సమయమే సంపద | Time is the most valuable thing in the world | Sakshi
Sakshi News home page

సమయమే సంపద

Published Mon, Oct 25 2021 12:33 AM | Last Updated on Mon, Oct 25 2021 4:09 PM

Time is the most valuable thing in the world - Sakshi

కాలం ఎంతో విలువైనది. ఎవరికోసం ఆగనిది. బిరబిరమంటూ సాగిపోయే ఉధృతమైన నదీ ప్రవాహానికి మానవ మేధాశక్తితో ఆనకట్ట వేయవచ్చు. కానీ, నిరవధికంగా సాగిపోయే కాలప్రవాహానికి మాత్రం ఎవ్వరూ అడ్డుకట్ట వేయలేరన్నది వాస్తవమే కదా..!! కాలం మనకు ఉచితంగా లభిస్తుంది. కానీ కాలం విలువను వెలకట్టలేమన్నది జగమెరిగిన సత్యం.

సకల ప్రాణుల్ని, సమస్త జగత్తునూ నడిపించేదీ, హరించేదీ కాలమే. సృష్టి, స్థితి, వినాశం అనే ప్రధానమైన కార్యాలకు సాక్షీభూతంగా నిలిచేదీ కాలమే. అత్యంత బలవత్తరమైన కాలప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఆధ్యాత్మిక సాధనలూ కాలాన్ని బంధించలేవు. ‘‘పారే నది లో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో అలాగే గతించిన కాలాన్ని పట్టుకోలేం. అందుచేత కాలమహిమను గుర్తించండి’’ అన్న చాణుక్యుని వాక్యాలు ఎంతో అర్థవంతమైనవి.

జీవితంలో ప్రతిక్షణం వెలకట్టలేనిదే. గడిచిపోయిన క్షణం తిరిగిరాదు. అందుకే, కాలాన్ని విధి గా పాటించడం లేదా సమయపాలనకు కట్టుపడడం అనేది ప్రతివారికీ అత్యంత ముఖ్యమైన విధి. సమయపాలనకు సంబంధించి రకరకాల నిర్వచనాలు మనకు నిత్యమూ కనబడుతూ ఉంటాయి. సమయానికి మనం అనుకున్న పనిలో, విహితమైన తీరులో, ఏకాగ్ర చిత్తంతో నిమగ్నం కావడాన్నే సమయపాలన అని చెప్పుకోవచ్చు.

ఏదైనా పనికోసం మనం సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆ కార్య పరిపూర్ణతకు ఉపకరించి, సంతృప్తిని కలిగిస్తుంది. ఏదైనా ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడంకోసం సమయాన్ని కేటాయిస్తే, అది మనలో మేధాశక్తినీ పెంచడమే గాక, వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రానికీ చేరుస్తుంది. అమేయమైన సారాన్ని నింపుకున్న పుస్తకాలను గానీ, గ్రంథాలను గానీ చదవడానికి సమయాన్ని కేటాయిస్తే, మనలో మనోవికాసం పెంపొందుతుంది.

ఎప్పుడూ ఏదో ఒక పనిలోనే నిమగ్నం కాకుండా, ఒకింత నవ్వుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే, అది మన జీవితాన్ని ఆహ్లాదమయం చేస్తుంది. కొంత సమయాన్ని పక్కవాడికి సహాయం చేయడానికి కేటాయిస్తే, అది మనకు ఆత్మానందాన్ని కలిగిస్తుంది. దైనందిన జీవితంలో వ్యాయామానికి సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆరోగ్యప్రదాయినియై సంతసాన్ని కలిగిస్తుంది.

సమయం విలువ ప్రతివారూ గుర్తెరగడం అత్యంత ముఖ్యం. ప్రత్యేకించి, పిల్లలకు సమయానికి తగినట్లుగా పనులు అలవాటు చేయడం తల్లితండ్రుల బాధ్యత. ముఖ్యంగా ఉదయాన నిద్రలేవడం నుంచీ, రాత్రి పడుకునే వరకు, వాళ్ళు ఏ సమయానికి ఏం చేయాలో తెలియజెప్పడం తప్పనిసరిగా చేయాలి. ముందు కొంత బద్ధకించినా, కొన్ని రోజులకు సమయం ప్రకారం పనులు చేయడం వారికి అలవాటుగా మారుతుంది. జీవితానికి ఉత్తమ బాటను పరుస్తుంది.

‘‘ క్షణము గడిచిన దాని వెన్కకు మరల్ప సాధ్యమే మానవున కిలాచక్రమందు’ అంటాడు గుర్రం జాషువ. ఒక్క మాటలో చె ప్పాలంటే విశ్వవిఖ్యాతి గడించిన మహనీయులందరూ ఏ రంగానికి చెందిన వారైనా కాలం విలువ బాగా తెలిసిన వారే సమయాన్ని సద్వినియోగపరచుకున్నవారే. కాలం అనేది మనం ఆపితే ఆగదు. కాబట్టి ఏ సమయంలో ఏ పని చెయ్యాలో ఆ సమయంలో ఆ పని చేస్తే సమయం సద్వినియోగపరిచినట్లే.

ప్రపంచంలో గొప్పవాళ్ళయిన వ్యక్తులందరూ కాలం విలువ తెలిసిన వాళ్ళే. ప్రతీ క్షణాన్నీ సద్వినియోగం చేసినవాళ్ళే. అందువల్లనే, ఆది శంకరాచార్యులు, ఏసుక్రీస్తు, వివేకానందస్వామి మొదలైన మహాపురుషులు చిన్నవయస్సులోనే శరీరాన్ని చాలించినప్పటికీ, తాము జీవించి ఉన్న స్వల్పమైన సమయంలోనే అద్వితీయమైన, అప్రతిహతమైన విజయాలను సాధించగలిగారు.

‘‘యువతీ యువకుల్లారా.. మీరంతా మేల్కొనండి. లక్ష్యసాధనకోసం  శ్రమించే క్రమంలో ప్రతి క్షణాన్నీ సద్వినియోగపరచండి. మీరు మండే నిప్పు కణికలు అని గమనించండి. కాబట్టి కాలం విలువ ఎరిగినవారై, బద్ధకాన్ని వదలండి.’’ అంటూ స్వామి వివేకానంద ఇచ్చిన సందేశం ఎంతో విలువైనది.

 సమయం విలువను కాల రాచే మహమ్మారిలాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి. పరీక్షలొస్తున్నాయి చదవడం  వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది. ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. ప్రతి వ్యక్తీ, తన మనసును అదుపులో ఉంచుకుంటే సోమరితనాన్ని జయించి, కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలో సార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని కాదు.

జగత్ప్రసిద్ధమైన ఆపిల్‌ కంపెనీ సహవ్యవస్థాపకుడైన స్టీవ్‌ జాబ్స్‌ మాట్లాడుతూ, ‘‘నీ సమయం ఎంతో విలువైనది. ఆ సమయాన్ని వినియోగించి నీ జీవితాన్ని స్వర్గమయం చేసుకో. కాలాన్ని వ్యర్థం చేసుకుని, ఇంకొకరి జీవితంలో నీవు బతకకు’’ అంటారు. కాలం విలువ తెలుసుకుని, ప్రగతిని సాధిస్తూ, ముందుకు సాగమని, ఇంకొకరితో తనను పోల్చుకోకుండా ధరిత్రిలో మరొక కొత్త చరిత్రను లిఖించమనే ప్రబోధమూ ఈ మాటల్లో దాగి ఉంది.


‘‘ప్రపంచంలో అతి విలువైన వస్తువులు రెండు.. మొదటిది సహనం, రెండోది కాలం.’’ అంటారు లియో టాల్‌స్టాయ్‌. సృష్టిలో మనకు లభించే అత్యంత విలువైన సంపద కాలమే. కానీ అత్యంత దయనీయంగా నిత్యమూ మనం వృథా చేసేదీ కాలాన్నే..!!

‘‘సమయం ప్రధానమైన విషయాల్లో ఒకటి కాదు. సమయమే అత్యంత ప్రశస్తమైన సంపద’’ అని యువత గ్రహిస్తే, వారి భవిత బంగరు బాట కావడం కష్టమేమీ కాదు. కాలాన్ని సద్వినియోగపరచిన ప్రతి వ్యక్తీ చేయగలిగేది మహేంద్రజాలమే.

సమయం విలువను కాల రాచే మహమ్మారిలాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి. పరీక్షలొస్తున్నాయి చదవడం  వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది. ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది ఏ మాత్రం వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. ప్రతి వ్యక్తీ, తన మనసును అదుపులో ఉంచుకుంటే సోమరితనాన్ని జయించి, కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలో సార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని ఏమాత్రం కాదు.

–వ్యాఖ్యాన విశారద, వెంకట్‌ గరికపాటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement