Japanese Grand Prix
-
వెల్డన్ వెర్స్టాపెన్
సుజుకా (జపాన్): ఫార్ములావన్ తాజా సీజన్లో తొలి రెండు రేసుల్లో మెక్లారెన్ ఇద్దరు డ్రైవర్లను దాటి ముందుకెళ్లడంలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ సఫలం కాలేకపోయాడు. కానీ మూడో రేసులో మాత్రం వెర్స్టాపెన్ జోరును అడ్డుకోవడంలో మెక్లారెన్ ఇద్దరు డ్రైవర్లు విఫలమయ్యారు. వెరసి ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లోని మూడో రేసులోనూ మూడో విజేత అవతరించాడు. సీజన్ మొదటి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్... సీజన్ రెండో రేసు చైనా గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి టైటిల్స్ సాధించారు. ఆదివారం జరిగిన సీజన్ మూడో రేసు జపాన్ గ్రాండ్‌ప్రిలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ పూర్తి ఆధిపత్యం చలాయించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో తనకెంతో కలిసొచ్చిన సుజుకా సర్క్యూట్లో వరుసగా నాలుగో ఏడాది జపాన్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెర్స్టాపెన్ నిర్ణీత 53 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 22 నిమిషాల 06.983 సెకన్లలో ముగించి చాంపియన్‌గా నిలిచాడు. 2022, 2023, 2024 జపాన్ గ్రాండ్‌ప్రి రేసుల్లో వెర్‌స్టాపెన్‌కే అగ్రస్థానం దక్కింది. మెక్లారెన్ డ్రైవర్లు లాండో నోరిస్ రెండో స్థానంలో, ఆస్కార్ పియాస్ట్రి మూడో స్థానంలో నిలిచారు. రెడ్‌బుల్ తరఫున తొలిసారి ప్రధాన డ్రైవర్‌గా వ్యవహరించిన జపాన్‌కు చెందిన యుకీ సునోడా 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. గత సీజన్లో ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టి ఆ తర్వాత వెనుకబడిపోయిన వెర్‌స్టాపెన్‌కు ఈ ఏడాది తొలి రెండు రేసుల్లో మెక్లారెన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. దాంతో వెర్స్టాపెన్ ఆ్రస్టేలియా గ్రాండ్‌ప్రిలో రెండో స్థానంలో, చైనా గ్రాండ్‌ప్రిలో నాలుగో స్థానంలో నిలిచాడు. కానీ గత నాలుగేళ్లు ఫార్ములావన్‌లో ఓవరాల్ టైటిల్ సాధించిన వెర్స్టాపెన్ మూడో రేసులో మాత్రం వెనుకంజ వేయలేదు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన అతను దూసుకుపోయాడు. ఒక్కసారి వెర్స్టాపెన్ ఆధిక్యంలోకి వెళితే అతడిని ఓవర్టేక్ చేయడం కష్టంతో కూడుకున్నదని మెక్లారెన్ డ్రైవర్లకు తెలుసు. జపాన్ గ్రాండ్‌ప్రిలో అదే జరిగింది. మొదట్లోనే ఆధిక్యంలోకి వెళ్లిన వెర్స్టాపెన్ చివరి ల్యాప్ వరకు ఆధిక్యంలో కొనసాగి రెండు సెకన్ల తేడాతో విజేతగా నిలిచాడు. పాయింట్ తేడానే... 24 రేసులతో కూడిన తాజా సీజన్లో మూడు రేసులు ముగిశాక లాండో నోరిస్ 62 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 61 పాయింట్లతో వెర్స్టాపెన్ రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య తేడా ఒక్క పాయింట్ మాత్రమే ఉండటం గమనార్హం. సీజన్‌లోని తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 13న జరుగుతుంది. 64 ఫార్ములావన్ చరిత్రలో వెర్స్టాపెన్ సాధించిన విజయాలు. అత్యధిక రేసుల్లో గెలిచిన డ్రైవర్ల జాబితాలో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నాడు. లూయిస్ హామిల్టన్ (105), మైకేల్ షుమాకర్ (91) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 4 రెండు వేర్వేరు గ్రాండ్‌ప్రి రేసులను వరుసగా నాలుగేళ్ల పాటు సాధించిన నాలుగో డ్రైవర్‌గా వెర్స్టాపెన్ గుర్తింపు పొందాడు. వెర్స్టాపెన్ అబుదాబి (2020, 2021, 2022, 2023), జపాన్ గ్రాండ్‌ప్రి (2022, 2023, 2024, 2025) రేసులలో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో జిమ్ క్లార్క్ (బెల్జియం గ్రాండ్‌ప్రి; బ్రిటన్ గ్రాండ్‌ప్రి 1962–1965), మైకేల్ షుమాకర్ (స్పెయిన్ గ్రాండ్‌ప్రి 2001–2004; యూఎస్ఏ గ్రాండ్‌ప్రి 2003–2005), లూయిస్ హామిల్టన్ (బ్రిటన్ గ్రాండ్‌ప్రి 2001–2004; యూఎస్ఏ గ్రాండ్‌ప్రి 2014–2017) కూడా ఉన్నారు. -
వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్
సుజుకా (జపాన్): ఫార్ములావన్ సీజన్ మూడో రేసు జపాన్ గ్రాండ్ ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 నిమిషం 26.983 సెకన్లలో ల్యాప్‌ను పూర్తిచేశాడు. చివరి ల్యాప్‌లో అతడు ఈ టైమింగ్ నమోదు చేశాడు. కాగా... వెర్స్టాపెన్ కెరీర్లో ఇది 41వ పోల్ పొజిషన్. మెక్లారెన్ డ్రైవర్లు నోరిస్ (1 నిమిషం 26.995 సెకన్లు), పియాస్ట్రి (1 నిమిషం 27.027 సెకన్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. జపాన్ గ్రాండ్‌ప్రిలో నాలుగుసార్లు విజేతగా నిలిచిన వెర్స్టాపెన్ ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో దూకుడు కనబర్చలేకపోయాడు. గత 16 రేసుల్లో అతడు కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో తనకు అచ్చొచ్చిన ట్రాక్‌పై నేడు జరగనున్న ప్రధాన రేసును వెర్స్టాపెన్ పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించనున్నాడు. ఆదివారం ఇక్కడ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించగా... తడిసిన ట్రాక్‌పై మెరుగైన రికార్డు ఉన్న వెర్స్టాపెన్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. వెర్స్టాపెన్ కెరీర్లో ఇప్పటి వరకు 63 ఎఫ్1 రేసులు నెగ్గాడు. ఈ జాబితాలో లూయిస్ హామిల్టన్ (105), షూమాకర్ (91) మాత్రమే అతడికంటే ముందున్నారు. ఈ ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి మెక్లారెన్ డ్రైవర్ నోరిస్ (44 పాయింట్లు) అగ్ర స్థానంలో ఉండగా... 36 పాయింట్లతో వెర్స్టాపెన్ రెండో స్థానంలో ఉన్నాడు. రసెల్ (మెర్సిడెస్; 35 పాయింట్లు), పియాస్ట్రి (మెక్లారెన్; 34 పాయింట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
2024 Japanese Grand Prix: వెర్‌స్టాపెన్‌కు మూడో విజయం
సుజుకా (జపాన్): జపాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ రేసును వెర్స్టాపెన్ ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించాడు. నిరీ్ణత 53 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 54 నిమిషాల 23.566 సెకన్లలో పూర్తి చేసి ఈ నెదర్లాండ్స్ డ్రైవర్ అగ్రస్థానాన్ని దక్కించుకొని కెరీర్లో 57వ టైటిల్‌ను సాధించాడు. ఈ సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది మూడో విజయంకాగా... జపాన్ గ్రాండ్‌ప్రిలో వరుసగా మూడో గెలుపు కావడం విశేషం. రెడ్‌బుల్ జట్టుకే చెందిన సెర్జియో పెరెజ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో నాలుగు రేసుల తర్వాత వెర్స్టాపెన్ 77 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... 64 పాయింట్లతో పెరెజ్ రెండో స్థానంలో, 59 పాయింట్లతో లెక్లెర్క్(ఫెరారీ) మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని ఐదో రేసు చైనా గ్రాండ్‌ప్రి ఈనెల 21న జరుగుతుంది. -
వెర్‌స్టాపెన్‌కు ‘పోల్ పొజిషన్’
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఈ సీజన్లో ఐదోసారి పోల్ పొజిషన్ సాధించాడు. సుజుకా నగరంలో శనివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 29.304 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. దాంతో నేడు జరిగే ప్రధాన రేసును ఈ నెదర్లాండ్స్ డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. లెక్లెర్క్ (ఫెరారీ), కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో ఇప్పటివరకు 17 రేసులు జరగ్గా... 11 రేసుల్లో వెర్స్టాపెన్ గెలిచి 341 పాయింట్లతో టాప్‌ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. లెక్లెర్క్ 237 పాయింట్లతో రెండో స్థానంలో, పెరెజ్ 235 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. -
జపాన్ ఫార్ములావన్ రద్దు
టోక్యో: ఏడాది వాయిదా పడినా కూడా ఒలింపిక్స్‌ను అద్భుతంగా నిర్వహించిన దేశం జపాన్. పారాలింపిక్స్ కూడా ఈ నెల 24 నుంచి అక్కడే జరగనున్నాయి. అయితే వందల సంఖ్యలో దేశాలు, వేల సంఖ్యలో అథ్లెట్లు పాల్గొనే మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చిన టోక్యో నగరం పదుల సంఖ్యలో జరిగే ఫార్ములావన్ జపనీస్ గ్రాండ్ ప్రి ఈవెంట్‌ను నిర్వహించలేమని చేతులెత్తేసిం ది. కరోనా మహమ్మారి కారణంగా తమ దేశంలో జరగాల్సిన ఫార్ములావన్‌ను రద్దు చేస్తున్నట్లు బుధవారం నిర్వాహకులు ప్రకటించారు. సుజుకా ట్రాక్‌పై అక్టోబర్ 10న జపాన్ గ్రాండ్ ప్రి జరగాల్సివుంది. ప్రభుత్వం, రేస్ ప్రమోటర్లు, ఫార్ములావన్ వర్గాలు దీనిపై చర్చించిన అనంతరం ఈ సీజన్ రేసు రద్దయింది. -
హామిల్టన్‌కే టైటిల్
సుజుకా: జపాన్ గ్రాండ్ ప్రి రేసులో బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ హవా కొనసాగింది. ‘పోల్’ పొజిషన్‌తో ప్రధాన రేసును ఆరంభించిన అతను విజేతగా నిలిచాడు. జపాన్‌లో హామిల్టన్‌కు ఇది నాలుగో టైటిల్. ఓవరాల్‌గా కెరీర్లో 61వ టైటిల్ కావడం విశేషం. ఆదివారం సుజుకా ఇంటర్నేషనల్ సర్క్యూట్‌పై ఈ మెర్సిడెస్ డ్రైవర్ దూసుకెళ్లాడు. అందరికంటే వేగంగా హామిల్టన్ 53 ల్యాపులను 1 గంటా 27ని.31.194 సెకన్లలో పూర్తిచేశాడు. ఈ సీజన్లో అతనికిది ఎనిమిదో టైటిల్ కాగా డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్ (306)... వెటెల్ (247) కంటే 59 పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్నాడు. ఆదివారం జరిగిన రేసులో వెటెల్ ఆరంభంలోనే తప్పుకున్నాడు. ఇంజిన్ మొరాయించడంతో అతను నాలుగో ల్యాపులోనే వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో రెడ్‌బుల్ డ్రైవర్లు మ్యాక్స్ వెర్స్టాపెన్, డానియెల్ రికియార్డో వరుసగా రెండు, మూడు స్థానాలతో పోడియం ఫినిష్ చేశారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఈస్టెబన్ ఒకాన్ ఆరు... పెరెజ్ ఏడో స్థానం పొందారు. ‘రేసు చివర్లో మ్యాక్స్ వెర్స్టాపెన్ వణికించాడు. అసాధారణ వేగంతో అతడు నన్ను చేరుకున్నాడు. ఏదేమైనా మొత్తానికి గెలిచి ఊపిరి పీల్చుకున్నాను. ఈ సీజన్లో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఇంకా చాలా రేసులు మిగిలున్నాయి’ అని హామిల్టన్ అన్నాడు. ఈ సీజన్లో తదుపరి యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రి రేసు ఈ నెల 22న ఆస్టిన్‌లో జరుగుతుంది. -
హామిల్టన్‌కు పోల్
సుజుకా: బ్రిటిష్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో మరో ‘పోల్’ పొజిషన్ సాధించాడు. జపాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో ఈ మెర్సిడెజ్ డ్రైవర్ అందరి కంటే వేగంగా 1 నిమిషం 27.319 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తద్వారా సుజుకా సర్క్యూట్లో అత్యంత వేగంగా ల్యాప్‌ను పూర్తిచేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది పదో పోల్ పొజిషన్ కాగా... జపాన్ రేసులో మొదటిది. ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. క్వాలిఫయింగ్‌లో ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఈస్టెబన్ ఒకాన్ (1:29.111 సె.), పెరెజ్ (1:29.260 సె.) వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచారు. -
జపాన్ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్
సుజుకా (జపాన్): మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 41వ ఫార్ములావన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రిలో అతడు విజేతగా నిలిచాడు. పోల్ పొజిషన్ సాధించిన మెర్సిడెస్ జట్టు మరో డ్రైవర్ నికో రోస్ బర్గ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గత వారం సింగపూర్ గ్రాండ్‌ప్రిలో విఫలమైన వీరిద్దరూ ప్రధాన రేసును తొలి రెండు స్థానాల నుంచి ప్రారంభించి చివరివరకు తమ ఆధిక్యం కొనసాగించారు. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానం దక్కించుకున్నాడు. ఇక భారత్‌కు చెందిన 'ఫోర్స్ ఇండియా' జట్టు డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానంలో నిలిచాడు. -
'నేటితో అతని పోరాటం ముగిసింది'
పారిస్ : ఫ్రాన్స్ కు చెందిన ఫార్ములావన్ డ్రైవర్ జ్యుల్స్ బియాంచి(25) శనివారం ఉదయం మరణించాడు. ఈ విషయాన్ని అతడి కుటుంబసభ్యులు వెల్లడించారు. అయితే, గతేడాది అక్టోబర్‌లో సుజుకాలో జరిగిన జపానిస్ గ్రాండ్ ప్రిక్స్‌లో పాల్గొన్న బియాంచి ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఫ్రాన్సులోని తన ఇంటికి దగ్గర్లో ఉన్న ఆస్పత్రిలో కోమాస్థితిలో చికిత్స పొందుతున్న బియాంచి ఈరోజు కన్నుమూశాడు. చివరి క్షణం వరకూ బియాంచి పోరాడేవాడని, అతని పోరాటం నేటితో ముగిసిందని బియాంచి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 1994 అయిర్టాన్ మరణం తర్వాత ఓ గ్రాండ్ ప్రిక్స్ లో రేస్ డ్రైవర్ చనిపోవడం ఇదే తొలిసారి. బియాంచి బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని గత నెలలో అతడి తండ్రి ఫిలిప్ స్థానిక మీడియాకు తెలపడంతో అభిమానులు విస్మయానికి గురయ్యారు.