హింసకు కళాత్మక ప్రతీకారం! | Sakshi
Sakshi News home page

హింసకు కళాత్మక ప్రతీకారం!

Published Mon, Apr 29 2024 5:05 AM

కత్తి దాడిలో కుడికన్నును కోల్పోయిన సల్మాన్‌ రష్దీ

కామెంట్‌

న్యూయార్క్‌లోని చౌటక్వా ఇన్‌స్టిట్యూషన్‌లో రెండేళ్ల క్రితం ఆగస్టు 12న ఉపన్యాసం ఇచ్చేందుకు సిద్ధమౌతున్న భారత సంతతి రచయిత సల్మాన్‌ రష్దీ అతి పాశవికంగా పదిహేను కత్తిపోట్లకు గురయ్యారు. చావు తప్పి కన్ను పోగొట్టుకున్న ఆ ప్రాణాపాయం నుండి మెల్లగా కోలుకుంటున్న స్థితిలో ఉన్న రష్దీ... నాటి ఘటనపై తాజాగా ‘నైఫ్‌: మెడిటేషన్స్‌ ఆఫ్టర్‌ యాన్‌ అటెంప్టెడ్‌ మర్డర్‌’ పుస్తకం రాశారు. భయంకరమైన ఆ దాడి గురించి ఈ పుస్తకంలో సల్మాన్‌ రష్దీ నేరుగా పాఠకులతో సంభాషించారు. నేటికీ వెంటాడుతున్న తన బాధను, అంతఃసంఘర్షణలను బహిర్గతం చేస్తూ... నెమ్మదిగానే అయినా ఆత్మవిశ్వాసంతో తనెలా కోలుకున్నదీ హృద్యంగా వివరించారు. అదొక గొప్ప మానవీయ పద స్వరీకరణ.

మునుపటి తన కళాఖండాల మాదిరిగా కాకుండా, తన తాజా పుస్తకం ‘నైఫ్‌: మెడిటే షన్స్‌ ఆఫ్టర్‌ యాన్‌ అటెంప్టెడ్‌ మర్డర్‌’లో... దాదాపుగా తనను చంపి నంత పని చేసిన ఆనాటి భయంకరమైన దాడి గురించి సల్మాన్‌ రష్దీ నేరుగా పాఠకులతో సంభాషించారు. సన్నిహితంగా, నిజాయితీగా, ఒప్పించే ప్రయత్నంలో విశ్వాసాన్ని చొరగొనే విధంగా, తన అనిశ్చిత స్థితిని పంచుకుంటూ, తన బాధను, అంతఃసంఘర్షణలను బహిర్గతం చేస్తూ, నెమ్మదిగానే అయినా ఆత్మవిశ్వాసంతో నిలకడైన ప్రయాణంగా తనెలా కోలుకున్నదీ చక్కగా వివరించారు. అదొక గొప్ప మానవీయ పద స్వరీకరణ. పూర్తిగా వ్యక్తిగతమైనది. రష్దీ కంటే సల్మాన్‌గానే ఆయన ఎక్కువగా మాట్లాడారని చెప్పొచ్చు.   

ఆయన తన పైన జరిగిన దాడి(2022) గురించి రాస్తారని నాకు కచ్చితంగా తెలుసు. అయినా ఒక నవలా రచయిత రాయకుండా ఎలా ఉండగలరు? నాకెప్పుడో తెలుసు అని నేను అనడం ఒక పాఠకుడి అంచనాగా మాత్రమే. దాడి ప్రభావాన్ని తనెలా మానసికంగా తట్టుకుని నిలబడ్డారన్న దానిపై పుస్తకంలో రష్దీ చేసిన విశదీకరణ ఆయన ప్రయత్నబలం ఎంత పటిష్టమైనదో చెబుతోంది. ‘‘జరిగిన దానిని అర్థం చేసుకునేందుకు, దానిని అధిగమించేందుకు, నాదిగా అలవాటు చెందేందుకు, ఒక బాధితుడిగా మాత్రమే ఉండటాన్ని నిరాకరించేందుకు నేను ఎంచుకున్న మార్గం ఈ రాయటం అన్నది కావచ్చు. హింసకు నేను చెప్పే సమాధానం కళ ’’ అంటారు రష్దీ.

ఈ పుస్తకం రష్దీ ప్రతిస్పందన అయితే, పుస్తకపు శీర్షిక రష్దీ ఉద్దేశపూర్వకమైన ఎంపిక. అతి దారుణంగా ఆయనపై కత్తిపోట్ల దాడి జరిగింది. కత్తి అన్నది తుపాకీకి చాలా భిన్నమైనది. ‘‘కత్తిపోటు ఒక విధమైన హత్తుకోలు. మనిషికి దగ్గరగా వచ్చి పొడిచే ఆయుధం. కత్తిపోట్లు అతి సమీప నేరాలు’’ అంటారు రష్దీ. అయితే కత్తి ఒక ఉపకరణం కూడా. ఉపయోగించే దాన్ని బట్టి ఆయుధమో, సాధనమో అవుతుంది. ఆ కోణంలో చూస్తే భాష కూడా పదునైన కత్తి వంటిదే. 

‘‘భాషే నా కత్తి’’ అని చెబుతారాయన. ‘‘నేనొకవేళ అనుకోకుండా ఒక అవాంఛనీయమైన కత్తి పోరాటంలో చిక్కుకున్నట్లయితే, ఎదురుదాడికి నేను తిప్పే కత్తి బహుశా నా భాషే కావచ్చు. నా ప్రపంచాన్ని నేను పునర్నిర్మించుకోటానికి, తిరిగి నా అధీనంలోకి తెచ్చు కోటానికి నేను వాడే పరికరం అదే కావచ్చు’’ అంటారు.

దాడి గురించి రష్దీ వర్ణన సూక్ష్మ సునిశితంగా, వెన్నులో వణుకు పుట్టించేలా, ఆ ఘటనను అదే రీతిలో తిరిగి చూపించినట్లుగా ఉంది. ‘‘నేను ఇప్పటికీ ఆ క్షణాన్ని నెమ్మదిగా కదిలే దృశ్యంలా చూడగలను. అతడు ప్రేక్షకుల నుంచి ఒక్క ఉదుటున దుమికి పరుగున నన్ను సమీపిస్తున్న ప్పుడు నా కళ్లు అతడిని అనుసరించాయి. దూకు డుగా పడుతున్న అతడి ప్రతి అడుగును నేను గమనిస్తున్నాను. చప్పున నేను నా కాళ్లపై లేవటం నాకు తెలుస్తూ ఉండగా అతడి వైపు తిరిగాను. ఆత్మరక్షణగా నా ఎడమ చేతిని పైకి లేపాను. ఆ చేతిపై అతడు తన కత్తిని దిగపొడిచాడు.’’  

బాధితుడిలా కాకుండా, జరుగుతున్న దానిని బయటి నుంచి చూస్తున్న వ్యక్తిగా... ‘‘అతడు చాలా పాశవికంగా పోట్లు పొడు స్తున్నాడు. పొడు స్తున్నాడు, కత్తిని నాపై తిప్పుతున్నాడు. కత్తి దాని కదే ప్రాణం కలిగి ఉన్నట్లుగా నాపై విరుచుకుపడింది’’ అని రష్దీ రాశారు. 

రష్దీ స్పృహ కోల్పోయినట్లు లేదు. జరుగుతున్న దాడి ఎలాంటిదో తెలుస్తూనే ఉన్న దిగ్భ్రాంత స్థితిలో ఆయన ఉన్నారు. ‘‘నేలపై పడి ఉన్న నేను నా శరీరం నుంచి కారుతున్న రక్తపు మడుగును చూస్తూ ఉండటం నాకు గుర్తుంది. చాలా రక్తం. అప్పుడు నాకు అనిపించింది: ‘నేను చనిపోతున్నాను’ అని. కానీ అదేమీ నాకు భయం కలిగించ లేదు. ఊహించనిది జరుగబోతున్నట్లుగానూ లేదు. బహుశా అలా జరిగే అవకాశం ఉంది అనుకున్నాను. జరగవలసిందే జరిగిపోతున్న దనే ఆలోచన.’’ 

ఆ సమయంలో రష్దీ గ్రహించని విషయం ఏంటంటే, బతికి బట్టకట్టాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ‘‘నా క్రెడిట్‌ కార్డులు ఈ జేబులో ఉన్నాయి. ఇంటి తాళాలు మరో జేబులో ఉన్నాయి’’ అని, ఆ స్థితితో ఎవరైతే తన పట్ల శ్రద్ధ వహిస్తున్నారో వారితో అస్పష్టంగా చెబుతున్నారు. ‘‘ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే, నా బొంగురు గొంతు దైనందిన వస్తువుల గురించి పట్టింపుతో ఉందంటే, నేననుకోవటం నా దేహంలోని ఒక భాగం – లోలోపలి పోరాడే భాగం – చనిపోయేందుకు సిద్ధంగా ఏమీ లేదని; ఆ క్రెడిట్‌ కార్డులు, ఇంటి తాళాలు మళ్లీ ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఉందని, ‘బతుకు, బతుకు’ అని నాతో గుసగుసలాడుతోందని’’అంటారు రష్దీ.  

ఆయన శరీరంపై పదిహేను కత్తిపోట్లు పడ్డాయి. మెడ, కుడి కన్ను, ఎడమ చెయ్యి, కాలేయం, పొత్తి కడుపు, నుదురు, చెంపలు, నోరు, ఇంకా... తల నుంచి కింది భాగమంతటా. ‘బీబీసీ’ ప్రతినిధి ఎలాన్‌ యెన్తోబ్‌తో మాట్లాడుతూ, మెత్తగా ఉడికించిన గుడ్డును తన పైచెంప మీద ఉంచినట్లుగా తన కుడికన్నుకు అనిపించిందని రష్దీ అన్నారు. ఆ కన్ను పోవటం అనే తీవ్రమైన కలత గురించి పుస్తకంలో ఆయన మనోభావనతో కాక ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడారు. ‘‘ఇప్పుడు కూడా, ఇది రాస్తున్నప్పుడు ఈ నష్టంతో సర్దుకుని పోవడం నా వల్ల కావటం లేదు. అది శారీరకంగా కష్టమైనది. మానసికంగా మరింత కష్టమైనది. ఇది నా జీవితాంతం ఇలాగే ఉండిపోతుందని అంగీకరించడం నిస్పృహను కలిగిస్తోంది’’ అని రాశారు రష్దీ. 

మెక్రాన్‌ (ఫ్రాన్స్‌ అధ్యక్షుడు), బైడెన్‌ (అమెరికా అధ్యక్షుడు), ఆఖరికి రష్దీ అంటే ఎప్పుడూ ఇష్టపడని బోరిస్‌ జాన్సన్‌ (ఆ సమయంలో బ్రిటన్‌ ప్రధాని) కూడా రష్దీపై దాడి జరగటం పట్ల భయాన్ని,ఆందోళనను వ్యక్తం చేశారు. ‘‘అతని పోరాటం మా పోరాటం’’ అని మెక్రాన్‌ ప్రముఖంగా ప్రకటించారు. కానీ రష్దీ జన్మించిన దేశంలో, తన జన్మభూమి అని రష్దీ చెప్పుకునే దేశంలో మౌనమే అధికారిక ప్రకటన అయింది. ‘‘నను గన్న నా భారతదేశానికి, నాకు లోతైన ప్రేరణ అయిన భారతదేశానికి ఆ రోజున మాటలే దొరకలేదు’’ అన్నారు రష్దీ.  ఎంత సిగ్గుచేటు!


కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement
Advertisement