'సల్మాన్ కు ఇప్పటికీ నాపై ప్రేమ ఉంది'
న్యూఢిల్లీ: తాను ఒకే సమయంలో ఇద్దరు మగాళ్లతో డేటింగ్ చేశానని భారత సంతతికి చెందిన మోడల్, సెలబ్రిటీ టీవీ హోస్ట్ పద్మాలక్ష్మి వెల్లడించింది. దీనికి తానేమీ చింతించడం లేదని పేర్కొంది. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్య్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలు వెల్లడించింది. ఒకే టైమ్ లో ఇద్దరు మగాళ్లతో డేటింగ్ తప్పుకాదని, దీనికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వ్యక్తిగత జీవితంపై ఎటువంటి విచారం లేదని, తాను ఎవరికీ క్షమాపణ చెప్పాలనుకోవడం లేదని తెలిపింది.
'లవ్, లాస్, అండ్ వాట్ వుయ్ యేట్: ఏ మెమొయిర్' పేరుతో రాసిన పుస్తకంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు పొందుపరిచినట్టు వెల్లడించింది. ఇప్పటివరకు తనలో గ్లామరస్ కోణం మాత్రమే చూశారని, ఈ పుస్తకంతో రియల్ పద్మాలక్ష్మిని చూస్తారని పేర్కొంది. సంక్లిష్టమైన సంబంధాలు ఎక్కువకాలం నిలబడవని అభిప్రాయపడింది.
తనపై సల్మాన్ రష్దీకి ప్రేమ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదని, తాము ఏ కారణంగా విడిపోయామే తెలియడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీని పెళ్లాడిన పద్మాలక్ష్మి తర్వాత ఆయనతో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. తన కూతురు కృష్ణ తియా లక్ష్మి-డెల్ తో కలిసి పద్మాలక్ష్మి అమెరికాలో నివసిస్తోంది.