Venkat garikapati
-
త్రికరణశుద్ధితో జీవనసిద్ధి
మనం ఏ కార్యాన్ని ఆచరించినా త్రికరణశుద్ధితో ఆచరించాలి. మనస్సుకు, మాటకు, చేతకు తేడా లేకుండా ఉండటమనే నిజాయితీనే త్రికరణశుద్ధిగా వ్యవహరించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, మనోవాక్కాయాల శుద్ధి. కార్యాన్ని మనసావాచా, కర్మణా అన్నిటా ఏకీభావ స్థితిలో మలచుకోవడమే త్రికరణశుద్ధి. మనసులో ఏ విధంగా కార్యాన్ని చేయాలని మనం సంకల్పిస్తామో, వచస్సులో, అంటే మన మాటల్లోనూ అదే ప్రతిఫలించాలి. కర్మణా అంటే కార్యాన్ని ఆచరించే విధానమూ మనం తలచిన విధంలో, చెప్పిన సంవిధానంలో పూర్తి చేయాలి. అప్పుడే ఆ కార్యం త్రికరణశుద్ధి కలిగినదై, లోకాన రాణింపుకు వస్తుంది.మనం ఎన్నో గొప్ప కార్యాలను మదిలో సంకల్పిస్తాం. తీరా, ఆ పనులను గురించి నలుగురిలో విడమరచి చెప్పాలంటే ఎందుకో బిడియం, ఎవరు ఏమనుకుంటారో..? అనే సందేహం. మనం సాధించగలమో లేదో అని అనుమానం. ఒకవేళ, మరీ సాహసం చేసి కొంతవరకు చెప్పగలిగినా, మళ్ళీ ఆచరించే సమయంలో మనకున్న సందేహాలతో ముందుకు సాగకుండా ఆగిపోతాం, దానికితోడు అనుకోకుండా ఎదురయ్యే అవాంతరాలు..!! ఈ విధంగా చేసే కార్యాలు నిరర్ధకమైన రీతిలోనే సాగుతాయి.మన మనసు అత్యంత పవిత్రమైనదనీ, సమస్త పుణ్యాలు అగణ్యమైన రీతిలో ఈ ధరిత్రిలో జరిగింది కేవలం మనసువల్లనేనని పెద్దల ఉవాచ. ఇహ వాక్కు సాక్షాత్తూ సర్వాంతర్యామి మనకు ప్రసాదించిందే. అందుకని తలచిన పనులు సఫలం అవాలంటే, మనం భావించిన విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచగలగాలి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఏ పనిలోనైనా కార్యసిద్ధి అనేది ఒక్కరి వల్ల జరగదు. అది సమిష్టిగా, నలుగురితో కలిసి కృషి చేయడం వల్ల జరుగుతుంది లేదా కొంతమంది వ్యక్తుల సమన్వయంతో జరుగుతుంది. అధికశాతం పనులు రకరకాల వ్యక్తుల సమన్వయంతోనే జరుగుతాయి. ఈ కార్యక్రమంలో కొంతమంది విద్యాధికులు, కొంతమంది ఎక్కువగా చదువుకోనివారు కూడా భాగం కావచ్చు. వీరందరి మధ్యా జరిగే సమన్వయమే త్రికరణాలతో కూడుకుని తలపెట్టిన పనిలో కార్యసిద్ధిని కలిగిస్తుంది.త్రికరణశుద్ధిగా చరించే మనిషి తనను తాను మూర్తిమంతంగా నడుపుకుంటూ, విజయాలను అవలీలగా సొంతం చేసుకోవడం జరుగుతుంది.త్రికరణశుద్ధిగా వుండడమే సిసలైన జీవనానికి ఆనందసూత్రం..!!త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే మకరంద భరితమైన జీవనం అమితంగా లభ్యమవుతుంది. అందుకని ప్రతివాడు పాటించవలసింది ఒక్కటే.. ‘‘ఆనందంగా, స్థితప్రజ్ఞునిగా ఉండాలంటే త్రికరణశుద్ధిని తప్పనిసరిగా కలిగి వుండాలి. తెలియనిది మాట్లాడకుండా, తనకు అవగాహన ఉన్న విషయాలనే మాట్లాడడం. మాట్లాడిందే ఆచరించడం ప్రధానంగా పాటించవలసిన అంశాలు. ఇవి మొక్కుబడిగా కాకుండా, మక్కువతో పాటిస్తే, జగతిలో గొప్ప విజయాలు నిత్యమూ ఆవిష్కృతమవుతాయి.‘‘త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును.. లోకము మెచ్చును’’ అన్న సంకీర్తనాచార్యుని వాక్కులు అక్షరసత్యం. త్రికరణశుద్ధితోనే జీవనానికి నిజమైన సత్వం, పసకలిగిన పటుత్వం కలుగుతాయి.బుద్ధిమతుల ఆలోచనా సరళికి ఆధారమూలం జీవనగమనంలో వారు కలిగి ఉండే త్రికరణశుద్ధి..!! ఈ లక్షణం కలిగిన వారికి తప్పక ఒనగూడుతుంది అన్నిటా కార్యసిద్ధి..– వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
సమయం.. సుధారసమయం..
కాలం భగవత్స్వరూపం. ప్రాణుల్ని, జగత్తునూ నడిపించేదీ, హరించేదీ కాలమే. సృష్టి, స్థితి, వినాశం అనే ప్రధానమైన కార్యాలకు సాక్షీభూతంగా నిలిచేదీ కాలమే. అత్యంత బలవత్తరమైన కాలప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఆధ్యాత్మిక సాధనలూ కాలాన్ని బంధించలేవు. ‘‘పారే నదిలో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో అలాగే గతించిన కాలాన్ని పట్టుకోలేం. అందుచేత కాలమహిమను ప్రతి ఒక్కరూ గుర్తించండి’’ అంటాడు చాణుక్యుడు. చాణుక్యుని వాక్యాలు ఎంతో అర్థవంతమైనవి.జీవితంలో ప్రతిక్షణం వెలకట్టలేనిదే. గడిచిపోయిన క్షణం మళ్ళీ తిరిగిరాదు. అందుకే, కాలాన్ని విధిగా పాటించడం, లేదా సమయపాలనకు కట్టుపడడం అనేది ప్రతివారికీ అత్యంత ముఖ్యమైన విధి. సమయపాలనకు సంబంధించి రకరకాల నిర్వచనాలు మనకు నిత్యమూ కనబడుతూ ఉంటాయి. సమయానికి మనం అనుకున్న పనిలో, విహితమైన తీరులో, ఏకాగ్ర చిత్తంతో నిమగ్నం కావడాన్నే సమయపాలన అని చెప్పుకోవచ్చు.ఏదైనా పనికోసం మనం సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆ కార్య పరిపూర్ణతకు ఉపకరించి, సంతృప్తిని కలిగిస్తుంది. ఏదైనా ఉన్నతమైనలక్ష్యాన్ని సాధించడంకోసం సమయాన్ని కేటాయిస్తే, అది మనలో మేధాశక్తినీ పెంచడమే గాక, వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రానికీ చేరుస్తుంది. అమేయమైన సారాన్ని నింపుకున్న పుస్తకాలను గానీ, గ్రంథాలను గానీ చదవడానికి సమయాన్ని కేటాయిస్తే, మనలో మనోవికాసం పెంపొందుతుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలోనే నిమగ్నం కాకుండా, ఒకింత నవ్వుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే , అది మన జీవితాన్ని ఆహ్లాదమయం చేస్తుంది.కొంత సమయాన్ని పక్కవాడికి సహాయం చేయడానికి కేటాయిస్తే, అది మనకు ఆత్మానందాన్ని కలిగిస్తుంది. దైనందిన జీవితంలో వ్యాయామానికి సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆరోగ్యప్రదాయినియై సంతసాన్ని కలిగిస్తుంది. సమయం విలువ ప్రతివారూ గుర్తెరగడం అత్యంత ముఖ్యమైన విషయం. ప్రత్యేకించి, పిల్లలకు సమయానికి తగినట్లుగా పనులు అలవాటు చేయడం తల్లితండ్రుల బాధ్యత. ముఖ్యంగా ఉదయాన నిద్రలేవడం నుంచీ, రాత్రి పడుకునే వరకు, వాళ్ళు ఏ సమయానికి ఏం చేయాలో తెలియజెప్పడం తప్పనిసరిగా చేయాలి. ముందు కొంత బద్ధకించినా, కొన్ని రోజులకు సమయం ప్రకారం పనులు చేయడం వారికి అలవాటుగా మారుతుంది. జీవితానికి ఉత్తమ బాటను పరుస్తుంది.‘‘ క్షణము గడిచిన దాని వెన్కకు మరల్పసాధ్యమే మానవున కిలాచక్రమందు‘ అంటారు శ్రీ జాషువ మహాకవి. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వవిఖ్యాతి గడించిన మహనీయులందరూ ఏరంగానికి చెందిన వారైనా కాలం విలువ బాగా తెలిసిన వారే సమయాన్ని సద్వినియోగపరచుకున్నవారే . కాలం అనేది మనం ఆపితే ఆగదు . కాబట్టి ఏ సమయంలో ఏపని చెయ్యాలో ఆ సమయం లో ఆపని చేస్తే సమయం సద్వినియోగపరిచినట్లే.ప్రపంచంలో గొప్పవాళ్ళయిన వ్యక్తులందరూ కాలం విలువ తెలిసిన వాళ్ళే. ప్రతీ క్షణాన్నీ సద్వినియోగం చేసినవాళ్ళే. స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన సందేశం ఎంతో ప్రభాసమానంగా ఉంటుంది. ‘‘యువతీయువకుల్లారా.. మీరంతా మేల్కొనండి. లక్ష్య సాధనకోసం శ్రమించే క్రమంలో ప్రతి క్షణాన్నీ సద్వినియోగపరచండి. మీరు మండే నిప్పు కణికలు అని గమనించండి. మిమ్మల్ని వెనుకకు నెట్టే ఒకే ఒక్క గుణం సోమరితనం. కాబట్టి కాలం విలువ ఎరిగినవారై, బద్దకాన్ని వదలండి.’’ అంటూ పలికిన సందేశం అత్యంత విలువైనది. సమయం విలువను కాల రాచే మహమ్మారి లాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి . పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది . ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది ఏమాత్రం వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలోసార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని ఏమాత్రం కాదు.జగత్ప్రసిద్ధమైన ఆపిల్ కంపెనీ సహవ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ, ‘‘నీ సమయం ఎంతో విలువైనది. ఆ సమయాన్ని వినియోగించి నీ జీవితాన్ని స్వర్గమయం చేసుకో. కాలాన్ని వ్యర్థం చేసుకుని, ఇంకొకరి జీవితంలో నీవు బతకకు’’ అంటారు. ఇందులో ఎంతో సందేశం ఉంది. కాలం విలువ తెలుసుకుని, ప్రగతినిసాధిస్తూ, ముందుకు సాగమని, ఇంకొకరితో తనను పోల్చుకోకుండా ధరిత్రిలో మరొక కొత్త చరిత్రను లిఖించమనే ప్రబోధమూ ఈ మాటల్లో దాగి ఉంది. – వెంకట్ గరికపాటి వ్యాఖ్యాన విశారద‘‘ప్రపంచంలో అతి విలువైన వస్తువులు రెండు.. మొదటిది సహనం, రెండోది కాలం.’’ అంటారు లియో టాల్స్టాయా. సృష్టిలో మనకు లభించే అత్యంత విలువైన సంపద కాలమే. కానీ అత్యంత దయనీయంగా నిత్యమూ మనం వృథా చేసేదీ కాలాన్నే..!!‘‘సమయం ప్రధానమైన విషయాల్లో ఒకటి కాదు. సమయమే అత్యంత ప్రశస్తమైన సంపద’’ అని యువత గ్రహిస్తే, వారి భవిత బంగరుబాట కావడం కష్టమైన విషయమేమీ కాదు. కాలానికి గాలం వేయడం కష్టమే. కానీ, దాని విలువను తెలుసుకుని, విహితమైన ఆలోచనకు ఆలవాలం చేసి, సద్వినియోగపరచిన ప్రతివ్యక్తీ చేయగలిగేది సుగతితో, ప్రగతితో కూడిన మహేంద్రజాలమే. -
ఆత్మ గౌరవం.. జీవన వనాన విరిసే ఆమని
ఆత్మగౌరవం మనిషికి నిజమైన ఆభరణంలా భాసిస్తుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకుని, నమ్మిన సిద్ధాంతం కోసం, విలువలకోసం రాజీ పడకుండా ముందుకు సాగే లక్షణానికి మనం చెప్పుకునే అందమైన పదభూషణం ‘ఆత్మ గౌరవం’. సమపాళ్ళలో కలిగి ఉండే ఈ లక్షణం సమాజంలో అగణ్యత, అగ్రగణ్యత సంపాదిస్తుందో లేదో తెలియదు కానీ, జీవన గమనానికి ఖచ్చితంగా నిజమైన నాణ్యతను సంతరిస్తుంది. ‘‘ఆయనకు చాలా ఆత్మగౌరవం ఎక్కువండీ.. ఎక్కడా రాజీ పడకుండా జీవిస్తాడు’’ అనే మాటను మనం కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి, మిగిలినవాళ్ళు మాట్లాడుకోవడం వింటూ ఉంటాం. అహంకారం ఉన్నవారు తమకోసం కాక, ఎదుటివాళ్ల దృష్టిలో తాము గొప్పగా వున్నట్లుగా భావన చేసుకుని జీవికను సాగిస్తారు. ఎవరైనా తన గురించి తక్కువ, ఎక్కువల తేడా చూపిస్తే చాలు, అవమానంతో రగిలిపోతారు. అహంకారంతో ఉండేవాళ్ళు, విలువలకోసం ప్రయత్నించక, పక్కవారి ముందు ఉన్నతులుగా గుర్తింపబడాలని కోరుకుంటారు. వీరిలో చెలరేగే అహంకారం వారిలో ఉన్న మంచిని కూడా ఎదుటివారిని చూడనీయకుండా చేస్తుంది. సంఘంలో మనకు ఎక్కువగా ఈ తరహా వ్యక్తులే తారసపడుతూ ఉంటారు. స్వల్పమాత్రపు భేదాన్ని మాత్రం మనం ఇక్కడ తప్పనిసరిగా గ్రహించాలి. అహంకారంతో వర్తించడం ఎటువంటి నేరమో, ఆత్మగౌరవాన్ని చంపుకోవడం అంతకుమించిన దోషం..!! మనం నమ్ముకున్న సూత్రాల విషయంలో అవలంబించే రాజీ ధోరణి తాత్కాలికంగా సుఖమయమనిపించినా, దీర్ఘకాలంలో తప్పనిసరిగా మనకు మానసిక క్లేశాన్ని కలిగిస్తుందని ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తాయి. ఆత్మగౌరవం అనే భావన ఒక వ్యక్తి తన గురించి కలిగి ఉన్న విలువ, అవగాహనకు సంబంధించిన భావన.దీని ఆధారంగా, ఒక వ్యక్తి తోటివారితో సాగే గమనంలో విభిన్న విషయాల్లో తనకు ఎటువంటి స్థానం ఉందో కనుగొంటాడు. ఆత్మగౌరవానికి నిర్వచనాన్ని చెప్పవలసి వస్తే, దాదాపుగా స్వీయ–ప్రేమకు, ఈ పదాన్ని సమానంగా చెప్పవచ్చు. తన గౌరవాన్ని గురించి ఎవరైనా, ఏ సందర్భంలోనైనా ప్రకటించ వలసి వస్తే,ఆత్మగౌరవం అనే పదం వ్యక్తికి గల స్వీయ గౌరవం అనే పదానికి ప్రత్యక్ష అర్థంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తనని తాను ప్రేమించడం స్వార్థం లేదా అనారోగ్యం కాదు; ఇది ఒక ప్రాథమిక భావన. తనని తాను ప్రేమించుకోవడం అనేది ప్రతి వ్యక్తీ చేసే పనే. తనకు మంచి జరగాలని కోరుకోవడమూ సహజమే.. అయితే, తనకే మంచి జరగాలని కోరుకోవడాన్ని స్వార్ధభావనగా మనం పేర్కొంటూ ఉంటాం. ప్రతికూల ఆలోచనలను అంతం చేయడం, జ్ఞానాన్ని పెంచే లేదా వ్యక్తికి మంచి అనుభూతిని కలిగించే కార్యకలాపాలు చేయడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, చేసిన తప్పులను తెలుసుకోవడం మొదలైనవి మనలో మరింత ఆత్మగౌరవాన్ని పెంచుతాయి. ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు గుర్తొచ్చే మరో పదం ‘అహంకారం’. పరిణతి చెందిన వ్యక్తులు సైతం తమ వైఖరిని వ్యక్తపరిచే సందర్భంలో, ఆ విధంగా మాట్లాడితే అహంకారులుగా తమను ఎదుటివారు భావిస్తారేమో అని సందేహించే సందర్భాలూ ఉంటాయి. అయితే, ఆత్మగౌరవానికీ, అహంకారానికీ మధ్య తేడా బాగానే ఉంది. సమాజం తీరును మనం నిశితంగా పరికిస్తే, అత్యాశలకు లోనైనప్పుడే, మనిషి జీవనశైలిలో ఉన్న సమతౌల్యం దెబ్బ తింటుంది. అనవసరమైన కోరికలనే గుర్రాలవెంట పరుగెడుతూ, వాటిని ఏ విధంగానైనా తీర్చుకోవాలనే తపన ప్రబలినప్పుడే, మనిషి తాను పాటించే విలువల విషయంలో, ఆత్మను వంచన చేసుకునేలా రాజీపడి, ఎదుటివాడి ముందు తలను వంచుతాడు. ఒకరకంగా దీన్నే నైతిక పతనానికి నాంది అని చెప్పవచ్చు. ఎందుకు ఈ అనవసరపు వెంపర్లాట..!! ఎవరికీ తలవంచకుండా, అధికమైన ఆశలతో ఎవరెవరినో ఆశించకుండా, దృఢమైన చిత్తంతో సాగుతూ, నిండుగా నిలుపుకునే ఆత్మగౌరవమే గుండెకు ఆనందరవం..!! జీవన వనాన విరిసే ఆమనిలో అదే మధురంగా కిలకిలమనే కోకిలారావం..!! ఆత్మగౌరవం అన్నది మనిషి ఉత్తమ ప్రవృత్తిని తెలియపరుస్తుంది. ఒక మంచి ప్రవర్తనకు జగతి లో అందే విలువను పరోక్షంగా ఆత్మగౌరవానికి నమూనాగా ప్రకటించవచ్చు. సంస్కారాలు, విలువలు, నియమాలతో కూడిన జీవన ఆచరణ కలిగినవారు ఒకరి ముందు తలవంచరు. దీనికి ధనంతో ఏమాత్రం పనిలేదు. సంస్కారాలకు ఉన్న మహత్తరమైన విలువ అలాంటిది. వీరు ఆదర్శ జీవనాన్ని జీవిస్తూ, ఉన్నంత లో ఎదుటివాళ్లచేత గుర్తింపును, గౌరవాన్ని పొందేవారుగా తమను తాము మలుచుకంటారు. అలాంటి వారు తమకు తాము కొన్ని హద్దులు పెట్టుకొని వాటిని దాటకుండా ఒక్కరిపైన ఆధారపడకుండా ఆత్మగౌరవంతో నిరంతరం జీవిస్తారు. – ‘‘వ్యాఖ్యాన విశారద’’ వెంకట్ గరికపాటి -
మలి వసంతమూ సంతసమే..
ప్రతి మనిషి జీవిత దశని రెండు ప్రధాన అంగాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ఉద్యోగబాధ్యతలు నిర్వర్తిస్తూ భార్యాబిడ్డలతో కాలాన్ని గడపడం. రెండోది.. బాధ్యతలను పూర్తిచేసి, ఉద్యోగవిరమణ తర్వాత లేదా ఆరు పదులు నిండాక గడిపే కాలం. వీటిలో మొదటి దశకే ప్రాధాన్యం ఉందని, రెండో దశ పనికిరానిదని భావించడం ఏమాత్రం సమంజసం కాదు. మానవుడు జన్మించాక తన జీవనకాలంలో విభిన్నమైన పరిణామదశలను ఎదుర్కొంటాడు. ముందుగా బాల్యం, తర్వాత కౌమారం, ఆ తర్వాత యవ్వన, ప్రౌఢ దశలను దాటుకుని వృద్ధాప్యంలోనికి అడుగిడడం జరుగుతుంది. ఇది అత్యంత సహజంగా జరిగే జీవన క్రమం. వృద్ధాప్యంలోనికి రాగానే జీవితం అంతా అయిపోయిందని అధిక శాతం వృద్ధులు నైరాశ్యానికి గురి అవుతూ ఉంటారు. అది చాలా తప్పు. ప్రతి జీవన దశలోనూ మనిషికి ప్రత్యేకమైన విషయాలపై శ్రద్ధ కనబరచవలసి ఉంటుంది. అదే విధంగా వృద్ధాప్యంలోనూ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే, మలిసంజెలో వెల్లివిరిసే కాంతులు వారికి మనోహరంగానే అగుపిస్తాయి. బాల్యంలో, యవ్వనంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలుఆ దశలు పూర్తి అయిన తర్వాతి దశల్లో కూడా మనకు గుర్తుంటాయి.యవ్వనంలో జీవితాన్ని అనుభవించినప్పటి అందమైన రూపం, దఢమైనశరీరం ఇప్పుడు లేకపోయినా, అప్పటి అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో పదిలంగా, మధురంగా మన మనస్సులో గుర్తుంటుంది. వృద్ధాప్యంలో ప్రతివారి మదిలో కలిగే సందేహమూ, వారుప్రకటించే భావమూ ఒకటే.. ‘‘నేను ఇది వరకు ఉన్నట్లుగా ఉండలేకపోతున్నాను’’ అనే మాట. ఇది చాలా పెద్ద తప్పిదం. యవ్వనంలో ఉన్నట్లుగా ప్రౌఢవయసులో మనిషి ఉండలేనట్లే, వృద్ధాప్యంలోనూ ప్రౌఢవయసులో ఉన్న సత్తువ మనిషిలో ఉండదు. ఈ విషయాన్ని గ్రహించకపోవడం, గ్రహించినా, విచారిస్తూ ఉండడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. యవ్వనంలో దట్టమైన పటుత్వం, దిట్టమైన బిగువు జీవులందరికీ భగవానుడు ప్రసాదించే సహజ గుణం. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ బిగువు సడలుతూ ఉంటుంది. దానికి ఆవేదన చెందడం నిరర్ధకం. అది శరీరానికుండే సహజ లక్షణం. వయసు పెరుగుతున్నకొద్దీ మనిషికి పెరిగే సంపద ఆపారమైన వారి అనుభవం. గడచిపోయిన కాలం ఒక అనుభవాల సుమహారంలా వారి చెంత పరిమళిస్తూ ఉంటుంది. ఎంతో విలువైన అనుభవాలు, అవి నేర్పిన పాఠాలను యువతరానికి నేర్పడాన్ని మించిన ఆనందం ఎవరికన్నా ఏముంటుంది? ప్రతి అనుభవం ఎంతో విలువైనది. ఎన్నో కష్టాలను, దుఃఖాలను దాటుకుని తెచ్చుకున్న విజయాలను పంచుకుని భావి తరాలను తీర్చిదిద్దగలిగింది విశ్రాంత జీవనం గడిపి మలి సంజలో కాలం గడిపే అనుభవ సంపన్నులే. వారి అనుభవాల చేవను ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథాలూ అందించలేవు. అనుభవైక వేద్యమైన వారి జీవనగమనాన్ని కొడుకులతో, మనవళ్ళతో పంచుకుంటూ గడపడం ఆహ్లాదకరమైన విషయం. వృద్ధులు పండుటాకులు కాదు. అనుభవంతో మన ముందు నిలిచే నిండైన అమృతభాండాలు..అనుభవాలను పంచుకునే సమయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతివాళ్ళూ ఆచరించాలి. పిల్లలకు మంచి విషయాలను బోధించడంలో తమను తాము నియంత్రించుకోవాలి. ‘‘మా రోజుల్లో ఇటువంటివి లేనేలేవు.. మేము ఆ రోజుల్లో ఈ విధంగానే చేశామా’’ అన్న నిరసనాపూర్వక మాటలను మాట్లాడకూడదు. ఈ తరహా మాటలను నేటి తరం ఏ మాత్రం హర్షించదు. ‘‘నువ్వు వెళ్ళే పద్ధతి బావుంది.. కొంచెం నేను చెప్పేది కూడా నీ విజయానికి గానీ, నీ సమస్య పరిష్కారానికి గానీ పనికి వస్తుందేమో చూడు’’ అని మృదువుగా అంటే చాలు, ఆ మాటలు యువత హృదయానికి మరింత గా చేరువ అవుతాయి. పెద్దవాళ్ళు ఆ విధంగా మాట్లాడితే, తమ తర్వాతి తరం వారిని తప్పు పడుతున్నట్లుగా గాక, సాఫల్యపు బాటలో నడిపిన వాళ్ళవుతారు. దేశంలోని, ప్రపంచంలోని రకరకాల ప్రదేశాలు చూసే అవకాశం కేవలంవిశ్రాంత జీవనంలోనే ఎవరికైనా సాధ్యమవుతుంది. ఉద్యోగంలో లేదా వేరే వ్యాపకంలో ఉండే పని ఒత్తిడి వల్ల కొత్త ప్రదేశాలు చూసే సౌలభ్యం తక్కువగానే ఉంటుంది. ఆ విధంగా కొత్త కొత్తవిహారాల్లో సందర్శించే ప్రదేశాలు, అక్కడి ఆహారపు అలవాట్లు, అభిరుచులు తిలకించి ఆనందం పొందడం ద్వారా వృద్ధుల మనసు మరింతగా ఉత్తేజితమవుతుంది. మరింతగా వాళ్ళను చిన్నవాళ్ళను చేసి ఆనంద సంభరితుల్ని చేస్తుంది. యవ్వనంలో, ప్రౌఢవయసులో వచ్చే ఆనందం దొంతర దొంతరలయితే, పెద్ద వయసులో అనుభవంవల్ల అలరించే ఆనందం మన ఊహకందే పిల్ల తెమ్మెరలా హాయిగా మనసును సోకుతూ ఉంటుంది. వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే. మదిలో మెదిలే భావాలకు అనుగుణంగా మన జీవన నావ సాగుతూ ఉంటుంది. నేను ఎన్నటికీ నవ యువకుడినే అన్న భావం మదిలో నింపుకుంటే ఆనందం సముద్ర తరంగాల్లా ఉరకలు వేస్తూనే ఉంటుంది. మనం సాధించిన విజయాలూ మన జ్ఞాపకాల పందిరిలోంచి పరిమళించే మల్లికల్లా తొంగి చూస్తూ ఉత్సాహానికి ఊపిరులూదుతూనే ఉంటాయి. పెద్దవయసులో గుర్తుపెట్టుకోవలసింది మన వయసునుకాదు.. గడిపే ప్రతి క్షణం తీసుకువచ్చే ఆనందాన్ని మాత్రమే..!! యవ్వనం కొంగ్రొత్త భోగాల సారం.. వృద్ధాప్యం అనుభవాల మణిహారం..!! వృద్ధాప్యం శాపం కాదు...ఆస్వాదిస్తే అణువణువూ ఆనందమే! ప్రతి జీవీ తమ జీవితంలో వృద్ధాప్యాన్ని ఎదుర్కొనక తప్పదు. అయితే ఈ వృద్ధాప్యాన్ని శాపంగా కాకుండా వరంగా భావించి ఆస్వాదిస్తే వృద్ధాప్యంలో కూడా హాయిగా సమయాన్ని అనుభవించవచ్చు. వృద్ధాప్యాన్ని బాధామయమని భావించకుండా, మన కోసం మనం జీవించే అద్భుత అవకాశంగా భావించిన నాడు వృద్ధాప్యం ఏ మాత్రం బాధించదు. – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
పొంగకు... కుంగకు స్థిరంగా ఉండు
స్థిమితమైన, స్థిరమైన ఆలోచన కలిగిన సాధకుడు తన సాధనతో ఏది కాగోరితే, అది కాగలడు. తాను అత్యంత బలవంతుడనని భావించి, కార్యరంగాన విజయాన్ని సాధించగల ఆత్మవిశ్వాసంతో తన గమనాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తాడు. అనుకూలంగా కాలం సాగిపోతున్నప్పుడు నన్ను మించినవాడు లేడని మానవుడు విర్రవీగడం సాధారణమైన విషయం. కానీ, తనకు సంప్రాప్తించిన విజయాన్ని సైతం దైనందిన జీవికలో సంభవించిన సాధారణమైన అంశంగానే భావించిన వాడే క్లిష్టపరిస్థితుల్లోనూ తన మానసిక స్థైర్యాన్ని అచంచలమైన తీరులో ప్రదర్శించగలుగుతాడు. కష్టం లేదా ఆపద లేకుండా సాధారణంగా ఏ పనీ పూర్తికాదన్నది వాస్తవం. ఆపద ఎదురైనప్పుడు దానినుంచి పారిపోవడం సముచితమైన విషయం కాదు. అలాగని, ఆ ఆపదలో చిక్కుకుని బాధపడడమూ వివేకి లక్షణం కాదు. ఈ సందర్భంలో స్వామి వివేకానంద బోధించిన వాక్యాలు నిజమైన తెలివిని విజ్ఞతతో అన్నివేళలా ప్రదర్శించవలసిన ప్రాముఖ్యాన్ని తెలుపుతాయి. ‘‘మనమంతా వేటగాడికి భయపడిన కుందేళ్ళలా ఆపద వచ్చినప్పుడు పరుగులు పెడుతూ ఉంటాం. ఇది సరియైన పద్ధతి కాదు. ఎంతటి ఆపదనైనా సరే, ఎదుర్కొని పోరాటాన్ని సాగించడమే నిజమైన ప్రజ్ఞ. ఒక్కసారి ఎదురు తిరిగి నిలబడ్డామంటే చాలు, కష్టాలు, భయాలు అన్నీ దూరంగా తొలగిపోతాయి.’’ అన్న అద్భుతమైన వాక్యాలు ఎప్పటికీ గుర్తుంచుకోతగ్గవే..!! ‘‘మనిషి స్థిరత్వంతో ఉన్నప్పుడు ఆలోచనా సరళిలో స్పష్టత మరింతగా పెరిగి, సాధనకు మార్గం సుగమమవుతుంది. గజిబిజిగా ఉండే యోచనలన్నీ ఒక కొలిక్కివచ్చి, సజావుగా పురోగమించేందుకూ, గమ్యాన్ని చేరేటందుకూ ద్వారాలు తెరుచుకుంటాయి’’ అంటాడు పర్షియన్ మేధావి రూమి. స్థిరత్వాన్ని ప్రదర్శించే ఇటువంటి ధీరుల లక్షణాలను స్వామి వివేకానంద తెలిపిన విధమూ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ‘దిటవైన ఆలోచనా సరళి కలిగిన వ్యక్తి తన కార్యసాధనలో ఎటువంటి విమర్శలు ఎదురైనా నిరాశకూ, బాధకూ లోను కాడు. తన మార్గాన్ని అధర్మ వర్తనులు లేదా అసత్య ప్రేలాపనలు చేసేవాళ్ళు అడ్డుకున్నా, శాంతస్వభావంతో వాటిని ఎదుర్కొంటాడు. అనవసరమైన ప్రేలాపనలతో సాగే వారి ప్రేరేపణలూ ధీరుడైన ఇటువంటి వ్యక్తిని ఏమీ చేయలేవు. నిత్యమూ సంతృప్తితో, సంతుష్టితో ఉండడమే ఇటువంటివారి లక్షణం. ఫలితాలకోసం ఎప్పుడూ వీరు ఎదురు చూడరు. తమ లక్ష్యాన్ని చేరడానికి నిర్మల హృదయంతో శ్రమిస్తారు.’’ అంటారు వివేకానంద. ఎంతటి అద్భుతమైన వాక్యాలో కదా.. ప్రతివారూ గుర్తుంచుకుని, తమ వర్తనా సరళికి అనువుగా మలచుకోవలసిన వాక్యాలే యివి..!! సమస్య ఎప్పుడైతే వస్తుందో, దానికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుందనేది ఆర్యోక్తి. సమాధానం అనేది మన సందేహానికి సూటిగా దొరక్కపోయినా, దానిని దాటే మార్గం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇది వాస్తవం. మేరునగధీరులైన సాధకులు చాటిన జీవనసత్యం. ఎటువంటి పరిస్థితులకూ చలించకుండా తన సహజ లక్షణంతో చరించడాన్నే స్థిత ప్రజ్ఞత అంటారు. అంటే, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టమైనా యిష్టమైనా చలించని ధీర లక్షణమే స్థితప్రజ్ఞత. ఇదేదో మనకు కొరుకుడు పడని శబ్దమనీ, అందని బ్రహ్మపదార్థమనీ అనుకోనక్కర్లేదు. సాధకునిలో ఉండవలసిన స్థిరమైన వర్తనాశైలిగా దీన్ని అభివర్ణించవచ్చు. భయం, అధైర్యం, అనుమానం, అసూయ. ద్వేషభావం వంటి అనవసర భావవికారాలు స్థితప్రజ్ఞునిలో అణుమాత్రమైనా ఉండవు. స్థితప్రజ్ఞుడు ఇనుమునూ, బంగారాన్ని సమానంగా చూడగలుగుతాడు. పొగడ్తనూ, విమర్శనూ ఒకేవిధంగా స్వీకరిస్తాడు. తాబేలు తన కాళ్ళూ, చేతులూ, తలా మొదలైన అన్ని అవయవాలనూ సాచి, మళ్ళీ డిప్పలోకి ముడుచుకున్నట్లుగా ఈ తరహా వ్యక్తులు సర్వేంద్రియాలనూ సర్వావస్థల్లో నిగ్రహించుకో గలుగుతారు. తన కనుల ముందు జరిగే సంఘటనలను చూసి కూడా చలించకుండా, స్థిరమైన ఆలోచన తో ముందుకు సాగుతాడు. అంటే మనసును నియంత్రించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండడమే వీరి వ్యక్తిత్వంలోని ప్రత్యేక లక్షణ ం. ముఖ్యంగా ఆటంకాలూ, అవరోధాలూ ఎదురైనప్పుడే స్థితప్రజ్ఞుల సుగుణాలు జగతికి తేటతెల్లమవుతాయి. తాను పడిపోయానని తెలిసినా, కుంగక, అపజయమనే మాటకు లొంగక ధైర్యంగా లేచి నిలబడే ధీరత్వం వీరిలో కనబడుతుంది. తనకు ఎదురైన ఓటమికి వేరేవారిని నిందించరు. కారణాలను అన్యులకు ఆపాదించరు. సంభవించిన పరాజయ క్రమంలో అవమానానికి, తృణీకరణకు గురైనా, చిరునవ్వుతోనే సాగుతూ వినమ్రంగా మసలుకోవడం ఉత్తములైన వీరి సహజ లక్షణం. ఈ అపజయం తమ గమ్యంలో ఒక మామూలు విషయమేనని తలుస్తూ, కార్యాన్ని సాధించగలిగిన బలం తనలో ఉందని అపారమైన నమ్మికతో ముందుకు సాగే తత్త్వం వీరి సొంతం. ఇలాంటి వారే అపూర్వమైన ఆ శక్తితో, ఆసక్తితో, అనురక్తితో ఆసాంతం పరిశ్రమించి విజయాన్ని చేజిక్కించుకోవడంలో చరితార్ధులవుతారు. నిశ్చయాత్మకమైన ఆలోచన సొంతమైన ఇటువంటి వ్యక్తులు తమలో ఉన్న మంచిని నలుగురికీ పంచడం ఒక ఉన్నతమైన సుగుణమైతే, తాము ఆ మంచిని చేశామని చెప్పుకోకపోవడం వీరిలో ఎంచదగిన ప్రత్యేకమైన అంశం. ఫలాలు ఎలాగైతే పక్వానికి వచ్చినప్పుడే పండుతాయో, అదేవిధంగా ఫలితం కూడా రావలసిన సమయంలోనే వస్తుందని వీరు నిశ్చల మానసంతో భావిస్తారు. కార్యసాఫల్యం మీద సహజంగా పిరికి వారికి కలిగే సందేహాలు, అపనమ్మకంవంటివి మచ్చుకైనా వీరిలో కానరావు. మనం తరచు మాట్లాడుకునే నూతన ఆవిష్కరణలకు కారణంగా, ప్రేరణగా నిలిచేది, వీరి కార్యసాధనా క్రమమనే అపూర్వరణమే..!! నవచేతనకు అర్థాన్నిచ్చేదీ, ఊతంగా నిలిచేదీ వీరి సుదృఢమైన చేతలే..!! సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టమైనా యిష్టమైనా చలించని ధీర లక్షణమే స్థితప్రజ్ఞత. ఇదేదో మనకు కొరుకుడు పడని శబ్దమనీ, అందని బ్రహ్మపదార్థమనీ అనుకోనక్కర్లేదు. స్థితప్రజ్ఞుడు ఇనుమునూ, బంగారాన్ని సమానంగా చూడగలుగుతాడు. పొగడ్తనూ, విమర్శనూ ఒకేవిధంగా స్వీకరిస్తాడు. – ‘వ్యాఖ్యాన విశారద’ వెంకట్ గరికపాటి -
విజయానికి తొలిమెట్టు అవగాహన
అవగాహన.. మనం నిత్యమూ స్మరించే పదాల్లో ఒకటి. దాదాపుగా ప్రతి వ్యక్తీ వాడే మాట.. ‘‘ఈ విషయం మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది’’.. ‘‘ ఆ పని చేయడానికి కావలసిన ప్రాథమిక అవగాహన కూడా అతనికి లేదు’’. ఇటువంటి మాటలు మనం తరచు మాట్లాడుతూ ఉంటాం. అసలు అవగాహన అంటే ఏమిటో, అవతలివారిని ఏ విధంగా అవగాహన చేసుకోవాలో, అవగాహన వల్ల ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం... అవగాహన అనే పదం చాలా విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంది. శాస్త్రీయంగా చెప్పాలంటే, ఏదైనా వస్తువు లేదా విషయంమీద ఒక వ్యక్తికున్న ఇంద్రియజ్ఞానాన్ని, ఆకళింపు శక్తినీ అవగాహనగా పేర్కొనవచ్చు. ప్రత్యేకమైన అంశంపై మనకున్న çస్పృహæ అంటే బాహ్య దృగ్విషయ సాక్షాత్కారం మనసులో నిండి ఉండడమే అవగాహన లేదా ఆకళింపు లేదా గ్రహింపు శక్తి. కొంచెం విడమరచి విశ్లేషిస్తే, ఆకళింపు అంటే చేయబోయే పనిమీద ప్రాథమికమైన జ్ఞానాన్ని కలిగి ఉండడం అన్న అర్థంలో తీసుకోవచ్చు. అదే విధంగా తాను కార్యసాధనలో కలిసి పని చేయబోయే వ్యక్తిని గురించి తెలుసుకుని ఉండగలగడాన్ని అవగాహనగా నిర్వచించవచ్చు. ఆనందకరమైన రీతిలో జీవితాన్ని గడపడానికి తన జీవితభాగస్వామితో నిత్యమూ ఆనందకరంగా చరించడమూ అవగాహనకు అందమైన ఉదాహరణే. ప్రజాసేవకు అంకితమయ్యే నాయకులు తాము చేసే సేవా కార్యక్రమాల మీద అర్థవంతమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండడమూ అవగాహనే. అంతేకాదు, పసిపిల్లలను ముఖ్యమైన విషయాలపట్ల అప్రమత్తంగా తీర్చిదిద్దడమూ మకరందభరితమైన అవగాహనగానే పరిగణించాలి. పిల్లలకు కలిగించవలసిన గ్రహింపుశక్తి గురించి క్లుప్తంగా మాట్లాడాలంటే, బాల్యం ఆరంభ దశ ఎంతో సున్నితమైంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఎదుగుదల కాలాన్ని బాల్యారంభదశగా పరిగణిస్తే, ఆ సమయంలోనే వారిలో అన్ని విధాలుగా ఎదుగుదలకు ఉపయోగపడేలా, అత్యంత సులంభంగానే విషయాలన్నిటా ఆకళింపు చేసుకునేలా బీజాలు నాటాలి. ఈ సమయంలోనే వారిలో చూపు, స్పర్శ, గుర్తింపు, వినికిడిలాంటి చేతనలన్నీ విజ్ఞానరూపం వైపు తొంగిచూస్తుంటాయి. ఈ సమయంలో ఏ మాత్రం మొరటు తనానికి వారు గురైనా, వారి భావి జీవితాలకు ఎంతో నష్టం కలుగుతుంది. ఆరు సంవత్సరాలలోపు పిల్లల మానసికస్థితి అత్యంత సున్నితంగా ఉంటుంది. వారి వ్యక్తిత్వపు మొలకలు ఆరంభమయ్యే రోజుల్లో ప్రతి విషయం మీదాగ్రహింపు కలిగేలా వారిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పూర్వ ప్రాథమిక దశలోని పిల్లలకున్న అవసరాలు తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, వారి శక్తి సామర్థ్యాలను మనంఅంచనా వేయటం, విభిన్నమైన విషయాలపై అర్థవంతమైన రీతిలో బలాన్ని కలిగించడం పిల్లల సమగ్ర అభివృద్ధికి మధురఫలంగా రూపొందుతుందనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. అవగాహన గురించి విశ్లేషించుకునే సందర్భంలో తప్పకుండా ప్రస్తావించుకోవలసిన మరొక అంశం భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండవలసిన నమ్మకం. భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ఉండవలసిన విశ్వాసపూరిత భావన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈ అనుబంధమే ధరిత్రిలో సృష్టికార్యానికి మూలమై నవచరితకు ఆధారంగా నిలుస్తోంది కదా..!! ఈ రోజుల్లో జీవిత భాగస్వామితో ఉన్న విశ్వాసరాహిత్యంవల్లనే, వారి దాంపత్యబంధంలో ముఖ్యమైన శాంతి కరువవుతోంది, సుఖమన్నది అరుదవుతోంది. భార్యాభర్తలమధ్య పొడసూపే ఆకళింపు లేమివల్ల సత్సమాజం ఏర్పడేందుకు అవరోధాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే, తల్లిదండ్రులు వ్యవహరించే తీరునే పిల్లలు అనుసరిస్తారు, అనుకరిస్తారు. ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెప్పేదేగాక, మనం నిత్యమూ కనులముందు తిలకించేదే..!! ఒకరినొకరు అర్థం చేసుకోవడమైనా, ఒకరి అభిరుచుల్ని మరొకరు గ్రహించడమైనా, ఒకరి ఇష్ట్రపకారం మరొకరు నడుచుకోవడమైనా.. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ దంపతులు ఆలోచించి అడుగేస్తే ఆ దాంపత్యం చిగురులోనే మొగ్గ తొడుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భార్యాభర్తల బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకుని చరించడం భారమైన విషయం కాదు, అది మధురమైన మకరంద సారం వంటిదని గ్రహించాలి.. ఇది నిజం..!! ఒకరిపై ఒకరికి అనురాగం, ప్రేమలను మరింత బలీయంగా ఉంచేది వారి మధ్య నిలిచివున్న అందమైన అవగాహనే. ‘‘భార్యకు నచ్చిన పనుల్ని చేయవలసిన అవసరం ఏముందని భర్త భావించడం, భర్త చెప్పినట్లుగా ఎందుకు నడుచుకోవాలి?’’ అని భార్య భావిస్తే, అతి కొద్ది రోజుల్లోనే ఆ బంధం దెబ్బతింటుంది. దీనికి ప్రధాన కారణం వారికి వారుగా ఒకరిపై ఒకరు పెంచుకున్న విశ్వాసరాహిత్యమే అని చెప్పడం నూటికి నూరుపాళ్ళూ నిజం. ఒక విషయాన్ని ఆకళింపుచేసుకోవడం జ్ఞానం కన్నా గొప్పదైన విషయంగా భావించమంటాడు ఓ తత్త్వవేత్త. ‘‘నీవెవరో చాలా మందికి తెలియవచ్చు, కానీ నీ విద్వత్తు మీద, శక్తిసామర్థ్యాల మీద నమ్మకం ఉన్న వాళ్ళ వల్లనే నీ ప్రతిభ లోకానికి పరిపూర్ణంగా తెలుస్తుంది’’ అనే భాష్యం సముచితంగా ఉంటుంది. విద్యార్థులు తమ విద్యపట్ల, లక్ష్యసాధకులు తాము సాధించ దలచిన లక్ష్యంపట్ల అవగాహన కలిగి ఉన్నట్లే, దేశ ప్రగతిని కాంక్షించే నాయకులకు తాము ఏ రకంగా ఉత్తమ సేవలను అందించి దేశానికి ప్రగతిని, సుగతిని అందించదలచుకున్నామో అన్న విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం దేశప్రగతికి అత్యంత ముఖ్యమైన విషయం. ప్రతి అందమైన బంధానికీ ఇరువురి మధ్య అవగాహన అనేది ఎంతో ముఖ్యం. సాధకుని ఆలోచనా ధోరణిలో నిండి వున్న దృఢమైన అవగాహనే కార్యసాధనలో విజయానికి ప్రధాన భూమిక నిర్వహిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఏదైనా లక్ష్యాన్ని సాధించాలి అని భావించినప్పుడు, ఆ లక్ష్య సాధనకు సంబంధించిన విషయాల పట్ల సమగ్రమైన గ్రహింపుని కలిగి ఉండడమనేది మౌలికమైన విజయసూత్రంగా భాసిస్తుంది. సాధనా క్రమంలో ఏదైనా విషయం తెలియకపోయినా, కొద్దిపాటి ఆకళింపు లేకపోయినా, ఆ విషయాన్ని సాధకుడు పనికిమాలిన అంశంగా భావించకూడదు. అదే, పరాజయానికి హేతువుగా మారుతుంది. నీకు ఏ విషయమైనా తెలియకపోయినా, ఆ రంగంలో నిష్ణాతులైనవారినో, అందులోని లోటుపాట్లను విడమరచి చెప్పగలవారినో ఆశ్రయించాలి. అందుకే, ఒక ఆర్యోక్తిలో చెప్పినట్లు ‘‘పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవడం ముఖ్యం కాదు. చిన్న చిన్న విషయాలను సమగ్రంగాఅర్థం చేసుకుంటూ ముందుకు సాగడం వివేకి లక్షణం’’ అన్న మాటలు శిరోధార్యమే..!! –వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
సహనమే.. సాధకునికి సంజీవని
సహనం అనేది మానవునికి అత్యంత ప్రధానమైన లక్షణంగా భాసించాలి. సహనం విజయానికి ప్రధానమైన కారణంగా ఎన్నోసందర్భాల్లో నిలుస్తుంది. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఎటువంటి ఒత్తిడికీ లోను కాకుండా, విజయం వైపు సాగడమే సహనానికున్న ఔన్నత్యం.. సహనం అనే గుణం మానవునికి విలువైన ఆభరణం వంటిది. సహనం అంటే క్షమ, ఓర్పు అని కూడా చెప్పవచ్చు. సహనంగా ఉండడం అనేది మనిషిలోని స్థితప్రజ్ఞతకు నిదర్శనం. సహనంగా ఉండడాన్ని అసమర్థతకు నిదర్శనంగా భావించరాదు. ‘‘అణిగి మణిగి ఉండేవాడే అందరిలోకి ఘనుడు’’ అన్న మాటను మనం తరచూ వింటూనే ఉంటాం కదా..!! లౌకికంగా జీవితంలో చేసే ప్రయత్నం, కృషి, ఆలోచనా ధోరణి ఎంత అవసరమో, దారిలో వచ్చే కష్టాలనూ, యాతనలనూ భరించడం, సహనాన్ని కోల్పోకుండా ఉండడం మనిషిని ఉన్నత స్థితికి తీసుకు వెళతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒకానొక గురుకులంలో ఒక శిష్యుడు తోటివారితోనూ, గురువుగారితోనూ ఎంతో అసహనంగా ప్రవర్తించేవాడు. గురువు చెప్పిన విషయాలను పూర్తిగా వినకుండానే తనకు తోచిన రీతిలో దురుసుగా మాటలు మాట్లాడడం, వింతైన భాష్యాలను చెప్పడం అతని నైజంగా ఉండేది. గురువుగారు అతని ప్రవర్తనకు ఎంతగానో విసిగిపోవడమే గాక, ఒకింత ఆవేదనకూ గురయ్యేవారు. సహనంగా వ్యవహరించడం వల్ల కలిగే ప్రయోజనాన్ని అతనికి తెలియచెప్పాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఒకసారి గురువుగారు తన శిష్యులతో కలిసి అడవిలో ప్రయాణిస్తున్నాడు. అప్పుడే పెద్దగా వాన కురిసి, వెలిసింది. వాతావరణం చల్లగా ఉంది. ఆయన ఒక శిష్యునితో ‘‘నాయనా.. కొంచెం పక్కనే పారుతున్న సెలయేటిలోని నీరు తీసుకుని వస్తావా.. దాహాన్ని తీర్చుకుందాం’’ అనడంతో శిష్యుడు సెలయేటి చెంతకు వెళ్ళి తిరిగివచ్చాడు. ‘‘గురువర్యా.. ఆ నీళ్ళు బురదగా ఉన్నాయి. తాగడానికి ఏమాత్రం బావుండవు’’ అన్నాడు. మళ్ళీ కాసేపటి తర్వాత గురువు గారు అతన్ని సెలయేటి దగ్గరకు పంపడం, మళ్ళీ అదే సమాధానం చెప్పడం జరిగింది. రెండు మూడుసార్లు ఆ విధంగా జరిగాక, శిష్యుడు చివరకు ఆనందంగా నీటితో తిరిగి వచ్చాడు. ‘‘గురువుగారూ.. ఇప్పుడు నీళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయి. అందుకే తాగడానికి తెచ్చాను’’ అన్నాడు. గురువుగారు అతని వైపు చూస్తూ, ‘‘నాయనా.. మనమంతా కొంత సమయం సహనంతో వేచి ఉన్నాం. అందుకే నీళ్ళు మామూలుగా ఉన్నాయి. మనం వేచి ఉన్న సమయాన నీటిలోని బురద స్వయంగా స్థిరపడింది. అందుకే ఇప్పుడు నీవు తెచ్చిన నీరు ఎంతో నిర్మలంగా ఉంది. మీ మనస్సు కూడా అలాంటిదే! ఇది ఆలోచనలనే బురదతో నిండి ఉన్నప్పుడు, మీరు దానిని తొట్రుపాటుకు లోను కాకుండా అలానే ఉంచాలి. మనసుకూ స్థిరపడడానికి కొంత సమయం అవసరం. అసహనానికి గురికావడంవల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. నీటిద్వారా నీవు తెలుసుకున్న ఉదాహరణే సహనంతో వర్తిస్తూ, విజయమార్గాన సాగడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది’’ అని చెప్పగానే శిష్యునికి కనువిప్పు కలిగింది. నాటినుంచి సహనంగా ప్రవర్తించడం అలవరుచుకుని, జీవితాన్ని సుఖమయం చేసుకున్నాడు ఆ శిష్యుడు. సహనం అనేది కొద్దిపాటి చేదుగానే ఉంటుంది. కానీ, సహనం యిచ్చే ఫలాలు ఎంతో మధురంగా ఉంటాయి. భూమాతకున్న సహనం ఎవరికుంది? ఎక్కడన్నా ఓటమి ఎదురైతే, క్రుంగిపోకుండా, ఓర్పును కలిగి ఉండాలి. ఓర్పు లేదా సహనం కలిగి ఉండడం అంటే, కేవలం ఒక బొమ్మలాగా మూలన నిశ్సబ్దంగా కూర్చోవడం కాదు. తాను వేచి ఉన్న తరుణం రాలేదని గ్రహించి, వైఫల్యానికి దారితీసిన కారణాలను కూలంకషంగా అన్వేషించి, విజయపథానికి బాటలు వేసుకోవడమే సహనంలోని ఆంతర్యం. ఏ రంగంలోనైనా విజయపతాకం ఎగురవేయాలంటే సహనంతోనే సాధ్యమని ఎన్నో చరితలు మనకు తెలుపుతాయి. కొందరు పరాక్రమించినా, కొందరు శాంతిమంత్రాన్ని పఠించినా, సహనంతో పోరాడడంతోనే ఆంగ్లేయుల చెరనుంచి మనకు విముక్తి లభించింది. ప్రతి క్రీడాకారుడూ గుర్తుంచుకోవలసిన వ్యక్తిత్వం శ్రీ లంక మాజీ కెప్టెన్ మర్వన్ సొంతం. అంతర్జాతీయ క్రికెట్లో తాను ఆడిన తొలి 6 ఇన్నింగ్సులో 5 సార్లు సున్నా పరుగులు మాత్రమే సాధించి ఘోరంగా విఫలమైన మర్వన్, మరో ఇన్నింగ్సులో ఒక పరుగు సాధించాడు. అటువంటి ఆటతో ఆరంభించిన మర్వన్ ఎంతో సహనంతో ఆటను కొనసాగించి, శ్రీ లంక జట్టుకు 4 ప్రపంచ కప్పుల్లో ప్రాతినిధ్యం వహించడమేగాక, జట్టుకు నాయకుడుగానూ వ్యవహరించడం గమనార్హం. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఆటగానిగా స్వర్ణ పతకాన్ని సాధించి దేశానికే గర్వకారణమైన నీరజ్ చోప్రా ‘‘నైపుణ్యం ప్రతి ఆటగాడికీ అవసరమే. అయితే, పరాజయాన్ని తట్టుకుని, సహనంతో ముందుకు సాగడం వల్లనే, ఎవరికైనా విజయం సిద్ధిస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి’’ అని పలికిన మాటలు అందరికీ ఆచరణీయమైనవే. ఏ రంగంలోనైనా విజయపతాకం ఎగురవేయాలంటే సహనంతోనే సాధ్యమని ఎన్నో చరితలు మనకు తెలుపుతాయి. కొందరు పరాక్రమించినా, కొందరు శాంతిమంత్రాన్ని పఠించినా, సహనంతో పోరాడడంతోనే ఆంగ్లేయుల చెరనుంచి మనకు విముక్తి లభించింది. – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
సమయమే సంపద
కాలం ఎంతో విలువైనది. ఎవరికోసం ఆగనిది. బిరబిరమంటూ సాగిపోయే ఉధృతమైన నదీ ప్రవాహానికి మానవ మేధాశక్తితో ఆనకట్ట వేయవచ్చు. కానీ, నిరవధికంగా సాగిపోయే కాలప్రవాహానికి మాత్రం ఎవ్వరూ అడ్డుకట్ట వేయలేరన్నది వాస్తవమే కదా..!! కాలం మనకు ఉచితంగా లభిస్తుంది. కానీ కాలం విలువను వెలకట్టలేమన్నది జగమెరిగిన సత్యం. సకల ప్రాణుల్ని, సమస్త జగత్తునూ నడిపించేదీ, హరించేదీ కాలమే. సృష్టి, స్థితి, వినాశం అనే ప్రధానమైన కార్యాలకు సాక్షీభూతంగా నిలిచేదీ కాలమే. అత్యంత బలవత్తరమైన కాలప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఆధ్యాత్మిక సాధనలూ కాలాన్ని బంధించలేవు. ‘‘పారే నది లో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో అలాగే గతించిన కాలాన్ని పట్టుకోలేం. అందుచేత కాలమహిమను గుర్తించండి’’ అన్న చాణుక్యుని వాక్యాలు ఎంతో అర్థవంతమైనవి. జీవితంలో ప్రతిక్షణం వెలకట్టలేనిదే. గడిచిపోయిన క్షణం తిరిగిరాదు. అందుకే, కాలాన్ని విధి గా పాటించడం లేదా సమయపాలనకు కట్టుపడడం అనేది ప్రతివారికీ అత్యంత ముఖ్యమైన విధి. సమయపాలనకు సంబంధించి రకరకాల నిర్వచనాలు మనకు నిత్యమూ కనబడుతూ ఉంటాయి. సమయానికి మనం అనుకున్న పనిలో, విహితమైన తీరులో, ఏకాగ్ర చిత్తంతో నిమగ్నం కావడాన్నే సమయపాలన అని చెప్పుకోవచ్చు. ఏదైనా పనికోసం మనం సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆ కార్య పరిపూర్ణతకు ఉపకరించి, సంతృప్తిని కలిగిస్తుంది. ఏదైనా ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడంకోసం సమయాన్ని కేటాయిస్తే, అది మనలో మేధాశక్తినీ పెంచడమే గాక, వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రానికీ చేరుస్తుంది. అమేయమైన సారాన్ని నింపుకున్న పుస్తకాలను గానీ, గ్రంథాలను గానీ చదవడానికి సమయాన్ని కేటాయిస్తే, మనలో మనోవికాసం పెంపొందుతుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలోనే నిమగ్నం కాకుండా, ఒకింత నవ్వుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే, అది మన జీవితాన్ని ఆహ్లాదమయం చేస్తుంది. కొంత సమయాన్ని పక్కవాడికి సహాయం చేయడానికి కేటాయిస్తే, అది మనకు ఆత్మానందాన్ని కలిగిస్తుంది. దైనందిన జీవితంలో వ్యాయామానికి సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆరోగ్యప్రదాయినియై సంతసాన్ని కలిగిస్తుంది. సమయం విలువ ప్రతివారూ గుర్తెరగడం అత్యంత ముఖ్యం. ప్రత్యేకించి, పిల్లలకు సమయానికి తగినట్లుగా పనులు అలవాటు చేయడం తల్లితండ్రుల బాధ్యత. ముఖ్యంగా ఉదయాన నిద్రలేవడం నుంచీ, రాత్రి పడుకునే వరకు, వాళ్ళు ఏ సమయానికి ఏం చేయాలో తెలియజెప్పడం తప్పనిసరిగా చేయాలి. ముందు కొంత బద్ధకించినా, కొన్ని రోజులకు సమయం ప్రకారం పనులు చేయడం వారికి అలవాటుగా మారుతుంది. జీవితానికి ఉత్తమ బాటను పరుస్తుంది. ‘‘ క్షణము గడిచిన దాని వెన్కకు మరల్ప సాధ్యమే మానవున కిలాచక్రమందు’ అంటాడు గుర్రం జాషువ. ఒక్క మాటలో చె ప్పాలంటే విశ్వవిఖ్యాతి గడించిన మహనీయులందరూ ఏ రంగానికి చెందిన వారైనా కాలం విలువ బాగా తెలిసిన వారే సమయాన్ని సద్వినియోగపరచుకున్నవారే. కాలం అనేది మనం ఆపితే ఆగదు. కాబట్టి ఏ సమయంలో ఏ పని చెయ్యాలో ఆ సమయంలో ఆ పని చేస్తే సమయం సద్వినియోగపరిచినట్లే. ప్రపంచంలో గొప్పవాళ్ళయిన వ్యక్తులందరూ కాలం విలువ తెలిసిన వాళ్ళే. ప్రతీ క్షణాన్నీ సద్వినియోగం చేసినవాళ్ళే. అందువల్లనే, ఆది శంకరాచార్యులు, ఏసుక్రీస్తు, వివేకానందస్వామి మొదలైన మహాపురుషులు చిన్నవయస్సులోనే శరీరాన్ని చాలించినప్పటికీ, తాము జీవించి ఉన్న స్వల్పమైన సమయంలోనే అద్వితీయమైన, అప్రతిహతమైన విజయాలను సాధించగలిగారు. ‘‘యువతీ యువకుల్లారా.. మీరంతా మేల్కొనండి. లక్ష్యసాధనకోసం శ్రమించే క్రమంలో ప్రతి క్షణాన్నీ సద్వినియోగపరచండి. మీరు మండే నిప్పు కణికలు అని గమనించండి. కాబట్టి కాలం విలువ ఎరిగినవారై, బద్ధకాన్ని వదలండి.’’ అంటూ స్వామి వివేకానంద ఇచ్చిన సందేశం ఎంతో విలువైనది. సమయం విలువను కాల రాచే మహమ్మారిలాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి. పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది. ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. ప్రతి వ్యక్తీ, తన మనసును అదుపులో ఉంచుకుంటే సోమరితనాన్ని జయించి, కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలో సార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని కాదు. జగత్ప్రసిద్ధమైన ఆపిల్ కంపెనీ సహవ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ, ‘‘నీ సమయం ఎంతో విలువైనది. ఆ సమయాన్ని వినియోగించి నీ జీవితాన్ని స్వర్గమయం చేసుకో. కాలాన్ని వ్యర్థం చేసుకుని, ఇంకొకరి జీవితంలో నీవు బతకకు’’ అంటారు. కాలం విలువ తెలుసుకుని, ప్రగతిని సాధిస్తూ, ముందుకు సాగమని, ఇంకొకరితో తనను పోల్చుకోకుండా ధరిత్రిలో మరొక కొత్త చరిత్రను లిఖించమనే ప్రబోధమూ ఈ మాటల్లో దాగి ఉంది. ‘‘ప్రపంచంలో అతి విలువైన వస్తువులు రెండు.. మొదటిది సహనం, రెండోది కాలం.’’ అంటారు లియో టాల్‌స్టాయ్. సృష్టిలో మనకు లభించే అత్యంత విలువైన సంపద కాలమే. కానీ అత్యంత దయనీయంగా నిత్యమూ మనం వృథా చేసేదీ కాలాన్నే..!! ‘‘సమయం ప్రధానమైన విషయాల్లో ఒకటి కాదు. సమయమే అత్యంత ప్రశస్తమైన సంపద’’ అని యువత గ్రహిస్తే, వారి భవిత బంగరు బాట కావడం కష్టమేమీ కాదు. కాలాన్ని సద్వినియోగపరచిన ప్రతి వ్యక్తీ చేయగలిగేది మహేంద్రజాలమే. సమయం విలువను కాల రాచే మహమ్మారిలాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి. పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది. ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది ఏ మాత్రం వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. ప్రతి వ్యక్తీ, తన మనసును అదుపులో ఉంచుకుంటే సోమరితనాన్ని జయించి, కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలో సార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని ఏమాత్రం కాదు. –వ్యాఖ్యాన విశారద, వెంకట్ గరికపాటి -
లక్ష్యసిద్ధికి త్రికరణశుద్ధి
మనం ఏ కార్యాన్ని ఆచరించినా త్రికరణశుద్ధితో ఆచరించాలి. మనస్సుకు, మాటకు, చేతకు తేడా లేకుండా ఉండటమనే నిజాయితీనే త్రికరణశుద్ధిగా వ్యవహరించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, మనోవాక్కాయాల శుద్ధి. ఏదయినా పనిని మనసా, వాచా, కర్మణా అన్నిటా ఏకీభావ స్థితిలో మలచుకోవడమే త్రికరణశుద్ధి. మనసులో ఏ విధంగా కార్యాన్ని చేయాలని మనం సంకల్పిస్తామో, వచస్సులో, అంటే మన మాటల్లోనూ అదే ప్రతిఫలించాలి. కర్మణా అంటే కార్యాన్ని ఆచరించే విధానమూ మనం తలచిన విధంలో, చెప్పిన సంవిధానంలో పూర్తి చేయాలి. అప్పుడే ఆ కార్యం త్రికరణశుద్ధి కలిగినదై, లోకాన రాణింపునకు వస్తుంది. మనం ఎన్నో గొప్ప కార్యాలను మదిలో సంకల్పిస్తాం. తీరా, ఆ పనులను గురించి నలుగురిలో విడమరచి చెప్పాలంటే ఎందుకో బిడియం, ఎవరు ఏమనుకుంటారో..? అనే సందేహం. మనం సాధించగలమో లేదో అని అనుమానం. ఒకవేళ, మరీ సాహసం చేసి కొంతవరకు చెప్పగలిగినా, మళ్ళీ ఆచరించే సమయంలో మనకున్న సందేహాలతో ముందుకు సాగకుండా ఆగిపోతాం, దానికితోడు అనుకోకుండా ఎదురయ్యే అవాంతరాలు..!! ఈ విధంగా చేసే కార్యాలు నిరర్ధకమైన రీతిలోనే సాగుతాయి. మన మనసు అత్యంత పవిత్రమైనదనీ, సమస్త పుణ్యాలు అగణ్యమైన రీతిలో ఈ ధరిత్రిలో జరిగింది కేవలం మనసు వల్లనేనని పెద్దల ఉవాచ. అందుకని తలచిన పనులు సఫలం అవాలంటే, మనం భావించిన విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచగలగాలి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఏ పనిలోనైనా కార్యసిద్ధి అనేది ఒక్కరి వల్ల జరగదు. అది సమిష్టిగా, నలుగురితో కలిసి కృషి చేయడం వల్ల జరుగుతుంది లేదా కొంతమంది వ్యక్తుల సమన్వయంతో జరుగుతుంది. అధికశాతం పనులు రకరకాల వ్యక్తుల సమన్వయంతోనే జరుగుతాయి. ఈ కార్యక్రమంలో కొంతమంది విద్యాధికులు, కొంతమంది ఎక్కువగా చదువుకోనివారు కూడా భాగం కావచ్చు. వీరందరి మధ్యా జరిగే సమన్వయమే త్రికరణాలతో కూడుకుని తలపెట్టిన పనిలో కార్యసిద్ధిని కలిగిస్తుంది. వ్యక్తిగతంగా తాము చేసే పనులు కూడా శుద్ధమైన మనసుతో ఆచరిస్తే, విజయాలు సాధించవచ్చు. మధ్యయుగం కాలంలోని ఒక చిన్న కథ ద్వారా ఆ సందేశాన్ని తెలుసుకుందాం. ఒక గురువు గారు నదికి అవతలి ఒడ్డున తన శిష్యులతో నిలిచి ఉన్నారు. నదిలో వారిని దాటించే పడవవాడు వెళ్ళిపోయాడు. కానీ గట్టుకు రెండోవేపు ఒక శిష్యుడు నిలిచిపోయాడు. గురువుగారు, వేగంగా రమ్మని ఆ శిష్యుని ఆజ్ఞాపించారు. వెంటనే, ఆ శిష్యుడు నీటిమీద వేగంగా నడుచుకుని అవతలి గట్టుకు వెళ్ళిపోయాడు. గురువుగారు, శిష్యునికేసి ఆశ్చర్యంగా చూస్తూ, ‘‘నాయనా.. ఏ విద్యతో అంత వేగంగా నీటిమీద నడుచుకుంటూ రాగలిగావు’’ అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించగా, శిష్యుడు’’ భలేవారే.. గురువుగారు... మీకు తెలియని విద్యలేవి ఉన్నాయి నా దగ్గర..!! మీరు తొందరగా రమ్మని ఆజ్ఞాపించారు. నేను మదిలో నది ఒడ్డుకు రావాలన్న తలపును త్రికరణశుద్ధిగా ఆచరించాను. విజయవంతంగా మీ దగ్గరకు చేరుకున్నాను’’ అంటూ వినయంగా సెలవిచ్చాడు. ఇందులో శిష్యుడు చూపిన అగణితమైన ప్రతిభకన్నా, అతని అంకితభావం, నదిని విజయవంతంగా దాటే సమయాన మనసా, వాచా, కర్మణా ఒకే పద్ధతిలో ముందుకు సాగడం పెద్ద పెద్ద లక్ష్యాలను తలపోసే అందరికీ అనుసరణీయం. త్రికరణశుద్ధిగా చరించే మనిషి తనను తాను మూర్తిమంతంగా నడుపుకుంటూ, విజయాలను అవలీలగా సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఎన్నో శాస్త్రాలను, విజ్ఞానాన్ని శిష్యులకు క్షుణ్ణంగా బోధించిన ఓ గురువుగారి జీవనప్రస్థానపు అంతిమఘడియల్లో అమృతతుల్యమైన ఈ సత్యం విశదం అయింది. మహా విజ్ఞాననిధియై జీవితాన్ని గడిపిన గురువుగారికి అంత్యకాలం చేరువ అయ్యింది. ఆయన శిష్యులందరిలో ఎడతెగని విచారం. ఆయన ఆశ్రమ ప్రాంతమంతా విషాద వీచికలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యశిష్యునిగా వ్యవహరిస్తూ, ఆశ్రమ యోగక్షేమాలు చూసే అతనిలో మరీ విచారం..!! ఈ వాతావరణాన్ని పరికిస్తున్న గురువుగారికి జీవన విషమస్థితిలోనూ ఏ మాత్రం మింగుడుపడడం లేదు. గురువు తన ముఖ్యశిష్యుణ్ణి దగ్గరకు పిలిచి ‘‘ఎందుకు మీరంతా అంతగా బాధపడిపోతున్నారు’’ అని ప్రశ్నించగా, అతను గద్గద స్వరంతో ‘‘గురువుగారూ.. మీరు మా నుంచి వెళ్ళిపోతున్నారు. మీవల్ల ఈ ఆశ్రమానికి వచ్చిన గొప్ప గుర్తింపు, ఎనలేని కాంతి మీ తదనంతరం మాయమవుతుంది. మాలో ఈ కారణం చేతనే రోజురోజుకూ అశాంతి పెరుగుతోంది’’ అన్నాడు. దానికి గురువు నవ్వుతూ ‘‘పిచ్చివాడా.. ఎంత అవివేకంతో మాట్లాడుతున్నావు నాయనా..!! నువ్వు చెప్పిన విధంగా జరిగితే, నేను ఇన్ని రోజులూ మీ అందరికీ చేసిన విద్యాబోధన అంతా వృథానే సుమా.. నేను మీకు ఇచ్చే సలహా ఒక్కటే.. నేను నేర్పించిన విషయాలను అన్నిటా ఆచరణలో పెడుతూ, మిమ్మల్ని మీరే దివ్యమైన జ్యోతుల్లా వెలిగించుకోండి. అది కేవలం మీరు త్రికరణశుద్ధితో చేసే పనులవల్లనే సదా సాధ్యమవుతుంది’’ అన్నాడు. శిష్యునికి జ్ఞానోదయ మయింది. మిగిలిన వారికీ ఇదే సందేశాన్ని అందించి, గురువు బోధలను మనసా వాచా కర్మణా ఆచరించి విజేతగా నిలిచాడు. త్రికరణశుద్ధిగా వుండడమే సిసలైన జీవనానికి ఆనందసూత్రం..!! త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే మకరందభరితమైన జీవనం అమితంగా లభ్యమవుతుంది. అందుకని ప్రతివాడు పాటించవలసింది ఒక్కటే.. ‘‘ఆనందంగా, స్థితప్రజ్ఞునిగా ఉండాలంటే త్రికరణశుద్ధిని తప్పనిసరి గా కలిగి వుండాలి. తెలియనిది మాట్లాడకుండా, తనకు అవగాహన ఉన్న విషయాలనే మాట్లాడడం. మాట్లాడిందే ఆచరించడం ప్రధానంగా పాటించవలసిన అంశాలు. ఇవి మొక్కుబడిగా కాకుండా, మక్కువతో పాటిస్తే, జగతిలో గొప్ప విజయాలు నిత్యమూ ఆవిష్కృతమవుతాయి. ‘‘త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును.. లోకము మెచ్చును’’ అన్న సంకీర్తనాచార్యుని వాక్కులు అక్షరసత్యం. త్రికరణశుద్ధితోనే జీవనానికి నిజమైన సత్వం, పస కలిగిన పటుత్వం కలుగుతాయి. బుద్ధిమంతుల ఆలోచనా సరళికి ఆధారమూలం జీవనగమనంలో వారు కలిగి ఉండే త్రికరణశుద్ధి..!! ఈ లక్షణం కలిగినవారికి తప్పక ఒనగూడుతుంది అన్నిటా కార్యసిద్ధి.. త్రికరణ శుద్ధిగా వుండడమే సిసలైన జీవనానికి ఆనందసూత్రం..!! త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే మకరంద భరితమైన జీవనం లభ్యమవుతుంది. అందుకని ప్రతివాడు పాటించవలసింది ఒక్కటే.. ‘‘ఆనందంగా, స్థితప్రజ్ఞునిగా ఉండాలంటే త్రికరణశుద్ధిని తప్పనిసరిగా కలిగి వుండాలి. తెలియనిది మాట్లాడకుండా, తనకు అవగాహన ఉన్న విషయాలనే మాట్లాడడం. మాట్లాడిందే ఆచరించడంప్రధానంగా పాటించవలసిన అంశాలు. ఇవి మొక్కుబడిగా కాకుండా, మక్కువతో పాటిస్తే, జగతిలో గొప్ప విజయాలు నిత్యమూ ఆవిష్కృతమవుతాయి. – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
నూతనత్వం భువికి చేతనత్వం
సమగ్రమైన రీతిలో విశ్వదర్శనం చేస్తే, మార్పు లేనిది ఏదీ మనకు ఈ ధరిత్రిలో కనిపించదు. ప్రతి విషయంలోనూ, ప్రతి వస్తువులోనూ, జీవనగమనంలోనూ నిత్యం ఎంతో మార్పు కనబడుతూ ఉంటుంది. ఒక దశాబ్దం క్రితం మన జీవన శైలిని, ఇప్పటి జీవన శైలితో పోల్చుకుంటేనే, మనకు ఎంతో భేదం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. నిరంతరాయంగా కదిలిపోయే కాలంతో సంభవించే మార్పులు అత్యంత సహజమైనవని మనం గ్రహించాలి. మార్పు అనేది నూతనత్వంతో ఎప్పుడూ ముడిపడే ఉంటుంది. అంటే, ఇంతకుముందు మనం చూసిన విషయం గానీ, వస్తువు కానీ మార్పులతో ద్యోతకమవుతుంది. అదే నూతనత్వం. విశ్వం ఈ నూతనత్వాన్ని వెంటనే అంగీకరిస్తుందా అంటే.. కాదు అనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. అయితే, ఆ మార్పులను, చేర్పులను ఎందరో మహనీయులు తమ చేతల ద్వారా ఎంత ప్రయోజనకరమైనవో చూపించి, మిగిలిన వారికి పథనిర్దేశం చేయడం అనాదిగా జరుగుతున్న విషయమే.కాలం చలనశీలం. కదిలేకాలం ఎవరికోసమూ ఆగదు. కాలంతో నిరవధికంగా పరుగెత్తుతూ, ఆగకుండా పరుగెత్తే కాలమనే పంచకళ్యాణి వేగాన్ని తమకు నచ్చిన విధంగా అందుకుని వలసిన కార్యాన్ని సాధించిన వినూత్న పథగాములే విజేతలు. భువికి తమదైన శైలిలో ఏదో అందించాలనే ఉత్సాహమే ఊతంగా ఉరకలేస్తూ, ఉద్వేగంతో సాగుతూ సాధించిన విజేతల విజయం, మానవాళి నుదుటిపై దిద్దిన అందమైన చరిత్ర. వారి చేతల్లోని నూతనత్వం భూతలానికి మనోహరంగా అద్దిన మహత్తు. విజేతలు కొత్తగా ఏ పనులనూ చేయరనీ, ఇంతకుముందు అందుబాటులో ఉన్న, అందరికీ తెలిసిన విషయాలనే కొత్త దక్కోణంలో పరిశీలించి, పరిశోధించి, నూతన శైలిలో ఆవిష్కరిస్తారనీ మనకు నిత్యమూ ఎదురయ్యే అనుభవాలను చూస్తే అర్థమవుతుంది. నూతనత్వం అన్న విషయం గుర్తుకు రాగానే, దాదాపుగా దానికి సమానార్థంగా నిలిచే సృజనాత్మకత కూడా స్ఫురణకు వస్తుంది. నూతనత్వం, సజనాత్మకతల మధ్య అవినాభావ సంబంధమే ఉంది. కొత్తవిషయాల గురించి, కొంగ్రొత్త ఆవిష్కరణల గురించి ఆలోచించే తీరే సృజనాత్మకత. సృజనాత్మకమైన ఆలోచనలను అమలుపరచే ఆచరణాత్మక విధమే నూతనత్వం. బాహ్యమైన స్పందనల ద్వారా మనిషిలోని సంస్కారం చేతనమవుతుంది. కానీ, అంతఃకరణలో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుని, తాను నూతన పోకడను ప్రవేశపెట్టదలచిన హృదికి కలిగేది సంకల్పం. దృఢమైన సంకల్పమే నూతనత్వానికి గట్టి పునాదిగా మనం భావించవచ్చు. మానవమేధ ఎంతో శక్తివంతమైనది. నూతన ఒరవడిని సృజించడానికి సంకల్పం మదిలో జనిస్తే, సాధించడానికి ఊతమిచ్చేది మేధస్సు.. ఆదిమానవునిలా సంచరించిన సమయంనుంచి నేటి కంప్యూటర్ యుగం వరకూ మానవుడు చేతనతో సాధించిన నూతన విజయాలు మస్తిష్కంలో మెరిసిన విద్యుల్లతలవంటి యోచనలేకదా.. సిసిలీరాజు ఒక స్వర్ణకిరీటాన్ని తయారుచేయించాడు. రాజుకు కిరీటానికి వాడిన బంగారంలో వెండి కల్తీ చేసినట్లు అనుమానం వచ్చింది. కిరీటాన్ని చెడకొట్టకుండా అది స్వచ్ఛమైన బంగారంతో చేయబడిందా లేకపోతే కల్తీ జరిగిందా అనే విషయాన్ని తేల్చమని ఆర్కిమెడిస్‌ను అదేశించాడు. ఆర్కిమెడిస్ సున్నితమైన ఈ సమస్యను ఆ కిరీటాన్ని చెడకొట్టకుండానే పరిష్కరించాడు. అక్రమాకార కిరీటాన్ని క్రమాకారానికి మార్చకుండానే దాని సాంద్రతను కనుగొన్నాడు. రాజు చెప్పిన విషయాన్ని గురించి ఆలోచిస్తూ అతను స్నానాల తొట్టెలో స్నానం చేస్తున్న సందర్భంలో తాను తొట్టెలో మునిగినప్పుడు కొంత నీరు బయటికి పోతున్నట్లు గమనించాడు. ఈ చిన్న విషయమే అతనిలో గొప్ప ఆలోచనకు దారి తీసింది. ఆ విషయం తెలిసిన వెంటనే వీధులలో ‘యురేకా!‘ అని అరుస్తూ రాజుగారికి విషయం చెప్పడానికి పరుగెత్తాడు. గ్రీకు భాషలో ‘యురేకా’ అంటే ‘నేను కనుగొన్నాను‘ అని అర్థం. ఏ వస్తువైనా నీటిలో ముంచినప్పుడు ఆ వస్తువు తన ఘనపరిమాణానికి సమానమైన నీటిని వైదొలగిస్తుందని ఆర్కిమెడిస్ తెలుసుకున్నాడు. ఆ విధంగా బంగారు కిరీటాన్ని నీటిలో ముంచినపుడు అది తొలగించిన నీటి ఘనపరిమాణం ఆధారంగా కిరీటం ఘనపరిమాణాన్ని కనుగొన్నాడు. అంతే, అతని ఆనందానికి అంతే లేదు. రాజు తనకు అప్పగించిన విషయం లో దాగున్న సిద్ధాంతాన్ని కనుగొన్న అవధుల్లేని ఉత్సాహంలోనే ఆర్కిమెడిస్ ఆ విధంగా ప్రవర్తించాడు. తాను కనుగొన్న విషయం ఎన్నో నూతన ఆవిష్కరణలకు దారితీస్తుందని గొప్పవాడైన ఆ శాస్త్రజ్ఞునికి తెలుసు. రేడియోను కనుగొన్న మార్కోనీ తనలో తాను ఎంతగానో పరవశిస్తూ ఉండేవాడట. దీనికి కారణం వారి హృదయంలో నూతనత్వాన్ని జగతికి అందించినందుకు కలిగిన ఆత్మానందమే.. భారతదేశంలో అనాదికాలం నుంచీ ఎన్నో ఆవిష్కరణలు జరిగి విశ్వానికి కొత్త మార్గాలను దర్శింపజేశాయి. ఆయుర్వేదంలో కొంగ్రొత్త ఔషధాలను కనుగొన్న చరకుడు, శుశ్రుతుడూ నేటి ఆధునిక ఔషధాలెన్నిటికో మార్గం చూపారు. ఆనాడే వైద్యరంగంలో వారు చూపిన దార్శనిక ప్రతిభతో కూడిన నూతనత్వమే నేటికీ విశ్వయవనికపై వెలుగులీనడం గమనార్హం. ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్టు, వరాహమిహిరుడు చూపిన నూతనత్వం నేటికీ స్మరణీయమే.. ఇక కంప్యూటర్, సెల్ ఫోన్ మనవ జీవితంలో నింపిన నూతనత్వాన్ని గురించి ఎంత విశదీకరించినా తనివి తీరదు కదా.. మానవునిగా జన్మించిన అపూర్వమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, విశ్వానికి తమ నూతన ఆలోచనా ధోరణితో, ఎన్నో రకాల ఆవిష్కరణలు చేసిన వీరి చరిత మనకు బోధించేది ఒక్కటే.. దైనందిన జీవికలో భాగంగా భుజించడం, నిద్రించడం అన్నవే కాకుండా, జగతికి ‘‘నూతనత్వాన్ని జోడించి నేను ఏం చేయగలను’’ అని ఆలోచించినప్పుడే చేతనుడు అవుతాడు మానవుడు. భూమిలో జనించిన ప్రతి మనిషీ నవీన జీవనానికి బాటలు చూపే శాస్త్రవేత్త కాకపోవచ్చు. నవ్యమైన కోణంలో ఆలోచనలు సాగితే, ఖచ్చితంగా చేతనామయమైన జగతికి తనవంతు సహకారాన్ని అందించే హితవర్తనుడవుతాడు. – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
విజయ సోపానాలు
మానసాన్ని, శరీరాన్ని సరైన గమ్యం వైపు నడిపించడమే ఏకాగ్రత. నిశ్చయమైన, నిశ్చలమైన బుద్ధి దీనికి తోడ్పాటును అందిస్తుంది. ఏ విషయం మీదనైనా ఏకాగ్రత కుదిరినప్పుడే అద్వితీయమైన విజయాలను సొంతం చేసుకోవచ్చునని చరిత్ర సాక్షిగా మనకు తెలుస్తుంది. ధనార్జనలోనైనా, కార్యసాధనలోనైనా, చేయదలచిన ఏ కార్యంలోనైనా, ఏకాగ్రతాశక్తి ఎంత అధికంగా ఉంటుందో ఆ కార్యం అంత చక్కగా జరిగి, విజయం సిద్ధిస్తుంది. ఒకే రకమైన అర్హతలూ, తెలివి తేటలూ ఉన్నా, విజయలక్ష్మిని సొంతం చేసుకునే వారు మాత్రం కొందరే ఉంటారు. దానికి కారణం వారి వ్యక్తిత్వంలోని విశిష్టశైలి, ప్రవర్తనలోని ప్రత్యేకమైన సుగుణాలు. విజేతలు తమ విజయానికి సోపానాలుగా మలచుకునే కొన్ని అరుదైన లక్షణాలను తమ వ్యక్తిత్వానికి అలకరణలుగా నిలుపుకుని ఉద్యమిస్తూ ఉంటారు. తాను విజేతను కావాలని కలలుగనేవారు ముందుగా సాధించబూనిన కార్యానికి సంబంధించిన అంశాన్ని జీవనధ్యేయం గా మలచుకోవాలి. ఆ భావాన్నే శ్వాసగా, ధ్యాసగా నిలుపుకుని ముందుకు సాగాలి. తన శరీరంలోని మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతి అంగమూ మహత్తరమైన ఆ భావంతో తాదాత్మ్యం చెందాలి. తామర తంపరగా మనల్ని చుట్టుముట్టే మిగిలిన భావాలకు సంబంధించిన ఆలోచనలను పక్కకు నెట్టేయాలి. కార్యాన్ని ఏ విధంగా సాధించ దలచుకున్నారో దానికి సంబంధించిన నిర్దిష్టమైన ఆలోచనతో పురోగమించాలి. ఆలోచనే ఏ మనిషినైనా కార్యాన్ముఖుని చేయగల గొప్ప శక్తి. ఇది విజయానికి ప్రథమ సోపానం. విజేతగా నిలవాలని భావించే వ్యక్తి పట్టించుకోకూడనివి, పయనించే మార్గంలో వారికి ఎదురయ్యే అపజయాలు. విజయసాధనలో అత్యంత ముఖ్యమైనది అపజయాలను లెక్కచేయకుండా, ముందుకు సాగడమే. అపజయాలు మనకు అపకారాలు చేయవు. మనకున్న అవకరాలూ కావు. అవి విజయానికి సాధకుని మరింతగా సన్నద్ధం చేసే గొప్ప అలంకారాలు. స్వల్పమైన అపజయం కలుగ గానే రకరకాల ఆలోచనలు, ముఖ్యంగా ప్రతికూల వాతావరణాన్ని సృష్టించే తలపులు మదిలో ముసురుకుని దాడి చేస్తాయి. అప్పుడే, దృఢమైన చిత్తంతో, సంకల్పబలంతో ముందడుగు వేయాలి. స్వామి వివేకానంద చెప్పినట్లుగా ‘‘సాగరంలోని కెరటం కింద పడేది, మరింత ఉధృతమైన శక్తితో పైకి లేవడానికే’’ అన్న వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని అచంచలమైన విశ్వాసంతో పురోగమించాలి. విజయసాధనలో మనిషికి బలవత్తరంగా ఉపకరించే మరొక అపురూపమైన సోపానం ఏకాగ్రత. ఏ రంగంలోనైనా నైపుణ్యాన్ని సాధించాలన్నా, ఎంతటి ఉన్నతమైన విజయాన్ని అందుకోవాలన్నా మనిషికి ఆధారంగా నిలిచేది ఏకాగ్రతే. ఒకరకంగా చెప్పాలంటే విజయసాధన అనే తాళాన్ని తెరిచే తాళపుచెవి ఏకాగ్రత అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. సాధకులు తమలోని సంకల్పబలాన్ని, ఆలోచనను, తమలో ఉన్న చైతన్యాన్ని అంతటినీ జాగృతం చేసి, ఒకేచోట కేంద్రీకృతం చేయడమే ఏకాగ్రత అయితే, మనసు ను ఏకైక విషయం మీద దృష్టిని నిలిపేలా చేయడం ఏకాగ్రతా సిద్ధి. ఏ కార్యంలోనైనా ఏకాగ్రత సాధిస్తే, విజయ శిఖరాన్ని చేరడం ఖాయం. విజయసాధకులకు పెట్టని ఆభరణంలా ఉండే శుభలక్షణం ఆత్మవిశ్వాసం. ఈ విషయాన్ని మణిపూసల వంటి సమాజ సేవకులను, క్రీడాకారులను చూసినప్పుడు మనం స్పష్టంగా గమనించవచ్చు. సమాజ సేవకులను ఉదాహరణగా తీసుకుంటే, వారికి దారిలో కలిగే ప్రతిబంధకాలు అనేకం. ముఖ్యంగా వారు తీసుకు రాదలచినమార్పును అంగీకరించని వ్యక్తుల నుంచి వచ్చే సహాయ నిరాకరణ వంటి అంశాలు ఎప్పుడూ ఈ సేవా దృక్పథం కలిగినవారి మదిలోనే ఉండవు. సమాజహితం కోరి తాము చేయదలచిన కార్యం మాత్రమే వారి మనోయవనిక మీద మనోరమ్యంగా రెపరెపలాడుతూ ఉంటుంది. మనిషికున్న ఆత్మవిశ్వాసమే భౌతికబలాన్ని మించిన నిజమైన బలం. భౌతిక శక్తిని, మానసిక యుక్తిని సమన్వితం చేయడమే మనిషిలో విశ్వాసాన్ని పాదుకొల్పుతుంది. క్రీడాకారులు ఆత్మవిశ్వాసం ప్రకటించడంలో ఎప్పుడూ ఉన్నతస్థానంలోనే ఉంటారు. వారు ఆడే ఆటలోఅంతకుముందు ఉన్న ప్రమాణాలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ, కొత్తప్రమాణాలను నెలకొల్పుతూ ముందుకు సాగడం మనకు ఎన్నో సందర్భాల్లో దీప్తివంతంగా కనబడుతూనే ఉంటుంది. టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణపతకమే దీనికి చక్కని ఉదాహరణ. వందేళ్లకు పైబడి ఏ భారతీయ అథ్లెట్ సాధించని అద్వితీయ విజయం ఈ ఒలింపిక్స్ క్రీడల్లో నీరజ్ సొంతమయ్యింది. అదే విధంగా అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మీరాబాయి చాను ఈ ఒలింపిక్స్ క్రీడల్లోనే వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని సాధించింది. ఈశాన్యభారత రాష్ట్రమైన మణిపూర్ కు చెందిన మీరాబాయి పేదరికాన్ని జయించి, అప్రతిహతమైన పట్టుదలతో విజేతగా నిలిచింది. విజేతలు గుర్తుంచుకోవలసిన లక్షణాలను నిండుగా కలిగిన తెలుగమ్మాయి సింధు మరొక చక్కని ఉదాహరణ. వీరి విజయాలకు మిగిలిన కారణాలు ఎన్నైనా ఉండవచ్చు, ప్రధాన కారణం మాత్రం మొక్కవోని పట్టుదలను ప్రదర్శిస్తూ ‘‘నేను సాధించగలను’’ అని త్రికరణశుద్ధిగా నమ్మిన వారి ఆత్మవిశ్వాసమే అని చెప్పకతస్పదు. విజయ సాధనలో వినయశీలతకూ ప్రధాన భూమికే ఉంది. అహంకరించినవాడు ఎంత శక్తివంతుడైనా, అతి స్వల్ప కాలంలోనే మట్టికరచిన దాఖలాలు మనకు చరిత్రలో ఎక్కువగానే కనబడతాయి. ఉత్తమంగా భాసించే పైన పేర్కొన్న లక్షణాలను సదా దృష్టిలో నిలుపుకుంటే, అవి సాధకునికి మార్గమధ్యంలో ఎదురయ్యే అవరోధపు కవాటాలను దాటించి, విజయ బావుటాను ఖచ్చితంగా ఎగురవేయిస్తాయి. – ‘వ్యాఖ్యాన విశారద’ వెంకట్ గరికపాటి -
మంచి మాట..జీవన లక్ష్యం
ప్రతి మనిషి జీవితానికి లక్ష్యం అనేది అత్యంత అవసరం. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలంటే, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని సఫలీకృతుడవడానికి అంకిత భావంతో పనిచేయాలి. తనకున్న యావచ్ఛక్తిని వినియోగించి పనిచేస్తే, విజయానికి దారులు తప్పక తెరుచుకుంటాయి. ఈ ధరిత్రిపై లక్ష్యం లేకుండా సాగే ఏ మనిషి జీవికైనా నిరర్ధకమంటారు స్వామి వివేకానంద. ఉన్నతపదవి.. వ్యాపారం.. క్రీడలు..లలితకళలు.. యిలా ఏ విభాగంలో మనం రాణిద్దామని అనుకుంటామో, అందులో చేరుకోవాలనుకున్న లక్ష్యాన్ని సావధానంతో నిర్ణయించుకోవాలి. అయితే, లక్ష్యాన్ని నిర్దేశించుకోగానే సరిపోదు. లక్ష్యాన్ని సాధించే దిశగా నిరంతర సాధనతో ముందుకు సాగాలి. ప్రతి పనినీ మొక్కవోని శ్రద్ధతో, ఏకాగ్రతతో, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలి. మన గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ముందుకు సాగాలి. మనం పయనించే మార్గంలో విజయంతో బాటు అపజయాలు కూడా కలుగుతూనే ఉంటాయి. అపజయం సంభవించినప్పుడు కుంగిపోక, లక్ష్యసాధనలో విజయానికి చేరువ కావడానికి మరింత అనుభవం తనకు సమకూడిందని భావిస్తూ సానుకూల దక్పథంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. ఈ ధరిత్రిలో ఏదీ, తనంత తానుగా మన చెంతకు రాదు. ఎనలేని శోధన, వలసినంత సాధన తోడైతేనే లక్ష్యం అవలీలగా సొంతమవుతుంది. మనిషి ఎంచుకునే లక్ష్యం చాలా ఉన్నతంగా ఉండాలి . ఉన్నతంగా ఉండడమంటే జీవనోపాధికోసం అప్పుడే సాధారణమైన ఉద్యోగంలో జేరినవాడు, వెంటనే అత్యంత సంపన్నుడు కావాలని కోరుకోవడం ఏమాత్రం సబబుకాదు. కానీ, తాను చేరిన వృత్తిలో, ఉద్యోగంలో, కృషి చేస్తే తాను ఎంతవరకు ఎదగగలడు అన్న విషయాన్ని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలి. సహేతుకమైన ఆలోచనతో, వివేచనతో ముందుకు సాగుతూ నిజాయితీతో కృషి చేస్తే, తను అనుకున్న ఉన్నతమైన స్థానాన్ని అందుకోలేకపోయినా, ఖచ్చితంగా గౌరవనీయమైన స్థానాన్ని మానవుడు కైవశం చేసుకుంటాడని చరిత్ర నిరూపించిన నిదర్శనాలెన్నో మనకు కనబడతాయి. ఓర్పు, పట్టుదల, నిజాయితీలనే ఆయుధాలుగా చేసుకుని లక్ష్యసాధన దిశగా కషి చేసిన వారందరూ, తమ జీవన గమనంలో అప్రతిహతమైన విజయాలను చేబూనారన్న విషయం చరిత్ర తేజోమయంగా మనకు తెలియజేస్తుంది. ఈ విజయపరంపరలో అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి, అత్యున్నత స్థాయి కి ఎదిగిన వ్యక్తులూ మనకు ఎంతో మంది తారసపడుతూనే ఉంటారు. బీద కుటుంబంలో పుట్టి, ఉదయాన్నే వార్తా పత్రిక లను పంచే అతి సాధారణ వ్యాపకాన్ని బాలునిగా ఉన్నప్పుడు నిర్వర్తించిన అబ్దుల్ కలామ్ దేశ ప్రధమ పౌరుడైన రాష్ట్రపతిగా, భారత అణుశాస్త్ర పితామహునిగా నిలవడం కృషితో నాస్తి దుర్బిక్షం అన్న సామెతకు నిలువెత్తు సాక్ష్యం. కలలు కను..కలలను సాకారం చేసుకో’’ అన్న ఆ మహోన్నత వ్యక్తి లక్ష్య సాధకు లకు చక్కటి సందేశాన్ని ఇవ్వడమే గాక, తన జీవితాన్నే ఆ సుధా మయ వాక్యాలకు నిలువెత్తు ఉదాహరణగా నిలిపిన సార్ధక జీవనుడు. లక్ష్యం ఉన్నతమైనదైతే, చిత్తశుద్ధి దానికి తోడైతే, దారిలో ఎదురయ్యే ఆటంకాలేవీ మనల్ని బాధించవు. లక్ష్యాన్ని చేరే గమ్యంలో ఎదురయ్యే ఆటంకాలు, సవాళ్ళు సాధారణమైనవిగానే మనకు అనిపిస్తాయి. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే చిరు సవాళ్ళు, పెనుసవాళ్ళు కూడా మన విజయానికి బాసటగా నిలిచే పునాదిరాళ్ళుగా మనం విశ్వసించాలి. మనిషికి మహితమైన సహనాన్ని, తనలో తనకు విశ్వాసాన్ని పెంపొందించే మేలురాళ్ళుగా ఈ సవాళ్ళను పేర్కొనవచ్చు. మహత్తరమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, విజయాన్ని చేబూనిన ప్రతి మానవుడూ మహనీయుడు కాకపోవచ్చు, కానీ సమాజంలో తప్పకుండా మాననీయుడవుతాడు. మహితమైన హితాన్ని నలుగురికీ తద్వారా చేకూరుస్తాడు. లక్ష్యసాధకునికి తప్పనిసరిగా కావలసింది అచంచలమైన ఆత్మవిశ్వాసం. మానవ చరిత్రను పరికిస్తే లక్ష్యాలను సాధించి, ఉన్నతులైన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నిటికంటే ఎక్కువ సామర్థ్యాన్ని పెంపొందించిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే. వాళ్ళు మొదటినుంచీ ఉన్నతులు కావాలనే విశ్వాసంతో పరిశ్రమించి, సాఫల్యతను సాధించారని వారి జీవనచిత్రం తిలకిస్తే మనకు అర్థమవుతుంది. లక్ష్యం అంటే గురి.. లక్ష్యం లేకుండా సాగే మనిషి జీవితాన్ని గమ్యం తెలియకుండా పయనించే నావతో పోల్చడం సబబుగా ఉంటుంది. మనం ఏ లక్ష్యం కోసమైతే సాధన, పరిశ్రమ కొనసాగిస్తామో, ఆ సాధనలో అవిశ్రాంతంగా కొనసాగితే, ఈ ధరిత్రిలోని ప్రతిశక్తీ మనకు సహకరిస్తుందనే మాట అత్యంత ప్రసిద్ధిని పొందిన ఓ పాశ్చాత్య దార్శనికుని మాట. – వెంకట్ గరికపాటి , వ్యాఖ్యాన విశారద -
సుధాభరితం... గోదాచరితం!
తమిళంలో తిరు అంటే శ్రీయుతమైన, పవిత్రమైన అని, పావై అంటే వ్రతం అనీ అర్థం. స్వామిని మనసారా కీర్తించి భోగిపండుగనాడు ఆ స్వామిలో ఐక్యమైన పావన చరితురాలు గోదాదేవి సూర్యభగవానుడు ధనురాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి భోగిపండుగ వరకు ఉండే మాసమే ధనుర్మాసం. వైష్ణవులు పరమ పావనంగా భావించే ఈ మాసంలో నిత్యమూ గోదాదేవి విరచిత ‘తిరుప్పావై’లోని పాశురాలను పారాయణ చేస్తారు. భూలోక వైకుంఠమై భాసించే తిరుమలలోనూ ధనుర్మాసమంతా సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని గానం చేయడం అనూచానంగా వస్తోంది. గోదాదేవి అంటే సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి అవతారం. ఈమెనే వైష్ణవ సంప్రదాయంలో ఆండాళ్ అనీ, చూడికుడిత నాంచారి అనీ వ్యవహరిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో, భక్తి ప్రబంధాలలో పన్నిద్దరు ఆళ్వారులు సుప్రసిద్ధులు. వీరిలో పెరియాళ్వారుగా పిలువబడే విష్ణుచిత్తుడు తన ఉదాత్త చరితంతో విష్ణుభక్తుల్లో శాశ్వత స్థానం పొందాడు. విష్ణుచిత్తుడు స్థానిక వైష్ణవ దేవాలయాల్లో స్వామికి పుష్పాలను, తులసిమాలలను కైంకర్యం చేస్తూ, శ్రీకృష్ణుని సేవిస్తూ ఉండేవాడు. ఒకనాడు విష్ణుచిత్తుడికి తులసి మొక్కల మధ్య పవళించి బంగారు వర్ణంలో ఉన్న శిశువు కనిపించింది. భూమాత ప్రసాదించింది కాబట్టి ఆమెను గోదా నామంతో పిలుచుకుంటూ గారాబంగా పెంచాడు విష్ణుచిత్తుడు. ఈ గోదాకు అసలు నామం కోదై అని పండితుల ఉవాచ. కోదై అంటే సుమమాలిక అని అర్థం. గోదాదేవిని శ్రీకృష్ణుని పాదాల చెంతనే ఉంచి ఆమెలో భక్తిభావాలను చిన్ననాటి నుంచే చిగురింపజేశాడు. గోదాదేవి శ్రీవారికి సమర్పించే పూమాలలను కడుతుండేది. ఆ మాలలను భగవంతుడికి వినమ్రంగా సమర్పించేవాడు విష్ణుచిత్తుడు. గోదాదేవికి స్వామి మనోహరత్వాన్ని దర్శించాలనే కోరిక కలిగింది. ఒకనాడు దేవాలయంలో జగన్మోహనాకారుడైన స్వామిని చూసి తన్మయురాలయింది. ఆ తరువాత స్వామివారికి సమర్పించే దండలను తాను ధరించి, తమ ఇంటిలో ఉన్న నూతిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ మురిసిపోయింది. రానురానూ... తనకు, భగవంతునికి భేదం లేదని తలచి తన ఆత్మలోనే ఆ సర్వేశ్వరుణ్ణి త్రికరణశుద్ధిగా దర్శించింది. ఒకనాడు విష్ణుచిత్తుడు స్వామికి సమర్పించే దండల్లో ఒక కేశపాశాన్ని చూసి గోదాదేవిని సందేహించి, తన అనుమానం నిజమేనని రూఢి చేసుకుని, ఒకరోజు గోదాదేవిని మందలించాడు. ఎప్పుడూ పల్లెత్తు మాట అనని తన గారాలపట్టిని నిందించినందుకు వ్యాకులచిత్తుడై, గోదా ధరించిన మాలలను స్వామికి సమర్పించడం అపచారంగా భావించాడు. ఆనాడు ఆలయానికి వెళ్లకుండా, తన గృహంలోనే తీవ్ర ఆవేదనతో శయనించాడు విష్ణుచిత్తుడు. ఆయనకు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై, ‘‘విష్ణుచిత్తా! నీవు నాకు నిత్యం భక్తితో సమర్పించే మాలలను ఈ రోజు సమర్పించలేదేం?’’ అని ప్రశ్నించగానే, విష్ణుచిత్తుడు జరిగినదంతా స్వామికి విన్నవించాడు. దానికి పరమాత్మ చిరునవ్వుతో... ‘గోదా ధరించిన మాలలను అలంకరించుకోవడం నాకు అత్యంత ప్రీతిపాత్రం’ అనగానే విష్ణుచిత్తుడు పరమానంద భరితుడయ్యాడు. ఆరోజునుంచి శ్రీహరి సేవలో నిమగ్నమయ్యారు తండ్రీకూతుళ్లు. గోదాకు యుక్తవయస్సు రావడంతో ఆమెకు వివాహం చెయ్యాలన్న తన నిర్ణయాన్ని ప్రస్తావించాడు విష్ణుచిత్తుడు. శ్రీకృష్ణుని తప్ప పరపురుషుని తాను వరించనని గోదాదేవి తండ్రికి స్పష్టం చేసింది. కాత్యాయనీవ్రతాన్ని భక్తిశ్రద్ధలతో, దీక్షతో ఆచరించిన గోపికలు ద్వాపరయుగంలో తమ మధురభక్తితో కమలాక్షుడైన శ్రీకృష్ణుని పొందారని తెలుసుకున్న గోదాదేవి తానూ ఆ స్వామి దేవేరిని కాగలనని విశ్వసించి, దృఢసంకల్పంతో కఠినమైన తిరుప్పావై దీక్షను ప్రారంభించింది. తమిళంలో తిరు అంటే శ్రీయుతమైన, పవిత్రమైన అని, పావై అంటే వ్రతం అని అర్థం. తాను విరచించిన తిరుప్పావైలోని భావబంధురమైన 30 పాశురాలతో మధురభక్తినీ, హృదయ సమర్పణం చేసే అలౌకిక ప్రణ యాన్నీ రంగరించి, మనసారా కీర్తించి భోగిపండుగనాడు ఆయనలోనే ఐక్యమైన పావన చరితురాలు గోదాదేవి. పాశుర గీతికలతో స్వామిని కీర్తించి, ఆ పరంధామునికి ఆత్మనివేదన చేసిన కారణజన్మురాలు గోదాదేవి. - వెంకట్ గరికపాటి