
జపాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ ఈవెంట్
సుజుకా (జపాన్): ఫార్ములావన్ సీజన్ మూడో రేసు జపాన్ గ్రాండ్ ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ (నెదర్లాండ్స్) పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్‌లో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 నిమిషం 26.983 సెకన్లలో ల్యాప్‌ను పూర్తిచేశాడు. చివరి ల్యాప్‌లో అతడు ఈ టైమింగ్ నమోదు చేశాడు. కాగా... వెర్‌స్టాపెన్ కెరీర్‌లో ఇది 41వ పోల్ పొజిషన్. మెక్‌లారెన్ డ్రైవర్లు నోరిస్ (1 నిమిషం 26.995 సెకన్లు), పియాస్ట్రి (1 నిమిషం 27.027 సెకన్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
జపాన్ గ్రాండ్‌ప్రిలో నాలుగుసార్లు విజేతగా నిలిచిన వెర్‌స్టాపెన్ ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో దూకుడు కనబర్చలేకపోయాడు. గత 16 రేసుల్లో అతడు కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో తనకు అచ్చొచ్చిన ట్రాక్‌పై నేడు జరగనున్న ప్రధాన రేసును వెర్‌స్టాపెన్ పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించనున్నాడు.
ఆదివారం ఇక్కడ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించగా... తడిసిన ట్రాక్‌పై మెరుగైన రికార్డు ఉన్న వెర్‌స్టాపెన్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. వెర్‌స్టాపెన్ కెరీర్‌లో ఇప్పటి వరకు 63 ఎఫ్1 రేసులు నెగ్గాడు. ఈ జాబితాలో లూయిస్ హామిల్టన్ (105), షూమాకర్ (91) మాత్రమే అతడికంటే ముందున్నారు.
ఈ ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి మెక్‌లారెన్ డ్రైవర్ నోరిస్ (44 పాయింట్లు) అగ్ర స్థానంలో ఉండగా... 36 పాయింట్లతో వెర్‌స్టాపెన్ రెండో స్థానంలో ఉన్నాడు. రసెల్ (మెర్సిడెస్; 35 పాయింట్లు), పియాస్ట్రి (మెక్‌లారెన్; 34 పాయింట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.