salman rushdie
-
హింసకు కళాత్మక ప్రతీకారం!
న్యూయార్క్‌లోని చౌటక్వా ఇన్స్టిట్యూషన్లో రెండేళ్ల క్రితం ఆగస్టు 12న ఉపన్యాసం ఇచ్చేందుకు సిద్ధమౌతున్న భారత సంతతి రచయిత సల్మాన్ రష్దీ అతి పాశవికంగా పదిహేను కత్తిపోట్లకు గురయ్యారు. చావు తప్పి కన్ను పోగొట్టుకున్న ఆ ప్రాణాపాయం నుండి మెల్లగా కోలుకుంటున్న స్థితిలో ఉన్న రష్దీ... నాటి ఘటనపై తాజాగా ‘నైఫ్: మెడిటేషన్స్ ఆఫ్టర్ యాన్ అటెంప్టెడ్ మర్డర్’ పుస్తకం రాశారు. భయంకరమైన ఆ దాడి గురించి ఈ పుస్తకంలో సల్మాన్ రష్దీ నేరుగా పాఠకులతో సంభాషించారు. నేటికీ వెంటాడుతున్న తన బాధను, అంతఃసంఘర్షణలను బహిర్గతం చేస్తూ... నెమ్మదిగానే అయినా ఆత్మవిశ్వాసంతో తనెలా కోలుకున్నదీ హృద్యంగా వివరించారు. అదొక గొప్ప మానవీయ పద స్వరీకరణ.మునుపటి తన కళాఖండాల మాదిరిగా కాకుండా, తన తాజా పుస్తకం ‘నైఫ్: మెడిటే షన్స్ ఆఫ్టర్ యాన్ అటెంప్టెడ్ మర్డర్’లో... దాదాపుగా తనను చంపి నంత పని చేసిన ఆనాటి భయంకరమైన దాడి గురించి సల్మాన్ రష్దీ నేరుగా పాఠకులతో సంభాషించారు. సన్నిహితంగా, నిజాయితీగా, ఒప్పించే ప్రయత్నంలో విశ్వాసాన్ని చొరగొనే విధంగా, తన అనిశ్చిత స్థితిని పంచుకుంటూ, తన బాధను, అంతఃసంఘర్షణలను బహిర్గతం చేస్తూ, నెమ్మదిగానే అయినా ఆత్మవిశ్వాసంతో నిలకడైన ప్రయాణంగా తనెలా కోలుకున్నదీ చక్కగా వివరించారు. అదొక గొప్ప మానవీయ పద స్వరీకరణ. పూర్తిగా వ్యక్తిగతమైనది. రష్దీ కంటే సల్మాన్‌గానే ఆయన ఎక్కువగా మాట్లాడారని చెప్పొచ్చు. ఆయన తన పైన జరిగిన దాడి(2022) గురించి రాస్తారని నాకు కచ్చితంగా తెలుసు. అయినా ఒక నవలా రచయిత రాయకుండా ఎలా ఉండగలరు? నాకెప్పుడో తెలుసు అని నేను అనడం ఒక పాఠకుడి అంచనాగా మాత్రమే. దాడి ప్రభావాన్ని తనెలా మానసికంగా తట్టుకుని నిలబడ్డారన్న దానిపై పుస్తకంలో రష్దీ చేసిన విశదీకరణ ఆయన ప్రయత్నబలం ఎంత పటిష్టమైనదో చెబుతోంది. ‘‘జరిగిన దానిని అర్థం చేసుకునేందుకు, దానిని అధిగమించేందుకు, నాదిగా అలవాటు చెందేందుకు, ఒక బాధితుడిగా మాత్రమే ఉండటాన్ని నిరాకరించేందుకు నేను ఎంచుకున్న మార్గం ఈ రాయటం అన్నది కావచ్చు. హింసకు నేను చెప్పే సమాధానం కళ ’’ అంటారు రష్దీ.ఈ పుస్తకం రష్దీ ప్రతిస్పందన అయితే, పుస్తకపు శీర్షిక రష్దీ ఉద్దేశపూర్వకమైన ఎంపిక. అతి దారుణంగా ఆయనపై కత్తిపోట్ల దాడి జరిగింది. కత్తి అన్నది తుపాకీకి చాలా భిన్నమైనది. ‘‘కత్తిపోటు ఒక విధమైన హత్తుకోలు. మనిషికి దగ్గరగా వచ్చి పొడిచే ఆయుధం. కత్తిపోట్లు అతి సమీప నేరాలు’’ అంటారు రష్దీ. అయితే కత్తి ఒక ఉపకరణం కూడా. ఉపయోగించే దాన్ని బట్టి ఆయుధమో, సాధనమో అవుతుంది. ఆ కోణంలో చూస్తే భాష కూడా పదునైన కత్తి వంటిదే. ‘‘భాషే నా కత్తి’’ అని చెబుతారాయన. ‘‘నేనొకవేళ అనుకోకుండా ఒక అవాంఛనీయమైన కత్తి పోరాటంలో చిక్కుకున్నట్లయితే, ఎదురుదాడికి నేను తిప్పే కత్తి బహుశా నా భాషే కావచ్చు. నా ప్రపంచాన్ని నేను పునర్నిర్మించుకోటానికి, తిరిగి నా అధీనంలోకి తెచ్చు కోటానికి నేను వాడే పరికరం అదే కావచ్చు’’ అంటారు.దాడి గురించి రష్దీ వర్ణన సూక్ష్మ సునిశితంగా, వెన్నులో వణుకు పుట్టించేలా, ఆ ఘటనను అదే రీతిలో తిరిగి చూపించినట్లుగా ఉంది. ‘‘నేను ఇప్పటికీ ఆ క్షణాన్ని నెమ్మదిగా కదిలే దృశ్యంలా చూడగలను. అతడు ప్రేక్షకుల నుంచి ఒక్క ఉదుటున దుమికి పరుగున నన్ను సమీపిస్తున్న ప్పుడు నా కళ్లు అతడిని అనుసరించాయి. దూకు డుగా పడుతున్న అతడి ప్రతి అడుగును నేను గమనిస్తున్నాను. చప్పున నేను నా కాళ్లపై లేవటం నాకు తెలుస్తూ ఉండగా అతడి వైపు తిరిగాను. ఆత్మరక్షణగా నా ఎడమ చేతిని పైకి లేపాను. ఆ చేతిపై అతడు తన కత్తిని దిగపొడిచాడు.’’ బాధితుడిలా కాకుండా, జరుగుతున్న దానిని బయటి నుంచి చూస్తున్న వ్యక్తిగా... ‘‘అతడు చాలా పాశవికంగా పోట్లు పొడు స్తున్నాడు. పొడు స్తున్నాడు, కత్తిని నాపై తిప్పుతున్నాడు. కత్తి దాని కదే ప్రాణం కలిగి ఉన్నట్లుగా నాపై విరుచుకుపడింది’’ అని రష్దీ రాశారు. రష్దీ స్పృహ కోల్పోయినట్లు లేదు. జరుగుతున్న దాడి ఎలాంటిదో తెలుస్తూనే ఉన్న దిగ్భ్రాంత స్థితిలో ఆయన ఉన్నారు. ‘‘నేలపై పడి ఉన్న నేను నా శరీరం నుంచి కారుతున్న రక్తపు మడుగును చూస్తూ ఉండటం నాకు గుర్తుంది. చాలా రక్తం. అప్పుడు నాకు అనిపించింది: ‘నేను చనిపోతున్నాను’ అని. కానీ అదేమీ నాకు భయం కలిగించ లేదు. ఊహించనిది జరుగబోతున్నట్లుగానూ లేదు. బహుశా అలా జరిగే అవకాశం ఉంది అనుకున్నాను. జరగవలసిందే జరిగిపోతున్న దనే ఆలోచన.’’ ఆ సమయంలో రష్దీ గ్రహించని విషయం ఏంటంటే, బతికి బట్టకట్టాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ‘‘నా క్రెడిట్ కార్డులు ఈ జేబులో ఉన్నాయి. ఇంటి తాళాలు మరో జేబులో ఉన్నాయి’’ అని, ఆ స్థితితో ఎవరైతే తన పట్ల శ్రద్ధ వహిస్తున్నారో వారితో అస్పష్టంగా చెబుతున్నారు. ‘‘ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే, నా బొంగురు గొంతు దైనందిన వస్తువుల గురించి పట్టింపుతో ఉందంటే, నేననుకోవటం నా దేహంలోని ఒక భాగం – లోలోపలి పోరాడే భాగం – చనిపోయేందుకు సిద్ధంగా ఏమీ లేదని; ఆ క్రెడిట్ కార్డులు, ఇంటి తాళాలు మళ్లీ ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఉందని, ‘బతుకు, బతుకు’ అని నాతో గుసగుసలాడుతోందని’’అంటారు రష్దీ. ఆయన శరీరంపై పదిహేను కత్తిపోట్లు పడ్డాయి. మెడ, కుడి కన్ను, ఎడమ చెయ్యి, కాలేయం, పొత్తి కడుపు, నుదురు, చెంపలు, నోరు, ఇంకా... తల నుంచి కింది భాగమంతటా. ‘బీబీసీ’ ప్రతినిధి ఎలాన్ యెన్తోబ్‌తో మాట్లాడుతూ, మెత్తగా ఉడికించిన గుడ్డును తన పైచెంప మీద ఉంచినట్లుగా తన కుడికన్నుకు అనిపించిందని రష్దీ అన్నారు. ఆ కన్ను పోవటం అనే తీవ్రమైన కలత గురించి పుస్తకంలో ఆయన మనోభావనతో కాక ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడారు. ‘‘ఇప్పుడు కూడా, ఇది రాస్తున్నప్పుడు ఈ నష్టంతో సర్దుకుని పోవడం నా వల్ల కావటం లేదు. అది శారీరకంగా కష్టమైనది. మానసికంగా మరింత కష్టమైనది. ఇది నా జీవితాంతం ఇలాగే ఉండిపోతుందని అంగీకరించడం నిస్పృహను కలిగిస్తోంది’’ అని రాశారు రష్దీ. మెక్రాన్ (ఫ్రాన్స్ అధ్యక్షుడు), బైడెన్ (అమెరికా అధ్యక్షుడు), ఆఖరికి రష్దీ అంటే ఎప్పుడూ ఇష్టపడని బోరిస్ జాన్సన్ (ఆ సమయంలో బ్రిటన్ ప్రధాని) కూడా రష్దీపై దాడి జరగటం పట్ల భయాన్ని,ఆందోళనను వ్యక్తం చేశారు. ‘‘అతని పోరాటం మా పోరాటం’’ అని మెక్రాన్ ప్రముఖంగా ప్రకటించారు. కానీ రష్దీ జన్మించిన దేశంలో, తన జన్మభూమి అని రష్దీ చెప్పుకునే దేశంలో మౌనమే అధికారిక ప్రకటన అయింది. ‘‘నను గన్న నా భారతదేశానికి, నాకు లోతైన ప్రేరణ అయిన భారతదేశానికి ఆ రోజున మాటలే దొరకలేదు’’ అన్నారు రష్దీ. ఎంత సిగ్గుచేటు!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Salman Rushdie: కత్తిపోట్ల నుంచి కలం ఈవెంట్ దాకా..
భారత మూలాలున్న వివాదస్పద రచయిత, బుకర్ బహుమతి విజేత సల్మాన్ రష్దీ చాన్నాళ్ల తర్వాత బహిరంగంగా కనిపించాడు. గత ఏడాది ఆగస్టులో అనూహ్యంగా ఓ వ్యక్తి చేతిలో దాడికి గురైన సల్మాన్ రష్డీ ఇప్పుడు ప్రాణాలతో బతికి ఉండడం నిజంగా వైద్య పరంగా గొప్ప విషయమే. అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన PEN America పెన్ అమెరికా ఈవెంట్ కు రష్డీ హాజరయ్యారు. అందరికీ ధన్యవాదాలు, మీ అందరినీ మళ్లీ కలుసుకున్నందుకు సంతోషమన్నారు. ప్రపంచమనే ఈ పుస్తకంలో మానవ హక్కుల కోసం ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుందన్నారు రష్డీ. తనను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని, కత్తిపోట్లకు గురయిన తనను కాపాడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. Salman Rushdie made a surprise appearance at PEN America’s annual gala on Thursday night. It was his first public appearance since he was stabbed and gravely wounded in an attack last August at a literary event in Western New York. https://t.co/EVtnvVrTXF pic.twitter.com/uN0p414O43 — The New York Times (@nytimes) May 19, 2023 ► సల్మాన్ రష్టీపై దాడికి పాల్పడిన వ్యక్తిని.. న్యూజెర్సీకి చెందిన హదీ మటర్ అనే వ్యక్తిగా గుర్తించారు. ► 1988లో సల్మాన్ రష్టీ రాసిన ది సాటానిక్ వెర్సెస్ తీవ్ర దుమారం రేపింది. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ సైతం ఆ నవలను నిషేధించారు. ► ముంబైలో పుట్టిన సల్మాన్ రష్టీ.. ప్రతిష్టాత్మక బుక్ ప్రైజ్‌ను గెల్చుకున్నారు. అదే సమయంలో.. ‘ది సాటానిక్ వెర్సెస్’నవల ద్వారా ఊహించని రేంజ్లో వివాదాన్ని, విమర్శలను మూటగట్టుకున్నారు. ► సల్మాన్ రష్డీ.. 1947 ముంబైలో కశ్మీరీ ముస్లిం కుటుంబంలో జన్మించారు. రాడికల్ రాతలతో అజ్ఞాతంలోనే ఎక్కువగా గడిపారు ఈయన. ఆ టైంలో జోసెఫ్ ఆంటోన్ అనే కలం పేరుతో ఆయన రచనలు సాగాయి. ► 1975 నుంచి 2019 దాకా మొత్తం 14 నవలలు రాశారు ఆయన. ► మిడ్నైట్ చిల్డ్రన్కు బుక్ ప్రైజ్ గెల్చుకోవడంతోపాటు ఇప్పటిదాకా ఐదుసార్లు బుకర్కు నామినేట్ అయ్యారు. ► 2007లో సాహిత్యంలో సేవలకు బ్రిటిష్ ప్రభుత్వం నైట్‌హుడ్ గౌరవం ఇచ్చింది. ► 1988, సెప్టెంబర్‌లో ది సాటానిక్ వెర్సెస్ నవల పబ్లిష్ అయ్యింది. ఈ నవలలోని అంశం ఇస్లాం మతానికి వ్యతిరేకం. రష్డీ తనను తాను ముస్లిమేతరుడిగా, నాస్తికుడిగా అభివర్ణించుకున్నాడు. ఇస్లామిక్ ఛాందసవాదులు సల్మాన్ రష్దీ రాతల్ని చూసి రగిలిపోయారు. అది వివాదం కావడంతో.. ప్రాణభయంతో తొమ్మిదేళ్లపాటు ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారు. 76 ఏళ్ల వయసున్న రష్డీ.. తన రెండో నవల మిడ్నైట్స్ చిల్డ్రన్(1981) ద్వారా బుకర్ ప్రైజ్‌ను సాధించి.. ఆ ఘనత అందుకున్న తొలి భారతీయ పౌరుడిగా ఘనత దక్కించుకున్నారు. -
మన నిశ్శబ్దం చేసిన గాయం
సల్మాన్ రష్దీపై తీవ్రమైన దాడిపై మన రాజకీయనాయకులు చాలామంది నిశ్శబ్దంగా ఉండటం చూసి కలవరపడ్డాను, దిగులు పడ్డాను. 1988లో ‘శాటానిక్ వర్సెస్’ నవలను నిషేధించిన ఏకైక అతి పెద్ద ప్రజాస్వామ్యం మనదే. ఆ పుస్తకాన్ని చదవకుండానే మనం దాన్ని నిషేధించేశాము. 34 సంవత్సరాల తర్వాత రష్దీపై జరిగిన దాడిని ఖండించని ఏకైక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా మనదే. ఎందుకు అనేది నాకు నిజంగానే అర్థం కావడం లేదు. సల్మాన్ రష్దీ భారతదేశంలో జన్మించారు. ఆయన పౌరసత్వం మారి ఉండవచ్చు కానీ, ఈ దేశంతో తన ఉనికిని ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. 2000 సంవత్సరంలో ‘బీబీసీ హార్డ్‌టాక్ ఇండియా’ కోసం ఆయనతో చేసిన ఇంటర్వ్యూలో ‘‘ఈ దేశం ఇప్పటికీ మీ ఇల్లేనా?’’ అని ప్రశ్నించాను. దానికి ఆయన సమాధానం ఏమిటో తెలుసా? ‘‘ఏ దేశంలో మీరు పుట్టారో, పిల్లవాడిగా మీరు ఏ దేశంలో పెరిగారో అది ఎప్పటికీ మీ ఇంటిలాగే ఉంటుంది. ఏ ఇతర ప్రదేశంలోనూ మీరు అలాంటి అనుభూతి చెందలేరు. నా పుస్తకాలు చదివిన ఎవరైనా సరే, ఈ దేశాన్ని ఇల్లు అని పిలవడంలో నా ఊహాస్థాయిని తెలుసుకునే ఉంటారు.’’ నా తదుపరి ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం మరింత ఆసక్తికరంగా ఉండింది. ‘‘సల్మాన్ రష్దీ భారతీయుడా లేక ఆంగ్లేయుడా లేక పాకిస్తానీయుడా? ఏ ఉనికిని మీరు అంగీకరిస్తారు?’’ అని అడిగాను. ఈ ప్రశ్నకు ఆయన సమాధానం క్లుప్తంగా, నిక్కచ్చిగా ఉండటమే కాదు, అది సరళం కూడా. ‘‘ఓహ్ పాకిస్తానీ మాత్రం కాదు,’’ అంటూ తర్వాత ఆయన నవ్విన నవ్వు వెక్కిరిస్తున్నట్లుగా ధ్వనించింది. పాకిస్తానీగా ఉండటం అనే ఆలోచనే ఆయనకు హాస్యాస్పదంగా తోచింది. మరి మన ప్రముఖ రాజకీయ నేతల నుంచి ఆయనపై దాడిపట్ల ఖండనకు సంబంధించిన వ్యక్తీకరణ బహిరంగంగా ఎందుకు రాలేదు? అక్కడ జరిగినదానిపై వారు ఎందుకు ఆగ్రహం ప్రదర్శించలేదు? కనీసం ఆయన కోలుకోవాలని సానుభూతి ప్రకటించడానికి కూడా వీరు ఎందుకు ఇష్టపడలేదు? అసలెందుకు వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు? నిస్సందేహంగా వేళ్ల మీద లెక్కబెట్టినంతమంది మాట్లాడారు. బహిరంగంగా ఆ దాడి గురించి మాట్లాడిన ఏకైక పార్టీ నేత సీతారాం ఏచూరి. మిగతావారికి దాని గురించి మాట్లాడటానికి ఏమీ ఉన్నట్టు లేదు. ప్రధాని నరేంద్రమోదీ, ఆయన మొత్తం మంత్రి మండలి మాత్రమే కాదు... సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, ఎంకే స్టాలిన్, నితీశ్ కుమార్, కోనార్డ్ సంగ్మా, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా... రష్దీపై దాడి గురించి విన్నప్పుడు వీరిలో ఏ ఒక్కరూ దానిగురించి నిజంగానే అనుభూతి చెందలేకపోయారా? లేదా రాజకీయాలు లేక ముస్లిం ఓటర్లను గాయపరుస్తామనే భయానికి గురయ్యారా లేక ఇరాన్ ప్రభుత్వానికి ఇబ్బంది కలగకూడదనే విషయం మౌనం పాటించేలా చేసిందా? పూర్తి వాస్తవం ఏమిటంటే, ఈ విషయం మీద మన విదేశీ వ్యవహారాల మంత్రి మాట్లాడారు. కానీ ఆయన చెప్పింది ఏమిటో పరిశీలించినప్పుడు, దానికంటే నిశ్శబ్దంగా ఉండటమే ఉత్తమమని అనిపిస్తుంది. బెంగళూరులో జరిగిన పత్రికా సమావేశంలో ఒక ప్రశ్నకు స్పందిస్తూ జై శంకర్ ఇలా అన్నారు: ‘‘నేను కూడా దాని గురించి చదివాను. మొత్తం ప్రపంచమే దాన్ని గమనించింది. మొత్తం ప్రపంచమే అలాంటి దాడి పట్ల స్పందించింది.’’ మొత్తం ప్రపంచం స్పందించింది కానీ మన విదేశీ వ్యవహారాల మంత్రి మాత్రం కాదు. ఆ దాడి పట్ల ఆయనది స్పందన కాదు. కచ్చితంగా ఆ దాడి గురించిన ఖండన కాదు. కేవలం ఆ దాడి గురించి తనకు తెలుసు అని మాత్రమే చెప్పారాయన. రష్దీ అతి గొప్ప రచయిత కావచ్చు. భారత సంతతి రచయితగా అందరికీ తెలిసిన, చాలామంది చదవగలగిన రచయితగా ఉండొచ్చు. కానీ ఆయనకు మనం మద్దతు తెలుపడానికి అంగీకరించలేకపోయాం. ఈలోగా తక్కిన ప్రపంచం ఆయన్ను కౌగలించుకుంది, తమవాడిని చేసుకుంది. ‘‘ఆయన పోరాటం మా పోరాటం’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ చెప్పారు. ‘‘గతంలో కంటే మిన్నగా మేం ఆయన పక్షాన నిలబడతాం’’ అన్నారు. కాబట్టి నిక్కచ్చిగా నన్ను ప్రశ్నించనివ్వండి. మనం ఎవరివైపు నిలబడుతున్నాం? ఈ విషయాన్ని మరింత స్పష్టంగా ప్రకటించాల్సిన సందర్భాలు తారసపడతాయి. ఇలాంటి సందర్భంలో ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన ప్రతిష్ఠను దెబ్బతీస్తాయి కూడా. మనవాడు అని గర్వంగా చెప్పుకోగలిగిన వ్యక్తిపై దాడి జరిగినప్పుడు, మనం ఆయన గురించి ఎందుకు ఏమీ చెప్పలేకపోయాం? ప్రవాస భారతీయుల పట్ల మన వైఖరి గురించి ఇది ఏమని సూచిస్తోంది? సల్మాన్ రష్దీ మన ఉజ్జ్వల తారల్లో ఒకరు కాదా? లేక ఆయన పుట్టిపెరిగిన విశ్వాసమే ఇక్కడ సమస్యాత్మకంగా ఉంటోందా? (నిజానికి ఆ విశ్వాసాన్ని ఆయన పాటించడం లేదు). (క్లిక్: ఇండియాపై పందెం కాసిన సాహసవంతుడు) రష్దీ గతంలో చెప్పిన చివరి మాటను ప్రస్తావించనివ్వండి. భారత్ తనను తిరస్కరించినట్లు రష్దీ భావిస్తున్నారా అని నేను బీబీసీ ఇంటర్వ్యూలో అడిగాను. ఎందుకంటే భారత్ అనేక సంవత్సరాలుగా ఆయనకు వీసాను నిరాకరించింది. ‘‘అవును, నేను అలా భావించాను’’ అని రష్దీ సమాధానం ఇచ్చారు. ‘‘చాలా గాయపడిన భావన కలిగింది. భారత్‌కు దూరంగా ఉండటం అప్పటి సంవత్సరాల్లో చాలా బాధాకరమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నేను భావించాను. నేను భారత్‌కు తిరిగి రావడాన్ని ప్రేమించాను. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే వాడిని’’ అన్నారు. కానీ బహుశా ఇప్పుడు మన నిశ్శబ్దం ఆయన పాతగాయానికి జత కలిసివుంటుంది. (క్లిక్: ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!) - కరణ్ థాపర్ సీనియర్ పాత్రికేయులు -
రష్దీ జీవించి ఉండడం ఆశ్చర్యమే
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో భారత రచయిత సల్మాన్ రష్దీని కత్తితో పొడిచాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు హదీ మతార్ తన దాడి వెనుక ఎవరి ప్రమేయం లేదని చెప్పాడు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపాడు. రష్దీ చిత్తశుద్ధి లేని వ్యక్తి అని అందుకే అతనంటే తనకి నచ్చడని చెప్పాడు. తనంతట తానుగానే రష్దీని పొడిచానని వెల్లడించాడు. జైలు నుంచే న్యూయార్క్ పోస్ట్ వార్తాసంస్థకు వీడియో ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చాడు. రష్దీ ఇంకా ప్రాణాలతో ఉన్నారన్న విషయం తెలియగానే తాను చాలా ఆశ్చర్యపోయానని చెప్పాడు. రష్డీకి మెడపై 3 కత్తి పోట్లు, కడుపులో నాలుగుసార్లు, కుడి కన్ను, ఛాతీ, కుడి తొడపై కత్తి పోట్లు ఉన్నాయని ఆయనకి చికిత్స చేస్తున్న వైద్యులు వెల్లడించారు. రష్దీ రాసిన నవల ‘ది సటానిక్ వెర్సస్’లో తాను కొన్ని పేజీలే చదివానని, అంతా చదవలేదన్నారు. రష్దీపై ఫత్వా జారీ చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమైనీ ఆదేశంతో ఈ దారుణానికి పాల్పడ్డావా? అన్న ప్రశ్నకు మతార్ సమాధానం ఇవ్వలేదు. అయతొల్లా అంటే తనకు గౌరవం ఉందని చెప్పాడు. -
ఈ దాడి అమానుషం
దాదాపు మూడున్నర దశాబ్దాలు గడిచినా ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ కంఠాన్ని ఒక కత్తి క్రోధంతో, కోపంతో గురిచూస్తూనే ఉన్నదని, ఇన్నాళ్లుగా అది అనువైన సమయం కోసం నిరీక్షిం చిందని అమెరికాలోని న్యూజెర్సీలో ఆయనపై జరిగిన హంతక దాడి రుజువు చేసింది. ఈ దాడిలో సల్మాన్ రష్దీ తీవ్రంగా గాయపడ్డారు. ఒక కన్ను పూర్తిగా దెబ్బతిన్నదని, కాలేయానికి కూడా తీవ్ర గాయమైందని, అయితే ఆయన ప్రాణానికొచ్చిన ముప్పేమీ లేదని వైద్యులు ప్రకటించటం ఊరటనిస్తుంది. ‘శాటానిక్ వర్సెస్’ నవలలో పాత్రల చేత పలికించిన సంభాషణలు రష్దీ ప్రాణం మీదకు తెచ్చాయి. ఆ నవలలో ఇస్లాం మతాన్నీ, ఆ మత ప్రవక్తనూ కించపరిచారన్నది రష్దీపై ఉన్న ప్రధాన అభియోగం. అయితే మొత్తం ఇతివృత్తాన్ని చదవకుండానే ఆ నవలపై దురభిప్రాయాన్ని ఏర్పరచుకొని ఇరాన్‌లోని మతాచార్యుడొకరు ఫత్వా జారీ చేశారని, పాకిస్తాన్ మత గురువుల అభిప్రాయమే దానికి ప్రాతిపదికని అమెరికాలో స్థిరపడిన ఇరాన్‌కి చెందిన రమితా నవాయ్ అనే మహిళ ఇటీవల ట్వీట్ చేసింది. ఆ ఫత్వాను వెనక్కు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారన్నది ఆ మహిళ కథనం. అందులో నిజానిజాల మాటెలా ఉన్నా ఒక సృజనాత్మక రచన రచయితకు ప్రాణాంతకం కావడం సభ్యసమాజం జీర్ణించుకోలేనిది. సమాజాన్ని ఉన్నతీకరిం చేందుకు కృషి చేసే కవులు, రచయితలు, కళాకారులు ప్రపంచ దేశాలన్నిటా ఈనాటికీ మృత్యు నీడలో, నిర్బంధాల్లో బతుకీడ్చే దుఃస్థితి ఉండటం దారుణాతి దారుణం. దక్షిణాసియాలోని భారత్ 75 ఏళ్ల క్రితం స్వాతంత్య్రాన్ని సాధించిన సందర్భంలో జరిగిన దేశ విభజన హిందూ, ముస్లింల మధ్య ఎంతటి విద్వేషాగ్నులను రగిల్చిందో... లక్షలాదిమంది ప్రాణాలు తీసి, కోట్లాదిమందిని ఎలా నిరాశ్రయులను చేసిందో తన ‘మిడ్నైట్ చిల్డ్రన్’ నవల ద్వారా రష్దీ కళ్లకు కట్టారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా జరుపుకోవడానికి కొన్ని గంటల ముందు రష్దీపై దాడి జరగడం యాదృచ్ఛికమే అయినా... దశాబ్దాలు గడిచేకొద్దీ మతోన్మాదం, విద్వేషం ఖండాంతరాలు దాటి కార్చిచ్చులా వ్యాపిస్తున్న వైనాన్ని ఈ ఉదంతం బయటపెట్టింది. 1988లో ‘శాటానిక్ వర్సెస్’ నవల బయటి కొచ్చాక రష్దీని హతమార్చినవారికి 30 లక్షల డాలర్లు బహుమతిగా ఇస్తామని ఇరాన్ మతాచార్యుడు ప్రకటించాడు. దానికి ఆనాటి ఇరాన్ ప్రధాన మతాచార్యుడు ఆయతుల్లా ఖొమైనీ కూడా మద్దతు నిచ్చారు. దాంతో ఆయన అజ్ఞాతవాసంలోకి పోవాల్సివచ్చింది. తొమ్మిదేళ్ల అజ్ఞాతం రచయితగా రష్దీని కుంగదీసింది. ఆ తర్వాత బయట సంచరిస్తున్నా కట్టుదిట్టమైన భద్రత తప్పలేదు. ఎన్నో సందర్భాల్లో దీనిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పలుమార్లు మన దేశాన్ని కూడా సందర్శించారు. అయితే జైపూర్ సాహిత్యోత్సవానికి ఆయన్ను ఆహ్వానించిన నిర్వాహకులు అటు తర్వాత మతోన్మాదుల బెదిరింపుతో వెనక్కి తగ్గడం రష్దీని బాధించింది. ఇస్లాం మత రిపబ్లిక్ అయిన పాకిస్తాన్లో కూడా ఇంతటి అవమానం తనకు జరగలేదని ఆయనొక సందర్భంలో అన్నారు. ఈ ఫత్వా తన ప్రతిష్ఠను దెబ్బతీసిందని గ్రహించిన ఇరాన్ ప్రభుత్వం ఇకపై ఫత్వాకు తమ మద్దతు ఉండబోదని ప్రకటించినా, నజరానా మొత్తాన్ని ఒక మత సంస్థ పెంచిందని ప్రభుత్వ అనుకూల మీడియా 2016లో ప్రకటించటం గమనించదగ్గది. సృజనాత్మక రచన లు సహా భిన్న కళారూపాలు దేశదేశాల్లో ఎలా దాడులకు గురవుతున్నాయో, వాటి రూపకర్తలను ఎంతగా వేధిస్తున్నారో నిత్యం తెలుస్తూనే ఉంది. రష్దీపై ఫత్వాకు ఎన్నో దశాబ్దాల ముందు నుంచీ ఈ రకమైన వేధింపులు ఉనికిలో ఉన్నాయి. అయితే ‘శాటానిక్ వర్సెస్’ వెలువడిన అనంతర కాలంలో వరుసగా ఇస్లాం మతానుకూల దేశాలపై పాశ్చాత్య దేశాలు విరుచుకుపడిన తీరు కారణంగా ఇస్లామిక్ దేశాల ప్రజానీకంలో రష్దీపై ద్వేషం మరింత పెరిగింది. రష్దీ రచన కూడా పాశ్చాత్య ప్రపంచం సాగిస్తున్న దాడుల్లో భాగమని వారు విశ్వసించారు. ముస్లింలు అధికంగా నివసించే బోస్నియా–హెర్జ్‌గోవినా రిపబ్లిక్లో క్రైస్తవులు, ముస్లింల మధ్య ఘర్షణలు, ‘నాటో’ జోక్యం, ఆ తర్వాత అమెరికా నాయకత్వాన సంకీర్ణ దళాలు ఇరాక్‌పై సాగించిన దురాక్రమణ, అఫ్ఘానిస్తాన్ దురాక్రమణ వగైరాలు సరేసరి. మనోభావాలు దెబ్బతినడం, తమ విశ్వాసాలపై దాడి జరిగిందనుకోవడం వర్తమానంలో ఏ ఒక్క దేశానికో, మతానికో పరిమితమై లేదు. మన దేశంలో ఈ జాడ్యం కులాలకు కూడా అంటింది. ఏదో సాకుతో భిన్న కళారూపాలను నిషేధించాలంటూ ఆందోళనలకు పూనుకోవడం రివాజుగా మారింది. ‘జై భీమ్’ చిత్రంపై వన్నియర్ కులస్థులు అభ్యంతరం చెబుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ ఇటీవల మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు తలమానికమైనది. హిందూ మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ కలబుర్గి, గోవింద్ పన్సారే, గౌరీ లంకేశ్, దాభోల్కర్లను ఉన్మాదులు కాల్చిచంపడం, ఏళ్లు గడిచినా కారకులైనవారికి ఇప్పటికీ శిక్షపడకపోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. మన దేశంలో భీమా–కోరెగావ్ కేసులో రెండున్నరేళ్లుగా అనేకమంది రచయితలు, మేధావులు జైళ్లలో మగ్గటం వర్తమాన విషాదం. సృజనాత్మక ప్రపంచంలో రూపొందే ఏ కళారూపం బాగోగులనైనా లోతుగా చర్చించటం, భిన్నాభిప్రాయాలను గౌరవించటం నాగరీక సమాజాల మౌలిక లక్షణంగా ఉండాలి. ప్రాణాలు తీయటం, నిర్బంధాలు, నిషేధాలు విధించటం అమానుషం, అనైతికం. -
సల్మాన్ రష్డీ దాడిపై మౌనం వీడిన ఇరాన్
టెహ్రాన్: బుకర్ ప్రైజ్ రచయిత, భారత సంతతికి చెందిన సల్మాన్ రష్డీ దాడిపై ఇరాన్ మౌనం వీడింది. దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉందంటూ దాడి జరిగినప్పటికీ నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే దాడి విషయంలో తమను నిందిచడంపై ఇరాన్ తీవ్ర అసహనం వెల్లగక్కింది. ఈ దాడి విషయంలో నిందించాల్సింది.. సల్మాన్ రష్డీ, ఆయన మద్దతుదారులనేనని ఇరాన్ విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాక్ స్వాతంత్ర్యం అనేది.. తన రచనలో ఒక మతానికి వ్యతిరేకంగా రష్దీ చేసిన అవమానాలను ఎంత మాత్రం సమర్థించదు అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నాజర్ కన్నాని తెలిపారు. ఇస్లామిక్ పవిత్రతలను అవమానించడం ద్వారా ఆయన కోట్ల మంది ఉన్న ఇస్లాం సమాజం నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దాడికి ఆయన్ని, ఆయన అనుచరులను తప్ప ఎవరినీ నిందించలేం. అంతేగానీ.. ఈ దాడి విషయంలో అసలు ఇరాన్‌ను నిందించే హక్కు ఎవరికీ లేదు. అది మాకు సంబంధంలేని విషయం అని నాజర్ కన్నాని తెలిపారు. ‘నిందితుడిని పొగుడుతూ వెలువడ్డ కథనాలు, సోషల్ మీడియా సంబురాల’ గురించి మీడియా నుంచి ప్రశ్న ఎదురుకాగా.. ఆ కథనాలు ప్రధానంగా ప్రచురితం అయ్యింది మాజీ అధ్యక్షుడు అయతొల్లా రుహోల్లాహ్కు చెందిన పత్రికల్లోనే అని, ఇక సోషల్ మీడియాలో ప్రజాభిప్రాయాలను తప్పుబట్టడం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు. సల్మాన్ రష్డీపై దాడికి పాల్పడ్డ నిందితుడు హాది మతార్ గురించి మీడియాలో చూడడమే తప్ప.. అతని గురించి తమకెలాంటి సమాచారం లేదని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానాలు ఉన్నాయి. 1998లో పబ్లిష్ అయిన ది సాటానిక్ వెర్సెస్.. ఇస్లాంకు వ్యతిరేకంగా ఉండడం, ఆ నిషేధిత నవలపై ఆగ్రహం వెల్లగక్కిన అప్పటి ఇరాన్ అధినేత అయతొల్లా రుహోల్లాహ్ ఖోమెయిని.. ఒక ఫత్వా జారీ చేశారు. రష్డీని చంపిన వాళ్లకు భారీ రివార్డు ప్రకటించారు. ఆ భయంతో దాదాపు చాలా ఏళ్లు సల్మాన్ రష్డీ అజ్ఞాతవాసంలోనే ఉండిపోయారు. శుక్రవారం న్యూయార్క్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు వెళ్లిన ఆయనపై నిందితుడు హాదీ మతార్.. పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కిమ్‌తో దోస్తీకి పుతిన్ తహతహ -
రక్తపు మడుగులో ఆయన్ని చూశాకే.. ఘోరం తెలిసొచ్చింది!
న్యూయార్క్: సుప్రసిద్ధ నవలా రచయిత సల్మాన్ రష్డీపై దాడిని సాహిత్య లోకం జీర్ణించుకోలేకపోతోంది. ఘోరమైన దాడి నుంచి ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని.. అయితే పూర్తిస్థాయి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడేం చెప్పలేమని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు చెప్తున్నారు. ఈ తరుణంలో ప్రత్యక్ష సాక్షి, దాడిలో గాయపడ్డ హెన్రీ రెస్సే.. సల్మాన్ రష్డీపై దాడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. న్యూయార్క్‌లో గత శుక్రవారం ఓ సాహిత్య కార్యక్రమానికి హాజరైన సల్మాన్ రష్డీపై దాడి జరిగింది. ఆయన ప్రసంగానికి సిద్ధమవుతున్న తరుణంలో.. దుండగుడు వేదికపైకి దూకి రష్డీపై విచక్షణా రహితంగా గొంతులో పొడిచి దాడి చేశాడు. ఆ సమయంలో ఆ ఈవెంట్ నిర్వాహకుడు, ఆయన్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్న సిటీ ఆఫ్ అసైలం ఎన్జీవో ప్రెసిడెంట్ హెన్రీ రెస్సే.. సైతం దాడిలో గాయపడి కోలుకున్నారు. ‘అసలు ఆరోజు అక్కడ ఏం జరిగిందో అర్థం కావడానికి కొంచెం సమయం పట్టింది. సల్మాన్ రష్డీకి ప్రాణ హని ఉందన్న చర్చ గత కొన్నేళ్లుగా నడుస్తోంది. ఈ క్రమంలో మమ్మల్ని ఆటపట్టించేందుకు ప్రాంక్‌కు పాల్పడి ఉంటారని భావించాం. ఆ ఘటనను సైతం ప్రాంక్ స్టంట్ ఏమో అనుకున్నాం. కానీ, రక్తపు మడుగులో రష్డీగారిని చూశాకే.. అదొక వాస్తవ ఘటన అని అర్థమైంది. అప్పటికే అక్కడంతా గందరగోళం నెలకొంది. నాపైనా దాడి జరిగింది’ అని రెస్సే గుర్తు చేసుకున్నారు. సల్మాన్ రష్డీపై జరిగింది భౌతిక దాడి మాత్రమే కాదు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సాహిత్య లోకం మీదే జరిగినట్లు లెక్క. దీనిని ముక్తకంఠంతో మేం ఖండిస్తున్నాం. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. 1997లో ఆయన ప్రసంగం చూశాక.. మా ఎన్జీవో ఈవెంట్‌కు ఆయన అర్హుడని భావించాం. ఇన్నాళ్లకు అది కుదిరింది. ఈ లోపే ఈ ఘటన జరగడం బాధాకరం. ఘటన జరిగిన సమయంలో దుండగులు సిబ్బందితో పాటు ఈవెంట్‌కు హాజరైన వాళ్లతో సైతం పెనుగులాడాడు. చివరికి సిబ్బందిని అతన్ని కట్టడి చేయగలిగింది అని రెస్సే తెలిపారు. పెన్సిల్వేనియాలోని ఓ ఆస్పత్రిలో సల్మాన్ రష్డీ చికిత్స పొందుతున్నారు. Full Video- Author Salman Rushdie was stabbed after taking stage at a Chautauqua Institute event.#SalmanRushdie #सलमान_रुश्दी #SarTanSeJuda #Rushdie #Iran #newyork #salmanrushdieattacked #salmanrushdiestabbed #Newyorkpic.twitter.com/6q1YDs6fb0 — Anil Kumar Verma (@AnilKumarVerma_) August 12, 2022 ఇదీ చదవండి: ఈ నవల రక్తాన్ని కళ్ల చూస్తోంది.. ఎందుకో తెలుసా? -
Salman Rushdie: నిలకడగా ఆరోగ్యం.. వెంటిలేటర్ తొలగింపు
న్యూయార్క్: భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్ బహుమతి విజేత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రష్దీకి వాయవ్య పెన్సిల్వేనియాలోని యూపీఎంసీ హ్యమాట్ సర్జరీ సెంటర్ ఆస్పత్రిలో ఇప్పటివరకూ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. తాజాగా సల్మాన్ రష్దీ ఆరోగ్యం కాస్త అదుపులోకి రావడంతో వెంటిలేటర్ తొలగించారు. ప్రస్తుతం రష్దీ మాట్లాడుతున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌ను వైద్యులు తొలగించారని వివరించారు. అమెరికాలోని ఓ వేదిక పై ప్రసంగించడానికి వెళ్లిన సల్మాన్ రష్దీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. సల్మాన్ రష్దీ మెడపై, పొట్టలోనూ పలుమార్లు కత్తితో పొడిచారు. 20 సెకండ్ల వ్యవధిలోనే సుమారు 10 నుంచి 15 సార్లు కత్తి పోట్లకు సల్మాన్ రష్దీ గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బలగాలు నిందితుడిని అరెస్టు చేశాయి. సల్మాన్ రష్దీని వెంటనే చాపర్‌లో హాస్పిటల్‌కు తరలించారు. అత్యవసర చికిత్సలో భాగంగా వైద్యులు నిరంతరం శ్రమించడంతో రష్దీ ఆరోగ్య పరిస్థితి అదుపులోకి రావడమే కాకుండా బెడ్‌పైనే ఆయన జోక్‌లు వేస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. చదవండి: సల్మాన్ రష్డీపై దాడి.. 30 ఏళ్లు భయం గుప్పిట్లోనే! ఆ నవల జోలికి వెళ్లినోళ్లందరికీ ఇదే గతి! -
‘కంగారు పడొద్దు.. తర్వాత నువ్వే’.. నవలా రచయిత్రికి బెదిరింపులు..
లండన్: బ్రిటిష్ నవలా రచయిత్రి జేకే రౌలింగ్(57)కు పాకిస్తాన్‌కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది ట్విట్టర్ వేదికగా చంపుతామంటూ బెదిరించడం కలకలం రేపింది. శుక్రవారం అమెరికాలో సల్మాన్ రష్దీపై హత్యాయత్నం ఘటనపై జేకే రౌలింగ్ విచారం వ్యక్తం చేశారు. ‘తీవ్ర వేదనకు గురయ్యాను. ఆయన క్షేమంగా ఉండాలి’ అని ట్వీట్‌చేశారు. దీనిపై కరాచీకి చెందిన మీర్ ఆసిఫ్ అజీజ్ అనే వ్యక్తి స్పందిస్తూ.. ‘కంగారు పడొద్దు.తర్వాత నువ్వే’ అనే బెదిరింపుతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. జేకే రౌలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త, విద్యార్థిగా తనకు తాను పేర్కొనే ఆసిఫ్ అజీజ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి మద్దతుగా పోస్టులు పెడుతుంటాడని అధికారులు తెలిపారు. ఇతడి దృష్టిలో భారత్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్లు ఉగ్రవాద దేశాలని తెలిపారు. వాటిని ఎలా నాశనం చేయాలనే దానిపై కుళ్లు జోకులు వేస్తుంటాడన్నారు. -
Salman Rushdie: వెంటిలేటర్‌పై రష్దీ.. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం
న్యూయార్క్: భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్ బహుమతి విజేత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ది సతానిక్ వర్సెస్ రచన తర్వాత దశాబ్దాలుగా ఇస్లామిక్ బెదిరింపులను ఎదుర్కొంటున్న రష్దీపై ఓ ఆగంతకుడు అమెరికాలో చర్చావేదికపైనే కత్తితో విచక్షణారహితంగా దాడిచేసిన విషయం విదితమే. రక్తసిక్తమైన రష్దీకి వాయవ్య పెన్సిల్వేనియాలోని యూపీఎంసీ హ్యమాట్ సర్జరీ సెంటర్ ఆస్పత్రి వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 20 సెకన్ల వ్యవధిలో ఆగంతకుడు వెనుక 15 సార్లు కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది. ‘గంటలపాటు ఆయనకు శస్త్రచికిత్స కొనసాగింది. మెడ భాగంలో కత్తిపోట్ల కారణంగా మెడ నుంచి చేతిలోకి వచ్చే నరాలు తెగిపోయాయి. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉంది. పొత్తికడుపుపై కత్తిగాటుతో కాలేయం దెబ్బతింది’ అని సల్మాన్ రష్దీ ప్రతినిధి ఆండ్రూ విలే న్యూయార్క్ టైమ్స్ వార్తాసంస్థతో చెప్పారు. పశ్చిమ న్యూయార్క్‌లోని చౌటాకా ఇన్స్టిట్యూట్లో రష్దీపై దాడి చేసిన వ్యక్తిని 24 ఏళ్ల హదీ మతార్‌గా గుర్తించారు. అతడిపై హత్యాయత్నం, దాడి సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. 150 ఏళ్ల చరిత్రలో తొలి దారుణం ‘150 ఏళ్ల లాభాపేక్షలేని విద్యా సంస్థ చరిత్రలో ఇలా దాడి జరగడం ఇదే తొలిసారి’ అని చౌటౌకా ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు మైఖేల్ హిల్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. సంస్థలో జరిగే కార్యక్రమాలకు భద్రత పెంచాలంటూ గతంలోనే విజ్ఞప్తులు వచ్చాయన్న వార్తలను ఆయన కొట్టేపారేశారు. అయితే, కార్యక్రమ నిర్వాహకులు అక్కడ ఎలాంటి సెక్యూరిటీ సెర్చ్ చేయలేదని, మెటల్ డిటెక్టర్లు లేవని, బ్యాగుల తనిఖీ విధానం లేదని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పడం గమనార్హం. ‘ఇరాన్ నేత అయోతొల్లా హత్య ఆదేశాలిచ్చినా రష్దీ తన స్వేచ్ఛా గళాన్ని వినిపించారు. ఈ కష్టకాలంలో రష్దీ ధైర్యాన్ని, అంకిత భావాన్ని వేనోళ్లా పొగడాల్సిన సమయమిది’ అని కౌంటర్ ఎక్స్‌ట్రీమిజమ్ ప్రాజెక్ట్ సీఈవో మార్క్ వ్యాఖ్యానించారు. ఉగ్రసంస్థల ఆర్థికమూలాలను దెబ్బతీయాలంటూ కౌంటర్ ఎక్స్‌ట్రీమిజమ్ ప్రాజెక్ట్ అనే లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థ పనిచేస్తోంది. దాడిపై ఇరాన్ మౌనం రష్దీని చంపాలంటూ దాదాపు దశాబ్దం క్రితం దేశ సుప్రీం లీడర్ అయోతొల్లా ఇచ్చిన ఫత్వాను ఇన్నాళ్లకు ఓ ఆగంతకుడు అమలుకు యత్నించాడన్న వార్తలపై ఇరాన్ పెదవి విప్పలేదు. ‘ఫత్వాను అమలుచేసే ప్రయత్నం జరిగింది’ అంటూ పొడిపొడిగా ఒక ప్రకటనను మాత్రం శనివారం ఇరాన్ అధికారిక మీడియా వెలువరించింది. ‘ ఇలాంటి ఘటనలు ఇరాన్‌ను అంతర్జాతీయ సమాజం నుంచి దూరం చేస్తాయి’ అని ఇరాన్ మాజీ దౌత్యవేత్త మాషల్లా సెఫాజదీ అన్నారు. దాడిపై వెల్లువెత్తిన నిరసనలు ఘటనను భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా సాహిత్యలోకం అభివర్ణించింది. రచయితల గొంతు నొక్కే, హింసాత్మక, అణచివేత ధోరణులపై ముక్తకంఠంతో తమ తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు. అత్యంత హేయమైన చర్యగా బుకర్ ప్రైజ్ విజేత, రచయిత్రి గీతాంజలి శ్రీ వ్యాఖ్యానించారు. నీల్ గైమన్, అమితవ్ ఘోష్, స్టీఫెన్ కింగ్, జీన్ గెరీరో తదితరులు దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. రష్దీ త్వగా కోలుకోవాలని కోరుకున్నారు. జాగర్‌నాట్ బుక్స్, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఆఫ్ ఇండియా వంటి పలు పబ్లిషింగ్ సంస్థలూ ఘాటుగా స్పందించాయి. ఎవరీ హదీ మతార్? న్యూజెర్సీలోని ఫెయిర్‌వ్యూ ప్రాంతంలో మతార్ నివసిస్తున్నాడు. మతార్ ఎందుకు దాడి చేశాడనే కారణాలను వెతికే పనిలో అమెరికా ఎఫ్‌బీఐ, స్థానిక దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. ‘ఘటనాస్థలిలోని బ్యాక్ ప్యాక్, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సెర్చ్ వారెంట్ తీసుకునే పనిలో అధికారులు ఉన్నారు. దాడి ఘటన వెనుక ఎవరూ ఉండకపోవచ్చని, మతార్ ఒక్కడికే ఇందులో ప్రమేయముందని అధికారులు ప్రాథమికంగా విశ్వసిస్తున్నారు. లెబనాన్ మూలాలున్న మతార్ నేర చరిత్రపై వివరాలు సేకరిస్తున్నాం’ అని పోలీస్ ట్రూప్ కమాండర్ మేజర్ ఎజీన్ జె. స్టాన్జ్యూస్కీ చెప్పారు. అయితే, అతని సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలించగా కొన్ని విషయాలపై స్పష్టత వచ్చింది. షియా ఉగ్రవాదులకు ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కు మతార్ సానుభూతిపరుడని తెలుస్తోందని దర్యాప్తులో భాగంగా ఉన్న ఒక ఉన్నతాధికారి ఎన్బీసీ న్యూస్‌తో చెప్పారు. మతార్ వాడుతున్న సెల్‌ఫోన్ మెసేజింగ్ యాప్‌లో ఇరాన్ కమాండర్ ఖాసిమ్ సులేమానీ ఫొటోను దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. సులేమానీ ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్కు సైన్యాధికారిగా ఉన్నాడు. రష్దీ రాసిన రచనను ఇరాన్ 1988లో నిషేధించిన విషయం తెల్సిందే. ఇంత భద్రత అవసరమా? గతంలో రష్దీ వ్యాఖ్య హత్యా బెదిరింపుల నేపథ్యంలో ఆయనకు కల్పించిన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై ఒకానొక దశలో అసహనం వ్యక్తంచేశారని న్యూయార్క్ పోస్ట్ ఒక కథనం ప్రచురించింది. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లో ఒక సారి రచయితల సదస్సు జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చిన రష్దీ మాట్లాడారు. ‘ఇంత మందితో నాకు భద్రత కల్పించడం నిజంగా అవసరమా? నాకైతే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది. నాకు ఇంతగా అదనపు భద్రత అవసరమని నేనెప్పుడూ అడగలేదు. గతంలో ఎలాంటి భద్రతా లేకుండానే ఇక్కడొకొచ్చాను. ఇప్పుడు ఇదంతా వృథా ప్రయాస. అయినా, భద్రత అవసరమైన రోజులను నేనెప్పుడో దాటేశాను’ అని ఆనాటి సభలో అన్నారు. -
ఆ నవల జోలికి వెళ్తే.. అందరికీ ఇదే గతి!
బుకర్‌ప్రైజ్ విన్నర్, భారత సంతతికి చెందిన ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్డీపై దాడి ఘటనను ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండిస్తోంది. 75 ఏళ్ల వయసున్న రష్డీ.. తన రెండో నవల మిడ్నైట్స్ చిల్డ్రన్(1981) ద్వారా బుకర్ ప్రైజ్‌ను సాధించి.. ఆ ఘనత అందుకున్న తొలి భారతీయ పౌరుడిగా(ముంబైలో పుట్టారు కాబట్టి) ఘనత దక్కించుకున్నారు. అందుకే పలు దేశాల నేతలు, అధినేతలతో పాటు భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. ఇరాన్లో పండుగ వాతావరణం నెలకొనడం విశేషం. ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధుల్లో మాజీ అధినేత అయతోల్లా రుహోల్లా ఖోమెయినీ(దివంగత) ఫొటోలు.. బ్యానర్లు, ఫ్లెక్సీల రూపంలో దర్శనమిస్తున్నాయి. అంతేకాదు ఒకప్పుడు తన నవల(నిషేధిత)తో ఇస్లాంను అవహేళన చేసినందుకు సరైన శిక్ష పడిందంటూ అక్కడి ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. కేవలం ఇస్లాంను అవమానించాడన్న ఆరోపణపైనే ఆయనపై దాడిని కొందరు ఇరానీయన్లు సమర్థించడం గమనార్హం. ► ఇక అదే గడ్డపై మరోరకమైన వాతావరణమూ కనిపిస్తోంది కూడా. ఇప్పటికే న్యూక్లియర్ ఒప్పందాల విషయంలో పాశ్చాత్య దేశాలు ఇరాన్‌పై గుర్రుగా ఉన్నాయి. తాజాగా ప్రముఖ నవలా రచయిత సల్మాన్ రష్డీపై దాడిని ఆధారంగా చేసుకుని మరిన్ని ఆంక్షలు విధించొచ్చన్న ఆందోళన ఇరాన్లో నెలకొంది. ► సల్మాన్ రష్టీపై దాడికి పాల్పడిన వ్యక్తిని.. న్యూజెర్సీకి చెందిన హదీ మటర్ అనే వ్యక్తిగా నిర్ధారించారు. అతను ఉద్దేశం ఏంటన్నది మాత్రం స్పష్టత లేకుండా పోయింది. ► 1988లో సల్మాన్ రష్టీ రాసిన ది సాటానిక్ వెర్సెస్ తీవ్ర దుమారం రేపింది. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ సైతం ఆ నవలను నిషేధించారు. ► ముంబైలో పుట్టిన సల్మాన్ రష్టీ.. ప్రతిష్టాత్మక బుక్ ప్రైజ్‌ను గెల్చుకున్నారు. అదే సమయంలో.. ‘ది సాటానిక్ వెర్సెస్’నవల ద్వారా ఊహించని రేంజ్లో వివాదాన్ని, విమర్శలను మూటగట్టుకున్నారు. ► సల్మాన్ రష్డీ.. 1947 ముంబైలో కశ్మీరీ ముస్లిం కుటుంబంలో జన్మించారు. రాడికల్ రాతలతో అజ్ఞాతంలోనే ఎక్కువగా గడిపారు ఈయన. ఆ టైంలో జోసెఫ్ ఆంటోన్ అనే కలం పేరుతో ఆయన రచనలు సాగాయి. ► 1975 నుంచి 2019 దాకా మొత్తం 14 నవలలు రాశారు ఆయన. ► మిడ్నైట్ చిల్డ్రన్కు బుక్ ప్రైజ్ గెల్చుకోవడంతోపాటు ఇప్పటిదాకా ఐదుసార్లు బుకర్కు నామినేట్ అయ్యారు. ► 2007లో సాహిత్యంలో సేవలకు బ్రిటిష్ ప్రభుత్వం నైట్‌హుడ్ గౌరవం ఇచ్చింది. ► 1988, సెప్టెంబర్‌లో ది సాటానిక్ వెర్సెస్ నవల పబ్లిష్ అయ్యింది. ఈ నవలలోని అంశం ఇస్లాం మతానికి వ్యతిరేకం. రష్డీ తనను తాను ముస్లిమేతరుడిగా, నాస్తికుడిగా అభివర్ణించుకున్నాడు. ఇస్లామిక్ ఛాందసవాదులు సల్మాన్ రష్దీ రాతల్ని చూసి రగిలిపోయారు. అది వివాదం కావడంతో.. ప్రాణభయంతో తొమ్మిదేళ్లపాటు ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారు. ► పాక్ ప్రపంచంలో పాతికకు పైగా దేశాలు.. ఇస్లాంను కించపరిచేలా ఉందంటూ ఈ నవలను నిషేధించాలని డిమాండ్ చేశాయి. సల్మాన్ రష్డీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. అందులో కొన్ని బ్యాన్ చేశాయి కూడా. భారత్ కూడా నవల పబ్లిష్ అయిన నెల రోజుల తర్వాత నిషేధించింది. ఎవరైనా ఆ నవలను దగ్గర ఉంచుకున్నా సరే అప్పట్లో కఠినంగా శిక్షించేవి ఇస్లాం దేశాలు. ► ముంబైలో 1989 ఫిబ్రవరిలో రష్డీకి వ్యతిరేకంగా మొదలైన ర్యాలీ కాస్త అల్లర్ల మలుపు తీసుకుంది. ఏకంగా 12 మంది మృతి చెందారు. ► ది సాటానిక్ వెర్సెస్ నవల పబ్లిష్ అయిన ఏడాది తర్వాత.. అప్పటి ఇరాన్ అధినేత అయతొల్లా రుహోల్లాహ్ ఖోమెయిని.. ఒక ఫత్వా జారీ చేశారు. రష్డీని చంపిన వాళ్లకు భారీ రివార్డు ప్రకటించారు. ► 80వ దశకం నుంచి ఇరాన్ ఆయనను చంపి తీరుతామని ప్రకటలు చేస్తూ వచ్చాయి. అంతేకాదు ఒకానొక టైంలో.. ఆయనపై ప్రకటించిన రివార్డు 3 మిలియన్ డాలర్లకు చేరుకుంది కూడా. ► 1989లో ఇరాన్ యూకేతో ది సాటానిక్ వెర్సెస్ నవల విషయంలో దౌత్యపరమైన సంబంధం నడిపింది. ► ఇప్పుడు సల్మాన్ రష్డీపై దాడి గురించి చూశారు కదా. అయితే గతంలోనూ ఈ నవలతో సంబంధం ఉన్నవాళ్లపైనా దాడులు జరిగాయి. ► ది సాటానిక్ వెర్సెస్ జపనీస్ వెర్సన్‌లో రష్డీకి సాయం చేసిన హితోషి ఇగరషి అనే ట్రాన్స్‌లేటర్.. 1991, జులై 13న ఘోరంగా కత్తిపోట్లకు గురై హత్య గావించబడ్డాడు. ► ఇగరషి కంటే పదిరోజుల ముందుగా జరిగిన ఓ దాడిలో.. రష్డీకి ది సాటానిక్ వెర్సెస్ విషయంలో ఇటాలియన్ ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించిన ఎట్టోరే క్యాప్రివోలో.. మిలన్(ఇటలీ)లోని తన ఇంట్లో దాడికి గురయ్యాడు. ఇతనూ కత్తి పోట్లకే గురికావడం గమనార్హం. ► ది సాటానిక్ వెర్సెస్ నార్వేరియన్ పబ్లిషర్ విలియం నైగార్డ్ను ఓస్లోలో అక్టోబర్ 11, 1993లో ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. ► టర్కీస్ ట్రాన్స్‌లేటర్ అజిజ్ నాసిన్‌ను లక్ష్యంగా చేసుకుని.. జులై 2, 1993లో ఓ గుంపు దాడి చేసింది. శుక్రవారం ప్రార్థనల తర్వాత మడిమక్ హోటల్‌కు నిప్పటించడంతో.. 37 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో చాలామంది కళాకారులు కావడం విశేషం. ► అగష్టు 12, 2022.. శుక్రవారం వెస్ట్రన్ న్యూయార్క్‌లో ఉపన్యాసం కోసం సిద్ధమైన వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై.. వెనుక నుంచి ఓ దుండగుడు కంఠంలో విచక్షణంగా పొడిచి దాడికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించి.. సర్జరీలు చేశారు. ఆయన ప్రధాన అవయవాలన్నీ దెబ్బతిన్నాయని, ఒక కంటికి చూపును సైతం కోల్పోవచ్చని వైద్యులు చెప్తున్నారు. ► కొంతకాలం దాకా ఆయనకు భారీ భద్రతే ఉండేది. అయితే ఆ భద్రతా సిబ్బందితోనూ తనకు ఇబ్బందులు తప్పడం లేదంటూ ఆయన విజ్ఞప్తి చేయడంతో.. కొంత వెనక్కి తీసుకున్నారు. ► చావు బెదిరింపులకు భయపడి.. ఇంతకాలం భయం భయంగా గడిపాను. ఇప్పుడు సాధారణంగా మారిందనే నమ్ముతున్నా.. దాడికి కొన్నివారాల ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ రష్టీ చేసిన వ్యాఖ్యలు. ► ఇరాన్ మీడియా ఇండో-బ్రిటీష్ సంతతికి చెందిన సల్మాన్ రష్డీపై దాడిని హైలైట్ చేస్తూ.. సానుకూల కథనాలు ప్రసారం చేసుకుంది. ముఖ్యంగా అయతోల్ల స్థాపించిన ‘కేహన్’.. దాడికి పాల్పడిన దుండగుడిని ఆకాశానికి ఎత్తేసింది. ► ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సల్మాన్ రష్డీ.. ఒకేఒక్క నవల(ది సాటానిక్ వెర్సెస్)తో తన జీవితానికి భయంభయంగా గడిపారు. అదీ 30 ఏళ్లకు పైనే. ► ప్రాథమిక విచారణలో హాది మతార్ సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ.. షియా ఎక్స్‌ట్రీమిజం, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్(IRGC)సానుభూతి పరుడిగా ఉంది. ► అయితే హాది మతార్‌కు.. ఐఆర్‌జీసీకి నేరుగా సంబంధాలు ఉన్నట్లు ఎవరికీ తెలియదు. ► 2020లో హత్యకు గురైన ఐఆర్జీసీ కమాండర్ ఖాసీం సోలెమని.. ఫొటోలు మాత్రం హాది మతార్ మొబైల్లో ఉన్నాయి. ► స్టేజీ మీదకు దూకి మరీ హాది మతార్ దాడికి పాల్పడ్డాడు. సల్మాన్ రష్డీని ఇంటర్వ్యూ చేయాలనుకున్న హెన్రీ రెస్సీ సైతం ఈ దాడిలో గాయపడ్డారు. ► ఒంటరిగానే అతను ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నా.. లోతైన దర్యాప్తు అవసరమని భావిస్తున్నారు. ► హదీ మాతర్ ప్రస్తుతం న్యూజెర్సీ.. ఫెయిర్వ్యూవ్లో ఉంటున్నాడు. అతను ఏ దేశ పౌరుడు, క్రిమినల్ రికార్డులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. ఇదీ చదవండి: వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై దాడి -
న్యూయార్క్: వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై దాడి
-
వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై దాడి
న్యూయార్క్: భారత సంతతికి చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత సల్మాన్ రష్దీ (75)పై శుక్రవారం అమెరికాలో హత్యాయత్నం జరిగింది. న్యూయార్క్‌లో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు ఆయన సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజెంటర్ రష్దీని సభికులకు పరిచయడం చేస్తుండగా ఓ వ్యక్తి ఉన్నట్టుండి వేదికపైకి దూసుకొచ్చి వెనక నుంచి దాడికి తెగబడ్డాడు. కనీసం 10 సెకన్ల పాటు కత్తితో ఆయనను పదేపదే పొడిచాడు. మెడ తదితర చోట్ల పది నుంచి పదిహేను దాకా కత్తిపోట్లు దిగినట్టు తెలుస్తోంది. దాంతో రష్దీ రెయిలింగ్‌ను ఊతంగా పట్టుకుని అలాగే కిందికి ఒరిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ‘‘రష్దీ చుట్టూ రక్తం మడుగులు కట్టింది. అయన కళ్ల చుట్టూ, చెంపల గుండా రక్తం కారింది. వెనకనున్న గోడ, సమీపంలోని కుర్చీతో పాటు పరిసరాలు కూడా రక్తసిక్తంగా మారాయి’’ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ హఠాత్సంఘటనతో సభికులంతా బిత్తరపోయారు. సహాయకులు, భద్రతా సిబ్బంది తక్షణం స్పందించి కింద పడిపోయిన రష్దీని పైకి లేపారు. ప్రథమ చికిత్స తర్వాత హుటాహుటిన హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. దాడిలో రష్దీ మెడపై గాయమైనట్టు న్యూయార్క్ పోలీసులు నిర్ధారించారు. ‘‘స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు దాడి జరిగింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. రష్దీ ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతానికి మాకెలాంటి సమాచారం లేదు’’ అని వెల్లడించారు. రష్దీని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తికి కూడా దాడిలో స్వల్ప గాయాలైనట్టు చెప్పారు. రష్దీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదని బీబీసీ వార్తా సంస్థ పేర్కొంది. దాడి అనంతరం అంతా రష్దీ చుట్టూ మూగగా దుండగుడు దర్జాగా వేదిక దిగి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. కొద్ది దూరం వెళ్లాక సభికులు, భద్రతా సిబ్బంది అతన్ని నిర్బంధించారు. దాడిపై సాహితీ ప్రపంచం నుంచి విమర్శలు, ఖండనలు వెల్లువెత్తుతున్నాయి. జరిగింది మాటలకందని దారుణమని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచల్ అన్నారు. రష్దీ ప్రాణాలతోనే ఉన్నారని ధ్రువీకరించారు. కడపటి సమాచారం అందేసరికి ఆయనకు ఆపరేషన్ జరుగుతున్నట్టు సమాచారం. బెదిరింపులే ప్రసంగాంశం... శుక్రవారం రష్దీపై జరిగిన దాడికి పశ్చిమ న్యూయార్క్ శివార్లలోని చౌటౌకా ఇన్స్టిట్యూషన్ వేదికైంది. అక్కడ రష్దీ ప్రసంగ అంశం కూడా బెదిరింపుల కారణంగా ప్రవాసులుగా మారిన రచయితలకు సంబంధించిందే కావడం విశేషం. వారి రక్షణకు కృషి చేస్తున్న పిట్స్బర్గ్ నాన్‌ప్రాఫిట్ సిటీ ఆఫ్ అసైలం అనే సంస్థ ఏర్పాటు చేసిన ఈ సభలో ‘మోర్ దాన్ షెల్టర్ (ఆశ్రయానికి మించి...)’ అనే అంశంపై ఆయన మాట్లాడాల్సి ఉంది. అందులో భాగంగా బెదిరింపులు ఎదుర్కొంటున్న రచయితలకు అమెరికా ఆశ్రయంగా మారుతున్న వైనంపై కూడా చర్చ జరగాల్సి ఉంది. ‘‘రష్దీపై దాడి జరిగిందని తెలిసి షాకయ్యా. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. పాశ్చాత్య దేశాల్లో అత్యంత సురక్షిత పరిస్థితుల్లో నడుమ ఉన్న ఆయనపైనే దాడి జరిగిందంటే ఇస్లాంపై విమర్శనాత్మక ధోరణి కనబరిచే వారందరిపైనా దాడులు తప్పవు. చాలా ఆందోళనగా ఉంది’’ – తస్లీమా నస్రీన్ ఫత్వా పడగ నీడలో.. వివాదాస్పద రచయితగా పేరుపడ్డ రష్దీ 1947 జూన్ 19న ముంబైలో జన్మించారు. పూర్తి పేరు అహ్మద్ సల్మాన్ రష్దీ. రచయితగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. చారిత్రక విషయాలతో పాటు వర్తమాన అంశాలకు ఆత్మాశ్రయ శైలిలో మనసుకు హత్తుకునేలా అక్షర రూపమివ్వడం ఆయన ప్రత్యేకత. 14 నవలలు, ఓ కథా సంకలనంతో పాటు పలు కాల్పనికేతర రచనలు చేశారు. ఎన్నో సాహిత్య అవార్డులు అందుకున్నారు. బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం, దేశ విభజన దాకా సాగిన పరిణామాలను చిత్రించిన నవల మిడ్నైట్స్ చిల్డ్రన్కు 1981లో ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ లభించింది. అయితే మతాన్ని కించపరిచే రాతలు రాస్తున్నారంటూ 1980ల నుంచే రష్దీని వివాదాలు చుట్టుముట్టాయి. బెదిరింపులు మొదలయ్యాయి. మహ్మద్ ప్రవక్త జీవితం ఆధారంగా 1988లో రాసిన నాలుగో నవల సటానిక్ వర్సెస్ పెను దుమారానికే దారితీసింది. పాకిస్తాన్ సహా పలు దేశాలు దాన్ని నిషేధించాయి. రష్దీని చంపుతామంటూ లెక్కలేనన్ని బెదిరింపులు వచ్చాయి. ఫత్వాలు జారీ అయ్యాయి. రష్దీని ఉరి తీయాలంటూ ఇరాన్ ఆధ్యాత్మిక నేత అయతుల్లా ఖొమైనీ 1989లో ఫత్వా జారీ చేశారు. ఆయన్ను చంపిన వారికి 30 లక్షల డాలర్ల రివార్డు ఇస్తామంటూ ఇరాన్ తదితర దేశాల నుంచి ప్రకటనలు వెలువడ్డాయి! దాంతో 1989లో రష్దీ భారత్ వీడారు. జోసెఫ్ ఆంటొన్ అనే మారుపేరుతో తొమ్మిదేళ్లకు పైగా రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. అందుకే తన జ్ఞాపకాలకు జోసెఫ్ ఆంటొన్ పేరుతోనే పుస్తక రూపమిచ్చారు. ఎప్పటికైనా చంపి తీరతామంటూ ఇరాన్ నుంచి తనకు ఏటా క్రమం తప్పకుండా ‘ప్రేమలేఖలు’ వచ్చేవని రష్దీ ఒక సందర్భంలో చెప్పారు. బెదిరింపుల నేపథ్యంలో 1989 నుంచి 2002 దాకా బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు నిరంతర భద్రత కల్పించింది. సాహిత్యానికి చేసిన సేవకు గాను 2007లో నైట్‌హుడ్ ఇచ్చి గౌరవించింది. ఈ అనుభవాలకు కూడా ‘ఫత్వా జ్ఞాపకాలు’గా రష్దీ పుస్తక రూపమిచ్చారు! 2000 అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. అంతర్జాతీయ రచయితల సంఘానికి సారథ్యం వహించారు. బెదిరింపుల కారణంగా ప్రవాసంలో గడుపుతున్న రచయితల సంక్షేమం కోసం నడుం బిగించారు. రష్దీ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు. 30 ఏళ్లకు పైగా రష్దీ ఫత్వా పడగ నీడలోనే గడుపుతున్నారు. ఇటీవల భారత్ వచ్చేందుకు కేంద్రం వీసా నిరాకరించడం తననెంతగానో బాధించిందని చెప్పారాయన. అనువాదకుల హత్య సటానిక్ వర్సెస్ను అనువదించినందుకు ప్రపంచవ్యాప్తంగా పలువురు రచయితలు ప్రాణాలు కోల్పోయారు! జపనీస్‌లోకి అనువదించిన హిటోషీ ఇగరాషీని యూనివర్సిటీ క్యాంపస్‌లోనే పొడిచి చంపారు. టర్కిష్‌లోకి అనువదించిన అజీజ్ నెసిన్పై జరిగిన బాంబు దాడి ఆయనతో పాటు మరో 36 మందిని కూడా బలి తీసుకుంది. ఇటాలియన్‌లోకి అనువదించిన ఎటోర్ కాప్రియోలో కత్తి పోట్ల బారిన పడ్డారు. నార్వే భాషలో ప్రచురించిన వ్యక్తి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. నిరంతరం భారీ భద్రత నడుమ బతకాల్సి వస్తోందంటూ రష్దీ పలుమార్లు ఆవేదన వెలిబుచ్చారు. కానీ ఆయనపై తాజాగా దాడికి భద్రతా లోపాలే ప్రధాన కారణమంటూ ఘటనకు ప్రత్యక్ష సాక్షులైన సాహితీ అభిమానులు వాపోవడం విషాదం. -
మహోజ్వల భారతి: సృజనాత్మక సంచలనం సల్మాన్ రష్దీ
సల్మాన్ రష్దీ భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ నవలా రచయిత, వ్యాసకర్త. 1981లో తన రెండవ నవల మిడ్నైట్ చిల్డ్రన్ బుకర్ ప్రైజు గెలవడంతో తొలిసారిగా వార్తల్లోకి వచ్చారు. సల్మాన్ ప్రారంభంలో రాసిన కాల్పనిక సాహిత్యమంతా భారత ఉపఖండం నుంచి జనించినదే. ఆయన శైలిని చారిత్రక కాల్పనికతతో మిళితమైన మ్యాజిక్ రియలిజంగా వర్గీకరిస్తూ ఉంటారు. సల్మాన్ నాలుగవ నవల ‘శటానిక్ వర్సెస్‘ (సైతాను వచనాలు) సంచలనాత్మక, వివాదాస్పద నవల. అనేక దేశాలలో నిషేధానికి గురైంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో ముస్లింలు దీనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. సల్మాన్‌ను చంపేస్తామని బెదరింపులు కూడా వచ్చాయి. ముంబైలో జన్మించిన ఆయన, ఇంగ్లండ్ పౌరసత్వం తీసుకుని ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. సల్మాన్ రష్దీ వయసు 74 ఏళ్లు. నేడు సల్మాన్ రష్దీ జన్మదినం. 1947 జూన్ 19న పుట్టారు. -
ఆ ఇంటి విలువ రూ 130 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ప్రముఖ రచయిత సల్మాన్ రష్ధీ పూర్వీకులకు సంబంధించిన ఇంటి విలువను రూ 130 కోట్లుగా ఢిల్లీ హైకోర్టు నిర్ణయించింది. 1970లో కాంగ్రెస్ నేతకు రష్ధీ తండ్రి ఈ ఇంటిని అమ్మేందుకు సిద్ధపడగా ఇరు పక్షాల మధ్య నెలకొన్న వివాదంతో ఆ ఒప్పందం నిలిచిపోయింది. ఈ వివాదం సర్వోన్నత న్యాయస్ధానానికి చేరగా 2012లో కాంగ్రెస్ మాజీ నేత భికురాం జైన్‌కు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఉత్తర్వులు వెలువడిన నాటికి మార్కెట్ రేటు ప్రకారం ఆ ఇంటిని జైన్‌కు అప్పగించాలని రష్ధీ వారసులను కోర్టు ఆదేశించింది. ఈ ఆస్తి మార్కెట్ విలువను నిర్ధారించాలని సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టును కోరింది. రూ 130 కోట్లకు తమ ఇంటిని కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారు సిద్ధంగా ఉన్నారని రష్ధీ వారసులు తెలపడంతో ఇంటి మార్కెట్ ధరను ఢిల్లీ హైకోర్టు రూ 130 కోట్లుగా నిర్ధారించింది. ఈ ధరకు ఇంటిని కొనుగోలు చేసేందుకు జైన్లు సిద్ధంగా లేకుంటే ఆరు నెలల్లోగా ఇతరులకు రష్ధీ వారసులు తమ ఇంటిని విక్రయించవచ్చని జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లా తెలిపారు. రూ 130 కోట్లకు ఇంటిని నిర్ధేశిత గడువులోగా రష్ధీలు అమ్మలేని పక్షంలో డిసెంబర్ 4, 2012లో సర్కిల్ రేట్లకు అనుగుణంగా రూ 75 కోట్లకు జైన్లు ఆ ఇంటిని కొనుగోలు చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక రూ 75 కోట్లకు ఇంటిని జైన్లు కొనేందుకు సుముఖత చూపనిపక్షంలో 1970లో ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందం నుంచి రష్ధీలు వైదొలగవచ్చని కోర్టు తెలిపింది. కాగా 1970లో ఈ ఇంటిని రష్ధీ తండ్రి అనీస్ అహ్మద్ రష్దీ రూ 3.75 లక్షలకు విక్రయించేందుకు భికు రామ్ జైన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. జైన్ అడ్వాన్స్‌గా రూ 50,000ను అనీస్ రష్ధీకి చెల్లించి మిగిలిన మొత్తం ఇంటి యజమాని ఆదాయ పన్ను అధికారుల నుంచి ట్యాక్స్ క్లియరెన్స్ పత్రాలు రాగానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఒప్పందంలోని అంశాలకు కట్టుబడలేదని ఇరు కుటుంబాలు ఫిర్యాదు చేసుకోవడంతో వివాదం నెలకొంది. ఇక అప్పటి నుంచి ఇరు కుటుంబాలు కోర్టులను ఆశ్రయించడంతో వివాదం వాయిదాల పర్వానికి దారితీసింది. -
టాప్–100 రచయితల్లో మనవాళ్లు
లండన్: ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఇంగ్లిష్ నవలలు రాసిన మొదటి 100 మందిలో.. ప్రముఖ భారతీయ రచయితలు ఆర్కే నారాయణ్, అరుంధతి రాయ్, సల్మాన్ రష్దీ, విక్రమ్ సేత్‌లకు చోటు దక్కింది. బీబీసీ నిపుణులు ఎంపిక చేసిన ప్రపంచ ప్రఖ్యాత రచయితల జాబితాలో వీరి పేర్లున్నాయి. బీబీసీ నియమించిన నిపుణుల కమిటీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సంప్రదాయ సాహిత్యం నుంచి సమకాలీన సాహిత్యం వరకు 100 రచనల్ని ఎంపిక చేసి వాటిని ప్రేమ, రాజకీయం, అధికారం, బాలసాహిత్యం, సమాజం వంటి పది కేటగిరీలుగా విభజించింది. ఒక్కో కేటగిరీ కింద ఏడాది పాటు శ్రమించి కొన్ని పుస్తకాలను ఈ బృందం ఎంపిక చేసింది. ఇందులో అరుంధతి రాయ్ రాసిన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్’పుస్తకం ఐడెంటిటీ కేటగిరీలోను, ఆర్కే నారాయణ్ ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’కమింగ్ ఆఫ్ ఏజ్ సెక్షన్లో, సల్మాన్ రష్దీ రాసిన ‘ది మూర్స్ లాస్ట్ సై’రూల్ బ్రేకర్స్ విభాగంలో ఎంపికయ్యాయి. విక్రమ్ సేథ్ రాసిన నవల ‘ఎ స్యూటబుల్ బోయ్’ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్షిప్ కేటగిరీ, వీఎస్ నైపాల్ రచించిన ‘ఎ హౌస్ ఆఫ్ మిస్టర్ బిశ్వాస్’కు క్లాస్ అండ్ సొసైటీ విభాగంలో చోటు దక్కింది. పాక్ రచయితలు మొహ్సీన్ హమీద్, కమిలా షమ్సీలు రాసిన ది రిలక్టాంట్ ఫండమెంటలిస్ట్, హోం ఫైర్, అఫ్గాన్–అమెరికన్ రచయిత ఖలేద్ హొస్సైనీ రాసిన ఎ థౌజెండ్ స్లె్పండిడ్ సన్స్ నవలకు చోటు దక్కింది. ఆంగ్లంలో తొలి నవలగా భావించే ‘రాబిన్సన్ క్రూసో ’ప్రచురితమై 300 ఏళ్లు పూర్తవడంతో ఈ జాబితా తెచ్చారు. -
'సల్మాన్ కు ఇప్పటికీ నాపై ప్రేమ ఉంది'
న్యూఢిల్లీ: తాను ఒకే సమయంలో ఇద్దరు మగాళ్లతో డేటింగ్ చేశానని భారత సంతతికి చెందిన మోడల్, సెలబ్రిటీ టీవీ హోస్ట్ పద్మాలక్ష్మి వెల్లడించింది. దీనికి తానేమీ చింతించడం లేదని పేర్కొంది. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్య్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలు వెల్లడించింది. ఒకే టైమ్ లో ఇద్దరు మగాళ్లతో డేటింగ్ తప్పుకాదని, దీనికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వ్యక్తిగత జీవితంపై ఎటువంటి విచారం లేదని, తాను ఎవరికీ క్షమాపణ చెప్పాలనుకోవడం లేదని తెలిపింది. 'లవ్, లాస్, అండ్ వాట్ వుయ్ యేట్: ఏ మెమొయిర్' పేరుతో రాసిన పుస్తకంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు పొందుపరిచినట్టు వెల్లడించింది. ఇప్పటివరకు తనలో గ్లామరస్ కోణం మాత్రమే చూశారని, ఈ పుస్తకంతో రియల్ పద్మాలక్ష్మిని చూస్తారని పేర్కొంది. సంక్లిష్టమైన సంబంధాలు ఎక్కువకాలం నిలబడవని అభిప్రాయపడింది. తనపై సల్మాన్ రష్దీకి ప్రేమ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదని, తాము ఏ కారణంగా విడిపోయామే తెలియడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీని పెళ్లాడిన పద్మాలక్ష్మి తర్వాత ఆయనతో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. తన కూతురు కృష్ణ తియా లక్ష్మి-డెల్ తో కలిసి పద్మాలక్ష్మి అమెరికాలో నివసిస్తోంది. -
27 ఏళ్ల తర్వాత ఖండించింది
రష్డీపై ఫత్వాను ఖండించిన నోబెల్ కమిటీ స్టాక్‌హోం: బ్రిటిష్ ఇండియన్ నవలా రచయిత, వివాదాస్పద సెటానిక్ వర్సెస్ పుస్తకాన్ని రాసిన సల్మాన్ రష్డీపై ఇరానియన్ మతపెద్ద అయతున్లా రుహుల్లా కొమైనీ జారీ చేసిన ఫత్వాను స్వీడిష్ అకాడమీ గురువారం ఖండించింది. నోబెల్ సాహిత్య విజేతను ఎంపిక చేసే ఈ కమిటీ నుంచి 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఈ నిర్ణయం వెలువడింది. సెటానిక్ వర్సెస్ పుస్తకంలో ఇస్లాంను కించపరచారనే ఆరోపణలతో రష్డీపై ఫత్వా జారీ అయింది. అయితే 1989లో దీన్ని ఖండించడానికి అకాడమీ నిరాకరించడంతో ఇద్దరు సభ్యులు తమ పదవులనుంచి తప్పుకున్నారు. ఈ పుస్తకంపై రాజకీయ దుమారం రేగడంతో స్వీడిష్ అకాడమీ వ్యక్తికి భావప్రకటనా స్వేచ్ఛ ఉందని చెబుతూనే రష్డీకి మద్దతు మాత్రం ప్రకటించలేదు. ఏదేమైనప్పటికీ ఇన్నాళ్లకు రష్డీపై ఫత్వాను ఖండించిన స్వీడిష్ అకాడమీ ఆయన తలకు వెలకట్టడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తన వెబ్సైట్లో పేర్కొంది. -
సల్మాన్ రష్దీ పుస్తకాన్ని కొన్న ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ఇద్దరు కూతుళ్లు సాషా, మాలియాతో కలిసి శనివారం ఓ చిన్న పుస్తక దుకాణాన్ని సందర్శించారు. భారత సంతతి రచయిత సల్మాన్ రష్దీ రచించిన పుస్తకంతోపాటు తొమ్మిద పుస్తకాలను ఆయన కొనుగోలు చేశారు. రష్దీ రచించిన 'టు ఇయర్స్ ఎయిట్ మంత్స్ అండ్ ట్వంటీ ఎయిట్ నైట్స్' పుస్తకాన్ని ఒబామా కొన్నారు. దాంతో పాటు జోనాథన్ ఫ్రాంజన్ రచించిన 'ప్యూరిటీ: ఏ నావెల్', సింథియా వొయిట్ రచించిన 'ఎల్స్కే: ఏ నావెల్ ఆఫ్ ద కింగ్డమ్', 'ఫార్చూన్స్ వీల్స్', 'జాకారో: ఏ నావెల్ ఆఫ్ ద కింగ్డమ్', నాటాలీ లాయిడ్ రాసిన 'ఏ స్నిక్కర్ ఆఫ్ మ్యాజిక్' తదితర పుస్తకాలను ఒబామా తీసుకున్నారు. ఓ చిన్న దుకాణంలో ఈ పుస్తకాలు కొన్న ఒబామా వాటిని ముదురు రంగు సంచిలో వేసుకొని బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఎదురుపడ్డ జర్నలిస్టులను చూసి ఓ చిన్న చిరునవ్వు నవ్వారు. ఆ తర్వాత తన ఎస్‌యూవీలో బిడ్డలతో బయలుదేరారు. అనంతరం డీసీ సమీపంలో ఓ ఐస్‌క్రీమ్ షాపు వద్ద ఆగి.. ఐస్‌క్రీమ్ ఆస్వాదించారు. -
తప్పును సరిదిద్దుకోవడానికి ఎన్నేళ్లు?
మాజీ ఆర్థీక మంత్రి చిదంబరం శనివారం ఓ సాహిత్య కార్యక్రమంలో మాట్లాడుతూ.. సెటానిక్ వర్సెస్ పుస్తకాన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వం నిషేధించడం తప్పేనంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. చిదంబరం ప్రకటన నేపథ్యంలో రచయిత సల్మాన్ రష్దీ స్పందించాడు. అయితే ఒక తప్పును సరిదిద్దుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటూ ట్విట్టర్లో ఆయన ప్రశ్నించాడు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో చిదంబరం హోం మంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో సల్మాన్ రష్దీ రచించిన వివాదాస్పద పుస్తకం సెటానిక్ వర్సెస్పై 1988లో నిషేధం విధించారు. ప్రభుత్వం తన తప్పును తెలుసుకోవడానికి 27 సంవత్సరాలు పట్టిందని సల్మాన్ రష్థీ ఆవేదన వ్యక్తం చేశారు. సెటానిక్ వర్సెస్ పుస్తకంలో వివాదాస్పద అంశాలు ఉన్నాయనే కారణంతో అప్పట్లో ఓ ఇరాన్ మత సంస్థ ఆయనకు మరణ శిక్ష విదిస్తూ ఫత్వా జారీ చేసింది. దీంతో రచయిత కొన్నాళ్ల పాటు అఙ్ఞాతంలో గడపాల్సి వచ్చింది. This admission just took 27 years. How many more before the "mistake" is corrected? https://t.co/qz7t1InXzV— Salman Rushdie (@SalmanRushdie) November 28, 2015 -
కలం.. కలం.. నిరసన గళం
సాహిత్య అవార్డులను వెనక్కిచ్చిన 12 మంది రచయితలు ♦ 21కి పెరిగిన జాబితా.. బాసటగా నిలిచిన సల్మాన్ రష్దీ.. న్యూఢిల్లీ: దేశంలో మత అసహన సంస్కృతి పెరిగిపోతోందని నిరసిస్తూ కేంద్ర సాహిత్య అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్న వారి జాబితా పెరిగిపోతోంది. సోమవారం ఒక్కరోజే 12 మంది రచయితలు నిరసన గళం విప్పారు. దీంతో సాహిత్య పురస్కారాలను వాపసు చేస్తామన్న వారి సంఖ్య 21కి పెరిగింది. వీరికి బుకర్ ప్రైజ్ రచయిత సల్మాన్ రష్దీ బాసటగా నిలిచారు. తమ పురస్కారాలను వెనక్కి ఇస్తున్నట్లు కశ్మీర్ రచయిత గులాం నబీ ఖాయల్, కన్నడ రచయిత, అనువాదకుడు డీఎన్ శ్రీనాథ్, హిందీ రచయితలు మంగళేశ్ దబ్రాల్, రాజేశ్ జోషి, కన్నడ అనువాదకుడు జీఎన్ రంగనాథరావ్, పంజాబ్ రచయితలు వార్యం సంధు, సుర్జీత్ పత్తార్, బల్దేవ్ సింగ్, సదక్నామ, జశ్వీందర్, దర్శన్ బుట్టర్ చెప్పారు. ఢిల్లీ రంగస్థల నటి మాయా క్రిష్ణారావ్ సంగీత నాటక అకాడమీ అవార్డును సోమవారం వెనక్కిచ్చారు. ‘దేశంలో మైనారిటీలకు రక్షణ లేదు. భవిష్యత్ అంధకారమని వారు భయపడుతున్నారు’ అని ఖాయల్ చెప్పారు. అవార్డుతోపాటు దానికింద వచ్చిన నగదును కూడా వెనక్కి ఇస్తానని జోషీ తెలిపారు. ఇటీవలి పరిణామాలపై ఆందోళన వ్యక్తంచేస్తూ, ఇప్పుడు కలం స్థానం నుంచి బుల్లెట్లు వస్తున్నాయని శ్రీనాథ్ అన్నారు. హేతువాద రచయిత కల్బుర్గి హత్యపై అకాడమీ స్పందించకుండా మౌనంగా ఉండటాన్ని నిరసిస్తున్నామని దబ్రాల్, జోషీ తెలిపారు. భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని రష్దీ పేర్కొన్నారు. అవార్డుల వాపసు నేపథ్యంలో అకాడమీ ఈనెల 23న ఎగ్జిక్యూటివ్ బోర్డు భేటీ నిర్వహించనుంది. రాజ్యాంగంలో పొందుపరిచినట్లు లౌకిక విలువలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని అకాడమీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ చెప్పారు. అవార్డులు వెనక్కి ఇస్తున్న రచయితల తీరుపై అనుమానం కలుగుతోందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ అన్నారు. -
సల్మాన్ రష్దీ- రైటర్స్ బ్లాక్...
1980లలో ఒకసారి నాకు రైటర్స్ బ్లాక్ వచ్చింది. ఇది అందరు రచయితలకూ వచ్చేదే. ఏమనుకున్నా రాయలేకపోవడం. అప్పుడే నికరాగ్వా మంచి వేడి మీద ఉంది. పొలిటికల్ రివల్యూషన్... ఎలాగూ ఏమీ రాయట్లేదు కదా అని దాని సంగతి చూసొద్దామని వెళ్లా. ఏముంది. అడుగడుగునా మందుపాతరలే. చావుతో దాదాపు దగ్గరి పరిచయమైంది. ఆ దెబ్బకు రైటర్స్ బ్లాక్ వదిలిపోయింది. వెంటనే లండన్‌కు తిరిగి వచ్చి ఆ సంవత్సరమే ‘శాటానిక్ వర్సెస్’ మొదటి డ్రాఫ్ట్ పూర్తి చేశా. (నవ్వుతూ) ల్యాండ్‌మైన్స్ వల్ల పెద్ద పెద్ద విధ్వంసాలే సృష్టించవచ్చని అనుకోవద్దు. నవలలు కూడా సృష్టించవచ్చు. - సల్మాన్ రష్దీ తన కొత్త వెబ్సైట్ జ్ట్టిఞ://ఠీఠీఠీ. ట్చఝ్చటఠటజిఛీజ్ఛీ.ఛిౌఝ/ మొదలైన సందర్భంగా గతంలో చేసిన వ్యాఖ్యలను పాఠకులకు అందుబాటులో ఉంచుతూ... (అయితే ‘శాటానిక్ వర్సెస్’ (1986) కూడా ల్యాండ్మైన్లానే పేలిందన్న సంగతి ఎవరూ మర్చిపోలేదు. దాని వల్ల రష్దీ ఫత్వా ఎదుర్కొన్నాడు. దేశాలు పట్టాడు. అవస్థల పాలయ్యాడు. ఇవాళ్టికీ భారతదేశంలో ఆ నవల మీద నిషేధం ఉంది) -
సత్వం:రెబెల్
నిన్నెవరూ నీ జ్ఞాపకాల్ని రాయమని బలవంతం చేయరు; రాయడమంటూ చేస్తే సాధ్యమైనంత నిజాయితీగా ఉండు. సల్మాన్ రష్దీకి పేరుపెట్టేటప్పుడు వాళ్ల నాన్నకు ఏదో భవిష్యవాణి వినిపించివుంటుంది. అందుకేనేమో, పన్నెండో శతాబ్దపు స్పానిష్-అరబ్ తత్వవేత్త, ఆ కాలపు గొప్ప ప్రగతివాది ఇబిన్ రష్ద్ మీదుగా తన కుమారుడికి నామకరణం జరిపాడు. ‘‘ఆ శతాబ్దం ఇస్లాంలోని ప్రగతిశీలురకూ, ఛాందసులకూ మధ్య యుద్ధం జరుగుతున్న కాలం. సహజంగానే రష్ద్ ప్రగతిశీలురవైపు గళం విప్పాడు. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నా,’’ అంటాడు రష్దీ. దానివల్లే (ద సైతానిక్ వర్సెస్) ఆయన ఫత్వాల బారినపడ్డాడు, ‘అనామక’ జీవితం గడిపాడు. సబ్వేలో నడుచుకుంటూ వెళ్లి, కావాల్సినవేవో కొనుక్కుంటూ, కారును తానే సొంతంగా నడుపుకొంటూ, సినిమాలు, ఫుట్‌బాల్ ఆటకు వెళ్తూ... చాలా చిన్న కోరికలకు దూరమై, పోలీసుల నీడలో, బుల్లెట్ప్రూఫు రక్షణలో బతికాడు. ఒక్కోసారి రచనా వ్యాసంగంకన్నా కండక్టర్ అయినా మేలేమో, అనుకున్న క్షణాల్లోకి జారిపోయాడు. భావస్వేచ్ఛ మీద ఆయన ఇలా వ్యాఖ్యానిస్తాడు: ‘‘భావస్వేచ్ఛ వాదంతో ఉన్న సమస్యేమిటంటే, నీకు ఎవరు నచ్చరో వాళ్లకోసం కూడా నువ్వు నిలబడాల్సివుంటుంది. నువ్వు ఆరాధించేవాళ్ల భావస్వేచ్ఛ మాత్రమే భావస్వేచ్ఛ కాదు; నువ్వు నిందించేవాళ్లకు కూడా అదే భావస్వేచ్ఛ వర్తిస్తుంది. (నల్లవాడైన) మార్టిన్ లూథర్ కింగ్నీ సమర్థించాలి, (నల్లవాళ్లను చంపిన) కు క్లక్స్ క్లాన్నీ సమర్థించాలి. అది అలా ఉంటుంది. సూత్రం కోసం నిలబడితే, ఆ సూత్రాన్ని దుర్వినియోగం చేసేవాళ్లకోసం కూడా నిలబడాల్సివస్తుంది. భంగం వాటిల్లకూడని హక్కు అంటూ ప్రపంచంలో ఏదీలేదు. స్వేచ్ఛా సమాజంలో, దాపరికం లేని సమాజంలో జనం చాలా బలమైన అభిప్రాయాలు కలిగివుంటారు; అవి ఒక్కోసారి పరస్పరం ఘర్షించుకుంటాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటివాటితో వ్యవహరించడం నేర్చుకోవాలి... ఇది నవలలకైనా, కార్టూన్లకైనా వర్తిస్తుంది.’’ ‘మన జీవితమే కథగా మారిపోవడం కంటే శాపం ఇంకేముంటుంది?’ అని ప్రశ్నిస్తాడాయన. లండన్, న్యూయార్క్ నగరాల్లో గోప్యంగా బతికినకాలం గురించి ఇలా అంటాడు: ‘‘... అందుకే ఒక నోట్స్ పెట్టుకున్నాను. నాకు సంభవించే అంశాలలోని ఆ రోజువారీ తక్షణత, ఆ వివరం కోల్పోవడం నాకు ఇష్టంలేదు. అది కూడా ఒక ఆశ. తప్పక ఇందులోంచి బయటపడతాను, దీన్ని రాస్తాను అని నాకు తెలుసు’’. ‘నిన్నెవరూ నీ జ్ఞాపకాల్ని రాయమని బలవంతం చేయరు; రాయడమంటూ చేస్తే సాధ్యమైనంత నిజాయితీగా ఉండు.’ ‘గ్యాలరీకోసం రాయను, కానీ పాఠకుడు దాన్ని విడవకుండా చదివేలా చేయగలిగిందంతా చేస్తాను.’ ఆయన ‘మిడ్నైట్స్ చిల్డ్రెన్’ బుకర్ ఆఫ్ బుకర్స్ గౌరవం పొందింది. షేమ్, గ్రౌండ్ బినీత్ హర్ ఫీట్, షాలిమర్ ద క్లౌన్ లాంటి నవలలతోపాటు, హరూన్ అండ్ ద సీ ఆఫ్ స్టోరీస్, లూకా అండ్ ద ఫైర్ ఆఫ్ లైఫ్ లాంటి పిల్లల కథల్ని తన పిల్లలు ఆనందించడం కోసం రాశాడు. ‘‘నా పాత్రల మీద నాకు పొసెసివ్‌నెస్ ఉంటుంది, ఒక్కోసారి వాటిని తలుచుకుని ఏడుస్తాను, పండిట్ ప్యారేలాల్ చనిపోతాడు... ప్రపంచంలో ఎక్కడాలేనంత అందమైన కశ్మీర్ గ్రామం ధ్వంసమవుతుంది... వాటికి జరిగిన అన్యాయాన్ని నేను తట్టుకోలేను, ఈ వాక్యాలు ఇక రాయలేననుకుంటాను... మరి ఇంకోలా జరిగితే బాగుండు... కానీ ఇంకోలా జరగదు, అదే జరిగింది.’’ జీవితాలన్నీ రాజకీయమయమైపోయాయంటాడు రష్దీ. ‘‘పబ్లిక్, ప్రైవేటు జీవితాల మధ్య దూరం తగ్గిపోయింది. గతంలో వాటికి స్పష్టమైన దూరం ఉండేది. అది కేవలం ప్రతి గదిమూలకో టీవీ వచ్చినందువల్ల కాదు. ప్రపంచలో జరిగే ఘటనలు మన రోజువారీ జీవితం మీద ప్రభావం చూపుతున్నాయి. ఉద్యోగం ఉందా లేదా? ఎంత ధనం ఉంది? మన నియంత్రణలో లేని శక్తులు వీటిని నిర్దేశిస్తాయి. నీకు నువ్వు మాత్రమే నీ విధిని నిర్దేశించుకోలేవు, నీ భవనంలోకి ఉన్నట్టుండి విమానం దూసుకురావడం నీ తలరాత. రాజకీయేతరమైన జీవితమంటూ మనకు లేదు.’’ రచయితలు నిస్వార్థంగా రాస్తారనీ, డబ్బు, పేరు కోసం ఆశపడరనీ, వారు కోరుకునేదల్లా సాధ్యమైనంత ఉత్తమ రచయితగా నిలబడాలనీ, సాధ్యమైనంత అత్యుత్తమమైన వాక్యాలు పేర్చాలనీ మాత్రమే అంటారాయన. రచన డిమాండ్ చేసే కష్టం ముందు అమ్మకాలు, స్పందనలు పట్టించుకోదగినవి కావంటారు. ‘నేను ఒక పేరా రాస్తాను, తెల్లారి ఊహూ ఇది బాలేదు అనుకుంటాను, లేదూ, ఇది ఇంకా ఎక్కడైనా సెట్ అవుతుందేమోగానీ ఇక్కడ కాదు అనుకుంటాను.’ ‘ఒక్కోసారి మన టైప్రైటర్లోంచి వచ్చే అక్షరాలు నీ ఒంట్లో విద్యుత్‌ను ప్రసరించేలా చేస్తాయి. అట్లాంటి క్షణాల్లో కచ్చితంగా నమ్మవలసివస్తుంది, రాత అనేది నీ నుంచి కాకుండా నీ ద్వారా బయటికి వస్తుందని.’ ఒక కారణం కోసం కాలం ఎంపిక చేసుకునే ప్రతినిధి- రచయిత! సల్మాన్ రష్దీ అలాంటి ఒక విస్మరించలేని ప్రతినిధి! -
'మోడీ వస్తే కలానికి తాళం'
'మోడీ రాజ్యం వస్తే గుండాలు, రౌడీల రాజ్యం మొదలైనట్టే. భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు మొదలైనట్టే. మోడీ రాజ్యం వస్తూందంటే నాకు ఆందోళన కలుగుతోంది.' సటానిక్ వెర్సెస్ అన్న పుస్తకంతో మతమౌఢ్య శక్తుల దాడులకు గురై ఏళ్ళ తరబడి అజ్ఞాత వాసంలో ఉన్న ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ అన్న మాటలివి. న్యూయార్క్ లో రచయితల భావప్రకటన స్వేచ్ఛ పై జరుగుతున్న పెన్ సదస్సులో పాల్గొన్న ఆయన ఒక వార్తాసంస్థకు ఇంటర్ వ్యూ ఇచ్చారు. మోడీ మార్కు రాజకీయాల పట్ల ఆయన తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే మోడీ రాజ్యంలో రచయితలు, జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా ఉందని, చాలా మంది రచయితలు తమ కలంపై తామే అదుపు పెట్టుకుని జాగ్రత్త పడుతున్నారని ఆయన అన్నారు. మోడీ ప్రజల్లో విభాదాలు సృష్టించే ఛాందసవాద నేత అని ఆయన అన్నారు. మోడీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని దేశవాసులకు పిలుపునిస్తూ లేఖ రాసిన మేధావుల్లో భారతీయ మూలానికి చెందిన ఎన్ ఆర్ ఐ సల్మాన్ రష్దీ కూడా ఉన్నారు. -
విశ్లేషణం: అందమైన మొండివాడు!
సాటానిక్ వెర్సెస్... ఈ పేరు వింటే చాలు ఒక వర్గం ఆగ్రహోదగ్రమవుతుంది. ఈ నవల రాసినందుకు సల్మాన్ రష్దీకి మరణశిక్ష వేస్తూ ఫత్వా కూడా జారీ అయ్యింది. దాంతో రష్దీ చాలాకాలం అజ్ఞాత జీవితం గడపాల్సి వచ్చింది. తన రచనలతో కోట్లాదిమంది పాఠకులను మెప్పించిన రష్దీ అందమైన మగువల మనసులనూ దోచుకున్నాడు. ఒకటికాదు రెండు కాదు నాలుగు వివాహాలు చేసుకున్నాడు. ఈ ప్రఖ్యాత, వివాదాస్పద రచయిత మనసేమిటో ఈ వారం తెలుసుకుందాం. బాడీలాంగ్వేజ్ ఆధారంగా వ్యక్తిత్వాన్ని విశ్లేషించేటప్పుడు ఒక్కో కదలికను విడివిడిగా తీసుకోలేం. సమయం, సందర్భం, మొత్తంగా ఆ వ్యక్తి కదలికలను పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే మనకు ఆ వ్యక్తి అసలైన వ్యక్తిత్వం అర్థమవుతుంది. సల్మాన్ రష్దీ మాట్లాడుతున్నప్పుడు గమనిస్తే... రష్దీ సూటిగా చూస్తూ కనిపిస్తారు. తల, శరీరం కొంచెం కుడివైపుకు వంగి ఉంటాయి. కాలుమీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుని ఉంటాడు. నిల్చుని మాట్లాడుతున్నప్పుడు ఒక జేబులో చేయి పెట్టుకుని, లేదా నడుముపై చేయి పెట్టుకుని ధారాళంగా మాట్లాడతాడు. మాట్లాడే సమయంలో చేతులు ఓపెన్‌గా ఉంటాయి. మాట్లాడే మాటలకు అనుగుణంగా చేతి కదలికలు ఉంటాయి. అప్పుడప్పుడూ గడ్డాన్ని నిమురుకుంటూ లేదా చూపుడువేలుతో పెదవులను తాకుతూ మాట్లాడతాడు. అప్పుడప్పుడూ చక్కగా నవ్వుతాడు. వీటన్నింటినీ సమగ్రంగా విశ్లేషించినప్పుడు... రష్దీ ఓ ఆలోచనా జీవి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కూర్చునే లేదా నిల్చునే విధానం ఆయన స్వేచ్ఛాపరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని... ఇంకా చెప్పాలంటే ఆయన మొండితనాన్ని వ్యక్తంచేస్తాయి. తనను చంపేయాలంటూ ఫత్వా జారీ చేసినా... తాను రాసిన రాతకు కట్టుబడి ఉన్నాడే తప్ప... ఆ రాతలను ఉపసంహరించుకోకపోవడం, క్షమాపణ చెప్పకపోవడంలో ఈ ఆత్మవిశ్వాసాన్ని, మొండితనాన్ని గమనించవచ్చు. మాట్లాడే మాటకు తగ్గట్టుగా ఉండే చేతి కదలికలు ఆయన నిజాయితీకి అద్దం పడతాయి. మనసులో ఉన్నదే మాట్లాడతాడనే విషయాన్ని వెల్లడిస్తాయి. అప్పుడప్పుడూ గడ్డాన్ని నిమురుకోవడం ఆయన దీర్ఘాలోచన చేస్తారని చెబుతుంది. వేళ్లతో పెదవులను తాకడానికి ఆలోచనలను దాచుకుంటున్నారనే అర్థమున్నా... రష్దీ బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని సమగ్రంగా చూసినప్పుడు అది ఆయన దీర్ఘాలోచనలో భాగమనే తెలుస్తుంది. ఇక తనపైన తానే జోక్ చేసుకోవడం, హాయిగా నవ్వడం ఆయన ఓపెన్‌గా, ఉల్లాసంగా ఉంటాడనే విషయాన్ని వ్యక్తంచేస్తాయి. విలువలే బలం... రష్దీ అందగాడనే విషయంలో ఎలాంటి సంకోచం అక్కర్లేదు. ఆయన మాటలు మరింత అందంగా ఉంటాయి. చాలా అందంగా, స్వేచ్ఛగా, ధారళంగా మాట్లాడతాడు. తాను ప్రాముఖ్యం ఇవ్వదలచుకున్న విషయాన్ని నొక్కిచెప్తాడు. దాని ప్రాముఖ్యతకు తగ్గట్టుగా చేతి కదలికలూ ఉంటాయి. రష్దీ బలం ఆయన రచనలో లేదు.. ఆయన నమ్మిన విలువల్లో ఉంది. ఆ విలువలు మతానికి, ప్రాంతానికి, దేశానికీ అతీతమైనవి. ఆ విషయం ఆయన మాటల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఏమిటనేది జీవితం మనకు చెప్తుంది. ఒక భావాన్ని విమర్శించే అవకాశం లేనప్పుడు భావస్వేచ్ఛకు అర్థమేలేదు. పుస్తకం ప్రపంచానికి అద్దంలాంటిది. నీకు ఇష్టంలేకపోతే వదిలేయ్ లేదంటే నువ్వో పుస్తకం రచించు. ఆలోచనలు బాధాకరమై ఉన్న సమయాల్లో కార్యాచరణే సరైన మందు. నేను జీవిస్తున్న ప్రపంచం గురించి చెప్పడానికి నాకు దేవుడనే భావన అవసరంలేదు. రచన అనేది కేవలం తార్కికంగా ఆలోచించి చేసేది కాదు. పుస్తకాలు తమ రచనలను తామే ఎంచుకుంటాయి. రాసేసమయంలో నీ ఆత్మ (సెల్ఫ్)తో నువ్వు కలిసిపో, అక్షరాలు అవే దొర్లుతాయి. పవిత్రత అనే భావన ఏ సంస్కృతికీ సరికాదు. ఎందుకంటే అది.. అభివృద్ధి, మార్పులను నేరాలుగా చూస్తుంది. ... ఇవన్నీ రష్దీ వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలే. వీటన్నింటినీ పరిశీలించినప్పుడు స్వేచ్ఛ పట్ల అతనికున్న విశ్వాసం ఎంత గట్టిదో అర్థమవుతుంది. అంతేకాదు దేవుడు, దెయ్యం, మతంలాంటి వాటికన్నా మనిషి, మానవత్వమే అతను నమ్మిన విలువలనే విషయం స్పష్టమవుతుంది. ఇక నాలుగు వివాహాలంటారా... అందగాడు, అందంగా మాట్లాడగలవాడు, మనసున్నవాడు... ఇక మగువలకు నచ్చకుండా ఉంటాడా?! - విశేష్, సైకాలజిస్ట్