
‘‘రెస్పెక్టెడ్ కొలీగ్స్!! మనం ఈ టైం మెషీన్ గురించి చాలా కాలంగా రీసెర్చి చేస్తున్నాం. అనేక పరిశోధనలు, ప్రయోగాలతో సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు కోసం గవర్నమెంట్ ఎన్నో మిలియన్ డాలర్లు ఖర్చు పెడుతోంది. బ్లాక్ మ్యాటర్, సింగ్యులారిటీ, ఇలా టైం మెషీన్‌కు సంబంధించిన రహస్యాలు, చిక్కుముడులు అందినట్టే అంది జారిపోతున్నాయి..’’ ఎమోషనల్‌గా చెబుతున్నాడు టైం మెషీన్ ప్రాజెక్ట్ హెడ్ జార్జ్ హెన్రీ. అది అమెరికాలోని ప్రపంచ ప్రసిద్ధ పరిశోధనాశాల.వారం రోజులుగా టైం మెషీన్ ప్రాజెక్టు పరిశోధన మీద తీవ్రంగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి.హెన్రీ తన తోటి శాస్త్రవేత్తలతో మాట్లాడుతున్నాడు.‘‘ఇంకోవైపు ఈ ప్రాజెక్టు టైం అండ్ మనీ వేస్ట్ ప్రాజెక్టు అని బయట ఎజిటేషన్స్ చేస్తున్నారు. మీడియా కూడా మనని పిచ్చివాళ్లంటూ ప్రాపగాండా చేస్తోంది. ప్లీజ్. మనం ఎలాగైనా ప్రోగ్రెస్ సాధించాలి. మనం ఈ సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ చూపకపోతే మన ప్రాజెక్టు ఫండింగ్ ఆగిపోతుంది.’’ హెన్రీ గొంతులో నిరాశ. ఇంతలో హెన్రీ సెక్రటరీ టిఫానీ ఫోన్ తీసుకొచ్చింది. ‘‘బాస్ నేను టిమోతీ. ఇండియాలో మీ రహస్య ఏజెంట్‌ని..’’‘‘మీటింగ్‌లో బిజీగా వున్నాను. ఏంటీ అంత ఇంపార్టెంట్ మ్యాటర్?’’ ‘‘బాస్. ఇక్కడ ఇండియాలోని హైదరాబాద్లో ఓ పర్సన్ టైం మెషీన్ ఫార్ములా కనిపెట్టాడు.’’ ‘‘వ్వాట్!!’’ ఉలిక్కి పడ్డాడు హెన్రీ. వాటర్ బాటిల్ ఒక్క గుక్కలో ఖాళీ చేశాడు.
‘‘ఎస్.. బాస్. ఇండియాలోనే వున్న మన లోకల్ ఏజెంట్ క్రిష్ ఇప్పుడే చెప్పాడు.’’‘‘వ్వాట్!! ఇండియాలో టైం మెషీన్ మీద పరిశోధన జరుగుతోందా!? చెప్పనేలేదు!?’’ కోపంగా అరిచాడు.‘‘అది ల్యాబ్‌లో, లేదా యూనివర్సిటీలో ఐతే మనం పసిగట్టేవాళ్లం బాస్. కానీ అది ఒక కాలేజీ లెక్చరర్ కనిపెట్టాడు. అదీ కాక సడన్‌గా ఎనౌన్స్ చేశాడు.’’‘‘నో, నోవే.. మేం ఇక్కడ కొన్ని మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి, డే అండ్ నైట్ కష్టపడుతున్నా చిన్న డెవలప్‌మెంట్ సాధించలేకపోయాం. ఆఫ్టరాల్ ఒక్కడు.. అదీ ఇండియాలో! టైం మెషీన్ కనిపెట్టడమా? అదేదో ఫేక్ న్యూస్ అయి వుంటుంది.’’ ఆవేశంగా ఊగిపోతున్నాడు హెన్రీ.‘‘నో బాస్! ఆల్రెడీ ఇప్పటికే రష్యన్, చైనా, జపాన్.. ఇలా అన్ని దేశాల టీంలు ఇండియాకు వస్తున్నాయట..’’ ‘‘ఓకే టిమోతీ! ఆ ఫార్ములా ఎవరికీ దక్కడానికి వీల్లేదు. నేను వెంటనే వస్తున్నాను..’’
ఆగమేఘాల మీద సొంత చార్టర్డ్ ఫ్లైట్లో ఇండియాకు బయలు దేరాడు హెన్రీ. ఇండియా ఏదో వొక రోజు అమెరికా కంటే అడ్వాన్స్ అవుతుందని అనుకున్నాడు. కానీ మరీ టైం మెషీన్ ఫార్ములా కనిపెడతారని కలలో కూడా అనుకోలేదు హెన్రీ. టైం మెషీన్ కనిపెట్టడమే జీవిత గమ్యంగా, అది తప్ప వేరే ప్రపంచం లేకుండా బతుకుతున్నాడు. అందుకే ఈ వార్త హెన్రీకి మింగుడు పడట్లేదు. ఎలాగైనా, ఎంత డబ్బైనా పోసి ఆ ఫార్ములా కొనేయాలి అనుకున్నాడు.మధ్యలో ఎప్పటికప్పుడు.. ఏజెంట్ టిమోతీతో ఎంతిచ్చైనా డీల్ సెటిల్ చేయమని చెప్తున్నాడు. ‘‘లాభం లేదు బాస్’’ అని చేతులెత్తేశాడు టిమోతీ.ఇటు ఇండియా మీడియాలో టైం మెషీన్ మీద బ్రేకింగ్ న్యూస్‌లు. లైవ్ కవరేజీలు. ఒక చానల్, ‘అసలు టైం మెషీన్ సాధ్యమేనా?’ అనే టాపిక్ మీద వాచీలు రిపేరు చేసేవాళ్లను పిలిచి లైవ్ డిస్కషన్ చేపట్టింది.హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా టైం మెషీన్ ఫార్ములా కనిపెట్టిన వ్యక్తి దగ్గరకు బయలుదేరాడు హెన్రీ.
‘‘హే మ్యాన్! నువ్వేనా సిద్ధార్థ..? టైం మెషీన్ ఫార్ములా కనిపెట్టింది..’’ ఆత్రంగా అడిగాడు హెన్రీ. సిద్ధార్థ ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి, ‘‘నేను కొత్తగా కనిపెట్టలేదు. తెలుసుకున్నాను అంతే’’ అన్నాడు.
హెన్రీ విమానంలో వస్తూ 30 రోజుల్లో తెలుగు పుస్తకం చదివాడు. కాబట్టి తెలుగు అర్థం చేసుకోగలడు. కానీ ‘‘ఫార్ములా కనిపెట్టలేదు, తెలుసుకున్నాను..’’ అనడంలో భావం మాత్రం అర్థం కాలేదు. ‘‘కనిపెట్టావో, తెలుసుకున్నావో! ఏదో ఒకటి. నువ్వు టైంలో ట్రావెల్ చేయగలవా..?’’ హెన్రీకి బీపీ గిన్నిస్ బుక్ రికార్డు దాటింది. ‘‘నేనే కాదు. ఆ ఫార్ములా తెలుసుకుంటే మీరైనా ప్రయాణం చేయగలరు.’’ అదే ప్రశాంతతో సిద్దార్థ బదులిచ్చాడు. ‘‘నువ్వు అబద్ధం చెపుతున్నావ్. మేం యాభై సంవత్సరాలుగా వందల మంది బుర్రబద్దలు కొట్టుకొన్నా కనిపెట్టలేకపోయాం. నువ్వు కనిపెట్టావంటే నమ్మను.’’ ‘‘మీరు నమ్మకపోయినా నష్టం లేదు. అసలు ఆ ఫార్ములా చాలా చిన్న విషయం.’’ ‘‘సరే ఐతే ఆ టైం మెషీన్ ఎక్కడ..? చూపించు.’’ ఆత్రంగా ఇంట్లోకి తొంగి చూశాడు హెన్రీ. ‘‘చూపిస్తాను. కాకుంటే ఇప్పుడు కాదు. రేపు మా కాలేజీలో అందరి ముందు చెపుతాను. అంతవరకూ ఆగండి.’’ ‘అందరికీ చెపుతాను..’ అనేసరికి హెన్రీ గుండె గుభిల్లుమంది. తానైతే టైం మెషీన్లు తయారు చేసి బిలియన్స్ సంపాదించే వాడు. కానీ ఇతను అందరికీ చెబుతాడట..? కొంపదీసి ఇతను మోసం చేయడం లేదు కదా.? అనుమానం వచ్చింది. ‘‘నువ్వు ఇప్పటివరకూ ఎపుడైనా టైంలో ట్రావెల్ చేశావా?’’ అని అడిగాడు.
‘‘చాలా సార్లు...’’‘‘నేను నమ్మను.’’ మెల్లగా కూపీ లాగుతున్నాడు హెన్రీ.‘‘మీకు నమ్మకం కలగాలంటే ఏం చెయ్యాలో చెప్పండి?’’ ‘‘ఐతే నీకో టెస్టు పెడతాను. కొలంబస్ అమెరికా కనుగొన్న టైంకు ప్రయాణం చేసి చూపించు’’చిరునవ్వుతో సిద్ధార్థ ‘‘సరే. మీరిక్కడే ఉండండి. పది నిమిషాల్లో వస్తాను’’ అని లోపలకి వెళ్లాడు. సిద్ధార్థ వెళుతుంటే టిమోతీకి కంటితో సైగ చేశాడు హెన్రీ. టిమోతీ సక్సెస్ అన్నట్టు చూపించాడు. సిద్ధార్థకు టిమోతీ షేక్ హ్యాండ్ ఇచ్చినపుడు చిన్న మైక్రో స్పై కెమెరాను సిద్ధార్థ షర్ట్‌కు అతికించాడు. ఇక సిద్ధార్థప్రతీ మూÐŒ మెంట్ తమ ల్యాప్‌టాప్‌లో చూసుకోవచ్చు.అందుకే సిద్ధార్థ లోపలికి వెళ్లగానే ల్యాప్ టాప్ ఓపెన్ చేసి లోపల ఏం జరుగుతుందో చూడసాగారు. సిద్ధార్థ లోపలికి వెళ్లి షర్ట్ తీసి హ్యాంగర్‌కు తగిలించి వేరే గదిలోకి వెళ్లిపోయాడు. కెమెరాలో గోడ తప్ప ఏమీ కనపడటం లేదు. తన ప్లాన్ అట్టర్ ఫ్లాపైనందుకు తిట్టుకున్నాడు హెన్రీ. ఓ అరగంట తర్వాత సిద్ధార్థ బయటకు వచ్చాడు.‘‘కమ్.. కమ్ సిద్ధార్థ. టైం ట్రావెల్ చేసి వచ్చావా? కొలంబస్‌తో మాట్లాడావా?’’ ఆత్రంగా అడిగాడు హెన్రీ. ‘‘ఒక్క కొలంబస్‌నే కాదు. అతని టీంను, రెడ్ ఇండియన్లనూ.. అందరినీ చూశాను. కొలంబస్ అమెరికా చేరుకున్న తేదీ అక్టోబర్ 12, 1492 సంవత్సరం. ఆ రోజు ఫ్రైడే. కొలంబస్ క్యూబా తీరంలోని లూకాయస్ ద్వీపానికి చేరుకున్నారు. మీరనుకుంటున్నట్లు రెడ్ ఇండియన్లు అనాగరికులు కాదు. వాళ్లకూ సముద్ర యాత్రలు తెలుసు. తమ దేశం వచ్చిన విదేశస్థులతో వాళ్లు ఎలాంటి ఘర్షణ పడలేదు. సాదర స్వాగతం పలికారు. పండ్లు అందించారు. కొలంబస్ వాళ్లకు ఎర్రటోపీలు ఇచ్చాడు.’’ సిద్ధార్థ చెప్పుకుంటూ పోతుంటే హెన్రీ నోట మాట రాలేదు.
‘‘అంటే సిద్ధార్థకు టైం మెషీన్ ఫార్ములా తెలుసు. టైంలో ట్రావెల్ చేసి వస్తున్నాడు. ఓ గాడ్! ఇంత విలువైన ఫార్ములాను ఎలా దక్కించుకోవడం?’’ ఇక ఆలస్యం చేయదల్చుకోలేదు హెన్రీ.‘‘మిస్టర్ సిద్దార్థ! నీకెంత మనీ కావాలో చెప్పు. మా దేశ సిటిజన్‌షిప్ ఇస్తాం. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. మా ప్రెసిడెంట్‌తో ఇప్పుడే మాట్లాడిస్తాను.’’ ఎగై్జట్‌మెంట్ తట్టుకోలేక పోతున్నాడు హెన్రీ.సిద్ధార్థ ఎప్పటిలాగే మెల్లగా నవ్వాడు.‘‘మీరు కంగారుగా ఉన్నారు. ఫార్ములా కోసం మీరింత శ్రమ పడనవసరం లేదు. రేపు అందరి ముందూ చెపుతాను. ప్లీజ్. రేపటి వరకూ ఆగండి.’’ తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఎంత డబ్బు ఆఫర్ చేసినా సిద్ధార్థ ఒప్పుకోకపోవడంతో హోటల్ గదికి వచ్చాడు హెన్రీ. రష్యా, జపాన్, చైనా వాళ్లు ఎవరడిగినా సిద్ధార్థ రేపటి వరకూ ఆగండి అనే చెప్పాడు. హెన్రీకి ఓపిక లేదు. ముఖ్యంగా ఆ ఫార్ములా ప్రపంచానికి ఉత్త పుణ్యానికే చెబుతాననడం అస్సలు నచ్చలేదు. ఎలాగైనా ఆ ఫార్ములా కొట్టేయాలనుకున్నాడు. వెంటనే ఏజెంట్ టిమోతీకి ఫోన్ చేసి ప్లాన్ వివరించాడు.బాస్ ఆదేశం ప్రకారం టిమోతి అర్ధరాత్రి సిద్ధార్థ ఇంట్లోకి దొంగతనంగా వచ్చాడు. చప్పుడు కాకుండా ఇల్లంతా గాలించాడు. ఇంటి నిండా చెల్లా చెదురుగా పుస్తకాలు పడి ఉన్నాయి. టైం మెషీన్ కనపడలేదు. ఎటు చూసినా పుస్తకాలతో లైబ్రరీలా వుంది ఇల్లు. మెల్లగా సిద్ధార్థ బెడ్ రూంలోకి ప్రవేశించాడు. అతను బెడ్‌మీద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నిద్దరలోనే నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు.‘‘మహాత్మా! ఎందుకయ్యా మేమంటే అంత ప్రేమ. నీ ఆవేదన, అంతరంగం నాకు అర్థమయ్యింది. మహాత్మా, మహర్షి...’’ అంటూ కలవరిస్తున్నాడు. బెడ్ చుట్టూ, కిందా మీదా వెతికాడు టిమోతీ. చివరకు సిద్ధార్థ దిండు కింద ఓ పుస్తకం దొరికింది. చీకట్లో దాని పేరు కనపడలేదు. ‘దిండు కింద దాచుకున్నాడంటే టైం మెషీన్ ఫార్ములా దాంట్లోనే వుండొచ్చు’ అనుకున్నాడు. ఆ పుస్తకం కొట్టేసి గోడ దూకాడు.
‘‘సాధించా బాస్. ఆ ఫార్ములా ఉన్న పుస్తకం తెచ్చాను.’’ పుస్తకం అందించాడు టిమోతీ. హెన్రీ గబగబా ఆ పుస్తకం చేతిలోకి తీసుకుని చూశాడు. ఆ పుస్తకం పేరు ‘సత్యంతో నా ప్రయోగాలు’. మహాత్మాగాంధీ ఆత్మకథ. సిద్ధార్థ గాంధీ పేరు కలవరించిన సంగతి కూడా చెప్పాడు టిమోతీ. ‘‘అంటే సిద్ధార్థ గాంధీజీ టైంలోకి వెళ్లాడన్న మాట.’’ అనుకున్నాడు హెన్రీమాటలతో, డబ్బులతో వినకపోతే పని ఎలా చేయించుకోవాలో అమెరికన్ అయిన హెన్రీకి బాగా తెలుసు. వెంటనే తన పథకం అమలులో పెట్టాడు. ఉన్నపళంగా సిద్ధార్థను కిడ్నాప్ చేసి అమెరికా తీసుకుని వెళ్లడం తప్ప మరో మార్గం లేదనుకున్నాడు. ఆమధ్య లాడెన్ ఇంటి ముందు మెరుపు దాడి చేసి దిగినట్లు.. ఆ అర్ధరాత్రి అమెరికా కమాండో టీం సిద్ధార్థ ఇంటి పైన దిగింది. మెల్లగా లోపలకి వెళ్లారు. అక్కడ పరిస్థితి చూసి ఉలిక్కిపడ్డారు. సిద్ధార్థ లేడు. మంచం అంతా చిందర వందరగా ఉంది. తాము రావడానికంటే ముందే ఎవరో వచ్చి కిడ్నాప్ చేశారన్నమాట. ‘‘ఓ గాడ్. రష్యన్లా, జపానోళ్లా? వాళ్లకు ఫార్ములా తెలిస్తే ఇంకేముంది?’’ఇంతలో టిమోతీ ఫోన్. ‘‘బాస్! సిద్ధార్థను కిడ్నాప్ చేసింది చైనా వాళ్లు. ఊరి చివర చైనా బజార్‌లో దాచిపెట్టారు. మీకు అడ్రస్ మెసేజ్ చేశాను. అక్కడకు రండి’’ హెన్రీ ఆగమేఘాల మీద చైనా బజార్‌కు చేరుకున్నాడు. ఈలోపే రష్యా, జపాన్, చైనా అన్ని దేశాలవాళ్లూ అక్కడకు వచ్చారు. ఆ ఫార్ములా చెప్పకపోతే తన కథ ముగిసిపోయే ప్రమాదం ఉందని భయపడ్డాడు సిద్ధార్థ. అందరినీ సైలెంట్‌గా ఉండమన్నాడు. ‘‘మీరు ఆ ఫార్ములా కోసం ఇంత కష్టపడటం చూసి జాలేస్తోంది. నేను టైంలోకి ఎలా ప్రయాణిస్తున్నానో జాగ్రత్తగా వినండి.’’ అంటూ తన ఫార్ములా మొత్తం వివరించాడు సిద్ధార్థ. అది వింటూనే సగం మంది కుప్పకూలారు. ‘‘ఇది అందరికీ తెలిసిందే కదా! ఇంత సింపుల్ ఫార్ములా గ్రహించలేక పోయామే’’ అనుకుని సిగ్గు పడ్డారు. హెన్రీకి నోట మాట రాలేదు. ఫార్ములా తెలిసిన ఆనందం తట్టుకోలేక సిద్ధార్థను గట్టిగా కౌగిలించుకున్నాడు. థ్యాంక్స్ చెప్పి మౌనంగా తన చార్టర్డ్ ఫ్లైట్‌లో అమెరికా బయలుదేరాడు. ఫ్లైట్‌లో వెళ్తూ సిద్ధార్థ మాటలు గుర్తుకు చేసుకున్నాడు హెన్రీ.
‘‘అసలు కాలమంటే ఏమిటో తెలిస్తే.. టైం మెషీన్ ఫార్ములా అర్థమవుతుంది. కాలమంటే ఒక మనిషి ఓ ప్రదేశంతో పొందే అనుభవాలు, జ్ఞాపకాలు. వర్తమానంలో మన అనుభవాలను నేడు అనుకుంటున్నాం. జరిగిపోయినవి నిన్న అని, జరగబోయే అనుభవాలకు రేపు అని పేరు పెట్టుకుంటున్నాం. చరిత్ర అంటే ఆనాటి మనుషుల అనుభవాలు. కాలమంటే జ్ఞాపకాలు. టైం మెషీన్‌లో ప్రయాణించడమంటే జ్ఞాపకాలు పోగేసుకోవడం. కాలంలోకి ప్రయాణమంటే కళ్లతో చూడడం కాదు. మనసుతో గ్రహించడం. గతంతో సంభాషించడం.’’‘‘ఇవన్నీ మాక్కూడా తెలుసు. కానీ ఆ టైం మెషీన్ ఫార్ములా ఏంటి?’’ ‘‘టైం మెషీన్ ఫార్ములా అంటే మరేదో కాదు. మన చేతిలోని పుస్తకం. అంతే..!’’ భారం దిగినట్లు నిట్టూర్చాడు సిద్ధార్థ.‘‘పుస్తకం.అంటే బుక్. ఆర్ యూ జోకింగ్ సిద్ధార్థ? మమ్మల్ని ఫూల్స్‌ను చేశావా?’’ కోపంగా మండిపడ్డాడు హెన్రీ. ‘‘ఆవేశంతో కాదు. జాగ్రత్తగా వినండి. అనాది కాలం నుంచి మనిషి తన భావాలను, ఆలోచనల ను, భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. వేదాలు చెప్పాడు. జానపద గీతాలు పాడాడు. గుహలపై, దేవాలయాల గోడలపై రాతలు రాశాడు. శాసనాలు చెక్కాడు. ఇదంతా దేనికి ? ఆనాటి మనిషి భవిష్యత్ తరాలను చేరుకునేందుకు పడ్డ ఆరాటం.
తమ ఆలోచనలను సజీవంగా ఉంచుతూ భవిష్యత్ తరాల కోసం చేస్తున్న మహా కాల ప్రయాణం అది. అదిక్కడితో ఆగిపోదు. ఆది మానవుని ఆలోచనలు ఆఖరి మానవున్ని చేరేదాకా ఆ నిరంతర స్రవంతి సాగుతూనే వుంటుంది. రేపు ఇంకెవరో టైం మెషీన్ కనిపెట్టినా ఇంతకు మించి సాధించేదేముంది? పుస్తకాన్ని మించిన టైం మెషీన్ ఏముంటుంది?’’‘‘ఛీటింగ్. మోసం. టైం ట్రావెల్ అంటే ఫిజికల్‌గా వెళ్లాలి. అంతే తప్ప పుస్తకాలు చదివితే ఎలా అవుతుంది?’’‘‘అదే మీకూ, మాకూ ఉన్నతేడా! మనిషంటే కేవలం దేహం కాదు. చైతన్యం కూడా. ఆ చైతన్యమే రకరకాల రూపాల్లోకి నిరంతర సింధూ ప్రవాహంలా సాగిపోతూనే ఉంటుంది. వెలుగులోంచి చీకటిలోకి, చెడు నుంచి మంచి దారికి, మృత్యువు నుంచి అమరత్వానికి నడిపించేది జ్ఞానమే. ఆ జ్ఞానమే కాలం. ఆ కాలమే సత్యం. ఆ సత్యాన్ని చూపేదే పుస్తకం. పుస్తకం చదవడమంటే అక్షరాలను చదవడం కాదు. రాసిన వాడితో మమేకం కావడం. అతని అనుభూతిని అందుకోవడం. మనం అతని కాలానికి, అతను మన కాలానికి రావడం. అతనూ మనం ఒక్కటి కావడం. మనిషికి మరణం ఉండొచ్చు, ఆలోచనలకు మాత్రం లేదు. మనిషి ఆయుష్షు అనే పరిమితిని, కాలం అనే మహా అగాథాన్ని దాటించిన సాధనం పుస్తకం. అదే అసలైన టైం మెషీన్.హెన్రీకి అంతా అర్థమైంది. తన సంవత్సరాల పరిశోధన అందించని జ్ఞానం బోధపడింది. తన పూర్వీకులు రెడ్ ఇండియన్లు, వాషింగ్‌టన్, లింకన్, కెనడీ, లూథర్... అందరూ కనిపిస్తున్నారు. తనతో మాట్లాడుతున్నారు. వారి ఆలోచనలను, భావాలను, అన్నింటిని అందుకున్న ఆనందంతో తిరుగు ప్రయాణమయ్యాడు హెన్రీ.అమెరికాకెళ్లాక హెన్రీ తన టైం మెషీన్ ప్రాజెక్టుకు రాజీనామా చేశాడు. ఇపుడతను టైం మెషీన్ ఫార్ములాతో రోజుకో కాలానికి ప్రయాణిస్తున్నాడు. తన పూర్వికులతో మనసారా సంభాషిస్తున్నాడు.
చందు తులసి
Comments
Please login to add a commentAdd a comment