నిజమైన కళకు నీరాజనాలు | Sakshi Guest Column On Praja Natya Mandal performances | Sakshi
Sakshi News home page

నిజమైన కళకు నీరాజనాలు

Published Thu, Feb 8 2024 12:34 AM | Last Updated on Thu, Feb 8 2024 12:34 AM

Sakshi Guest Column On Praja Natya Mandal performances

‘‘ప్రజా నాట్యమండలి ప్రదర్శనలు చూసిన తర్వాత, మా గండపెండేరాలను తీసి ఆ నాట్య మండలి నిర్వాహకుల, కళాకారుల ముందు సమర్పించాలనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు విశ్వనాథ సత్యనారాయణ. నాటక, సాహిత్యాది రంగాలు ఎలా ఉంటే నిజమైన ప్రజాకళలుగా, సృజన శక్తులుగా భాసిస్తాయో ‘ప్రజా నాట్యమండలి’ ప్రదర్శనలు నిరూపించాయి. అయితే తెలుగునాట నాటక రంగానిది మహా వైభవోపేత చరిత్ర. అవి జనజీవితాన్ని ఎల్లెడలా ప్రభావితం చేశాయి. జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పాయి. నవజీవన పరిధి విస్తృతం కావాలంటే ‘ప్రశ్న’ అనివార్యం అని చాటాయి. ‘సమాజానికాయువైన నాటకమే శ్వాసగా జీవితాలనర్పించిన సూత్రధారులెందరో! మధురస్వర ఝరీ గమన హృద్యపద్య రాగంతో మేలుకొలుపు పాడిన గాత్రధారులెందరో!! ఆ మహానుభావులకు వందనం!!!

నాటక, సాహిత్యాది రంగాలకు చెందిన వివిధ రంగాలు ఎలా ఉంటే నిజమైన ప్రజాకళలుగా, సృజన శక్తులుగా భాసిస్తాయో 1930లలో భారత పర్యంతం వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘ప్రజా నాట్యమండలి’ ప్రదర్శనలు నిరూపించాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ‘ఆంధ్ర ప్రజా నాట్యమండలి’ సారథ్యంలోని ‘మా భూమి’ ఇత్యాది కళా రూపాలను ప్రస్తావిస్తూ మహాకవి విశ్వనాథ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. ‘‘ప్రజా నాట్యమండలి ప్రదర్శనలు చూసిన తర్వాత మా గండపెండేరాలను తీసి ఆ నాట్య మండలి నిర్వాహకుల, కళాకారుల ముందు సమర్పించాలనిపిస్తోంది.

ప్రజాకళలు ఎలా ఉండాలో ‘మా భూమి’, ‘అంతా పెద్దలే’ నాటకాలు నిరూపించా’’యని ప్రశంసల వర్షం కురిపించారు! ఈ కితాబు నాటికీ, నేటికీ మరపురాని సందేశంగా నిలిచిపోయింది. ఆ ఒరవడిలో ముందుకు సాగి, అఖిల భారత స్థాయిలోనే ఒక విశిష్ఠ స్థానాన్ని పొందిన ‘ఆంధ్ర ప్రజా నాట్యమండలి’ రాష్ట్రీయ విశిష్ఠ శాఖలలో ఒకటి గుంటూరు జిల్లా ‘ప్రజా నాట్యమండలి’. భారత ప్రజానాట్య మండలికి ఆంధ్ర ప్రజానాట్య మండలి ఎలా ‘ఒజ్జ బంతి’ అయిందో, అలాగే గుంటూరు ప్రజా నాట్యమండలి వివిధ శాఖలతో పరిఢవిల్లింది. మానవ జీవన దర్పణంగా పలువురు ఆంధ్ర పండితుల, కవుల ఆశీస్సులతో ముందుకు సాగుతోంది. 

సందేశాలు సమకాలీనం
విశ్వనాథ వారు ఎంతటి మహాకవో, అంతటి సరసుడు, ‘గడగ్గాయి’ కూడా! పెళ్లయి, కాపురాలకు వెళ్లబోయే నూతన దంపతులందరికీ కంటికి కనిపించినా, కనిపించకపోయినా ‘అరుంధతీ’ నక్షత్రాన్ని చూపడానికి మన పెద్దలు ప్రయత్నిస్తారు. కానీ విశ్వనా«థను ఒకరు మీరెప్పుడైనా ‘అరుంధతీ’ నక్షత్రాన్ని చూశారా అని ప్రశ్నించగా... నాకైతే ‘అరుంధతి కనిపించలేదుగానీ చేసిన ‘అప్పులయితే’ కనిపించి, వేధించాయని చమత్కరించారు. 

బహుశా కొన్ని జీవితానుభవాల తర్వాత, ‘చింతామణి’ నాటక కర్తగా సుప్రసిద్ధుడైన మహాకవి కాళ్లకూరి... భార్యాభర్తల మధ్య ఉదాత్తమైన సంసార అవగాహన ఎలా ఉండాలో చెప్పడానికి ఒక పద్యాన్ని రాశారు. సందేశాత్మకంగా ఉండటానికి సరళమైన భాషలో రాసి మనకు అందించారు! ఆరోజుల్లో వేశ్యా లంపటత్వం వల్ల సంసార జీవితాలు ఎలా బుగ్గిపాలవుతున్నాయో చెప్పి, ఆ వినాశం వల్ల సంసార జీవితాల్ని రక్షించడం అవసరమని భావించి కాళ్లకూరి ఆ నాటకం రాశారు! ఫలితంగా గంభీర సంసార జీవితాల అవగాహనకు ఆ పద్యం ద్వారా సమకాలీన సందేశం అందింది. కనుకనే కాళ్లకూరి రచనకు అంత విలువ పెరిగింది. 

‘కష్ట ఫలితంబు బహుళ దుఃఖ ప్రదంబు
సార రహితమైన సంసారమందు
భార్యయను స్వర్గమొకటి కల్పనంబు చేసే
పురుషుల నిమిత్తము పురాణ పురుషులుండు!’


ప్రశ్నించే సంస్కారం బుద్ధి జీవుల్లో పెరగనంతవరకూ మనిషికి వికాసం ఉండదని కవి మీగడ రామలింగస్వామి స్పష్టం చేస్తాడు. ఎందుకని? ఆయన మాటల్లోనే నవజీవన పరిధి విస్తృతం కావాలంటే ‘ప్రశ్న’ అనివార్యం అంటారు. 

‘ప్రశ్న మానవ విజ్ఞాన పరిధి పెంచు
ప్రశ్న లేనిదే మనిషికి ప్రగతి లేదు 
ప్రశ్న యందే సకల దిశా ప్రగతి యుండు


కాన, ప్రశ్నయే వ్యక్తి వికాసమౌను’ అంటారు. అంతేగాదు, ‘ఈర్ష్య’ అనేది ఏ కళకూ, నాటకానికీ పనికి రాదనీ, ఈర్ష్య అనారోగ్యం, హానికరమని స్పష్టం చేశారు! ఇలా ఎన్నెన్నో దృశ్య మాలికలను ‘దర్పణం’ పేరిట గుంటూరు కళా పరిషత్‌ 1997–2022 సంవత్సరాల మధ్య కార్యక్రమాలన్నింటిని రసవత్తరమైన రచనా శైలిలో ‘కళ ప్రజలది’ అన్న మకుటం కింద రజతోత్సవ ప్రత్యేక సంచికగా అందించింది.

‘దర్పణం’ సంపాదకులు, సహ సంపాదకులు వల్లూరు శివప్రసాద్, వల్లూరు తాండవకృష్ణ అభినందనీయులు. నాటక రంగంలో ప్రజాకళలకు ప్రాధాన్యం కల్పించడంలో సుప్రసిద్ధులైన నవీన పథకులుగా ఖ్యాతి పొందిన నటశేఖరులు బళ్లారి రాఘవ, గరికపాటి రాజారావు ప్రఖ్యాతులకు ఈ ప్రత్యేక సంపుటిని అంకితమిచ్చారు. గుంటూరు కళాపరిషత్‌ కార్యక్రమాల ప్రత్యేక దృశ్యమాలిక ఈ సంచికకు ప్రత్యేక కళాకాంతులు అందించింది.

ఎందరో మహానుభావులు
జీవితాంతం ఆధునికులను వెన్నుతట్టి ప్రోత్సహించినవారు... కందుకూరి, తిరుపతి కవులు, చిలకమర్తి, బలిజేపల్లి, పరబ్రహ్మ పరమేశ్వరి, ఒద్దిరాజు సోదరులు, కోదాటి నరసింహం, రామరాజు, గురజాడ, బళ్లారి రాఘవ, వాసిరెడ్డి, సుంకర, ఆత్రేయ, గరికపాటి, ఆత్రేయ ఇత్యాదులు. ఇలా తెలుగు నాటక పరిణామానికి దోహదం చేసినవారి గురించి మేడిచర్ల సత్యనారాయణమూర్తి కవితాత్మకంగా కురిపించిన ప్రశంస ద్వారా దర్పణం సంచిక వైశిష్ట్యం తెలుస్తుంది. 

‘సమాజానికాయువైన నాటకమే శ్వాసగా
జీవితాలనర్పించిన సూత్రధారులెందరో, 
మధురస్వర ఝరీ గమన హృద్యపద్య రాగంతో 
మేలుకొలుపు పాడిన గాత్రధారులెందరో, 
నటనకు జీవం పోసి దైవాలుగా పూజలంది 
శిలారూపమందిన పాత్రధారులెందరో, 
ఎవని కళకు, యువనికలకు ఊపిరినిచ్చెనో 
ఈ రంగస్థలి చిత్రకారులెందరో 
ఆ మహానుభావులకు వందనం 

సాష్టాంగ వందనం!’


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement