శ్రామిక వర్గ మహోపాధ్యాయుడు | Sakshi Guest Column On Communist theoretician Karl Marx | Sakshi
Sakshi News home page

శ్రామిక వర్గ మహోపాధ్యాయుడు

Published Sun, May 5 2024 3:47 AM | Last Updated on Sun, May 5 2024 3:47 AM

Sakshi Guest Column On Communist theoretician Karl Marx

ప్రపంచాన్ని మలుపుతిప్పిన ఘటనల్లో ఒకటి కమ్యూనిస్ట్‌ సిద్ధాంతకర్త కారల్‌ మార్క్స్‌ జననం. జర్మనీ (ప్రష్యా)లో పుట్టిన ఆయన విద్యాభ్యాసం అనంతరం పాత్రికేయ వృత్తిని ఎంచుకున్నారు. కొంతకాలం తర్వాత ఫ్రాన్స్‌ వెళ్ళారు. అక్కడే ఆయన  జీవితకాల ఉద్యమ సిద్ధాంత మిత్రుడు ఫ్రెడరిక్‌ ఏంగిల్స్‌ను కలుసు కున్నారు. ఫ్రాన్స్‌ ఆయన్ని దేశం నుంచి బహిష్కరించడంతో ముందు బెల్జియం ఆ తర్వాత ఇంగ్లండ్‌ (లండన్‌) వెళ్లి  మిగిలిన జీవితమంతా తన భార్యాబిడ్డలతో అక్కడే గడిపారు. 

మార్క్స్‌ తన జీవితకాల మిత్రుడు, సహచరుడు, సిద్ధాంతకర్త అయిన ఫ్రెడరిక్‌ ఏంగిల్స్‌తో కలిసి ‘కమ్యూ నిస్టు లీగు’ ఏర్పాటు చేసి  1848లో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ఏంగిల్స్‌తో కలిసి రాశారు. 1867లో ‘దాస్‌ క్యాపి టల్‌’ మొదటి వాల్యూమ్‌ను ప్రచురించారు.

మానవ  సమాజ సమూహ సంబంధాలు అన్నిటినీ కార్ల్‌ మార్క్స్‌ ‘ఫ్రెడరిక్‌ ఏంగిల్స్‌లు శాస్త్రీయంగా నిరూ పించారు. ఆదిమ కమ్యూనిస్టు సమాజం నుండి బానిస సమాజం, బానిస సమాజం నుండి ఫ్యూడల్‌ సమాజం, ఫ్యూడల్‌ భూస్వామ్య సమాజం నుండి పెట్టుబడిదారీ సమాజం, పెట్టుబడిదారీ సమాజం నుండి సోషలిస్టు సమాజానికి మానవ సమాజం ఎలా పరిణామం చెందు తుందో... సోషలిస్టు సమాజం నుండి అంతిమంగా కమ్యూనిస్టు సమాజం వైపు వర్గహిత సమాజం వైపు ఎలా మానవ సమాజం ప్రయాణిస్తుందో శాస్త్రీయంగా మార్క్స్‌–ఏంగెల్స్‌లు నిరూపించారు, సిద్ధాంతీకరించారు. 

మానవ సమాజ పరిణామ క్రమంలో శ్రమ పాత్రనూ, శ్రమ ఔన్నత్యాన్నీ, సర్వసంపదలకు శ్రమే మూలం అన్న విషయాన్నీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో సిద్ధాంతీకరించిన తత్వవేత్తలు కారల్‌ మార్క్స్, ఏంగెల్స్‌లు. కార్మికుని అదనపు శ్రమే ‘పెట్టుబడి’ అనే విషయాన్ని బహుముఖ కోణాల నుంచి పరిశోధన చేసి ‘దాస్‌ క్యాపిటల్‌’ను ప్రపంచానికి అందించారు. గతి తర్కాన్ని, చారిత్రిక భౌతిక వాదాన్నీ, తలకిందులుగా ఉన్న హెగెల్‌ తత్వ శాస్త్రాన్నీ, అందులోని భావవాదాన్నీ సరిదిద్ది భౌతిక వాదం తన కాళ్ళ మీద తను నిలబడే టట్లుగా రూపొందించారు మార్క్స్‌.   

అభివృద్ధి నిరోధకమైన పాత వ్యవస్థ, అభివృద్ధి కరమైనటువంటి కొత్త వ్యవస్థను అనుమతించదు. అందుచే బల ప్రయోగం ద్వారా పాత అభివృద్ధి నిరోధక వ్యవస్థను నెట్టివేయాలనీ, కూలదోయాలనీ మార్క్స్‌ శాస్త్రీయంగా వివరించారు. 

మార్క్స్‌ తదనంతరం పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద రూపం తీసుకున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నత రూపమే సామ్రాజ్యవాదం అని లెనిన్‌ సిద్ధాంతీకరించారు. మార్క్సిజాన్ని రష్యా పరిస్థితులకు అన్వయించి కార్మిక వర్గ నాయకత్వాన, కర్షకవర్గం మైత్రితో లెనిన్‌ సోషలిస్ట్‌ విప్లవాన్ని విజయవంతం చేశారు.

– మన్నవ హరిప్రసాద్, సీపీఐ (ఎమ్‌ఎల్‌) రెడ్‌ స్టార్‌ పాలిట్‌ బ్యూరో సభ్యుడు
(నేడు కారల్‌ మార్క్స్‌ జయంతి) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement