మంచిమాట
మనం ఏ కార్యాన్ని ఆచరించినా త్రికరణశుద్ధితో ఆచరించాలి. మనస్సుకు, మాటకు, చేతకు తేడా లేకుండా ఉండటమనే నిజాయితీనే త్రికరణశుద్ధిగా వ్యవహరించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, మనోవాక్కాయాల శుద్ధి. కార్యాన్ని మనసావాచా, కర్మణా అన్నిటా ఏకీభావ స్థితిలో మలచుకోవడమే త్రికరణశుద్ధి. మనసులో ఏ విధంగా కార్యాన్ని చేయాలని మనం సంకల్పిస్తామో, వచస్సులో, అంటే మన మాటల్లోనూ అదే ప్రతిఫలించాలి. కర్మణా అంటే కార్యాన్ని ఆచరించే విధానమూ మనం తలచిన విధంలో, చెప్పిన సంవిధానంలో పూర్తి చేయాలి. అప్పుడే ఆ కార్యం త్రికరణశుద్ధి కలిగినదై, లోకాన రాణింపుకు వస్తుంది.
మనం ఎన్నో గొప్ప కార్యాలను మదిలో సంకల్పిస్తాం. తీరా, ఆ పనులను గురించి నలుగురిలో విడమరచి చెప్పాలంటే ఎందుకో బిడియం, ఎవరు ఏమనుకుంటారో..? అనే సందేహం. మనం సాధించగలమో లేదో అని అనుమానం. ఒకవేళ, మరీ సాహసం చేసి కొంతవరకు చెప్పగలిగినా, మళ్ళీ ఆచరించే సమయంలో మనకున్న సందేహాలతో ముందుకు సాగకుండా ఆగిపోతాం, దానికితోడు అనుకోకుండా ఎదురయ్యే అవాంతరాలు..!! ఈ విధంగా చేసే కార్యాలు నిరర్ధకమైన రీతిలోనే సాగుతాయి.
మన మనసు అత్యంత పవిత్రమైనదనీ, సమస్త పుణ్యాలు అగణ్యమైన రీతిలో ఈ ధరిత్రిలో జరిగింది కేవలం మనసువల్లనేనని పెద్దల ఉవాచ. ఇహ వాక్కు సాక్షాత్తూ సర్వాంతర్యామి మనకు ప్రసాదించిందే. అందుకని తలచిన పనులు సఫలం అవాలంటే, మనం భావించిన విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచగలగాలి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఏ పనిలోనైనా కార్యసిద్ధి అనేది ఒక్కరి వల్ల జరగదు.
అది సమిష్టిగా, నలుగురితో కలిసి కృషి చేయడం వల్ల జరుగుతుంది లేదా కొంతమంది వ్యక్తుల సమన్వయంతో జరుగుతుంది. అధికశాతం పనులు రకరకాల వ్యక్తుల సమన్వయంతోనే జరుగుతాయి. ఈ కార్యక్రమంలో కొంతమంది విద్యాధికులు, కొంతమంది ఎక్కువగా చదువుకోనివారు కూడా భాగం కావచ్చు. వీరందరి మధ్యా జరిగే సమన్వయమే త్రికరణాలతో కూడుకుని తలపెట్టిన పనిలో కార్యసిద్ధిని కలిగిస్తుంది.
త్రికరణశుద్ధిగా చరించే మనిషి తనను తాను మూర్తిమంతంగా నడుపుకుంటూ, విజయాలను అవలీలగా సొంతం చేసుకోవడం జరుగుతుంది.
త్రికరణశుద్ధిగా వుండడమే సిసలైన జీవనానికి ఆనందసూత్రం..!!
త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే మకరంద భరితమైన జీవనం అమితంగా లభ్యమవుతుంది. అందుకని ప్రతివాడు పాటించవలసింది ఒక్కటే.. ‘‘ఆనందంగా, స్థితప్రజ్ఞునిగా ఉండాలంటే త్రికరణశుద్ధిని తప్పనిసరిగా కలిగి వుండాలి. తెలియనిది మాట్లాడకుండా, తనకు అవగాహన ఉన్న విషయాలనే మాట్లాడడం. మాట్లాడిందే ఆచరించడం ప్రధానంగా పాటించవలసిన అంశాలు. ఇవి మొక్కుబడిగా కాకుండా, మక్కువతో పాటిస్తే, జగతిలో గొప్ప విజయాలు నిత్యమూ ఆవిష్కృతమవుతాయి.
‘‘త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును.. లోకము మెచ్చును’’ అన్న సంకీర్తనాచార్యుని వాక్కులు అక్షరసత్యం. త్రికరణశుద్ధితోనే జీవనానికి నిజమైన సత్వం, పసకలిగిన పటుత్వం కలుగుతాయి.
బుద్ధిమతుల ఆలోచనా సరళికి ఆధారమూలం జీవనగమనంలో వారు కలిగి ఉండే త్రికరణశుద్ధి..!! ఈ లక్షణం కలిగిన వారికి తప్పక ఒనగూడుతుంది అన్నిటా కార్యసిద్ధి..
– వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి
Comments
Please login to add a commentAdd a comment