'నేటితో అతని పోరాటం ముగిసింది'
పారిస్ : ఫ్రాన్స్ కు చెందిన ఫార్ములావన్ డ్రైవర్ జ్యుల్స్ బియాంచి(25) శనివారం ఉదయం మరణించాడు. ఈ విషయాన్ని అతడి కుటుంబసభ్యులు వెల్లడించారు. అయితే, గతేడాది అక్టోబర్లో సుజుకాలో జరిగిన జపానిస్ గ్రాండ్ ప్రిక్స్లో పాల్గొన్న బియాంచి ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఫ్రాన్సులోని తన ఇంటికి దగ్గర్లో ఉన్న ఆస్పత్రిలో కోమాస్థితిలో చికిత్స పొందుతున్న బియాంచి ఈరోజు కన్నుమూశాడు.
చివరి క్షణం వరకూ బియాంచి పోరాడేవాడని, అతని పోరాటం నేటితో ముగిసిందని బియాంచి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 1994 అయిర్టాన్ మరణం తర్వాత ఓ గ్రాండ్ ప్రిక్స్ లో రేస్ డ్రైవర్ చనిపోవడం ఇదే తొలిసారి. బియాంచి బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని గత నెలలో అతడి తండ్రి ఫిలిప్ స్థానిక మీడియాకు తెలపడంతో అభిమానులు విస్మయానికి గురయ్యారు.