వెల్‌డన్‌ వెర్‌స్టాపెన్‌ | Max Verstappen wins Japanese Grand Prix title | Sakshi
Sakshi News home page

వెల్‌డన్‌ వెర్‌స్టాపెన్‌

Published Mon, Apr 7 2025 4:11 AM | Last Updated on Mon, Apr 7 2025 4:11 AM

Max Verstappen wins Japanese Grand Prix title

వరుసగా నాలుగోసారి జపాన్‌ గ్రాండ్‌ప్రిలో టైటిల్‌ సొంతం

ఈ సీజన్‌లో తొలి విజయం దక్కించుకున్న రెడ్‌బుల్‌ డ్రైవర్‌

సుజుకా (జపాన్‌): ఫార్ములావన్‌ తాజా సీజన్‌లో తొలి రెండు రేసుల్లో మెక్‌లారెన్‌ ఇద్దరు డ్రైవర్లను దాటి ముందుకెళ్లడంలో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ సఫలం కాలేకపోయాడు. కానీ మూడో రేసులో మాత్రం వెర్‌స్టాపెన్‌ జోరును అడ్డుకోవడంలో మెక్‌లారెన్‌ ఇద్దరు డ్రైవర్లు విఫలమయ్యారు. వెరసి ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లోని మూడో రేసులోనూ మూడో విజేత అవతరించాడు. 

సీజన్‌ మొదటి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో మెక్‌లారెన్‌ డ్రైవర్‌ లాండో నోరిస్‌... సీజన్‌ రెండో రేసు చైనా గ్రాండ్‌ప్రిలో మెక్‌లారెన్‌ డ్రైవర్‌ ఆస్కార్‌ పియాస్ట్రి టైటిల్స్‌ సాధించారు. ఆదివారం జరిగిన సీజన్‌ మూడో రేసు జపాన్‌ గ్రాండ్‌ప్రిలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ పూర్తి ఆధిపత్యం చలాయించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో తనకెంతో కలిసొచ్చిన సుజుకా సర్క్యూట్‌లో వరుసగా నాలుగో ఏడాది జపాన్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను దక్కించుకున్నాడు. 

‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్‌ నిర్ణీత 53 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 22 నిమిషాల 06.983 సెకన్లలో ముగించి చాంపియన్‌గా నిలిచాడు. 2022, 2023, 2024 జపాన్‌ గ్రాండ్‌ప్రి రేసుల్లో వెర్‌స్టాపెన్‌కే అగ్రస్థానం దక్కింది. మెక్‌లారెన్‌ డ్రైవర్లు లాండో నోరిస్‌ రెండో స్థానంలో, ఆస్కార్‌ పియాస్ట్రి మూడో స్థానంలో నిలిచారు. రెడ్‌బుల్‌ తరఫున తొలిసారి ప్రధాన డ్రైవర్‌గా వ్యవహరించిన జపాన్‌కు చెందిన యుకీ సునోడా 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

గత సీజన్‌లో ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టి ఆ తర్వాత వెనుకబడిపోయిన వెర్‌స్టాపెన్‌కు ఈ ఏడాది తొలి రెండు రేసుల్లో మెక్‌లారెన్‌ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. దాంతో వెర్‌స్టాపెన్‌ ఆ్రస్టేలియా గ్రాండ్‌ప్రిలో రెండో స్థానంలో, చైనా గ్రాండ్‌ప్రిలో నాలుగో స్థానంలో నిలిచాడు. కానీ గత నాలుగేళ్లు ఫార్ములావన్‌లో ఓవరాల్‌ టైటిల్‌ సాధించిన వెర్‌స్టాపెన్‌ మూడో రేసులో మాత్రం వెనుకంజ వేయలేదు. 

‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన అతను దూసుకుపోయాడు. ఒక్కసారి వెర్‌స్టాపెన్‌ ఆధిక్యంలోకి వెళితే అతడిని ఓవర్‌టేక్‌ చేయడం కష్టంతో కూడుకున్నదని మెక్‌లారెన్‌ డ్రైవర్లకు తెలుసు. జపాన్‌ గ్రాండ్‌ప్రిలో అదే జరిగింది. మొదట్లోనే ఆధిక్యంలోకి వెళ్లిన వెర్‌స్టాపెన్‌ చివరి ల్యాప్‌ వరకు ఆధిక్యంలో కొనసాగి రెండు సెకన్ల తేడాతో విజేతగా నిలిచాడు.  

పాయింట్‌ తేడానే... 
24 రేసులతో కూడిన తాజా సీజన్‌లో మూడు రేసులు ముగిశాక లాండో నోరిస్‌ 62 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 61 పాయింట్లతో వెర్‌స్టాపెన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య తేడా ఒక్క పాయింట్‌ మాత్రమే ఉండటం గమనార్హం. సీజన్‌లోని తదుపరి రేసు బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 13న జరుగుతుంది.  

64 ఫార్ములావన్‌ చరిత్రలో వెర్‌స్టాపెన్‌ సాధించిన విజయాలు. అత్యధిక రేసుల్లో గెలిచిన డ్రైవర్ల జాబితాలో వెర్‌స్టాపెన్‌ మూడో స్థానంలో ఉన్నాడు. లూయిస్‌ హామిల్టన్‌ (105), మైకేల్‌ షుమాకర్‌ (91) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 

4 రెండు వేర్వేరు గ్రాండ్‌ప్రి రేసులను వరుసగా నాలుగేళ్ల పాటు సాధించిన నాలుగో డ్రైవర్‌గా వెర్‌స్టాపెన్‌ గుర్తింపు పొందాడు. వెర్‌స్టాపెన్‌ అబుదాబి (2020, 2021, 2022, 2023), జపాన్‌ గ్రాండ్‌ప్రి (2022, 2023, 2024, 2025) రేసులలో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో జిమ్‌ క్లార్క్‌ (బెల్జియం గ్రాండ్‌ప్రి; బ్రిటన్‌ గ్రాండ్‌ప్రి 1962–1965), మైకేల్‌ షుమాకర్‌ (స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి 2001–2004; యూఎస్‌ఏ గ్రాండ్‌ప్రి 2003–2005), లూయిస్‌ హామిల్టన్‌ (బ్రిటన్‌ గ్రాండ్‌ప్రి 2001–2004; యూఎస్‌ఏ గ్రాండ్‌ప్రి 2014–2017) కూడా ఉన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement