17వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టి అగ్రస్థానం సొంతం
ఎనిమిదో విజయంతో ప్రపంచ టైటిల్‌కు చేరువైన రెడ్‌బుల్ డ్రైవర్
సావోపాలో (బ్రెజిల్): వరుసగా నాలుగో ఏడాది ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకునే దిశగా రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ మరో అడుగు వేశాడు. సీజన్‌లోని 21వ రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ రేసులో 27 ఏళ్ల వెర్‌స్టాపెన్ ఊహకందని రీతిలో ఫలితాన్ని రాబట్టాడు. ఎక్కడో 17వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన వెర్‌స్టాపెన్... అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో డ్రైవర్‌ను దాటుకుంటూ చివరకు అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
ఈ సీజన్‌లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేశాడు. నిర్ణీత 69 ల్యాప్‌లను వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 2 గంటల 6 నిమిషాల 54.430 సెకన్లలో పూర్తి చేసి విజేతగా అవతరించాడు. 10 జట్ల నుంచి మొత్తం 20 మంది డ్రైవర్లు పోటీపడగా... ఐదుగురు డ్రైవర్లు రేసును పూర్తి చేయడంలో విఫలమయ్యారు. అలెగ్జాండర్ అల్బోన్ (విలియమ్స్ రేసింగ్), లాన్స్ స్ట్రోల్ (ఆస్టన్ మార్టిన్ అరామ్‌కో) తొలి ల్యాప్‌లోనే వెనుదిరగ్గా... 30వ ల్యాప్‌లో ఫ్రాంకో కొలాపింటో (విలియమ్స్ రేసింగ్), 38వ ల్యాప్‌లో కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) రేసు నుంచి తప్పుకున్నారు.
మనీగ్రామ్ హాస్ జట్టు డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్‌పై రేసు నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. 27వ ల్యాప్‌లో హుల్కెన్‌బర్గ్ స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయి ట్రాక్ బయటికి వచ్చాడు. అనంతరం హుల్కెన్‌బర్గ్ మార్షల్ సహకారంతో మళ్లీ ట్రాక్‌పైకి వచ్చాడు. ఇది నిబంధనలకు వ్యతిరేకం కావడంతో హుల్కెన్‌బర్గ్‌ను రేసు నిర్వాహకులు డిస్‌క్వాలిఫై చేశారు. 21 రేసుల అనంతరం డ్రైవర్స్ పాయింట్ల పట్టికలో వెర్‌స్టాపెన్ 393 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... మెక్‌లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్ 331 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు.
ఈ సీజన్‌లో మరో మూడు రేసులు (లాస్ వేగస్ గ్రాండ్‌ప్రి; నవంబర్ 24న... ఖతర్ గ్రాండ్‌ప్రి; డిసెంబర్ 1న... అబుదాబి గ్రాండ్‌ప్రి; డిసెంబర్ 8న) మిగిలి ఉన్నాయి. ఈ మూడు రేసుల్లో ఒక దాంట్లోనైనా వెర్‌స్టాపెన్ గెలిస్తే వరుసగా నాలుగో ఏడాది అతనికే ప్రపంచ చాంపియన్íÙప్ టైటిల్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment