మార్క్స్‌ అవగాహన రుజువవుతోందా? | Sakshi Guest Column On Karl Marx by ABK Prasad | Sakshi
Sakshi News home page

మార్క్స్‌ అవగాహన రుజువవుతోందా?

Published Fri, Nov 3 2023 5:35 AM | Last Updated on Fri, Nov 3 2023 5:35 AM

Sakshi Guest Column On Karl Marx by ABK Prasad

పార్లమెంటులో, శాసన సభల్లో వందలాది మంది ఎలా కోట్ల ఆస్తులకు పడగలెత్తారని ‘ఏడీఆర్‌’ నివేదికలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియను ‘ఐదేళ్ల కాంట్రాక్టు’గానే పార్టీలు చూస్తున్నాయి. ‘ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం’ వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ధనికవర్గ సమాజాలు నేరస్థుల్ని, వారి వెంటనే నేర చట్టాల్ని, వాటిని సమర్థించే శక్తుల్ని ఎలా సృష్టించుకుంటూ పోతాయో కార్ల్‌ మార్క్స్‌ ఎప్పుడో చెప్పారు. అలాంటి సమాజంలో ఒక తత్వవేత్త అందుకు తగిన భావాల్ని అందజేస్తాడు. ఒక కవి తన కవితల్ని అల్లుకుంటూ పోతాడు. ఒక మతాధికారి తన వంతుగా ప్రవచనాల్ని అందిస్తాడు. వర్గ రహిత సోషలిస్టు వ్యవస్థ ఏర్పడేవరకూ ఈ పరిస్థితిలో మార్పు ఉండదు!

‘‘మన దేశంలో ప్రజల కోసం కాకుండా పవర్‌ (అధికారం) కోసమే పథకాలు పుట్టు కొస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియను ‘ఐదేళ్ల కాంట్రాక్టు’గానే పార్టీలు చూస్తున్నాయి. కార్పొరేట్‌ విధాన రాజకీయాలనే అన్ని పార్టీలు అనుసరిస్తున్నాయి. ఇంతకూ మన దేశంలో భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యా లను చదివిన నాయకులెందరు?’’
– తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్‌గా పనిచేసిన ఐఏఎస్‌ అధికారి వి. నాగిరెడ్డి (28.10.2023)

‘‘దేశంలో చట్టాలకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం’ వల్ల ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు వాటిల్లుతోంది. దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల అధీనంలో ఉండ వలసిన ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రయివేట్‌ రంగ సన్నిహితులకు కట్టబెట్టడానికి మారుపేరు ‘ఆశ్రిత పెట్టుబడి’!’’
– సీనియర్‌ పాత్రికేయులు పరాంజయ గుహ ఠాకుర్తా (29.10.2023)

‘పాలన సాగించే సివిల్‌ సర్వెంట్లను ప్రచార సాధనాలుగా ఉపయోగించుకునేలా– దేశంలోని 765 జిల్లాలకు జాయింట్‌ సెక్రటరీ, లేదా అంతకన్నా తక్కువ స్థాయి అధికారులను ‘రథ్‌ ప్రభారీ’లుగా నామినేట్‌ చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంపై కేంద్ర మంత్రి మండలి మాజీ కార్యదర్శి కె.ఎం. చంద్రశేఖర్‌ తీవ్ర నిరసన తెలిపారు.’ (30.10. 2023)

పాలనా యంత్రాంగంలో అవినీతి భాగోతం అంతటితోనే ఆగలేదు. రాజకీయ పార్టీలకు ఎన్నికలలో డబ్బు ఎక్కడినుంచి వస్తోందీ, ఎటు పంపిణీ అవుతోందన్న వివరాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ‘లేదు పొమ్మని’ మోదీ ప్రభుత్వ అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి సుప్రీంకోర్టు ముఖం మీదనే చెప్పారు. తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదు పొమ్మంటున్న కేంద్ర పాలకుల ఎత్తుగడను  సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ప్రశ్నిస్తోంది. 

భారతదేశంలో ప్రజాస్వామ్య సంస్కరణలు స్థిరపడి నిలదొక్కు కునేటట్లు చేసేందుకు ఏర్పడిన సంస్థ ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌’... కొంతకాలంగా పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభల్లో ప్రవేశి స్తున్న వివిధ పార్టీల, రాజకీయ నాయకుల, ప్రతినిధుల ఆదాయ వ్యయాల వివరాలను వెల్లడిస్తూ దేశ ప్రజల్ని హెచ్చరిస్తోంది.

‘అందరూ శాకాహారులే అయిన చోట రొయ్యల బుట్ట ఎలా ఖాళీ అవుతోంద’ని ప్రశ్నిస్తోంది. పార్లమెంటులో 250 మంది సభ్యులకు పైగా, రాష్ట్రాల శాసన సభల సభ్యులలో వందలాది మంది ఎలా వందల కోట్ల ఆస్తులకు పడగలెత్తుతూ వచ్చారని ‘ఏడీఆర్‌’ సాధికార నివేదికలు గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నా సమాధానం లేదు. సగానికి పైగా పార్లమెంట్‌ సభ్యులలో, రాష్ట్రాల శాసన సభ్యులలో, పాలకులలో పేరుకు పోతున్న అవినీతికి, క్రిమినల్‌ కేసులకు అంతులేని పరిస్థితిని ఏడీఆర్‌ సాధికార నివేదికలు బయట పెడుతున్నాయి.

క్రమంగా ఇలాంటి పరిస్థితులు ధనికవర్గ సమాజాలు నేరస్థుల్ని, వారి వెంటనే నేర చట్టాల్ని, వాటిని సమర్థించే శక్తుల్ని ఎలా సృష్టించుకుంటూ పోతాయో చరిత్రలో మొదటిసారిగా విశ్లేషించినవాడు శాస్త్రీయ సోష లిజం సిద్ధాంత ప్రవక్త కార్ల్‌ మార్క్స్‌. అలాంటి దోపిడీ వ్యవస్థ ఉనికిని కాపాడటానికి వివిధ శక్తులు ఏ స్థాయిల్లో ఎలా చేదోడు వాదోడు అవుతాయో మార్క్స్‌ ఇలా విశ్లేషించి చూపాడు:

అలాంటి సమాజంలో ఒక తత్వవేత్త అందుకు తగిన భావాల్ని అందజేస్తాడు. ఒక కవి తన కవితల్ని అల్లుకుంటూ పోతాడు. ఒక మతాధికారి లేదా పూజారి తన వంతుగా ప్రవచనాల్ని అందిస్తాడు. ఓ ప్రొఫెసర్‌ గారు ఇందుకు తగిన గ్రంథ రాజాల సారాంశాన్ని అందజేస్తుంటాడు. ఓ నేరగాడు యథేచ్ఛగా అలా నేరాలు చేస్తూనే పోతాడు. నేరానికి పాల్పడటం కూడా ధనిక, దోపిడీ వర్గ సమాజ వస్తూత్పత్తి క్రమంలో భాగంగానే సాగిపోతుంది. అటు సరుకుల ఉత్పత్తి క్రమానికి, ఇటు సమాజానికి మధ్య నెలకొనే అవినాభావ సంబంధాన్ని పరిశీలించినట్లయితే–అనేక భ్రమలు, దురభిమానాలు పటాపంచలై పోతాయి.

ఎందుకంటే, మన ‘లా ప్రొఫెసర్‌’ గారు ఆ భ్రమలపై ఆధారపడి ఓ గ్రంథ రాజాన్ని తయారు చేసుకొని మార్కెట్‌ లోకి ఓ అమ్మకపు సరుకుగా వదులు తాడు. ఆ పుస్తకాన్ని తమ వంతు ‘జాతీయ సంపద’గా భావించి ధనిక వర్గం పంచుకోవడానికి దోహద పడుతుంది. మరో వైపున దాన్ని తయారు చేసిన ‘లా ప్రొఫెసర్‌’ గారిలో ఇది వ్యక్తిగత మైన ఆనందాన్నీ, తృప్తినీ పెంచేస్తుంది.

ఇలా మన ప్రొఫెసర్‌ ధనికవర్గ ప్రయోజనాలకు ఉపయోగపడే ఓ క్రిమినల్‌ చట్టం రూపొందడానికి చేయూత నివ్వడమేగాక, ఆ చట్టానికి గొడుగు పట్టే ‘పీనల్‌ కోడ్స్‌’ (శిక్షా స్మృతి)ను, దానితోపాటే ధనికవర్గ ప్రయోజనాలు ఈడేర్చిపెట్టే శాసన కర్తలు, కళాకారులు రూపొందేలా, ఆ చట్టానికి వత్తాసు పలికే సాహిత్యానికి, నవలలకు, చివరికి సమాజంలో అనంతమైన విషాదకర సన్నివేశాలకు కారణమవుతాడు.

కనుకనే, అలాంటి సమాజాల్లో పరస్పర వర్గ ప్రయోజనాల రక్షణ కోసం ఒక వైపు నుంచి ధనికవర్గమూ, మరో వైపు నుంచి శ్రామికులు ఆచరణలో ప్రయివేట్‌ ఆస్తి ఉనికిని కాపాడు తున్నట్టు అవుతోందని కూడా మార్క్స్‌ ప్రభృతులు అరమరికలు లేకుండా చెప్పారు. వర్గ రహిత సోషలిస్టు వ్యవస్థ ఏర్పడేవరకూ ఈ పరిస్థితిలో మార్పు ఉండదు!

అందుకే అన్నాడా, శ్రమ విలువ తెలిసిన వేమన?
‘‘భూమిలోన పుట్టు భూసారమెల్లను
తనువులోన పుట్టు తత్వమెల్ల
శ్రమములోన పుట్టు సర్వంబు తానౌను’’!
కాగా, అసలు జీవితమంటే ఏదో ‘సినారె’ను అడిగితే చెబుతాడు:
‘‘ఉప్పెనలో తలవొగ్గక నిలువున ఉబికొచ్చే జీవితం
ఓటమిలో నిట్టూర్చక రివ్వున ఉరికొచ్చేదే జీవితం
చచ్చేదాకా బతికి వుండటం జాతకాల్లో ఉన్నదే –
ఒరిగిపోయినా తన కంఠం నలుగురు మెచ్చేదే జీవితం
ప్రలోభాలు పైబడినా నీతికి పడి చచ్చేదే జీవితం’’!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement