ఇంటర్మీడియట్లో బోధనా పద్ధతులను కూడా సంస్కరించుకోవాలి. ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందిస్తూ చేయవలసిన ఈ కార్యక్రమంపై సత్వర చర్యలు తీసుకుంటేనే మెరుగైన డాక్టర్లు తయారవుతారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య భ్రష్టు పట్టింది. ఇంజనీరింగ్ విద్య, డిగ్రీ కాలేజీల వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాలి. విద్యారంగ సమస్యల తీగను కదిలించారు. ఈ పనితో మొత్తం విద్యారంగం డొంకంతా కదిలింది. ప్రక్షాళన జర గాలి. అప్పుడే సమర్థ తెలంగాణ సాధ్యం. వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు చుక్కా రామయ్య -
వసతిగృహల్లో విద్యార్థుల పరిస్థితి దారుణం
⇒ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ⇒ కందుకూరులో ఎస్ఎఫ్ఐ సైకిల్‌యాత్ర ప్రారంభం కందుకూరు : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, విద్యారంగ సమస్యల పరిరక్షణ కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా సైకిల్ యాత్రను ఆయన ప్రారంభించారు. అంతకుముందు స్థానిక ముదిరాజ్ భవన్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వనతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు సరైన భోజనం అందక పౌష్టికాహార లోపంతో అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నారన్నారు. కనీస సౌకర్యాలు కరువవడంతో బాలికలు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటి వరకు పోరాటాల ద్వారానే హాస్టళ్లలోని సమస్యలను పరిష్కరించుకున్నామే తప్ప.. ఎవరి దయాదాక్షిణ్యాలతో కాదన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడంతో పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు, ఉద్యమాలు తప్పవన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎస్ఎఫ్ఐ సంస్థను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డీ జగదీష్, రాజేంద్రనగర్ జోన్ కార్యదర్శి ఆనంద్, అధ్యక్షుడు కేవై ప్రణయ్, నాయకులు హరి, ప్రభావతి, మల్లేష్, భాను, వాజిద్, సాయి, మహేష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
బాసరలో గురుపౌర్ణమి
-
'హైదరాబాద్ నాలెడ్జ్ హబ్ కాదు.. దోపిడీ అడ్డా'
హైదరాబాద్: హైదరాబాద్ నాలెడ్జి హబ్ కాదని, దోపిడీకి అడ్డాగా మారిందని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. విద్యా వ్యాపారం ప్రజాస్వామ్యానికి దెబ్బ అని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా శనివారం ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ... తల్లిదండ్రులను కస్టమర్లుగా చూస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. పిల్లల ఫీజులను పెట్టుబడిగా పెట్టి మంత్రుల పదవులను కొంటున్నారని వ్యాఖ్యానించారు. మధ్య తరగతి ప్రజలను రోడ్డెక్కించిన ఘటన ఈ ప్రభుత్వాలదేనని మండిపడ్డారు. విప్లవం ఎంతో దూరంలో లేదన్నారు. స్కూల్ మేనేజ్మెంట్లు దిగిరావాలని, స్కూల్ కమిటీలో తల్లిదండ్రులకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. -
అవకాశాలకు ఆకాశమే హద్దు
సందర్భం దాదాపు 13 వందల మంది పిల్లలను గ్రామాల నుండి తీసుకువచ్చి భోజన, వసతి సౌకర్యాలు కల్పించి 50 రోజులపాటు శిబిరం నడపడం, జాతిపట్ల అక్షరవనం సంస్థకు ఉన్న ఆదుర్దాను వెలిబుచ్చడం అభినందనీయం. ఉన్నత విద్య కేవలం ఉద్యోగం కోసమే కాదు. మనిషిలో దాగి ఉన్న పరిమళాన్ని ప్రపంచానికి చాటడా నికి ఒక మాధ్యమం మాత్రమే. ప్రతి మనిషిలో ప్రతిభ దాగి ఉంటుంది. నిద్రాణంగా ఉన్న ఆ ప్రతిభను సమాజపరం చేయడానికి ఉన్నత విద్య ఒక మాధ్యమం. సమాజం అందరికీ సమానమైన అవకాశం కల్పించాలి. ఎవరికి ప్రతిభ ఎందులో దాగి ఉంటుందో తెలియదు. బుర్రకో బుద్ధి జిహ్వకో రుచి అన్న చందంగా సమాజం అన్ని అభిరుచులకు అది బఫే భోజనం. ఎవరికి ఎందులో ఆసక్తి, అభిరుచి ఉంటాయో వారి వారి అభిరుచుల మేరకు ఆయా రుచులతో కూడిన పదా ర్థాలను అందుకుంటారు. సమాజం సకల అభిరుచుల సమ్మేళనం. అభిరుచులను అందుకోవడం కష్టం. అవకా శాలు కల్పిస్తే ఆశయాలు మొగ్గ తొడుగుతాయి. వాటికి పదును పెడితే అపారమైన ప్రతిభ వెలికివచ్చి ప్రపంచానికి సంపదను సృష్టించి సమాజ అవసరాలను తీరు స్తాయి. ప్రతిభావంతమైన జాతి నిర్మాణానికి వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో అక్షరవనం అనే వేదికను ఏర్పాటు చేసింది. అపారమైన మానవ సంపదగల ఈ జిల్లాలో విద్యార్థుల లోని అంతర్లీనంగా ఉన్న ఆసక్తులను వెలికితీసేందుకు వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఒక బఫేలాగా విద్యార్థులు వాడుకుంటున్నారు. ఇక్కడ తినుబండా రాలు కావు మైండ్‌కు కావలసిన బండారాలను వందేమాతరం ఏర్పాటు చేసింది. ఈ శిబిరాన్ని సంద ర్శించినప్పుడు నేను అపారమైన నాట్య, వాద్య, గాత్ర, సాహిత్య, జానపద, చిత్ర, జ్ఞాన, గణిత కళలలో అబ్బో ఒకటేమిటి 14 రంగాలలో ప్రతిభా పాటవాలను వెలికి తీస్తున్నారు. ఒక గదికి వెళితే తబలా వాయించడం, మరో గదికి వెళితే డప్పు కొట్టడం, మరో గదిలో భరతనాట్యం చేయించడం, మరో చోట పల్లెపాటలు, నాట్లు వేసేటప్పుడు పాడే పాటలు ఈ విధంగా ఆట పాటలను మాటలతో కలిపి చిన్నపిల్లలో దాగి ఉన్నటు వంటి ప్రతిభను గిచ్చి లేపుతున్నారు. మనిషిని గిచ్చితే తెలవకుండానే తొడ జాడిస్తాడు. అదే విధంగా 13 వందల మంది పిల్లలను గ్రామాల నుండి తీసుకువచ్చి భోజన, వసతి సౌకర్యాలు కల్పించి 50 రోజులపాటు శిబిరం నడపడం, జాతిపట్ల ఆ సంస్థకు ఉన్న ఆదుర్దాను వెలిబుచ్చడం అభినంద నీయం. దీనికి చేయూతనిస్తున్న ఆ జిల్లా కలెక్టర్ మాతృ హృదయాన్ని చాటుతుంది. పిల్లల కోసం అమ్మవలె ఆరాటపడిన తీరు జిల్లా కలెక్టర్ ముఖంలో కనబడింది. జిల్లా వ్యాప్తంగా ఆమె చొరవ తీసుకొని 2000 మంది పిల్లలకు తల్లిగా మారి శిబిరాల నిర్వహణకు ఆరాట పడుతున్న తీరు నన్నెంతగానో కదిలించింది. అక్షర వనానికి స్థలాన్ని విరాళమిచ్చిన ఫౌండేషన్ కార్యదర్శి మాధవ్ ముఖంలో జీవితం సార్థకమైనదన్న సంతృప్తి కనిపించింది. వెలికి వస్తున్న పిల్లల ప్రతిభను చూసి ఎంతో ఆనందంతో మాధవ్ మాట్లాడుతూ నాట్యం చేస్తాడు. నిన్నటి వరకు బెంగళూరు నుంచి కూలీలను తీసుకు పోవడానికి యజమానులు మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చేవారు. కానీ ఈరోజు అదే యజమానులు విజ్ఞాన సంస్థలను సందర్శించడానికి మహబూబ్‌నగర్‌కు వస్తు న్నారు. ఆ మార్పుకు కారణమైన వాటిలో మా మాధవ రెడ్డి పాత్ర ఉంది అంటే అది అతిశయోక్తి కాదేమో. ఇది కేవలం ఆటే కదా అనుకున్నాను. బహుశా నాలో దాగి ఉన్న జిజ్ఞాసను గిల గిల పెట్టించడానికి ఒక గదిలోకి తీసుకెళ్లారు. తాతా గణితం నువ్వే చెప్పగల్గుతావని అను కున్నావు కదా! కానీ నేను కూడా చెప్పగలనని పదేళ్ల పిల్లవాడు లిటిల్ టీచర్లా నా ముందుకొచ్చి గణితంలో ప్రాథమిక సూత్రాలు గబగబా చెబుతుంటే, సున్నాను కనుక్కున్న వారెవరో కానీ ఆ చిన్నారి మాత్రం ప్రస్ఫు టంగా బాల గణిత మేధావిగా కనిపించాడు. మనిషిలోని మనసుతో అభీష్టాన్ని బయటకు లాగడానికి వీరు వేసవి సెలవులలో క్యాంపులను నడిపిస్తారు. కొందరికి టెక్నాలజీ, సైన్స్ మీద అభిలాష, మరికొందరికి తను చేసే వృత్తిపై అభిరుచి, పిల్లల ప్రవృత్తికి తల్లిదండ్రులు అవకాశాలను సమకూరుస్తారు. అమెరికాలోని సిన్సినాటీలో నా స్వంత మనవడు న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్నాడు. వాడు 9వ తరగతిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాడి ఆసక్తిని గమనించి హాస్పిటల్‌కు తీసుకెళ్లి అక్కడ రోగులకు మందులు సర ఫరా చేయడం అలవాటు చేశారు. నా కూతురు, అల్లుడితో ‘ఇదేనా మీరు నేర్పించింది’ అన్నాను. అప్పుడు వారు ‘మీకు కనబడింది ఇంతే’ అన్నారు. ‘దాని వెనుక రోగిపట్ల సంరక్షణ, వాత్సల్యత వృద్ధి చెంది, వైద్యం పట్ల పెరిగిన నిబద్ధత వాడి మొహంలో కనబడట్లేదా’ అన్నారు. ‘ఇదే ప్రాక్టికల్ లెర్నింగ్’ అన్నారు. వేసవిలో ఆ పిల్లవాడు ఇండియాకు వచ్చాడు. తాత, అమ్మమ్మలకు మనవడు కాబట్టి చిట్టి పంజరంలో చిలుకను పెంచినట్లు పెంచేద్దాం అనుకున్నాం. కానీ వాడు ఇంట్లో ఉంటే కదా..! రెక్కలు వచ్చిన పక్షిలా, మా బంధువుకు ఆపరేషన్ అవుతుంటే థియేటర్లో ప్రత్య క్షంగా చూడడానికి వెళ్లాడు. ప్రతి పిల్లవాడు చిన్నప్పటి నుండే కలలు కంటాడు. అమ్మ, నాన్నలుగా వారికి అవకాశాలు కల్పించాలి. ఇలాంటి అవకాశాలకు అక్షరవనం ఒక వేదిక అయింది. చదువు చెప్పడం కంటే నేర్చుకోవడం ఎలాగో నేర్పించే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. తనకు తానుగా ఆసక్తితో తన చుట్టూ ఉన్న అవకాశాలను అంది పుచ్చుకుని ఆశయాలను మెరుగు పరచుకుంటున్న తీరు ఆసక్తికరంగా ఉంది. పాఠశాల స్థాయిలో పిల్లల్ని పట్టు కొని పాఠాలు చెప్పడం పరిపాటి. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకున్న ఇక్కడి విద్యార్థులకు ఉపాధ్యాయుల వద్ద పాఠాలు ఎలా నేర్చుకోవాలో అర్థమైంది. ఇది తెలియక సందేహాలను నివృత్తి చేసుకోలేక చదువులో వెనుకబడు తున్నారు. పాలమూరు జిల్లాకు అక్షరవనం ఒక విద్యా వర ప్రదాయిని. ఈ పరిశోధన కేంద్రంలో జరుగుతున్న ప్రయత్నం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో విస్తరించాలి. పిల్లల్లో నిద్రాణంగా ఉన్న జ్ఞాన కిరణాలను తట్టి లేపాలి. తనకు ఏది కావాలో వెతుక్కునే అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా పిల్లలు దూసుకుపోతారు. వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు -
ప్రగతికి తర్కం ప్రధానం
సందర్భం: మిలటరీ కోసం ఖర్చు చేయటం కంటే ప్రజల ఆలోచనా పద్ధతుల్లో రావాల్సిన మార్పులపై దేశాలు దృష్టి సారిస్తున్నాయి. హేతుబద్ధత అన్నది ప్రశ్నించటానికి మూలం అవుతుంది. ఏ మతమైతే ఇతరుల భావనలను ఎదగనీయదో అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా ఎదగదు. 1960లో విజ్ఞాన శాస్త్రంలో వచ్చిన ఆవిష్కరణలు మానవ సమాజంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిం చాయి. ప్రజలలో నూతన ఆలోచనలు రేకెత్తించాయి. కొన్ని దేశాలు అన్ని రంగాల్లో ఎలా విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్నాయి? మరికొన్ని దేశాలు ఎందుకు వెనుకబడిపోతున్నాయి? దీనికి కార ణం ఏమిటిదని ఆలోచనలు మొదలయ్యాయి. కొన్ని దేశాల అభివృద్ధి ఎందుకంత మందకొండిగా ఉందని ఆర్థికవేత్తలు లారెన్స్ హరిసన్, షాంబెల్ హల్టింగ్సన్లు అనేక పరిశోధ నలు చేశారు. ఒకదేశం నాగరికత కూడా ఆ దేశ ఆర్థిక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందని వీరు సూత్రీకరించారు. నాగరికత, సంస్కృతి అంటే ఏమిటో చాలా మందికి స్పష్టత ఉండదు. నాగరికత అంటే జాతీయత మాత్రమే కాదు. జాతి బృందాలు మాత్రమే కాదు. నాగరికత అంటే మతం కూడా కాదు. మూఢవిశ్వాసాలు అంతకంటే కాదు. జాతీయత, రంగు, ప్రదేశము, మతము యొక్క సమగ్ర రూపమే సంస్కృతి. ఒక దేశం ఆర్థిక ఎదుగుదలకూ లేదా వైఫల్యానికీ ఆ దేశ సంస్కృతే కారణభూతమౌతుంది. సంస్కృతి ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అది నిత్యం పరిభ్ర మిస్తూ ఉంటుంది. మారుతూ ఉంటుంది. ఇంగ్లాండు, ఐర్లాండ్‌లు ఒక దేశంలోని భాగాలు, ఐర్లాండ్ ప్రగతిలో మందకొడి తనాన్ని ఇంగ్లాండ్ తరుచుగా హేళన చేసేది. ఐర్లాండ్‌లో కరు వుకు కారణం అక్కడివారి సోమరితనమే అని సామెతలుగా బ్రిటిష్‌వాళ్లు చెప్పేవారు. ఐర్లాండు అంటే ఉడకబెట్టిన ఆలుగడ్డలు అని కూడా వ్యాఖ్యా నించేవారు. కూర్చుని తింటే కరువులు ఎందుకు రావు అని ఆనాడు విన్స్టన్ చర్చిల్ వ్యాఖ్యానించారు. బ్రిటిష్ హయా ములో మనదేశ ప్రజలు కూడా కూర్చుని తినటం వల్లనే కరువులు వచ్చాయన్నారు. కానీ, 1970లో యూరప్‌లో అన్ని దేశాలకంటే ఐర్లాండ్ జీడీపీ బాగా పెరిగింది. అదే భారతదేశంలో 1973లో ఆహార కరువు వచ్చింది. నాగరికత ప్రభావం కూడా ఎప్పుడూ స్థిరం గా ఉండదు. ఉదాహరణకు దక్షిణ కొరియా, ఆఫ్రికాలోని థానా ఆర్థిక పరిస్థితి 1960ల వరకు ఒకే రకంగా ఉండేది. కానీ థానా అభివృద్ధి మందకొడిగా ఉంది. సౌత్‌కొరియా ఆర్థిక వ్యవస్థ భేషుగ్గా ఉన్నదని ఆర్థిక శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ వ్యాపారంలో దక్షిణ కొరియా వేగవంతంగా అభివృద్ధి చెందింది. గ్రీసుదేశాన్ని దాటిపోయింది. ఈ ఎదుగుదలకు ఆ దేశాల సంస్కృతి, నాగరికతే కారణమని పలువురు ఆర్థికవేత్తల వ్యాఖ్యానం. ప్రధానంగా బౌద్ధమతం, సౌత్‌కొరియా ఆలోచనా విధానాన్ని మార్చివేసింది. జసాన్, సౌత్‌కొరియా, ఐర్లాండ్, శ్రీలంక దేశాలలో బౌద్ధమతం వలన విద్యావ్యాప్తి వేగంగా జరిగింది. ఇతర మతాలు విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. బౌద్ధమతంలో గ్రంథాలు చదవటమే ప్రధానం. అధ్యయనం ముఖ్యమైనది. అందుకే జపాన్‌లో 16వ శతా బ్దంలోనే సంపూర్ణ అక్షరాస్యతను సాధించారు. మత గ్రంథాలు ప్రమాణం కాబట్టి ఆ గ్రంథాలను చదవటమే బౌద్ధ మతం విస్తృత ప్రచారానికి ప్రధాన కారణం. బౌద్ధమతానికి తర్కం ప్రధానం కాబట్టి ఆ దేశాల యొక్క అభివృద్ధికి అదే కారణమైందని పలువురు ఆర్థికవేత్తలు విశ్లేషించారు. జపాన్ దేశంలో అమెరికా కన్నా రెండున్నర రెట్లు అధికంగా పుస్తకాలు ముద్రించబడ్డాయి. జపాన్ అభివృద్ధి వెనుక అక్కడ నెలకొన్న బౌద్ధమతం, పుస్తకాలే కారణం. అంటే మతం, నాగరికత కూడా ఎలా అభివృద్ధికి దోహదపడతాయో జపాన్, ఐర్లాండ్ లాంటి దేశాలు తెలియజేస్తున్నాయి. కొన్ని దేశాలను కర్మ సిద్ధాంతం కుంగదీసింది. కేవలం దైవానుగ్రహంపైన అభివృద్ధి ఆధారపడి ఉంటుందని కొన్ని దేశాలు భావించాయి. మతమౌఢ్యాలు బలంగా వున్న దేశా లలో ప్రతి దానికి మతమౌఢ్యమే ప్రధానమనుకునే భావనలో ఉన్నారు. శాస్త్రీయ చింతన లేకుండా అభివృద్ధి అసాధ్యం. మనిషి ఆలోచనే ఆ సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. 21వ శతాబ్దంలో ఏ దేశమైనా గాని ప్రగతి సాధించాలంటే ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. ఆ మార్పు హేతుబద్ధంగా ఉండాలి. మౌఢ్యం సమాజాన్ని శాసిస్తోంది. రాజ్యాంగ నిర్మాణంలోనే సైంటిఫిక్ టెంపర్‌ను కలిగిం చాలని ఆనాడే నెహ్రూ చెప్పారు. మనిషి శ్రమ వెనుక ఆలోచనే ప్రధానం. ఆలోచనపైన సంస్కృతి ప్రభావం ఎక్కు వగా ఉంటుంది. 21వ శతాబ్దంలో మిలటరీ కోసం ఖర్చు చేయటం కంటే ప్రజల ఆలోచనా పద్ధతుల్లో రావాల్సిన మార్పులపై దేశాలు దృష్టి సారిస్తున్నాయి. హేతుబద్ధత అన్నది ప్రశ్నించటానికి మూలం అవు తుంది. ఏ మతమైతే ఇతరుల భావనలను ఎదగనీయదో అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా ఎదగదు. హేతుబద్ధత పెర గాలంటే అవగాహనాశక్తి పెరగాలి. అందుకే మన రాజ్యాంగంలో మొదటి వాక్యంలోనే దేశం భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్ణయమవుతుందన్నారు. తరగతి గది అంటే గోడలు కావు. దాని వెనుక రేకెత్తించే ఆలోచనలున్నాయి. వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు చుక్కా రామయ్య -
ఉజ్వల భవిష్యత్తుకు ‘భవిత’
♦ నూతన ఆవిష్కరణలకు ‘సాక్షి’ నాంది ♦ సాక్షి భవిత ఆవిష్కరణ వేడుకలో చుక్కా రామయ్య ♦ ‘సాక్షి’ కృషిని అభినందించిన వక్తలు ♦ కరీంనగర్లో ఘనంగా ఆవిష్కరణోత్సవం సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విద్యార్థులు, ఉద్యోగార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సాక్షి ‘భవిత’ పునాది వంటిదని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. వార్తలే కాకుండా సమాజానికి ఉపయోగపడాలనే కాంక్షతో పత్రిక మెయిన్ ఎడిషన్‌లో రోజూ భవిత అనుబంధానికి 2 పేజీలు కేటాయించి విద్యార్థుల భవిష్యత్తును బంగారుమయం చేస్తోందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో సాక్షి తెలుగు దినపత్రిక మెయిన్‌లో రోజూ ప్రత్యేకంగా అందిస్తున్న భవిత పేజీలను బుధవారం కరీంనగర్లో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎస్పీ జోయెల్ డేవిస్‌లతో కలసి ఆయన ఆవిష్కరించారు. నగరంలోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో సాక్షి నెట్వర్క్ ఇన్చార్జి కె.శ్రీకాంత్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా పలు కాలేజీల విద్యార్థులు, ఉద్యోగార్థులు తరలివచ్చారు. ఎడిటర్ వి.మురళి ప్రారంభోపన్యాసం చేస్తూ భవితకు సాక్షి మెయిన్ ఎడిషన్‌లో 2 పేజీలు కేటాయించడం వెనుక ముఖ్య ఉద్దేశాలను వివరించారు. కరీంనగర్ జిల్లా జైలు సూపరింటెండెంట్ శివకుమార్, సాక్షి ఫైనాన్స్, అడ్మిన్ డెరైక్టర్ వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి, ఎంసెట్ కన్వీనర్ రమణారావు, సబ్జెక్టు నిపుణులు గురజాల శ్రీనివాసరావు, శాతవాహన వర్సిటీ ప్రొఫెసర్ మనోహర్‌రావు, సాక్షి మఫిసిల్ ఎడిటర్ చలపతిరావు, సర్క్యులేషన్ జీఎం సోమ సురేందర్ తదితరులు హాజరయ్యూరు. సాక్షి భవిత... ఒక దీక్ష: చుక్కా రామయ్య సాక్షి దినపత్రికకు భవిత ఒక దీక్ష అని చుక్కా రామయ్య అన్నారు. ‘‘నాలెడ్జ్ సెంటర్‌గా పేరొందిన కరీంనగర్లో భవితను ఆవిష్కరించడం ముదావహం. విద్యారంగ బీజా లు వేయడానికి కరీంనగర్ జిల్లా అనువైన ప్రాంతం. ఈ డిజిటల్ యుగంలో వర్తమాన విషయాలే గాక భవిష్యత్తు అంశాలను కూడా భవిత ద్వారా విద్యార్థులు నేర్చుకోవచ్చు. విద్యా రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా ఎప్పటికప్పుడు పలు అంశాలపై సాక్షి భవిత అందిస్తున్న సమాచారం విలువైంది.’’ అని చెప్పారు. భవిత.. దిక్సూచి కావాలి: కలెక్టర్ నీతూప్రసాద్ ఏటా ప్రభుత్వోద్యోగాల సంఖ్య తగ్గుతున్న విషయాన్ని విద్యార్థి లోకం గమనించి ప్రైవేటు ఉద్యోగాలపై దృష్టి సారించాలని కలెక్టర్ నీతూప్రసాద్ సూచించారు. ఇక నుంచి ఆకాశమే హద్దుగా పట్టుదలతో ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగార్థులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం ‘భవిత’ ద్వారా సాక్షి విలువైన సమాచారం అందించడం అభినందనీయమన్నారు. డిజిటల్ యుగపు మార్పులకనుగుణంగా విద్యార్థులు పయనించాలని సూచించారు. అవగాహనలేని విద్యార్థులకు భవిత దిక్సూచి కావాలన్నారు. భవితతో భావి ప్రణాళిక: ఎస్పీ జోయెల్ డేవిస్ గ్రామీణ నిరుద్యోగ యువత ఉన్నత చదువులు, పోటీ పరీక్షలు, ఉద్యోగాలపై అవగాహన లేక నష్టపోతున్నారని ఎస్పీ జోయెల్ డేవిస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రణాళిక రూపొందించుకునేలా సాక్షి భవిత దిశానిర్దేశం చేస్తోందని అభినందించారు. కోచింగ్‌కు వెళ్లే స్థోమత లేనివారికి సాక్షి భవిత ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అన్ని వర్గాలకూ స్థానం: సాక్షి ఎడిటర్ మురళి విద్యా రంగానికే కాకుండా రైతులు తదితర అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యతతో అవసరమైన సమాచారాన్ని సాక్షి ఎనిమిదేళ్లుగా అందిస్తూనే ఉందని ఎడిటర్ మురళి అన్నారు. పోటీ పరీక్షలకు కీ పేపర్ తయారు చేయడం సాక్షితోనే ప్రారంభమైందని, చాలాసార్లు వంద శాతం సరైన సమాధానాలిచ్చి లక్షలాది మంది మన్ననలు చూరగొన్నామన్నారు. భవితకు అత్యధిక ప్రాధాన్యం: వైఈపీ రెడ్డి ఎనిమిదేళ్లుగా ఎన్ని ఇబ్బందులొచ్చినా విద్యార్థులకు, యువతకు ఉపయోగపడే సాక్షి భవితకు పత్రికలో అధిక ప్రాధాన్యమిస్తున్నామని ఫైనాన్సియల్ డెరైక్టర్ వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు భవిత వేదికగా మారాలని ఆకాంక్షించారు. నాలుగో తరగతి నుంచి మొదలుకుని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యతోపాటు ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి సమాచారమూ అందిస్తామన్నారు. పరీక్ష విధానంలో వినూత్న మార్పులు: గురజాల పోటీ పరీక్షల్లో వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయని సబ్జెక్టు నిపుణులు గురజాల శ్రీనివాస్‌రావు అన్నారు. గ్రూప్స్‌తోపాటు అన్ని పోటీ పరీక్షల్లోనూ సమకాలీన అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. కాబట్టి భవిత మెటీరియల్‌నూ విశ్లేషణాత్మకంగా ఇవ్వాలని కోరారు. కాలేజీల ఎంపిక కీలకం: రమణారావు ఎంసెట్‌కు సిద్ధమయ్యే విద్యార్థులకు భవిత ఎంతో ఉపయోగకరమని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు కావాల్సిన ప్రశ్నలు, జవాబులతోపాటు కాలేజీలు, గ్రూప్‌ల ఎంపిక తదితర విషయాలను భవిత ద్వారా అందించాలని కోరారు. సాక్షి అందిస్తున్న భవితతో విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని ప్రొఫెసర్ మనోహర్ అన్నారు. సాక్షి భవిత అద్భుతమని తహసీల్దార్ జయచంద్రారెడ్డి అభినందించారు. ఉద్యోగ ఎంపికకు దోహదం ‘‘నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. క్యాంపస్‌లో ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా కోచింగ్ సెంటర్‌కు వెళ్లాను. సాక్షి భవిత నాకెంతగానో ఉపయోగపడింది. భవిత, విద్య పేజీల ద్వారా ఎంతో ప్రాక్టీసైంది. పలు నోటిఫికేషన్లు వస్తున్న నేపథ్యంలో భవిత పేజీలను ప్రతి రోజూ అందించడం అభినందనీయం’’ - అరుణశ్రీ, డీఆర్డీఏ పీడీ భవితతోనే ఉద్యోగం సాధించా ‘‘నేను సాక్షి భవిత చదివే ఉద్యోగాన్ని సాధించా. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పద్ధతులతో పాటు ఉద్యోగానికి సంబంధించిన అంశాలు భవితలో చాలా చక్కగా ఉంటాయిు. భవితతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడం సామాజిక బాధ్యతగా స్వీకరించిన సాక్షికి ధన్యవాదాలు’’ - నవాబ్ శివకుమార్, కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ -
సాక్షి భవిత ఆవిష్కరణ
కరీంనగర్: విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఉపయోగపడేలా సాక్షి దినపత్రికలో నిత్యం భవిత పేజీలు ప్రారంభించటం అభినందనీయమని విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. బుధవారం కరీంనగర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన భవిత ప్రారంభ సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ 'విద్యలో డిజిటల్ విప్లవం వచ్చింది. దేశం భవిష్యత్తు యువత చేతిలో ఉంది. యువత, విద్యార్థుల సమస్యలను ఏ పత్రికలు ఉపేక్షిస్తాయో ఆ పత్రికలు ఎక్కువ కాలం నిలుస్తాయి. సాక్షి యాజమాన్యం చేసేది దీక్ష లాంటిది. ప్రతిరోజు కొత్త ఐడియాను సాక్షి ఆవిష్కరిస్తుంది. ప్రజలను భవిత వైపు మరల్చడానికి సాక్షి చేస్తున్న కృషి అభినందనీయం. ఒక ప్రశ్నకు ఒక సమాధానం అనే కాలం పోయింది నేడు ఏడు సమాధానాల కాలం వచ్చింది. మారిన పరిస్థితులకు అనుకూలంగా విద్యారంగంలో మార్పు చేయకుంటే విద్యార్థులు వెనకబడతారు. సమస్యలకు హైదరాబాద్ లో పరిష్కారాలు దొరకవు పల్లెటూరులో దొరుకుతాయి. పత్రికలు వర్తమానం వార్తలే కాదు రేపటి వార్తలకు భూమికను పోషించాలి. సాక్షి భవితను చదువుతూ భవిష్యత్తును చక్కదిద్దుకోవాలి' అన్నారు. సాక్షి ఫైనాన్స్ డైరెక్టర్ ఈశ్వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు మేలు చేయడానికే భవితను ప్రతిరోజు తీసుకు వస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటర్ వి.మురళి, కరీంనగర్ ఎస్పీ జోయెల్ డేవిస్ తదితరులు ఉన్నారు. అదే విధంగా గుంటూరు లో జరిగిన కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి భవిత సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెసిడెంట్ ఎడిటర్ ఆర్.ధనుంజయ్ రెడ్డి, విజ్ఞాన్ రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక నుంచి సాక్షి భవిత మెయిన్ ఎడిషన్ లో రెండు పేజీల్లో వెలువడనుంది. -
పిల్లలే ఉపాధ్యాయుల తొలి గురువులు
సందర్భం పాఠశాల పాలకవర్గం ఉపాధ్యాయుని కళ్ల ముందు కనపడదు. పిల్లలు అనుక్షణం కనపడతారు. అందుకే చాలా మంది ఉపాధ్యాయులు విద్యార్థుల సాంగత్యంతో తమను తాము మలుచుకుంటారు. తన తరగతిని ఉత్సాహంగా ఉంచటానికి ఉపాధ్యాయుడు ఎన్నో బాధలకు గురి కావాల్సి వస్తుంది. దేనికోసం? రాబోయే నూతన సమాజ నిర్మాణం కోసం ఉపాధ్యాయుడు నిలబడతాడు. ఉపాధ్యాయుడు కావాలనుకునేవాడు ఈ ఇబ్బందులు పడేందుకు సిద్ధపడాలి. విద్యార్థిని ఉపాధ్యాయుడు ఎంత చెక్కుతాడో దానికన్నా రెట్టింపుగా విద్యార్థి కూడా ఉపాధ్యాయుడిని చెక్కు తాడు. విద్యార్థి ప్రతి ఉపా ధ్యాయుడు చెప్పే మాటలను వినయంగా వింటాడు. కానీ ఉపాధ్యాయుడు ప్రతి ఘడి యలో శల్యపరీక్షకు కూడా గురవుతాడు. తరగతి గదిలో ఉండే 40 మంది టీచర్‌ను చూస్తూ ఉంటారు. టీచర్ చెప్పిన మాటలను సంబంధిత టీచర్ ఆచరిస్తు న్నారా? అని తరగతి, విద్యార్థుల కళ్లు చూస్తుం టాయి. ఉపాధ్యాయుడు చెప్పిన మాటలకు ఆచర ణకు తేడా కన్పిస్తే ఈ ఉపాధ్యాయుడొక కృత్రిమ మనిషి (హిపోక్రాటిక్) అనుకుంటారు. సిగరెట్ తాగవద్దని తరగతి గదిలో పిల్లలకు బోధ చేశాక సంబంధిత టీచర్ సిగరెట్ తాగుతున్నాడా, లేదా? అని పిల్లలు కచ్చితంగా గమనిస్తుంటారు. దానికి తేడా వస్తే అయ్యగారి మాటలన్నీ మనకు చెప్పే ప్రవచనాలని అంటారు. కొంతమంది పిల్లలు బాహాటంగా అడుగుతారు. ‘‘సార్ మీరు మాకు క్లాసులో చెప్పింది ఏమిటి? చేస్తుందేమిటి?’’ అని వారు నిలదీస్తారు కూడా. ‘‘చెప్పింది మీకు రా! చేసేది మేమురా!!’’ మాటలకు, చేతలకు తేడా ఉంటుందని ఉపాధ్యా యుడు అన్నాడనుకోండి. ‘‘వినేది మేము కదా! మేం క్లాసులో కూర్చున్నందుకు డబ్బేమైనా ఇస్తున్నావా? కిరాయి మనుషులనుకుంటున్నావా?’’ అని పిల్లలు అనే అవకాశం కూడా ఉంటుంది. పైకి అలా చెప్పే ధైర్యం లేకపోయినప్పటికీ మనసులో తప్పకుండా వారికి అదే భావన ఉంటుంది. కాబట్టి విద్యార్థికి ఉపాధ్యాయునికుండే సం బంధం చాలా సున్నితమైనది. తను చెప్పే ప్రతి మాటపై ఉపాధ్యాయులకు జవాబుదారీతనం తప్ప కుండా ఉండాలి. అలా జవాబుదారీతనం లేకుండా తరగతి గదిలో పాఠం చెప్పటం చాలా కష్టమైన పని. నేను ప్రభుత్వ సిలబస్ చదువు చెబుతున్నానని ఉపాధ్యాయుడు అనవచ్చును. ‘‘నువ్వు చెప్పిన పాఠాన్ని నేను పరీక్షల్లో కక్కేస్తానని’’ పిల్లలూ అనవచ్చును. కాబట్టి మనం చెప్పిన పాఠం ప్రభావం పిల్లలపై జీవితాంతం ఉండాలంటే తొలుత ఉపాధ్యాయుడు ఆచరణధారి కావాలి. సమాజంలో జరిగే ఎన్నో కార్యక్రమాలను పాఠంతో జోడించి ఉపాధ్యాయుడు ఛలోక్తులు వేస్తాడు. కొన్ని సందర్భాలలో నిరసిస్తాడు. బైటకు వెళ్లిన తర్వాత విద్యార్థి చెప్పిన పాఠాన్ని ప్రమాణంగా తీసుకుని వాటిని ఆచరిస్తాడు. కాబట్టి ఉపాధ్యాయుణ్ని ఎంతోమంది బైట నుంచి ప్రశ్నించే వారుంటారు. అందుకే ఉపాధ్యాయునికి అకడమిక్ ఫ్రీడమ్ అవసరం. ఉపాధ్యాయుడు భవిష్యత్తును నిర్మించే మనిషి ఆవిర్భవించే సమాజాన్ని చూస్తాడు. తన పాఠానికి కొన్ని మానవతా విలువలను కూడా జోడిస్తాడు. ఆ మానవతా విలువలకు వర్తమాన కాలపు పరిస్థితులు అనుకూలించకపోతే ఉపాధ్యాయుణ్నే దోషిగా చూడ టం ఎంత వరకు న్యాయం? భవిష్యత్తును నిర్మించే వాడు ఉత్తమ పౌరుడు కావాలనే భావనతో ఉపాధ్యా యుడు సమాజంలో కనపడుతున్న దురలవాట్లను, చెడు సంప్రదాయాలను నిరసిస్తాడు. తరగతి బైట కూడా వాటిని ఖండిస్తాడు. ఉపాధ్యాయుడు తన వృత్తి జీవితంలో నిత్యం రెండు కత్తులపైన సవారీ చేయాల్సి వస్తుంది. 1) ప్రభుత్వ నిబంధనలు 2) విద్యార్థులను రాబోయే కాలానికి తయారు చేసే బాధ్యత. ఈ రెండింటి మధ్య ఉపాధ్యాయుడు సవారీ చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు చాలా మంది ఈ రెండింటిలో విద్యార్థుల వైపే మొగ్గుతారు. పాఠశాల పాలకవర్గం ఉపాధ్యాయుని కళ్ల ముందు కనపడదు. పిల్లలు అనుక్షణం కనపడతారు. అందుకే చాలా మంది ఉపాధ్యాయులు విద్యార్థులతోడిగా తమను తాము మలుచుకుంటారు. తన మాటలకు, ఆచరణకు, ఏ మాత్రం తేడా వచ్చినా తరగతి గదిలో తన పిల్లలను దొర్లించుకోలేడు. నేను టీచర్‌గా చేరక ముందు అందరి మాదిరిగానే నాలో చిలిపి చేష్టలు చాలా ఉండేవి. నేను చెప్పే పాఠం పిల్లలకు ఆకళింపు కావాలనే ఆదుర్దాయే నన్ను సరైన బాటలో పెట్టింది. ఈ రోజు మీ కళ్ల ముందు కనపడే రామయ్య ఎంత మంది విద్యార్థులతోటి సాంగత్యంతో తన్ను తాను మల్చుకుని ఉంటాడో మీరు ఆలోచించండి. తన తరగతిని ఉత్సాహంగా ఉంచటానికి ఉపా ధ్యాయుడు ఎన్నో బాధలకు గురి కావాల్సి వస్తుంది. దేనికోసం? రాబోయే నూతన సమాజ నిర్మాణం కోసం ఉపాధ్యాయుడు నిలబడతాడు. ఉపాధ్యాయుడు కావాలనుకునేవాడు ఈ ఇబ్బం దులు పడేందుకు సిద్ధపడాలి. ఫెరా, చామ్స్కీ ల్లాంటి ఎంతో మంది చేసిన త్యాగాలే ఉపాధ్యాయ వర్గానికి ఆదర్శం కావాలి. తాత్కాలిక లాభాల కోసమై శాశ్వ తమైన భవిష్యత్తును మనం తాకట్టుపెట్ట కూడదు. అదే ఉపాధ్యాయ వృత్తి నాకు ఈ జీవితంలో నేర్పింది. (వ్యాసకర్త : చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు) -
దేశభక్తి ఏ ఒక్కరి సొత్తూ కాదు
రోహిత్ ఘటనపై విచారణ తేదీలను మార్చాలి {పముఖ విద్యావేత్త చుక్కా రామయ్య హైదరాబాద్: ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దేశభక్తి పేరుతో జరుగుతున్నదంతా కేంద్రం సృష్టేనని, దేశభక్తి ఏ ఒక్కరి సొత్తూ కాదని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ ఘటనపై విచారణకు నియమించిన ఏకసభ్య కమిషన్ పర్యటన అనుమానాలకు తావిస్తోందన్నారు. విద్యార్థులు వర్సిటీలో లేని సమయంలో కమిషన్ పర్యటించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నిజానిజాలను తెలుసుకోవడమే న్యాయవిచారణ లక్ష్యం అయితే అందులో విద్యార్థులదే కీలక పాత్ర అని, అలాంటప్పుడు విద్యార్థులు లేని సమయంలో కమిషన్ వచ్చి ఏం చేస్తుందని చుక్కా రామయ్య నిలదీశారు. మాజీ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు మాట్లాడుతూ విద్యార్థులు నగరంలో ఉండరని తెలిసే ఏకసభ్య విచారణ కమిషన్ ఈ నెల 23,24,25 తేదీల్లో పర్యటిస్తుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. చలో ఢిల్లీ అన ంతరం 26వ తేదీ తరువాత విద్యార్థులు అందుబాటులో ఉంటారని, దీనికనుగుణంగా కమిషన్ తేదీల్లో మార్పు చేసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సీడీఎస్ వ్యవస్థాపకులు మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ విద్యార్థులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన వారం రోజుల తర్వాత ఢిల్లీనుంచి ఏకసభ్య కమిషన్ అదే తేదీల్లో వస్తున్నట్టు ప్రకటించిడం కేంద్రం కుట్రలో భాగమని అన్నారు. పార్లమెంటులో రోహిత్ అంశాన్ని మరుగుపర్చేందుకు జేఎన్‌యూలో జరిగిన చిన్న సంఘటనను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఆ ఉచ్చులో పడకూడదని హెచ్చరించారు. మీడియాపైన ఢిల్లీలోనూ, మేడారం జాతరలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరిపైనా జరిగిన దాడిని లక్ష్మయ్య తీవ్రంగా ఖండించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు యాదయ్య, సీడీఎస్ డెరైక్టర్ వైబి సత్యనారాయణ, భరత్ భూషణ్, సిద్ధోజి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడి పిల్లలకు భరోసా
పెళ్లీడుకు వచ్చిన అమ్మాయికి పెళ్ళి చూపులు జరుగుతున్నా యంటే కాపురానికి వెళ్లకముందే, గుండెల నిండా, మదినిండా భారాన్ని మూటకట్టుకుంటుంది. పెళ్ళిచూపుల తంతు తోనే పుట్టెడు దుఃఖాన్ని మూట కట్టుకొని తనలో తాను కుమిలి పోతుంది. చాలీ చాలని దినసరి వేతనం, అంతంత మాత్రపు కుటుంబ నేపథ్యం వున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదవ తరగతి పరీక్షల సమయంలో కూడా ఇదే తరహాలో మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 26 1/2 లక్షల మంది విద్యార్థులు చదువు కొనుక్కోలేని పుట్టెడు దారిద్య్రాన్ని అనుభవిస్తూన్నారు. ప్రభుత్వం పెట్టే మధ్యాహ్న భోజనం మాకు కొంత ఊరటనిస్తుందని ఆశతో బడికి వచ్చే పిల్లలు 70% పైగా వున్నారు. చదువు కొనుక్కొలేని పేదరికంతో అల్లాడిపోతున్న మొదటి తరానికి చెందిన విద్యార్థుల సంఖ్య 95% పైగా వుంది. ఒకవైపు ఆశయం .. మరోవైపు ఆకలి.. వీటి మధ్యనే జరిగే తీవ్ర సంఘర్షణ విద్యార్థి మానసిక క్షోభకు కారణం అవుతోంది. ఉదయం బడికి వెళ్ళిన పిల్లవాడు మధ్యాహ్నం ఏమి తిన్నాడో అని ఎదురుచూసి సద్దులు తీసుకొచ్చి ఇచ్చే సంస్కృతి ప్రభుత్వ పాఠశాలల ముందు కన్పిం చదు. బడిలో పెట్టిన మధ్యాహ్న భోజనమే బడుగుల పిల్లల పాలిట పరమాన్నం అవుతుంది. ఎండకు ఎండి, వానకు తడిసి రెక్కల కష్టంపై కుటుంబాలను నెట్టు కొస్తున్న తల్లిదండ్రులు కూలి నాలి చేసుకొని ఇంటి ముఖం పట్టే సమయానికి ఏ రాత్రో అవుతుంది. బడి నుంచి ఇంటికి వచ్చిన పిల్లవాడు అమ్మనాన్నల కోసం ఎదురుచూస్తుంటాడు. వారు వచ్చి వంట చేసే దాకా ఆకలితో అల్లాడిపోతున్న తీరు నేడు పల్లెలలో కన్పి స్తుంది. ఉన్న ఒక ఇల్లు, అందులోనే వంట, అందులోనే సంసారపు కష్టనష్టాలు, పూట పూటకు వెతుకులాటలు, తాగి వచ్చిన తండ్రి.. తల్లితో, పిల్లలతో పెనుగు లాటలతో విద్యార్థుల ఇళ్ళు రాత్రికల్లా రణరంగాన్ని తలపిస్తాయి. తాగి వచ్చిన తండ్రి కొడితే తల్లడిల్లిన తల్లి ఏడుస్తూ పడిపోతే ఆకలితో అలమటిస్తున్న ఆ బడుగు పిల్లలకు మరుసటి రోజు మధ్యాహ్నం వండి పెట్టే బడి భోజనమే జీవగంజి అవుతుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సెకండరీ బోర్డు పరీక్షలకు ఈ రకమైన సంఘర్షణ మధ్యే సన్నద్ధం అవ్వాలి. పేదరికంలో పుట్టిన పాపానికి ఆశయం ఉన్నా మౌలిక వసతులు లేని కారణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వెనకబడిపోతున్నారు. అనేక విద్యా సంస్థలు, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు, కార్పొరేటు సంస్థల తీరుతెన్నులను అనేక విద్యా పోకడలను, విద్యావ్యవహారాలను అధ్యయనం చేసిన నా 89 సం॥జీవన ప్రయాణంలో నాకు ఎదురైన ఒక అద్భుతమైన ప్రయోగం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పదోతరగతి పరీక్షల అధ్యయన శిబిరం. ‘వందే మాతరం ఫౌండేషన్’ అనే పేరుతో వరంగల్ జిల్లాలోని తొర్రూర్ కేంద్రంగా 500 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థు లకు 50 రోజుల పాటు మౌలికమైన వసతులు, బోధన, భోజనం, వైద్య సదుపాయాలు సమకూర్చి ఆ బడుగుల బిడ్డల భవితకు ఊతం ఇస్తున్న తీరు నన్నెంతగానో కదిలించింది. నా జీవితంలో ఈ శిబిరం ఒక అనుభవ పాఠశాల అయింది. 50 రోజుల పాటు జరిగే ఈ శిబిరా నికి ఒక పదేళ్లుగా పలుమార్లు వెళ్ళి ఆ పిల్లలతో గడిపిన క్షణాలు మధురమైన అనుభూతులుగా మిగిలాయి. ఆ శిబిరంలో ఒక్కొక్క విద్యార్థి హృదయం తట్టి కదిలిస్తే వెల లేని వెతల గ్రంథం అవుతుంది. తండ్రి ఉంటే తల్లి వుండదు. తల్లి ఉంటే తండ్రి వుండడు. ఇద్దరు లేని వారు ఒకరైతే, వున్న తండ్రి.. త ల్లీ పిల్లలను వదిలేసి మరో కాపురం పెట్టుకొని గడుపుతున్న తీరు. మరో తండ్రి సాయంత్రానికల్లా తప్ప తాగి వచ్చి పిల్లలు చదివే పుస్తకాలను సైతం అమ్ముకుంటాడు. ఈ నిర్భాగ్య జీవనం నుంచి ఆకాశమంత ఎత్తున్న ఆశయం వైపు పిల్లల ప్రయాణం కొనసాగుతుంది. ఈ దుర్భరమైన దారిద్య్రం, దుఃఖంతో బాధపడుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఆత్మీయతతో చేరదీసి వారి ఆశయానికి పదును పెడితే తప్ప సమాజంలో సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని సాధించలేమన్న మౌలికమైన ఆశయాన్ని ముందు పెట్టుకొని మహానీ యుడైన అంబేడ్కర్ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చింది వందేమాతరం పౌండేషన్. జీవితంలో ఎంతటి ఉన్నత చదువులకైనా పదవ తరగతే ప్రాథమిక మెట్టు అవుతుంది. ఈ పునాది ఎంత బలంగా పటిష్టమైన రీతిలో నిర్మాణమైతే భవిష్యత్తు భావిజీవన సౌధం అంత బలంగా నిలబడగలుగుతుంది. ఈ పునాదులు సరిగా లేని కారణంగా ఉన్నత చదువులకు వెళ్ళినప్పటికీ అత్యుత్తమ ప్రతిభావంతులుగా నిలబడలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వందే మాతరం పౌండేషన్ చదువు, విలువలతో కూడుకున్న దార్శనిక జీవనాన్ని సామాజిక బాధ్యతతో జోడించడం వల్ల ఆ పిల్లలు అత్యుత్తమ వ్యక్తిత్వంతో, చదువుతో పాటు ఉదాత్తమైన జీవితంతో రాణించగల్గుతున్నారు. 50 రోజుల పాటు అనేకమంది ప్రతిభావంతులు, మేధావులు, విజయ పథాన కొనసాగిన ప్రముఖులు ఈ శిబిరాన్ని సందర్శించి విద్యార్థులకు ప్రేరణ ఇస్తున్నం దున విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఈ ప్రయోగాన్ని గమనించిన ఆ జిల్లా కలెక్టరు వాకాటి కరుణ... కేవలం దాతృత్వంతో జరిగే ఈ పనిని, పూట పూటకు అడుక్కొచ్చి నిర్వహించే దాతృత్వంతో జరుగు తున్న ఈ కార్యక్రమాన్ని చూసి ఆమె చలించిపోయారు. ప్రభుత్వాధికారంలో ఉండి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ మాత్రమైనా చేయలేమా అని ఆమె భావించి ఇలాంటి శిబిరాలను జిల్లా వ్యాప్తంగా 12 చోట్ల ఏర్పాటు చేసారు. సాయంత్రం వరకు ఉండే మిగతా విద్యార్థులకు సాయంత్రం పూట కూడా బడిలోనే అత్యల్ప ఆహారం ఇచ్చి వారి ఆకలిని తీర్చడం మా బాధ్యత. మీ ఆశయ సాధనకోసం మీరు ముందుకు నడవండి అని విద్యార్థులకు కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బడుగు, బలహీన విద్యార్థుల భవిష్యత్తుకు పరీక్షల ముందు భరోసాను ఇస్తూ వారి ఆకలిని తీర్చి మౌలికమైన అవసరాలు సమకూర్చగలిగితే సామాజిక సమానత్వం సిద్ధిస్తుందనడానికి ఇదో గొప్ప ప్రయోగం. ఈ ప్రేరణ కలిగించాలనే నాతోపాటు ఈ శిబిరానికి అనేకమందిని తీసుకెళ్లాను. అలా వచ్చినవారంతా ఆశ్చర్యపడ్డారు. ఆలోచించడం మొదలెట్టారు. వయోభారం అయినా ఆరోగ్యం సహకరించనప్పటికీ, పేద బిడ్డల మధ్య ఎక్కువ రోజులు గడపడానికి ఎన్నో విషయాలు నేర్చు కోవడానికి వందేమాతరం శిబిరాన్ని నేటికీ సందర్శిస్తుం టాను. ఊర్లు, కులాలు, వివక్షలు, మతాలు, సంకుచి తత్వ పోకడలకు తావు లేకుండా ఒకే ప్రాంగణంలో ఆడ, మగపిల్లలు ఒకే తల్లిబిడ్డల్లా సంస్కారవంతమైన జీవనం గడుపుతున్న తీరుతో.. అత్యుత్తమ నవీన సమాజానికి ఈ శిబిరం నాంది పలుకుతుంది. అభిప్రాయం; డా. చుక్కారామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు -
గురువుల ఎంపికే ఉత్తమం
అభిప్రాయం నేడు కావాల్సింది భవిష్యత్ సమాజ సృష్టికర్తలను తయారుచేసే ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయుల నియామకాన్ని ఎంపిక అనాలి. దీన్ని గమనించి ప్రభుత్వం ఈ పనిని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి అప్పగించడం హర్షణీయం. ప్రజాస్వామిక ప్రభుత్వాలంటే మెజారిటీ ప్రభుత్వాలు కాదు. ఎన్నికల్లో ఒక పార్టీ అధికారానికి వచ్చి బాధ్యతను స్వీకరించి అందరి అభిప్రాయాలను క్రోడీకరించి ప్రజా శ్రేయస్సుకై ఆచరణ యోగ్య మైన పథకాలను రూపొందిం చడం. అదే ప్రగతిశీల శక్తుల, పార్టీల విధి. కాబట్టి ఆచరణ రీత్యా ఏ పథకమైనా ఎంత ప్రధానమో దాన్ని అమలుపరిచే యంత్రాంగం కూడా అంతే ప్రధానం. కనుక పాలనా యంత్రాంగం పని అధికారంలోని పార్టీల ఆలోచనా విధానానికి అద్దం పడుతుంది. ప్రజా నాయకులుగా ఎన్నికైన వ్యక్తులు తమ విధానాల, పథకాల అమలుకై సమర్థులైన మనుషులను ఎన్నుకోవాలి. ఆ ఎన్నికే వారి సంకల్పాన్ని ప్రతిబింబి స్తుంది. కాబట్టి ఉద్యోగులను నియమించే వ్యవస్థకు ప్రాధాన్యం ఉంది. ఈ శతాబ్దిలో ప్రపంచంలో చాలా చిన్న చిన్న దేశాలేర్పడ్డాయి. అవి పెద్ద దేశాలతో పోటీ పడటమే కాదు, వారు సాధించలేని ప్రగతిని కూడా సాధించాయి. వాటి విజయం వెనుక ఉన్నది వాటి ప్రాధాన్యాలే. విద్యారంగానికి ప్రాధాన్యం ఇచ్చిన దేశాలు ముందంజ వేశాయి. విద్యారంగం కేవలం పాఠశాలల స్థాపనకే పరిమితం కారాదు. బాలలను బాధ్యత కలిగిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేవి పాఠశాలలే. విస్త్రుతమౌతోన్న జ్ఞానపరిధికి అనుగుణంగా విద్యార్థులను తయారు చేయడం, అపరిమితమైన జ్ఞానాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తేవడం, దాన్ని సమాజానికి అన్వయిం చడం విద్య ముఖ్య లక్షణాలు. విజ్ఞానానికి కొత్త ఊటలు వెతికి ఎప్పటికప్పుడు ప్రవాహంలోకి తేవడం పాఠశాల ఉపాధ్యాయుల పని. అప్పుడే అవి విజయానికి సంకేతం అవుతాయి. కొత్త రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. విద్య, వైద్య రంగాలపైన ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపగలిగితే అంత కొంగొత్త ప్రగతికి బాటలు పడతాయి. ఈ మధ్య ప్రభుత్వం విద్యారంగంపైన కొంత శ్రద్ధ చూపుతున్నట్టు కనిపిస్తోంది. విద్యాభివృద్ధి అంటే అట్టహాసాల అలం కారం కాదు. కావలసిన ఉపాధ్యాయులను సమకూర్చి తేనే గమ్యానికి చేరగలం. ఉపాధ్యాయుడు గత సమా జాన్ని తిరిగి ముద్ర వేయడం కాదు. మరో కొత్త సమాజా నికి బీజాలు వేయాలి. కొత్త సమస్యలకు పరిష్కారాలు చెప్పగలగాలి. ఆ పని చేసే పుస్తకాలుండవు. ఊహించని సమస్యలను ఎదుర్కునేలా మనుషులను ఎలా ఉపయో గించాలో తెలిసిన తరాన్ని సిద్ధం చేయడమే నేటి ఉపాధ్యాయుడి పని. ఈ బాధ్యతను సామాజిక స్పృహ కలిగిన మనిషే చేయగలడు. జ్ఞానం పరిధులు తెలిసిన వారై ఉండాలి. జ్ఞానం వ్యక్తుల ఎదుగుదలకు గాక, మొత్తం సమాజం ఎదుగుదలకు ఉపయోగపడాలి. కాబట్టి అలాంటి జిజ్ఞాస కలిగిన ఉపాధ్యాయులను నియ మించే వ్యవస్థ, భవిష్యత్తులో రావాల్సిన సమస్యలను ఆకళింపు చేసుకునేదిగా ఉండాలి. శరవేగంతో వస్తున్న ఆవిష్కరణలను జీర్ణం చేసుకొని రాబోయే సమాజాన్ని సృష్టించే ఉపాధ్యాయ వర్గం నియామకాన్ని ప్రభుత్వం ఏవిధంగా నిర్వహిస్తోందో ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఈనాటి వరకు ఉపాధ్యాయుల నియామకాన్ని రిక్రూట్మెంట్ అన్నారు. రిక్రూట్మెంట్ ద్వారా నీతినిజాయితీలు కలిగిన వ్యక్తులే లభించినా, వారు గత సమాజాన్ని యథాతథంగా ఉంచితే చాలని భావిస్తారు. కానీ నేడు కావాల్సింది భవిష్యత్ సమాజ సృష్టికర్తలను తయారుచేసే ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయుల నియామకాన్ని సెలక్షన్ అనాలి. రిక్రూట్ మెంట్‌గా చూడకూడదు. తహసీల్దార్ ఆఫీసుల్లో క్లర్క్‌ల నియామకాన్ని రిక్రూట్మెంట్ అనడం సబబుగా ఉంటుంది. దీన్ని గమనించి ఈ పనిని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి అప్పగించడం హర్షణీయం. ప్రభుత్వ దూర దృష్టికి నేను అభినందిస్తున్నాను. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఒక ప్రొఫెసర్, విద్యారంగంలో అనుభవ మున్న వ్యక్తి, ఉపాధ్యాయ వృత్తికున్న ప్రాశస్త్యం తెలిసిన మనిషి ఉండటం వల్ల మా ఆశలు ఇనుమడించాయి. అయితే అందుకు తగిన సిబ్బంది కూడా అవసరం. ఉపాధ్యాయుల నియామకం గ్రూప్-2 ఎక్జామినేషన్స్ నిర్వహించినట్టు కాదు. ఉపాధ్యాయ నియామకాలకు పోటీపడే వారందరికీ డిగ్రీలుంటాయి. నైపుణ్యం ఉంటుంది. కానీ నేటి సమాజానికి ఇవి రెండే ప్రామా ణికం కాదు. జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళే పరిశోధనా తత్వం, విద్యార్థులంటే ఆదరణ, వారికి ప్రేరణనిచ్చే, స్నేహమైన వైఖరి ప్రదర్శించే ఉపాధ్యాయులు కావాలి. సృజనాత్మకత కలిగి ఉండి వృత్తి పట్ల అంకితభావం ఉండాలి. దీనివల్ల విద్యార్థుల అంతరాంతరాల్లో ఇమిడి ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది. ఇవన్నీ మనుషుల్లో పైకి కనపడని గుణాలు. వీటిని గుర్తించే మనిషి ఎంత అనుభవంతో ఉండాలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి సులభం గానే అర్థం అవుతుందని భావిస్తాను. మానవ సంపదంతా ప్రైవేటు యాజమాన్యాల దగ్గర పోగుపడుతోంది. అందుకే అక్కడ తయారైన విద్యార్థులకి సైతం ఆ పెట్టుబడిదారీ లక్షణాలే ఒంటబడు తున్నాయి. కానీ మనం విద్యారంగాన్ని ప్రజాపరం చేయాలనుకుంటున్నాం. లాభదృష్టికన్నా ప్రజాహితమే ప్రధానం అనుకున్న తరాన్ని సృష్టించవలసి ఉన్నది. అందుకు కావాల్సిన ఉపాధ్యాయులను ఎన్నుకునే బృహత్తర కార్యక్రమాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం విద్యకు వేరే దశను చూపించాం. ఆ కోణం దారితీసిన చెడ్డ సాంప్రదా యాల దుష్పలితాలను మన తరాలు అనుభవిస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న దేశాలు విద్యారంగాన్ని ప్రజల పక్షాన నిలబెట్టి ప్రగతిని సాధించాయి. దానికి కావాల్సిన ఉపాధ్యాయ వర్గాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నుకుం టుందని ఆశిస్తున్నా. గ్రూప్ 2 పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించి ఆదర్శంగా నిలిచిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఛాలెంజ్‌ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొం టుందని భావిస్తున్నా. వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త -
అవగాహన పెంచేదే అసలు చదువు
విశ్లేషణ ‘చరిత్రను తెలుసుకుందాం.. వాటి ఆనవాళ్లు కాపాడుకుందాం’ పేరుతో చేపట్టిన ప్రయోగం సరికొత్త బోధనా తీరుకు బీజం వేయడం వంటిదే. సహకార బోధన (కొలాబిరేటివ్ టీచింగ్) పద్ధతికి ఇది నిదర్శనం. పిల్లలను చుట్టూ ఉన్న పరిస్థితులతో మమేకం చేస్తూ బోధిస్తే విద్యావికాసం పరిపూర్ణంగా ఉంటుందన్న ఉద్దేశంతో యాజమాన్యం ఈ ప్రయోగం చేయించింది. ఉపాధ్యాయుడు బోధిం చడం, విద్యార్థులు శ్రద్ధగా వినడం - ఇప్పటి వరకు మనం అనుసరిస్తున్న బోధనా పద్ధతి ఇదే. సామాజిక పరిస్థితులు మారాయి. బడిపిల్లల అల వాట్లు, అభిరుచులు, ఆలో చనా ధోరణి కూడా మారాయి. అందుకే సంప్రదా యక ‘చాక్ అండ్ టాక్’ పద్ధతికి స్వస్తి పలకవలసిన సమయం వచ్చింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత విద్యారంగంలో గణనీయమైన మార్పులు సంభవించాయి. అందుకే అభివృద్ధి చెందిన దేశాలు చాలా వరకు పాఠశాల స్థాయిలోనే పరిశోధనాత్మక విద్యా విధానానికి శ్రీకా రం చుట్టాయి. బోధన, అవగాహన, పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చే విధానంతో విద్యను మలచుకో వడానికి అక్కడ వేగంగా ప్రయత్నం జరుగుతోంది. నిజానికి పాఠ్యాంశాన్ని యథాతథంగా బోధించడం కంటే, సామాజిక పరిస్థితులకు అన్వయించి చెప్పడం వల్ల పిల్లలకు సులభంగా విషయం అర్థమవుతుంది. ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ కొయ్యబొమ్మలకే కాదు, విద్యార్థులలో చక్కని సృజనను పెంచడానికి కృషి చేస్తున్న స్థలంగా చెప్పుకోవచ్చునని ఈ మధ్య రుజువు చేసుకుంది. ఆ పట్టణంలోని ఒక పాఠశాల ‘చరిత్రను తెలుసుకుందాం.. వాటి ఆనవాళ్లు కాపా డుకుందాం’ పేరుతో చేపట్టిన ప్రయోగం సరికొత్త బోధనా తీరుకు బీజం వేయడం వంటిదే. సహకార బోధన (కొలాబిరేటివ్ టీచింగ్) పద్ధతికి ఇది నిద ర్శనం. పిల్లలను చుట్టూ ఉన్న పరిస్థితులతో మమేకం చేస్తూ బోధిస్తే విద్యావికాసం పరిపూర్ణంగా ఉంటుం దన్న ఉద్దేశంతో యాజమాన్యం ఈ ప్రయోగం ఏర్పాటు చేసి, చూడడానికి రావలసిందని నన్ను ఆహ్వానించింది. ఎనిమిదో తరగతి విద్యార్థులను మూడు బృందాలుగా విభజించి ఖిలాగుట్ట, శ్యామ్గఢ్, బత్తిస్గఢ్, ఇతర ప్రాంతాలకు పంపారు. అక్కడకు వెళ్లివచ్చిన పిల్లలు తాము తెలుసుకుని వచ్చిన కొత్త విషయాలను, ఆసక్తికరమైన అంశాలను సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో సాటి విద్యార్థులకు వివరించారు. నిర్మల్‌లోనే ఉన్న శ్యామ్గఢ్కు ఆ పేరు ఎలా వచ్చింది? సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కాలంలో నిర్మించిన ఖిల్లాగుట్ట ప్రత్యేకత ఏమిటి? ఎవరు నిర్మించారు? వేయి ఉరుల మర్రి ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? రాంజీ గోండు ఎవరు? ఆయనను ఎవరు ఉరి తీశారు? రాంజీతో మరో వేయి మందిని ఆ మర్రికే ఎందుకు ఉరి తీశారు? నాటి పరిస్థితులు ఏమిటి? వంటి పుస్తకాలలో లేని పలు అంశాలను క్షేత్రస్థాయి పర్యటనలో పరిశోధన ద్వారా వారు స్వయంగా తెలుసుకుని వచ్చారు. పరిసరాలతో మమేకం చేయకుండా విద్య గరిపితే అది అసహజంగా ఉంటుంది. అన్నం ఎలా వస్తుందని అడిగితే, సూపర్మార్కెట్లో తెచ్చిన బియ్యం వండితే వస్తుందని చెప్పారంటే, అది పిల్లల తప్పుకాదు. రైతు కష్టిస్తేనే వరి చేలు పండుతాయనీ, ఫలితంగానే బియ్యం వస్తుందనీ వారికి తెలియ కుండా చేయడం ఆందోళన కలిగించే అంశమే. మన ప్రధాన పంటను గురించే విద్యార్థులకు సరైన అవగా హన కలిగించలేకపోతున్నాం. కాబట్టి వైట్‌హౌస్, పారిస్ ఫ్యాషన్ టెక్నాలజీల కంటే ముందు విద్యార్థు లకు పరిసరాలు, వాటి ప్రాముఖ్యం గురించి చెప్పాలి. సామాజిక అవగాహన పెంచాలి. డిజిటల్ పాఠశాలల్లో బోధనా పద్ధతులలో కొన్ని మార్పులు వచ్చినా అవి ఇంకా బడుగు బలహీన వర్గాల పిల్లల దాకా రాలేదు. సర్కారీ బడులలో కూడా దానిని ప్రవేశపెడితే మంచి ఫలితాలు వస్తాయి. చాక్ అండ్ బోర్డ్ పద్ధతి నుంచి ప్రొజెక్టర్ అండ్ టేబుల్ బోధనా విధానానికి మారామని అనుకున్నా అది కూడా అధిక సంఖ్యలో పిల్లలకు అందుబాటులో లేదు. దీనితో అంతరాలు పెరుగు తున్నాయి. కొన్ని పాఠశాలల్లో ఉన్నప్పటికీ బోధన ఆంగ్లంలోనే జరుగుతూ ఉండడంతో ఆకళింపు చేసుకోలేక విద్యార్థులు సతమతమవుతున్నారు. కాబట్టి మాతృభాషను పూర్తి స్థాయిలో అమలు చేస్తూనే, ఆంగ్లంలో తర్ఫీదునివ్వడం మేలు. నిజానికి ప్రైవేటు విద్యాసంస్థలు విస్తరించిన తరువాత అనారోగ్యకర పోటీ ఏర్పడి చదువు స్వరూపమే మారింది. విద్యార్థులను జ్ఞానం చుట్టూ కాకుండా, మార్కుల చుట్టూ తిప్పుతున్నారు. అవగాహనను బట్టి కాకుండా మార్కులను బట్టి విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసే విపరీత ధోరణులు ప్రవేశించాయి. దీనితో మార్కులు సాధించాలంటూ తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి అధికమైంది. ఈ పరిస్థితి మారాలి. పిల్లలను స్వతహాగా ఆలోచించేటట్టు చేయాలి. అప్పుడే వారి సామర్థ్యం తెలుస్తుంది తప్ప, గైడ్లను ఆశ్రయించి భట్టీయం వేయడం వల్ల ప్రయోజనం ఉండదు. పిల్లలు చాలామంది ఇప్పటికీ భాష, భావ వ్యక్తీకరణల విషయంలో వెనుకబడి, పెద్ద చదువులు ఉన్నా నైపుణ్యాలు లేక అరకొర వేతనాలకే పని చేస్తున్నారు. కొలాబిరేటివ్ టీచింగ్‌తో ఈ సమస్యను అధిగమించవచ్చు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల స్థాయిలోనే పరిశోధనాత్మకత మీద అవగాహన పెంచాలి. (వ్యాసకర్త విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు: చుక్కా రామయ్య) -
అన్నమూ అక్షరమూ లేని చదువులు
విశ్లేషణ డబ్బుతో చదువుని కొనుక్కోలేక, పొద్దుపొడవకముందే తల్లితోపాటు కూలికి వెళ్ళి నానా చాకిరీ చేసి ఖాళీ కడుపుతో పాఠశాలలకు వెళ్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీవిద్యార్థులకు వస్తున్న జబ్బులేవో మనకీ మన సర్కారుకీ తెలుసా? గుండె కలుక్కుమంటుంది. ఏ బడిలోనో ఏదో ఘోరం జరిగినప్పుడు. ఏ మారు మూల ఊరు బడిలోనో కాదు మహానగరం మధ్యలోనే మాస్టారింట్లో వెట్టి చాకిరీ చేయనందుకు ఓ మైనారిటీ చిన్నారిని బడినుంచి గెంటివేసినందుకు. అందుకే కాదు. ఒళ్ళంతా పుళ్ళయి రక్తసిక్తమైన ఒంటికింత మందు లేనప్పుడు తోటి విద్యార్థులు గేలి చేస్తుంటే మనసు చిన్నబుచ్చుకున్న నా విద్యార్థి కళ్ళల్లో దీనత్వం చూసినప్పుడు హృదయం విలవిల్లాడుతుంది. చిట్టచివరి బెంచీలో కూర్చొని రోజూ నిద్రపోతున్న విద్యార్థికి క్రమేణా చూపు తగ్గిపోతోందని అందుకు అతని పేదరికం, పౌష్టికాహారలోపమే కారణమని తెలి సినప్పుడు మనసు మెలితిప్పే బాధ. నాలుగు అక్షరం ముక్కలతో పాటు నాలుగన్నం మెతుకులు వారికి సక్ర మంగా అందడం లేదనే చింత నిత్య ఉపాధ్యాయుడిగా ఉన్న నన్నింకా వేధిస్తూనే వుంది. స్వచ్ఛ భారత్‌పై యావత్ దేశం చర్చించుకుంటున్న ప్పుడు మరుగుదొడ్లు లేక ఒకే చోట పదే పదే మూత్ర విసర్జన చేసి ఆడపిల్లలు జబ్బుపాలై నందుకు, ఇన్ఫెక్ష న్లతో గైనిక్ వ్యాధులతో విలవిల్లాడు తున్నందుకు; నగ రంలోని ఓ పాఠశాలలో ఒకే తరగతి గదిలో తగిలించిన అమ్మాయిల సెలవు చీటీలన్నింటిలోనూ ‘‘కడుపునొప్పి తో బడికి రాలేకపోతున్నాను’’ అన్న వాక్యాలే చదివిన ప్పుడు గుండె గొంతులో చిక్కుకున్నట్టవుతుంది. ఎక్కడో గిరిజన గూడేల్లో ఆడపిల్లలపై జరిగిన అత్యాచారం ఫలి తంగా చిట్టితల్లులే కన్నతల్లులుగా మారిన దుర్మార్గాల్ని చూసినప్పడు ఒళ్ళు జలదరిస్తుంది. డబ్బుతో చదువుని కొనుక్కోలేక, పొద్దుపొడవక ముందే తల్లితోపాటు కూలికి వెళ్ళి నానా చాకిరీ చేసి ఖాళీ కడుపుతో పాఠశాలలకు వెళ్తున్న ప్రభుత్వ పాఠశా లల విద్యార్థినీవిద్యార్థులకు వస్తున్న జబ్బులేవో మనకీ మన సర్కారుకీ తెలుసా? పిల్లల రోజువారీ శారీరక, ఆరోగ్యపరమైన, మానసిక మార్పులు గమనించే వ్యవస్థ మనకి ఎందుకు లేకుండా పోయింది? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. (యుక్తవయస్సులో ఉన్న చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదల బాధ్యతెవ్వరిదో ఎవరికి తెలియాలి? కేవలం ఉపాధ్యాయుడిదేనా? లేక కేవలం ప్రధానోపాధ్యాయుడిదేనా? లేదంటే అక్షరజ్ఞానం కూడా లేని కూలినాలి చేసుకునే పేద తల్లిదండ్రులదా?) ఇప్పుడు సమాధానం వెతకాల్సింది సరిగ్గా ఈ ప్రశ్నకే. పైవన్నీ ప్రశ్నలే సమాధానం లేని ప్రశ్నలు. ఒక ప్పుడు పివి నరసింహారావు ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలల్లో నర్సింగ్ వ్యవస్థ ఉండేది. విద్యార్థులను అంటి పెట్టుకొని ఒక నర్సు ఉండేది. వారికి వచ్చే జబ్బులు, వారికి ఎదురయ్యే శారీరక అనారోగ్య సమస్యలు గమనించి, వారికి తగిన సూచనలు చేసేది. అవసరమైతే వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళి వారికి చికిత్స చేయించే వ్యవస్థ ఉండేది. ఆ తరువాత కూడా చాలా కాలం వరకు పాఠశాలల్లో ప్రతి మూడు నెలలకో, లేక ఆరునెలలకో ఓ సారి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరికీ ప్రభుత్వమే మెడికల్ క్యాంపులు నిర్వహించేది. వారి ఆరోగ్య పరిస్థితులను రికార్డు చేసేది. అవసరమైన మేరకు పాఠశాల ఉపాధ్యాయులకు, అలాగే తల్లిదండ్రు లకు వారి సమస్యలను వివరించేది. పౌష్టికాహార లోపంతో బలహీనంగా ఉన్న పిల్లలకు సప్లిమెంట్స్ సైతం కొన్ని చోట్ల ప్రభుత్వమే ఉచితంగా అందజేసేది. కానీ ఇప్పుడా వ్యవస్థ లేనేలేదు. ఆ విధానం కనుమ రుగైపోయింది. ఈ కారణంగానే చిన్నవయస్సులోనే జబ్బుని గుర్తించి నయం చేసే పరిస్థితి లేకుండా పోయింది. విద్యాహక్కు చట్టం కారణంగా ఇప్పటికే బడిగడప తొక్కనటువంటి వర్గాల పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు, దళిత, ఆదివాసీల పిల్లలు, వికలాంగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కానీ ఈ వర్గాలకు చెందిన ఎందరో పిల్లల పేర్లు పాఠశాలల్లో నమోదైనప్పటికీ, వారి శారీరక అసౌకర్యం వల్ల, అత్యధిక కాలం పాఠశాలలకు దూరంగానే ఉంటున్నారు. కాబట్టి వారిని పాఠశాలల్లో చేర్చడం ఎంత ప్రధానమో, వారికి క్రమం తప్ప కుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం అంతకన్నా ప్రధానం అన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాల్సి వుంది. పిల్లల విద్య, వైద్యం, పౌష్టికాహారం ఈ మూడిం టినీ ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నప్పుడు విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలు జరుగుతుంది. ఎందరో వైద్యులు ఉచిత సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. అటువంటి వారి సాయం తీసుకుని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అనారోగ్యం కార ణంగా బడికి వెళ్ళలేని పరిస్థితులు లేకుండా మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. కాబట్టి సమస్య తలెత్తిన ప్పుడు గగ్గోలు పెట్టడం కంటే, ఎవరినో ఒకరిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కంటే శాశ్వత పరిష్కారానికి యత్నించడం సబబుగా ఉంటుంది. అలాగే కిశోర బాలికలకు పౌష్టికాహారంతో పాటు నెలనెలా అవసరమయ్యే శానిటరీ నాప్కిన్స్ని ప్రభు త్వమే ప్రతి పాఠశాలకు సరఫరా చేయాలి. అతి తక్కువ ధరకు సైతం వాటిని తయారుచేసే అవకాశం వున్నచోట నుంచి ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసి ప్రభుత్వ పాఠ శాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు అంద జేయడం అత్యవసరం. వీటన్నింటికీ తోడు మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవ సరం ఎంతైనా వుంది. మరుగుదొడ్లపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ ఏ రాష్ట్రప్రభుత్వం వాటిని సక్రమంగా అమలు చేస్తున్న దాఖలాలు లేవు. కనీసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనైనా మరుగుదొడ్ల సమస్య తీవ్రతను పాలకులు గుర్తిస్తే మంచిది. వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, డాక్టర్ చుక్కా రామయ్య -
గురువు... ప్రవహించే జ్ఞానం
తరగతి గదే సమాజం అంటూ, వందేమాతరం ఉద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు ఆ తరగతి గదే సామాజిక ఉద్యమాలకు ఏ విధంగా ప్రాణం పోసిందీ వివరించడం జరిగింది. విశ్లేషణ చుక్కా రామయ్యగారు లబ్ధప్రతి ష్టులైన, జనామోదం పొందిన విద్యావేత్త. లబ్ధప్రతిష్టులైన వారం దరూ జనామోదం పొందిన వారు కాకపోవచ్చు. జనామోదం ఉన్న వారు లబ్ధప్రతిష్టులు కానక్కర లేదు. ఈ రెండూ ఒక్కరిలో కలసి సాగిపోవాలంటే, విజ్ఞానాన్ని సామాజిక అవసరాలకు మేళవించే శక్తి సామర్థ్యాలుండాలి. రామయ్యగారిలో ఈ శక్తి సామ ర్థ్యాలు అపారంగా ఉన్నాయి. ఆదర్శ ఉపాధ్యాయుడికి ఉండాల్సిన విద్యాలక్ష్యాల గురించీ, సమాజానికి విద్యా వ్యవస్థకు ఉండాల్సిన సంబంధాల గురించీ ఆయనకు స్పష్ట మైన అవగాహన ఉంది. ఉపాధ్యాయ వృత్తి ఎడల ఉండవ లసిన గౌరవానికీ, నిబద్ధతకూ ఆయన నిలువెత్తు నిదర్శనం. అందుకే రామయ్యగారంటే నాకెంతో అభిమానం. ప్రజా పోరాటాల్లో పాల్గొన్న, పాల్గొంటున్న నేపథ్యంతో, పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకూ సాగిన అధ్యాపన అనుభవంతో రామ య్యగారు విస్తృతంగా రచనలు చేశారు, చేస్తున్నారు. సామాజిక సమస్యలను పరిష్కరించడం కోసం ఒక తరాన్ని ఎప్ప టికప్పుడు తయారుచేయడమే 'విద్య' ప్రధాన లక్ష్యంగా ఆయన భావించారు. ఈ లక్ష్యమే ఆయన రచనల్లో అంతస్సూ త్రం. ఆ కోవకు చెందినదే రామయ్యగారి ప్రస్తుత రచన 'విద్యాక్షేత్రం తరగతి గది' రామయ్య గారి అధ్యాపక అనుభవ సారం ఈ పుస్తకం. అందుకే ఈ పుస్తకానికి ముందుమాట రాయడం గౌరవంగా, నేర్చుకునే అవకాశంగా భావిస్తు న్నాను. గురుకులం నుంచి తరగతి గది వరకు, అక్కడి నుంచి virtual classroom వరకు జరుగుతున్న విద్యారంగ ప్రస్థానం సామాజిక ప్రస్థానంలో భాగమే. సాంప్రదాయ సామాజిక వ్యవస్థల విద్యావ్యవస్థ ప్రతిరూపమే గురుకు లాలు. పారిశ్రామిక వ్యవస్థల ప్రతిరూపమే తరగతి గదుల విద్యావ్యవస్థ. ఆధునిక సమాజాల (Post Industrial Societies) ప్రతిరూపమే virtual classrooms. మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థ రూపాలు కూడా మారుతుంటాయి. తరగతి రూప స్వభావాలు మారుతున్నప్పటికీ, నేటి విద్యావ్యవస్థలో తరగతి గది ప్రధాన పాత్ర నిర్వహిస్తుంది. రామయ్యగారి మాటల్లో చెప్పాలంటే, 'తరగతి గది ఒక పవిత్రమైన క్షేత్రం. తల్లి గర్భకోశం లాంటిది. సమాజ సూక్ష్మ ప్రతిబింబం.'తరగతి గదిని కేంద్రంగా చేసుకుని, తన అధ్యాపక జీవితంలో తరగతి గది నేర్పిన పాఠాలెన్నింటినో రామయ్యగారు మనకందించారు. ప్రపంచ భవిష్యత్తు తరగతి గదుల్లో లిఖితమవుతుం దనే ప్రగాఢ విశ్వాసం రామయ్యగారికుంది. అందుకే, భువ నగిరి పాఠశాల నుంచి నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ కళా శాల వరకూ సాగిన అధ్యాపక ప్రస్థానంలో పిల్లల్లో ఉన్న శక్తి సామర్థ్యాలను కదిలించి కార్యాచరణకు సిద్ధం చేయడంలోని తన అనుభవాలను మనకందించారు. పిల్లల దగ్గర నుంచి తాను నేర్చుకున్న పాఠాల నుంచి, పిల్లలకు తను నేర్పిన పాఠాల వరకూ ఎన్నెన్నో విషయాలను సందర్భోచితంగా వివరించారు. అనుభవాల నుంచి నేర్చుకోవడం, నేర్చుకున్న దానిని సందర్భోచితంగా అన్వయించడం రామయ్యగారి ప్రత్యేకత. చాలా మందికి అనుభవం ఉంటుంది కానీ, నేర్చుకోలేరు. నేర్చుకున్న దానిని అన్వయించలేరు. కనుకనే సరళమైన భాషలో రామయ్యగారు అందించిన తరగతి గది నేర్పిన పాఠాల సూత్రీకరణలు నేటి తరానికి దిక్చూచిలా ఉపకరిస్తాయి. పాఠశాల అంటే బల్లలు, భవనాలు, కట్టడాలు కావు. పాఠశాల అంటే ఉపాధ్యాయుడు, విద్యార్థుల సంబంధం, అనురాగం, ప్రజాస్వామిక చర్చ, మేధోమథనం అనంటారు రామయ్యగారు. విద్యార్థి అధ్యాపక సంబంధాలే విద్యా వ్యవస్థ మౌలిక అంశంగా గుర్తిస్తూ, ఆ సంబంధాలే ఏ విధంగా విద్యార్థి భవిష్యత్తును.. సమాజ భవిష్యత్తును ప్రభా వితం చేస్తాయో వివరించడం జరిగింది. తరగతి గదే సమా జం అంటూ, వందేమాతరం ఉద్యమం నుంచి ప్రత్యేక తెలం గాణ ఉద్యమం వరకు ఆ తరగతి గదే సామాజిక ఉద్యమా లకు ఏ విధంగా ప్రాణం పోసిందీ వివరించడం జరిగింది. రామయ్యగారు విదేశాలలోని తరగతి గదుల అనుభవాలని, ముఖ్యంగా అమె రికా, ఫిన్లాండ్ దేశాల అనుభవాలని, మన దేశ అనుభవంతో పోల్చి విశ్లేషిం చారు. మనదేశంలో ప్రశ్నలకు సమాధా నాలు చెప్పడాన్ని నేర్పడానికి ప్రాధాన్య తనిస్తే అమెరికాలో సమాధానాన్ని ప్రశ్నిం చడానికి ప్రాధాన్యత ఉంటుంద న్నారు రామయ్యగారు. ప్రతిదేశానికి ప్రత్యేక మైన తరగతి గది కల్చర్ ఉంటుందని, ఇతర దేశాల తరగతి గది కల్చర్‌ని మన దేశంలోకి తేవాలనుకుంటే చాలా జాగ్ర త్తలు పాటించాలని హెచ్చరించారు. ప్రతిదీ స్విట్జర్లాండ్ నుంచో, అమెరికా నుంచో దిగుమతి చేసుకోవాలనుకునే వాళ్లకిదో మంచి హెచ్చరిక. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో తరగతి గది నేర్పిన పాఠాలు తెలంగాణ విద్యావ్యవస్థ పున ర్నిర్మాణానికి, దిశా నిర్దేశానికి ఎంతగానో తోడ్పడతాయి. కార్పొరేట్ శక్తులు విద్యాలయాలను మురికికూపాలుగా మారుస్తున్నాయని రామయ్యగారు హెచ్చరించారు. ఈ తరుణంలో తరగతి గదుల్లో ప్రజాస్వామిక స్వభావాన్ని, సోషలిజాన్ని ఆచరణాత్మకంగా చూపాలని ఆశించారు. ఉపాధ్యాయుల నియామకాలలో జాగ్రత్త వహించాలని, ఫిన్లాండ్ దేశంలో లాగా ప్రతి మూడు సంవత్సరాలకొకసారి ఉపాధ్యాయునికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని.. ఉపాధ్యాయుని పనిని అంచనా వేసేటప్పుడు సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. రామయ్యగారి ఈ సూచనలు తెలంగాణ విద్యావ్యవస్థ పునర్నిర్మాణానికి ఎంత గానో తోడ్పడతాయి. నేర్చుకోవడానికి తగిన వాతావరణం సృష్టించే కేం ద్రంగా తరగతి గదులను తయారు చేయడంలో అధ్యాప కుని పాత్ర గురించి రామయ్యగారు చేసిన సూచనలు, చెప్పిన పద్ధతులు పాటిస్తే తెలంగాణ విద్యార్థులకు ఎంతో సేవ చేసినవారమవుతాము. ప్రవహించే జ్ఞానానికి ఉపా ధ్యాయుడు ‘ప్రతీక’ కావాలనేది రామయ్యగారి కోరిక. ఇప్పుడు మనందరి కోరిక కూడా అదే. (చుక్కా రామయ్య 89వ పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసిన 'పాఠం'పుస్తకాన్ని నేడు ఆవిష్కరిస్తున్నారు. ఆ పుస్తకానికి ప్రొ॥వి.ఎస్. ప్రసాద్, ఫార్మర్ డెరైక్టర్, న్యాక్ అందించిన ముందుమాట ఇది.) ప్రొ॥వి.ఎస్.ప్రసాద్ -
వాణిజ్యం సంకెళ్లలో జ్ఞానం
విద్యను వినియోగ వస్తువుగా మార్చడం వలన బలౌతోంది ఎవరు? వర్సిటీలు జ్ఞాన సముపార్జనా కేంద్రాలుగా ఉండాల్సినది పోయి విద్య, పరిశోధన వాణిజ్యాన్ని వృద్ధి చేయాలా? జ్ఞానం మార్కెట్లో అమ్ముడు పోయే వినియోగవస్తువా? తార్కిక శక్తి అణచివేతకు గురయ్యే దేశాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది. తార్కిక శక్తి సామాజిక ఉద్యమాలకు తోడ్పటమే కాదు, పరిశోధ నల ద్వారా సమాజ పురోభి వృద్ధికి ఎనలేని ఉపకారం చేయగలుగుతుంది. శాస్త్ర పరిశోధనలు ముందు కలుగ బోయే ప్రయోజనాలనో, లాభాలనో దృష్టిలో పెట్టుకొని లేదా ఫలితాలను ముందుగానే ఊహించి జరిపేవి కావు. ఒక అంశంపై పరిశోధన చేస్తుండగా అనుకున్నదాన్నిగాక మరెన్నో విషయాలను ఆవిష్కరించిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఆ పరిశోధనల ఫలితాలు సమాజా నికి ఉపయోగపడుతున్నాయా లేక ఒక వర్గానికే ఉపకరిస్తున్నాయా? అన్నదే నేటి చర్చ. 19వ శతాబ్దం వరకు యూరప్‌లో అద్భుతమైన పరిశోధనలు జరిగి, ఖండాంతరాల మధ్య దూరాలు తగ్గిపోయాయి, కలసిపోయాయి. 20వ శతాబ్దం చివరి కల్లా వనరుల కొరత, యూనివర్సిటీలపై పాలకుల, పాలనాయంత్రాంగం ఒత్తిడి పెరిగాయి. పరిశోధనలపై మార్కెట్ శక్తుల ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం మొదలైంది. క్రమంగా విశ్వవిద్యాలయాలు మార్కెట్ శక్తుల అధీనంలోకి పోయి, వాటికి తోడ్పడే కొత్త ఆలోచనా విధానం ప్రవేశించింది. పరిశోధనల ఫలితంగా వెలువడే జ్ఞానానికి స్వార్థాన్ని జోడించాలనే కొత్త 'నీతి' పుట్టింది. జ్ఞానం సమాజానికి ఉపయోగపడాలంటే లాభాపేక్ష, స్వార్థపరత్వం అవసరమన్నారు. తగిన ధర ఉంటేనే దేనికైనా గౌరవం, విలువన్నారు. వర్సిటీల్లో, పరిశోధనా కేంద్రాల్లో జరిగే ఏ పరిశోధనైనా ఏదో ప్రతిఫలాన్ని ఆశించి జరగాల్సిందేననడం మొదలైంది. విశ్వవిద్యాల యాల పరిశోధనలకు ధర కట్టడం ఇలాగే ప్రారంభమైం ది. దానికి తగ్గ భాష, సంస్కృతి కూడా పుట్టుకొచ్చాయి. విద్యార్థిని వినియోగదారుడనడం ప్రారంభించారు. దీంతో విద్యాబోధనకు, పరిశోధనకు లాభార్జన లక్ష్యం సమంజసమైనదిగా మారిపోయింది. పరిశోధనల్లో వెల్లడైన జ్ఞానాన్ని ఉత్పత్తి అన్నారు. కాబట్టి ఆ ఉత్పత్తికి యజమాని, యాజమాన్యపు హక్కు, అధికారం లేదా పేటెంట్ ఉండటం సహజమైంది. ఉంటే అందులో శ్రమ ఉంటుంది. ఇలా సామాజికాభివృద్ధి ఫలితంగా, సామా జిక సంపదగా ఉన్న జ్ఞానంపై గుత్తాధికారం నెలకొనడం పుంజుకుంది. విద్యార్థిని వినియోగదారునిగా మార్చడంతోనే విద్య వినియోగ వస్తువుగా మారింది. ఈ విద్యా వ్యాపారంలో పరిశోధకుడు కూడా ఒక భాగస్వామి. ఇక్కడే అసలు సమస్య ఆరంభం అవుతుంది. పరిశోధనలు సాగించిన విద్యార్థి, నేను తయారుచేసిన పరిశోధనా ప్రాజెక్ట్ నివేదికల వల్లే ఫలితం వచ్చింది. కనుక నేనూ భాగస్వామినే అని కోర్టులో దావా వేశాడు. దీంతో విద్యార్థిని కూడా భాగస్వామిగా ఒప్పుకున్నారు. పరిశోధనకు అవకాశాలను, పరిస్థితులను సమకూర్చిన యూనివర్సిటీ తాను ఆ ప్రత్యేక జ్ఞానం ఉత్పత్తికి కారణం కనుక తనకూ అందులో వాటా దక్కాలని వర్సిటీ పట్టుబట్టింది. జ్ఞానం యాజమాన్యంలో వర్సిటీ, ప్రొఫెసర్లు, విద్యార్థులు అంతా భాగస్వాములయ్యారు. విశాలమైన జ్ఞానం విస్తృతిని కుదించారు. అపారమైన విజ్ఞానానికి సంకెళ్లు వేశారు. మన ప్రభుత్వాలు, పాలకుల ప్రధాన ధోరణి మార్కెటీకరణే కనుక అవి ఈ జ్ఞానం మార్కెట్‌ని ప్రోత్స హించాయి. విశ్వవిద్యాలయాలు తమకు తామే నిధు లను సమకూర్చుకోవాలనే భావన ఇలాగే ఉత్పన్న మైంది. ప్రభుత్వం ఆ బాధ్యతను వదుల్చుకుని విద్యా విపణిలో లాభాలు తెచ్చిపెట్టే ప్రొఫెసర్లనే నియమి స్తోంది. విద్యార్థికి నాణ్యమైన విద్యను, జ్ఞానాన్ని అందించే గీటురాయికి కాలదోషం పట్టింది. విశ్వవిద్యా లయాలకు ఆదాయం సమకూర్చడమే ప్రొఫెసర్ల జ్ఞానా నికి, బోధనా నైపుణ్యానికి గీటురాయిగా మారింది. పరిశోధనకు, విద్యార్థికి, ఉపాధ్యాయుడికి మధ్య ఉన్న సంబంధాలు తెగిపోయాయి. ఏ పరిశోధనలైతే లాభదా యకమో అటువంటివే జరుగుతున్నాయి. ఏ సబ్జెక్ట్ వాణిజ్యపరంగా లాభదాయకమైతే దానికే ప్రాధాన్యత నివ్వడం మొదలైంది. వృత్తిపరమైన జ్ఞాన సాధనే పరమావధిగా మారింది. తరగతి గది బోధన ప్రాధాన్యం కోల్పోయింది. బోధనలో అనుభవం లేని వారికి ఆ బాధ్యతలు అప్పగించేస్తున్నారు. ప్రొఫెసర్లను పరిశోధనా వ్యాపార వృద్ధికి ఉపయోగించుకోవడం పెరిగింది. డబ్బు సంపాదనను బట్టి యూనివర్సిటీల ర్యాంకింగ్ మొదలైంది. విద్యార్థిని గాలికి వదిలేశారు. అసలు పరిశోధనే జరగకున్నా ఆదాయం వస్తే చాలనుకుంటున్నారు. ఒకప్పుడు నిస్వార్థంగా విద్యాదానం కోసం స్థాపించిన ప్రైవేటు కళాశాలలు లాభాలనిచ్చే పాడి గేదెలయ్యాయి. ఏ మెడికల్ కాలేజీలోనైనా నేడు 30 నుంచి 40 శాతం మేనేజ్మెంట్ సీట్లుంటాయి. అవి యాజమాన్యాలకు ఆదాయ వనరుగా మారాయి. అభి వృద్ధి చెందిన దేశాల్లో పరిశోధనలను అమ్ముకుంటుంటే, వెనుకబడిన దేశాల్లో సీట్లు అమ్ముకుంటున్నారు. ఎక్కడైనా బలైంది విద్యార్థులే. పరిశోధనలు ప్రైవేట్ పరం కావడంతో బోధన దెబ్బతిన్నది. సీట్లు అమ్ముకో వడంతో కాలేజీల సంస్కృతి మారిపోయింది. విద్యను వినియోగ వస్తువుగా మార్చడం వలన బలౌతోంది ఎవరు? విశ్వవిద్యాలయాలు జ్ఞాన సముపార్జనా కేంద్రాలుగా ఉండి, మానవతావాదాన్ని పెంపొందిప జేయాల్సింది పోయి విద్య, పరిశోధన వాణిజ్యాన్ని వృద్ధి చేయాలా? జ్ఞానం మార్కెట్లో అమ్ముడు పోయే వినియోగవస్తువా? అదే నిజమైతే రేపు గాలి, నీరు సైతం మార్కెట్లో కొనుక్కోవాల్సిన వస్తువులయ్యే ప్రమాదం ఉంది. ఆ రెండు సరుకులపై పేటెంట్ హక్కు ఎవరిదంటారో? (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త) -
'మన ఊరు బడిని బతికించుకుందాం'
గూడూరు(పాలకుర్తి) : విద్యారంగంలో రాణించడం ద్వారానే ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదుగొచ్చని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. పేద వర్గాలకు నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలంటే స్థానిక ప్రజల భాగస్వామ్యం తప్పక ఉండాలని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో 'వందేమాతరం ఫౌండేషన్' ఆధ్వర్యంలో 'మన ఊరు బడిని బ్రతికించుకుందాం' అనే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చుక్కా రామయ్య మాట్లాడుతూ ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఒకటైన ఫిన్లాండ్ విద్యా రంగంలో ముందుండటం వల్లే అగ్ర దేశాలతో అన్ని రంగాల్లో మందంజలో ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు చదువు చెబుతామనే నమ్మకాన్ని కల్గించాలని అన్నారు. గ్రామ ప్రజలు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో, ఉపాధ్యాయులతో సమన్వయంగా ఉంటూ నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. తాను పుట్టిన గ్రామంలో విద్యను ప్రోత్సహించేందుకు గోల్డ్ మెడల్ ప్రధానం చేయడం ప్రారంభించిన నాటి నుంచి విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు. గూడూరు గ్రామ దళిత కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి నేడు న్యూజెర్సీలో నెలసరి వేతనం రూ.15 లక్షలు సంపాదించడం గర్వకారణమన్నారు. ఆడ పిల్ల చదువు సమాజంలో ఎంతటి మార్పు తీసుకు వస్తుందో అర్థం చేసుకోవాలని కోరారు. నేడు ప్రభుత్వ పాఠశాలను ప్రజలు, ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే ప్రభుత్వ విద్య బలహీన పడుతుందన్నారు. వందేమాతరం ఫౌండేషన్ డైరక్టర్ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడిన కమిటితో మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. విద్యాభిమానులను కలిసి విరాళాలు సేకరించి పాఠశాల తరగతి గదిలో అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. ఇందు కోసం వందేమాతరం ఫౌండేషన్ స్వచ్చందంగా సహకరిస్తుందని తెలిపారు. -
రైతులకు ఆదాయ భద్రత కల్పించాలి
-
రైతులకు ఆదాయ భద్రత కల్పించాలి
రైతు కుటుంబాన్ని పరామర్శించిన విద్యావంతుల వేదిక నాయకులు అండగా ఉంటామని భరోసా ఐనాపూరు, చేర్యాలలో రైతు రక్షణ యాత్ర చేర్యాల : అన్నం పెట్టే రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని తెలంగాణ జేఏసీ చైర్మన్.. ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తిలు అన్నారు. శుక్రవారం తెలంగాణ విద్యా వంతుల వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి రైతుల రక్షణ యాత్రను ప్రారంభించి, వరంగల్ జిల్లా చేర్యాల మండలంలో ఐనాపూరుకు వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజేందర్, చేర్యాలలో సర్పంచ్ ముస్త్యాల అరుణల అధ్యక్షతన వేర్వేరు సమావేశాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను పలువురు రైతులు ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక దృష్టికి తీసుకొచ్చారు. రైతులు ఆత్మగౌరవంతో బతకాలి: కోదండరాం రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఆత్మగౌరవంతో బతకాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గ్రామస్థాయి నుంచి రైతు సమస్యలపై సంఘం ఏర్పాటు చేసుకోవాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పోరాటాలు చేయాలన్నారు. దేశ ఆర్థిక పరిస్థితులకు వ్యవసాయరంగం ముఖ్యమైందన్నారు. రైతులకు బ్యాంకు రుణాలు వెంటనే ఇవ్వాలని, బ్యాంకర్లతో మాట్లాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చుతామని అన్నారు. కరువు ప్రాంతంలో పంట నష్టపరిహారం కింద ఒక్క ఎకరానికి 10 వేలు అందించాలన్నారు. సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి: రవీందర్రావు రైతులు గ్రామ సంఘాలు ఏర్పాటు చేసుకుని సమస్యలపై పోరాటం చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు రవీందర్రావు అన్నారు. రైతు సమస్యలపై ఒంటరిగా పోరాటం చేస్తే సాధించలేమని అన్నారు. రైతులు ఒంటరి కాదని, మీ వెంట సమాజం ఉందని, మీకు తోడుగా ఉంటామన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. -
'అరెస్ట్‌లతో ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు'
హైదరాబాద్: వరంగల్ ఎన్‌కౌంటర్‌పై నిరసనగా బుధవారం చలో అసెంబ్లీకి ప్రజాసంఘాల నేతలు, వామపక్షాల నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యార్థులను, పలువురు నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్యను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. గృహనిర్బంధంలో ఉన్న చుక్కారామయ్య తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు ఉదయం సీఐ తన ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తున్నానని చెప్పినట్టు ఆయన అన్నారు. ప్రజల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని కోరారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ప్రజల ఆకాంక్షలను అణిచివేయలేరని చుక్కా రామయ్య స్పష్టం చేశారు. -
'అరెస్ట్‌లతో ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు'
-
ఆ సినిమా.. విద్యారంగ ప్రగతికి చిహ్నం
హైదరాబాద్: విద్యారంగ ప్రగతికి ‘చదువుకోవాలి’ చిత్రం ఎంతో దోహదపడుతుందని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ప్రశంసించారు. తాను 30 ఏళ్ల తర్వాత చూసిన మొదటి చిత్రం ఇదేనని ఆయన చెప్పారు. ఖైరతాబాద్‌లోని ఓ థియేటర్లో విద్యార్థులతో కలిసి సినిమాను తిలకించిన అనంతరం ఆయన మాట్లాడారు. బాలికల చదువు విషయంలో రూపొందించిన ఉత్తేజభరితమైన పాటలు, కథ అందరినీ కదిలించే తీరుగా ఉందని కొనియాడారు. తాము నిర్వర్తించాల్సిన బాధ్యతను విజయవంతంగా పూర్తిచేసిన సీనియర్ జర్నలిస్ట్, దర్శకుడు ఎం.వెంకటేశ్వరరావును అభినందించారు. సామాజిక అంశాల ఆధారంగా సినిమా తీయడం గొప్ప విషయమని చెప్పారు. అనంతరం చుక్కారామయ్యను సన్మానించారు. కార్యక్రమంలో డి.లలిత, ఫార్మసీ కళాశాలల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కె.రామదాసు, సూపర్వైజర్ నర్సింగరావు, దావూద్ ఖాన్ పాల్గొన్నారు. -
‘డిటెన్షన్’ సమాజానికి చేటు!
నేడు ఉపాధ్యాయ దినోత్సవం డిటెన్షన్ పద్ధతి ఉపాధ్యాయుడికీ, విద్యార్థికీ ఇద్దరికీ నష్టమే. విద్యార్థి సాధించిన విజయాలను మూల్యాంకన చేయవద్దని నేను అనడంలేదు. కానీ అతన్ని డిటైన్ చేయడం న్యాయం కాదనేది నా ఉద్దేశం. కాబట్టి డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచనలను ఉపసంహరించుకోండి. పుండు ఒకచోట ఉంటే మందు ఇంకోచోట పెట్టడం మన దేశంలో పరిపాటిగా మారింది. ఇది అనాదిగా మన విద్యా వ్యవస్థకు పట్టిన దౌర్భా గ్యం కూడా. సీబీఎస్ఈ అధికార యంత్రాంగం డిటెన్షన్ పద్ధతిని మర లా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ మేరకు రాష్ట్రాల అభిప్రాయాలను కోరారు. డిటెన్షన్ ప్రవేశపెట్టి 10 ఏళ్ల కంటే ఎక్కువే అయింది. అప్పుడు విద్యావేత్తలు హెచ్చరికలు చేశారు. కేవలం డిటెన్షన్ పద్ధతే కాకుండా విద్యార్థి ప్రమాణాలు సాధించాడా? లేదా? కనుక్కొ నేందుకు యంత్రాంగం ఏర్పాటు చేయాలని నాడు చెప్పడం జరి గింది. ఇవాళ విద్యార్థుల్లో ప్రమాణాలు దిగజారిపోతున్నాయనే నెపంతో సమస్యను తిరగదోడుతున్నారు. డిటెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టి వెనుకబడిన తరగతుల విద్యార్థుల్ని చదువు నుంచే కాకుండా పౌర సమాజం నుంచే దూరం చేసే ప్రయత్నం జరుగు తోంది. చదువు చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. తాను చెప్పిన చదువు పిల్లలకు అర్థమవుతోందో, లేదో విద్యార్థులను అడిగి తెలుసుకోవాలి. అందువల్ల ఈనాడు ఉపాధ్యాయుడు, విద్యార్థి వీరిద్దరినీ ఎవాల్యుయేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. విద్యార్థికి అర్థం కాకపోతే ఉపాధ్యాయుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. విద్యార్థికి అర్థమవడం వ్యక్తిగత విషయం. బోధన మాత్రం సామాజిక ప్రక్రియ. కొన్ని సార్లు సామూహిక ప్రక్రియ వ్యక్తికి ఉపయోగపడకపోవచ్చు. అప్పుడు ఆ వ్యక్తికి అర్థం కాకపోవడానికి కారణం తెలుసుకొని, అది బోధనాపరమైన కారణమా? వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. బోధనాపరమైన కారణాలు ఉంటే ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. తరగతిలో చెప్పిన అంశం విద్యార్థికి అర్థమయ్యేలా చెప్పే దిశగా ఉపాధ్యాయుడు ఆలోచిస్తే అతనికి కూడా కొన్ని కొత్త బోధనా పద్ధతులు తెలుస్తాయి. అది లాభమే. తప్పులు చేసిన ప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి. అర్థం కాని పిల్లవాడే కొత్త బోధనా పద్ధతులను ఆవిష్కరించవచ్చు. విద్యార్థి వ్యక్తిగత కార ణాలు ఏమైనా ఉంటే అతడిని ప్రేమించేందుకు పాలకవర్గం నుంచి ప్రయత్నం జరగాలి. మన సర్కారీ బడులకు వస్తున్న వారిలో చాలా మంది విద్యార్థులు ఫస్ట్ లెర్నర్స్ కాబట్టి వ్యక్తి గతమైన కారణాలు బలమైనవి ఉండవచ్చు. ఇతర దేశాల్లో ఆ కారణాలను కనుక్కొనేందుకు యంత్రాంగాన్ని సృష్టించుకున్నా రు. పాఠశాలల్లో సరైన బోధనా పద్ధతులు, మౌలిక వసతులు కల్పించకుండా, వారి వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సైతం చొరవ చూపకుండా కేవలం పిల్లల్ని డిటైన్ చేస్తామనడం సరి కాదు. దేశంలో దారిద్య్రం తాండవిస్తోందని దరిద్రుల్ని చంపుకుం టామా? అలాగే పిల్లవాడికి చదువు రాలేదని చదువు నుంచి దూరం చేస్తామా? చదువంటే కేవలం పుస్తక పరిజ్ఞానమే కాదు. కొందరికి అకడమిక్‌గా రాకపోవచ్చు. అతను వేరే రంగంలో ప్రతిభాశీలి కావచ్చు. గొప్ప క్రీడాకారుడు కావచ్చు. సంగీత విద్వాంసుడు కావచ్చు. లేకపోతే ఏ చేతివృత్తిలోనో రాణించ వచ్చు. ఈ ప్రయత్నాలేవీ చేయకుండా బడి నుంచి పిల్లల్ని తొల గిస్తామనడం మన వైఫల్యాలను ప్రపంచానికి ఎత్తి చూపడమే అవుతుంది తప్ప మరొకటి కాదు. గత పదేళ్లుగా ఈ దిశగా ప్రయత్నాలేవీ జరగలేదు. చివరకు ఏ తరగతికి ఏ విద్యా ప్రమాణాలు కావాలో మనం సూచించ లేదు. పదో తరగతికి వచ్చిన విద్యార్థి తీరుతెన్నులను చూస్తు న్నాం. ఇతర దేశాలలో అయితే ఏ సంవత్సరానికి ఆ సంవ త్సరం విద్యార్థిని సమీక్షిస్తారు. ప్రతి తరగతికి కొన్ని ప్రమాణాలు ఏర్పా టు చేసుకున్నారు. ఆ వారంలో అవి రాకపోతే పాఠశాల తరగ తుల అనంతరం అదనపు సమయాన్ని కేటాయించి దాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తారు. అదే విధంగా సెలవుల్లోనూ విద్యా ర్థులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఇవేమీ లేకుండా కనీసం విద్యార్థి ప్రమాణాల స్థాయిని పెంచేందుకు ప్రయత్నాలు చేయకుండా ఏకంగా డిటెన్షన్ విధానంతోనే విద్యార్థిని శాశ్వ తంగా బడి నుంచి పంపిస్తామనడం సమాజానికి అనర్థం. విద్యా ర్థిని ఒక్కసారి బడి నుంచి తొలగిస్తే అతడు తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు. అతడు తర్వాతి జీవితంలో సృష్టించే సంపదను దేశం కోల్పోతుంది. ఈ విధంగా లెక్కవేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం వైపు వెళ్లే ప్రమాదం ఉంది. దీనితో సహా తరగతి గది ప్రమాణాలు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారతా యి. అర్థంకాని పిల్లవాడు కొత్త రీసెర్చ్‌కు కారణమవుతాడు. మనం ఒక మంచి పుస్తకం నుంచి మరో పుస్తకానికి విషయాన్ని మార్చడమే చదువు అనే భ్రమలలోనే ఉన్నాం. చదువు అంటే లెర్నింగ్. దానిపై పరిశోధనలు నిరంతరం జరగాలి. కాబట్టి డిటెన్షన్ పద్ధతి అటు ఉపాధ్యాయుడికీ, ఇటు విద్యార్థికీ ఇద్దరికీ నష్టమే. విద్యార్థి సాధించిన విజయాలను మూల్యాంకన చేయ వద్దని నేను అనడంలేదు. కానీ అతన్ని డిటైన్ చేయడం న్యాయం కాదనేది నా ఉద్దేశం. కాబట్టి డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచనలను తక్షణమే ఉపసంహరించుకోండి. పేదపిల్లలకు విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఇతర దేశాలలో చేపట్టిన అన్ని ప్రయత్నాల మీద ఇప్పటికైనా పరిశోధన చేయండి. ఇప్పటి వరకు చదువులో ఆసక్తి ప్రదర్శించిన వారి పట్లే ఎక్కువ దృష్టి పెట్టాం. ఇకనైనా వెనుకబడిన కుటుంబాల వారి పిల్లలకు నాణ్య మైన విద్యను అందించే దిశగా దృష్టి సారించండి. బడుగు, బల హీనవర్గాల పిల్లలు బడికి ఎందుకు రాలేకపోతున్నారో తెలుసు కోండి. వ్యక్తిగత కారణాలను సైతం అధ్యయనం చేసి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టండి. నైపుణ్యాలు కలిగిన మానవ సంపదను పెంచి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయండి. విద్యా వ్యవస్థను పూర్తిగా సంస్కరించి దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు కృషి చేయండి. చుక్కా రామయ్య (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు) -
కేజీ చదువే పునాది
మనం మాట్లాడే మాటలు ఎదుటివారిని గౌరవిస్తేనే వాళ్లు వింటారు. భాష ఎదుటివారిని నొప్పించకూడదు. కేజీ చదువు బెంచీలతో రాదు ఉపాధ్యాయు ల ప్రవర్తనతో వస్తుంది. అబద్ధం ఆడకూడదని చిన్నప్పుడే పిల్లల్లో రావాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిన తర్వాత దీర్ఘాలోచ నలు చేసి, చర్చలు జరిపి విద్యా పాలసీని ప్రకటిం చడం జరిగింది. ఆ పాలసీని పకడ్బందీగా అమలుపర్చడానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీలో పాల్గొనే అవకాశం నాకు దొరి కింది. ఈ రకమైన ఎడ్యుకేషన్ పాలసీ.. కేజీ టూ పీజీ అన్న విధానం విద్యారంగంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకూ లేదు. ఇది అందరూ ఆహ్వానించాల్సింది. కేజీ విద్య పేరుతో ప్రైవేటు సంస్థలు భారీగా డబ్బు వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే ఇక నుంచి కేజీ విద్యను చేపట్టబో తుందని ప్రకటించడంతో విద్యారంగ కార్యకర్తగా నేను ఎంతో సంతోషపడ్డాను. ఈనాడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమేకాదు అది సమాజం బాధ్యత అని గుర్తించినందులకు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వాన్ని అభినందించాల్సిందే. సాంకేతికరంగంలో వచ్చిన మార్పుల వల్ల సమష్టి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3 నుంచి 6 సంవత్సరాల మధ్యన శిశువులో ఏర్పడిన మానసిక, శారీరక మార్పులను ఆధారం చేసుకుని సుస్థిరమైన సమాజ నిర్మాణానికి విద్యారంగం ప్రాధాన్యతలను నిర్ణయించడంలో కేజీ చదువు పాత్ర ఎంతో ఉంది. విదేశాలలో ఇందుకు సంబంధించి ఏ విధమై నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలు సుకోవాలనే ఉద్దేశ్యంతో ఇటీవల అమెరికా వెళ్లాను. చాలా మంది విద్యావేత్తలతో కలిసి మాట్లాడాను. ముఖ్యంగా చికాగో నగరంలో ఒక సంస్థ ఏర్ప డింది. ఇందుకోసం ఏకంగా ‘అర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ టు ఏ సస్టైనబుల్ సొసైటీ’ అనేది ఏర్పడింది. ఆ సంస్థ నిర్వాహకులతో మాట్లాడాను. వారి పనితీరును నిశితంగా పరిశీలించాను. సాంకేతికమైన మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగానే విద్యారంగంలో తీవ్రమైన కదలికలు రావటం జరిగింది. దీంతో అందరికీ చదువు అనే భావన కూడా కలిగింది. చదువు వల్ల ఆధిక్యత వస్తున్నది కాబట్టి ఆ చదువును అందరికీ అందిం చగలిగితే కొన్ని వర్గాల్లో విముక్తి కలుగుతుంది. మొత్తం సమాజ పరివర్తన జరుగుతుంది. సామాజిక పరిణామాల నుంచి చదువును విడదీయలేరు. 21వ శతాబ్దంలో సమాచార రంగంలో వచ్చిన మార్పులు చిన్నవి కావు. దీనివల్ల ఉద్యోగభృతి అవకాశాలు పెరగటమే గాకుండా ఆర్థిక వ్యవస్థకు విద్య ఒక ప్రధాన అంగంగా మారింది. ఈనాడు అక్షరం కన్నా భావన చాలా ప్రధానం. ఆ ఆలోచ నలు బాల్యంలో ఉత్పత్తి అయ్యేది ఇంద్రియాల చైతన్యం వలననే. శిశువు దేహంలో ప్రధానమైన మార్పు ఇంద్రి యాల వల్లనే ఏర్పడుతూ వచ్చింది. శిశువు తనంత తానుగా ఆలోచించడు. ఇంద్రియాల ప్రేరణే శిశువు ఆలోచనలకు మూలం. దానినే ‘బుద్ధి’ అంటారు. ఇంద్రియాలు ఈ బుద్ధికి పునాది. 3 నుంచి 6 ఏళ్ల మధ్యన ఇంద్రియాలకిచ్చే శిక్షణే బిడ్డల ఆలోచనలకు పునాది. అదే అనంతర జీవితంలో కూడా శిశువు అవగాహనపై ప్రభావం వేస్తూ ఉంటుంది. ఆలోచనా విధానాన్ని నియమబద్ధంగా ఉంచా లన్నా, సామాజిక అవసరాలకు అనుగుణంగా మార్చాలన్నా, వ్యక్తిగత అవసరాలకు మార్చా లన్నా శిశువుకు ఈ దశే చాలా ప్రధానం. ఈ దశలో విద్యార్థిని ఎంత జాగ్రత్తగా, బాధ్యతా యుతంగా మనం తీర్చిదిద్దగలిగితే అదే స్థాయిలో ఉత్తమమైన పౌరుడుగా ఉత్తమ పౌరురాలుగా వారు రూపొందుతారు. కానీ శిశువులో ఏ అవగాహన కలిగించదలు చుకున్నా తల్లికి ఉండే లక్షణాలు ఆ ఉపాధ్యాయు నికి ఉంటేనే ఆ లక్ష్యసాధన జరుగుతుంది. ఆర్థిక రంగంలో వచ్చిన మార్పుల వలన శిశువుపై నేటి కాలంలో ఎంతో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అది జరగకపోతే శిశువు పెరిగాక పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. తల్లీ తండ్రీ చేయవలసిన పనిని సమాజమే చేయవలసిన బాధ్యత ఏర్పడింది. కాబట్టి ఒక పౌర సమాజం కోసమై వ్యవస్థ ఏర్పడింది. ఇది కొందరికే కాదు అందరికీ అన్నది ‘అర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ టు ఎ సస్టైనబుల్ సొసైటీ’ లక్ష్యంగా ముందుకు సాగుతుంది. అయితే ఈ పని మాత్రం ఆచరణలో అంత సులభమైనది కాదు. తల్లి మాదిరిగా శిశువుతో సాన్నిహిత్యం పెంచుకునే వ్యక్తి ఒక ఎడ్యుకేటర్ కావాలి. కుటుంబంలో తల్లి చేసే పని పవిత్రమై నది. శిశువుకు శారీరక అవసరాలుంటాయి. ఎదిగే పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని ఇవ్వటం జరగాలి. పిల్లలకు పెట్టే ఆహారంలో ప్రేమను కూడా కలిపి తినిపిస్తే అది పిల్లలకు శక్తినిస్తుంది. శిశువు ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వటానికి వన రులు కూడా ఎంతో అవసరం. శిశువు రంగులను గుర్తించటం, రంగులలో తేడాలను గుర్తించటం. అవసరం ఉపాధ్యాయుడు పిల్లల భాషలో మాట్లాడాలి. ఉపాధ్యాయుని దగ్గరకు శిశువు తల్లి దగ్గరకు వచ్చినట్లుగా పరుగెత్తుకు రావాలి. ఇందుకు ఎలాంటి భాష కావాలో ఆలోచించాలి. ఆ శిశువు కల్చర్ తెలియాలి. అమెరికాలో ఉన్న ఆఫ్రో అమెరికన్ శిశువు లకు శిక్షణనిచ్చేందుకు అక్కడ ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. సామాజిక సుస్థిరత కోసం ఆ శోధనలు జరుగుతున్నాయి. కేజీ చదువు వెనుక ఇంత పెద్ద పరిశ్రమ ఉన్నది. మనం మాట్లాడే మాటలు ఎదుటివారిని గౌరవిస్తేనే వాళ్లు వింటారు. భాష ఎదుటివారిని నొప్పించకూడదు. ఆప్యా యంగా ఆదరించే విధంగా ఉండాలి. కేజీ చదువు బెంచీలతో రాదు ఉపాధ్యాయుల ప్రవర్తనతో వస్తుంది. అబద్ధం ఆడకూడదని చిన్నప్పుడే పిల్లల్లో అవగాహన రావాలి. కేజీ స్కూలుకు అక్షరం కాదు పౌర సమాజ నిర్మాణానికి కావాల్సిన పునాది. అమెరికాలో ఆ కేజీ స్కూల్‌కు పోతే నేనూ చంటి బిడ్డనయ్యాను. (వ్యాసకర్త: చుక్కారామయ్య ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు) -
‘కేజీ’ కారాదు పసివారికి దూరం, భారం
పసి పిల్లలకు తరగతి గదుల్లో అక్షరాలు నేర్పటం సరైంది కాదని విద్యావేత్తలంతా చెబుతున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు ఆ పట్టింపే లేకుండా పసివాళ్లకు కేజీ తరగతులను, చదువులను తప్పనిసరి చేసేశాయి. పిల్లలపై అనవసర భారాన్ని, ఒత్తిడిని తొల గించేలా దాన్ని సంస్కరించాలి. మారిన సామాజిక పరిస్థితులకనుగుణంగా ప్రభుత్వ రంగంలోని కేజీ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పుడు అమల్లో ఉన్న తర గతి గది బోధనా పద్ధతుల్ని పటిష్టం చేసి, విద్యను సామా జికీకరణ చేయాలనే లక్ష్యంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని ఓ కొత్త ప్రయోగాన్ని తెలంగాణ విద్యారంగంలో మొదలుపె ట్టారు. ఇప్పటి వరకూ మన శ్రద్ధంతా సెకండరీ విద్యపైనే కేంద్రీకరించడం జరిగింది. మారిన పరిస్థితులకు అను గుణంగా కేజీ విద్యపైకి తెలంగాణ ప్రభుత్వం దృష్టి మరల్చింది. పరీక్షా విధానంలో సైతం దేశంలో మరె క్కడా చేపట్టని పలు సంస్కరణలను కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఇంతవరకు ఒకే లోపభూయిష్ట విద్యా విధానం అమలవుతూ వచ్చిన తోటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కే కాదు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రా లకు సైతం ఈ నూతన వైఖరి అనుసరణీయమైనది. ప్రత్యేకించి నేటి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కేజీ చదువులను ప్రభుత్వ విద్యారంగం పరి ధిలోకి తేవడం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రయోగంలో విజయం సాధిస్తే తెలంగాణ దేశానికే ఆదర్శ నమూనా అవుతుంది. మూడు నుంచి ఆరేళ్ల వయసు పిల్లల కోసం ప్రత్యే కంగా పిల్లలను కేజీ స్కూళ్లలో చేర్చే దేశవ్యాప్త సంప్రదా యానికి మధ్యతరగతి లేక సంపన్న వర్గాలు శ్రీకారం చుట్టాయి. అలా తరగతి గదుల్లో అంత చిన్న పిల్లలకు అక్షరాలు నేర్పటం సరైంది కాదని విద్యావేత్తలంతా ఎప్ప టి నుంచో చెబుతున్నారు. కానీ ప్రైవేట్ యాజమా న్యాలు ఆ పట్టింపే లేకుండా పసి పిల్లలకు కేజీ తరగతు లను, చదువులను తప్పనిసరి చేసేశాయి. పైగా వారికి ఇంచుమించు ప్రాథమిక పాఠశాల పాఠ్యాంశాలనే బోధి స్తున్నారు. 3 నుండి 6 ఏళ్ల వయసు పిల్లలకు అక్షరం నేర్ప డం కన్నా ఇంద్రియాల శిక్షణే అవసరం. ‘సర్వేంద్రి యానాం నయనం ప్రధానం’ అంటాం. కాబట్టి ఇంద్రి యాలకు శిక్షణనివ్వాలి. దృష్టి సరిగా ఉంటే వస్తువుల లోని తేడాలను గుర్తించగలుగుతారు. అంటే ఆ వయసు పిల్లలు వస్తువుల రంగు, ఆకారం, విస్తీర్ణం, పరిధుల లోని తేడాలను గుర్తించగలిగేటట్లు చేస్తే సరిపోతుందా? ఇదంతా దృష్టి చేసే పరిశీలన మీదనే ఆధారపడినది. అనగా ‘నేను చూస్తున్నాను’, ‘నేను పరిశీలిస్తున్నాను’, ‘నేను అధ్యయనం చేస్తున్నాను’ అన్నవి మూడూ కంటికి సంబంధించినవి. కంటి శిక్షణపై ఈ మూడింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించవచ్చు. అదే మాదిరిగా ‘నేను వింటున్నాను’, ‘నేను ఆలకిస్తున్నాను’. ఈ రెండింటి లోనూ వస్తువుల మధ్య తేడాను గుర్తించడం కన్ను, కంటి చూపులపై ఆధారపడి ఉంటాయి. ఇదే మాదిరిగా నాలుకకు శిక్షణ ఇవ్వటాన్ని ఎంతగా సంస్కరిస్తే విద్యా ర్థుల ఆలోచన అంతగా పదునెక్కుతుంది. కాబట్టి అన్ని దేశాల్లోనూ కేజీ స్కూళ్లపై దృష్టిని కేంద్రీకరించారు. అందుకు భిన్నంగా మన పట్టణాల్లోని మార్కెట్ శక్తులు లాభాపేక్షే లక్ష్యంగా కేజీ స్కూళ్లను పెట్టాయి. నిపుణుల సూచనలను పట్టించుకోకుండా తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా స్కూళ్లను నడిపి డబ్బు రాబట్టే వ్యవస్థగా ప్రైవేట్ స్కూళ్ల వ్యవస్థ మారింది. ఈనాడు కేజీ స్కూళ్ల ఫీజు లక్ష రూపాయల దాకా పోయింది. దానికి కూడా రికమండేషన్ లేకపోతే సీటు దొరకని దశను తీసుకొచ్చారు. పసిపిల్లల మనోవికా సాన్ని దెబ్బతీసేలా అక్షరాలు నేర్పడానికి తోడు ఉపా ధ్యాయులకు సరైన అర్హతలు, శిక్షణ కొరవడుతున్నాయి. దీంతో ఇప్పుడున్న కేజీ స్కూళ్లు విదేశాల్లోలాగా వాటి లక్ష్యాన్ని సాధించడంలో విఫలమవుతున్నాయి. మొత్తంగా చూస్తే నేడు విద్యారంగంలో కేజీ స్కూళ్ల ప్రాధాన్యత పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కేజీ టు పీజీ విద్య కేవలం రాజకీయ నినాదం కాదు. మారిన సామాజిక పరిస్థితులకనుగుణంగా విద్యారం గంలో తీసుకురావాల్సిన సంస్కరణగా ప్రభుత్వం రం గంలోని కేజీ విద్యను గుర్తించాలి. కేజీ నుంచే నాణ్యమైన విద్యను సామాన్యుల పిల్లలకు అందుబాటులోకి తీసుకు రావాలనే కోరికను ప్రత్యేకమైనదిగా చూడాలి. మారు మూల గ్రామాల్లోని నిరుపేదల పిల్లలకు సైతం దాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. కేజీ విద్య ప్రైవేటు యాజమాన్యంలో ఉండటం వలన ఫీజులు విపరీతంగా పెరిగాయి. దీన్ని నియంత్రించాలని ప్రభుత్వం గుర్తించ టం వల్ల విద్యారంగానికి గొప్ప మేలు జరుగుతుంది. కేజీ విద్యను పేదవానికి అందుబాటులోకి తేవడం మాత్రమే కాదు, ప్రమాణాలను కాపాడాలి. పిల్లలపై అనవసర భారాన్ని, ఒత్తిడిని తొలగించేలా దాన్ని సంస్క రించాలి. ఆ లక్ష్యానికి తగినట్లు శిక్షణ పొందిన ఉపా ధ్యాయులను నియమించాలి. కేజీ విద్యావ్యవస్థను పూర్తి ప్రభుత్వ అజమాయిషీలో ఉంచాలి. కామన్ స్కూల్ సిస్టంను తీసుకురావాలి. దాని వల్ల శ్రీమంతుల పిల్లలైనా, పేదల పిల్లలైనా పసితనం నుంచే వివక్షతకు గురికాకుండేలా చూసి, అందరిలో సమానత్వ భావనను కల్పించాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక, సామాజిక సమానత్వానికి బీజం పడే అవకాశం ఏర్పడుతుంది. కేజీ స్కూళ్లను ప్రభుత్వపరంగానే నెలకొల్పి, ప్రతి వారూ నిర్బంధంగా ఈ ప్రభుత్వ బడులకే పిల్లలను పం పేలా చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పనిని గ్రామ పంచాయతీలకే అప్పగించాలి. ప్రతి గ్రామ పంచాయతీ తమ పరిధిలోని స్కూళ్లకు ఎంత మంది పిల్లలు వస్తు న్నారో నమోదు చేయాలి. కేజీ స్కూల్‌పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అప్పుడు కేజీ విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రాథమిక విద్యలో భాగమైన కేజీ చదువులో అంతరాలకు తావు లేకుండా పోతుంది. (చుక్కా రామయ్య , వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు) -
అందరికీ సమాన విద్య ఎప్పటికీ మిథ్యేనా..?
సందర్భం ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి 50 మంది విద్యార్థుల్లో ఉన్నత విద్యకు వెళ్లి స్థిరపడేవారు సగటున కేవలం నలుగురేనట. మిగతా 46 మంది పాఠశాల స్థాయిలోనే నిలిచిపోవడంతో వారి జీవితాలు ఆగమవుతున్నాయి. ఆడపిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వ బడులకు వెళ్లే వారిలో 80 శాతం మంది బడుగు, బలహీనవర్గాలకు చెందిన వర్గాలవారే అధికం. ఉన్నత విద్యారంగంలో ప్రవే శానికి పదో తరగతే తొలిమె ట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీ వలే వెల్లడైన ‘పది’ ఫలితాల్లో ఎప్పటిలాగే బాలురుకన్నా బాలికలే పైచేయి సాధించారు. అబ్బాయిలకంటే తామే చదు వుల్లో మేటి అని మళ్లీ నిరూ పించుకున్నారు. కటిక పేదరి కంతో ప్రభుత్వ బడుల్లో చదువుకుని విద్యా సుగంధాలు విరజిమ్మే వరంగల్ జిల్లా కేసముద్రానికి చెందిన సృజన లాంటి కుసుమాలు కొందరైతే... పాఠశాలల్లో మౌలిక వసతుల్లేక చదువుల్ని మధ్యలోనే చాలిస్తున్న విద్యార్థులు మరెందరో. అంతరాలున్న మన సమాజంలో అందరికీ సమానమైన విద్య మిథ్యగానే మిగిలిపోతోంది. అందుకే నాణ్యమైన విద్య అందిస్తామని గత ఆరు న్నర దశాబ్దాలుగా పాలకులు చెబుతోన్న మాటలు ఎండ మావులే అవుతున్నాయి తప్ప నేటికీ సాకారమైంది లేదు. (పాలకుల మాయ మాటలకు తలొగ్గుతోన్న సగటు మని షి తన పిల్లల చక్కటి బతుకుకు కచ్చితమైన భరోసా కల్పిం చలేక తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నా డు.) కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తా మన్న తెలంగాణ ప్రభుత్వ ప్రకటన ప్రజల్లో గంపెడా శల్ని నింపింది. వన్నె కోల్పోయిన సర్కారీ బడులు మళ్లీ ఇప్పుడు తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటా యని ప్రజల్లో చిగురించిన ఆశల్ని నెరవేర్చాల్సిన బాధ్య త ప్రభుత్వంపైనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బడులకు వెళ్లి చదువుకుంటు న్న విద్యార్థుల సంఖ్య కంటే బడి బయట ఉండే పిల్లలే అధికంగా ఉంటున్నారు. వీరిలో బాలికలే అత్యధికం. ముఖ్యంగా గ్రామీణ పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఆడపిల్లలు పెద్ద మొత్తంలో చదువుకు దూరమ వుతున్నారు. మైనార్టీ, గిరిజనవర్గాలకు చెందిన పిల్లల ఎన్రోల్మెంట్ కూడా కనిష్టస్థాయిలోనే ఉంది. మనిషికి కావాల్సిన కనీస అవసరాలైన కూడు. గూడు, గుడ్డ వం టి మౌలిక వసతులు కొరవడటం వల్లనే చాలా మంది చిన్నారులు బడి గడప తొక్కలేకపోతున్నారు. బడులకు వెళ్లి చదువుతున్న విద్యార్థులు మాత్రం అంతంత మాత్రంగానే రాణిస్తున్నారు. ప్రభుత్వం జిల్లాల వారీగా ఫలితాలను విశ్లేషించి వెనుకబడిన జిల్లాల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రయత్నం చేయాలి. సమాజంలో వివిధ వర్గాలలో నెల కొన్న అంతరాలు తొలగిపోవాలంటే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి వారిని మరింతగా ప్రోత్స హించాలి. మారిన ఆర్థిక, సామాజిక విధానాల వల్ల ఉన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలంటే గణి తం, సైన్స్, ఇంగ్లిష్ వంటి సబ్జెక్టుల్లో మంచి ప్రావీణ్యత అవసరం లేనట్లయితే విద్యార్థులు సరైన ఉపాధి అవ కాశాలను అందిపుచ్చుకోలేరు. పరీక్షల్లో ఉత్తమ ఫలి తాలు సాధించడం ఎంత ముఖ్యమో... వాటి ద్వారా భవిష్యత్తులో ఉపాధి పొందడం అంతే అవసరం. ఎన్నో వ్యయప్రయాసలు పడి పదో తరగతిలో మం చి గ్రేడ్లతో పాసైన విద్యార్థులకు ఇంటర్ విద్యే గగనమైన రోజులివి. ప్రస్తుతం పాఠశాల విద్యతో పాటుగా ఇంటర్ చదువంతా కార్పొరేట్ కాలేజీల హస్తగతమైంది. దీనివల్ల ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు ఫీజుల భారం మోయ లేక అర్థాంతరంగా చదువులకు స్వస్తి చెబుతున్నారు. ప్ర భుత్వకాలేజీ వ్యవస్థను పటిష్టపరిస్తే ఈ దుస్థితి తప్పు తుంది. కేరళలో ప్రభుత్వరంగంలో నాణ్యమైన విద్యను అందించడం వల్ల పేద వర్గాల పిల్లలు ప్రపంచ స్థాయిలో పలు రంగాల్లో మంచి ఉపాధి అవకాశాలు పొందుతు న్నారు. తద్వారా దారిద్య్రరేఖను అధిగ మించారు. గత ఆరున్నర దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించినా వారిలో విద్యానాణ్యత ప్రమా ణాలు మాత్రం మెరుగుపడలేదు. వరంగల్, మహబూ బ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇటీవలే వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ నమూనా సర్వే లో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ బడుల్లో విద్యనభ్యసించే ప్రతి 50 మంది విద్యార్థుల్లో ఉన్నత విద్యను చదివి జీవితంలో స్థిరపడేవారు సగటున కేవలం నలుగురేనట. మిగతా 46 మంది పాఠశాల స్థాయిలో సరైన విద్యాప్రమాణాలు లేకపోవడం, కుటుం బ పరిస్థితులు సహకరించని కారణంగా వారి జీవితాలు ఆగమవుతున్నాయి. ఆడపిల్లల పరిస్థితి మరింత దారు ణంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వ బడులకు వెళ్లే వారిలో 80 శాతం మంది బడుగు, బలహీనవర్గా లకు చెందిన వారే అధికం. ప్రభుత్వ గురుకుల పాఠ శాలల్లో విద్యనభ్యసిస్తున్న పిల్లలు చాలా మెరుగ్గా ఉన్నట్లు సర్వే ద్వారా గుర్తించారు. అందువల్ల ప్రభు త్వాలు సామాజిక బాధ్యతతో పేద పిల్లల చదువుకు భరోసాగా నిలిచే సామాజిక పరివర్తనకు కృషిచేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో వర్ధమాన దేశాలు తమ దేశ పౌరుల ఉజ్జ్వల భవిష్యత్తుకు ఉద్యోగ, ఉపాధి అవకా శాలే లక్ష్యంగా విద్యా వ్యవస్థను చక్కదిద్దుకుంటున్నా యి. మార్కెట్ వ్యవస్థ సృష్టించిన ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే అందుకనుగుణమైన నైపుణ్యాలు అవసరం. నాణ్యమైన నైపుణ్యాలు కలిగిన చదువు మన విద్యార్థులకు అందినప్పుడే వాళ్లు దేశానికి అపార సం పదగా మారతారు. ఏ దేశానికైనా మానవ వనరులే ప్రధానం. అది మన దగ్గర అపరిమితంగా ఉంది. ఆ వన రులకు తగిన శిక్షణ ఇచ్చి సాంకేతికతను జోడిస్తే రాబో యే రోజుల్లో మన విద్యార్థులు అద్భుతాలు సాధిస్తారు. రాష్ట్ర పురోగతికి బాటలు వేస్తారు. ఇలాంటి సమగ్ర అభివృద్ధికి విద్యారంగమే కార్యక్షేత్రం కావాలని, ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలని ఆశిస్తున్నాను. (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త) -
అధినేతల ధోరణే అసలు సమస్య..
కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాలను విస్మరించడం వ ల్లే ప్రజలు ఉద్యమాల బాటపడుతున్నారు. తమకు ఏమి కావాలో ప్రజలే నిర్ణయించుకొని తమ ఎజెండాను రూపొందించుకుంటున్నారు. ప్రజల పక్షాన పాలన నడపాల్సిన ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అగాధాన్ని తయారు చేస్తున్నది. పదవులు, హోదాలు పొంద డంతోనే పని పూర్తికాదు. అది ఆరంభం మాత్రమే. ఆ తర్వా త ఆ వ్యక్తి తన పాలనకు అను గుణంగా తన చుట్టూ వున్న వ్యవస్థను, విధివిధానాలను దశ, దిశను రూపొందించుకో వాలి. అవి పాలన అవసరా లకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. ఎవరైనా మొదటి దశలోనే తను అనుకున్నవన్నీ సాధించలేరు. అతనికి ఇచ్చే స్వేచ్ఛపైనా, ప్రభుత్వం అందించే సహకారంపైనా, అతను ఏ మేరకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాడు అనే అంశాలపైన అతని విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఉదా హరణకు ఒక వైస్‌చాన్సలర్‌కి ఆ పదవి యిస్తే అదొక ఉద్యోగంలా వెనువెంటనే ఫైళ్ళు తిరగేసి యూనివర్సిటీ బాధ్యతలు నిర్వర్తిస్తానంటే కుదరదు. ఎందుకంటే ఆ వీసీ గానీ మరే హోదాలో ఉన్న వ్యక్తి అయినాగానీ తనకి ఉన్న సదుపాయాల్లో ఆర్థిక వనరుల్లో తను ఏమేం చేయ గలడు. ఇంకా ప్రభుత్వ సహకారం ఏ మేరకు అవసరం, ప్రభుత్వం ఆ వీసీని పూర్తి స్వేచ్ఛగా పని చేయనిస్తోందా లేదా? లాంటి సవాలక్ష ప్రశ్నలు అతని పనిపైన ప్రభా వం చూపుతాయి. ఈ అన్ని ప్రశ్నలకూ అతనికి సాను కూల సమాధానాలు దొరికినప్పుడే ఆ యూనివర్సిటీ బాధ్యతలను అతను సక్రమంగా నెరవేర్చడం సాధ్యం అవుతుంది. అలాగే ఒక ప్రధాని కూడా గెలవడంతోనే సరిపోదు. తన ఎజెండాని ప్రజలతో ఒప్పించగలగాలి. దానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ప్రజల అంగీకారం లేకుండా ఏకపక్షంగా తన ఎజెండాని అమలు చేసిన కొందరు ప్రధానులు నాయకులుగా గెలిచినా పాలకులుగా ఓడిపోతారు. మన దేశ ప్రప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కు మొదట పాలనానుభవం లేదు. ఆయన రాజకీయ ఉద్యమ నాయకుడు మాత్రమే. దేశంలో మతప్రాతిపది కపై తలెత్తే పరిణామాలు సరిదిద్దుకోకపోతే దేశం విచ్ఛి న్నం అవుతుంది. ప్రజల ఎజెండాను తీసుకొని తనకు, ప్రజలకు మధ్య వారధిని ఏర్పాటు చేసుకోవాలి. ఐక్యత, సమైక్యత పట్ల సరియైన దృక్పథం అలవర్చుకోవాలి. అందుకే నెహ్రూ దేశ ప్రధానిగా ఎన్నికైన తర్వాత తన ఎజెండాను ప్రజలతో అంగీకరింప జేసుకున్నాడు. ఆ రోజుల్లో దేశ సమైక్యతే ప్రధానమైన ఎజెండా అయింది. దేశంలోని అన్ని ప్రాంతాలను ఒక గొడుగు కిందికి తేవ డంలో ఆయన సఫలీకృతం అయ్యారు. అనేక మతాలు, జాతులు, భాషలు ఉన్న ఈ ప్రాంతంలో ఒకలౌకికవాద పాలనను అందించడం అంత సులువేమీ కాదు. అయితే నెహ్రూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన కార్యాచ రణను రూపొందించుకున్నారు. ఆర్థికాభివృద్ధికి ప్రజల కు అభివృద్ధి ఫలాలు అందించడానికి ప్రణాళికా సంఘా న్ని ఏర్పాటు చేసుకున్నారు. సోవియట్ రష్యా అనుభ వం ఆయనకు ఒక స్ఫూర్తిగా తోడ్పడింది. అయితే ఈ రోజు దేశ నాయకత్వానికి అటువంటి దృక్పథం కొరవడింది. మతతత్వం, కుల అణచివేత, మహిళలపై దౌర్జన్యాలు, దేశ సమగ్రత ప్రధాన సమస్య లుగా మారాయి. దేశంలో ఇటీవల మైనారిటీ మత సంస్థలపై పెరిగిన దాడులు ఆందోళనకరంగా ఉన్నాయి. చాలా దేశాలు భారతదేశ వైఖరిని బహిరంగంగానే తప్పు పడుతున్నాయి. దేశంలో పదికోట్ల మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారు. అంత పెద్ద సంఖ్యలో ఉన్న వాళ్ళు అభద్రతా భావానికి లోనయ్యేటట్టు ప్రభుత్వాధి నేతలు ప్రవర్తించడం ప్రమాదకర ధోరణి. మైనారిటీ లను విశ్వాసంలోకి తీసుకొని రక్షణ కల్పించాల్సిన బాధ్య త మెజారిటీ ప్రజలది, ప్రభుత్వాలది. అయితే కొంత మంది మైనారిటీలు మతతత్వంతో వ్యవహరిస్తున్నారని వాదిస్తుంటారు. అయితే మైనారిటీ మతతత్వం కన్నా మెజారిటీ మతతత్వం అత్యంత ప్రమాదకరమైనది. ఈ దేశంలో కుల వివక్ష, పీడన ఎక్కడ చూసినా కనపడుతోంది. దళితులపై, ఆదివాసీలపై సాగుతున్న అత్యాచారాలు ఇందుకు ఉదాహరణ. అలాగే మహిళల కు రక్షణ కరువైంది. స్త్రీలపై పెరుగుతున్న గృహహింస కుటుంబాల విచ్ఛిన్నానికి దారితీస్తోంది. కేంద్ర ప్రభు త్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాలను విస్మరిం చడం వల్ల ప్రజలు ఉద్యమాల బాటపడుతున్నారు. తమకు ఏమి కావాలో ప్రజలే నిర్ణయించుకొని తమ ఎజెండాను రూపొందించుకుంటున్నారు. ప్రజల పక్షాన పాలన నడపాల్సిన ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అగాధాన్ని తయారు చేస్తున్నది. అందుకే పాలకులు ప్రజల ఎజెండాను విస్మరించకుండా, ప్రజల ఎజెండానే పాలకుల కార్యక్రమంగా మలచుకొని పాలన సాగిం చాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వాలు నడిపే వాళ్ళు ప్రజాపాలకులు అవుతారు. - చుక్కా రామయ్య, వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త -
జాతి నిర్మాతలుండగా సింగపూర్ పాఠాలెందుకు?
సందర్భం ప్రపంచీకరణ వలన ఏర్పడిన భ్రష్టత్వాన్ని రూపుమాపితే తప్ప మేకిన్ ఇండియా సాధ్యంకాదు. జపాన్, స్విట్జర్లాండ్, సింగపూర్లు గొప్పదేశాలే కావచ్చు కానీ మనం వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సక్సెస్ కోసం కొత్త నిర్మాణాలు అవసరం లేదు. ఉన్న నిర్మాణాలను పునరుద్ధరించండి. భారత ప్రధాని మోదీ ఇచ్చిన ‘మేకిన్ ఇండియా’ అనే నినా దం మా అందర్నీ పులకింప జేసింది. కానీ సృష్టించడం అనేది ఒక రోజు లోనో, ఒక నెలలోనో, ఒక ఏడాదిలోనో సాధ్యమయ్యేది కాదు. కొన్ని సంవత్సరాల్లోనై నా సాధించేది కాదు. కనీసం ఐదేళ్లలో కూడా పరిపూ ర్ణంగా నూతన వ్యవస్థను సృష్టించలేం. కొన్ని దశాబ్దాలు కూడా కాదు. శతాబ్దాల తరబడి అనేకానేక తరాలు ఎడతెగకుండా జాతి పురోభివృద్ధికి అంకితమైతేనే నూతన సృష్టి సాధ్యమవుతుంది. మేకిన్ ఇండియా అనే నినాదం సార్థకమౌతుంది. భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ సరిగ్గా దీనినే సాధించాలని కలగ న్నాడు. కేవలం కలగని ఊరుకోలేదు. తన కలల పునా దులపై భావిభారత పౌరుల భవిష్యత్తు నిర్మాణానికి కార్యరూపం ఇచ్చాడు. ఓ సందర్భంలో నెహ్రూని ఒక పొలిటికల్ రిపోర్టర్ ఒక ప్రశ్న వేశాడు. ‘దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి కదా మీరు చెబుతున్న ఐఐటీ అనే నినాదం ఏవిధంగా దీనికి భిన్నంగా ఉంటుం ద’ని అడిగాడు. నెహ్రూ దార్శనికుడిలా సమాధానం చెప్పాడు.‘దేశంలో ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కళాశా లలు లేవని కాదు. అవి కేవలం బ్రిటిష్ సామ్రాజ్య వాదులు వేసిన కట్టడాలకు కాపలాదారులను మాత్రమే తయారు చేయగలవు. కానీ మనదేశ ప్రజల అవసరా లకు అనుగుణమైనటువంటి టెక్నాలజీని సృష్టించేవి కాదు. బ్రిటిష్ వారు తమ అవసరాల నిమిత్తం నిర్మాణా లు చేసిన మాట వాస్తవమే. దానికి మేం కృతజ్ఞులం. కానీ ఈనాడు దేశం స్వతంత్రమైంది. ప్రజలు ప్రజల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెంచ వలసిన అవసరం వున్నది. కాబట్టి భారత ప్రజల అవస రాలను శోధించే తరాన్ని సృష్టించవలసిన ఆవశ్యకత మనపై ఉన్నది. ఇది కొత్తతరం చేయవలసిన పని... అటువంటి ఫలవంతమైన తరాన్ని నేను చూడదల్చుకు న్నాను. అన్ని దేశాల్లో ఇలాంటి తరమే తమ దేశం యొ క్క నిర్మాణంలో కీలక భాగస్వామి అవుతోంది. ఆ తరం తో నా దేశస్తులు కూడా భుజం భుజం కలిపి ప్రపంచ సౌభాగ్యానికి కార్యోన్ముఖులైతే నేను గర్విస్తాను.’ ఆనా టికే ఆరుపదులు దాటిన దేశ ప్రధానియొక్క కల ఇది. అటువంటి కలను భారతీయుల ముంగిళ్లలోకి తె చ్చేందుకు నెహ్రూ ఐఐటీలను ప్రవేశపెట్టాడు. ‘ఈ దేశం దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతోంది. తిండిలేక తిప్పలు పడుతున్నారు. ప్రపంచ విజ్ఞానం అభివృద్ధికి కావాల్సిన స్తోమత ఈ దేశానికి ఉన్నదా?’ అని అడిగాడా విలేకరి. ‘నా దేశం తన దేశాన్ని ఎంత ప్రేమిస్తుందో ప్రపంచం లోని అణగారిన వర్గాలను, పీడిత వర్గాన్ని కూడా అంతే ప్రేమిస్తుంది... ప్రపంచ దేశాలన్నీ మమ్మల్ని ఆదుకుం టాయ’నే విశ్వాసం కూడా నెహ్రూ వ్యక్తం చేశారు. దాని ప్రకారమే ఖరగ్‌పూర్ ఐఐటికి కెనడా సహాయం చేసింది. చెన్నై ఐఐటీకి వెస్ట్ జర్మనీ సాయపడింది. బాంబే ఐఐటి ని సోవియట్ యూనియన్ నిర్మించింది. కాన్పూర్ ఐఐటీకి అమెరికా సహాయం అందజేసింది. ఈ నాలుగు ఐఐటీలకు ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలు సహాయం చేశాయి. కాబట్టి మేకిన్ ఇండియాకు పునాదిని తొలి ప్రధాని పండిట్ నెహ్రూనే వేశారు. దానినే ప్రస్తుత ప్రధాని మోదీ పునరుద్ధరిస్తేచాలు. దేశం సంతోషిస్తుంది. గత 60 ఏళ్ళలో ఐఐటీలు అసాధారణ విజయాల ను సాధించాయి. ప్రపంచంలోనే మూడవ, నాల్గవ ర్యాంకులు వచ్చాయి. దేశంలో వున్న ఐఐటీ విద్యార్థులు నాసా డెరైక్టర్స్ అయ్యారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీని నిర్మించారు. కానీ ప్రపంచీకరణ ఫలితాలు అన్ని దేశాల ను ఏవిధంగా నిర్వీర్యంగా తయారు చేశాయో, ఐఐటీల ను సైతం అంతే మోతాదులో బలహీన పరిచాయి. ఐఎం ఎఫ్ ఆదేశానుసారం ఐఐటికి యిచ్చిన ధనసాయంపై ఆంక్షలు విధించారు. ఎన్నో ఖాళీలను భర్తీ చేయలేదు. విద్యార్థులు నిస్పృహతో సర్వీస్ సెక్టార్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చా ల్సిన వారు సర్వీస్ సెక్టార్‌లోకి అనివా ర్యంగా వచ్చారు. దేశంలో అపరిమితమైన మేధస్సు వుంది. మేకిన్ ఇండియా సక్సెస్ కోసం కొత్త నిర్మాణాలు అవసరం లేదు. ఉన్న నిర్మాణాలను పునరుద్ధరించండి. ఐఐటీలు అన్నింటికీ నిధులు సమకూర్చండి. ఇవి కాకుండా దేశ వ్యాప్తంగా వున్న ఎన్ఐటీలను పరిపూర్ణం చేయండి. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయండి. వారిలోపల ఇన్నో వేషన్ అనే భావనకు అంకురార్పణ చేయండి. అది ప్రాథమిక దశనుంచి విశ్వవిద్యాలయాల వరకు జరగాలి.. విద్యార్థి జాతి నిర్మాత. నూతన భావాల సృష్టికర్త. భవిష్యత్ భారతావని ఆవిష్కర్త. అతనికి ప్రభుత్వాలకు మధ్యన దళారులు అవసరం లేదు. ప్రభుత్వమే దృఢ సంకల్పంతో వీటిని నిర్వహిస్తే అందరి ఆశలు ఫలిస్తాయి. జపాన్, స్విట్జర్లాండ్, సింగపూర్లు గొప్ప దేశాలే కావచ్చు కానీ మనం వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన తొలి ప్రధానులే మన దేశ భవిష్యత్తుకి పునా దులు వేశారు. దాన్ని పరిపుష్టం చేసుకోవడం మాత్రమే ఇప్పుడు జరగాల్సింది. అందుకు జాతియావత్తూ పునరంకితం కావాలి. అదే మా లక్ష్యం. (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త) -
తరగతి గదికి సామాజిక స్పృహ
చుక్కా రామయ్య నేరాలు జరిగే వాతావరణాన్ని మనమే సిద్ధం చేసుకుంటున్నాం. నేరం జరిగాక ఖండిస్తాం. ఉరిశిక్షకు కూడా వెనుకాడం. పరిష్కారం ఇదేనా? నేరంతో నేరాన్ని నిరోధించలేం. పౌరసమాజం, పాలనా యంత్రాంగం దూరదృష్టితో తగు చర్యలు తీసుకుంటేనే నేరాలు తగ్గుతాయి. దీనికి తోడు నేరగ్రస్తతను మొగ్గలోనే తుంచేసే పని ఇంటి నుంచే, బడి నుంచే మొదలు కావాలి. విద్యార్థికి సామాజిక సమస్యలపై అవగాహనను, బాధ్యతను నేర్పాలి. నేరం జరగకుండా నివారించేందుకు వివిధ ప్రభుత్వ యంత్రాంగాలు ఏవిధంగా పనిచేయాలన్నదే నేటి సవాల్. మన విద్యా వ్యవస్థ బాగోగుల పట్ల పట్టింపు ఉన్న నాకు వివిధ దేశాల విద్యావిధానాలను గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ. ఏ దేశం వెళ్ళినా అక్కడి విద్యావిధానాన్ని పరిశీలించడం కోసం అక్కడి పాఠశాలలను సందర్శించేవాడిని. అలా కొన్ని సార్లు ప్రాథమిక పాఠశాలలకు వెళ్లాను. కొన్ని సార్లు ఉన్నత పాఠశాలలు తిరిగాను. ప్రతిష్టాత్మకమైన కళాశాలలు, సుప్రసిద్ధ విశ్యవిద్యాలయాలు కూడా చూశాను. ఎక్కడికి వెళ్ళినాకానీ, సమాజంలోని వాస్తవ పరిస్థితుల పట్ల, దైనందిన సమస్యల పట్ల విద్యార్థులకు వారి స్థాయికి విధంగా అవగాహనను కల్పించడం అక్కడి విద్యా కార్యక్రమంలో విడదీయ రాని భాగంగా ఉండటం స్పష్టంగా కనిపించింది. మన దేశంలో లాగా విదే శాల్లో బోధనా ప్రణాళిక (కరికులం) స్థిరంగా ఉండదు. మారుతున్న సామా జిక పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటారు. పాఠాలు చెప్పే పోలీసాఫీసర్లు ప్రాథమిక పాఠశాలలను పరిశీలించేందుకు వెళితే ఒక చోట... ఒక పోలీసు అధికారి వచ్చి తరగతి గదిలో చిన్న పిల్లలకు రోడ్డు ప్రమాదాలను గురించి వివరిస్తుండటం కనిపించింది. ఆయన తనతో పాటు ఒక ప్రొజెక్టర్‌ను కూడా తెచ్చుకున్నాడు. ప్రొజెక్టర్‌పై బొమ్మలు చూపిస్తూ రోడ్డుపైన జరిగే ప్రమాదాల తీవ్రతను, అవి బాధితుల భవిష్యత్తుపై చూపే ప్రభావాన్ని, ప్రమాదాల తదుపరి బాధితుల కుటుంబాల పరిస్థితిని వివరిస్తూ... రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను పిల్లల మనస్సుల్లో ముద్రపడేలా వివరించి చెపుతు న్నాడు. చిన్న పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో వారికి వారి సొంత భాషల్లోనే చెప్పిస్తున్నారు. అది చూస్తుంటే నాకు విజయవాడ రోడ్లపై జరిగే ప్రమాదాలు గుర్తుకొచ్చాయి. రోడ్డు ప్రమాదాలపై అవగాహనను మనం ట్రాఫిక్ పోలీసుల వరకే పరిమితం చేస్తున్నాం. కానీ ఇతర దేశాల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పిల్లలకే అవగాహనా తరగతులు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు బాధితులకు, వారి కుటుం బాలకే గాక మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థపై సైతం చూపే ప్రభావం ఎలా ఉంటుందో బొమ్మలలో చూపి, వివరించి చెబుతున్న ట్రాఫిక్ పాఠాలను పిల్లలు శ్రద్ధగా వింటున్నారు. పిల్లలను మంచి పౌరులుగా తయారు చేయా లనే తపన, లక్ష్యం అక్కడి విద్యావ్యవస్థలో బలంగా కనబడుతుంది. ఆ బోధన చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. ఉన్నత పాఠశాలకు వెళితే ఒక డాక్టర్ వచ్చి మాదక ద్రవ్యాల వాడకం పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై, ఎదుగుదలపై ఎలాంటి దుష్ర్పభావాలను కలిగిస్తుందో, ఆ వ్యసనం ఎలాంటి సామాజిక సమస్యలకు దారితీస్తుందో వివరిస్తున్నాడు. అనర్ధాలకు అడ్డుకట్ట అవగాహనే మరో సందర్భంలో ఒక కళాశాలకు వెళ్ళాను. అక్కడ 14 నుంచి 16, 17 ఏళ్ల లోపు విద్యార్థులున్నారు. ఆ తరగతి గదిలో అంతా మగపిల్లలే ఉండడం గమనించాను. మానవ పునరుత్పత్తి ప్రక్రియను గురించి వారికి వివరిస్తు న్నారు. వయసుతోపాటూ క్రమంగా ఆడ, మగ పిల్లల శరీర భాగాల్లో వచ్చే మార్పులేమిటి? సంపర్కం వలన గర్భం రావడం, గర్భంలో శిశువు ఎదుగు దల ఎలా సాగుతుంది? అనే విషయాలను అక్కడ విడమర్చి చెపుతున్నారు. విచ్చలవిడి సంపర్కం వల్ల ఎటువంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది? వాటి దుష్పరిణామాలేమిటి? వంటి పలు విషయాలపై యుక్త వయస్సులోకి అడుగిడుతున్న పిల్లలకు తరగతి గదుల్లోనే అక్కడ అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ అలాంటి అంశాలను బహిరంగంగా చర్చించడానికే సంకోచిస్తాం. ఆ బోధనాంశం ప్రత్యేకతకు అనుగుణంగానే ఆడ, మగ పిల్లలకు ఇలాంటి తరగతులను వేరువేరుగా నిర్వహిస్తారు. చిన్నతనం నుంచే, తరగతి గది నుంచే మంచి పౌరులను తయారు చేయడంలో తీసుకునే ఈ జాగ్రత్తల వల్లనే ఆయా దేశాల్లో నేరాలు దినదినం తగ్గుతుంటాయి. నేరాలను తగ్గించడంలో పోలీసుల పాత్ర ఎంతుంటుందో, పౌరుల పాత్ర కూడా అంతే ఉంటుందని ఇలాంటి అవగాహనా తరగతుల ద్వారా విద్యార్థులకు బోధిస్తున్నారు. కానీ మన దేశంలో నేరాలు, నేరాల నివారణ వంటి అంశాలపై అవగాహనంతా పోలీసులకే పరిమితం అవు తోంది. కాబట్టే ఈ సమస్య పట్ల మొత్తంగా సమాజానికి ఉన్న బాధ్యతను విస్మరిస్తున్నాం. అందువల్లనే ఒకే విధమైన నేరాలు పదేపదే పునరావృతం అవుతున్నాయి. ‘యాసిడ్ దాడులకు మేమే కారణం!’ వరంగల్‌లో జరిగిన ఒక దుర్ఘటన సందర్భంగా ఒక పోలీస్ ఆఫీసర్ నాతో కొన్ని ముఖ్యమైన, ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. ఆడపిల్లలపై జరిగిన యాసిడ్ దాడుల గురించి మాట్లాడుతూ ఆయన నాతో పంచుకున్న భావాలు పౌర సమాజాన్ని ఆలోచింపజేసేవిగా అనిపించాయి. యాసిడ్ దాడులలాంటి సంఘటనలు జరగడానికి తామే కారణమని ఆ అధికారి అన్నాడు. ఎందుకు? అని అడిగాను. వామపక్ష భావాలు ప్రచారంలో ఉన్న ప్పుడు పిల్లలు సామాజిక సమస్యలను గురించి ఆలోచించేవారు. యువతీ యువకులు జీవితంలో ఎదురయ్యే సమస్యలపై కలసి పనిచేసేవారు. మేం మా పోలీసు బలగాలతో కలసి వామపక్ష విద్యార్థి సంఘాలే లేకుండా చేశాం. వారిని బలవంతంగా అణచివేశాం. సామాజిక సమస్యలపై పోరాడే వారిని నేరస్తులుగా చిత్రీకరించాం. సమాజం బాగు కోసం యోచించే విద్యార్థుల ఆలోచనలను స్వీయ మానసిక సమస్యలపైకి మళ్లించామంటూ ఆ అధికారి బాధతో చెప్పారు. సినిమాలు బోధిస్తున్నదేమిటి? అలా స్వీయగత మనస్కులైన విద్యార్థుల ఆలోచనలు పెడదోవలు పట్టడానికి సినిమాలు తోడయ్యాయంటూ ఆయన ఆ విషయాన్నీ వివరించారు. సినిమాల్లో కుమ్మరిస్తున్న విషభావజాలంతో కుర్రాళ్లలో ఉద్రేకాలు అవధులు దాటి రెచ్చిపోతాయి. వినోదం అర్థం మారుతుంది. ఆ ‘వినోదం’గా చూపే దాన్ని స్వయంగా అనుభవించాలనే కోరిక బలంగా ఏర్పడుతుంది. సంపన్న వర్గాల వారైతే ఎలాగోలా వారి కోర్కెలను తీర్చుకుంటారు. అది సమాజానికి ఆమోదయోగ్యమే. అదే పేద, దిగువ మధ్యతరగతి వారైతే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఆ ‘వినోదాన్ని’ డబ్బుతో కొనుక్కుని అనుభవించ లేరు. కనుక పర్యవసానాల గురించిన ఆలోచనే లేకుండా బలప్రయోగం ద్వారా వాటిని తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే నేరాలకు పాల్పడతారు. సామాజిక సమస్యలు, ప్రజా జీవితాలను గురించి ఆలోచించాల్సిన వయసు లోని యువత ఆలోచనలను మేమూ, సినిమా వాళ్లు కలసి ధ్వంసం చేశాం. ఆ విధ్వంసం ఫలితాలు నేడు అనేక రూపాలు తీసుకుంటున్నాయి. మరోవంక దేశవ్యాప్తంగానే ఆర్థిక అసమానతలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పేదవాడికీ, ధనికుడికీ మధ్య అగాధం పెరుగుతున్నది. ఒకడు డబ్బుతో అనుభవిస్తున్నాడు. రెండవ వాడు బలంతో తన కోర్కెను తీర్చుకుంటున్నాడు. కాబట్టే నేను బాధపడుతున్నాను అంటూ ఆ పోలీసు అధికారి తన ఆవేదనను నాతో పంచుకున్నారు. ఎవరినని నిందించాలి? కాలేజీల్లో విద్యార్థి సంఘాలు ఉన్నప్పుడు విద్యార్థినీ, విద్యార్థులంతా సామాజిక సమస్యలపై కలసి ఆలోచించేవారు, పనిచేసేవారు. ప్రజాసంఘాల పోరాటాల్లో విద్యార్థులు ముందుండేవారు. ఆ వాతావరణాన్నే సినిమాలు కూడా ప్రతిబింబించేవి. సమాజం ప్రభావం సినిమాలపైన ఉండటం సహ జం. అందుకే అప్పట్లో సామాజిక సమస్యలపై సినిమాలు తీసేవారు. అలాం టి విద్యార్థులను ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, అర్థరహితమైన హింస వంటి పెడదోవల్లోకి నేటి సినిమా ‘వినోదం’ మళ్లించింది. సినిమాల్లోని హీరోల వీరోచిత కృత్యాలు ఎప్పుడూ సుఖాంతమే అవుతాయి. నిజజీవితంలో ఇలాంటి చర్యలన్నీ వికృతమైనవిగానే మిగులుతాయి, వైఫల్యాలనే మిగులు స్తాయి. ప్రతీకార వాంఛను ప్రేరేపించి మానవత్వాన్ని మంటగలిపేసేట్టు చేస్తాయి. ఆడపిల్లలపై యాసిడ్ దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా యంటే దానికి ఎవరు కారణం అంటారు? విద్యార్థులా? సినిమా మార్కెట్టా? లేక పాలనా యంత్రాంగం పట్టింపులేని వైఖరా? మనం ఎవరినని నిందిస్తాం? ఈ విపరిణామాలకు బలైపోతున్నదెవరు? శిక్షలతో నేరాలకు అడ్టుకట్ట వేయగలమా? నేరాలు అన్ని దేశాల్లో జరుగుతాయి. అన్ని దేశాల్లో వచ్చినట్టే కాలాను గుణంగా మన దేశంలోని యువత మానసిక స్థితిలో కూడా మార్పు వచ్చింది. కానీ ఇతర దేశాల్లో ఆ మానసిక స్థితిని సన్మార్గంలోకి మళ్ళించారు. పాలనా యంత్రాంగం, విద్యావ్యవస్థ, పోలీసు యంత్రాంగం, పౌరసమాజం అంతా కలసి యువత ఆలోచన పెడదోవలు పట్టకుండా నిరోధించేందుకు చేస్తున్న కృషి ఫలితం అది. నేరపూరిత ఆలోచనా విధానానికి అక్కడ వారంతా అడ్డుకట్టవేస్తున్నారు. అందుకు భిన్నంగా మన దేశంలో నేరాలు జరగడానికి కావాల్సిన వాతావరణాన్ని మనమే సిద్ధం చేసుకుంటున్నాం. నేరం జరిగాక అందరం కలసి దాన్ని ఖండిస్తాం. జరిగిన నేరాన్ని అత్యంత తీవ్రమైనదిగా పరిగణిస్తాం. అవసరమైతే ఉరిశిక్షకు కూడా వెనకాడం. ఇదేనా సమస్యకు పరిష్కారం? ఉరిశిక్షతో నేరాలు ఆగుతాయా? నేరంతో నేరాన్ని నిరోధిం చలేం. పౌరసమాజం, పాలనా యంత్రాంగం దూరదృష్టితో తగు చర్యలు తీసుకుంటే సమాజంలో నేరాలు క్రమేణా తగ్గుతాయి. నేరగ్రస్తతను మొగ్గ లోనే తుంచేయాలంటే ఆ పని ఇంటి నుంచే, బడి నుంచే మొదలు కావాలని పాలకులు గుర్తించాలి. విద్యార్థికి సామాజిక సమస్యలపై అవగాహన, బాధ్యత నేర్పాలి. అంతేగానీ నేరం జరిగే పరిస్థితులకు అవకాశం కల్పించి, నేరం జరిగే వరకు వేచి ఉండి, జరిగిన నేరాన్ని తీవ్రంగా పరిగణించడం వల్ల ఫలితం శూన్యం. నేరం జరగకుండా నివారించేందుకు వివిధ ప్రభుత్వ యంత్రాంగాలు ఏవిధంగా పనిచేయాలన్నదే నేటి సవాల్. (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ) -
యాంత్రికత కాదు, సృజనాత్మకత కావాలి
నాలెడ్జ్ ఎకానమీకీ, గత ఆర్థికవ్యవస్థకీ తేడా ఉన్నది. కాబట్టి పాఠశాలలు మడికట్టుకొని సమాజానికి దూరంగా ఉంటే విద్యార్థి నిరర్థకుడు అవుతాడు. భవిష్యత్తును తీర్చే నైపుణ్యాన్ని కలిగిస్తేనే మానవ సంపదగా మనిషి మారతాడు. ప్రతి ఉదయం లాగే ఈరోజు కూడా 6 గంటలకు ఉస్మాని యా ప్రాంగణం దగ్గర వాకిం గ్‌కి వెళ్లినపుడు ప్యాంట్లు, షర్టు లతో ఉన్న కొందరమ్మాయిలు చేతిలో ల్యాప్‌టాప్‌లతో పరిగె డుతూ కనిపించారు - బస్ కోసం. ఆ సన్నివేశం నన్ను ఐదారు దశాబ్దాల వెనక్కు లాక్కెళ్లింది. 50, 60 ఏళ్ల క్రితం అదే వయసున్న అమ్మా యిలు గుంపులు గుంపులుగా కొడవళ్లు పట్టుకొని కూలి పనులకు వడివడిగా వెళ్లే దృశ్యం గుర్తొచ్చింది. ఇరవ య్యేళ్ల క్రితం ఆదిలాబాద్‌లో తిరుగుతున్నప్పుడు ఉద యమే పారలు పట్టుకొని పరిగెత్తుతున్న కార్మికులను చూశాను. 60 ఏళ్లలో ఎంత మార్పు! ఈ మార్పును చైనాలో, పోలెండ్‌లో, అమెరికాలో కూడా చూశాను. ఈనాడు సామాజిక విప్లవానికి సమాంతరంగా విజ్ఞానంతో కూడిన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతు న్నది. దీనికి సంతోషపడుతుంటే దానికి సమాంతరంగా నిరుద్యోగం కూడా పెరుగుతున్నది. సాంకేతిక పరిజ్ఞా నం పుణ్యమా అని చాలా ఉద్యోగాలను యంత్రాల ప్రాతిపదికగా రూపొందిస్తున్నారు. ఒక షిఫ్ట్‌లో వంద మంది చేసే పనిని ఒకే ఒక్క యంత్రం అర నిమిషంలో చేస్తోంది.పెట్టుబడిదారుడు మనిషికన్నా యంత్రాన్నే వ్యాపార సాధనంగా భావిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఆవిష్కరణ జరిగితేనే మనిషి సమ స్యలను పరిష్కరించుకోగలుగుతాడు. నూతన ఆవిష్కర ణలకు మూలం జ్ఞానం. ఇది నాలెడ్జ్ ఎకానమీ. దీనిలో విద్యారంగాన్ని ప్రతిక్షణం మార్చుకుంటూ కొత్త భావా లను దీక్షతో అమలు చేయగలిగితేనే ఆర్థిక రంగంలో కొత్త ఉద్యోగావకాశాలు, కొత్త సంపదను సృష్టించడం సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు పెట్టుబడిదారీ దేశాలు వినియోగంలోకి రుణాలు ఇచ్చి, డబ్బు చలామణీతో ఆర్థిక వ్యవస్థను నడిపించగలిగాయి. అది ఫలితాలివ్వక అక్కడ వాల్‌స్ట్రీట్ ఉద్యమం లేక స్ప్రింగ్ ఉద్యమాలు ఆవిర్భవించాయి. కాబట్టి విద్యారంగాన్ని కాలానుగుణం గా ఎంత సంస్కరించగలిగితే అంత కొత్త ఆర్థిక వ్యవ స్థను మనం ముందు తరాలకు అందించగలుగుతాం. ఇది ఏదో ఒక దేశం సమస్య కాదు. ప్రపంచ దేశాలన్నీ ఇదే పరిస్థితిని గమనించి తమ విద్యావ్యవస్థలను సంస్క రించుకుంటున్నాయి. ఇదివరకు ఏ దేశ సమస్యను ఆ దేశమే పరిష్కరించుకొనేది. కానీ నేడు సమస్య ఏ దేశా నిదైనా, దాని పరిష్కారం అనేక దేశాలతో ముడిపడి ఉం టోంది. ఆ పరిష్కారం గ్లోబల్ పరిష్కారంగా మారు తున్నది. ఇప్పుడు దేశ సరిహద్దుల సమస్య కాదు ప్రధా నం. ఆ దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పేదరికం, ఆర్థిక అసమానతలు, ఆర్థిక సంక్షోభాలు, ప్రజల అనేకా నేక సమస్యలే ప్రధానం. ఆయా సమస్యల ఆధారంగా జరగాల్సిన నూతన ఆవిష్కరణలు వాటికి పరిష్కారం. అలాంటి ఆవిష్కరణలకు పునాది నిర్మించుకోవడానికి విశ్వవిద్యాలయాలనే కాదు, చిన్న తరగతుల నుంచి కూడా మన బోధనా పద్ధతులు మార్చుకోవాలి. వెనుకటి కాలంలో పుస్తకాలలో ముద్రించింది బోధిస్తే సరిపోయే ది. కానీ దానితో గత సమాజమే ఆవిష్కృతం అవుతుం ది. అంతే తప్ప ప్రస్తుత సమస్యకు పరిష్కారం దొరకదు. చరిత్రను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించకపోతే భవిష్యత్తుని నష్టపోతాం. మనం నిన్నటి సమాజం కన్నా రేపటి సమాజం గురించి ఆలోచించవలసి ఉన్నది. రేపు పిల్లవాడికి కావాల్సింది నైపుణ్యం మాత్రమే. అనగా రేపటి సమస్యలను పరిష్కరించడానికి వర్తమాన విద్యా ర్థుల్లో క్లిష్ట సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే ఆలోచనను అలవాటుగా మార్చాలి. సృజనాత్మక విద్యా బోధనను అలవర్చాలి. దీనినే క్రిటికల్ థింకింగ్ అం టాం. అది యాంత్రిక బోధన ద్వారా సాధ్యంకాదు. సృజనాత్మకత కావాలి. సమాచార రంగంలో కూడా విప్ల వాలు వచ్చాయి. ఈనాడు ఒంటరిగా ఆలోచించడం కన్నా నలుగురితో కలసి ఆలోచించడం అవసరం. ఆ నలుగురు ఒకే గదిలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక జట్టుతో కలసి పనిచేసే అలవాటు రావా లి. మనకు కనపడని వ్యక్తులతో కలసి పనిచేయాలి. ఇత రుల సహకారం కావాలంటే వారి నాగరికత, సంస్కృతి అలవాట్లను గౌరవించే లక్షణం కూడా ఉండాలి. దాన్నే టీం స్పిరిట్ అంటారు. టీం స్పిరిట్ కావాలంటే మన అభిప్రాయాలను ఇతరులకు అందజేసే శాసనాలపైన మనకు అభినివేశం కావాలి. అనగా ఓరల్ కమ్యూని కేషన్, రిటెన్ కమ్యూనికేషన్ ఉంటేనే ఇతరులతో కలసి ఆలోచించవచ్చు. కాబట్టి ఈనాటి విద్యార్థికి కంఠస్థం చేయడంకన్నా కొత్త సమాజం సృష్టించేందుకు నైపుణ్యం కావాలి. అందుకు పునాది మన తరగతి గదిలోనే పడవ లసి ఉంటుంది. కాబట్టి పారిశ్రామిక రంగానికీ, ఆర్థిక రంగానికీ విద్యాలయాలు తోడైతేనే క్లాసులో కనపడే విద్యార్థికి భవిష్యత్తులో ఉపాధి, జీవించే లక్షణం ఏర్పడ తాయి. నాలెడ్జ్ ఎకానమీకీ, గత ఆర్థిక వ్యవస్థకీ తేడా ఉన్నది. కాబట్టి పాఠశాలలు మడికట్టుకొని సమాజానికి దూరంగా ఉంటే మీ దగ్గర ఉన్న విద్యార్థి నిరర్థకుడు అవుతాడు. భవిష్యత్తును తీర్చే నైపుణ్యాన్ని కలిగిస్తేనే మానవ సంపదగా మనిషి మారతాడు. ఈనాటి సవాలు ఇదే. విద్యారంగంతో సంబంధమున్న వారంతా దీనికి సమాయత్తం కావాలి. అప్పుడే ఈ ప్రజాస్వామిక వ్యవ స్థలో భాగస్వాములమవుతాం. లేకుంటే కూలీలుగానే మిగిలిపోతాం. (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త) -
జ్ఞాన సమాజ దార్శనికులు
విశ్వవిద్యాలయం అంటేనే భవిష్యత్తు అని అర్థం. వైస్ చాన్సలర్ అంటే జ్ఞాన సమాజాన్ని సృష్టించే ఒక సామాజిక కార్యకర్త. తెలంగాణ రాష్ట్రంలో ఆరు విశ్వవిద్యాలయాలలో వి.సి. పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మన ఉన్నత విద్య ఏ రకంగా ఉందో అంచనా వేయవచ్చును. ప్రభుత్వం తక్షణం దీన్ని గాడిలో పెట్టాలి. విశ్వవిద్యాలయాలు ఎంత సమర్థవంతంగా ఉంటే ఉన్నత విద్యారంగం నుంచి అంతే సమర్థవంతులను సమాజానికి అందిస్తుంది. విశ్వవిద్యాల యాలు జీర్ణావస్థకు చేరుకుంటే ప్రగతికి తీరని ఆటంకం అవుతుంది. విశ్వవిద్యాలయ వ్యవస్థ అందించిన సమర్థులైన వ్యక్తులే నేడు దేశంలోని మొత్తం పాలనా రంగాన్ని నడిపిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలను ముందుకు నడిపిస్తూ దిశానిర్దేశం చేయగలిగిన సమర్థవంతులను ఉన్నత విద్యావ్యవస్థే అందించింది. ఇందుకు ప్రధాన కారణం విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దే వైస్‌చాన్సలర్లు, బోధనా రంగంలో నిష్ణాతుల వల్లనే ఉన్నత విద్యారంగం శక్తిమంతం అవుతుంది. ఇపుడు మన యూనివర్సిటీల ను గతంలో యూనివర్సిటీల వ్యవస్థతో పోల్చుకుంటే చాలా ఎక్కువ తేడా కనిపిస్తుంది. ఒక విశ్వవిద్యాలయానికి వి.సి నియామకం చేసేందుకు ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసేది. ఇందుకోసం ప్రత్యేకించి సెర్చ్ కమిటీ వేసేవారు. సమర్థుడైన వ్యక్తిని వెతికి పట్టుకునేందుకు పాలనా రంగంలోని వారు, ప్రభుత్వం, విద్యారంగ నిపుణులు కలిసి ఆలోచించి వి.సి.ని నియమించడం జరిగేది. అలా నియమితులైన వి.సి.ల కృషితో ఆ వ్యవస్థ వెలుగుతూ ఉండేది. కానీ ఇపుడు విశ్వవిద్యాలయ వి.సి.ల నియామకం రాజకీయ నియామకాలుగా, తమ అనుయాయులను నింపుకునే వ్యవస్థగా మారాయి. ఇది వ్యవస్థకు చాలా ప్రమాదకరమైనది. ఇపుడు తెలంగాణ కన్న కలలతో స్వరాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రంలో నియమితులయ్యే వి,సి.లతో ఉన్నత విద్యావ్యవస్థ సంపూర్ణ ప్రక్షాళన జరగాలి. సమర్థులను వెతికి పట్టుకోవాలి. ఇందులో రాజకీయ అంశాలను పక్కనబెట్టి ఉన్నత విద్యా వ్యవస్థను పకడ్బందీగా నడిపించే సారథుల కోసం వెతకాలి. ఏ ప్రలోభాలకు లొంగని వ్యక్తులవల్ల మాత్రమే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. విద్యావ్యవస్థ దెబ్బతింటే దాని ప్రభావం మిగిలిన అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విద్యారంగం వెలుగులు సమాజంపై పడి వ్యవస్థ వెలుగొందుతుంది. ఈ విశ్వవిద్యాలయాలకు ఒక్కరోజు కూడా వి.సి. లేకుండా ఉండకూడదు. ఈ విషయాన్ని ఎవరో కనుక్కొని చెప్పాల్సిన పని లేదు. విద్యారంగ నిపుణులందరికీ విద్యారంగ ప్రేమికులందరికీ ఈ విషయం తెలిసిందే. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేసిన డేవిడ్ స్టార్ బోర్డాన్ రాసిన ది కేర్ అండ్ కల్చర్ ఆఫ్ మ్యాన్ పుస్తకంలో తన అనుభవాలను తెలియజేశాడు. విద్యారంగాన్ని మానవుల అవసరాలను తీర్చే సాధనంగా డేవిడ్ స్టార్ బోర్డాన్ పేర్కొన్నాడు. భవిష్యత్తుకు మనం వెచ్చించే డబ్బు ఉత్కృష్ట వ్యయంగా పరిగణించబడుతుంది. విశ్వవిద్యాలయం అంటేనే భవిష్యత్తు అని అర్థం. సమాజాన్ని సంరక్షించడం అనే పదం చాలా క్లిష్టమైనది. ఏ సంస్థలైతే (విశ్వ విద్యాలయాలు) సమాజాన్ని సంరక్షించటానికి ఏర్పడ్డా యో వాటిని అవగాహన చేసుకోవటం, వాటిని కాపా డటమే ప్రజాస్వామిక ప్రభుత్వాల కర్తవ్యం అని మరు వరాదు. విశ్వవిద్యాలయానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిలే ప్రధానమైన అంగం. కానీ వైస్ చాన్సలర్ విశ్వవిద్యా లయానికి ప్రతీక. విద్యా ప్రమాణాలు పడిపోయినా, పరిశోధనలో నాణ్యత తగ్గినా, పరీక్షా పత్రాలు బయటపడ్డా, విద్యా ప్రాంగణంలో ఆందోళనలున్నా దానికి సంపూర్ణమైన బాధ్యత వైస్ చాన్సలర్దే అవుతుంది. ఏ రంగంలో పగుళ్లు వచ్చినా ఆ దుమ్ము అంతా వైస్ చాన్సలర్ నెత్తిమీదనే పడుతుంది. దేశంలో ఏ ఉద్యోగం అయినా వైస్ చాన్సలర్ పదవితో పోల్చలేం. ఆ పదవి కాలపరిమితి స్వల్పం. వారి అధికారాలు చాలా తక్కువ. భద్రత చాలా బలహీనంగా ఉంటుంది. కానీ ఆ బాధ్యతలు మాత్రం వైరుధ్యాలతో కూడుకున్న ఉన్నతమైన బాధ్యతలు. అందుకే వైస్ చాన్సలర్ నుంచి సమాజం ఎంతో ఆశిస్తుంది. అలాంటి సమర్థులు కావాలని సమాజం డిమాండ్ చేస్తుంది. ఆ పదవిలో ఉన్నవారిపై సానుభూతి తక్కువగా ఉంటుంది. అలాంటి బాధ్యత గల పోస్టును భర్తీ చేసేటప్పుడు సమర్థుల కోసం అన్వేషించాలి కానీ పోస్టులను నింపటం ఎంతమాత్రం కాదు. అలాంటి వి.సి.పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో ఆరు విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్నాయంటే మన ఉన్నత విద్య ఏ రకంగా ఉందో అంచనా వేయవచ్చును. దీన్ని గాడిలో పెట్టవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం ముందున్నది. వైస్ చాన్సలర్ పోస్టులకు చూడవలసింది యోగ్యతలు కాదు. ఆ వ్యక్తి దార్శనికుడై ఉండాలి. విభిన్న వైరుధ్యాలున్న విద్యావ్యవస్థ నుంచి విభిన్న వ్యక్తులు వస్తారు. వివిధ శాఖలు, వివిధ రకాల విద్యార్థుల చేత పని చేయించాలి. టీచింగ్, లెర్నింగ్‌లపై దృష్టి పెట్టాలి. సత్యాన్వేషణే లక్ష్యంగా ముందుకు సాగాలి. జ్ఞాన నిల్వ చేయటం, జ్ఞాన ప్రసారం, జ్ఞాన సృష్టి జరగాలి. విశ్వవిద్యాలయం జ్ఞానకేంద్రం మాత్రమే కాకుండా సమాజ మార్పుకు కారణభూతం అవుతుంది. తొలిసారిగా విశ్వవిద్యాలయం మెట్లెక్కిన విద్యార్థులకు దశా దిశా నిర్దేశించాలి. నేడు ఉన్నత విద్య మాస్ ఎడ్యుకేషన్ అయింది. సామాజిక న్యాయం, సమత్వం తేవటం దీని లక్ష్యం కావాలి. సత్యాన్వేషణ అనేది వెతికితే దొరికే వజ్రం కాదు. అది జ్ఞానమై నిరంతరం క్రమంగా ఎదగవలసి ఉంటుంది. ఈ జ్ఞాన ఫలితాలను చూడాలి. భవిష్యత్తును అంచనా వేసే దార్శనికుడిగా వి.సి. ఉండాలి. వి.సి. అంటే ఒక సామాజిక కార్యకర్త. జ్ఞాన సమాజాన్ని సృష్టించి దాని ద్వారా విశాల సమాజం నిర్మించేందుకు దోహదపడాలి. తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై వి.సిల నియామకం చేపట్టాలి. అన్ని విశ్వ విద్యాలయాలకు సమర్థులను ఎంపిక చేయాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంకంటే భిన్నంగా వ్యవహరించాలి. సమర్థులైన వి.సి.ల కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయాలి. - (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ) చుక్కా రామయ్య -
వాడిపోతున్న విద్యావనాలు
నవ తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ఉత్పత్తి కేంద్రాలుగా విలసిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు బోధకులు లేక వెలవెల బోతున్నాయి.. మౌలిక సదుపాయాలు లేక కునారిల్లిపోతున్నాయి.. రాష్ట్రంలో ఏడు వర్సిటీలు వైస్చాన్స్లర్లు లేకుండానే కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికీ చాలా వర్సిటీల్లో ఉండాల్సిన బోధన సిబ్బందిలో మూడో వంతు కూడా లేరు. దీంతో కోర్సుల నిర్వహణ కష్టతరమవుతోంది. ⇒ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా యూనివర్సిటీల పాలన ⇒ వీసీల నియామకం లేదు.. ప్రొఫెసర్ల భర్తీ లేదు ⇒ 8 మందితో నడుస్తోన్న పాలమూరు వర్సిటీ ⇒ మిగతా వర్సిటీల్లోనూ50 శాతం ఖాళీలే సాక్షి,హైదరాబాద్: గతమెంతో ఘన కీర్తి కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుతో సహా దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులను తీర్చిదిద్దిన ఓయూ క్రమం గా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. 100 ఏళ్ల సంబరానికి దగ్గరవుతున్న ఈ వర్సిటీలో ఏడు నెలల నుంచి వీసీ కూడా లేడు. ఓయూలో 1,230 బోధనా సిబ్బంది పోస్టులు ఉంటే వాటి లో 630 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదవీ విరమణ చేస్తున్నవారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం లేదు. ఫలితంగా నాలుగేళ్లుగా వర్సిటీ పరిస్థితి దిగజారింది. ఇటీవల దాకా దేశంలో ఐఐటీల తరువాత స్థానాన్ని ఆక్రమించిన ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పుడు తన స్థానాన్ని మరింతగా దిగజార్చుకుంటోంది. ఫ్యాకల్టీ లేని కారణంగా ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పెంచేందుకు ఏఐసీటీఈ అంగీకరించడం లేదు. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) డిపార్టుమెంట్ లేదు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు విస్తృతంగా ఉన్న తరుణంలో ముఖ్యమైన ఐటీ కోర్సును ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. సరైన బోధనా సిబ్బంది లేక ఓయూలో కొన్ని కోర్సులు ‘నాక్’ గుర్తింపు కోల్పోయినట్లు తెలిసింది. నాక్ గుర్తింపు కోల్పోయిన కోర్సుల వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్న అధికారులు ప్రస్తుతానికి ఆ సమస్యేమీ లేదని చెబుతున్నారు. ఏడు వర్సిటీల్లోనూ అదే పరిస్థితి తెలంగాణలోని 7 రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలకు 2,232 మంజూరైన పోస్టులు ఉంటే ప్రస్తుతం వాటిల్లో 1,122 మంది మాత్రమే బోధన సిబ్బంది ఉన్నారు. 1,110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త పోస్టులను మంజూరు చేయలేదు. పాలమూరు విశ్వ విద్యాలయం ప్రారంభంలో ఇచ్చిన 28 పోస్టులను కూడా పూర్తిగా భర్తీ చేయలేదు. శాతవాహన విశ్వవిద్యాలయంలో 44 బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరు చేసి 21 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. ఓయూలో 1,230 వరకు మంజూరైన పోస్టులుంటే 600 మంది పనిచేస్తున్నారు. మహాత్మాగాంధీ వర్సిటీలో 14 పోస్టులు ఉంటే నలుగురే పనిచేస్తున్నారు. మిగతా వర్సిటీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇన్‌చార్జీలే దిక్కు: తెలుగు విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్‌లోని పాలమూరు, కరీంనగర్‌లోని శాతవాహన మినహా మిగతా అన్ని వర్సిటీలు ఇన్చార్జీల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఓయూ, కేయూ, నిజామాబాద్‌లోని తెలంగాణ, నల్లగొండలోని మహాత్మాగాంధీ, హైదరాబాద్‌లోని జేఎన్టీయూ(హెచ్), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలకు ఐఏఎస్ అధికారులు, వేరే యూనివర్సిటీల వీసీలే ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. పదిమందీ లేకుండా ‘పాలమూరు’ పాలన రాష్ట్రంలో అత్యంత వెనకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయం కూడా విద్యా బోధనలో పూర్తిగా వెనక బడింది. ఇక్కడ బోధనా సిబ్బంది ఆరుగురు, బోధనేతర సిబ్బంది ఇద్దరు. మొత్తం 8 మందితో వర్సిటీ పాలన సాగుతోంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.డిగ్రీ కళాశాలలో ఉండే సిబ్బంది సంఖ్యలో పదో వంతు కూడా ఇక్కడ లేకపోవడం గమనార్హం. తెలంగాణలో రెండో అతిపెద్ద కాకతీయ విశ్వ విద్యాలయం పరిస్థితిలోనూ మార్పు లేదు. గడచిన ఏడాది కాలంగా వైస్ చాన్స్‌లర్ లేకుండానే కేయూలో పాలన నడుస్తోంది. నియామకాలు చేపట్టాలి ప్రపంచ బ్యాంకు ఒత్తిడి, ప్రైవేటీకరణలో భాగంగా ఈ పరిస్థితి దాపురించింది. చంద్రబాబు హయాం నుంచే వర్సిటీలు క్రమంగా తమ ప్రాభవాన్ని కోల్పోతూ వస్తున్నాయి. వర్సిటీల్లో లైబ్రరీలు లేవు, ల్యాబరేటరీలు లేవు. బ్లాక్ గ్రాంటు లేదు. ఇప్పటికైనా దూరదృష్టి కలిగిన వీసీలు, ఫ్యాకల్టీని నియమించాలి. - ప్రొ.హరగోపాల్, విద్యావేత్త వీసీలు లేకపోతే ఎలా? యూనివర్సిటీల్లో టీచింగ్, లెర్నింగ్, రీసెర్చ్లకు గెడైన్స్ ఇచ్చేది వీసీలే. వాళ్లే లేకుంటే ఇంకా వర్సిటీలు ఎలా మనుగడ సాగిస్తాయి..ప్రొఫెసర్ పరిశోధనను విస్తరించేందుకు మార్గదర్శనం చేస్తారు. కానీ, అలాంటి వారే లేకపోతే బోధించేదెవరు?.ఇప్పటికైనా పోస్టులను భర్తీ చేయాలి. - చుక్కా రామయ్య, విద్యావేత్త -
ఎంసెట్ కొనసాగించాలా?
ఇంటర్ విద్యను ప్రక్షాళన చేయకుండా ఇంటర్ మార్కులను ఆధారం చేసుకుని ఇంజనీరింగ్ చదువును కొనసాగిస్తే మరింతగా మాల్ ప్రాక్టీస్‌లు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ఇంటర్ విద్యను పటిష్టం చేసుకున్న తర్వాత ఇంజనీరింగ్ విద్య ప్రవేశ పరీక్షపై నిర్ణయం తీసుకుంటే బావుంటుంది. రెండు రాష్ట్రాలు ఏర్పడి, ప్రజలు తమ స్థితిగతులు మారుతాయని ఆశిస్తున్న తరు ణంలో ప్రతి చిన్న విషయానికి వివాదాలలోకి వెళ్లటం రాజ కీయ నాయకులకు సరైన పద్ధతి కాదు. ఇద్దరు చంద్రు లైన నాయకులు రెండు ప్రాం తాల ప్రజల హృదయాలపై అన్నివిధాలుగా ముద్ర వేసినవారు. వీరిద్దరూ రెండు ప్రాంతాల ప్రగతిని కోరు కునేవారనే భావన కూడా ఉంది. పాలనా యంత్రాం గంలో చిన్న చిన్న సమస్యలు రావటం సహజం. వాటిని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పత్రికలకు ఎక్కకుండా పరిష్కరించుకుంటే తెలుగు ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా హర్షిస్తారు. దేశాలకు దేశాలు విడిపోయిన ఘటన లున్నాయి. ఆ దేశాల మధ్య తిరిగి వచ్చే సమస్యలను రచ్చకెక్కకుండా పరిష్కరించుకున్న ఉదంతాలు లేవా? తెలుగు ప్రజలు ఉద్రిక్త వాతావరణాలను కోరుకోవటం లేదు. ఉభయులు కూడా కలిసి ఇరు రాష్ట్రాలను ప్రగతిపథం పైకి నడిపిస్తే వారికి స్టేట్స్‌మెన్ లన్న పేరు వస్తుంది. విడిపోకముందు ధీరులుగా పోరాడటం, విడిపోయిన తర్వాత అంకిత స్వభావంతో ప్రజలను అభివృద్ధి పథంపైన నడిపించడం రాజనీ తిజ్ఞుల లక్షణం. ప్రతి చిన్న విషయానికి పత్రికలకెక్కటం శ్రేయస్కరం కాదు. చిన్న పిల్లలకు సంబంధించిన ఎంసెట్ పరీక్షపై కూడా ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం ఉన్నదా? రాష్ట్రాలు విడిపోయాయి. తమ ప్రాంత నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంసెట్‌ను ఎలా నిర్వహించుకోవాల్నో ఈ రెండు ప్రభుత్వాలు నిర్ణయిం చుకోలేవా? ఈ చిన్న విషయానికి కూడా కేంద్రంతో, గవర్నర్‌తో అక్షింతలు వేయించుకోవాలా? ముఖ్యంగా 21వ శతాబ్దాన్ని కేవలం యువకులకు ఉపాధి కలిగించేదే కాక సంపదను సృష్టించేదిగా కూడా పరిగణిస్తున్నారు.యువకుల్లో దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను, మారుతున్న విజ్ఞానానికి అనుగుణంగా ఆ నైపుణ్యాలను నిత్యం పదును పెట్టుకోవలసిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రవేశానికి ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటు న్నాయి. ఎంసెట్ పరీక్ష ఇంటర్మీడియెట్ పూర్తి అయిన విద్యార్థులకే నిర్వహించాలా? ఈ రెండేళ్ల విద్యార్థులు 12వ తరగతికి రాకముందే వారికి ఎంసెట్-శాట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు కదా! అదే మాదిరిగా ఎంసెట్ పరీక్షను ఇంటర్మీడియెట్ పరీక్షతో ముడిపెట్టవలసిన పని లేదు. ఇంటర్ పరీక్ష లక్ష్యం వేరు. ఇంటర్మీడియెట్ పరీక్షలో పాఠ్యాంశాలను పరీక్షిస్తారు. ఎంసెట్ పరీక్షలో ఇంజనీరింగ్‌కు కావల్సిన నైపుణ్యాలను పరీక్షించాలి. అంటే విద్యార్థులకు తార్కికమైన నైపుణ్యం ఏ మేరకు వచ్చింది? లేదా గణితశాస్త్రపరమైన విశ్లేషణ వచ్చిందా? లేదా సామాజిక దృక్పథం వచ్చిందా? ఇలాంటి ఎన్నో నైపుణ్యాలను విద్యార్థుల 11ఏళ్ల నేపథ్యాన్ని గమనంలోకి తీసుకుని ఎంసెట్ పరీక్షలను నిర్వహించుకోలేమా? ఎంసెట్ పరీక్ష అంటే సీట్లు నింపుకోవడానికి కాదు. విద్యార్థికి ఇంజనీరింగ్ విద్యపై ఏ మేరకు ఆసక్తి ఉన్నదో, కనీస నైపుణ్యం ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు ఈ ఎంసెట్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో 20 ఇంజనీరింగ్ కాలే జీలు మాత్రమే యోగ్యత కలవని ఉన్నత విద్యామండలి చెప్పడం కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు నిరుద్యోగులుగా ముందుకు వస్తున్నారు. క్లర్క్ ఉద్యోగం నుంచి కండక్టర్ ఉద్యోగం వరకు ఎంతో మంది ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు దరఖాస్తులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంసెట్ పరీక్షను రద్దు చేస్తే ఇంటర్మీడియెట్ వ్యవస్థపైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ప్రతి తల్లీతండ్రీ ఈ 20 కాలేజీల అడ్మిషన్ల కోసమే తమ పిల్లలకు మంచి ర్యాంకు కావాలని కోరుకుంటారు. ఇంటర్ పరీక్షల్లోనూ మాల్ ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటర్ పరీక్ష కూడా కొన్ని వందల కేంద్రాల్లో మారు మూల ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షా విధానం గత కొన్ని దశాబ్దాల నుంచి కార్పొరేట్ రంగం చేతుల్లోకి పోవటం వలన ఎన్నో అవకతవకలకు దారితీసింది. ఇంటర్ విద్యను ప్రక్షాళన చేయకుండా ఇంటర్ మార్కులను ఆధారం చేసుకుని ఇంజనీరింగ్ చదువు కొనసాగిస్తే మరింత మాల్ ప్రాక్టీస్‌లు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. మద్రాసులో ఇంటర్ విద్యను పటిష్టం చేసుకున్న తర్వాత ఎంట్రన్స్ పరీక్షను రద్దు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మొదట విద్యను పటిష్టం చేసుకున్న తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఏమీ కాదు. ఈ మధ్యకాలంలో ఎంసెట్ పరీక్షను కొనసాగిస్తేనే అటు ఇంటర్ విద్యను ఇటు ఇంజనీరింగ్ విద్యను బాగు చేసు కునే అవకాశం దొరుకుతుంది. అన్ని రంగాల మాదిరి గానే విద్యారంగాన్ని కూడా గత ప్రభుత్వాలు అతలా కుతలం చేశాయి. ఫీజురీయింబర్స్‌మెంట్ పేదలకు ఉపయోగపడుతుందనుకుంటే అది కార్పొరేట్ రంగాల కు సంజీవనిగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభు త్వానికి ఇంటర్ విద్యను, ఇంజనీరింగ్ విద్యను బాగుపరుచుకోవాలంటే ఎంసెట్‌ను కొంతకాలం సమర్థ వంతంగా కొనసాగించవలసే ఉంటుంది. ఇంటర్ విద్యను పటిష్టం చేసుకున్న తర్వాత ఇంజనీరింగ్ విద్య ప్రవేశ పరీక్షపైన నిర్ణయం తీసుకుంటే బావుంటుంది. సందర్భం: చుక్కా రామయ్య, (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసన మండలి మాజీ సభ్యులు) -
కాడి వదిలేసిన చోటినుంచే దున్నాలి
సందర్భం తెలంగాణలో కులం కొంద రికి యావజ్జీవశిక్ష. మరికొం దరికి కులం సాధనం. వృత్తి విభజన మాత్రమే కులం కాదు. పునాదులను పెకిలిస్తే తప్ప కులం అసలు మూలాలు అర్థం కావు. కులం మర కలు మలపడానికి కొన్ని శతాబ్దాలు పడుతుంది. దానికి అకుంఠిత దీక్ష అవసరం. తెలంగాణ ఊరి నిర్మాణంలోనే కులం ఉంది. ఊరి మధ్యలో పాలనా యంత్రాంగ కేంద్రమైన గడీ, దాని తర్వాత పాలనా యంత్రాంగానికి దగ్గరగా ఉండే వర్గం, దాని చుట్టూ కుల వృత్తి చేసుకునే వర్గం ఉంటాయి. వారి ఇళ్లు దాటిన తర్వాత రైతులుం టారు. వీటిలో ఏ వర్గానికీ చెందని వర్గం కూడా ఉంది. అదే దళిత వర్గం. ఊరికి ఒక మూల మాలలు, మరో మూల మాదిగలు ఉంటారు. వీటిలో ఒక కులాన్ని వ్యవ సాయానికి, మరో కులాన్ని వెట్టికి ఉపయోగించుకుం టారు. ఆంధ్ర మహాసభతో కలసి పనిచేసేటప్పుడు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలంటే, వెనుకబడిన వర్గాల భాగస్వామ్యంతోనే అది సాధ్యం అని భావించాం. ఉద్యమ కార్యకర్తను అయినప్పటికీ కులానికి బ్రాహ్మణుడిని కావడంతో దళితులు నన్ను తమ ఇళ్లలోకి అడుగుపెట్టనిచ్చేవారు కాదు. వారిళ్లలోకి బలవంతంగా చొచ్చుకుపోవల్సి వచ్చినప్పుడు వారిలోని బానిసత్వం, దుర్భర దారిద్య్రం మరింతగా అర్థమైంది. చివరికి వారి అసలు పేరును కూడా కుల దురహంకారం మింగివేసి మల్లయ్యను మల్లిగాడు, మల్లమ్మను మల్లి అని పిలుస్తూ పుట్టుకతోనే బానిసలుగా భావించే వారు. ఆ బానిస త్వాన్ని అడుగడుగునా గుర్తుచేయడానికి భూస్వాములు మల్లిగా అని పిలిచిన ప్రతిసారీ ‘బాంచెన్ దొర, నీ కాల్మొ క్కుతా’ అని పలకడం అలవాటు చేశారు. ఆ అణచివేతే, ఈ వెలివేతే తిరుగుబాటుకు కారణమైంది. అదే సాయు ధపోరుకు దారితీసింది. ఇది 1940-47 నాటి సంగతి. ఆ కాలంలోనే కొలనుపాక లాంటి చోట్ల జాగీర్దారు ముస్లిం. దీంతో ఆ ప్రాంతంలో అస్పృశ్యత నుంచి విముక్తి కోసం దళితులు జాగీర్దారు మతంలోకి చేరిపోయారు. దీన్ని అడ్డుకోవడానికి భూస్వాములు ఆర్యసమాజ్ వారిని తీసుకొచ్చారు. వారు దళితుల ఇళ్లలోకి వచ్చి హిందూ మతం నుంచి ఎందుకు మారుతున్నారని అడిగితే దళి తులు ఒకే సమాధానమిచ్చారు. మతం మార్చుకుంటేనే మా వెట్టిచాకిరీ పోయింది. హిందూమతంలో ఉంటే వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగిస్తామని, వెట్టి చేయిం చమని చెప్పండి. అప్పుడు మేం హిందూ మతం వీడం అని చెప్పారు. ఇది రెండో దశ. స్వాతంత్య్రానంతరం అంటే 1947 తర్వాత పైకి అస్పృశ్యతా వ్యతిరేక ఉద్యమాలు వచ్చినా వారి పట్ల జాలి పెరిగింది తప్పితే వారి జీవితాల్లో మార్పులేదు. అస్పృశ్యతా మూలాలు కదల్లేదు. దళితులకు ఇళ్లు కట్టిం చారు కానీ అవి ఊరి చివరే ఉండేవి. ఆస్పృశ్యత, అణచి వేతకు వ్యతిరేకంగా సాగిన కమ్యూనిస్టుల ఉద్యమం భూపోరాటానికి దారితీసింది. దీని ప్రభావంతోటే నక్స ల్బరీ ఉద్యమం వచ్చింది. 1980ల నాటికి దళిత ఉద్య మం స్వయంగా అస్తిత్వ ఉద్యమంగా రూపొందింది. కమ్యూనిస్టు ఉద్యమంతో కులం అంతరిస్తుందని భావిం చినా అదీ జరగలేదు. గుడిసెల స్థానంలో బిల్డింగులు కట్టించినా వివక్ష పోలేదు. బాంచెన్ దొర అనే భాష పోయింది కానీ బానిసత్వం కొనసాగుతూనే ఉంది. దళి తులను ఓటు బ్యాంకు స్థాయిలోనే ఉంచారు. వారిని అలాగే ఉపయోగించుకున్నారు. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే దళితులు అందరితో సమానం. మిగిలిన సందర్భాల్లో దళితులు అస్పృశ్యులే. భూ సంస్కరణలు అమలు జరగకుండా, భూమిపైన హక్కు రాకుండా దళి తుల జీవితాల్లో మార్పు రాదు. వృత్తి మారలేదు. వెట్టిచా కిరీ మారలేదు. సమాజంలో భాగం కాలేకపోయారు. అందుకే ఇప్పుడు కావలసింది మతమార్పిడీ నిరోధకచట్టం కాదు. ఆనాడు వెట్టిచాకిరీ పోవడానికి ముస్లింలుగా మారిన వారే తర్వాత వైద్య సాయం కోసం క్రిస్టియన్లుగా మారారు. అందుకే కులంతో సంబంధం లేని వృత్తి నైపుణ్యం కావాలి. అప్పుడే అన్ని కులాలు సమాజంలో భాగం అవుతాయి. లేదంటే కొన్ని కులాలు శాశ్వతంగా అస్పృశ్యులుగానే ఉంటాయి. అందుకే వామ పక్షాలు ఎక్కడ కాడిని వదిలేశాయో అక్కడినుంచి తిరిగి దున్నడం ప్రారంభించాలి. ఆర్థికసమస్యతోపాటు, సా మాజిక సమస్యని సైతం తీవ్రంగా పరిగణించాలి. వారి తోపాటు ప్రజాస్వామికశక్తులు, దళిత సంఘాలు, సం స్థలు సమష్టిగా ఆశయసాధనలో భాగం కావాలి. (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు) -
నిజాం పాలనపై పొగడ్తలు దారుణం
సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య డిమాండ్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దుర్మార్గమైన పాలనతో ప్రజలను వేధించిన నిజాంలను సీఎం కేసీఆర్ పొగడడం ఏమాత్రం సరికాదని, ఈ విషయంలో ఆయన పునరాలోచన చేసి, పొగడ్తలను ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య డిమాండ్ చేశారు. ప్రజలకు ఈ విషయంలో క్షమాపణ చెప్పాలన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం(టీపీఎస్కే) ఆధ్వర్యంలో‘నిజాం పాలన- ఒక పరిశీలన’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ నిజాం పాలన దొరలకు తోడ్పాటునందించిందని, ఎంతో మంది స్త్రీలపై అత్యాచారాలు జరిగాయన్నారు. తెలంగాణ సాయుధపోరాటంలో ఎంతో మంది రైతులను పొట్టనపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గమైన పాలనను కొనసాగించిన నిజాంను సీఎం పొగడ్తలతో ముంచెత్తడం అవమానకరమన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ మాట్లాడుతూ నిజాం పాలనలో కొన్ని భవనాలు, స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించినంత మాత్రాన, ఆయన చేసిన పాపం ఊరికే పోదని విమర్శించారు. నిజాం మంచివాడ ని సర్టిఫికెట్ ఇవ్వటం దుర్మార్గమన్నారు. సీఎం కేసీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ అత్యంత దుర్మార్గంగా ప్రజలను హింసించిన నిజాంను పొగడటం సిగ్గు చేటని విమర్శించారు. టీపీఎస్కే కన్వీనర్ జి.రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్, ఎస్వీకే ట్రస్టీ ఎస్.వినయ్‌కుమార్, ప్రొఫెసర్ భంగ్య భూక్యా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగయ్య, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, రఘుపాల్, నరహరి పాల్గొన్నారు. -
పోటీ పరీక్షలపై నిపుణుల కమిటీ
ప్రొఫెసర్ హరగోపాల్ చైర్మన్‌గా 27 మందితో ఏర్పాటు ప్రొఫెసర్ కోదండరాం, చుక్కా రామయ్య తదితరులకు చోటు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షల విధి విధానాల్లో మార్పులు, చేర్పులపై అధ్యయనానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) కమిటీని ఏర్పాటు చేసింది. 27 మంది నిపుణులతో కూడిన ఈ కమిటీకే సిలబస్ మార్పుల అంశాన్నీ అప్పగించింది. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీకి సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. పోటీ పరీక్షల విధి విధానాలతో పాటు సిలబస్‌లో మార్పులను కూడా ఈ కమిటీ సిఫారసు చేస్తుందని.. అయితే ముందుగా పరీక్ష విధివిధానాలకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుందని చక్రపాణి తెలిపారు. సిఫారసులతో కూడిన అధ్యయన నివేదికను మూడు వారాల్లో ఇవ్వాలని కమిటీకి స్పష్టం చేశామని చెప్పారు. నివేదిక వచ్చిన వెంటనే కమిషన్ దానిని పరిశీలించి ఈ నెలాఖరులో ప్రభుత్వ ఆమోదానికి పంపుతుందని వెల్లడించారు. కమిటీలో సభ్యులు వీరే: కమిటీలో విద్యావేత్త చుక్కా రామయ్య, ఓయూ ప్రొఫెసర్లు ఎం.కోదండరాం, కె.నాగేశ్వర్, రమా మేల్కొటే, జీబీ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఎస్.మల్లేశ్, తెలుగు వర్సిటీ వీసీ శివారెడ్డి, న్యాక్ మాజీ డెరైక్టర్ వీఎస్ ప్రసాద్, కాకతీయ వర్సిటీ మాజీ వీసీ లింగమూర్తి, రిటైర్డ్ ప్రొఫెసర్లు అడపా సత్యనారాయణ, బీనా, భూపతిరావు, సెస్ నుంచి డాక్టర్ ఇ.రేవతి, ఐసీఎస్ఎస్ఆర్ దక్షిణ భారత రీజియన్ చైర్మన్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి, ఏపీ సెట్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సి.గణేష్, మౌలానా ఆజాద్ ఉర్దూ వర్సిటీ ప్రొఫెసర్ వహీదుల్లా సిద్ధిఖీ, డాక్టర్ కనకదుర్గ, అంబ్కేదర్ వర్సిటీ ప్రొఫెసర్ సి.వెంకటయ్య, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన నిశాంత్ డోంగరి, రిటైర్డ్ లెక్చరర్ నందిని సిధారెడ్డి, సెంట్రల్ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ రాజశేఖర్, కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్ భద్రూనాయక్, హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ జె.మనోహర్‌రావు, కాకతీయ వర్సిటీ నుంచి డాక్టర్ టి.శ్రీనివాస్, గజ్వేల్ జీఎంఆర్ పాలిటెకి ్నక్ విభాగాధిపతి డాక్టర్ భైరి ప్రభాకర్, నల్సార్ నుంచి డాక్టర్ ఎన్.వసంత్ తదితరులను కమిటీ సభ్యులుగా నియమించారు. -
ప్రభుత్వ విద్య ప్రతిభకు నెలవు
వసతి గృహాలు పెట్టగానే ప్రమాణాలు రావు. మేనేజ్మెంట్కు లాభాపేక్ష కన్నా సామాజిక దృక్పథం కావాలి. కానీ దానికి భిన్నంగా కార్పొరేట్ శక్తులే పాలనలోకి ప్రవేశించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరుగార్చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్ విద్యాలయాన్ని పెట్టేందుకు ముందుకు రావడం గొప్ప విషయం. ఇల్లు అలుకగానే పండుగ కాదు, ఇంటిని తీర్చిదిద్దుకోవ టం అనుకున్నంత సులభమై నది కాదు. 1952లో విద్యా శాఖ సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమైన బాధ్య తను, కర్తవ్యాన్ని నిర్వహిం చేది. నేటి విద్యారంగం స్థితిని చూస్తే నాటి కంటే నేడు మరింత గురుతరమైన బాధ్యత విద్యాశాఖపై ఉంది. కాలమేదైనా విద్య అంటే సమాజ పరివర్తనే దాని కర్తవ్యం. నేటి ఆర్థిక రంగానికి విద్యారంగం బలమైన అంగంగా మారింది. సామాన్యుని భాగస్వామ్యంతో అది నేడు అభివృద్ధికి దోహదపడవలసి ఉంది. కొత్తతరం వచ్చింది కానీ ఆ తరం బడి మాత్రం పోలేదు. విద్య వల్లనే తన భవిష్యత్‌ను, తన పిల్లల భవిష్యత్‌ను కూడా నిర్మించాలనే కాంక్షగల సమాజం వచ్చింది. ఆనాడు యజమాని చెప్పటం ఉద్యోగి చేయడం జరిగేది. దాన్నే కమాండింగ్ వ్యవస్థ అంటారు. కానీ ఈనాడు ఎవరూ ఏమీ చెప్పరు. ప్రతి విషయాన్ని ఉద్యోగే ఆలోచించుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. నేడు ప్రతి విద్యార్థి ప్రతిరోజూ ఇంటర్వ్యూకు సిద్ధం కావలసివస్తోంది. ఎంతో లోతైన జ్ఞానం ఉం టే తప్ప నేటి విద్యార్థులు నిలదొక్కుకోలేరు. కాబట్టే విద్యారంగం బాధ్యత మరింత పెరిగింది. ఈ పరి స్థితుల్లో ఛిన్నాభిన్నమైన వ్యవస్థను గాడిలో పెట్ట టం ఒకటైతే, మారుతున్న ఆర్థికవ్యవస్థలో మనగ లిగిన మానవ సంపదను తయారు చేయడం కీల కమైనది. అత్యున్నత నైపుణ్యం గల మేధావి వర్గం అందుకు అవసరం. ప్రతిభగల మేధావి వర్గం గాలి లోంచి ఊడిపడదు. ప్రతిభ రావాలంటే విద్యారం గంలో సమత్వం ఉండాలి. సమత్వం నుంచి వచ్చిన ప్రతిభ కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. ఈనాడు విద్యాశాఖ ఎక్సెలెన్సీ కన్నా ఈక్విటీపైన దృష్టిని కేంద్రీకరించాలి. సమత్వంలో విద్యార్థి నేపథ్యమే ప్రధానమైనది. వారి తల్లిదండ్రులు చదు వుకున్నవారు కాదు. ఈ పాత్రను కూడా ఉపా ధ్యాయవర్గమే నిర్వహించవలసి ఉంటుంది. బోధనకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, తర గతి వెలుపల మోటివేషన్‌కు కూడా అంతే ప్రాధా న్యత ఉంటుంది. దీన్ని గమనించే పీవీ నర్సింహా రావు అప్పట్లోనే రెసిడెన్షియల్ విద్యావ్యవస్థను ప్రవేశపెట్టారు. విద్యార్థి చదువుకున్న స్కూలు పేరు చెప్పగానే ఆ విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసే వారు. ఆటల్లో, జనరల్ నాలెడ్జిలో కూడా ఆ పిల్లలు ఆరితేరినవారుగా నిలిచారు. ఆ పిల్లల బ్యాక్ గ్రౌండ్ చూస్తే పట్టణ ప్రాంతపు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఉపాధ్యాయులు కూ డా ఎంతో అంకిత స్వభావంతో హేమాహేమీలుగా పనిచేశారు. సమర్థవంతమైన పాఠశాలలను నిర్మిం చేందుకు ఆనాటి పాలకవర్గాలు ఎంత శ్రద్ధ వహిం చాయో గమనించాలి. అంకిత స్వభావమున్న ఉపాధ్యాయులను ఎన్నుకోవటం ఒక పనైతే, వారిని నిలబెట్టుకోవటా నికి కావల్సిన పరిస్థితులను కలిగించడం రెండో భాగం. సమత్వం తేవటం కోసం రెసిడెన్షియల్ హైస్కూల్స్ ఏర్పాటు చేశారు. అది కాకుండా ఈ పిల్లల ఉన్నత విద్య కోసమై నాగార్జునసాగర్‌లో ఒక రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ, ఒక రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ పెట్టారు. రెండు మూడు సంవత్సరాల లోపలనే ఎస్ఎస్సీ ర్యాంకులతో పాటు, ఇంటర్మీడి యట్ ర్యాంకులన్నీ ప్రభుత్వ స్కూళ్లకే వచ్చాయి. పేద కుటుంబాల పిల్లల విద్యాప్రమాణాలు సం పన్న కుటుంబాల పిల్లల కన్న ఎక్కువగా వచ్చాయి. ప్రజలకు ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూళ్ల నిర్వాహకులు ఈ పేద పిల్లలకు ర్యాంకులు ఎలా వచ్చాయని ఆశ్చ ర్యపోయారు. ప్రైవేట్ యాజమాన్యాలు కూడా అప్పటి నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ మొదలు పెట్టాయి. కానీ ఆ ప్రభుత్వ స్కూళ్లు సాధించిన ఫలితాలు మాత్రం రాలేదు. రెసిడెన్షియల్ వ్యవస్థ వల్ల, విద్యార్థులకు భోజనం వల్ల వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కానీ, ఉపాధ్యాయుని అంకిత స్వభావం, ఉపాధ్యాయుడు-విద్యార్థి మ ధ్య సంబంధాలే విద్యాప్రమాణాలను నిర్ణయి స్తాయి. ప్రభుత్వ స్కూళ్లలో మెరికల్లాంటి విద్యార్థు లున్నారని అనటం మాత్రమే కాదు. దాని వెనుక ఉపాధ్యాయుల దీక్ష ఎంత గొప్పదో గుర్తించాలి. వసతి గృహాలు పెట్టగానే ప్రమాణాలు రావు. మేనే జ్మెంట్కు సామాజిక దృక్పథం కావాలి. కానీ దానికి భిన్నంగా కార్పొరేట్ శక్తులే ప్రభుత్వ పాల నలోకి ప్రవేశించి ప్రభుత్వ విద్యావ్యవస్థను నీరు గార్చే దశకు వచ్చేశాయి. తెలంగాణ ప్రభుత్వం పాత విద్యా వ్యవస్థలోని సుగుణాలను కొనసాగి స్తామంటోంది. ప్రభుత్వ విద్యారంగాన్ని గెలిపిస్తా మని, పేదవర్గాల పిల్లలను అత్యున్నత ప్రమాణా లుగల మానవ వనరులుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు అంతా అభి నందిస్తున్నారు. ప్రతి మండలానికి ఒక రెసిడెన్షి యల్ విద్యాలయాన్ని పెట్టేందుకు ముందుకు రావ డం గొప్ప విషయం. దాంతోపాటుగా బోధనలో బంగారు బాటలువేయాలి. ప్రపంచస్థాయిలో తెలంగాణ విద్యార్థులు ప్రతిభతో రాణించాలి. అం దుకు ప్రభుత్వం నిరంతర కృషి చేయవలసి ఉంది. (చుక్కా రామయ్య , వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు) -
హైదరాబాద్‌లో ఎంసీపీఐ జాతీయ మహాసభలు
సాక్షి, హైదరాబాద్: భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ(ఐక్య)-ఎంసీపీఐ యు-3వ అఖిల భారత జాతీయ మహాసభలను 2015 మార్చి 24 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. వీటి కోసం మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అధ్యక్షతన ఆ హ్వాన సంఘం ఏర్పాటైం ది. వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కేఆర్ చౌదరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ గౌస్, తాండ్ర కుమార్, వనం సుధాకర్ తదితరులు ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శులుగా ఉన్నారు. -
పైథాగరస్ నంబర్‌సను కనుక్కొందామా?
చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త చాలా మంది పైథాగరస్ సిద్ధాంతం అంటే.. (భూమి)2 + (ఎత్తు)2 = (కర్ణం)2 అని, దీన్ని త్రిభుజంలో ఏవైనా రెండు భూజాలు ఇచ్చి మిగిలిన భుజం విలువను కనుక్కోవడానికి మాత్రమే ఉపయోగిస్తారని భావిస్తారు. కానీ,పైథాగరస్ సూత్రం (భూమి)2 + (ఎత్తు)2 = (భుజం)2 ఉపయోగించి జామెట్రీ, నంబర్ థియరీ వంటి సమస్యలను కూడా సాధించవచ్చు. ఈ క్రమంలో పైథాగరస్ నంబర్‌స అయ్యే వాటి స్వరూపం కింది విధంగా ఉంటుంది. 's', 't' అనేవి పైథాగరస్ నంబర్‌స అయితే వాటి స్వరూపం (2st)2 + (s2–t2) s2+t2)2 అవుతుంది. అంటే ఉదాహరణకు s = 1, t = 2 అనుకుంటే అప్పుడు ఫైథాగరస్ నంబర్ సెట్ అనేది 2×1×2)2 + (12–22)2 = (12+22) 42+32 = 52 అంటే 3, 4, 5 అనేవి పైథాగరస్ నంబర్ సెట్ అను కుంటే వాటి స్వరూపాన్ని పైవిధంగా కనుక్కోవచ్చు. s t 2st s2–t2 s2+t2 2 1 4 3 5 3 2 12 5 13 4 1 8 15 7 4 3 24 7 25 5 2 20 21 29 ఈ విధంగా ఏ పైథాగరస్ సెట్ విలువల స్వరూపాన్నైనా కనుక్కోవచ్చు. మరో విషయం పైథాగరస్ సూత్రంలో ఏవైనా రెండు పైథాగరస్ నంబర్‌స తెలిస్తే మరో కొత్త పైథాగరస్ నంబర్ని కనుక్కోవచ్చు. ఉదాహరణకు x2+y2=z2, a2+b2=c2 అనే రెండు పైథాగరస్ సిరీస్‌ని తీసుకుందాం. అప్పుడు x, y, z; a, b, c పైథాగరస్ నంబర్‌స అవుతాయి. కాబట్టి మనకు రెండు పైథాగరస్ నంబర్‌స తెలిసినప్పుడు మరో కొత్త పైథాగరస్ నంబర్ని ఆల్జీబ్రా ఐడెంటిటీ (Alegbra Identity) ద్వారా (bx-ay)2+(ax+by)2=(a2+b2)(x2+y2) అవుతుంది. ఇప్పుడు 3, 4, 5; 12, 5, 13 అనే రెండు పైథాగరస్ నంబర్‌స సిరీస్‌ను తీసుకొని మరో కొత్త పైథాగరస్ నంబర్‌ను కనుక్కోవచ్చు. అంటే a= 3, b= 4, c= 5; x = 12, y= 5, z = 13 (4×12–3×5)2 + (3×12+4×5)2 = [(3)2+(4)2] [(12)2 + (5)2] (48–15)2 + (36+20)2 = (9+16) + (144+25) (33)2 + (56)2 = (25)+(169) (33)2 + (56)2 = (65)2 వస్తుంది. కాబట్టి (bx-ay)2+(ax+by)2=(cz)2 అని రాసుకోవచ్చు. అంటే 3, 4, 5; 12, 5, 13 అనే రెండు పైథాగరస్ నంబర్‌స నుంచి 33, 56, 65 అనే కొత్త పైథాగరస్ నంబర్ రూపొందించవచ్చు. విద్యార్థుల మేధస్సుకు ప్రశ్నలు 7, 6తో ఉత్పత్తి అయ్యే పైథాగరస్ నంబర్‌స కనుక్కోండి? 5, 15, 20 పైథాగరస్ నంబర్‌స అవుతాయా? గమనిక: పై సమస్యలకు మీరు కూడా సులువైన, సరళమైన పద్ధతిలో సాధించి వివరణ పంపవచ్చు. కొత్త పద్ధతిలో పరిష్కారాలను పంపిన విద్యార్థుల పేర్లను ప్రచురిస్తాం. ఈ-మెయిల్: sakshieducation@gmail.com -
ఈ విప్లవాత్మక మార్పులెవరికని అడిగితే!
విశ్లేషణ మన విద్యారంగం సగం చీకటి, సగం వెలుగుగా మారింది. విద్యారంగంలో గొప్ప మార్పులన్నీ ఉన్నత వర్గాలకే వెలుగునిచ్చాయి. సామాజిక జీవనం మారకుండా పిల్లల విద్యలో మార్పు తేవటం కష్టసాధ్యం. క్యూబా లాంటి దేశాలలో ఎంతో శ్రద్ధ తీసుకుని వెనుకబడిన పిల్లల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు. విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పు లు వచ్చాయి. కానీ ఆ మార్పులన్నీ ఏ వర్గాలకు ఉపయోగపడ్డాయన్నది కీ లకమైనది. విద్యలో మా ర్పులు, సాంకేతిక సమాచార రంగంలోని విప్లవా లు నేటికీ కొన్ని వర్గాలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. మన విద్యారంగం సగం చీకటి, సగం వెలుగుగా మారింది. విద్యారంగంలో వచ్చిన గొప్ప మార్పులన్నీ ఉన్నత వర్గాలకు మరింత వెలుగునిచ్చాయి. అదే దళిత, బహుజన, గిరిజన, మైనారిటీ, ఆదివాసీ వర్గాలలో రావాల్సినంత మార్పు జరగలేదు. 20 శాతం మంది పేద వర్గాల విద్యార్థులకు ఈ విద్యా వెలుగులు అందకపోతే దేశాభివృద్ధి కుంటుపడిపోతుంది. చరిత్రాత్మకమైన కొఠారి కమిషన్ మొట్టమొదటిసారి కామన్ స్కూల్ విధానాన్ని (సీఎస్ఎస్) ప్రవేశపెట్టింది. ఈ విధానంవల్ల సమాజంలోని ఆర్థిక అంతస్తులను తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కొఠారి కమిషన్ నిర్దేశించింది. జాతీయ సమగ్రతకు దోహదపడటం కోసం ఒక రాష్ట్రం విద్యార్థులను మరొక రాష్ట్ర విద్యార్థులతో కలపటం కూడా ఇందులో ముఖ్యమైనది. ప్రాథమిక దశలో విద్యార్థులందరికీ, ముఖ్యంగా బీసీ కులాల పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకు, ఆడపిల్లలకు ఉచితంగా చదువు చెప్పాలన్నది కొఠారి కమిషన్ సూచనలలో కీలకమైనది. కానీ దీన్ని ఏవిధంగా అమలు జరపాలో చెప్పకపోవటం వలన అది కాగితాలకే పరిమితమైంది. 1986లో మానవ వనరులశాఖ ఒక పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించేందుకు పూనుకున్నది. దీంతోనే 1986లో రాజీవ్‌గాంధీ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1992లో విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వం పునర్ విమర్శన చేసింది. వెనుకబడిన వర్గాల పిల్లల నుంచి డిమాం డ్ లేనందున జాతీయ విద్యావిధానం (ఎన్పీఈ) అంతగా అమలుజరగలేదు. బీద పిల్లలకు నాణ్యమైన చదువు ఇప్పించటం వరకే అక్కడక్కడ ప్రయత్నాలు జరిగాయి. దీనివలన విద్యలో సమత్వం రా దని 1992లో ప్లానింగ్ కమిషన్ పునర్ సమీక్ష చేసిం ది. ఎస్సీ, ఎస్టీలు, బలహీనవర్గాల పిల్లలు బడికి వ చ్చేందుకై కొన్ని రాయితీలివ్వాలని తీర్మానించింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు ప్రత్యేక హాస్టల్స్ తెరవాలని, గిరిజన ప్రాంతంలో ఆశ్రమ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని, ఎస్సీ, ఎస్టీ నివాస ప్రాంతాలలోనే బడులు ఏర్పాటు చేయాలని ఎన్పీఈ కమిషన్ సూచించింది. నవోదయ బడులలో కేంద్రీయ విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ పిల్లలకు రిజ ర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది. కానీ ఇవి అంతగా అమలు జరగలేదు. కారణాలు ఎన్నో. ఎస్సీ, ఎస్టీ స్కూళ్ల నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయి. వీటికి ప్రభుత్వం డబ్బు కేటాయించకపోగా హాస్టల్స్‌లో నాసిరకమైన ఆహారాన్ని అందిస్తున్నా రు. ఎన్పీఈ సిఫార్సులు విద్యారంగంలో మరొక అంతస్తును సృష్టించాయి. ఆశ్రమ స్కూళ్లకు, ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో వ్యత్యాసమే ఇంకో అగాధాన్ని సృష్టించింది. జనరల్ స్కూళ్లలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చినా వారి స్థితిగతులను మార్చకుం డా పాఠశాలల్లో చేర్పించినా వారిని నిలబెట్టుకోవటమే కష్టమైపోయింది. మొదటి తరగతిలో చేరిన వాళ్లు రెండో తరగతి వచ్చేసరికి డ్రాప్ అవుట్స్ అయ్యారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 2013-14 విద్యాసంవత్సరంలో 5వ తరగతి వరకు చదివే విద్యార్థులలో 22.23 శాతం, 1వ తరగతి నుంచి 7వ తరగతి మధ్య 32.56 శాతం, 1 నుంచి 10వ తరగతి వరకు బడి మానేసిన విద్యార్థుల సంఖ్య 38.21 శాతంగా ఉన్నాయని, ఇటీవల తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ పేర్కొంది. ఇదే నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా డ్రాప్ అవుట్ల సంఖ్య కనిపిస్తుంది. ఆ డ్రాప్ అవుట్ విద్యార్థులను పట్టించుకోకపోవటం వలన వారు చదువులో వెనుకబడిపోయారు. ఎన్పీఈ వలన 20 శాతం వర్గాల ఆడపిల్లల చదువులో మార్పు వచ్చింది. వెనుకబడిన వర్గాల ఆడపిల్లల చదువులో అంతగా మార్పు రాలేదు. సామాజిక జీవనం మారకుండా ఆ పిల్లల విద్యలో మార్పు తేవటం కష్టసాధ్యం. క్యూబాలాం టి దేశాలలో ఎంతో శ్రద్ధ తీసుకుని వెనుకబడిన పిల్లల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు. అట్టడుగు వర్గాలలో చైతన్యం కలిగించి వారిని విద్య వైపు మళ్లిం చాలి. భారతదేశ తొలి విద్యామంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బడికిరాని పిల్లల పైన ప్రత్యేకంగా విచారించే యంత్రాంగం కావాలి. డ్రాప్ అవుట్స్‌కు విరుగుళ్లు వెతకాలి. (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త)