సత్వం:రెబెల్
నిన్నెవరూ నీ జ్ఞాపకాల్ని రాయమని బలవంతం చేయరు; రాయడమంటూ చేస్తే సాధ్యమైనంత నిజాయితీగా ఉండు. సల్మాన్ రష్దీకి పేరుపెట్టేటప్పుడు వాళ్ల నాన్నకు ఏదో భవిష్యవాణి వినిపించివుంటుంది. అందుకేనేమో, పన్నెండో శతాబ్దపు స్పానిష్-అరబ్ తత్వవేత్త, ఆ కాలపు గొప్ప ప్రగతివాది ఇబిన్ రష్ద్ మీదుగా తన కుమారుడికి నామకరణం జరిపాడు. ‘‘ఆ శతాబ్దం ఇస్లాంలోని ప్రగతిశీలురకూ, ఛాందసులకూ మధ్య యుద్ధం జరుగుతున్న కాలం. సహజంగానే రష్ద్ ప్రగతిశీలురవైపు గళం విప్పాడు. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నా,’’ అంటాడు రష్దీ.
దానివల్లే (ద సైతానిక్ వర్సెస్) ఆయన ఫత్వాల బారినపడ్డాడు, ‘అనామక’ జీవితం గడిపాడు. సబ్‌వేలో నడుచుకుంటూ వెళ్లి, కావాల్సినవేవో కొనుక్కుంటూ, కారును తానే సొంతంగా నడుపుకొంటూ, సినిమాలు, ఫుట్‌బాల్ ఆటకు వెళ్తూ... చాలా చిన్న కోరికలకు దూరమై, పోలీసుల నీడలో, బుల్లెట్‌ప్రూఫు రక్షణలో బతికాడు. ఒక్కోసారి రచనా వ్యాసంగంకన్నా కండక్టర్ అయినా మేలేమో, అనుకున్న క్షణాల్లోకి జారిపోయాడు.
భావస్వేచ్ఛ మీద ఆయన ఇలా వ్యాఖ్యానిస్తాడు: ‘‘భావస్వేచ్ఛ వాదంతో ఉన్న సమస్యేమిటంటే, నీకు ఎవరు నచ్చరో వాళ్లకోసం కూడా నువ్వు నిలబడాల్సివుంటుంది. నువ్వు ఆరాధించేవాళ్ల భావస్వేచ్ఛ మాత్రమే భావస్వేచ్ఛ కాదు; నువ్వు నిందించేవాళ్లకు కూడా అదే భావస్వేచ్ఛ వర్తిస్తుంది. (నల్లవాడైన) మార్టిన్ లూథర్ కింగ్‌నీ సమర్థించాలి, (నల్లవాళ్లను చంపిన) కు క్లక్స్ క్లాన్‌నీ సమర్థించాలి. అది అలా ఉంటుంది. సూత్రం కోసం నిలబడితే, ఆ సూత్రాన్ని దుర్వినియోగం చేసేవాళ్లకోసం కూడా నిలబడాల్సివస్తుంది. భంగం వాటిల్లకూడని హక్కు అంటూ ప్రపంచంలో ఏదీలేదు. స్వేచ్ఛా సమాజంలో, దాపరికం లేని సమాజంలో జనం చాలా బలమైన అభిప్రాయాలు కలిగివుంటారు; అవి ఒక్కోసారి పరస్పరం ఘర్షించుకుంటాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటివాటితో వ్యవహరించడం నేర్చుకోవాలి... ఇది నవలలకైనా, కార్టూన్లకైనా వర్తిస్తుంది.’’
‘మన జీవితమే కథగా మారిపోవడం కంటే శాపం ఇంకేముంటుంది?’ అని ప్రశ్నిస్తాడాయన. లండన్, న్యూయార్క్ నగరాల్లో గోప్యంగా బతికినకాలం గురించి ఇలా అంటాడు: ‘‘... అందుకే ఒక నోట్స్ పెట్టుకున్నాను. నాకు సంభవించే అంశాలలోని ఆ రోజువారీ తక్షణత, ఆ వివరం కోల్పోవడం నాకు ఇష్టంలేదు. అది కూడా ఒక ఆశ. తప్పక ఇందులోంచి బయటపడతాను, దీన్ని రాస్తాను అని నాకు తెలుసు’’. ‘నిన్నెవరూ నీ జ్ఞాపకాల్ని రాయమని బలవంతం చేయరు; రాయడమంటూ చేస్తే సాధ్యమైనంత నిజాయితీగా ఉండు.’ ‘గ్యాలరీకోసం రాయను, కానీ పాఠకుడు దాన్ని విడవకుండా చదివేలా చేయగలిగిందంతా చేస్తాను.’
ఆయన ‘మిడ్‌నైట్స్ చిల్డ్రెన్’ బుకర్ ఆఫ్ బుకర్స్ గౌరవం పొందింది. షేమ్, గ్రౌండ్ బినీత్ హర్ ఫీట్, షాలిమర్ ద క్లౌన్ లాంటి నవలలతోపాటు, హరూన్ అండ్ ద సీ ఆఫ్ స్టోరీస్, లూకా అండ్ ద ఫైర్ ఆఫ్ లైఫ్ లాంటి పిల్లల కథల్ని తన పిల్లలు ఆనందించడం కోసం రాశాడు. ‘‘నా పాత్రల మీద నాకు పొసెసివ్‌నెస్ ఉంటుంది, ఒక్కోసారి వాటిని తలుచుకుని ఏడుస్తాను, పండిట్ ప్యారేలాల్ చనిపోతాడు... ప్రపంచంలో ఎక్కడాలేనంత అందమైన కశ్మీర్ గ్రామం ధ్వంసమవుతుంది... వాటికి జరిగిన అన్యాయాన్ని నేను తట్టుకోలేను, ఈ వాక్యాలు ఇక రాయలేననుకుంటాను... మరి ఇంకోలా జరిగితే బాగుండు... కానీ ఇంకోలా జరగదు, అదే జరిగింది.’’
జీవితాలన్నీ రాజకీయమయమైపోయాయంటాడు రష్దీ. ‘‘పబ్లిక్, ప్రైవేటు జీవితాల మధ్య దూరం తగ్గిపోయింది. గతంలో వాటికి స్పష్టమైన దూరం ఉండేది. అది కేవలం ప్రతి గదిమూలకో టీవీ వచ్చినందువల్ల కాదు. ప్రపంచలో జరిగే ఘటనలు మన రోజువారీ జీవితం మీద ప్రభావం చూపుతున్నాయి. ఉద్యోగం ఉందా లేదా? ఎంత ధనం ఉంది? మన నియంత్రణలో లేని శక్తులు వీటిని నిర్దేశిస్తాయి. నీకు నువ్వు మాత్రమే నీ విధిని నిర్దేశించుకోలేవు, నీ భవనంలోకి ఉన్నట్టుండి విమానం దూసుకురావడం నీ తలరాత. రాజకీయేతరమైన జీవితమంటూ మనకు లేదు.’’
రచయితలు నిస్వార్థంగా రాస్తారనీ, డబ్బు, పేరు కోసం ఆశపడరనీ, వారు కోరుకునేదల్లా సాధ్యమైనంత ఉత్తమ రచయితగా నిలబడాలనీ, సాధ్యమైనంత అత్యుత్తమమైన వాక్యాలు పేర్చాలనీ మాత్రమే అంటారాయన. రచన డిమాండ్ చేసే కష్టం ముందు అమ్మకాలు, స్పందనలు పట్టించుకోదగినవి కావంటారు. ‘నేను ఒక పేరా రాస్తాను, తెల్లారి ఊహూ ఇది బాలేదు అనుకుంటాను, లేదూ, ఇది ఇంకా ఎక్కడైనా సెట్ అవుతుందేమోగానీ ఇక్కడ కాదు అనుకుంటాను.’ ‘ఒక్కోసారి మన టైప్‌రైటర్‌లోంచి వచ్చే అక్షరాలు నీ ఒంట్లో విద్యుత్‌ను ప్రసరించేలా చేస్తాయి. అట్లాంటి క్షణాల్లో కచ్చితంగా నమ్మవలసివస్తుంది, రాత అనేది నీ నుంచి కాకుండా నీ ద్వారా బయటికి వస్తుందని.’ ఒక కారణం కోసం కాలం ఎంపిక చేసుకునే ప్రతినిధి- రచయిత! సల్మాన్ రష్దీ అలాంటి ఒక విస్మరించలేని ప్రతినిధి!