Red bull team driver
-
Canadian Grand Prix 2024: వెర్స్టాపెన్ ‘హ్యాట్రిక్’
మాంట్రియల్: ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించకపోయినా... అందివచి్చన అవకాశాలను సది్వనియోగం చేసుకున్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఈ సీజన్లో తన ఖాతాలో ఆరో విజయం జమ చేసుకున్నాడు. కెనడా గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెండో స్థానం నుంచి ప్రారంభించిన వెర్స్టాపెన్ నిర్ణీత 70 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 45 నిమిషాల 47.927 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. వరుసగా మూడో ఏడాది కెనడా గ్రాండ్‌ప్రిలో టైటిల్ నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన వెర్స్టాపెన్ కెరీర్లో ఓవరాల్‌గా 60వ విజయం సాధించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన జార్జి రసెల్ (మెర్సిడెస్) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. లాండో నోరిస్ (మెక్లారెన్) రెండో స్థానంలో నిలువగా... లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఐదుగురు డ్రైవర్లు కార్లోస్ సెయింజ్ (ఫెరారీ), అలెగ్జాండర్ అల్బోన్ (విలియమ్స్), సెర్జియో పెరెజ్ (రెడ్‌బుల్), చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ), లొగాన్ సార్జెంట్ (విలియమ్స్) రేసును ముగించలేకపోయారు. 24 రేసుల ఈ సీజన్లో ఇప్పటికి తొమ్మిది రేసులు ముగిశాయి. ఆరు రేసుల్లో నెగ్గిన వెర్స్టాపెన్ 194 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని పదో రేసు స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 23న బార్సిలోనాలో జరుగుతుంది. -
2024 Japanese Grand Prix: వెర్‌స్టాపెన్‌కు మూడో విజయం
సుజుకా (జపాన్): జపాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ రేసును వెర్స్టాపెన్ ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించాడు. నిరీ్ణత 53 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 54 నిమిషాల 23.566 సెకన్లలో పూర్తి చేసి ఈ నెదర్లాండ్స్ డ్రైవర్ అగ్రస్థానాన్ని దక్కించుకొని కెరీర్లో 57వ టైటిల్‌ను సాధించాడు. ఈ సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది మూడో విజయంకాగా... జపాన్ గ్రాండ్‌ప్రిలో వరుసగా మూడో గెలుపు కావడం విశేషం. రెడ్‌బుల్ జట్టుకే చెందిన సెర్జియో పెరెజ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో నాలుగు రేసుల తర్వాత వెర్స్టాపెన్ 77 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... 64 పాయింట్లతో పెరెజ్ రెండో స్థానంలో, 59 పాయింట్లతో లెక్లెర్క్(ఫెరారీ) మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని ఐదో రేసు చైనా గ్రాండ్‌ప్రి ఈనెల 21న జరుగుతుంది. -
విజయంతో వెర్స్టాపెన్ ముగింపు
అబుదాబి: ఫార్ములావన్–2023 సీజన్‌ను ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ విజయంతో ముగించాడు. చివరిదైన 22వ రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలోనూ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో వెర్స్టాపెన్ రికార్డుస్థాయిలో 19 రేసుల్లో నెగ్గాడు. మరో రెండు రేసుల్లో పెరెజ్ (రెడ్‌బుల్), కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) ఒక రేసులో నెగ్గారు. అబుదాబి గ్రాండ్‌ప్రిని ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన వెర్స్టాపెన్ నిర్ణీత 58 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంట 27 నిమిషాల 02.624 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. కెరీర్లో 54వ గెలుపుతో వెర్స్టాపెన్ ఫార్ములావన్ చరిత్రలో అత్యధిక విజయాలు అందుకున్న డ్రైవర్ల జాబితాలో వెటెల్ (53)ను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు. హామిల్టన్ (103), షుమాకర్ (91) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
వెర్స్టాపెన్ ‘హ్యాట్రిక్’
దోహా: వేదిక మారినా ఫలితం మారలేదు. ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ 14వ విజయం నమోదు చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఖతర్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ చాంపియన్‌గా నిలిచాడు. నిరీ్ణత 57 ల్యాప్‌లను వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ఒక గంటా 27 నిమిషాల 39.168 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్కార్ పియస్ట్రీ (మెక్లారెన్) రెండో స్థానంలో, లాండో నోరిస్ (మెక్లారెన్) మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్), కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) తొలి ల్యాప్‌లోనే వెనుదిరిగారు. ఈ ఫలితంతో వెర్స్టాపెన్ ఈ సీజన్లో మరో ఐదు రేసులు మిగిలి ఉండగానే 433 పాయింట్లతో ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్íÙప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 22 రేసుల ఈ సీజన్లో ఇప్పటి వరకు 17 రేసులు ముగిశాయి. ఇందులో 14 రేసుల్లో వెర్స్టాపెన్, రెండు రేసుల్లో పెరెజ్ (రెడ్‌బుల్), మరో రేసులో కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) గెలిచారు. 2021, 2022లలో కూడా వెర్స్టాపెన్ ప్రపంచ చాంపియన్íÙప్ టైటిల్‌ను సాధించాడు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు యూఎస్ఎ గ్రాండ్‌ప్రి ఈనెల 22న జరుగుతుంది. -
వెర్‌స్టాపెన్‌కు ‘పోల్’
సుజుకా (జపాన్): ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో ఎదురులేని రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తొమ్మిదోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 28.877 సెకన్లలో ముగించాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును వెర్స్టాపెన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 15 రేసులు జరగ్గా, రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లు వరుసగా 14 రేసుల్లో విజేతలుగా నిలిచారు. వెర్స్టాపెన్ 12 రేసుల్లో, పెరెజ్ రెండు రేసుల్లో గెలిచారు. గతవారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ చాంపియన్‌గా నిలిచి రెడ్‌బుల్ జట్టు జైత్రయాత్రకు అడ్డుకట్ట వేశాడు. -
వారెవ్వా వెర్స్టాపెన్
మోంజా (ఇటలీ): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో ఒకే సీజన్లో అత్యధికంగా 10 వరుస విజయాలు సాధించిన డ్రైవర్‌గా వెర్స్టాపెన్ గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రిలో రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన వెర్స్టాపెన్ నిర్ణీత 51 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంట 13 నిమిషాల 41.143 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానం దక్కించుకున్నాడు. పెరెజ్ రెండో స్థానంలో, సెయింజ్ మూడో స్థానంలో నిలిచారు. ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టగా... 15వ ల్యాప్‌లో సెయింజ్ను వెర్స్టాపెన్ ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత వెర్స్టాపెన్ను ఎవరూ అందుకోలేకపోయారు. దాంతో వెర్స్టాపెన్ ఖాతాలో ఈ సీజన్లో ఓవరాల్‌గా 12వ విజయం... వరుసగా 10వ విజయంతో కొత్త చరిత్ర నమోదైంది. 2013లో సెబాస్టియన్ వెటెల్ వరుసగా 9 రేసుల్లో గెలిచాడు. వెటెల్ రికార్డును 25 ఏళ్ల వెర్స్టాపెన్ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా ఈ సీజన్లో జరిగిన 14 రేసుల్లోనూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లే గెలుపొందడం విశేషం. వెర్స్టాపెన్ 12 రేసుల్లో నెగ్గగా... రెడ్‌బుల్ జట్టుకే చెందిన మరో డ్రైవర్ సెర్జియో పెరెజ్ రెండు రేసుల్లో గెలిచాడు. 22 రేసుల ఈ సీజన్లో ప్రస్తుతం వెర్స్టాపెన్ 364 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 17న జరుగుతుంది. -
వెర్స్టాపెన్ జోరు
బుడాపెస్ట్: ఫార్ములావన్ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ వరుసగా ఏడో విజయాన్ని, ఓవరాల్‌గా తొమ్మిదో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ నిర్ణీత 70 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 38 నిమిషాల 08.634 సెకన్లలో పూర్తి చేసి గెలుపొందాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్‌ను వెర్స్టాపెన్ తొలి ల్యాప్ మలుపు వద్ద ఓవర్టేక్ చేసి వెనుదిరిగి చూడలేదు. ఈ గెలుపుతో ఫార్ములావన్ చరిత్రలో వరుసగా 12 రేసుల్లో నెగ్గిన తొలి జట్టుగా రెడ్‌బుల్ గుర్తింపు పొందింది. 1988లో మెక్లారెన్ జట్టు వరుసగా 11 రేసుల్లో గెలిచింది. -
వెర్స్టాపెన్ ఖాతాలో ఎనిమిదో విజయం
ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఎనిమిదో విజయం నమోదు చేశాడు. బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 70 ల్యాప్‌ల రేసును వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 39 నిమిషాల 35.912 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో... ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన జార్జి రసెల్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. -
French Grand Prix: వెర్‌స్టాపెన్‌కు ఏడో విజయం
లె కాసెలెట్ (ఫ్రాన్స్): ఈ సీజన్లో తన అద్భుత ఫామ్ కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తన ఖాతాలో ఏడో విజయాన్ని జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. నిర్ణీత 53 ల్యాప్‌లను వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 30ని:02.112 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన లెక్లెర్క్ (ఫెరారీ) 18వ ల్యాప్‌లో నియంత్రణ కోల్పోయి గోడను ఢీకొట్టి రేసు నుంచి నిష్క్రమించాడు. కెరీర్లో 300వ గ్రాండ్‌ప్రి రేసులో పాల్గొన్న మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానాన్ని పొందగా... జార్జి రసెల్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచాడు. సీజన్లో 12 రేసులు ముగిశాక వెర్స్టాపెన్ 233 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 31న జరుగుతుంది. -
విజేత వెర్స్టాపెన్
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) 2020–సీజన్ ముగింపు రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. యాస్ మరీనా సర్క్యూట్లో ఆదివారం జరిగిన అబుదాబి గ్రాండ్‌ప్రిలో నిర్ణీత 55 ల్యాప్‌లను వెర్స్టాపెన్ అందరికంటే ముందుగా గంటా 36 నిమిషాల 28.645 సెకన్లలో ముగించి ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన 23 ఏళ్ల వెర్‌స్టాపెన్‌కు ఏదశలోనూ ఇతర డ్రైవర్ల నుంచి పోటీ ఎదురుకాలేదు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు బొటాస్ రెండో స్థానంలో... హామిల్టన్ మూడో స్థానంలో నిలిచారు. గతవారం సాఖిర్ గ్రాండ్‌ప్రి విజేత సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్–ఆర్పీ) ఎనిమిదో ల్యాప్‌లోనే రేసు నుంచి తప్పుకున్నాడు. కరోనా కారణంగా ఈ సీజన్లో 22 రేసులకు బదులుగా 17 రేసులను మాత్రమే నిర్వహించారు. 11 రేసుల్లో గెలుపొందిన హామిల్టన్ (మెర్సిడెస్) 347 పాయింట్లతో ఓవరాల్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఏడోసారి సొంతం చేసుకొని దిగ్గజ డ్రైవర్ మైకేల్ షుమాకర్ (జర్మనీ) రికార్డును సమం చేశాడు. బొటాస్, వెర్స్టాపెన్ రెండేసి రేసుల్లో నెగ్గగా... పెరెజ్, పియరీగ్యాస్లీ ఒక్కో రేసులో గెలిచారు. 573 పాయింట్లతో టీమ్ కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ కూడా మెర్సిడెస్ జట్టుకే లభించింది. -
వెటెల్ ‘సిక్సర్’
లాంఛనం ముగిసింది. ఊహించిన ఫలితమే వచ్చింది. ఈ సీజన్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఇండియన్ గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచాడు. మూడో ఏడాదీ ఈ టైటిల్ నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. ఈ క్రమంలో వెటెల్ వరుసగా నాలుగో ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో ఆరో విజయంతో ‘డబుల్ హ్యాట్రిక్’ సాధించాడు. అంతేకాకుండా కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో రెడ్‌బుల్ జట్టును వరుసగా నాలుగో ఏడాది విజేతగా నిలిపాడు. గ్రేటర్ నోయిడా: అదే జోరు... అదే వేగం... సర్క్యూట్ మారినా.. తన దూకుడు తగ్గించకుండా రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ దూసుకుపోతున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో... క్వాలిఫయింగ్ సెషన్లో ఆధిపత్యం చలాయించిన 26 ఏళ్ల ఈ జర్మన్ డ్రైవర్ ప్రధాన రేసులోనూ హల్చల్ చేశాడు. ఆద్యంతం ఆధిక్యం కనబరుస్తూ ఇండియన్ గ్రాండ్‌ప్రిలో వరుసగా మూడో ఏడాది చాంపియన్‌గా అవతరించాడు. బుద్ధ అంతర్జాతీయ సర్క్యూట్లో ఆదివారం జరిగిన 60 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 31 నిమిషాల 12.187 సెకన్లలో పూర్తి చేశాడు. 2011, 2012లలో కూడా ఇండియన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన వెటెల్‌కు ఈ సీజన్లో వరుసగా ఆరో విజయం... ఓవరాల్‌గా 10వ గెలుపు కావడం విశేషం. ఈ రేసుకు ముందు వెటెల్... బెల్జియం, ఇటలీ, సింగపూర్, కొరియా, జపాన్ గ్రాండ్‌ప్రిలలో కూడా అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ రేసులో రెడ్‌బుల్ జట్టుకే చెందిన మార్క్ వెబెర్ 39వ ల్యాప్‌లో వైదొలిగినా... వెటెల్ ప్రదర్శనతో రెడ్‌బుల్ జట్టుకు వరుసగా నాలుగో ఏడాది కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ కూడా దక్కింది. తాజా విజయంతో వెటెల్ ఈ సీజన్లో మరో మూడు రేసులు మిగిలి ఉండగానే అధికారికంగా డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. 2010, 2011, 2012లలో కూడా వెటెల్ డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఒకే సీజన్లో వరుసగా 6 అంతకంటే ఎక్కువ విజయాలు నమోదు చేసిన నాలుగో డ్రైవర్‌గా వెటెల్ గుర్తింపు పొందాడు. గతంలో అస్కారి (వరుసగా 9 రేసులు), షుమాకర్, జిమ్ క్లార్క్ (7 రేసులు) ఈ ఘనత సాధించారు. ఈ సీజన్లో 19 రేసులకుగాను 16 రేసులు పూర్తయ్యాయి. వెటెల్ 10 రేసుల్లో విజయం సాధించి మొత్తం 322 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 207 పాయింట్లతో అలోన్సో రెండో స్థానంలో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి నవంబరు 3న జరుగుతుంది. ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా టాప్-5లో నిలిస్తే వరుసగా నాలుగో ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమయ్యే పరిస్థితిలో బరిలోకి దిగిన వెటెల్ కేవలం విజయమే లక్ష్యంగా దూసుకుపోయాడు. రెండో స్థానంలో నిలిచిన రోస్బర్గ్కు వెటెల్‌కు మధ్య 29 సెకన్ల తేడా ఉండటం ఈ రేసులో వెటెల్ ఆధిపత్యానికి నిదర్శనం. లోటస్ జట్టు డ్రైవర్ రొమైన్ గ్రోస్యెన్ మూడో స్థానంలో నిలువగా... మసా (ఫెరారీ), పెరెజ్ (మెక్లారెన్) వరుసగా నాలుగైదు స్థానాలతో సరిపెట్టుకున్నారు. ప్రపంచ మాజీ చాంపియన్ ఫెర్నాండో అలోన్సో (ఫెరారీ) 11వ స్థానంతో సంతృప్తి పడటంతో అతనికి ఒక్క పాయింట్ కూడా దక్కలేదు. భారత్‌కు చెందిన ‘సహారా ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు కలిసి వచ్చింది. ఆ జట్టు ఇద్దరు డ్రైవర్లు టాప్-10లో నిలిచి తమ ఖాతాలో పాయింట్లు వేసుకున్నారు. పాల్ డి రెస్టా ఎనిమిదో స్థానంలో... అడ్రియన్ సుటిల్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. మార్క్ వెబెర్ (రెడ్‌బుల్) 39వ ల్యాప్‌లో రేసు నుంచి వైదొలగగా... కాటర్‌హమ్ జట్టు డ్రైవర్లు చార్లెస్ పిక్ 35వ ల్యాప్‌లో... గియెడో గార్డె తొలి ల్యాప్‌లోనే రేసు నుంచి తప్పుకున్నారు.