
వందేమాతరం ఫౌండేషన్
పెళ్లీడుకు వచ్చిన అమ్మాయికి పెళ్ళి చూపులు జరుగుతున్నా యంటే కాపురానికి వెళ్లకముందే, గుండెల నిండా, మదినిండా భారాన్ని మూటకట్టుకుంటుంది. పెళ్ళిచూపుల తంతు తోనే పుట్టెడు దుఃఖాన్ని మూట కట్టుకొని తనలో తాను కుమిలి పోతుంది. చాలీ చాలని దినసరి వేతనం, అంతంత మాత్రపు కుటుంబ నేపథ్యం వున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదవ తరగతి పరీక్షల సమయంలో కూడా ఇదే తరహాలో మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 26 1/2 లక్షల మంది విద్యార్థులు చదువు కొనుక్కోలేని పుట్టెడు దారిద్య్రాన్ని అనుభవిస్తూన్నారు. ప్రభుత్వం పెట్టే మధ్యాహ్న భోజనం మాకు కొంత ఊరటనిస్తుందని ఆశతో బడికి వచ్చే పిల్లలు 70% పైగా వున్నారు. చదువు కొనుక్కొలేని పేదరికంతో అల్లాడిపోతున్న మొదటి తరానికి చెందిన విద్యార్థుల సంఖ్య 95% పైగా వుంది. ఒకవైపు ఆశయం .. మరోవైపు ఆకలి.. వీటి మధ్యనే జరిగే తీవ్ర సంఘర్షణ విద్యార్థి మానసిక క్షోభకు కారణం అవుతోంది.
ఉదయం బడికి వెళ్ళిన పిల్లవాడు మధ్యాహ్నం ఏమి తిన్నాడో అని ఎదురుచూసి సద్దులు తీసుకొచ్చి ఇచ్చే సంస్కృతి ప్రభుత్వ పాఠశాలల ముందు కన్పిం చదు. బడిలో పెట్టిన మధ్యాహ్న భోజనమే బడుగుల పిల్లల పాలిట పరమాన్నం అవుతుంది. ఎండకు ఎండి, వానకు తడిసి రెక్కల కష్టంపై కుటుంబాలను నెట్టు కొస్తున్న తల్లిదండ్రులు కూలి నాలి చేసుకొని ఇంటి ముఖం పట్టే సమయానికి ఏ రాత్రో అవుతుంది. బడి నుంచి ఇంటికి వచ్చిన పిల్లవాడు అమ్మనాన్నల కోసం ఎదురుచూస్తుంటాడు. వారు వచ్చి వంట చేసే దాకా ఆకలితో అల్లాడిపోతున్న తీరు నేడు పల్లెలలో కన్పి స్తుంది. ఉన్న ఒక ఇల్లు, అందులోనే వంట, అందులోనే సంసారపు కష్టనష్టాలు, పూట పూటకు వెతుకులాటలు, తాగి వచ్చిన తండ్రి.. తల్లితో, పిల్లలతో పెనుగు లాటలతో విద్యార్థుల ఇళ్ళు రాత్రికల్లా రణరంగాన్ని తలపిస్తాయి. తాగి వచ్చిన తండ్రి కొడితే తల్లడిల్లిన తల్లి ఏడుస్తూ పడిపోతే ఆకలితో అలమటిస్తున్న ఆ బడుగు పిల్లలకు మరుసటి రోజు మధ్యాహ్నం వండి పెట్టే బడి భోజనమే జీవగంజి అవుతుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సెకండరీ బోర్డు పరీక్షలకు ఈ రకమైన సంఘర్షణ మధ్యే సన్నద్ధం అవ్వాలి.
పేదరికంలో పుట్టిన పాపానికి ఆశయం ఉన్నా మౌలిక వసతులు లేని కారణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వెనకబడిపోతున్నారు. అనేక విద్యా సంస్థలు, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు, కార్పొరేటు సంస్థల తీరుతెన్నులను అనేక విద్యా పోకడలను, విద్యావ్యవహారాలను అధ్యయనం చేసిన నా 89 సం॥జీవన ప్రయాణంలో నాకు ఎదురైన ఒక అద్భుతమైన ప్రయోగం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పదోతరగతి పరీక్షల అధ్యయన శిబిరం. ‘వందే మాతరం ఫౌండేషన్’ అనే పేరుతో వరంగల్ జిల్లాలోని తొర్రూర్ కేంద్రంగా 500 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థు లకు 50 రోజుల పాటు మౌలికమైన వసతులు, బోధన, భోజనం, వైద్య సదుపాయాలు సమకూర్చి ఆ బడుగుల బిడ్డల భవితకు ఊతం ఇస్తున్న తీరు నన్నెంతగానో కదిలించింది. నా జీవితంలో ఈ శిబిరం ఒక అనుభవ పాఠశాల అయింది. 50 రోజుల పాటు జరిగే ఈ శిబిరా నికి ఒక పదేళ్లుగా పలుమార్లు వెళ్ళి ఆ పిల్లలతో గడిపిన క్షణాలు మధురమైన అనుభూతులుగా మిగిలాయి.
ఆ శిబిరంలో ఒక్కొక్క విద్యార్థి హృదయం తట్టి కదిలిస్తే వెల లేని వెతల గ్రంథం అవుతుంది. తండ్రి ఉంటే తల్లి వుండదు. తల్లి ఉంటే తండ్రి వుండడు. ఇద్దరు లేని వారు ఒకరైతే, వున్న తండ్రి.. త ల్లీ పిల్లలను వదిలేసి మరో కాపురం పెట్టుకొని గడుపుతున్న తీరు. మరో తండ్రి సాయంత్రానికల్లా తప్ప తాగి వచ్చి పిల్లలు చదివే పుస్తకాలను సైతం అమ్ముకుంటాడు. ఈ నిర్భాగ్య జీవనం నుంచి ఆకాశమంత ఎత్తున్న ఆశయం వైపు పిల్లల ప్రయాణం కొనసాగుతుంది. ఈ దుర్భరమైన దారిద్య్రం, దుఃఖంతో బాధపడుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఆత్మీయతతో చేరదీసి వారి ఆశయానికి పదును పెడితే తప్ప సమాజంలో సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని సాధించలేమన్న మౌలికమైన ఆశయాన్ని ముందు పెట్టుకొని మహానీ యుడైన అంబేడ్కర్ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చింది వందేమాతరం పౌండేషన్. జీవితంలో ఎంతటి ఉన్నత చదువులకైనా పదవ తరగతే ప్రాథమిక మెట్టు అవుతుంది. ఈ పునాది ఎంత బలంగా పటిష్టమైన రీతిలో నిర్మాణమైతే భవిష్యత్తు భావిజీవన సౌధం అంత బలంగా నిలబడగలుగుతుంది.
ఈ పునాదులు సరిగా లేని కారణంగా ఉన్నత చదువులకు వెళ్ళినప్పటికీ అత్యుత్తమ ప్రతిభావంతులుగా నిలబడలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వందే మాతరం పౌండేషన్ చదువు, విలువలతో కూడుకున్న దార్శనిక జీవనాన్ని సామాజిక బాధ్యతతో జోడించడం వల్ల ఆ పిల్లలు అత్యుత్తమ వ్యక్తిత్వంతో, చదువుతో పాటు ఉదాత్తమైన జీవితంతో రాణించగల్గుతున్నారు. 50 రోజుల పాటు అనేకమంది ప్రతిభావంతులు, మేధావులు, విజయ పథాన కొనసాగిన ప్రముఖులు ఈ శిబిరాన్ని సందర్శించి విద్యార్థులకు ప్రేరణ ఇస్తున్నం దున విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఈ ప్రయోగాన్ని గమనించిన ఆ జిల్లా కలెక్టరు వాకాటి కరుణ... కేవలం దాతృత్వంతో జరిగే ఈ పనిని, పూట పూటకు అడుక్కొచ్చి నిర్వహించే దాతృత్వంతో జరుగు తున్న ఈ కార్యక్రమాన్ని చూసి ఆమె చలించిపోయారు. ప్రభుత్వాధికారంలో ఉండి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ మాత్రమైనా చేయలేమా అని ఆమె భావించి ఇలాంటి శిబిరాలను జిల్లా వ్యాప్తంగా 12 చోట్ల ఏర్పాటు చేసారు. సాయంత్రం వరకు ఉండే మిగతా విద్యార్థులకు సాయంత్రం పూట కూడా బడిలోనే అత్యల్ప ఆహారం ఇచ్చి వారి ఆకలిని తీర్చడం మా బాధ్యత. మీ ఆశయ సాధనకోసం మీరు ముందుకు నడవండి అని విద్యార్థులకు కలెక్టర్ పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బడుగు, బలహీన విద్యార్థుల భవిష్యత్తుకు పరీక్షల ముందు భరోసాను ఇస్తూ వారి ఆకలిని తీర్చి మౌలికమైన అవసరాలు సమకూర్చగలిగితే సామాజిక సమానత్వం సిద్ధిస్తుందనడానికి ఇదో గొప్ప ప్రయోగం. ఈ ప్రేరణ కలిగించాలనే నాతోపాటు ఈ శిబిరానికి అనేకమందిని తీసుకెళ్లాను. అలా వచ్చినవారంతా ఆశ్చర్యపడ్డారు. ఆలోచించడం మొదలెట్టారు. వయోభారం అయినా ఆరోగ్యం సహకరించనప్పటికీ, పేద బిడ్డల మధ్య ఎక్కువ రోజులు గడపడానికి ఎన్నో విషయాలు నేర్చు కోవడానికి వందేమాతరం శిబిరాన్ని నేటికీ సందర్శిస్తుం టాను. ఊర్లు, కులాలు, వివక్షలు, మతాలు, సంకుచి తత్వ పోకడలకు తావు లేకుండా ఒకే ప్రాంగణంలో ఆడ, మగపిల్లలు ఒకే తల్లిబిడ్డల్లా సంస్కారవంతమైన జీవనం గడుపుతున్న తీరుతో.. అత్యుత్తమ నవీన సమాజానికి ఈ శిబిరం నాంది పలుకుతుంది.
అభిప్రాయం; డా. చుక్కారామయ్య
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు