వెటెల్ ‘సిక్సర్’ | Winning world title in India special, says Sebastian Vettel | Sakshi
Sakshi News home page

వెటెల్ ‘సిక్సర్’

Published Mon, Oct 28 2013 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

వెటెల్ ‘సిక్సర్’

వెటెల్ ‘సిక్సర్’

లాంఛనం ముగిసింది. ఊహించిన ఫలితమే వచ్చింది. ఈ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఇండియన్ గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచాడు. మూడో ఏడాదీ ఈ టైటిల్ నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. ఈ క్రమంలో వెటెల్ వరుసగా నాలుగో ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఆరో విజయంతో ‘డబుల్ హ్యాట్రిక్’ సాధించాడు. అంతేకాకుండా కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో రెడ్‌బుల్ జట్టును వరుసగా నాలుగో ఏడాది విజేతగా నిలిపాడు.
 
 గ్రేటర్ నోయిడా: అదే జోరు... అదే వేగం... సర్క్యూట్ మారినా.. తన దూకుడు తగ్గించకుండా రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ దూసుకుపోతున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో... క్వాలిఫయింగ్ సెషన్‌లో ఆధిపత్యం చలాయించిన 26 ఏళ్ల ఈ జర్మన్ డ్రైవర్ ప్రధాన రేసులోనూ హల్‌చల్ చేశాడు. ఆద్యంతం ఆధిక్యం కనబరుస్తూ ఇండియన్ గ్రాండ్‌ప్రిలో వరుసగా మూడో ఏడాది చాంపియన్‌గా అవతరించాడు. బుద్ధ అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఆదివారం జరిగిన 60 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 31 నిమిషాల 12.187 సెకన్లలో పూర్తి చేశాడు.
 
 
 2011, 2012లలో కూడా ఇండియన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన వెటెల్‌కు ఈ సీజన్‌లో వరుసగా ఆరో విజయం... ఓవరాల్‌గా 10వ గెలుపు కావడం విశేషం. ఈ రేసుకు ముందు వెటెల్... బెల్జియం, ఇటలీ, సింగపూర్, కొరియా, జపాన్ గ్రాండ్‌ప్రిలలో కూడా అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ రేసులో రెడ్‌బుల్ జట్టుకే చెందిన మార్క్ వెబెర్ 39వ ల్యాప్‌లో వైదొలిగినా... వెటెల్ ప్రదర్శనతో రెడ్‌బుల్ జట్టుకు వరుసగా నాలుగో ఏడాది కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ కూడా దక్కింది.
 
 తాజా విజయంతో వెటెల్ ఈ సీజన్‌లో మరో మూడు రేసులు మిగిలి ఉండగానే అధికారికంగా డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. 2010, 2011, 2012లలో కూడా వెటెల్ డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఒకే సీజన్‌లో వరుసగా 6 అంతకంటే ఎక్కువ విజయాలు నమోదు చేసిన నాలుగో డ్రైవర్‌గా వెటెల్ గుర్తింపు పొందాడు. గతంలో అస్కారి (వరుసగా 9 రేసులు), షుమాకర్, జిమ్ క్లార్క్ (7 రేసులు)  ఈ ఘనత సాధించారు.
 ఈ సీజన్‌లో 19 రేసులకుగాను 16 రేసులు పూర్తయ్యాయి. వెటెల్ 10 రేసుల్లో విజయం సాధించి మొత్తం 322 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 207 పాయింట్లతో అలోన్సో రెండో స్థానంలో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి నవంబరు 3న జరుగుతుంది.
 
 ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా టాప్-5లో నిలిస్తే వరుసగా నాలుగో ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమయ్యే పరిస్థితిలో బరిలోకి దిగిన వెటెల్ కేవలం విజయమే లక్ష్యంగా దూసుకుపోయాడు. రెండో స్థానంలో నిలిచిన రోస్‌బర్గ్‌కు వెటెల్‌కు మధ్య 29 సెకన్ల తేడా ఉండటం ఈ రేసులో వెటెల్ ఆధిపత్యానికి నిదర్శనం. లోటస్ జట్టు డ్రైవర్ రొమైన్ గ్రోస్యెన్ మూడో స్థానంలో నిలువగా... మసా (ఫెరారీ), పెరెజ్ (మెక్‌లారెన్) వరుసగా నాలుగైదు స్థానాలతో సరిపెట్టుకున్నారు. ప్రపంచ మాజీ చాంపియన్ ఫెర్నాండో అలోన్సో (ఫెరారీ) 11వ స్థానంతో సంతృప్తి పడటంతో అతనికి ఒక్క పాయింట్ కూడా దక్కలేదు.
 
 భారత్‌కు చెందిన ‘సహారా ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు కలిసి వచ్చింది. ఆ జట్టు ఇద్దరు డ్రైవర్లు టాప్-10లో నిలిచి తమ ఖాతాలో పాయింట్లు వేసుకున్నారు. పాల్ డి రెస్టా ఎనిమిదో స్థానంలో... అడ్రియన్ సుటిల్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. మార్క్ వెబెర్ (రెడ్‌బుల్) 39వ ల్యాప్‌లో రేసు నుంచి వైదొలగగా... కాటర్‌హమ్ జట్టు డ్రైవర్లు చార్లెస్ పిక్ 35వ ల్యాప్‌లో... గియెడో గార్డె తొలి ల్యాప్‌లోనే రేసు నుంచి తప్పుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement