వామపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు పోవాలి
వామపక్ష మేధావులు
హైదరాబాద్: నాటి ఉద్యమ స్ఫూర్తితో వామపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని పలువురు వామపక్ష మేధావులు, సానుభూతిపరులు సూచించారు. బూర్జువా పార్టీలతో కలసి పోటీ చేయడంతో కమ్యునిస్టు పార్టీలపై ప్రజల్లో న మ్మకం పోయిందని వారు అన్నారు. 2019 ఎన్నికలు మావే అన్న లక్ష్యంగా అన్ని కమ్యునిస్టుపార్టీలు ఐక్యకార్యచరణతో ముందుకు పోవాలని వారు సూచించారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 10 వామపక్ష పార్టీల మేధావులు, ఆలోచనా పరులతో సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య అధ్యక్షతన చర్చా గోష్టి జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్స్ హరగోపాల్, ఘంటా చక్రపాణి, రమా మెల్కోటే, భాంగ్య భూక్య, ప్రొఫెసర్ కె.ఆర్.చౌదరి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
చుక్కా రామయ్య మాట్లాడుతూ నాటి కమ్యునిస్టు నాయకుల స్ఫూర్తి నేడు కరువైందని అన్నారు. నేటి ఉద్యమాలు అట్టడుగు ప్రజలకు ఉపయోగపడే విధంగా లేకుండా కొన్ని స్వార్ధ శక్తుల ప్రయోజనాల కోసం ఏర్పడుతున్నాయుని, ఇది కమ్యునిస్టుల దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ 1964కు ముందు అంతా ఒకే కమ్యునిస్టు భావాలతో పని చేశారని, ఆ తర్వాత ఎందుకు విడిపోయారని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో 240 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. దీనిపై రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీసు వద్ద బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారని, మీరెందుకు వెనకబడ్డారని ప్రశ్నించారు. కమ్యునిస్టులంగా ఏకతాటి పైకి రావాలని సూచించారు. హరగోపాల్ మాట్లాడుతూ బీజేపీ లాంటి పార్టీలు వినాయకచవితి, జై శ్రీరాం దేవతల పేర్లతో ప్రజల్లో మమేకం అవుతున్నారని, మీకెందుకు పండుగలు లేవని అన్నారు. మీరు ఆ దిశగా ఆలోచించాలని సూచించారు. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ వామపక్షాలు ఉద్యమం చేయటంలో ముంద ంజలో ఉన్నాయని.. ఎన్నికల సమయంలో తమ స్వార్ధ ప్రయోజనాలకోసం ఒకటి, రెండు కమ్యునిస్టు పార్టీలు బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకోవటం వల్ల ప్రజల్లో క మ్యూనిస్టులపై నమ్మకం పోయిందని అన్నారు. రమా మెల్కోటే మాట్లాడుతూ వామపక్ష పార్టీలు ఎన్నికల్లో ఒకే వేదికపైకి వచ్చి నిలబడితే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. కమ్యునిస్టు పార్టీలో కూడ కమ్మ, రెడ్డిలే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పని చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీలు ఎందుకు ఆ స్థాయిలో లేరని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ, సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, సీపీఐ నాయకులు చాడ వెంకట్ రెడ్డి, గుండా మల్లేష్, ఆర్‌ఎస్‌పీ నాయకులు జానకిరాములు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె.గోవర్ధన్, సూర్యం, వివిద పార్టీల నాయకులు భూతం వీరన్న, జూలూరి గౌరీశంకర్, ఎస్.వెంకటేశ్వర్ రావు, గడ్డం ఝాన్సీ, ప్రదీప్, మురారి, జీవన్ కుమార్‌లతో పాటు అనేక మంది మేధావులు, సానుభూతిపరులు పాల్గొన్నారు.