Time Machine
-
ఒకసారి.. పదహారో శతాబ్దంలోకి వెళ్లివద్దామా?!
రాజాంతఃపురాలను, కోటలను సినిమాలలో తప్ప స్వయంగా చూడటం సాధ్యం కాదేమో అని బెంగపడే వాళ్లకు ఆహ్వానం పలుకుతోందీ ప్యాలెస్. ఇది మహారాష్ట్రలోని సావంత్వాడిప్యాలెస్. గోవాకు దగ్గరలో ఉంది. పదహారవ శతాబ్దంలో నిర్మించిన ఈప్యాలెస్లోకి అతిథులకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు సావంత్ రాజవంశీకులు.యువరాజు లఖమ్ సావంత్ భోంస్లే, యువరాణి శ్రద్ధా సావంత్ భోంస్లేలు తమప్యాలెస్ను పర్యాటకులకు హోమ్‌స్టేగా మార్చారు. ‘‘మేము మాప్యాలెస్తో వ్యాపారం చేయడం లేదు, మనదేశ చరిత్రను తెలియచేస్తున్నాం. స్వాతంత్య్రోద్యమ సమయంలో గాంధీజీ ఆధ్వర్యంలో ఉప్పు సత్యాగ్రహం ఇక్కడ జరిగింది.మరో సందర్భంలో నెహ్రూ కూడా బస చేశారు. ఈప్యాలెస్లో అడుగుపెట్టిన క్షణం నుంచి మా కొంకణ సంప్రదాయ ఆహ్వానం, ఆత్మీయతలు, భోజనంతో పదహారవ శతాబ్దంలోకి వెళ్లి΄ోతారు’’ అని చెబుతున్నారు ఈ ఇంటి వాళ్లు.టైమ్ మెషీన్లో కాలంలో వెనక్కి వెళ్లడం సినిమాల్లో చూడడం కాదు ఇక్కడ స్వయంగా అనుభూతి చెందవచ్చు, అంతేకాదు... మొఘలులు పర్షియా నుంచి మన దేశానికి తీసుకువచ్చిన గంజిఫా ఆట ఆడడం వంటివి ఇక్కడివి వచ్చిన వాళ్లకు నేర్పిస్తామని చెబుతున్నారు.రాజసాన్ని చూపిస్తుంది. కళాత్మక లాలిత్యంతో కనువిందు చేస్తుంది. అమ్మ ఒడిలా ఆప్యాయతనిస్తుంది. అమ్మమ్మ చేతి స్పర్శలోని మృదుత్వాన్ని గుర్తు చేస్తుంది. పర్యటన రొటీన్‌కి భిన్నంగా ఉండాలని కోరుకునే వాళ్లకు చక్కటి వెకేషన్ అవుతుంది. -
Happy New Year 2023: మెరిసేనా.. ఉరిమేనా?
ఎస్.రాజమహేంద్రారెడ్డి మరో ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఇరవై రెండు జ్ఞాపకాల పుటల్లోకి వెళ్లిపోతుంది. జ్ఞాపకం ఎప్పుడూ గుర్తుగానే మిగిలిపోతుంది. టైమ్ మెషీన్లో వెనక్కు వెళ్లి అనుభవంలోకి తెచ్చుకోలేము. కొన్ని జ్ఞాపకాలు కంటినుంచి జారిపడ్డ మెరుపుల్లాగా పెదవులపై చిరునవ్వులు వెలిగిస్తాయి. మరికొన్ని కన్నీటి చుక్కల్లా అప్రయత్నంగా ఒలికిపోయి ఘనీభవిస్తాయి. అప్పుడప్పుడు భయపెడతాయి. 2020, 2021 సంవత్సరాలు ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపి మానవాళికి అంతులేని విషాదాన్ని, నిర్వేదాన్ని, మానసిక ఒత్తిడిని మిగిల్చి వెళ్లాయి. 2022 ఆశాజనకంగానే ఆరంభమై భయంభయంగానే అయినా మందహాసంతో మందగమనంగా కొనసాగుతున్న వేళ ఒకరి రాజ్యకాంక్ష యుద్ధ రూపంలో విరుచుకుపడింది. యుద్ధం తాలూకు దుష్పరిణామాలు ప్రపంచాన్ని నిర్దాక్షిణ్యంగా మాంద్యంవైపు నెట్టాయి. ఏడాది చివర్లో కంటికి కనిపించని వైరస్ ఒకటి మరోసారి రాబోయే గడ్డు పరిస్థితులను కళ్లకు కట్టడం మొదలుపెట్టింది. ఉగాది పచ్చడిలా తీపి, చేదులను రుచి చూపించిన 2022 మానవాళికి కొంతలో కొంత ఉపశమనం కలిగించి వెళ్లిపోతోంది. మరి 2023 కొత్త ఆశలకు ఊపిరులూదుతుందా, లేక ఉన్న ఉసురూ తీస్తుందా? చూడాల్సిందే! వెళ్లిపోనున్న ఈ ఏడాది ప్రభావం రానున్న ఏడాదిపై ఎంతమేరకు పడనుందో ఒకసారి చూద్దాం... మాంద్యం... ముంచుకొస్తోంది! రోజురోజుకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో నిత్యావసరాల ధరలు రాకెట్ వేగంతో చుక్కలవైపు దూసుకెళుతున్నాయి. కరోనా భయాలు, ఆంక్షలు రెండేళ్లపాటు ప్రపంచ ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసి వృద్ధి రేటును పాతాళంలోకి నెట్టేశాయి. ఫలితంగా ఈ ఏడాది ద్రవ్యోల్బణం గత దశాబ్దంలోకెల్లా గరిష్టానికి చేరుకుంది. ఇది వచ్చే ఏడాది మరింత పైపైకి ఎగబాకి దాదాపు ప్రపంచాన్ని యావత్తూ మాంద్యంలోకి నెడుతుందని విశ్లేషకుల అంచనా. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం మాంద్యానికి మరింత ఆజ్యం పోస్తుందని వారి విశ్లేషణ. ద్రవ్యోల్బణాన్ని అరికడితే మాంద్యం బారిన పడకుండా బయటపడే అవకాశం ఉంటుందనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులన్నీ ఈ ఏడాది ఇప్పటికే పలుమార్లు వడ్డీరేట్లు పెంచాయి. వచ్చే ఏడాది కూడా వడ్డీరేట్లు మరింత పెరిగే అవకాశముంది. అమెరికాలో ద్రవ్బోల్బణం ఈ ఏడాది ఒక దశలో గత 40 ఏళ్లలో గరిష్టంగా ఏకంగా 9 శాతానికి ఎగబాకడం ప్రపంచ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఫలితంగా ఆహార పదార్థాల ధరలు పెరగడం సగటు మనిషికి కోలుకోని దెబ్బే. పెట్రో ధరలు పెరగడం మధ్యతరగతి జీవితాలను పెనంమీది నుంచి పొయ్యిలోకి నెట్టింది. ఒకవైపు ద్రవ్యోల్బణం వేడి, మరోవైపు మాంద్యం బూచి పలు కార్పొరేట్ సంస్థలను తీవ్ర ఆలోచనలో పడేయడంతో ఖర్చు తగ్గించుకునేందుకు అవి ఉద్యోగాల కోతవైపు దృష్టి సారించాయి. ఫలితంగా పలు దేశాల్లో నిరుద్యోగిత మరింత పెరిగింది. అమెరికా, బ్రిటన్, పలు యూరప్ దేశాలు ద్రవ్యోల్బణంతో సతమతమవుతుంటే భారత్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉండటం గమనార్హం. భారత్‌లో ద్రవ్యోల్బణం ప్రస్తుతం 5.9 శాతంగా ఉంది. అయితే వచ్చే ఏడాది పరిస్థితి మెరుగవుతుందని ఆశించలేం. అంతో ఇంతో మాంద్యం ఊబిలో చిక్కక తప్పని పరిస్థితులు ఎదురవ్వవచ్చు. వచ్చే ఏడాది బడ్జెట్లో దేశ ఆర్థిక వ్యవస్థను విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఏ మేరకు సరిచేస్తారో వేచి చూడాల్సిందే. ప్రపంచంలోని మిగతా దేశాల పరిస్థితి కూడా ఊగిసలాటగానే ఉంది. మరీ శ్రీలంకలాగా దిగజారకున్నా వచ్చే ఏడాది అన్ని దేశాలపైనా మాంద్యం కత్తి వేలాడుతూనే ఉంటుంది. వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 100 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ ఏడాదంతా ఊదరగొట్టిన అధ్యయన సంస్థలు, అది కొంచెం కష్టమేనని తాజాగా అంగీకరిస్తుండటం గమనార్హం. మాంద్యం భయం అంచనాలనూ తారుమారు చేస్తోంది! యుద్ధం... వెన్ను విరుస్తోంది! నిజం చెప్పాలంటే ఈ ఏడాది జనవరి నెల ఒక్కటే ప్రశాంతంగా గడిచింది. కరోనా రక్కసి పీడ పోయిందని ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో యుద్ధం మరో దయ్యంలా దాపురించింది. 2020, 2021ల్లో మానవాళిని కరోనా వెంటాడితే ఈ ఏడాదిని రష్యా అధ్యక్షుడు పుతిన్ రాజ్యకాంక్ష వెంటాడింది. ఫిబ్రవరిలో రష్యా ఉన్నట్టుండి ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగి తన యుద్ధోన్మాదాన్ని ప్రపంచంపై రుద్దింది. తన అదృశ్య స్నేహితుడు చైనాతో కలిసి రష్యా ఒకవైపు, అమెరికా వత్తాసుతో ఉక్రెయిన్ మరొకవైపు మోహరించాయి. ఇప్పుడు డిసెంబరులో ఉన్నాం. యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్త సంవత్సరంలోకీ అడుగు పెడుతోంది. ముమ్మరమా.. ముగింపా.. చెప్పలేం! రెండేళ్లుగా తూర్పు ఆఫ్రికాలో కొనసాగుతున్న యుద్ధం దాదాపు ఆరు లక్షల మందిని కబళించినా ఇంకా కొలిక్కి రాలేదు. వస్తుందనే నమ్మకమూ దరిదాపుల్లో లేదు. మరోవైపు సిరియా, యెమన్లలో జరుగుతున్న అంతర్యుద్ధాల పరిస్థితీ ఇదే. వాటి పర్యవసానాలు ఆయా దేశాలకే పరిమితమైనా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా దేశాలు తటస్థంగా ఉన్నప్పటికీ ఈ యుద్ధం ప్రపంచాన్ని రెండు శిబిరాలుగా చీల్చింది. మరోవైపు పెట్రో ధరలపైనా, గోధుమ, మొక్కజొన్న వంటి ఆహార ధాన్యాల ధరలపైనా తీవ్ర ప్రభావం చూపింది. క్రూడాయిల్ ఎగుమతుల్లో రష్యా (14 శాతం), గోధుమ, మొక్కజొన్న ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ (25 శాతం) అగ్ర భాగాన ఉన్న సంగతి తెలిసిందే. వీటిపైనే ఆధారపడ్డ చాలా దేశాలు ఇప్పటికే చమురు కొరతను, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొటున్నాయి. వచ్చే ఏడాది ఇది మరింత తీవ్రతరం కానుంది. ఎందుకంటే యుద్ధాన్ని ఆపాలన్న ఉద్దేశం పుతిన్, జెలెన్స్కీల్లో ఏ కోశానా ఉన్నట్టు కన్పించడం లేదు. యుద్ధం విషాదమే గానీ ఆపే ఉద్దేశం లేదని పుతిన్ ఇటీవలే బాహాటంగా స్పష్టం చేశారు. రష్యా ముందు సాగిలపడటానికి ససేమిరా అంటున్న జెలెన్స్కీ పోరాడితే పోయేదేమీ లేనట్టు ముందుకు సాగుతున్నారు. దౌత్య చర్చలకు మొగ్గు చూపుతూనే అదనపు ఆయుధ సమీకరణకు నాటో మిత్ర దేశాల వైపు చూస్తున్నారు. ఇటీవలే అమెరికా వెళ్లి అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అవడమే గాకుండా తన ఆయుధపొదిలో పేట్రియాటిక్ క్షిపణులను సమకూర్చుకున్నారు. సంధి కోసమో, కనీసం యుద్ధ విరామం కోసమో ప్రయత్నించాల్సిన అమెరికా లాంటి దేశాలు చోద్యం చూస్తూ కూర్చున్నాయే తప్ప ఆ దిశగా ఎలాంటి చొరవా చూపడటం లేదు. మరోవైపు యుద్ధాన్ని రష్యా తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌పై రోజుల తరబడి క్షిపణుల వర్షం కురిపిస్తోంది. గురువారం ఒక్క రోజే 120కి పైగా క్షిపణులను ప్రయోగించిందంటే రాబోయే రోజుల్లో యుద్ధం ఏ దశకు చేరుకోనుందో ఊహించవచ్చు. 2023లోకి అడుగు పెడుతున్న యుద్ధం 2024ను కూడా పలకరించేలా కన్పిస్తోంది. కరోనా... వణికిస్తోంది! గడచి రెండేళ్లు (2020, 2021) కరోనా నామ సంవత్సరాలైతే ఈ ఏడాది (2022) కరోనా ఫ్రీ సంవత్సరమని చెప్పుకోవచ్చు. అయితే అది నవంబర్ వరకే. డిసెంబర్లో చైనా మళ్లీ కొత్త వేరియంట్‌తో సరికొత్త కరోనా బాంబు పేల్చింది. కరోనా వైరస్ మానవ సృష్టేనన్న వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్ చైనా పాలిట భస్మసుర హస్తమైంది. ప్రతి రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు అంటూ చైనా నుంచి వస్తున్న వార్తలు ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేట్టు చేశాయి. చైనాలో వైరస్ ఉనికి కనిపించిన ఒకట్రెండు నెలలకు ప్రపంచానికి వ్యాపించడం, లేదా విస్తరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలో ప్రత్యక్షమైన కొత్త వేరియంట్ వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలోగా ఇతర దేశాలకు పాకడం ఖాయమని వైద్య నిపుణుల అంచనా. కరోనాతో సహజీవనం చేసిన చాలా దేశాల్లోని జనాలకు ఈ కొత్త వేరియంట్ ప్రాణాంతకం కాకపోవచ్చు కానీ కొంతమేరకు ఇబ్బంది పెట్టే అవకాశముందని వారి విశ్లేషణ. చైనా ప్రజలు రెండేళ్లుగా కరోనా వైరస్‌కు అల్లంత దూరాన తమను తాము బందీ చేసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తికి దూరమయ్యారు. ఇప్పడు ఒక్కసారిగా కరోనా ఆంక్షలు ఎత్తేయడంతో వైరస్ ప్రభావం నుంచి తప్పించుకోలేక సతమతమవుతున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా తాజాగా చైనా ఆంక్షలు ఎత్తేయడం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు చైనానుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్ష తప్పనిసరి చేశాయి. చైనా ప్రపంచానికి వెల్లడించింది ఒక్క వేరియంట్ గురించేనని, నిజానికి అక్కడ మరో డజనుకు పైగా కొత్త వేరియంట్లు పుట్టకొచ్చాయని వార్తలు వినవస్తున్నాయి. అదే నిజమైతే ఏ వైపునుంచి ఏ వేరియంట్ వచ్చి మీద పడుతుందో ఊహించడం కష్టం. టీవీలు, వార్తా పత్రికలు ఊదరగొడుతున్నట్టుగా చైనాలో గడ్డు పరిస్థితులేమీ లేవని, అదంతా పశ్చిమ దేశాల కుట్రేనన్నది మరో వాదన. కరోనా వ్యాక్సీన్లను అమ్ముకోవడానికి ఫార్మా కంపెనీలు అల్లుతున్న కట్టుకథలేనన్నది ఇంకో వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా ఇప్పటికైతే ఇంకా కఠినమైన కరోనా ఆంక్షలేవీ అమల్లోకి రాలేదు. అయితే జనవరి, ఫిబ్రవరి నెలల్లో భారత్‌లో కూడా కేసులు పెరిగే అవకాశం లేకపోలేదని నిపుణులు అనుమానిస్తున్నారు. అదే జరిగితే వచ్చేది మరో కరోనానామ సంవత్సరమే అవుతుమంది. లేదంటే కరోనా ఫ్రీ ఏడాదిగా అందరి ముఖాలపై ఆనందాన్ని వెలిగిస్తుంది! -
అవకాశం వస్తే పదేళ్ల భవిష్యత్‌లోకి వెళ్తాను
‘‘ఒకే ఒక జీవితం’ చూసి, నాగార్జునగారు ‘మా అమ్మ అన్నపూర్ణమ్మగారు గుర్తుకు వచ్చారు.. చాలా గర్వంగా ఉంది’’ అని చెప్పడం గొప్ప అనుభూతినిచ్చింది’’ అని అమల అక్కినేని అన్నారు. శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు. ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. ఈ చిత్రంలో హీరో శర్వానంద్ తల్లి పాత్ర చేసిన అమల మాట్లాడుతూ– ‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత మలయాళంలో రెండు, హిందీలో మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ చేశాను. కానీ తెలుగులో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత నేను చేసిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఐదేళ్లుగా ‘అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా’ని నేనే చూసుకుంటున్నాను. వందల మంది విద్యార్థుల భవిష్యత్ బాధ్యత నాపై ఉండటంతో నటిగా బిజీగా ఉంటే కష్టం. అందుకే నా మనసుకు హత్తుకునే కథ, ఆ పాత్రకి నేను కరెక్ట్ అనిపిస్తే చేస్తాను. అలాంటి కథే ‘ఒకే ఒక జీవితం’. నిజాయితీతో తీసిన సినిమా ప్రేక్షకులకు ఎప్పుడూ నచ్చుతుందని ఈ మూవీ మరోసారి రుజువు చేసింది. అయితే ‘ఒకే ఒక జీవితం’ లాంటి పాత్రలు చేయడం సవాల్‌తో కూడుకున్నది. ఈ సినిమా చూసిన మా అమ్మగారు నన్ను హత్తుకుని ‘చాలా గర్వంగా ఉంది’ అనడం మర్చిపోలేను. నాగార్జునతో పాటు, మా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ చిత్రానికి డీప్‌గా కనెక్ట్ అయ్యారు. నన్ను చూడకుండా కేవలం కథ, పాత్రలతో ప్రయాణం చేశారు. నాకు గొప్ప తృప్తిని, హాయిని ఇచ్చిన సినిమా ఇది. ఈ చిత్రంలోలా టైమ్ మిషన్‌లో వెళ్లే అవకాశం వస్తే పదేళ్ల భవిష్యత్‌లోకి వెళ్తాను (నవ్వుతూ). నాగార్జునగారు, నేను ఇంట్లో ఎప్పుడూ కలిసే ఉంటాం.. మళ్లీ స్క్రీన్‌పై వద్దు (నవ్వుతూ)’’ అన్నారు. ‘బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్’కి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. మంచి వైద్యులు, మేనేజ్మెంట్, వాలంటీర్లు ఉన్నారు. నేను ఉన్నా లేకపోయినా అద్భుతమైన సేవలు అందిస్తుంది. ప్రతి శనివారం నేను కూడా స్వచ్ఛందంగా వెళ్లి పని చేస్తున్నాను. -
మనం మళ్లీ పిల్లల్లా మారిపోతే! శాస్త్రవేత్తల అధునాతన ప్రయోగం
కాలం గడుస్తున్న కొద్దీ వయసు పెరుగుతుంది. వృద్ధాప్యం మీద పడుతుంది. వందేళ్లు బతికినా అందులో మూడు వంతులకుపైగా ముసలితనంతోనే గడిచిపోతుంది. అలాకాకుండా బతికినంత కాలం యంగ్‌గానే బతికేస్తే.. అసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వయసును వెనక్కి తీసుకెళ్లి.. మళ్లీ ఆ బాల్యాన్ని, యవ్వనాన్ని ఎంజాయ్ చేయగలిగితే..!? ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో సీన్లా అనిపిస్తోందా.. అలాంటిది ఎప్పటికైనా సాధ్యమేనా అన్న ప్రశ్న వస్తోందా? ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అలాంటి రోజు రావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం సముద్రంలో జీవించే ఓ చిత్రమైన జెల్లీ ఫిష్‌పై చేస్తున్న పరిశోధనలు తోడ్పడతాయని అంటున్నారు. ఆ వివరాలేమిటో చూద్దామా.. అన్ని జీవులకు భిన్నంగా.. సాధారణంగా సముద్రాల్లో నివసించే చాలా రకాల జెల్లీ ఫిష్‌లకు తమ వయసును వెనక్కి తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. కానీ ఇది కొంతకాలం మాత్రమే, అదీ పునరుత్పత్తి చేయగలిగే దశ వరకు మాత్రమే ఉంటుంది. ఈ దశ దాటితే తిరిగి వయసును వెనక్కి తగ్గించుకునే సామర్థ్యం పోతుంది. కానీ శాస్త్రవేత్తలు కొన్నేళ్ల కింద సముద్రంలో సరికొత్త జెల్లీ ఫిష్‌ను కనుగొన్నారు. టుర్రిటోప్సిస్ డొహ్రని (టీ.డోహ్రని) అని పేరుపెట్టి.. పరిశోధన చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. జీవితంలో ఏ దశలో అయినా, ఎప్పుడైనా తిరిగి తన వయసును వెనక్కి తగ్గించుకోలదు. దీనికి ఈ సామర్థ్యం ఎలా వచ్చిందన్న దానిపై స్పెయిన్‌లోని ఓవిడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇటీవలే ఈ పరిశోధన వివరాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. రెండు సెట్ల జన్యువులతో.. సాధారణంగా ఏ జీవిలో అయి నా వయసు పెరుగుతున్న కొద్దీ, శరీరంలో కణ విభజన జరుగుతూ.. జన్యువుల్లో మార్పులు జరుగుతుంటాయి. కణాల్లో జన్యుక్రమానికి సంబంధించిన సమాచారం నిల్వ ఉండే టెలోమెర్ల (జన్యువులు ఉండే క్రోమోజోమ్‌ల చివరన ఉండే భాగాలు) పొడవు తగ్గిపోతూ ఉంటుంది. ఈ మార్పులే వృద్ధాప్యానికి కారణమవుతాయి. టీ.డోహ్రని జెల్లీ ఫిష్‌పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. దానిలో జన్యువులన్నీ మరో సెట్ కాపీ చేసి ఉన్నాయని గుర్తించారు. దీనివల్ల ఈ జెల్లీ ఫిష్ వయసు పెరిగినకొద్దీ ప్రధాన జన్యువుల్లో మార్పులు జరిగినా, దెబ్బతిన్నా.. వాటిని మరో సెట్ సాయంతో తిరిగి సరిచేసుకుంటున్నట్టు తేల్చారు. అంతేగాకుండా ఈ జెల్లీఫిష్‌ల కణాల్లోని టెలోమెర్ల పొడవు తగ్గకుండా అంతర్గత వ్యవస్థలు పనిచేస్తున్నట్టు గుర్తించారు. దీనివల్ల ఇవి వృద్ధాప్య లక్షణాలను దరిచేరనీయడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సామర్థ్యంతో ఏం చేస్తుంది? టి.డోహ్రిని జెల్లీఫిష్‌లకు వృద్ధాప్యం రానప్పుడు.. మళ్లీ వయసును తగ్గించుకునే సామర్థ్యం ఎందుకనే అంశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ జెల్లీ ఫిష్‌లు మరీ ఎక్కువ వయసుకు వచి్చనప్పుడు, ఇతర జీవుల దాడుల్లో దెబ్బతిన్నప్పుడు, అవి ఉన్న పరిస్థితులు జీవించడానికి అనుకూలంగా లేనప్పుడు.. వయసు తగ్గించేసుకుని, తిరిగి ఎదుగుతున్నట్టు గుర్తించారు. చాలా రకాల కీటకాలు, ఇతర జీవుల తరహాలోనే జెల్లీ ఫిష్‌ల పరిణామక్రమం ఉంటుంది. ఉదాహరణకు దోమ మొదట పిండం రూపంలో, తర్వాత లార్వా వంటి మధ్యస్థ దశలో, తర్వాత పూర్తి రూపంలోకి ఎదుగుతుంది. సీతాకోక చిలుకలు మొదట గుడ్డు, తర్వాత పురుగు, చివరిగా ఎగిరే సీతాకోక చిలుకల్లా మారుతాయి. ఇదే తరహాలో టి.డోహ్రిని జెల్లీ ఫిష్‌లు క్రమంగా తమ పూర్వరూపాలకు మారుతూ.. పిండం దశదాకా (జెల్లీ ఫిష్.. సిస్ట్.. పాలిప్ రూపాలదాకా) వెళ్తాయి. అక్కడి నుంచి తిరిగి పూర్తిస్థాయి జీవిగా ఎదుగుతూ వస్తాయి. ఈ క్రమంలో మళ్లీ బాల్యం నుంచి యవ్వనం దాకా అనుభవిస్తాయని అనుకోవచ్చు. ఇదే శక్తి మనకూ వస్తే..? ఈ జెల్లీ ఫిష్‌లలో ఉండో రెండో సెట్ జన్యువులు కణాల రక్షణకు, పునరుద్ధరణకు తోడ్పడే ప్రోటీన్లు ఉత్పత్తి చేస్తున్నాయని ఓవిడో వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రోటీన్లపై పరిశోధన చేయడం ద్వారా.. మనం తిరిగి మరీ చిన్నపిల్లల్లా మారిపోకున్నా, వృద్ధాప్యాన్ని దూరం చేసే అత్యాధునిక విధానాలను అభివృద్ధి చేయవచ్చని చెప్తున్నారు. ఎన్నోరకాల జన్యు సంబంధ వ్యాధులు, ఇతర అనారోగ్యాలకూ సమర్థవంతమైన చికిత్సలను రూపొందించవచ్చని అంటున్నారు. అంతేకాదు.. భవిష్యత్తులో అసలు వృద్ధాప్యమే దరి చేరకుండా ఉండే ఔషధాలు, చికిత్సలు వచ్చే అవకాశమూ ఉంటుందని పేర్కొంటున్నారు. చదవండి: జంతువుల మాదిరిగానే..మనుషులకు తోక! -
కాలంలో ప్రయాణం సాధ్యమేనా?
టైమ్ ట్రావెల్ అసాధ్యమేమీ కాదు. అదో ఇంజనీరింగ్ సమస్య. అంతే! – ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త మైకియో కాకు చేజారితే మళ్లీ దొరకనిది కాలమని అందరికీ తెలుసు. కానీ టైమ్ ట్రావెలే గనక నిజంగా సాధ్యమైతే? చేజారిన క్షణాలను మళ్లీ చవిచూడవచ్చు. సైన్స్ ఫిక్షన్‌గా, కవుల కల్పనగా భాసించిన కాల ప్రయాణం సాధ్యమేనంటున్నారు సైంటిస్టులు! గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవడానికి అవకాశం వస్తే బాగుండని అనుకోని వాళ్లుండరు. కానీ నిజజీవితంలో అది సాధ్యమయ్యేది కాదని అందరికీ తెలుసు. అయితే ఇంతవరకు మనిషి కల్పనలో భాగమైన టైమ్ మిషన్ ఇక ఎంతమాత్రం కల్పన కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఇకపై ఎవరైనా కాలంలో వెనక్కు పయనించవచ్చంటున్నారు. ‘ఆహా! ఎంత శుభవార్త’అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. కాలంలో వెనక్కు పయనించడం సాధ్యమే కానీ అది ఏ టైమ్‌లైన్‌లోకి అన్నది మాత్రం ఎవరూ చెప్పలేరని వివరిస్తున్నారు. కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంది కదా! ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే ఐన్‌స్టీన్ స్పేస్ అండ్ టైమ్ సూత్రం నుంచి కొత్త సిద్ధాంతం వరకు గుర్తు చేసుకోవాలి. రెండు సమస్యలు ఐన్‌స్టీన్ ప్రకారం స్థలకాలాదులు వాస్తవాలు కావు. అవి సాపేక్షాలు. అసలు ఆ రెండూ కలిసి స్పేస్టైమ్గా కూడా ఉంటాయి. ఈ సిద్ధాంతం ఆధారంగా పలువురు సైంటిస్టులు కాల ప్రయాణానికి సంబంధించిన సూత్రాలు రూపొందించారు. కానీ ఆచరణలో ఇవన్నీ విఫలమయ్యాయి. సూత్రాల వైఫల్యానికి ముఖ్యంగా రెండు కారణాలున్నాయి. టైమ్ మిషన్ నిర్మించడానికి నెగిటివ్ ఎనర్జీ (డార్క్ మ్యాటర్) కావాలి. కానీ మన చుట్టూ ఉన్న ప్రతిదీ పాజిటివ్ ఎనర్జీతో తయారైనదే. అలాంటప్పుడు టైమ్ మిషన్ కోసం నెగిటివ్ ఎనర్జీని ఎలా తీసుకురావాలన్నది మొదటి ప్రశ్న. క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం నెగిటివ్ మ్యాటర్‌ను స్వల్పకాలం పాటు స్వల్ప పరిమాణంలో సృష్టించవచ్చు. కాలంలో ప్రయాణానికి అసలు సమస్య టైమ్ కన్సిస్టెన్సీ పారడాక్స్ (కాల స్థిరత్వ విరోధాభాసం). అంటే భూతకాలంలో ఒక సంఘటనలో మార్పు వస్తే దాని ప్రభావం వర్తమానంపై కూడా పడుతుంది. అదే సమయంలో వర్తమానంలో అప్పటికే వచ్చిన మార్పు భూతకాలం తాలూకు సదరు మార్పును జరగనీయకుండా ఆపుతుంది. మరింత సరళంగా చెప్పాలంటే మీరు టైమ్ మిషన్‌లో ఐదు నిమిషాలు వెనక్కువెళ్లి అక్కడ అదే టైమ్ మిషన్‌ను ధ్వంసం చేశారనుకోండి, అలాంటప్పుడు మీకు ఐదు నిమిషాల తర్వాత టైమ్ మిషన్ వాడే అవకాశమే ఉండదు. అలా టైమ్ మిషన్ వాడే అవకాశమే లేనప్పుడు మీరు ఐదు నిమిషాల గతంలోకే వెళ్లలేరు. దాన్ని ధ్వంసం చేయనూ లేరు. అంటే ఏకకాలంలో టైమ్ మిషన్ ఉంటుంది, ఉండదు కూడా. ఇదే కాల ప్రయాణంలో ఎదురయ్యే రెండో పరస్పర విరుద్ధ వాస్తవాల సమస్య. – నేషనల్ డెస్క్, సాక్షి పరిష్కారాలున్నాయి రకరకాల పారడాక్స్ల దృష్ట్యా కాల ప్రయాణం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చారు ప్రముఖ సైంటిస్టు స్టీఫెన్ హాకింగ్. టైమ్ ట్రావెల్ నిజమైతే ఈపాటికి భవిష్యత్ మానవులు మన దగ్గరికి వచ్చేవారన్నది ఆయన అభిప్రాయం. కానీ వీటన్నింటికీ సరికొత్త సమాధానం ఉందంటున్నారు ప్రస్తుత పరిశోధకులు. ఐగార్ డిమిట్రివిక్ నొవికో అనే సైంటిస్టు ప్రకారం మనం భూతకాలంలోకి వెళ్లవచ్చు, కానీ అక్కడ ఎలాంటి మార్పులూ చేయలేం! అంటే భూతకాలంలో ప్రేక్షకులుగా మాత్రమే ఉండగలుగుతాం. అలాంటప్పుడు పారడాక్స్ల సమస్యే రాదు. అయితే పారడాక్స్ సమస్యకు అతి ముఖ్య పరిష్కారం మల్టిపుల్ హిస్టరీలు లేదా మల్టిపుల్ టైమ్‌లైన్స్ అంటారు నవీన శాస్త్రవేత్తలు. దీని ప్రకారం భూతకాలంలోకి వెళ్లవచ్చు. మార్పులూ చేయవచ్చు. కానీ ఆ మార్పులు ప్రస్తుత టైమ్‌లైన్‌లో ప్రతిబింబించవు. మీరు చేసిన మార్పులతో కొత్త టైమ్‌లైన్ స్టార్టవుతుంది. అంటే ఒక ఘటనకు అనేక చరిత్రలుంటాయి. ఈ సిద్ధాంతాన్ని పై ఉదాహరణకు అన్వయిస్తే మీరు ఐదునిమిషాల గతంలోకి వెళ్లేది మీ ప్రస్తుత టైమ్‌లైన్‌లోకి కాదు. అది మరో కొత్త టైమ్‌లైన్. అక్కడ మీరు టైమ్ మిషన్ ధ్వంసం చేసిన తర్వాతి పరిణామాలతో టైమ్‌లైన్ కొనసాగుతుంది. అంటే మీ ఐదు నిమిషాల భూతకాల ప్రయాణం తర్వాత మీకు రెండు చరిత్రలుంటాయి. ఒకటి ప్రస్తుతమున్నది, మరోటి మీరు సృష్టించినది. అయితే మన విశ్వంలో ఇలా అనేక టైమ్‌లైన్స్ ఉండటం సాధ్యమేనా? అంటే క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు. ఫైనల్‌గా... ‘టైమ్ ట్రావెల్ సాధ్యమే. కానీ దీనివల్ల టైమ్‌లైన్స్ మారతాయి’అన్నది ప్రస్తుత సైంటిస్టుల సిద్ధాంతం. ఇది ప్రాక్టికల్‌గా నిరూపితమవ్వాలంటే ఒక రియల్ టైమ్ మిషన్ నిర్మాణం జరగాలి. అంతవరకు ఈ సిద్ధాంత రాద్ధాంతాలు నడుస్తూనే ఉంటాయి. -
సమయమే సంపద
కాలం ఎంతో విలువైనది. ఎవరికోసం ఆగనిది. బిరబిరమంటూ సాగిపోయే ఉధృతమైన నదీ ప్రవాహానికి మానవ మేధాశక్తితో ఆనకట్ట వేయవచ్చు. కానీ, నిరవధికంగా సాగిపోయే కాలప్రవాహానికి మాత్రం ఎవ్వరూ అడ్డుకట్ట వేయలేరన్నది వాస్తవమే కదా..!! కాలం మనకు ఉచితంగా లభిస్తుంది. కానీ కాలం విలువను వెలకట్టలేమన్నది జగమెరిగిన సత్యం. సకల ప్రాణుల్ని, సమస్త జగత్తునూ నడిపించేదీ, హరించేదీ కాలమే. సృష్టి, స్థితి, వినాశం అనే ప్రధానమైన కార్యాలకు సాక్షీభూతంగా నిలిచేదీ కాలమే. అత్యంత బలవత్తరమైన కాలప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఆధ్యాత్మిక సాధనలూ కాలాన్ని బంధించలేవు. ‘‘పారే నది లో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో అలాగే గతించిన కాలాన్ని పట్టుకోలేం. అందుచేత కాలమహిమను గుర్తించండి’’ అన్న చాణుక్యుని వాక్యాలు ఎంతో అర్థవంతమైనవి. జీవితంలో ప్రతిక్షణం వెలకట్టలేనిదే. గడిచిపోయిన క్షణం తిరిగిరాదు. అందుకే, కాలాన్ని విధి గా పాటించడం లేదా సమయపాలనకు కట్టుపడడం అనేది ప్రతివారికీ అత్యంత ముఖ్యమైన విధి. సమయపాలనకు సంబంధించి రకరకాల నిర్వచనాలు మనకు నిత్యమూ కనబడుతూ ఉంటాయి. సమయానికి మనం అనుకున్న పనిలో, విహితమైన తీరులో, ఏకాగ్ర చిత్తంతో నిమగ్నం కావడాన్నే సమయపాలన అని చెప్పుకోవచ్చు. ఏదైనా పనికోసం మనం సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆ కార్య పరిపూర్ణతకు ఉపకరించి, సంతృప్తిని కలిగిస్తుంది. ఏదైనా ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడంకోసం సమయాన్ని కేటాయిస్తే, అది మనలో మేధాశక్తినీ పెంచడమే గాక, వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రానికీ చేరుస్తుంది. అమేయమైన సారాన్ని నింపుకున్న పుస్తకాలను గానీ, గ్రంథాలను గానీ చదవడానికి సమయాన్ని కేటాయిస్తే, మనలో మనోవికాసం పెంపొందుతుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలోనే నిమగ్నం కాకుండా, ఒకింత నవ్వుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే, అది మన జీవితాన్ని ఆహ్లాదమయం చేస్తుంది. కొంత సమయాన్ని పక్కవాడికి సహాయం చేయడానికి కేటాయిస్తే, అది మనకు ఆత్మానందాన్ని కలిగిస్తుంది. దైనందిన జీవితంలో వ్యాయామానికి సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆరోగ్యప్రదాయినియై సంతసాన్ని కలిగిస్తుంది. సమయం విలువ ప్రతివారూ గుర్తెరగడం అత్యంత ముఖ్యం. ప్రత్యేకించి, పిల్లలకు సమయానికి తగినట్లుగా పనులు అలవాటు చేయడం తల్లితండ్రుల బాధ్యత. ముఖ్యంగా ఉదయాన నిద్రలేవడం నుంచీ, రాత్రి పడుకునే వరకు, వాళ్ళు ఏ సమయానికి ఏం చేయాలో తెలియజెప్పడం తప్పనిసరిగా చేయాలి. ముందు కొంత బద్ధకించినా, కొన్ని రోజులకు సమయం ప్రకారం పనులు చేయడం వారికి అలవాటుగా మారుతుంది. జీవితానికి ఉత్తమ బాటను పరుస్తుంది. ‘‘ క్షణము గడిచిన దాని వెన్కకు మరల్ప సాధ్యమే మానవున కిలాచక్రమందు’ అంటాడు గుర్రం జాషువ. ఒక్క మాటలో చె ప్పాలంటే విశ్వవిఖ్యాతి గడించిన మహనీయులందరూ ఏ రంగానికి చెందిన వారైనా కాలం విలువ బాగా తెలిసిన వారే సమయాన్ని సద్వినియోగపరచుకున్నవారే. కాలం అనేది మనం ఆపితే ఆగదు. కాబట్టి ఏ సమయంలో ఏ పని చెయ్యాలో ఆ సమయంలో ఆ పని చేస్తే సమయం సద్వినియోగపరిచినట్లే. ప్రపంచంలో గొప్పవాళ్ళయిన వ్యక్తులందరూ కాలం విలువ తెలిసిన వాళ్ళే. ప్రతీ క్షణాన్నీ సద్వినియోగం చేసినవాళ్ళే. అందువల్లనే, ఆది శంకరాచార్యులు, ఏసుక్రీస్తు, వివేకానందస్వామి మొదలైన మహాపురుషులు చిన్నవయస్సులోనే శరీరాన్ని చాలించినప్పటికీ, తాము జీవించి ఉన్న స్వల్పమైన సమయంలోనే అద్వితీయమైన, అప్రతిహతమైన విజయాలను సాధించగలిగారు. ‘‘యువతీ యువకుల్లారా.. మీరంతా మేల్కొనండి. లక్ష్యసాధనకోసం శ్రమించే క్రమంలో ప్రతి క్షణాన్నీ సద్వినియోగపరచండి. మీరు మండే నిప్పు కణికలు అని గమనించండి. కాబట్టి కాలం విలువ ఎరిగినవారై, బద్ధకాన్ని వదలండి.’’ అంటూ స్వామి వివేకానంద ఇచ్చిన సందేశం ఎంతో విలువైనది. సమయం విలువను కాల రాచే మహమ్మారిలాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి. పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది. ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. ప్రతి వ్యక్తీ, తన మనసును అదుపులో ఉంచుకుంటే సోమరితనాన్ని జయించి, కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలో సార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని కాదు. జగత్ప్రసిద్ధమైన ఆపిల్ కంపెనీ సహవ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ, ‘‘నీ సమయం ఎంతో విలువైనది. ఆ సమయాన్ని వినియోగించి నీ జీవితాన్ని స్వర్గమయం చేసుకో. కాలాన్ని వ్యర్థం చేసుకుని, ఇంకొకరి జీవితంలో నీవు బతకకు’’ అంటారు. కాలం విలువ తెలుసుకుని, ప్రగతిని సాధిస్తూ, ముందుకు సాగమని, ఇంకొకరితో తనను పోల్చుకోకుండా ధరిత్రిలో మరొక కొత్త చరిత్రను లిఖించమనే ప్రబోధమూ ఈ మాటల్లో దాగి ఉంది. ‘‘ప్రపంచంలో అతి విలువైన వస్తువులు రెండు.. మొదటిది సహనం, రెండోది కాలం.’’ అంటారు లియో టాల్‌స్టాయ్. సృష్టిలో మనకు లభించే అత్యంత విలువైన సంపద కాలమే. కానీ అత్యంత దయనీయంగా నిత్యమూ మనం వృథా చేసేదీ కాలాన్నే..!! ‘‘సమయం ప్రధానమైన విషయాల్లో ఒకటి కాదు. సమయమే అత్యంత ప్రశస్తమైన సంపద’’ అని యువత గ్రహిస్తే, వారి భవిత బంగరు బాట కావడం కష్టమేమీ కాదు. కాలాన్ని సద్వినియోగపరచిన ప్రతి వ్యక్తీ చేయగలిగేది మహేంద్రజాలమే. సమయం విలువను కాల రాచే మహమ్మారిలాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి. పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది. ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది ఏ మాత్రం వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. ప్రతి వ్యక్తీ, తన మనసును అదుపులో ఉంచుకుంటే సోమరితనాన్ని జయించి, కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలో సార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని ఏమాత్రం కాదు. –వ్యాఖ్యాన విశారద, వెంకట్ గరికపాటి -
118 ఏళ్ల కింద.. టైమ్ ఎలా సెట్ చేశారు?
టైం.. మన జీవితంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. చూసుకోవడానికే కాదు.. ఏది మాట్లాడినా.. దీన్ని ప్రస్తావించకుండా ఉండలేము కూడా.. అందుకే.. వాడి టైం మొదలైందిరా.. అన్నా.. వీడి టైం బ్యాడ్ నడుస్తోంది రా అన్నా.. ఏదైనా టైం కలసి రావాలి అన్నా.. ప్రతి విషయంలోనూ దానికున్న ప్రాధాన్యతే వేరు.. మరి అలాంటి ‘టైం’ను ఎప్పుడు సెట్ చేశారు? నిజానికి భూమి తిరుగుతున్న కొద్దీ ఒక్కో ప్రాంతంలో సూర్యోదయం అవుతూ వస్తుంది. అలా దేశాలు దాటుతున్న కొద్దీ.. కొన్నిచోట్ల అప్పుడే తెల్లవారుతుంటే, మరికొన్ని చోట్ల మధ్యాహ్నం, ఇంకొన్ని చోట్ల సాయంత్రం, రాత్రి అవుతుంటాయి. అంటే ఒక్కో చోట ఒక్కో టైం.. తొలినాళ్లలో ఇదంతా పెద్ద గందరగోళంగా ఉండేది.. సరిగ్గా చెప్పాలంటే.. 118 ఏళ్ల కింద ఈ ‘టైం జోన్ల’ను నిర్ధారించి, ఇబ్బందులను సెట్ చేశారు. అందుకే ఆ స్టోరీతోపాటు మరికొన్ని డిఫరెంటు సంగతులనూ తెలుసుకుందామా.. మొదట్లో ఎక్కడి టైం అక్కడే మొదట్లో ప్రపంచవ్యాప్తంగా సమయం విషయంగా తీవ్ర గందరగోళం ఉండేది. ఎక్కడికక్కడ స్థానికంగానే.. పగలు సూర్యోదయం, అస్తమయం, సూర్యుడి నీడ కదలికలతో.. రాత్రిపూట చంద్రుడు, నక్షత్రాల ఆధారంగా సమయాన్ని లెక్కించేవారు. అప్పట్లో వేగవంతమైన రవాణా లేదు. ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్లేందుకు ఎక్కువసేపు పట్టడంతో.. సమయాల్లో తేడా తెలిసేది కాదు. వేగవంతమైన రవాణా వచ్చాక సమయం విషయంగా ఇబ్బందులు పెరిగిపోయాయి. కెనడా ఇంజనీర్ ఆలోచనతో.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడ వేర్వేరు సమయాల సమస్యను తొలగించేందుకు కెనడాకు చెందిన ఇంజనీర్ సర్ శాండ్ఫోర్డ్ ఫ్లెమింగ్ ఓ ప్రతిపాదన చేశాడు. భూమి అంతటినీ గంటకో టైం జోన్ వచ్చేలా.. 24 టైం జోన్లుగా విభజించాలని సూచించాడు. ప్రతి 15 డిగ్రీల రేఖాంశం వద్ద ఒక టైం జోన్ పెడితే సరిపోతుందన్నాడు. ►శాండ్ఫోర్డ్ సూచనతో 1884లో ఇంగ్లండ్‌లోని గ్రీన్విచ్ ఆధారం గా (జీరో డిగ్రీగా) తీసుకుని 24 టైం జోన్లను నిర్ధారించారు. దీనిని గ్రీన్విచ్ మీన్ టైం (జీఎంటీ)గా పేర్కొంటారు. తర్వాత 1967లో మరింత స్పష్టంగా, కచ్చితమైన అణు గడియారాలతో కూడిన ‘ది కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం (యూటీసీ)’ మొదలైంది. టైం జోన్లన్నింటినీ.. యూటీసీ ప్లస్, మైనస్ (బేస్ టైంజోన్‌కు ముందు, వెనుక ఉన్న ప్రాంతాలు)గా లింక్ చేసి చెప్తారు. మన టైం ఎప్పుడొచ్చింది? వైశాల్యం పరంగా ప్రపంచంలోనే ఏడో పెద్ద దేశం ఇండియా. బ్రిటిష్ వారి హయాంలో బాంబే, కలకత్తా, మద్రాస్.. మూడు టైంజోన్లు పాటించేవారు. అయితే 1906లో దేశంలో ఎక్కువ ప్రాంతాల మధ్య సమతుల్యత వచ్చేలా ఒకే ‘ఇండియన్ స్టాండర్డ్ టైం (ఐఎస్టీ)’ని అమల్లోకి తెచ్చారు. మన సమయం ‘యూటీసీ+ 5.30’ గంటలుగా ఉంటుంది. ►మన దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో ముందే సూర్యోదయం అవు తుంది. అందువల్ల అస్సాం టీ తోటల్లో పనుల కోసం సమయాన్ని గంట ముందు కు జరిపి.. ‘టీ గార్డెన్ టైం’గా పాటిస్తుంటారు. ►ఇండియా టైంజోన్లోనే శ్రీలంక మన సమ యాన్నే పాటిస్తుంది. నేపాల్ తమకో ప్రత్యేకత ఉండా లంటూ.. 15 నిమిషాలు ముందుండే ‘యూటీసీ+5.45’ టైంజోన్‌ను వాడుతోంది. చైనాలో టైం గోల! ప్రపంచంలో వైశాల్యంలో నాలుగో పెద్ద దేశం చైనా ‘బీజింగ్’ పట్టణం కేంద్రంగా ఒకే టైం జోన్ పాటిస్తుంది. దీనితో ఇప్పటికీ గందరగోళమే. బీజింగ్ చైనాలో తూర్పు కొసన .. క్సింజియాంగ్ వంటి ప్రాంతాలు పడమర చివరన ఉంటాయి. ఒకే టైం పాటించడంతో బీజింగ్‌లో ఉదయం 9 గంటలకు ఆఫీసుకు వెళితే.. క్సింజియాంగ్‌లో పొద్దున ఆరు గంటలకే బయలుదేరాల్సి ఉంటుంది. ►ప్రపంచంలో అతిపెద్ద దేశం అయిన రష్యాలో అయితే తూర్పు, పడమర చివర్లలోని ప్రాంతాల మధ్య తేడా పది గంటలకుపైనే ఉంటుంది. కానీ అక్కడ వేర్వేరు టైంజోన్లు పాటిస్తుండటంతో ఇబ్బంది కాస్త తక్కువగా ఉంది. ►ఇక 1940లో అయితే స్పానిష్ నియంత ఫ్రాంకో కేవలం హిట్లర్‌కు సంఘీభావం తెలిపేందుకు తమ దేశ టైం జోన్‌ను జీఎంటీ నుంచి జర్మనీ పాటించే సెంట్రల్ యూరోపియన్ టైంకు మార్చేశారు. గౌరవం కోసం ఒకరు.. పొదుపు కోసం మరొకరు ►ప్రపంచంలో రెండు దేశాలు ఇటీవల తమ సమయాన్ని మార్చేసుకున్నాయి. తమ సమయాన్ని అరగంట ముందుకు జరిపేసుకున్నాయి. అందులో ఒకటి ఉత్తర కొరియా, మరొకటి వెనెజువెలా. ►ఉత్తర కొరియా వాస్తవానికి ‘యూటీసీ+8.30’ టైం జోన్లో ఉంటుంది. వందేళ్ల కింద తమ ఆక్రమణలో ఉన్న కొరియా టైంజోన్‌ను జపాన్ ‘యూటీసీ+9.00’కు మార్చేసింది. 2015లో ఉత్తర కొరియా తమ ఆత్మగౌరవం కోసమంటూ.. సమయాన్ని అర గంట ముందుకు జరుపుకొని, పాత టైంజోన్‌కు మారింది. తర్వాత ఉత్తర, దక్షిణ కొరియాల్లో ఏకత్వం పేరిట ‘యూటీసీ+9.00’కి మార్చారు. ►విద్యుత్ పొదుపు కోసం వెనెజువెలా తమ దేశంలో టైమ్‌ను అరగంట పెంచి ‘యూటీసీ+4.30 నుంచి యూటీసీ+4.00’ టైంజోన్‌కు మారింది. దీనివల్ల పొద్దున లేటుగా నిద్రలేస్తారని, సాయంత్రం ఆలస్యంగా ఇళ్లకు వెళ్తారని.. విద్యుత్ బల్బులు, ఉపకరణాల వినియోగం తగ్గుతుందని ఇలా చేసింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ చదవండి: ఆఫ్రికాలో దొరికిన అరుదైన మూడో అతిపెద్ద వజ్రం -
సైన్స్ ఈస్ట్‌మన్ కలర్లో..
సైన్సు క్లాసు పిల్లలకు విజ్ఞానం. సినిమా వాళ్లకు వినోదం. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సైన్సు ఆధారంగా తయారైన తెలుగు సినిమాలెన్నో. నేడు నేషనల్ సైన్స్ డే సందర్భంగా... ఆదివారం ప్రత్యేకం హాలీవుడ్లో సైన్స్ ఫిక్షన్ తీయడం క్షణాల్లో పని. వారు కథలు ఎలా ఆలోచిస్తారో ఆ ఆలోచనలు ఎలా వస్తాయో తెలియదు. ఆత్రేయ ‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు’ అని రాశారు. హాలీవుడ్ వాళ్లు కలల్లోకి వెళ్లడాన్ని కూడా తీసుకుని సినిమాలు తీశారు. ‘ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ది స్పాట్‌లెస్ మైండ్’ అనే ఒక సినిమాలో హీరో హీరోయిన్ ఇక మన మధ్య ప్రేమ వద్దు అనుకుంటారు. బ్రేకప్ అయిపోతుంది. బ్రేకప్ అయిపోయినా పాత జ్ఞాపకాలు మాత్రం ఉంటాయి కదా. ఆ జ్ఞాపకాలు మాత్రం ఎందుకు అనుకుని ఒక టెక్నాలజీ ద్వారా ఆ జ్ఞాపకాలన్నీ ఇద్దరూ చెరిపేసుకుంటారు. ఆ తర్వాత ఏమయ్యింది అనేది కథ. చూడండి ఎంత బాగా ఆలోచించారో. తెలుగులో ఈ స్థాయి ఆలోచన రావడానికి చాలా కాలం పడుతుంది. కాని తెలుగు ఇంకా కచ్చితంగా చెప్పాలంటే తమిళ భాషల్లో సైన్స్‌ని కమర్షియల్ సినిమాకు బాగానే ఉపయోగించుకున్నారు. తెలుగులో జేమ్స్‌బాండ్ తరహా క్రైమ్ సినిమాలు మొదలయ్యాక సైన్సు, సైంటిస్టు అనే మాటలు ప్రేక్షకులకు ఎక్కువగా వినిపించడం మొదలయ్యాయి. ఒక సైంటిస్ట్ ఏదో ఫార్ములా కనిపెడతాడు. దాని కోసం విలన్ వెంటపడతాడు. ఆ సైంటిస్ట్ కూతురు తండ్రి కోసం వెతుకుతుంటుంది. హీరో సాయం చేస్తాడు. మనకు సైన్స్ అంటే ఒక ల్యాబ్, బుడగలు తేలే బీకర్లు మాత్రంగా చాలా కాలం సినిమాలు నడిచాయి. కాని సైన్స్‌ను లేశమాత్రంగా కథల్లో ప్రవేశ పెట్టడం మెల్లగా మొదలైంది. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ నటించిన ‘దొరికితే దొంగలు’ దాదాపుగా సైన్స్ ఫిక్షన్‌గా చెప్పే వీలైన తొలి తెలుగు సినిమా అనుకోవచ్చు. ఇందులో రాజనాల, సత్యనారాయణ, అల్లురామలింగయ్యలు తెర వెనుక సైంటిఫిక్ పవర్స్‌ను అడ్డుపెట్టుకొని నానా అఘాయిత్యాలు చేస్తుంటారు. చివరకు ఎన్.టి.ఆర్ వారి ఆట కట్టిస్తాడు. ఆ తర్వాతి రోజుల్లో కృష్ణ ‘రహస్య గూఢచారి’ సినిమా వచ్చింది. ఇందులో విలన్ సత్యనారాయణ విజ్ఞాన శాస్త్రాన్ని ఔపోసన పట్టి అణు రాకెట్లు తయారు చేస్తాడు. ‘ఒక మీట నొక్కితే కుంభవృష్టి కురుస్తుంది.. ఒక మీట నొక్కితే సముద్రం ఆవిరవుతుంది’ అని చెబుతాడు. అయితే సహజంగానే కృష్ణ అతణ్ణి మట్టి కరిపిస్తాడు. కాని రహస్య గూఢచారిలో విలన్ చేసిన పని మనిషి త్వరలోనే చేస్తాడనిపిస్తుంది. దర్శకుడు గీతాకృష్ణ ‘కోకిల’ అనే సినిమా తీశారు. ఇందులో ప్రమాదరీత్యా కళ్లు పోయిన హీరోకు వేరొకరి కళ్లు అమరుస్తారు. అయితే అతడు కళ్లు తెరిచినప్పటి నుంచి ఒక హత్య జరిగిన దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. ఎవరి కళ్లయితే నరేశ్‌కు పెట్టారో ఆ కళ్లు ఆఖరిసారిగా ఆ హత్యను చూశాయి. ఆ కళ్లకు ఆ మెమొరి అలా ఉండిపోయి ఆ దృశ్యం ఇప్పుడు నరేశ్‌కు కనిపిస్తూ ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారం లేకపోయినా జనం ఓకే చేశారు. సినిమా హిట్ అయ్యింది. ∙∙ అయితే తెలుగువాళ్లు ఈనాటికీ గొప్పగా చెప్పుకోదగ్గ సైన్స్ ఫిక్షన్ మాత్రం ‘ఆదిత్యా 369’ సినిమాయే. టైమ్ మిషన్ ఆధారంగా అల్లుకున్న ఈ కథ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇందులో హీరో బాలకృష్ణ హీరోయిన్ను తోడు చేసుకుని టైమ్ మిషన్‌లో రాయలవారి కాలానికి వెళతాడు. ఆ తర్వాత అత్యంత రేడియేషన్ ఉండే భవిష్యత్ కాలానికి కూడా వెళతాడు. ఆ సినిమా లో వీడియో కాల్స్, సెల్‌ఫోన్ కాల్స్ లాంటివి ఊహించారు. ఆ సినిమాలో సైంటిస్ట్‌గా టిన్నూ ఆనంద్ నటించి మంచి గుర్తింపు పొందాడు. ఈ సినిమా తీసినందుకు గాను దర్శకుడు సింగీతం శ్రీనివాస్ చాలా మంది ప్రేక్షకులకు మరింత ఇష్టులు అయ్యారు. దీని సీక్వెల్ గురించి ఎన్నో ప్రయత్నాలు సాగాయి కాని జరగలేదు. సైన్స్ ఫిక్షన్‌ను పెద్ద హీరోల మీద భారీగా ఉపయోగించాలి కాని కామెడీగా కాదని సూర్య దర్శకత్వంలో వచ్చిన ‘నాని’ నిరూపించింది. ఇందులో కూడా ఒక పిచ్చి సైంటిస్ట్ చేసిన ఒక ప్రయోగం వికటించి చిన్న పిల్లాడు పెద్దవాడిగా మారడం ఆ పెద్దగా ఉన్న సమయంలో వివాహం కూడా జరిగిపోవడం ఇవన్నీ ఫన్నీగా ఉన్నా జనం మెచ్చలేదు. మహేశ్ బాబు అభినయం, ఏ.ఆర్.రెహమాన్, అమీషా పటేల్ అల్లరి సినిమాను కాపాడలేకపోయాయి. ∙∙ అదే సమయంలో తమిళం నుంచి డబ్ అయిన సైన్స్ ఫిక్షన్ సినిమాలు తెలుగువే అన్నంత బాగా ఇక్కడ హిట్ అయ్యాయి. శంకర్ తీసిన ‘రోబో’ పెద్ద సంచలనం రేపింది. శాస్త్రం శృతి మించితే మనిషికి బానిసగా ఉండటం కాక మనిషినే బానిసగా చేసుకుంటుందని చెప్పిన ఈ సినిమా కలెక్షన్ల దుమారం రేపింది. రజనీకాంత్‌కు భారీ హిట్‌ను ఇచ్చింది. దీని కొనసాగింపుగా సెల్ టవర్ల దుష్ఫలితాలను తీసుకుని ‘రోబో2’ తీశారు కాని జనం మెచ్చలేదు. స్పష్టత కరువై ఎవరు హీరోనో ఎవరు విలనో తెలియకుండా పోయింది. హీరో సూర్య దర్శకుడు మురగదాస్‌తో కలిసి చేసిన ‘సెవెన్త్ సెన్స్’ భారతీయ సనాతన శక్తులను, శాస్త్రీయ శక్తులను చర్చించింది. ఇందులో వైరస్ చైనా నుంచి దిగుమతి అయినట్టు చూపడం మొన్న కరోనా సమయంలో చర్చకు వచ్చింది. సూర్య దర్శకుడు విక్రమ్ కుమార్‌తో తీసిన ‘24’ కూడా హిట్ అయ్యింది. ఈ సినిమా సమయాన్ని బంధించడం గురించి అందమైన ఊహ చేసింది. అలాంటి రోజులు వస్తాయేమో తెలియదు. అలాగే అంతరిక్షం కథాంశంగా వచ్చిన ‘టిక్ టిక్ టిక్’ కూడా మంచి మార్కులే సంపాదించింది. ∙∙ సైన్స్ ఫిక్షన్ మీద తెలుగు సినిమా పెట్టుకున్న నమ్మకం అన్నిసార్లు సక్సెస్ ఇవ్వలేదు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అంతరిక్షం’ తొలి తెలుగు అంతరిక్ష నేపథ్య సినిమాగా నమోదైనా విజయం సాధించలేదు. హీరో వరుణ్‌తేజ్‌ను ఇది నిరాశ పరిచింది. ఇక విజయేంద్ర ప్రసాద్ కథతో వచ్చిన ‘శ్రీవల్లి’ సినిమా బ్రైన్ వేవ్‌ను కంట్రోల్లోకి తెచ్చుకోవడం వల్ల ఎదుటివారిని తమ అదుపులోకి తేవడం అనే అంశాన్ని చర్చించినా జనానికి కనెక్ట్ కాలేదు. పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’లో, రవితేజా ‘డిస్కో రాజా’లో శాస్త్రీయ అంశం కనిపించింది. సైన్స్ ఒక సముద్రం. దాని నుంచి ఎన్ని కథలైనా అల్లవచ్చు. అయితే విజ్ఞానం, వినోదం సమపాళ్లలో కలిపినప్పుడు ఆ జానర్ హిట్ అయ్యింది. భవిష్యత్తులో మంచి సైన్స్ ఫిక్షన్ చిత్రాలు వస్తాయని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
ఫార్ములా ఆఫ్ ది టైం మెషిన్
‘‘రెస్పెక్టెడ్ కొలీగ్స్!! మనం ఈ టైం మెషీన్ గురించి చాలా కాలంగా రీసెర్చి చేస్తున్నాం. అనేక పరిశోధనలు, ప్రయోగాలతో సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు కోసం గవర్నమెంట్ ఎన్నో మిలియన్ డాలర్లు ఖర్చు పెడుతోంది. బ్లాక్ మ్యాటర్, సింగ్యులారిటీ, ఇలా టైం మెషీన్‌కు సంబంధించిన రహస్యాలు, చిక్కుముడులు అందినట్టే అంది జారిపోతున్నాయి..’’ ఎమోషనల్‌గా చెబుతున్నాడు టైం మెషీన్ ప్రాజెక్ట్ హెడ్ జార్జ్ హెన్రీ. అది అమెరికాలోని ప్రపంచ ప్రసిద్ధ పరిశోధనాశాల.వారం రోజులుగా టైం మెషీన్ ప్రాజెక్టు పరిశోధన మీద తీవ్రంగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి.హెన్రీ తన తోటి శాస్త్రవేత్తలతో మాట్లాడుతున్నాడు.‘‘ఇంకోవైపు ఈ ప్రాజెక్టు టైం అండ్ మనీ వేస్ట్ ప్రాజెక్టు అని బయట ఎజిటేషన్స్ చేస్తున్నారు. మీడియా కూడా మనని పిచ్చివాళ్లంటూ ప్రాపగాండా చేస్తోంది. ప్లీజ్. మనం ఎలాగైనా ప్రోగ్రెస్ సాధించాలి. మనం ఈ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చూపకపోతే మన ప్రాజెక్టు ఫండింగ్ ఆగిపోతుంది.’’ హెన్రీ గొంతులో నిరాశ. ఇంతలో హెన్రీ సెక్రటరీ టిఫానీ ఫోన్ తీసుకొచ్చింది. ‘‘బాస్ నేను టిమోతీ. ఇండియాలో మీ రహస్య ఏజెంట్‌ని..’’‘‘మీటింగ్‌లో బిజీగా వున్నాను. ఏంటీ అంత ఇంపార్టెంట్ మ్యాటర్?’’ ‘‘బాస్. ఇక్కడ ఇండియాలోని హైదరాబాద్‌లో ఓ పర్సన్ టైం మెషీన్ ఫార్ములా కనిపెట్టాడు.’’ ‘‘వ్వాట్!!’’ ఉలిక్కి పడ్డాడు హెన్రీ. వాటర్ బాటిల్ ఒక్క గుక్కలో ఖాళీ చేశాడు. ‘‘ఎస్.. బాస్. ఇండియాలోనే వున్న మన లోకల్ ఏజెంట్ క్రిష్ ఇప్పుడే చెప్పాడు.’’‘‘వ్వాట్!! ఇండియాలో టైం మెషీన్ మీద పరిశోధన జరుగుతోందా!? చెప్పనేలేదు!?’’ కోపంగా అరిచాడు.‘‘అది ల్యాబ్‌లో, లేదా యూనివర్సిటీలో ఐతే మనం పసిగట్టేవాళ్లం బాస్. కానీ అది ఒక కాలేజీ లెక్చరర్ కనిపెట్టాడు. అదీ కాక సడన్‌గా ఎనౌన్స్ చేశాడు.’’‘‘నో, నోవే.. మేం ఇక్కడ కొన్ని మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి, డే అండ్ నైట్ కష్టపడుతున్నా చిన్న డెవలప్మెంట్ సాధించలేకపోయాం. ఆఫ్టరాల్ ఒక్కడు.. అదీ ఇండియాలో! టైం మెషీన్ కనిపెట్టడమా? అదేదో ఫేక్ న్యూస్ అయి వుంటుంది.’’ ఆవేశంగా ఊగిపోతున్నాడు హెన్రీ.‘‘నో బాస్! ఆల్రెడీ ఇప్పటికే రష్యన్, చైనా, జపాన్.. ఇలా అన్ని దేశాల టీంలు ఇండియాకు వస్తున్నాయట..’’ ‘‘ఓకే టిమోతీ! ఆ ఫార్ములా ఎవరికీ దక్కడానికి వీల్లేదు. నేను వెంటనే వస్తున్నాను..’’ ఆగమేఘాల మీద సొంత చార్టర్డ్ ఫ్లైట్‌లో ఇండియాకు బయలు దేరాడు హెన్రీ. ఇండియా ఏదో వొక రోజు అమెరికా కంటే అడ్వాన్స్ అవుతుందని అనుకున్నాడు. కానీ మరీ టైం మెషీన్ ఫార్ములా కనిపెడతారని కలలో కూడా అనుకోలేదు హెన్రీ. టైం మెషీన్ కనిపెట్టడమే జీవిత గమ్యంగా, అది తప్ప వేరే ప్రపంచం లేకుండా బతుకుతున్నాడు. అందుకే ఈ వార్త హెన్రీకి మింగుడు పడట్లేదు. ఎలాగైనా, ఎంత డబ్బైనా పోసి ఆ ఫార్ములా కొనేయాలి అనుకున్నాడు.మధ్యలో ఎప్పటికప్పుడు.. ఏజెంట్ టిమోతీతో ఎంతిచ్చైనా డీల్ సెటిల్ చేయమని చెప్తున్నాడు. ‘‘లాభం లేదు బాస్’’ అని చేతులెత్తేశాడు టిమోతీ.ఇటు ఇండియా మీడియాలో టైం మెషీన్ మీద బ్రేకింగ్ న్యూస్‌లు. లైవ్ కవరేజీలు. ఒక చానల్, ‘అసలు టైం మెషీన్ సాధ్యమేనా?’ అనే టాపిక్ మీద వాచీలు రిపేరు చేసేవాళ్లను పిలిచి లైవ్ డిస్కషన్ చేపట్టింది.హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా టైం మెషీన్ ఫార్ములా కనిపెట్టిన వ్యక్తి దగ్గరకు బయలుదేరాడు హెన్రీ. ‘‘హే మ్యాన్! నువ్వేనా సిద్ధార్థ..? టైం మెషీన్ ఫార్ములా కనిపెట్టింది..’’ ఆత్రంగా అడిగాడు హెన్రీ. సిద్ధార్థ ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి, ‘‘నేను కొత్తగా కనిపెట్టలేదు. తెలుసుకున్నాను అంతే’’ అన్నాడు. హెన్రీ విమానంలో వస్తూ 30 రోజుల్లో తెలుగు పుస్తకం చదివాడు. కాబట్టి తెలుగు అర్థం చేసుకోగలడు. కానీ ‘‘ఫార్ములా కనిపెట్టలేదు, తెలుసుకున్నాను..’’ అనడంలో భావం మాత్రం అర్థం కాలేదు. ‘‘కనిపెట్టావో, తెలుసుకున్నావో! ఏదో ఒకటి. నువ్వు టైంలో ట్రావెల్ చేయగలవా..?’’ హెన్రీకి బీపీ గిన్నిస్ బుక్ రికార్డు దాటింది. ‘‘నేనే కాదు. ఆ ఫార్ములా తెలుసుకుంటే మీరైనా ప్రయాణం చేయగలరు.’’ అదే ప్రశాంతతో సిద్దార్థ బదులిచ్చాడు. ‘‘నువ్వు అబద్ధం చెపుతున్నావ్. మేం యాభై సంవత్సరాలుగా వందల మంది బుర్రబద్దలు కొట్టుకొన్నా కనిపెట్టలేకపోయాం. నువ్వు కనిపెట్టావంటే నమ్మను.’’ ‘‘మీరు నమ్మకపోయినా నష్టం లేదు. అసలు ఆ ఫార్ములా చాలా చిన్న విషయం.’’ ‘‘సరే ఐతే ఆ టైం మెషీన్ ఎక్కడ..? చూపించు.’’ ఆత్రంగా ఇంట్లోకి తొంగి చూశాడు హెన్రీ. ‘‘చూపిస్తాను. కాకుంటే ఇప్పుడు కాదు. రేపు మా కాలేజీలో అందరి ముందు చెపుతాను. అంతవరకూ ఆగండి.’’ ‘అందరికీ చెపుతాను..’ అనేసరికి హెన్రీ గుండె గుభిల్లుమంది. తానైతే టైం మెషీన్లు తయారు చేసి బిలియన్స్ సంపాదించే వాడు. కానీ ఇతను అందరికీ చెబుతాడట..? కొంపదీసి ఇతను మోసం చేయడం లేదు కదా.? అనుమానం వచ్చింది. ‘‘నువ్వు ఇప్పటివరకూ ఎపుడైనా టైంలో ట్రావెల్ చేశావా?’’ అని అడిగాడు. ‘‘చాలా సార్లు...’’‘‘నేను నమ్మను.’’ మెల్లగా కూపీ లాగుతున్నాడు హెన్రీ.‘‘మీకు నమ్మకం కలగాలంటే ఏం చెయ్యాలో చెప్పండి?’’ ‘‘ఐతే నీకో టెస్టు పెడతాను. కొలంబస్ అమెరికా కనుగొన్న టైంకు ప్రయాణం చేసి చూపించు’’చిరునవ్వుతో సిద్ధార్థ ‘‘సరే. మీరిక్కడే ఉండండి. పది నిమిషాల్లో వస్తాను’’ అని లోపలకి వెళ్లాడు. సిద్ధార్థ వెళుతుంటే టిమోతీకి కంటితో సైగ చేశాడు హెన్రీ. టిమోతీ సక్సెస్ అన్నట్టు చూపించాడు. సిద్ధార్థకు టిమోతీ షేక్ హ్యాండ్ ఇచ్చినపుడు చిన్న మైక్రో స్పై కెమెరాను సిద్ధార్థ షర్ట్‌కు అతికించాడు. ఇక సిద్ధార్థప్రతీ మూÐŒ మెంట్ తమ ల్యాప్‌టాప్‌లో చూసుకోవచ్చు.అందుకే సిద్ధార్థ లోపలికి వెళ్లగానే ల్యాప్ టాప్ ఓపెన్ చేసి లోపల ఏం జరుగుతుందో చూడసాగారు. సిద్ధార్థ లోపలికి వెళ్లి షర్ట్ తీసి హ్యాంగర్‌కు తగిలించి వేరే గదిలోకి వెళ్లిపోయాడు. కెమెరాలో గోడ తప్ప ఏమీ కనపడటం లేదు. తన ప్లాన్ అట్టర్ ఫ్లాపైనందుకు తిట్టుకున్నాడు హెన్రీ. ఓ అరగంట తర్వాత సిద్ధార్థ బయటకు వచ్చాడు.‘‘కమ్.. కమ్ సిద్ధార్థ. టైం ట్రావెల్ చేసి వచ్చావా? కొలంబస్‌తో మాట్లాడావా?’’ ఆత్రంగా అడిగాడు హెన్రీ. ‘‘ఒక్క కొలంబస్నే కాదు. అతని టీంను, రెడ్ ఇండియన్లనూ.. అందరినీ చూశాను. కొలంబస్ అమెరికా చేరుకున్న తేదీ అక్టోబర్ 12, 1492 సంవత్సరం. ఆ రోజు ఫ్రైడే. కొలంబస్ క్యూబా తీరంలోని లూకాయస్ ద్వీపానికి చేరుకున్నారు. మీరనుకుంటున్నట్లు రెడ్ ఇండియన్లు అనాగరికులు కాదు. వాళ్లకూ సముద్ర యాత్రలు తెలుసు. తమ దేశం వచ్చిన విదేశస్థులతో వాళ్లు ఎలాంటి ఘర్షణ పడలేదు. సాదర స్వాగతం పలికారు. పండ్లు అందించారు. కొలంబస్ వాళ్లకు ఎర్రటోపీలు ఇచ్చాడు.’’ సిద్ధార్థ చెప్పుకుంటూ పోతుంటే హెన్రీ నోట మాట రాలేదు. ‘‘అంటే సిద్ధార్థకు టైం మెషీన్ ఫార్ములా తెలుసు. టైంలో ట్రావెల్ చేసి వస్తున్నాడు. ఓ గాడ్! ఇంత విలువైన ఫార్ములాను ఎలా దక్కించుకోవడం?’’ ఇక ఆలస్యం చేయదల్చుకోలేదు హెన్రీ.‘‘మిస్టర్ సిద్దార్థ! నీకెంత మనీ కావాలో చెప్పు. మా దేశ సిటిజన్‌షిప్ ఇస్తాం. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. మా ప్రెసిడెంట్‌తో ఇప్పుడే మాట్లాడిస్తాను.’’ ఎగై్జట్‌మెంట్ తట్టుకోలేక పోతున్నాడు హెన్రీ.సిద్ధార్థ ఎప్పటిలాగే మెల్లగా నవ్వాడు.‘‘మీరు కంగారుగా ఉన్నారు. ఫార్ములా కోసం మీరింత శ్రమ పడనవసరం లేదు. రేపు అందరి ముందూ చెపుతాను. ప్లీజ్. రేపటి వరకూ ఆగండి.’’ తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఎంత డబ్బు ఆఫర్ చేసినా సిద్ధార్థ ఒప్పుకోకపోవడంతో హోటల్ గదికి వచ్చాడు హెన్రీ. రష్యా, జపాన్, చైనా వాళ్లు ఎవరడిగినా సిద్ధార్థ రేపటి వరకూ ఆగండి అనే చెప్పాడు. హెన్రీకి ఓపిక లేదు. ముఖ్యంగా ఆ ఫార్ములా ప్రపంచానికి ఉత్త పుణ్యానికే చెబుతాననడం అస్సలు నచ్చలేదు. ఎలాగైనా ఆ ఫార్ములా కొట్టేయాలనుకున్నాడు. వెంటనే ఏజెంట్ టిమోతీకి ఫోన్ చేసి ప్లాన్ వివరించాడు.బాస్ ఆదేశం ప్రకారం టిమోతి అర్ధరాత్రి సిద్ధార్థ ఇంట్లోకి దొంగతనంగా వచ్చాడు. చప్పుడు కాకుండా ఇల్లంతా గాలించాడు. ఇంటి నిండా చెల్లా చెదురుగా పుస్తకాలు పడి ఉన్నాయి. టైం మెషీన్ కనపడలేదు. ఎటు చూసినా పుస్తకాలతో లైబ్రరీలా వుంది ఇల్లు. మెల్లగా సిద్ధార్థ బెడ్ రూంలోకి ప్రవేశించాడు. అతను బెడ్‌మీద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నిద్దరలోనే నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు.‘‘మహాత్మా! ఎందుకయ్యా మేమంటే అంత ప్రేమ. నీ ఆవేదన, అంతరంగం నాకు అర్థమయ్యింది. మహాత్మా, మహర్షి...’’ అంటూ కలవరిస్తున్నాడు. బెడ్ చుట్టూ, కిందా మీదా వెతికాడు టిమోతీ. చివరకు సిద్ధార్థ దిండు కింద ఓ పుస్తకం దొరికింది. చీకట్లో దాని పేరు కనపడలేదు. ‘దిండు కింద దాచుకున్నాడంటే టైం మెషీన్ ఫార్ములా దాంట్లోనే వుండొచ్చు’ అనుకున్నాడు. ఆ పుస్తకం కొట్టేసి గోడ దూకాడు. ‘‘సాధించా బాస్. ఆ ఫార్ములా ఉన్న పుస్తకం తెచ్చాను.’’ పుస్తకం అందించాడు టిమోతీ. హెన్రీ గబగబా ఆ పుస్తకం చేతిలోకి తీసుకుని చూశాడు. ఆ పుస్తకం పేరు ‘సత్యంతో నా ప్రయోగాలు’. మహాత్మాగాంధీ ఆత్మకథ. సిద్ధార్థ గాంధీ పేరు కలవరించిన సంగతి కూడా చెప్పాడు టిమోతీ. ‘‘అంటే సిద్ధార్థ గాంధీజీ టైంలోకి వెళ్లాడన్న మాట.’’ అనుకున్నాడు హెన్రీమాటలతో, డబ్బులతో వినకపోతే పని ఎలా చేయించుకోవాలో అమెరికన్ అయిన హెన్రీకి బాగా తెలుసు. వెంటనే తన పథకం అమలులో పెట్టాడు. ఉన్నపళంగా సిద్ధార్థను కిడ్నాప్ చేసి అమెరికా తీసుకుని వెళ్లడం తప్ప మరో మార్గం లేదనుకున్నాడు. ఆమధ్య లాడెన్ ఇంటి ముందు మెరుపు దాడి చేసి దిగినట్లు.. ఆ అర్ధరాత్రి అమెరికా కమాండో టీం సిద్ధార్థ ఇంటి పైన దిగింది. మెల్లగా లోపలకి వెళ్లారు. అక్కడ పరిస్థితి చూసి ఉలిక్కిపడ్డారు. సిద్ధార్థ లేడు. మంచం అంతా చిందర వందరగా ఉంది. తాము రావడానికంటే ముందే ఎవరో వచ్చి కిడ్నాప్ చేశారన్నమాట. ‘‘ఓ గాడ్. రష్యన్‌లా, జపానోళ్లా? వాళ్లకు ఫార్ములా తెలిస్తే ఇంకేముంది?’’ఇంతలో టిమోతీ ఫోన్. ‘‘బాస్! సిద్ధార్థను కిడ్నాప్ చేసింది చైనా వాళ్లు. ఊరి చివర చైనా బజార్లో దాచిపెట్టారు. మీకు అడ్రస్ మెసేజ్ చేశాను. అక్కడకు రండి’’ హెన్రీ ఆగమేఘాల మీద చైనా బజార్‌కు చేరుకున్నాడు. ఈలోపే రష్యా, జపాన్, చైనా అన్ని దేశాలవాళ్లూ అక్కడకు వచ్చారు. ఆ ఫార్ములా చెప్పకపోతే తన కథ ముగిసిపోయే ప్రమాదం ఉందని భయపడ్డాడు సిద్ధార్థ. అందరినీ సైలెంట్‌గా ఉండమన్నాడు. ‘‘మీరు ఆ ఫార్ములా కోసం ఇంత కష్టపడటం చూసి జాలేస్తోంది. నేను టైంలోకి ఎలా ప్రయాణిస్తున్నానో జాగ్రత్తగా వినండి.’’ అంటూ తన ఫార్ములా మొత్తం వివరించాడు సిద్ధార్థ. అది వింటూనే సగం మంది కుప్పకూలారు. ‘‘ఇది అందరికీ తెలిసిందే కదా! ఇంత సింపుల్ ఫార్ములా గ్రహించలేక పోయామే’’ అనుకుని సిగ్గు పడ్డారు. హెన్రీకి నోట మాట రాలేదు. ఫార్ములా తెలిసిన ఆనందం తట్టుకోలేక సిద్ధార్థను గట్టిగా కౌగిలించుకున్నాడు. థ్యాంక్స్ చెప్పి మౌనంగా తన చార్టర్డ్ ఫ్లైట్‌లో అమెరికా బయలుదేరాడు. ఫ్లైట్‌లో వెళ్తూ సిద్ధార్థ మాటలు గుర్తుకు చేసుకున్నాడు హెన్రీ. ‘‘అసలు కాలమంటే ఏమిటో తెలిస్తే.. టైం మెషీన్ ఫార్ములా అర్థమవుతుంది. కాలమంటే ఒక మనిషి ఓ ప్రదేశంతో పొందే అనుభవాలు, జ్ఞాపకాలు. వర్తమానంలో మన అనుభవాలను నేడు అనుకుంటున్నాం. జరిగిపోయినవి నిన్న అని, జరగబోయే అనుభవాలకు రేపు అని పేరు పెట్టుకుంటున్నాం. చరిత్ర అంటే ఆనాటి మనుషుల అనుభవాలు. కాలమంటే జ్ఞాపకాలు. టైం మెషీన్లో ప్రయాణించడమంటే జ్ఞాపకాలు పోగేసుకోవడం. కాలంలోకి ప్రయాణమంటే కళ్లతో చూడడం కాదు. మనసుతో గ్రహించడం. గతంతో సంభాషించడం.’’‘‘ఇవన్నీ మాక్కూడా తెలుసు. కానీ ఆ టైం మెషీన్ ఫార్ములా ఏంటి?’’ ‘‘టైం మెషీన్ ఫార్ములా అంటే మరేదో కాదు. మన చేతిలోని పుస్తకం. అంతే..!’’ భారం దిగినట్లు నిట్టూర్చాడు సిద్ధార్థ.‘‘పుస్తకం.అంటే బుక్. ఆర్ యూ జోకింగ్ సిద్ధార్థ? మమ్మల్ని ఫూల్స్‌ను చేశావా?’’ కోపంగా మండిపడ్డాడు హెన్రీ. ‘‘ఆవేశంతో కాదు. జాగ్రత్తగా వినండి. అనాది కాలం నుంచి మనిషి తన భావాలను, ఆలోచనల ను, భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. వేదాలు చెప్పాడు. జానపద గీతాలు పాడాడు. గుహలపై, దేవాలయాల గోడలపై రాతలు రాశాడు. శాసనాలు చెక్కాడు. ఇదంతా దేనికి ? ఆనాటి మనిషి భవిష్యత్ తరాలను చేరుకునేందుకు పడ్డ ఆరాటం. తమ ఆలోచనలను సజీవంగా ఉంచుతూ భవిష్యత్ తరాల కోసం చేస్తున్న మహా కాల ప్రయాణం అది. అదిక్కడితో ఆగిపోదు. ఆది మానవుని ఆలోచనలు ఆఖరి మానవున్ని చేరేదాకా ఆ నిరంతర స్రవంతి సాగుతూనే వుంటుంది. రేపు ఇంకెవరో టైం మెషీన్ కనిపెట్టినా ఇంతకు మించి సాధించేదేముంది? పుస్తకాన్ని మించిన టైం మెషీన్ ఏముంటుంది?’’‘‘ఛీటింగ్. మోసం. టైం ట్రావెల్ అంటే ఫిజికల్‌గా వెళ్లాలి. అంతే తప్ప పుస్తకాలు చదివితే ఎలా అవుతుంది?’’‘‘అదే మీకూ, మాకూ ఉన్నతేడా! మనిషంటే కేవలం దేహం కాదు. చైతన్యం కూడా. ఆ చైతన్యమే రకరకాల రూపాల్లోకి నిరంతర సింధూ ప్రవాహంలా సాగిపోతూనే ఉంటుంది. వెలుగులోంచి చీకటిలోకి, చెడు నుంచి మంచి దారికి, మృత్యువు నుంచి అమరత్వానికి నడిపించేది జ్ఞానమే. ఆ జ్ఞానమే కాలం. ఆ కాలమే సత్యం. ఆ సత్యాన్ని చూపేదే పుస్తకం. పుస్తకం చదవడమంటే అక్షరాలను చదవడం కాదు. రాసిన వాడితో మమేకం కావడం. అతని అనుభూతిని అందుకోవడం. మనం అతని కాలానికి, అతను మన కాలానికి రావడం. అతనూ మనం ఒక్కటి కావడం. మనిషికి మరణం ఉండొచ్చు, ఆలోచనలకు మాత్రం లేదు. మనిషి ఆయుష్షు అనే పరిమితిని, కాలం అనే మహా అగాథాన్ని దాటించిన సాధనం పుస్తకం. అదే అసలైన టైం మెషీన్.హెన్రీకి అంతా అర్థమైంది. తన సంవత్సరాల పరిశోధన అందించని జ్ఞానం బోధపడింది. తన పూర్వీకులు రెడ్ ఇండియన్లు, వాషింగ్టన్, లింకన్, కెనడీ, లూథర్... అందరూ కనిపిస్తున్నారు. తనతో మాట్లాడుతున్నారు. వారి ఆలోచనలను, భావాలను, అన్నింటిని అందుకున్న ఆనందంతో తిరుగు ప్రయాణమయ్యాడు హెన్రీ.అమెరికాకెళ్లాక హెన్రీ తన టైం మెషీన్ ప్రాజెక్టుకు రాజీనామా చేశాడు. ఇపుడతను టైం మెషీన్ ఫార్ములాతో రోజుకో కాలానికి ప్రయాణిస్తున్నాడు. తన పూర్వికులతో మనసారా సంభాషిస్తున్నాడు. చందు తులసి -
త్వరలోనే ‘టైమ్ మెషిన్’
టొరంటో: గతం లేదా భవిష్యత్తులోకి తీసుకెళ్లే టైమ్ మెషిన్ త్వరలోనే సాకారమయ్యే అవకాశముంది. దీనికి అవసరమైన గణిత, భౌతిక సిద్ధాంతాన్ని అమెరికాలోని వర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా ఇన్ కెనడాకు చెందిన శాస్త్రవేత్త బెన్ టిప్పెట్ అభివృద్ధి చేశారు. ‘ఐన్‌స్టీన్ సిద్ధాంతం ప్రకారం అంతరిక్షం, సమయంలో వక్రీకరణల వల్ల గురుత్వాకర్షణ క్షేత్రాలు ఏర్పడ్డాయి. ఇటీవల లిగో సైంటిఫిక్ బృందం కొన్ని కాంతి సంవత్సరాల క్రితం కృష్ణబిలాలు ఢీకొనడంతో ఏర్పడ్డ∙గురుత్వాకర్షణ తరంగాల్ని గుర్తించింది. ఐన్‌స్టీన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి అంతరిక్ష సమయాన్ని వలయాకారంలోకి మార్చి, గతం లేదా భవిష్యత్తులోకి ప్రయాణించవచ్చు’ అని టిప్పెట్ తెలిపారు. -
చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాన్ని..!
నాటి రాచరికపు వైభవానికి గుర్తును మాత్రమే కాదు.. శిథిలావస్థలో ఉన్న కట్టడాన్ని అసలే కాదు.. నాటి శిల్పకళా చాతుర్యానికి నిదర్శనాన్ని ఘన చరిత్రకు సజీవ సాక్ష్యాన్ని. నా పేరు ఏదైనా మీరంతా చెప్పుకునే ‘కోట’ను నేను. మీ కోసమే నా ఎదురుచూపు.. మిమ్మల్నే...! అవును, నేను పిలుస్తున్నది మిమ్మల్నే..!! నా పిలుపు మీ చెవిని తాకడం లేదా!! నా రూపు మిమ్మల్ని ఆకట్టుకోవడం లేదా!! అవునులే, వార్ధక్యంలో ఉన్న నన్ను చూడాలని, పట్టించుకోవాలని మీకెందుకుంటుంది?! పుట్టిన నాటి నుంచే ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎన్ని చూశానో మీకు తెలుసా! ఏ రాజు కలలో ఊపిరి పోసుకున్నానో.. ఎంతమంది శ్రామికులు, శిల్పులు.. నన్ను ఇంత ఠీవిగా నిలబెట్టారో, ఎంత ధనం ఖర్చయిందో.. ఎంత మంది నాకు ప్రాణం పోయడానికి తాము ప్రాణార్పణం చేశారో.. ఎన్ని కథలు విన్నానో.. ఎందరి గాథలు తెలుసుకున్నానో.. ఇంకెన్ని యుద్ధాలకు సాక్ష్యంగా నిలిచానో.. వందల ఏళ్లుగా ఉన్నచోటనే సాగే నా ప్రయాణంలో మీరూ ఓ అడుగవ్వమని కోరుతున్నాను. మీకు తీరిక లేకపోయినా.. నాకు తెలిసినది చెప్పాలని ఉబలాటం. చూసినది మీ కళ్లకు కట్టాలని ఆరాటం. కాలుష్యపు కోరల్లో చిక్కుకుపోయి, అజాగ్రత్తల వలలో ఇమిడిపోయి... ఒళ్లు సడలిపోయి.. అలసిపోయి.. ఇంకా ఎన్నాళ్లు, ఎన్నేళ్లు ఉంటానో తెలియనిదాన్ని. మీ ఊళ్లోనో.. మీ ఊరి చివరనో.. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నదాన్ని. అస్థిత్వాన్ని కోల్పోకుండా ఉండటం కోసమే నా ఆరాటం. నాటి రాజ్యాలకు రాచకొలువును. మేధాపరమైన చర్చలకు, కళలకు, రాచరికపు హుందాతనానికి వేదికను. ఒక్కసారి వచ్చిపోండి. నా ఈ కళ్లతో నాటి అద్భుతాలను మీ ముందుంచుతాను... మీ కళ్లు విప్పార్చి, తల పెకైత్తి నన్నే దీక్షగా చూస్తున్నారా! నాకు ఇంతటి ఠీవిని ఎవరు కట్టబెట్టారో తెలుసా! పెద్ద పెద్ద రాళ్లను ఒకదాని మీద ఒకటి ఎలా పేర్చారో చూశారా! అంతా పుస్తకాల్లో చదివామనో, ఎవరో చెబితే వినడమో కాదు... నేటి మహామహులు సైతం తలవంచి సలామ్ చేసిన నాటి పరిజ్ఞానం ఎంత గొప్పదో మీ కళ్లతో మీరే చూసి తెలుసుకోండి. టైమ్ మిషన్‌ని... పిల్లలకు ‘టైమ్ మిషన్’ గురించి ఎన్నో ఆంగ్ల సినిమాలను పరిచయం చేస్తూ చెబుతారు. కాలాన్ని వెనక్కి తిప్పి చూపించాలనుకుంటారు. ఒక్కసారి నా కోట గుమ్మం వద్దకు తీసుకురండి. కాకతీయుల పాలించిన నేల.. చాళుక్యులు, పల్లవుల పరిపాలన.. అంటూ ఇక్కడే మొదలుపెట్టండి. ‘అనగనగా రాజు.. కోట నుండి యుద్ధానికి బయల్దేరాడు..’ అంటూ బడిలో పుస్తకాల ద్వారా చెప్పిన చరిత్రను కళ్లకు కట్టినట్టుగా చూపించండి. పిల్లల్లో అవగాహన, ఆలోచనా శక్తి మీరు ఊహించనంతగా పెరుగుతుంది. జీవన పోరాటాలను తెలియజేసే కథలెన్నో నన్ను చూపిస్తూ మీ చిన్నారులకు ఎంతో సులువుగా పరిచయం చేయవచ్చు. చెక్కుచెదరని ‘టైమ్ మిషన్’ అవునో కాదో వారే నిర్ధారిస్తారు. ఇంకొన్నాళ్లు నన్ను కాపాడుకోవాలనే ఆలోచన చేస్తారు. అదేగా ముందు తరాలకు మీరిచ్చే సంపద. బంధాలకు ఇల్లు... నేను రాతి కట్టడాన్నే! కానీ, కుటుంబమంతా మీరు కలిసి రావాలని ఆశపడతాను. అలా వస్తే నా గుండె సంతోషంతో ఉప్పొంగిపోతుంది. కూర్చోవడానికి వేదికలు వేసి ఉంచుతాను. కనువిందు చేసే శిల్పాలతో ఊహల్లో నాట్యమాడిస్తాను. గుప్తంగా ఉండే కోశాగారాలను, అబ్బురపరిచే ఆహార శాలలను, ధాన్యపు గిడ్డంగులను.. అన్నీ పరిచయం చేస్తాను. ఇక్కడంతా కలిసి ఎంత చెప్పుకున్నా తనవి తీరని ముచ్చట్లు. ఆ మాటల్లో పెరిగే దగ్గరితనం... బంధాలకు కొలువుగా అతి పెద్ద ఇల్లుగా మీ రాక కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. శత్రురాజులకు దడపుట్టించిన ఫిరంగులు, రేయింబవళ్లు పహారా కాసిన కాపలాదారుల స్థావరాలు, గుర్రపు శాలలు, ఆంతరంగిక మందిరాలు.. ఎన్నో విచిత్రాలతో మిమ్మల్ని అడుగడుగునా విస్మయపరుస్తూనే ఉంటాను. నూతన హంగులు... ఎన్నో కోటలు కనుమరుగయ్యాయి. కోట ప్రాంతాలు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. ఇంకెన్నో కోటలు అవసాన దశలో ఉన్నాయి. గ్రామ, జిల్లా స్థాయిలో ఉండే కొన్ని కోటల గురించి సమాచారమే లేదు. కనుమరుగవుతున్న వాటిని పట్టించుకునేవారూ లేరు. రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలు అద్బుతంగా ఉన్నాయని వాటిని చూడటానికి మళ్లీ మళ్లీ వెళుతుంటారు. కానీ, అలనాటి వైభవాన్ని ఇప్పటికీ చెక్కుచెదరనీయకుండా అక్కడివారు కాపాడుకుంటూ వస్తున్న విధానాన్ని కనిపెడుతున్నారా..! అక్కడి కోటలకు నూతన హంగులు అద్ది, హోటళ్లుగా మార్చే నైజాన్ని తెలుసుకున్నారా! ఈ విధానం వల్ల ఆ రాష్ట్ర ఆదాయమూ పెరిగిందని వార్తలు మీ చెవిన పడుతున్నాయా! ఈ దిశగానూ ఒక్కసారి ఆలోచన చేయండి. నాటి రాజులకు రక్షణ కవచంగానే కాదు, మీకు ఆదాయవనరుగానూ మారుతాను. నాటి వైభవాన్ని ముందు ముందు ఇంకెంతో మందికి చాటుతూనే ఉంటాను. తీసుకువెళ్లండి..! నా దగ్గరకు రండి. నాతో ఉన్న కొన్ని గంటలను అమూల్యంగా మదిలో దాచుకోండి. ఇక్కడ గడిపిన గుర్తులను ఫొటోల రూపంలో పదిలంగా తీసుకెళ్లండి. కానీ, మీ గుర్తులను నా దగ్గర వదలాలని చూడకండి. ఎందుకంటే మీరు వ చ్చిన విషయం నాకు తెలుసు. మీ సందడి నా గుండె గోడల నిండుగా ఘల్లుమంటూనే ఉంటుంది. కానీ, మీ పేర్లు, గుర్తులు నా గుండె మీద చెక్కుతున్నప్పుడు నేను పడే వేదన మీకు తెలియడం లేదు. వాహనాలు, పరిశ్రమలు వదిలే కాలుష్యం నన్ను రోజు రోజుకూ మసకబారేలా చేస్తున్న విషయం మీకు తట్టడం లేదు. మీరు వెళుతూ వెళుతూ ఒక్కసారి నా వేదనను పట్టించుకొమ్మని ఒక చిన్న విన్నపం. - నిర్మలారెడ్డి అప్పటి కథలకు ఆనవాళ్లు హైదరాబాద్ నుంచి సుమారు దూరం (కి.మీ.) గోల్కొండ కోట (హైదరాబాద్)... 23 కి.మీ కొండపల్లి కోట (కృష్ణా జిల్లా).. 258 కి.మీ వరంగల్ కోట (వరంగల్ జిల్లా) .. 150 కి.మీ భువనగిరి కోట (నల్గొండ జిల్లా).. 48 కి.మీ పెనుకొండ కోట (అనంతపురం జిల్లా).. 431కి.మీ గండికోట (వై.ఎస్.ఆర్. కడప జిల్లా ) ... 500 కి.మీ బొబ్బిలి కోట (విజయనగరం జిల్లా).. 636 కి.మీ చంద్రగిరి కోట (చిత్తూరు జిల్లా)... 572 కి.మీ మీ ఊరు, మీ ప్రాంతంలో ప్రాచీన కట్టడాలేవైనా ఉంటే వాటి వివరాలను ఫొటోలతో సహా తెలుపండి. ప్రచురిస్తాం. మీరు పంపవలసిన చిరునామా: విహారి, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారా హిల్స్, హైదరాబాద్ -34. e-mail:sakshivihari@gmail.com -
ఆ జ్ఞాపకాలు నన్నెప్పుడూ వెంటాడుతుంటాయి!
సింగీతం శ్రీనివాసరావు... మైండ్‌లోనే టైమ్ మెషీన్ ఉన్న సూపర్ జీనియస్! క్లాసూ... మాసూ... ఫ్యాంటసీ... సైన్స్ ఫిక్షనూ... జానపదం... పౌరాణికం... రియల్ లైఫ్ స్టోరీలూ, రీల్ లైఫ్ ఎక్స్పరిమెంట్లూ... యానిమేషన్లూ... ఇలా ఏ జానర్‌కైనా ఆయన ఆనర్ తీసుకొస్తారు. సెల్యులాయిడ్ సైంటిస్ట్... సింగీతం! నేడు పుట్టినరోజు జరుపుకొంటున్న సింగీతం శ్రీనివాసరావు స్పెషల్ ఇంటర్వ్యూలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం!! నా కెరీర్లో టాప్ 5 సినిమాల గురించి చెప్పమంటే... కొద్దిగా కష్టమే. కానీ, ఇష్టమైన కొన్ని మైలురాళ్ళను ప్రస్తావిస్తా... సింగిల్ కాలమ్ న్యూస్ నుంచి పుట్టిన ‘మయూరి’... ఓ చిన్న వార్త నుంచి సినిమా పుడుతుందంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ ‘మయూరి’ (1984)ని చూస్తే మీరు నమ్మాల్సిందే. నిర్మాత రామోజీరావు, సుధాచంద్రన్ గురించి సింగిల్ కాలమ్ వార్త చదివి ఇన్స్పైర్ అయ్యి, నా దర్శకత్వంలో సినిమా చేద్దామనుకున్నారు. సుధాచంద్రన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు కొంత ఫిక్షన్ జత చేసి ‘మయూరి’ కథ అల్లుకున్నాం. ఎవరైనా హీరోయిన్‌తో ఈ సినిమా చేసి, ఆఖర్లో సుధాచంద్రన్ క్లోజప్ చూపిద్దామని మొదట అనుకున్నాం. సుధాచంద్రన్ దగ్గర మరిన్ని సంఘటనలు తెలుసుకుందామని కలిసినప్పుడు, ఆమె కళ్లల్లోని ఇంటెన్సిటీ నన్ను ఆకట్టుకుంది. ఆమెతోనే ఈ సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాం. మొదట ఆమె చేయనంటే, ఒప్పించాం. ఇలాంటి సినిమాలో డ్యూయట్లు పెట్టాలా? వద్దా? అనే విషయంలో డైలమా. అప్పుడు నేను ‘కన్నడ’ రాజ్‌కుమార్ షూటింగ్లో ఉన్నా. ఆయన్ను అడిగితే అద్భుతమైన సలహా చెప్పారు. అదేమిటంటే -‘‘సినిమాలో 10 రీళ్లు అద్భుతంగా ఉండి, ఆఖరి 2 రీళ్లు యావరేజ్‌గా ఉంటే, అది యావరేజ్ సినిమా అయిపోతుంది. అలాగే 10 రీళ్లు యావరేజ్‌గా ఉండి, ఆఖరి 2 రీళ్లు అద్భుతంగా ఉంటే ఆ సినిమా హిట్ కింద లెక్క. మీ సినిమా క్లైమాక్స్ అద్భుతం అంటున్నారు కాబట్టి, ముందు డ్యూయెట్లు పెట్టినా ఫరవాలేదు’’. అవార్డులు, అన్ని భాషల్లో జయకేతనాలు... ఇవన్నీ కాదు. అంగవైకల్యం ఉన్నా అందలమెక్కవచ్చని ఈ సినిమా ఎంతోమందికి ఇచ్చిన స్ఫూర్తి చాలు దర్శకునిగా నేను పూర్తిస్థాయి సంతృప్తిని ఆస్వాదించడానికి. రాజ్కపూర్కైతే విపరీతంగా నచ్చేసింది! సినిమా అంటేనే డైలాగులు పేలాలి అనుకునే కాలంలో - మూకీ సినిమా చేయడమంటే చాలామందికి సాహసం, కొంతమందికి చాదస్తం కింద లెక్క. కేవీ రెడ్డిగారి దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్నప్పటి నాటి కోరిక అది. ఆ తర్వాత సినిమాల హడావిడిలో పడి మర్చిపోయా. కానీ ఓ రోజు బాత్రూమ్లో స్నానం చేస్తుండగా సడన్‌గా మూకీ తీద్దామని ఆలోచనొచ్చింది. రెండు వారాల్లో స్క్రిప్టు రెడీ. కమల్‌కి చెబితే ఎక్స్లెంట్ అన్నాడు. కానీ ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదు. దాంతో కథని మనసు లాకర్లో పెట్టేశా. దేనికైనా కాలం, ఖర్మం కలిసి రావాలి కదా. కొన్నేళ్లకు అదే జరిగింది. బెంగళూరులో ఓ హోటల్లో ఉన్నా. ‘కన్నడ’ రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ చేసొచ్చి, రెస్ట్ తీసుకోవడానికి రెడీ అవుతుంటే, ‘శృంగార్ ఫిలింస్’ నాగరాజ్ వచ్చారు. ఆయన నటుడు. దానికన్నా ప్రధానంగా సినిమా షూటింగ్స్‌కి ఫారిన్ కో ఆర్డినేటర్. ఏదో కబుర్లు చెప్పుకుంటూ యథాలాపంగా ఆ కథ చెప్పా. ఆయన ఫ్లాట్ అయిపోయాడు. మనం తీద్దామన్నాడు. కమల్ కూడా ఓకే అన్నాడు. అలా ‘పుష్పక విమానం’(1984) యాత్ర మొదలైంది. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వారి అవార్డు ఫంక్షన్లో వ్యాఖ్యానం చేసిన ఓ అమ్మాయి నవ్వు, కళ్లు నన్ను ఆకట్టుకున్నాయి. ఆమెను చూస్తుంటే. ‘రోమన్ హాలిడే’ అనే హాలీవుడ్ సినిమాలో చేసిన ఆర్డ్రే హెప్బర్న్ గుర్తొచ్చింది. వెంటనే కథానాయికగా తీసేసుకున్నాం. ఆమె ఎవరో కాదు? అమల. హోటల్ ప్రొప్రయిటర్ పాత్రకు గుమ్మడి గారిని అనుకున్నాం. అప్పుడే ఆయన భార్యకు వంట్లో బాగోకపోవడంతో, చేయడం కుదర్లేదు. వేరే కన్నడ ఆర్టిస్టుతో చేయించేశాం. ఇక ముష్టివాడి పాత్రను పీఎల్ నారాయణతోనే చేయించాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. ముంబైలో షో వేస్తే, రాజేంద్ర కుమార్, రాజ్‌కపూర్, ఆర్డీ బర్మన్ లాంటి హేమాహేమీలు మెచ్చుకున్నారు. రాజ్కపూర్కైతే ‘డెడ్‌బాడీ రొమాన్స్’ సీన్ విపరీతంగా నచ్చేసింది. నేనెన్ని ప్రయోగాలు చేసినా, ‘పుష్పక విమానం’ మోసుకొచ్చినంత పేరు ప్రఖ్యాతులు, జాబ్ శాటిస్ఫాక్షన్ ఇంకేదీ ఇవ్వలేదు. మొదట మరుగుజ్జు ప్రేమకథ అనుకున్నాం... ‘‘కమల్‌హాసన్ లాంటి గ్లామర్ హీరో ఓ మరుగుజ్జుగా కనిపిస్తే ఏం బాగుంటుంది? అందుకే అందరూ వద్దన్నారు. ఇది కమల్‌కి పుట్టిన ఆలోచనే. నాకు చెప్పగానే, నేను వెంటనే ఉద్వేగానికి గురయ్యా. నేను, కమల్, రచయిత క్రేజీ మోహన్ కలిసి ఓ కథ తయారు చేశాం. మరుగుజ్జు ప్రేమకథ అన్నమాట. ఐదారు రోజులు షూటింగ్ చేశాక, మాకే కథపై సందేహాలు మొదలయ్యాయి. నిర్మాత పంజు అరుణాచలం కథలు బాగా జడ్జ్ చేయగలరు. ఆయన్ను పిలిచి కథ వినిపిస్తే, పగ నేపథ్యంలో డ్యూయల్ రోల్‌తో చేయమని సలహా ఇచ్చారు. అలా స్క్రీన్‌ప్లే మార్చితే ‘విచిత్ర సోదరులు’(1989) కథ తయారైంది. ఇందులో తండ్రి పాత్రకు మొదట ప్రేమ్‌నజీర్ అనుకున్నాం. అస్వస్థతగా ఉండటంతో ఆయన చేయలేనన్నారు. ఎలాగో కవలలుగా చేస్తున్నారు కాబట్టి, తండ్రి వేషం కూడా మీరే చేయండని నేను కమల్‌తో చెబితే, ఆయన సరేనన్నారు. విలన్‌గా అమ్రీష్పురిలాంటి వాళ్లను తీసుకోవచ్చు కానీ, ఎవ్వరూ ఊహించని వ్యక్తితో చేయిస్తే, ప్రేక్షకులు థ్రిల్ అవుతారనిపించింది. అందుకే హాస్యనటుడు నాగేశ్‌ని విలన్‌గా తీసుకున్నాం. ఇక మేకింగ్ విషయానికొస్తే - మరుగుజ్జు కమల్ సీన్లు తీయడానికి చాలా శ్రమించాం. ఎందుకంటే ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేవు. మానిటర్లు లేవు. మిఛెల్ కెమెరాతోనే అద్భుతాలు చేయాలి. అసలు కమల్ని పొట్టివాడిగా ఎలా చూపించారన్నది అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. కమల్ మోకాళ్లకు స్పెషల్లీ డిజైన్డ్ షూస్ తొడిగాం. 18 అంగుళాల గొయ్యిలు రెండు తవ్వించి, ఒక దాంట్లో కమల్ని, మరొక దాంట్లో కెమెరాను పెట్టి ఒకే లెవెల్లో ఉండేలా చిత్రీకరణ జరిపేవాళ్లం. గోతిలో దిగిన కమల్ మోకాళ్లకి షూస్ తొడిగి నడిపిస్తూ ఉంటే, మరుగుజ్జు కమల్ నడుస్తున్నట్టే అనిపిస్తుంది. అలాగే ఓ సీన్లో మరుగుజ్జు కమల్ కూర్చుని కాళ్లు కదుపుతారు కదా. అదెలా తీశామో తెలుసా? అవి కమల్ కాళ్లు కావు. ఆర్టిఫీషియల్ లెగ్స్. కమల్ కాళ్లను మడిచి కూర్చుంటే, రైల్వే సిగ్నల్స్ టెక్నిక్‌లో ఆర్టిఫీషియల్ కాళ్లతో సీన్ షూట్ చేశాం. ఆడియో క్యాసెట్లు తయారు చేసే పారిశ్రామికవేత్త సహదేవన్ ఈ విషయంలో మాకు బాగా సహకరించారు. ఇంకో ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పకపోతే అది పాపమే అవుతుంది. జపాన్ అనే సెట్‌బాయ్ ఈ గోతుల్ని కరెక్ట్‌గా తవ్వి, మాకు బోలెడంత టైమ్ కలిసొచ్చేలా చేశాడు. కమల్ నిర్మాత కాబట్టే ఈ సినిమాను 90 రోజుల్లో తీయగలిగాం. ఇంకెవరైనా అయ్యుంటే బడ్జెట్ పెరిగిపోయేది. షూటింగ్ డేసూ పెరిగేవి. అసలు ఈ సినిమా మేకింగ్ గురించి డాక్యుమెంటరీ తీద్దామని నేనూ, కమల్ ఎన్నాళ్లనుంచో అనుకుంటున్నాం. కుదరడం లేదు. ఎప్పటికైనా చేయాలి. నా ఇతర సినిమాల్ని మళ్లీ రీమేక్ చేయొచ్చేమో కానీ, దీన్ని మళ్లీ తీయడం మాత్రం అసాధ్యమే. ఎంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా సరే! నాగేశ్లాంటి ఆర్టిస్టులు... ఇలాంటి బలమైన స్క్రిప్టు మళ్లీ దొరకవు. నా లైఫ్‌లో ఎప్పటికీ ఓ మెమరీ ఇది. విమానంలో కథ చెబితే థ్రిల్ అయిపోయారు! టైమ్ మెషీన్ ఎక్కి మనకు నచ్చిన కాలానికి వెళ్లిపోతే ఎంత బాగుంటుంది? అది గతమైనా కావచ్చు. భవిష్యత్తు అయినా కావచ్చు. 18వ శతాబ్దంలోనే హెచ్‌జి వెల్స్ రాసిన ‘టైమ్ మెషీన్’ కథను కాలేజీ రోజుల్లో చదివి నేను తెగ థ్రిల్ ఫీలయ్యా. అప్పుడు అనుకోలేదు... ఆ నేపథ్యంలో సినిమా తీస్తానని. ఓ రోజు నేను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విమానంలో కలిసి వెళ్తున్నాం. సరదాగా తనకు టైమ్ మెషీన్ నేపథ్యంలో కథ గురించి చెప్పా. ‘అద్భుతం’ అన్నాడాయన. అక్కడితో ఊరుకోలేదు. తనకు తెలిసిన వాళ్లందరికీ గొప్పగా చెప్పేశాడు. కానీ ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. శివలెంక కృష్ణప్రసాద్ అనే కొత్త నిర్మాత మాత్రం రెడీ అన్నాడు. టైమ్ మెషీన్ ఎపిసోడ్లో శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్లడం ఉంటుంది. ఆ పాత్రను చేయగల ఒకే ఒక్క హీరో బాలకృష్ణ. అందుకే ఆయనకు ఈ కథ చెబితే, వెంటనే ఓకే అన్నారు. ఈ సినిమాకు ముగ్గురు ఛాయాగ్రాహకులు పనిచేశారు. మొదట పీసీ శ్రీరామ్ వర్క్ చేశారు. ఆయనకు కడుపులో సమస్య రావడంతో, శ్రీకృష్ణ దేవరాయల ఘట్టాలను వీఎస్సార్ స్వామి తీశారు. ఇక ఫ్యూచర్ ఎపిసోడ్‌కు సంబంధించిన ట్రిక్ ఫొటోగ్రఫీని కబీర్‌లాల్ తీసి పెట్టారు. ఇళయరాజా మ్యూజిక్కే ఈ సినిమాకు ప్రాణం. ‘ఆదిత్య 369’ (1991) సినిమా చూస్తుంటే - నాక్కూడా టైమ్‌మెషీన్ ఎక్కి ఆ రోజుల్లోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. వెంటనే దీనికి సీక్వెల్ చేయాలన్న ఆలోచనా పుడుతుంది. ‘మాయాబజార్’లో వదిలేసిన బాణీని వాడా! కేవీ రెడ్డిగారు తీసిన కళాఖండం ‘మాయాబజార్’కి పనిచేసినవాణ్ణి. ఆ సినిమా అంటే ప్రాణం నాకు. యానిమేషన్ సినిమా చేద్దామని నిర్మాత వినోద్ ప్రపోజల్ తెచ్చినపుడు, నాకు ‘మాయాబజార్’లోని ఘటోత్కచుడి పాత్ర మెదిలింది. ఆ పాత్రను బాల్యం నుంచి మొదలుపెట్టి తీద్దామనిపించింది. అప్పటికి తెలుగులో పూర్తి స్థాయిలో ఎవరూ యానిమేషన్ సినిమా చేయలేదు. నాకంతకు ముందు ఇంగ్లీషులో ‘సన్ ఆఫ్ అల్లాడిన్’ చేసిన అనుభవం ఉంది. ‘ఘటోత్కచుడు’ (2008) ఏడు భాషల్లో తీశాం. సంగీత దర్శకత్వమూ నేనే చేశా. ‘వివాహ భోజనంబు’ పాటను మాత్రం అలాగే ఉంచాం. ఆ పాటను అన్ని భాషల్లోనూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారితోనే పాడించాం. కేవీరెడ్డిగారి ‘మాయాబజార్’ కోసం సాలూరు రాజేశ్వరరావుగారు నాలుగు బాణీలిచ్చారు. ‘కుశలమా ప్రియతమా’ అనే బాణీని ఆ సినిమాలో వాడలేదు. దాన్నే తీసుకుని ‘ఘటోత్కచుడు’లో ఉపయోగించా. కైరో ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఎంపికైందీ సినిమా. నేను తీసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే, ఇదొక్కటీ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే నేను కూడా చిన్నపిల్లాణ్ణయిపోయి, తీసిన చిన్నపిల్లల సినిమా కదా! నా కెరీర్లో మరపురాని ఈ ఐదు సినిమాల జ్ఞాపకాలు నన్నెప్పుడూ వెంటాడుతుంటాయి! - పులగం చిన్నారాయణ -
టైమ్ మిషన్‌లో సిల్లీబ్రాండ్
-
విహారం: వైగన్... మధ్యయుగపు అనుభూతి!
ఆదిత్య 369 సినిమా చూసినపుడల్లా... అలాంటి టైమ్ మెషీన్ ఒకటి అందుబాటులో ఉండి మనకు కూడా అలా ముందుకూ వెనక్కు వెళ్లే అవకాశం కనుక వస్తే ఎంత బావుంటుందో అనిపిస్తుంది. ముందుకు తీసుకెళ్లలేం గాని... టైం మెషీన్ లేకుండానే వెనక్కు వెళ్లే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అయితే, షరతులు వర్తిస్తాయి. ఆ అద్భుతం... వైగన్! చక్కటి వీధులు.. గుంతలు లేని, వంకరలు లేని, మరమ్మతులు అవసరం లేని ఫుట్‌పాత్‌లతో కూడిన వీధులు... వాటికి ఇరువైపులా బొమ్మలు గీసినంత అందంగా ఉండే ఇళ్లు. వీధిలో ఇవతలి ఇంటి బాల్కనీ నుంచి అవతలి ఇంటి బాల్కనీలో వ్యక్తులతో ముచ్చట్లు చెప్పుకునేలా ఓ క్రమపద్ధతిలో ఆ నిర్మాణాలు. ఇంటింటికీ అమర్చిన వీధిదీపాలు. భూగర్భ మంచినీటి, మురుగు నీటి పారుదల... కాలికి మట్టి అంటని రోడ్లు. పగలు అద్భుతంగా రాత్రి సుందరంగా ఉంటుంది ఆ చిన్న నగరం. వైగన్ నగరం... వైశాల్యంలో జనాభాలో చిన్నదే. పేరులో, ఖ్యాతిలో పెద్దది. జనాభా యాభై వేలు, విస్తీర్ణం 25 చదరపు కిలోమీటర్లు. (మన హైదరాబాదు 700 చదరపు కిలోమీటర్లు కాబట్టి అది ఎంత ఉంటుందో మీరే ఊహించుకోండి). వైగన్ ఫిలిప్పీన్స్ దేశంలో పశ్చిమోత్తరాన ఉంటుంది. దక్షిణ చైనా సముద్రానికి ఎదురుగా ఉండే ఇలాకోస్ సర్ దీవిలో తీరానికి దగ్గరగా ఉంటుంది. ఏ నగరానికి లేని అవకాశం నగరం చిన్నదే గాని విశిష్టతలు బోలెడు. పెద్ద దీవిలో ఒక చిన్న దీవి ఈ నగరం. బహుశా చాలా పెద్ద నగరాలకు కూడా లేని ఒక అద్భుతమైన అవకాశం ఈ బుల్లి నగరానికి దక్కింది. కేవలం ఇరవై ఐదు చదరపు కిలోమీటర్ల ఈ నగరానికి నలువైపులా మూడు నదులున్నాయి. అవి కూడా జీవనదులు. ఏడాదిలో 365 రోజులూ ప్రవహిస్తుంటాయి. అంతేనా... ఇంకో అద్భుతం కూడా ఉంది. నగరం నుంచి సైకిల్‌పై వెళ్లగలిగినంత దూరంలో సముద్ర తీరం ఉంది. అది దక్షిణ చైనా సముద్ర తీరం. కళ్ల ముందు మధ్యయుగపు జాడలు ఫిలిప్పీన్స్‌లోని ఈ ప్రాంతాన్ని పదహారో శతాబ్దంలో స్పానిష్‌లు పరిపాలించారు. దీంతో ఇక్కడ భవనాలు యూరోపియన్ ఆర్కిటెక్చర్‌తో ఉంటాయి. అంతేకాదు... ఇది అత్యుత్తమ ప్రణాళికతో నిర్మించిన నగరం. అందుకే వీధులు అయినా, ఇళ్లయినా చాలా చక్కగా అందంగా రూపుదిద్దబడ్డాయి. ఈ ఊళ్లో ప్రతి కట్టడానికి వందేళ్ల నుంచి ఐదువందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. అంటే... ఆధునిక ఆర్సీసీ బిల్డింగులు, వోల్వో బస్సులు ఇలాంటివేవీ ఇక్కడ కనపడవు. టక్ టక్ మని తిరిగే గుర్రపు బగ్గీలు... మన వద్ద కూడా కనిపించకుండా పోయిన మరమగ్గాలు సైతం ఉన్నాయి. అవి సజీవంగా, చక్కటి ఆదాయంతో నడుస్తున్నాయి. వీధుల్లో రోడ్లన్నీ సిమెంటు, బ్లాక్ టాప్ రోడ్లు కాదు. మధ్యయుగాల నాటి రాతి రోడ్లు. విద్యుద్దీపాలు కూడా అప్పటి మోడల్లోనే ఉంటాయి. పాత భవనాలు కదా అని పాడైపోయిన స్థితిలో ఉంటాయనుకునేరు. ఇప్పటికీ ఫ్రెష్‌గా చక్కటి నిర్వహణతో హాయిగా జీవించడానికి అనువుగా ఉంటాయి. అందుకే ఈ విశిష్టమైన నగరాన్ని యునెస్కో ‘ప్రపంచ వారసత్వపు ప్రదేశం’గా గుర్తించింది. చిన్న నగరం బోలెడు విశిష్టతలు ! శివారులను కూడా కలిపి ఈ నగరాన్ని ఓ జిల్లా కేంద్రం చేశారు. ఈ జిల్లాకు రెండే రెండు ప్రధాన ఆదాయ వనరులు. ఒకటి పర్యాటకం. రెండు వ్యవసాయం. పుష్కలమైన నదీజలాలతో 1400 హెక్టార్ల భూమిలో ఇక్కడ వ్యవసాయం కొనసాగుతోంది. దీనివల్ల ఇక్కడి ప్రజలకు అందుబాటులోనే వ్యవసాయ ఉత్పత్తులు దొరుకుతాయి. అంటే ప్రాంతం చిన్నదైనా స్వావలంబన కలిగినది. చూడదగ్గ ప్రదేశాలు.. నగరం పక్కనే అడవి. సహజసిద్ధంగా ఏర్పడిన రాళ్లే బెంచీలు. ఏపుగా పెరిగిన వెదురు చెట్లు, మనం మరెక్కడా చూడని చిన్నచిన్న కొత్త రకం మొక్కలు వంటివన్నీ కనిపిస్తాయి. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆ చిట్టడవిలో నడుస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకా నగరంలో ప్రవేశ రుసుము లేని ఓ జంతు ప్రదర్శన శాల కూడా ఉంది. ఇందులో అంతరించిన రాకాసి బల్లులు ఇంకా బతికున్నాయా అన్న అనుమానం వచ్చేంతటి సహజంగా చెక్కిన రాకాసి బల్లుల బొమ్మలు ఆహ్వానం పలుకుతాయి. అక్కడ స్థానికంగా పేరు గాంచిన కొన్ని జంతువులను చూడొచ్చు. వైగన్లోని కొన్ని వీధుల్లో ఖలీసా రైడ్ (గర్రపు బగ్గీ) బాగుంటుంది. గంటన్నర ప్రయాణానికి 150 పెసోలు (ఆ దేశపు కరెన్సీ అడుగుతారు. అంటే మన కరెన్సీలో 210 రూపాయిలు. వీరికి ఇంగ్లిష్ రాదు. ఇంకా వైగన్ కాథడ్రల్, బాంటే చర్చి, సిఖియా ప్రదర్శన శాల, క్రిసోలోగో మ్యూజియం, మధ్యయుగం నాటి మట్టి కుండలు తయారుచేసే కుటీర పరిశ్రమలు, మరమగ్గాల నేతపని, బర్గోస్ నేషనల్ మ్యూజియం వంటివి చాలా ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. బీచ్ కూడా చాలా దగ్గర. ఒక్కే ఒక్క డిస్కో క్లబ్ మినహా నైట్ లైఫ్ ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నమ్మకమైన మనుషులు. మోసాలు తక్కువ. దాదాపు అన్ని దేశాల వారు తినదగిన రుచికరమైన తిండి దొరుకుతుంది. ఎలా చేరుకోవాలి ఈ చిన్నసిటీకి దగ్గర్లో ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉందండోయ్. గతంలో ప్రైవేటుగా వాడేవారు కానీ.. ఇపుడు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అయ్యింది. అయితే ఇంకా వైగన్ ఎయిర్‌పోర్టుకు మాత్రం ఇపుడు ఫ్లైట్లు కావల్సినన్ని నడవడం లేదు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నుంచి ట్యాక్సీలో తొమ్మిది గంటలు ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. లేదా మనీలా నుంచి లావోగ్కు విమానంలో వెళితే అక్కడి నుంచి గంటన్నర ట్యాక్సీ ప్రయాణం. అక్కడ మీరు దిగే హోటల్స్ కూడా పురాతన భవనాలే. కానీ ఇబ్బందేమీ ఉండదు. అన్ని సదుపాయాలు ఉంటాయి.