Sebastian Vettel
-
ఫార్ములావన్ దిగ్గజం అనూహ్య నిర్ణయం..
ఫార్ములావన్ దిగ్గజం.. నాలుగుసార్లు చాంపియన్ జర్మనీ రేసర్ సెబాస్టియన్ వెటెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2022 సీజన్ అనంతరం ఫార్ములావన్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు గురువారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. అయితే సెబాస్టియన్ వెటెల్ అనూహ్య నిర్ణయం వెనుక ఒక కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన ఆస్ట్రియా గ్రాండ్ ప్రి సందర్భంగా రేసింగ్ స్టీవర్డ్స్తో గొడవ పడ్డాడు. ప్రస్తుతం ఎఫ్ 1 రేసింగ్ మునపటిలా లేదనే భావనను వ్యక్తం చేశాడు. అందుకే ఇలా అనూహ్య రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెబాస్టియన్ వెటెల్ ఆస్టన్ మార్టిన్ జట్టు తరఫున 2022 ఫార్ములా వన్ సీజన్ లో రేసింగ్ చేస్తున్నాడు. 2007లో బీఎండబ్ల్యూ తరఫున సెబాస్టియన్ వెటెల్ ఫార్ములా వన్ లో అరంగేట్రం చేశాడు. 2008లో రెడ్ బుల్ సిస్టర్ టీం అయిన టొరొ రాసో (ఇప్పటి ఆల్ఫా టారీ) తరఫున బరిలోకి దిగాడు. మిడ్ ఫీల్డ్ టీం అయిన టొరొ రాసో తరఫున 2008లో జరిగిన ఇటాలియన్ గ్రాండ్ ప్రిలో విజయం సాధించి సంచలనం నమోదు చేశాడు. అనంతరం 2009 నుంచి 2014 వరకు రెడ్ బుల్ తరఫున రేసింగ్ చేశాడు. ఈ క్రమంలో వరుసగా 2010, 2011, 2012, 2013లలో ఫార్ములా వన్ డ్రైవర్ చాంపియన్‌గా నిలిచాడు. 2010, 2012లో ఫెరారీ డ్రైవర్ ఫెర్నాండో అలొన్సో నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నా.. 2011, 2013 ఫార్ములా వన్ సీజన్ లలో అలవోకగా చాంపియన్ షిప్ ను సొంతం చేసుకున్నాడు. భారత్ వేదికగా ఇండియన్ గ్రాండ్ ప్రి మూడు ( 2011, 2012, 2013) పర్యాయాలు జరగ్గా.. ఆ మూడు సార్లు కూడా వెటెల్ విజేతగా నిలువడం విశేషం. అనంతరం 2015లో ఫెరారీకి మారిన అతడు ఆ ఏడాది నుంచి 2020 వరకు ఆ జట్టుతోనే కొనసాగాడు. 2021 నుంచి ఆస్టన్ మార్టిన్ తరఫున రేసింగ్ లో పాల్గొంటున్నాడు. సెబాస్టియన్ తన కెరీర్ లో ఇప్పటి వరకు 290 రేసుల్లో 53 విజయాలు సాధించాడు. మరో 57 సార్లు పోల్ పొజిషన్ ను అందుకున్నాడు. NEWS: Sebastian Vettel will retire from #F1 at the end of the 2022 season, bringing one of the greatest careers in the history of the sport to a close. Read more from Sebastian, Lawrence Stroll and Mike Krack. ⬇️ — Aston Martin Aramco Cognizant F1 Team (@AstonMartinF1) July 28, 2022 చదవండి: చెస్ ఒలంపియాడ్‌ను ప్రారంభించిన మోదీ.. తమిళ తంబిలా పంచకట్టులో..! -
జీపీఎస్ పెట్టినా వదల్లేదు.. ఫార్ములావన్ స్టార్‌కు చేదు అనుభవం
నాలుగుసార్లు ఫార్ములావన్ చాంపియన్ విజేత.. ఆస్టన్ మార్టిన్ ఎఫ్1 డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు చేదు అనుభవం ఎదురైంది. వెటెల్ బ్యాగును దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగలు ఎత్తుకెళ్లిన బ్యాగును వెటెల్ జీపీఎస్ ట్రాకర్ ద్వారా కనుక్కోవాలనుకున్నప్పటికి ఫలితం లేకుండా పోయింది. విషయంలోకి వెళితే.. స్పానిష్ గ్రాండ్ప్రిక్స్ ముగించుకొని బార్సిలోనాకు చేరుకున్న సెబాస్టియన్ వెటెల్ ఒకరోజు అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాడు. తన కారును హోటల్ ముందు పార్క్ చేసి లోనికి వెళ్లాడు. పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన వెటెల్‌కు కారులో బ్యాగు కనిపించలేదు. దీంతో దొంగలు ఎత్తుకెళ్లారని భావించిన వెటెల్.. బ్యాగులో తన ఐ ఫోన్ ఎయిర్ పాడ్స్‌కు జీపీఎస్ ట్రాకర్ ఉన్నట్లు గుర్తొచ్చింది. వెంటనే తన ఐ-ఫోన్లో జీపీఎస్ ఆన్ చేశాడు. జీపీఎస్ లొకేషన్ ఆధారంగా తన కారులోనే బయల్దేరిన వెటెల్ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దారి మధ్యలోనే సదరు దొంగలు తన ఐ ఫోన్ ఎయిర్ పాడ్స్ పడేయడంతో జీపీఎస్ అక్కడే ఆగిపోయింది. దీంతో వెటెల్ తన బ్యాగు జాడను తెలుసులేకపోయాడు. కాగా ఈ ఏడాది వెటెల్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తాజాగా ముగిసిన స్పానిష్ గ్రాండ్ప్రిక్స్ను వెటెల్ 11వ పొజిషన్‌తో ముగించాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 66 ల్యాప్‌ల రేసును వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 37 నిమిషాల 20.475 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో 27వ ల్యాప్‌లో వైదొలిగాడు. చదవండి: ICC: అంపైరింగ్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం Spanish Grand Prix: వెర్స్టాపెన్ ఖాతాలో నాలుగో విజయం -
'పనికిమాలిన చర్య.. రష్యాకు రేసింగ్‌కు వెళితే చెప్పుతో కొట్టుకున్నట్లే'
Ukraine-Russia: రష్యా- ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం సంక్షోభం ప్రపంచాన్ని కలవరపెడుతుంది. రష్యా అమానుష దాడిని ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. యుద్ధం మంచి పద్దతి కాదని.. వెంటనే ఆపేయాలని మొత్తుకుంటున్నా రష్యా వెనకడుగు వేయడం లేదు. పైగా తమ జోలికి వస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తమను టార్గెట్ చేసిన దేశాలకు రష్యా పరోక్షంగా హెచ్చరికలు పంపింది. రష్యా దుందుడుకు వైఖరిపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం క్రీడలకు కూడా పాకింది. రష్యాలో జరిగే ఏ క్రీడైనా సరే తాము ఆడబోయేది లేదని పలువురు ఆటగాళ్లు పేర్కొంటున్నారు. ఫార్ములావన్ డ్రైవర్.. సూపర్ స్టార్ సెబాస్టియన్ వెటెల్ ఇదే విషయాన్ని పేర్కొన్నాడు. నాలుగుసార్లు చాంపియన్ అయిన వెటెల్ రష్యాలో జరగబోయే ఎఫ్ 1 రేసును బహిష్కరిస్తున్నట్లు తెలిపాడు. ఫార్ములా వన్ 2022 ప్రీ టెస్టింగ్ సీజన్ కోసం ప్రస్తుతం బార్సిలోనాలో ఉన్న వెటెల్ తాను రష్యా జీపీలో పాల్గొనేది లేదని స్పష్టం చేశాడు. ''నేను ఈరోజు ఉదయం లేచేసరికి ఒక వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. ఉక్రెయిన్‌పై దాడి చేస్తూ రష్యా అమానుషంగా ప్రవర్తిస్తోంది. ఒక సిల్లీ కారణంతో అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం ఉపేక్షించేది కాదు. అందుకే ఒకసారి నేను పాల్గొనబోయే రేసింగ్ క్యాలెండర్‌ను చూసుకున్నా. అందులో రష్యా కూడా ఉంది. రష్యాలో జరిగే రేసింగ్‌లో పాల్గొనకూడదని ఇప్పుడే నిర్ణయించుకున్నా. ఆ దేశంలో రేసింగ్‌కు వెళితే నా చెప్పుతో నేను కొట్టుకున్నట్లే. అందుకే రష్యాకు వెళ్లను గాక వెళ్లను..'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Formula One: 'ఫార్ములావన్‌ను యువతులు ఎగబడి చూస్తున్నారు.. ఆటపై ఇష్టంతో కాదు' Russia vs Ukraine: బాహుబలితో తలపడగలదా? -
ఫెరారీని వీడనున్న వెటెల్
పారిస్: నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఫార్ములావన్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈ ఏడాది ఫెరారీ జట్టును వీడనున్నాడు. ‘మేం కలిసి పనిచేయడానికి ఇకపై అవకాశం లేదు. ఫెరారీతో నా బంధం ఈ ఏడాదితో ముగియనుంది. నేను, ఫెరారీ ఎఫ్1 టీమ్ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది’ అని వెటెల్ పేర్కొన్నాడు. ఎన్నో అంచనాల నడుమ 2015లో ఫెరారీతో జతకట్టిన వెటెల్... మరో ‘మైకేల్ çషుమాకర్ (జర్మనీ)–ఫెరారీ’ బంధంలా ఎఫ్1ను శాసిస్తుందని అందరూ ఊహించారు. అయితే వెటెల్– ఫెరారీ ద్వయం ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఫెరారీ డ్రైవర్‌గా ఇప్పటి వరకు వెటెల్ 103 రేసుల్లో పాల్గొనగా కేవలం 14 రేసుల్లో మాత్రమే విజేతగా నిలిచాడు. 2017, 2018 సీజన్లో డ్రైవర్ ప్రపంచ చాంపియన్ రన్నరప్‌గా నిలిచాడు. -
22 రేసుల తర్వాత...
సింగపూర్: నాలుగుసార్లు ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ అయిన సెబాస్టియన్ వెటెల్ టైటిల్ నిరీక్షణకు తెరపడింది. ఏకంగా 22 రేసుల అనంతరం తన ఖాతాలో తొలి విజయాన్ని జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన 61 ల్యాప్‌ల సింగపూర్ గ్రాండ్‌ప్రిని మూడో స్థానం నుంచి ప్రారంభించిన వెటెల్... గంటా 58 నిమిషాల 33.667 సెకన్లలో అందరికంటే ముందుగా గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) రెండో స్థానాన్ని... రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానాన్ని పొందారు. పోల్ పొజిషన్ హీరో లెక్లెర్క్ను 21వ ల్యాప్‌లో అండర్కట్ ద్వారా అధిగమించిన వెటెల్ చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకొని రేసును నెగ్గాడు. లెక్లెర్క్కు హ్యాట్రిక్ విజయం దక్కకపోయినా... అతని జట్టు ఫెరారీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. పిట్ స్టాప్ వ్యూహంలో తడబడిన మెర్సిడెస్ డ్రైవర్లు హామిల్టన్, బొటాస్లు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి ఈ నెల 29న జరుగుతుంది. -
రైకోనెన్ రికార్డు
మోంజా (ఇటలీ): ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ ఫార్ములావన్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. అత్యంత వేగంగా ల్యాప్‌ను పూర్తి చేసిన డ్రైవర్‌గా గుర్తింపు పొందాడు. ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రైకోనెన్ ఒక నిమిషం 19.119 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఈ క్రమంలో 2004లో విలియమ్స్ జట్టు డ్రైవర్ మోంటాయా (1ని:19.525 సెకన్లు) నెలకొల్పిన రికార్డును రైకోనెన్ బద్దలు కొట్టాడు. ఫెరారీకే చెందిన వెటెల్ రెండో స్థానంలో నిలువగా... మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు హామిల్టన్, బొటాస్ మూడు, నాలుగు స్థానాలతో రేసును ఆరంభిస్తారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ 8వ, 16వ స్థానాల నుంచి రేసు మొదలెడతారు. -
విజేత వెటెల్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్: ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ బెల్జియం గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. ఆదివారం పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన హామిల్టన్‌ను వెటెల్ తొలి ల్యాపులోనే అధిగమించాడు. అక్కడి నుంచి రేసు ముగిసేదాకా ఆధిక్యంలో కొనసాగిన వెటెల్ 44 ల్యాపుల ఈ రేసును గంటా 23 ని.34.476 సెకన్లలో పూర్తి చేశాడు. అతనికంటే 11.061 సెకన్లు ఆలస్యమైన హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఓకాన్లు వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. ప్రధాన రేసు మొదలైన కాసేపటికే రేసింగ్ కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమైన హుల్కెన్బర్గ్పై ఫార్ములావన్ నిర్వాహకులు 10 స్థానాలు పెనాల్టీగా విధించారు. -
బ్రిటిష్ గ్రాండ్‌ప్రి చాంపియన్ సెబాస్టియన్ వెటెల్
ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలిచాడు. సిల్వర్‌స్టోన్‌లో ఆదివారం జరిగిన 52 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 27 నిమిషాల 29.784 సెకన్లలో ముగించాడు. ఈ సీజన్లో వెటెల్‌కిది నాలుగో విజయం. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు ఒకాన్ ఏడో స్థానంలో, పెరెజ్ 11వ స్థానంలో నిలిచారు. -
వెటెల్‌కే టైటిల్
సాఖిర్: ఫార్ములావన్ సీజన్లో మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ వరుసగా రెండో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో ఈ ఫెరారీ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 32 నిమిషాల 01.940 సెకన్లలో పూర్తి చేశాడు. బొటాస్ (మెర్సిడెస్) రెండో స్థానంలో... హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు ఒకాన్ పదో స్థానంలో, పెరెజ్ 12వ స్థానంలో నిలిచారు. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలోనూ వెటెల్ టైటిల్ గెల్చుకున్నాడు. సీజన్‌లోని మూడో రేసు చైనా గ్రాండ్‌ప్రి ఈనెల 15న జరుగుతుంది. -
వెటెల్దే విజయం
మెల్బోర్న్: ఫార్ములావన్ సీజన్లో తొలి విజయం ఫెరారీ జట్టు ఖాతాలోకి వెళ్లింది. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సీజన్‌లోని మొదటి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన వెటెల్ నిర్ణీత 58 ల్యాప్‌లను గంటా 29 నిమిషాల 33.283 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 25 ల్యాప్‌ల వరకు అగ్రస్థానంలోనే ఉన్న హామిల్టన్ ఆ తర్వాత ఆధిక్యాన్ని వెటెల్‌కు కోల్పోయాడు. 25వ ల్యాప్‌లో ఆధిక్యంలోకి వచ్చిన వెటెల్ చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. కెరీర్లో 200వ రేసులో పాల్గొన్న అతను 48వ టైటిల్‌ను గెలిచాడు. కిమీ రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో, రికియార్డో (రెడ్‌బుల్) నాలుగో స్థానంలో, అలోన్సో (మెక్లారెన్) ఐదో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు నిరాశ మిగిల్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ 11వ స్థానంలో, ఒకాన్ 12వ స్థానంలో నిలిచారు. మొత్తం 20 మంది డ్రైవర్లు రేసులో పోటీపడగా ఐదుగురు మధ్యలోనే వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 9న జరుగుతుంది. -
వెటెల్‌కు ‘పోల్’
సింగపూర్: ఇటలీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో తన ఆధిక్యాన్ని లూయిస్ హామిల్టన్ (238 పాయింట్లు)కు కోల్పోయిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ (235 పాయింట్లు)కు మళ్లీ ఆధిక్యంలోకి వచ్చే అవకాశం వచ్చింది. సింగపూర్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెటెల్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 39.491 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును వెటెల్ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), రికియార్డో (రెడ్‌బుల్) రెండు, మూడు స్థానాల నుంచి... రైకోనెన్ (ఫెరారీ), హామిల్టన్ నాలుగు, ఐదు స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు. సింగపూర్ గ్రాండ్‌ప్రిలో గత ఎనిమిదేళ్లలో ఏడుసార్లు ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన వారికే విజయం దక్కడం విశేషం. -
వెటెల్దే విక్టరీ
హంగేరి గ్రాండ్‌ప్రిలో టైటిల్ కైవసం బుడాపెస్ట్ (హంగేరి): తొలి ల్యాప్ నుంచి చివరి ల్యాప్ వరకు సాధికారికంగా డ్రైవ్ చేసిన ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈ సీజన్లో నాలుగో విజయాన్ని సాధించాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో ఈ జర్మనీ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 70 ల్యాప్‌లను వెటెల్ గంటా 39 నిమిషాల 46.713 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెటెల్‌కు తన జట్టు సహచరుడు కిమీ రైకోనెన్‌తో గట్టిపోటీ ఎదురైనా... ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా గమ్యానికి చేరాడు. ఈ సీజన్లో ఇప్పటికే వెటెల్ ఆస్ట్రేలియన్, బహ్రెయిన్, మొనాకో గ్రాండ్‌ప్రి రేసుల్లో టైటిల్స్ సాధించాడు. రైకోనెన్‌కు రెండో స్థానం లభించగా... మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు బొటాస్, లూయిస్ హామిల్టన్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. సెర్గియో పెరెజ్ ఎనిమిదో స్థానంలో, ఎస్టెబన్ ఒకాన్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. మొత్తం 20 మంది డ్రైవర్లు రేసులో పాల్గొనగా... నికో హుల్కెన్‌బర్గ్ (రెనౌ), పాల్ డి రెస్టా (విలియమ్స్), గ్రోస్యెన్ (హాస్), రికియార్డో (రెడ్‌బుల్) మధ్యలోనే వైదొలిగారు. మొత్తం 20 రేసులున్న ఈ సీజన్లో ఇప్పటివరకు పదకొండు రేసులు పూర్తయ్యాయి. ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో వెటెల్ (202 పాయింట్లు), హామిల్టన్ (188 పాయింట్లు), బొటాస్ (169 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి ఆగస్టు 27న జరుగుతుంది. -
వెటెల్‌కు ‘పోల్’ నేడు హంగేరి గ్రాండ్‌ప్రి
బుడాపెస్ట్: ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో రెండోసారి పోల్ పొజిషన్‌ను సాధించాడు. శనివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో అతను అందరికంటే వేగంగా ఒక నిమిషం 16.276 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఫెరారీకే చెందిన కిమీ రైకోనెన్‌కు రెండో స్థానం లభించింది. ఫలితంగా హంగేరి గ్రాండ్‌ప్రిలో 2004 తర్వాత మరోసారి తొలి రెండు స్థానాల నుంచి ఫెరారీ డ్రైవర్లు రేసును ఆరంభించనున్నారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ 12వ, పెరెజ్ 14వ స్థానాల నుంచి రేసును మొదలు పెడతారు. నేటి ప్రధాన రేసు సాయంత్రం గం. 5.25 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం -
వెటెల్ విజయం
► సీజన్లో మూడో టైటిల్ ► మొనాకో గ్రాండ్‌ప్రిలో ఫెరారీ హవా మోంటెకార్లో (మొనాకో): మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, నికో రోస్‌బర్గ్ జోరులో గత రెండు సీజన్లలో వెనుకబడిపోయిన మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ ఈ ఏడాది మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వెటెల్ ఈ సీజన్లో తన ఖాతాలో మూడో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి రేసులో వెటెల్ విజేతగా నిలిచాడు. 78 ల్యాప్లపాటు జరిగిన ఈ రేసును వెటెల్ గంటా 44 నిమిషాల 44.340 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫెరారీ జట్టుకే చెందిన కిమీ రైకోనెన్ రెండో స్థానంలో, రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఒకాన్ వరుసగా 12వ, 13వ స్థానాల్లో నిలిచి నిరాశ పరిచారు. తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 11న జరుగుతుంది. మొత్తం 20 మంది డ్రైవర్లు బరిలోకి దిగగా... 13 మంది మాత్రమే రేసును పూర్తి చేశారు. మిగతా ఏడుగురు మధ్యలోనే వైదొలిగారు. 16 ఏళ్ల తర్వాత... ‘పోల్ పొజిషన్’తో ప్రధాన రేసును ఆరంభించిన రైకోనెన్ 35 ల్యాప్‌ల వరకు ఆధిక్యంలో ఉండగా... ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్న వెటెల్ ఆధిక్యంలోకి దూసుకొచ్చాడు. ఆ ఆధిక్యాన్ని చివరి ల్యాప్ వరకు కాపాడుకొని వెటెల్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. దాంతో 2001లో షుమాకర్ తర్వాత వెటెల్ రూపంలో మొనాకో గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్‌కు మళ్లీ టైటిల్ లభించింది. కెరీర్లో 45 రేసుల్లో గెలిచిన వెటెల్ మొనాకో గ్రాండ్‌ప్రిలో రెండోసారి టైటిల్ సాధించాడు. చివరిసారి వెటెల్ 2011లో రెడ్‌బుల్ జట్టు తరఫున ఇక్కడ గెలిచాడు. సీజన్లో ఆరు రేసులు ముగిశాక... తాజా గెలుపుతో వెటెల్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో 129 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి వచ్చాడు. 104 పాయింట్లతో హామిల్డన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, 75 పాయింట్లతో బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానంలో ఉన్నారు. -
తొమ్మిదేళ్ల తర్వాత...
► క్వాలిఫయింగ్‌లో తొలి రెండు స్థానాలు ఫెరారీ డ్రైవర్లకే ► వెటెల్‌కు పోల్ పొజిషన్ ► నేడు రష్యా గ్రాండ్‌ప్రి సోచి (రష్యా): ఒకప్పుడు ఫార్ములావన్‌లో ఆధిపత్యం చలాయించి... ఆ తర్వాత వెనుకబడి పోయిన ఫెరారీ జట్టు మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. కొత్త సీజన్లో తమ ప్రత్యేకతను చాటుకుంటూ డిఫెండింగ్ చాంపియన్ మెర్సిడెస్ జట్టుకు గట్టిపోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. సీజన్‌లోని నాలుగో రేసు రష్యా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఫెరారీ డ్రైవర్లు సెబాస్టియన్ వెటెల్, కిమీ రైకోనెన్ అదరగొట్టారు. వెటెల్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 33.194 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకోగా... రైకోనెన్ ఒక నిమిషం 33.253 సెకన్లతో రెండో స్థానాన్ని పొందాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును వెటెల్, రైకోనెన్ వరుసగా తొలి రెండు స్థానాల నుంచి ప్రారంభిస్తారు. ఈ సీజన్లో తొలిసారి ఫెరారీ డ్రైవర్‌కు ‘పోల్ పొజిషన్’ లభించింది. 2008 జూన్‌లో ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి (రైకోనెన్, మసా) తర్వాత ఓ ప్రధాన రేసును ఇద్దరు ఫెరారీ డ్రైవర్లు మొదలుపెట్టనుండటం ఇదే తొలిసారి. మెర్సిడెస్ డ్రైవర్లు బొటాస్, హామిల్టన్ వరుసగా మూడు, నాలుగు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. భారత్‌కు చెందిన పెరెజ్, ఒకాన్ వరుసగా తొమ్మిది, పది స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్లో మూడు రేసులు జరగ్గా... వెటెల్ రెండింటిలో... హామిల్టన్ ఒక రేసులో విజేతగా నిలిచారు. గ్రిడ్ పొజిషన్స్: 1. వెటెల్ (ఫెరారీ), 2. రైకోనెన్ (ఫెరారీ), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. హామిల్టన్ (మెర్సిడెస్), 5. రికియార్డో (రెడ్‌బుల్), 6. మసా (విలియమ్స్), 7. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 8. హుల్కెన్‌బర్గ్ (రెనౌ), 9. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 10. ఒకాన్ (ఫోర్స్ ఇండియా), 11. సెయింజ్ (ఎస్టీఆర్), 12. లాన్స్ స్ట్రాల్ (విలియమ్స్), 13. క్వియాట్ (ఎస్టీఆర్), 14. మాగ్నుసెన్ (హాస్), 15. అలోన్సో (మెక్లారెన్), 16. పాల్మెర్ (రెనౌ), 17. వాన్డూర్నీ (మెక్లారెన్), 18. వెర్లీన్ (సాబెర్), 19. ఎరిక్సన్ (సాబెర్), 20. గ్రోస్యెన్ (హాస్). -
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి విజేత వెటెల్
మనామా: ఆద్యంతం ఉత్కంఠభరింగా సాగిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 33 నిమిషాల 53.373 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ సీజన్లో వెటెల్‌కిది రెండో విజయం. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానంతో సరిపెట్టుకోగా... హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా ఎనిమిది, పదో స్థానాల్లో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 30న జరుగుతుంది. -
హామిల్టన్ హవా...
► చైనా గ్రాండ్‌ప్రి టైటిల్ కైవసం ► కెరీర్లో 54వ టైటిల్ సొంతం షాంఘై: క్వాలిఫయింగ్ సెషన్లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో తొలి విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 37 నిమిషాల 36.160 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందా డు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 54వ టైటిల్. ‘పోల్ పొజిషన్’తో ఈ రేసును ఆరంభించిన హామిల్టన్‌కు ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయితే హామిల్టన్ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా తన ఆధిక్యాన్ని కాపాడుకుంటూ అందరికంటే ముందు గమ్యానికి చేరాడు. వెటెల్‌కు రెండో స్థానం లభించగా... వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఒకాన్ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. హామిల్టన్ గమ్యం చేరే సమయానికి ఎనిమిది మంది డ్రైవర్లు చివరి ల్యాప్‌ను ఇంకా పూర్తి చేయకపోవడం గమనార్హం. మరో ఐదుగురు డ్రైవర్లు రేసును పూర్తి చేయకుండానే మధ్యలోనే వైదొలిగారు. సీజన్‌లోని మూడో రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 16న జరుగుతుంది. -
వెటెల్ నిరీక్షణ ముగిసె...
►27 రేసుల తర్వాత తొలి విజయం ►ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం మెల్బోర్న్: ఒకటా... రెండా...మూడా... ఏకంగా 27 రేసుల నిరీక్షణ ముగిసింది. హామిల్టన్, రోస్‌బర్గ్ దాటికి ఏడాదిన్నర కాలంగా ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయిన నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 2017 ఫార్ములావన్ సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వెటెల్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన 57 ల్యాప్‌ల ఈ రేసులో వెటెల్ గంటా 24 నిమిషాల 11.670 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2015 సెప్టెంబరులో సింగపూర్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన తర్వాత వెటెల్ ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే కావడం విశేషం. ఓవరాల్‌గా వెటెల్ కెరీర్లో ఇది 43వ టైటిల్. మరోవైపు 2007 తర్వాత ఫెరారీ జట్టు డ్రైవర్‌కు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి టైటిల్ లభించడం గమనార్హం. వరుసగా నాలుగో ఏడాది ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. హామిల్టన్ గంటా 24 నిమిషాల 21.645 సెకన్లలో గమ్యానికి చేరుకున్నాడు. 17వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్న హామిల్టన్ టైర్లు మార్చుకోవడానికి విరామం తీసుకోగా... రెండో స్థానంలో ఉన్న వెటెల్ ముందుకు దూసుకెళ్లాడు. అక్కడి నుంచి వెటెల్‌ను అందుకోవడంలో మిగతా డ్రైవర్లు వెనుకబడ్డారు. మెర్సిడెస్ జట్టుకే చెందిన బొటాస్ మూడో స్థానాన్ని, ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ నాలుగో స్థానాన్ని పొందారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో, ఒకాన్ పదో స్థానంలో నిలిచి పాయింట్ల ఖాతా తెరిచారు. మొత్తం 20 మంది డ్రైవర్లు బరిలోకి దిగగా... ఏడుగురు డ్రైవర్లు రేసును పూర్తి చేయలేక మధ్యలోనే వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు చైనా గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 9న జరుగుతుంది. గమ్యం చేరారిలా (టాప్–10): 1. వెటెల్ (ఫెరారీ; 1గం:24ని:11.670 సెకన్లు), 2. హామిల్టన్ (మెర్సిడెస్; 1:24:21.645), 3. బొటాస్ (మెర్సిడెస్; 1:24:22.920), 4. రైకోనెన్ (ఫెరారీ; 1:24:34.063), 5. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్; 1:24:40.497), 6. మసా (విలియమ్స్; 1:25:35.056), 7. పెరెజ్ (ఫోర్స్ ఇండియా; +1 ల్యాప్), 8. సెయింజ్ (ఎస్టీఆర్; +1 ల్యాప్), 9. క్వియాట్ (ఎస్టీఆర్; +1 ల్యాప్), 10. ఒకాన్ (ఫోర్స్ ఇండియా; +1 ల్యాప్). -
సింగపూర్ గ్రాండ్‌ప్రి విజేత వెటెల్
సింగపూర్ : క్వాలిఫయింగ్‌లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ పునరావృతం చేసిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈ సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో వెటెల్ విజేతగా నిలిచాడు. 61 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన వెటెల్ రెండు గంటల 1ని:22.118 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 32 ల్యాప్‌ల తర్వాత కారులో ఇబ్బంది తలెత్తడంతో రేసు నుంచి వైదొలిగాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లలో సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో నిలువగా... హుల్కెన్‌బర్గ్ 12వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 27న జరుగుతుంది. ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో హామిల్టన్ (252 పాయింట్లు), రోస్‌బర్గ్ (211), వెటెల్ (203) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
సింగపూర్ గ్రాండ్ ప్రి విజేత వెటెల్
సింగపూర్: ఈ ఏడాదిలో తొలిసారి ఫార్ములావన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను ప్రపంచ మాజీ చాంపియన్, ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ సాధించాడు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ల జోరుకు కళ్లెం వేసిన వెటెల్ ఎట్టకేలకు టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసును పోల్ పొజిషన్ నుంచి మొదలు పెట్టిన వెటెల్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. కాగా, రేసును రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన మాజీ సహచరుడు, రెడ్ బుల్ డ్రైవర్ రికియార్డో నుంచి వెటెల్ కు తీవ్ర పోటీ ఎదురైంది. అయితే ల్యాప్ ను అందరికంటే వేగంగా పూర్తి చేసిన వెటెల్ విజేతగా నిలిచాడు. ఇదిలా ఉండగా భారత్ కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్ ఏడో స్థానంలో నిలిచాడు. -
ఎదురులేని హామిల్టన్
సీజన్లో ఏడో టైటిల్ ఇటలీ గ్రాండ్‌ప్రిలోనూ విజయం మోంజా : క్వాలిఫయింగ్‌లో మొదలైన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన ఖాతాలో మరో విజయాన్ని జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ 53 ల్యాప్‌లను గంటా 18 నిమిషాల 00.688 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది ఏడో టైటిల్ కావడం విశేషం. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) రెండో స్థానాన్ని దక్కించుకోగా... ఫెలిప్ మసా (విలియమ్స్) మూడో స్థానాన్ని పొందాడు. తాజా గెలుపుతో హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో 252 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ఎఫ్1 ఆల్‌టైమ్ టైటిల్స్ జాబితాలో 40వ విజయంతో ఐదో స్థానానికి చేరుకున్నాడు. గత ఏడాది మాదిరిగానే ఈసారీ హామిల్టన్ ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టి విజేతగా నిలిచాడు. రేసు పూర్తయ్యాక హామిల్టన్ ఉపయోగించిన టైర్లపై రేసు నిర్వాహకులు విచారణ చేశారు. అయితే అతను వాడిన టైర్లు నిబంధనలకు లోబడే ఉండటంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. ‘ఫోర్స్’ డ్రైవర్లిద్దరూ టాప్-10లో నిలిచారు. సెర్గియో పెరెజ్ ఆరో స్థానాన్ని పొందగా... హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానాన్ని సంపాదించాడు. రేసు మొదలైన వెంటనే తొలి ల్యాప్‌లోనే లోటస్ జట్టుకు చెందిన గ్రోస్యెన్, మల్డొనాడో కార్లు ఢీకొట్టుకోవడంతో వారిద్దరూ వైదొలిగారు. మరోవైపు ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ ఆద్యంతం ఆధిక్యంలో నిలిచి అందరికంటే ముందుగా లక్ష్యానికి చేరుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 20న జరుగుతుంది. -
వెటెల్ విజయం
హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సీజన్లో రెండో గెలుపు హామిల్టన్, రోస్బర్గ్ల తడబాటు ‘ఫోర్స్ ఇండియా’కు నిరాశ బుడాపెస్ట్: అందరి అంచనాలను తారుమారు చేస్తూ ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) ఈ సీజన్లో రెండో టైటిల్‌ను నెగ్గాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో ఈ జర్మన్ డ్రైవర్ అద్వితీయ విజయాన్ని నమోదు చేశాడు. 69 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 46 నిమిషాల 09.985 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. క్వియాట్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలువగా... రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానాన్ని సంపాదించాడు. ఈ సీజన్లో జరిగిన గత తొమ్మిది రేసుల్లో ఎనిమిదింట విజయఢంకా మోగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, నికో రోస్‌బర్గ్ జోరుకు ఈసారి బ్రేక్ పడింది. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ ఆఖరికి ఆరో స్థానంతో సరిపెట్టుకోగా... రోస్‌బర్గ్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు కలిసిరాలేదు. హుల్కెన్‌బర్గ్ 41వ ల్యాప్‌లో, పెరెజ్ 53వ ల్యాప్‌లో రేసు నుంచి వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి ఆగస్టు 23న జరుగుతుంది. రేసు మొదలైన వెంటనే హామిల్టన్, రోస్‌బర్గ్ లను వెనక్కినెట్టి వెటెల్ ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ గమ్యానికి చేరుకున్నాడు. తన కెరీర్లో తొలిసారి హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆరంభంలోనే నాలుగో స్థానానికి పడిపోయిన హామిల్టన్ తేరుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తన విజయాన్ని గతవారం మృతి చెందిన ఎఫ్1 డ్రైవర్ జులెస్ బియాంచికి అంకితం ఇస్తున్నట్లు వెటెల్ తెలిపాడు. బియాంచి మృతికి సంతాపంగా ఈ రేసు ప్రారంభానికి ముందు నిమిషంపాటు మౌనం పాటించారు. ఈ గెలుపుతో వెటెల్ అత్యధిక టైటిల్స్ సాధించిన వారి జాబితాలో అయర్టన్ సెనా (41)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. అలైన్ ప్రాస్ట్ (51 టైటిల్స్), మైకేల్ షుమాకర్ (91 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5) స్థానం డ్రైవర్ జట్టు పాయింట్లు 1 హామిల్టన్ మెర్సిడెస్ 202 2 రోస్‌బర్గ్ మెర్సిడెస్ 181 3 వెటెల్ ఫెరారీ 160 4 బొటాస్ విలియమ్స్ 77 5 రైకోనెన్ ఫెరారీ 76 కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5) స్థానం జట్టు పాయింట్లు 1 మెర్సిడెస్ 383 2 ఫెరారీ 236 3 విలియమ్స్ 151 4 రెడ్‌బుల్ 96 5 ఫోర్స్ ఇండియా 39 -
హంగేరి గ్రాండ్ ప్రీ
-
హంగేరి గ్రాండ్ ప్రీ విజేత వెటెల్
బుడాపెస్ట్: హంగేరి ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీలో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసును వెటెల్ ప్రథమ స్థానంతో పూర్తిచేశాడు. రెడ్ బుల్ డ్రైవర్లు డానిల్ క్వియాట్, డానియల్ రికియార్డో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కాగా ఈ ఏడాది ఫార్ములా వన్ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయీస్ హామిల్టన్ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. శనివారం క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ పోల్ పొజిషన్ సాధించినా ఫైనల్ రేసులో వెనుకబడ్డాడు. -
వెటెల్ వచ్చేశాడు!
మలేసియా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సెపాంగ్ (మలేసియా): ఏడాది కాలంగా హామిల్టన్, రోస్‌బర్గ్ జోరులో వెనుకబడిపోయిన ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ కొత్త సీజన్లో దూసుకొచ్చాడు. విఖ్యాత ఫెరారీ జట్టు తరఫున బరిలోకి దిగిన ఈ జర్మన్ డ్రైవర్ 20 రేసుల తర్వాత తన ఖాతాలో తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అంతేకాకుండా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత డీలా పడిన ఫెరారీ జట్టుకు 35 రేసుల తర్వాత టైటిల్‌ను అందించాడు. ఆదివారం జరిగిన మలేసియా గ్రాండ్‌ప్రి రేసులో వెటెల్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసును రెండో స్థానం నుంచి మొదలుపెట్టిన వెటెల్ గంటా 41 నిమిషాల 05.793 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ప్రపంచ చాంపియన్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. హామిల్టన్ సహచరుడు రోస్బర్గ్కు మూడో స్థానం లభించింది. 2010 నుంచి నాలుగేళ్లపాటు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన వెటెల్‌కు గత ఏడాది కలసిరాలేదు. బరిలో దిగిన 19 రేసుల్లో అతను ఒక్కదాంట్లోనూ గెలువలేకపోయాడు. ఈ సీజన్లో జట్టు మారిన అతను తొలి విజయాన్ని దక్కించుకొని మున్ముందు రేసుల్లో హామిల్టన్, రోస్బర్గ్లకు తన నుంచి గట్టిపోటీ తప్పదని సంకేతాలు పంపించాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు ఈ రేసు నిరాశను మిగిల్చింది. ‘ఫోర్స్’ డ్రైవర్లు సెర్గియో పెరెజ్ 13వ, హుల్కెన్‌బర్గ్ 14వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. సీజన్‌లోని తదుపరి రేసు చైనా గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 12న జరుగుతుంది. -
ఎఫ్1కు వేళాయె..!
నేటి నుంచి కొత్త సీజన్ షురూ మెల్బోర్న్: డిఫెండింగ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) మళ్లీ టైటిల్ నిలబెట్టుకుంటాడా... నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచి గతేడాది విఫలమైన సెబాస్టియన్ వెటెల్ కొత్త జట్టు ఫెరారీతో మళ్లీ గాడిలో పడతాడా... ఈసారైనా ఎలాంటి ప్రమాదాలు లేకుండా అంతా సాఫీగా సాగుతుందా... భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ మరింత మెరుగైన ప్రదర్శన చేస్తుందా... ఈ సందేహాల నడుమ 2015 ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌కు శనివారంతో తెరలేవనుంది. ఆదివారం మెల్బోర్న్లో జరిగే ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రితో మొదలయ్యే కొత్త సీజన్‌కు నవంబరు 29న అబుదాబి గ్రాండ్‌ప్రి రేసుతో ముగింపు లభిస్తుంది. శనివారం ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్ జరుగుతుంది. ఈ సెషన్ ఫలితాల ఆధారంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును ఆయా డ్రైవర్లు ఏ ఏ స్థానం నుంచి (గ్రిడ్ పొజి షన్స్) ప్రారంభించాలో నిర్ణయిస్తారు. తొమ్మిది నెలలపాటు సుదీర్ఘంగా సాగే ఈ సీజన్లో మొత్తం 20 రేసులు ఉంటాయి. అత్యధిక పాయింట్లు సాధించిన వారికి ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్... అత్యధిక పాయింట్లు నెగ్గిన జట్టుకు ‘కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్ అందజేస్తారు. -
రయ్...రయ్...రయ్
నేటి నుంచి ఫార్ములావన్ సీజన్ రేపు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి రేసు మెల్బోర్న్: గత నాలుగేళ్లుగా ఎదురులేని డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ (రెడ్‌బుల్) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడా... మాజీ చాంపియన్ హామిల్టన్ పుంజుకుంటాడా... లేదంటే మరో కొత్త విజేత అవతరిస్తాడా... భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా గాడిలో పడుతుందా... ఈ సందేహాల నడుమ ఫార్ములావన్ (ఎఫ్1)-2014 సీజన్‌కు తెరలేవనుంది. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి రేసుకు మెల్బోర్న్ ఆదివారం ఆతిథ్యమివ్వనుంది. ఈ రేసుకు సంబంధించి క్వాలిఫయింగ్ సెషన్ శనివారం జరుగుతుంది. నవంబరు 23న జరిగే అబుదాబి గ్రాండ్‌ప్రి రేసుతో 19 రేసుల సీజన్ ముగుస్తుంది. 11 జట్లున్న ఈ సీజన్లో రెడ్‌బుల్ జట్టే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ వెటెల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. నిబంధనల విషయానికొస్తే ప్రతి రేసులో విజేతకు 25 పాయింట్లు, రెండో స్థానంలో నిలిస్తే 18 పాయింట్లు, మూడో స్థానం దక్కితే 15 పాయింట్లు, నాలుగో స్థానం సంపాదిస్తే 12 పాయింట్లు, ఐదో స్థానం పొందితే 10 పాయింట్లు లభిస్తాయి. అయితే గత సీజన్‌కు భిన్నంగా ఈసారి చివరి రేసులో మాత్రం డ్రైవర్లకు రెట్టింపు పాయింట్లు లభిస్తాయి. ఎఫ్1-2014 షెడ్యూల్: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి (మార్చి 16); మలేసియా (మార్చి 30); బహ్రెయిన్ (ఏప్రిల్ 6); చైనా (ఏప్రిల్ 20); స్పెయిన్ (మే 11); మొనాకో (మే 25); కెనడా (జూన్ 8);ఆస్ట్రియా (జూన్ 22); బ్రిటన్ (జూలై 6); జర్మనీ (జూలై 20); హంగేరి (జూలై 27); బెల్జియం (ఆగస్టు 24); ఇటలీ (సెప్టెంబరు 7); సింగపూర్ (సెప్టెంబరు 21); జపాన్ (అక్టోబరు 5); రష్యా (అక్టోబరు 12); అమెరికా (నవంబరు 2); బ్రెజిల్ (నవంబరు 9); అబుదాబి గ్రాండ్‌ప్రి (నవంబరు 23). -
నగరంలో వెటెల్ కారు
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ఫార్ములావన్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ నడిపిన కారును హైదరాబాద్‌లోని రెనాల్ట్ షోరూంలో ప్రదర్శనకు ఉంచారు. గత నాలుగేళ్లుగా ఈ కారు ఫార్ములా వన్ రేసింగ్‌లో విజేతగా నిలుస్తూ వస్తుందని సంస్థ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఎండీ మెంబీ శ్రీనివాస్ తెలిపారు. రెడ్‌బుల్ జట్టు తరఫున వెటెల్ నడిపిన ఈ కారును చూసేందుకు యువత ఉత్సాహం చూపించింది. -
వెటెల్‌కు మళ్లీ ‘పోల్’
సావోపాలో: డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమైనప్పటికీ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మాత్రం తన జోరు కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లోని చివరిదైన 19వ రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రిని ఈ జర్మనీ డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో వెటెల్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 26.479 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును వెటెల్ తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. ఈ సీజన్లో వెటెల్‌కిది తొమ్మిదో ‘పోల్’ కాగా... కెరీర్లో 45వది కావడం విశేషం. ఈ సీజన్లో 12 టైటిల్స్ నమోదు చేసిన వెటెల్ ఆదివారం కూడా గెలిస్తే తన ఖాతాలో వరుసగా పదో టైటిల్‌ను జమ చేసుకొని ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. -
వెటెల్ కొత్త చరిత్ర
ఆస్టిన్: మరో రేసు... మరో విజయం... మరో రికార్డు... మూడు వారాల క్రితమే వరుసగా నాలుగో ఏడాది డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఖాయం చేసుకున్న రెడ్‌బుల్ జట్టు స్టార్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ నామమాత్రమైన రేసుల్లోనూ దుమ్ము రేపుతున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన యునెటైడ్ స్టేట్స్ గ్రాండ్‌ప్రి రేసులో వెటెల్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 39 నిమిషాల 17.148 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో వరుసగా ఎనిమిదో విజయాన్ని తన ఖాతాలో జమచేసుకున్నాడు. అంతేకాకుండా ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో ఒకే సీజన్లో వరుసగా ఎనిమిది విజయాలు సాధించిన తొలి డ్రైవర్‌గా చరిత్ర సృష్టించాడు. దాంతో ఇప్పటిదాకా ఒకే సీజన్లో వరుసగా ఏడు విజయాలతో ఎఫ్1 దిగ్గజం మైకేల్ షుమాకర్ (జర్మనీ-2004లో) పేరిట ఉన్న రికార్డును వెటెల్ తిరగరాశాడు. ఓవరాల్‌గా ఈ సీజన్లో వెటెల్‌కిది 12వ విజయం కాగా... కెరీర్లో 38వ టైటిల్ కావడం విశేషం. ఈనెల 24న సీజన్‌లోని చివరిదైన రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలోనూ వెటెల్ గెలిస్తే మరో రెండు ప్రపంచ రికార్డులను సమం చేస్తాడు. ఎఫ్1 చరిత్రలో వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన ఏకైక డ్రైవర్ అల్బెర్టో అస్కారి (ఇటలీ) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. అల్బెర్టో అస్కారి 1952 సీజన్‌లోని చివరి ఆరు రేసుల్లో... 1953 సీజన్ ఆరంభంలోని తొలి మూడు రేసుల్లో విజేతగా నిలిచాడు. ఒకే సీజన్లో అత్యధికంగా 13 విజయాలతో మైకేల్ షుమాకర్ (2004లో) పేరిట ఉన్న రికార్డునూ వెటెల్ సమం చేస్తాడు. ఫోర్స్ ఇండియాకు నిరాశ ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెటెల్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. తొలి ల్యాప్‌లోనే భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ సుటిల్ కారుపై నియంత్రణ కోల్పోయి విలియమ్స్ జట్టు డ్రైవర్ పాస్టర్ మల్డొనాడో కారును ఢీకొట్టాడు. దాంతో సర్క్యూట్‌పై సేఫ్టీ కారు రంగప్రవేశం చేసింది. ఐదో ల్యాప్ మొదలయ్యే సమయానికి వెటెల్ ఆధిక్యం 1.9 సెకన్లకు చేరుకుంది. ఆ తర్వాత వెటెల్ వెనుదిరిగి చూడలేదు. ఓవరాల్‌గా వెటెల్ ఆరు సెకన్ల తేడాతో విజయాన్ని అందుకున్నాడు. గ్రోస్యెన్ (లోటస్) రెండో స్థానంలో... వెబెర్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో, హామిల్టన్ (మెర్సిడెస్) నాలుగో స్థానంలో నిలిచారు. ఐదో స్థానం పొందిన ఫెరారీ జట్టు డ్రైవర్ అలోన్సో ఓవరాల్‌గా 227 పాయింట్లతో ఈ సీజన్‌లోని డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్ స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. ‘ఫోర్స్’కే చెందిన మరో డ్రైవర్ పాల్ డి రెస్టా 15వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. గర్వంగా ఉంది ‘‘ఒకే సీజన్లో వరుసగా ఎనిమిది రేసులు నెగ్గిన తొలి డ్రైవర్‌గా రికార్డు సృష్టించినందుకు గర్వంగా అనిపిస్తోంది. ఈ విజయాల సంఖ్య కారణంగా నేను కారులో నుంచి ఎగిరి గంతేయను. అయితే తాజా గెలుపుతో నేను ఓ అద్భుతం చేశానని గ్రహించాను. కొన్నేళ్ల తర్వాత మా ఘనతలపై కూడా అభిమానులు చర్చించుకుంటారు. నా రికార్డు వెనుక రెడ్‌బుల్ జట్టు బృందం కృషి ఎంతో ఉంది. వాస్తవానికి షుమాకర్ పేరిట ఉన్న రికార్డును ఎవరూ తిరగరాసే అవకాశం లేదని భావించారు. కానీ మేం దీనిని సాధ్యం చేశాం.’’ -వెటెల్, రెడ్‌బుల్ డ్రైవర్ -
వెటెల్ విజయ ‘సప్తమి’
అబుదాబి: ఇప్పటికే ఈ సీజన్ ఫార్ములావన్ టైటిల్ ఖరారయినా... రెడ్‌బుల్ రేసర్ సెబాస్టియన్ వెటెల్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. గత వారం ఢిల్లీలో చూపిన ప్రదర్శననే కొనసాగిస్తూ అబుదాబి గ్రాండ్‌ప్రిలో విజయం సాధించాడు. ఈ సీజన్లో వెటెల్‌కు ఇది వరుసగా ఏడో విజయం కాగా, ఓవరాల్‌గా 11వది. 55 ల్యాప్‌ల అబుదాబి రేస్‌ను వెటెల్ గంటా 38 నిమిషాల 6.106 సెకన్లలో పూర్తి చేశాడు. రెడ్‌బుల్‌కే చెందిన మార్క్ వెబెర్‌కు రెండో స్థానం దక్కగా, మెర్సిడెజ్ డ్రైవర్ రోస్‌బర్గ్ మూడో స్థానంలో నిలిచాడు. పోల్ పొజిషన్లో దక్కిన అగ్రస్థానాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వెబర్ విఫలమయ్యాడు. రెండో స్థానంతో ప్రారంభించిన వెటెల్ తొలి మలుపునుంచే ముందుకు దూసుకుపోయి చివరి వరకు దానిని కొనసాగించాడు. తొలి స్థానంపై ఆశలు వదులుకున్న వెబర్, తన వెనకే దూసుకొస్తున్న రోస్బర్గ్పైనే దృష్టి నిలిపి రేస్‌ను కొనసాగించడంతో వెటెల్ పని మరింత సులువైంది.ఈ విజయంతో వెటెల్... వరుసగా ఏడు రేస్‌లు నెగ్గిన మైకేల్ షుమాకర్ (2004) సరసన చేరాడు. సీజన్లో మిగిలి ఉన్న రెండు రేస్‌లను కూడా నెగ్గితే వరుసగా తొమ్మిది సార్లు గెలిచిన ఆల్బర్టో అస్కారి (1952-53) రికార్డును వెటెల్ సమం చేస్తాడు. మరో వైపు తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (2011లో 11 రేస్‌లు) కూడా సెబాస్టియన్ సమం చేశాడు. చివరి రెండూ గెలిస్తే సీజన్లో అత్యధిక విజయాల షుమాకర్ (13) రికార్డును కూడా అతను అందుకోగలడు. టాప్-10లో ఫోర్స్ డ్రైవర్లు మరో వైపు ఫోర్స్ ఇండియా జట్టు ప్రదర్శన ఇండియన్ గ్రాండ్‌ప్రి కంటే మెరుగు పడింది. సీజన్లో రెండో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ ఫోర్స్ డ్రైవర్ పాల్ డి రెస్టా ఆరో స్థానంలో నిలిచాడు. మరో డ్రైవర్ ఆడ్రియన్ సుటిల్ 10వ స్థానం సాధించాడు. ఫోర్స్ ఇండియాకు ఇది వరుసగా రెండో డబుల్ పాయింట్ ఫినిష్ కావడం విశేషం. -
F1 కింగ్
-
వెటెల్ ‘సిక్సర్’
లాంఛనం ముగిసింది. ఊహించిన ఫలితమే వచ్చింది. ఈ సీజన్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఇండియన్ గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచాడు. మూడో ఏడాదీ ఈ టైటిల్ నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. ఈ క్రమంలో వెటెల్ వరుసగా నాలుగో ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో ఆరో విజయంతో ‘డబుల్ హ్యాట్రిక్’ సాధించాడు. అంతేకాకుండా కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో రెడ్‌బుల్ జట్టును వరుసగా నాలుగో ఏడాది విజేతగా నిలిపాడు. గ్రేటర్ నోయిడా: అదే జోరు... అదే వేగం... సర్క్యూట్ మారినా.. తన దూకుడు తగ్గించకుండా రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ దూసుకుపోతున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో... క్వాలిఫయింగ్ సెషన్లో ఆధిపత్యం చలాయించిన 26 ఏళ్ల ఈ జర్మన్ డ్రైవర్ ప్రధాన రేసులోనూ హల్చల్ చేశాడు. ఆద్యంతం ఆధిక్యం కనబరుస్తూ ఇండియన్ గ్రాండ్‌ప్రిలో వరుసగా మూడో ఏడాది చాంపియన్‌గా అవతరించాడు. బుద్ధ అంతర్జాతీయ సర్క్యూట్లో ఆదివారం జరిగిన 60 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 31 నిమిషాల 12.187 సెకన్లలో పూర్తి చేశాడు. 2011, 2012లలో కూడా ఇండియన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన వెటెల్‌కు ఈ సీజన్లో వరుసగా ఆరో విజయం... ఓవరాల్‌గా 10వ గెలుపు కావడం విశేషం. ఈ రేసుకు ముందు వెటెల్... బెల్జియం, ఇటలీ, సింగపూర్, కొరియా, జపాన్ గ్రాండ్‌ప్రిలలో కూడా అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ రేసులో రెడ్‌బుల్ జట్టుకే చెందిన మార్క్ వెబెర్ 39వ ల్యాప్‌లో వైదొలిగినా... వెటెల్ ప్రదర్శనతో రెడ్‌బుల్ జట్టుకు వరుసగా నాలుగో ఏడాది కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ కూడా దక్కింది. తాజా విజయంతో వెటెల్ ఈ సీజన్లో మరో మూడు రేసులు మిగిలి ఉండగానే అధికారికంగా డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. 2010, 2011, 2012లలో కూడా వెటెల్ డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఒకే సీజన్లో వరుసగా 6 అంతకంటే ఎక్కువ విజయాలు నమోదు చేసిన నాలుగో డ్రైవర్‌గా వెటెల్ గుర్తింపు పొందాడు. గతంలో అస్కారి (వరుసగా 9 రేసులు), షుమాకర్, జిమ్ క్లార్క్ (7 రేసులు) ఈ ఘనత సాధించారు. ఈ సీజన్లో 19 రేసులకుగాను 16 రేసులు పూర్తయ్యాయి. వెటెల్ 10 రేసుల్లో విజయం సాధించి మొత్తం 322 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 207 పాయింట్లతో అలోన్సో రెండో స్థానంలో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి నవంబరు 3న జరుగుతుంది. ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా టాప్-5లో నిలిస్తే వరుసగా నాలుగో ఏడాది డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమయ్యే పరిస్థితిలో బరిలోకి దిగిన వెటెల్ కేవలం విజయమే లక్ష్యంగా దూసుకుపోయాడు. రెండో స్థానంలో నిలిచిన రోస్బర్గ్కు వెటెల్‌కు మధ్య 29 సెకన్ల తేడా ఉండటం ఈ రేసులో వెటెల్ ఆధిపత్యానికి నిదర్శనం. లోటస్ జట్టు డ్రైవర్ రొమైన్ గ్రోస్యెన్ మూడో స్థానంలో నిలువగా... మసా (ఫెరారీ), పెరెజ్ (మెక్లారెన్) వరుసగా నాలుగైదు స్థానాలతో సరిపెట్టుకున్నారు. ప్రపంచ మాజీ చాంపియన్ ఫెర్నాండో అలోన్సో (ఫెరారీ) 11వ స్థానంతో సంతృప్తి పడటంతో అతనికి ఒక్క పాయింట్ కూడా దక్కలేదు. భారత్‌కు చెందిన ‘సహారా ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు కలిసి వచ్చింది. ఆ జట్టు ఇద్దరు డ్రైవర్లు టాప్-10లో నిలిచి తమ ఖాతాలో పాయింట్లు వేసుకున్నారు. పాల్ డి రెస్టా ఎనిమిదో స్థానంలో... అడ్రియన్ సుటిల్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. మార్క్ వెబెర్ (రెడ్‌బుల్) 39వ ల్యాప్‌లో రేసు నుంచి వైదొలగగా... కాటర్‌హమ్ జట్టు డ్రైవర్లు చార్లెస్ పిక్ 35వ ల్యాప్‌లో... గియెడో గార్డె తొలి ల్యాప్‌లోనే రేసు నుంచి తప్పుకున్నారు. -
వెటెల్దే ఆధిపత్యం
గ్రేటర్ నోయిడా: వరుసగా మూడో ఏడాది ‘ఇండియన్ గ్రాండ్ ప్రి’ టైటిల్‌పై గురిపెట్టిన రెడ్‌బుల్ డ్రైవర్, డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ శుక్రవారం జరిగిన రెండు ప్రాక్టీస్ సెషన్లలోనూ దుమ్మురేపాడు. బుద్ధ సర్క్యూట్లో ఉదయం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్లో ని.1:26.683 సెకన్ల ల్యాప్ టైమింగ్ నమోదు చేశాడు. అయితే మధ్నాహ్నం జరిగిన రెండో ప్రాక్టీస్ సెషన్లో వెటెల్ మరింత మెరుగ్గా డ్రైవ్ చేశాడు. ని. 1:25.722 సెకన్లతో అత్యంత వేగవంతంగా ల్యాప్‌ను పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించాడు. దీంతో రెండు సెషన్లలోనూ టాప్‌లో నిలిచాడు. రెడ్బుల్కు చెందిన మరో డ్రైవర్ మార్క్ వెబెర్ కూడా రెండు సెషన్లలో (1:26.871 సెకన్లు; 1:26.011 సెకన్లు) హవా కొనసాగిస్తూ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తొలి ప్రాక్టీస్ (ఎఫ్పీ-1) సెషన్లో నాలుగో స్థానంలో నిలిచిన లోటస్ డ్రైవర్ గ్రోస్జీన్... రెండో ప్రాక్టీస్‌లో 1:26.220 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలవగా... మెర్సిడెస్కు చెందిన లూయిస్ హామిల్టన్ (1:26.399 సెకన్లు) నాలుగో స్థానం దక్కించుకున్నాడు. గేర్‌బాక్స్ సమస్యతో తొలి ప్రాక్టీస్ సెషన్లో 12వ స్థానానికి పరిమితమైన ఫెరారీ డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో.... రెండో ప్రాక్టీస్‌లో ఆకట్టుకున్నాడు. 1:26.430 సెకన్ల టైమింగ్‌తో ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. నికో రోస్బెర్గ్ (మెర్సిడెస్) 1:26.582 సెకన్లతో ఆరోస్థానంలో నిలవగా... ఫెలిప్ మసా (ఫెరారీ) 1:26.601 సెకన్లతో; కిమీ రైకోనెన్ (లోటస్) 1:26.632 సెకన్లతో; మెక్లారెన్ డ్రైవర్లు సెర్గి పెరెజ్ 1:26.857 సెకన్లతో; జెన్సన్ బటన్ 1:26.972 సెకన్లతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ‘ఫోర్స్’ విఫలం భారత రేసింగ్ జట్టు ‘ఫోర్స్ ఇండియా’ రెండు ప్రాక్టీస్ సెషన్లలోనూ విఫలమైంది. తొలి ప్రాక్టీస్ సెషన్లో 15వ స్థానంలో నిలిచిన ఆడ్రియన్ సుటిల్... రెండో సెషన్లో 1:27.375 సెకన్ల ల్యాప్ టైమింగ్‌తో 12వ స్థానంలో నిలిచాడు. తొలి ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్న పాల్ డి రెస్టా... రెండోసెషన్‌లో 1:27.608 సెకన్లతో 15వ స్థానానికి పరిమితమయ్యాడు. విలియమ్స్ జట్టుకు జరిమానా పిట్ స్టాప్‌లో చేసిన చిన్న తప్పిదానికి విలియమ్స్ జట్టుపై 60వేల యూరోల (రూ. 50 లక్షలు) జరిమానా పడింది. రెండో ప్రాక్టీస్ సెషన్లో విలియమ్స్ డ్రైవర్ పాస్టర్ మల్డొ నాల్డో నడుతుపున్న కారు కుడి టైర్ నట్ ఊడిపోయింది. మరోవైపు తొలి ప్రాక్టీస్ సెషన్లో పిట్‌లైన్ వద్ద కారును వేగంగా నడిపినందుకు లోటస్ డ్రైవర్ కిమీ రైకోనెన్పై 400 యూరోల (రూ.34వేలు) జరిమానా విధించారు. -
వెటెల్ జోరు
సుజుకా (జపాన్): సర్క్యూట్ మారినా... పోల్ పొజిషన్ దక్కకపోయినా... డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మాత్రం తన జోరు కొనసాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి రేసులో వెటెల్ విజేతగా నిలిచాడు. గత ఏడాది కూడా ఈ టైటిల్ నెగ్గిన వెటెల్‌కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. 53 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 26 నిమిషాల 49.301 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన మార్క్ వెబెర్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలిచాడు. లోటస్ జట్టు డ్రైవర్ గ్రోస్యెన్‌కు మూడో స్థానం లభించగా... ఫెర్నాండో అలోన్సో నాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు నిరాశ మిగిలింది. పాల్ డి రెస్టా 11వ స్థానంలో, సుటిల్ 14వ స్థానంలో నిలిచారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ రేసులో ముగ్గురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. తొలి ల్యాప్ మలుపులో బియాంచి (మారుసియా), గియెడో గార్డె (కాటర్‌హమ్) పరస్పరం ఢీకొట్టుకొని రేసు నుంచి నిష్ర్కమించారు. ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ కారు పంక్చర్ కావడంతో అతను ఏడో ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకున్నాడు. తాజా విజయంతో వెటెల్ వరుసగా నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలువడం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం వెటెల్ 297 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 207 పాయింట్లతో అలోన్సో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య 90 పాయింట్ల వ్యత్యాసం ఉంది. సీజన్లో మరో నాలుగు రేసులు మిగిలి ఉన్నాయి. అలోన్సోకు టైటిల్ దక్కాలంటే మిగిలిన నాలుగు రేసుల్లో అతను కనీసం మూడింటిలో గెలిచి, మరో రేసులో రెండు లేదా మూడో స్థానంలో నిలువాలి. మరోవైపు ఈ నాలుగు రేసుల్లో వెటెల్‌కు ఒక్క పాయింట్ కూడా దక్కకూడదు. ప్రస్తుతం వెటెల్ జోరు చూస్తుంటే ఈనెల 27న భారత్‌లో జరిగే ఇండియన్ గ్రాండ్‌ప్రి రేసులో అతనికి అధికారికంగా ప్రపంచ టైటిల్ ఖాయమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. -
వెబెర్‌కు తొలి ‘పోల్’
సుజుకా (జపాన్): తన సహచరుడు సెబాస్టియన్ వెటెల్ విజయాల నీడలో వెనుకబడిపోయిన మార్క్ వెబెర్ (రెడ్‌బుల్) ఈ సీజన్లో తొలిసారి ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాడు. శనివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెబెర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 30.915 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ఈ ఏడాది తొలిసారి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. ఈ ఏడాది తర్వాత ఫార్ములావన్‌కు వీడ్కోలు చెప్పనున్న ఈ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ ప్రస్తుత సీజన్లో ఒక్క విజయాన్నీ నమోదు చేయలేకపోయాడు. మరోవైపు వెబెర్ సహచరుడు వెటెల్ క్వాలిఫయింగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ల ద్వయం వరుసగా తొలి రెండు స్థానాల నుంచి ప్రారంభించనుంది. వెబెర్ ‘పోల్ పొజిషన్’ సాధించినా... వరుసగా నాలుగు విజయాలతో జోరుమీదున్న వెటెల్పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో 272 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న వెటెల్ ఆదివారం జరిగే రేసులో విజయం సాధించి.... 195 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఫెర్నాండో అలోన్సో (ఫెరారీ) టాప్-8లో నిలువకపోతే.... సీజన్లో మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే వెటెల్‌కు డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమవుతుంది. సుటిల్పై పెనాల్టీ క్వాలిఫయింగ్ సెషన్లో భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు నిరాశ మిగిలింది. పాల్ డి రెస్టా 12వ స్థానంలో... సుటిల్ 17వ స్థానంలో నిలిచారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా సుటిల్ గేర్ బాక్స్‌ను మార్చడంతో అతనిపై ఐదు గ్రిడ్ల పెనాల్టీని విధించారు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును సుటిల్ చివరిదైన 22వ స్థానం నుంచి మొదలుపెడతాడు. -
ఎదురులేని వెటెల్
యోన్గామ్ (దక్షిణ కొరియా): ఊహించిన ఫలితమే వచ్చింది. క్వాలిఫయింగ్‌లోనే కాదు ప్రధాన రేసుల్లోనూ సెబాస్టియన్ వెటెల్ తన సంపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన కొరియా గ్రాండ్‌ప్రిలో ఈ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. వరుసగా నాలుగో విజయం సాధించడంతోపాటు ఈ సీజన్లో ఎనిమిదో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 55 ల్యాప్‌ల కొరియా గ్రాండ్‌ప్రి రేసును గంటా 43 నిమిషాల 13.701 సెకన్లలో పూర్తి చేసిన వెటెల్ వరుసగా నాలుగో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌కు చేరువయ్యాడు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 13న జరుగుతుంది. అద్భుతాలు జరిగితే తప్ప ఈసారీ వెటెల్‌కే ప్రపంచ చాంపియన్‌షిప్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 19 రేసుల ఈ సీజన్లో ఇప్పటికి 14 రేసులు పూర్తయ్యాయి. వెటెల్ మొత్తం 272 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.... అలోన్సో 195 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య 77 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం వెటెల్ జోరు చూస్తుంటే తదుపరి ఐదు రేసుల్లో అతణ్ని సమీప ప్రత్యర్థులు అలోన్సో, రైకోనెన్, హామిల్టన్ నిలువరించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. వచ్చేవారం జపాన్ గ్రాండ్‌ప్రిలో వెటెల్ గెలిచి అలోన్సో టాప్-8లో లేకపోతే ఈ జర్మన్ డ్రైవర్‌కు టైటిల్ ఖాయమవుతుంది. వరుసగా మూడో రేసులోనూ ‘పోల్ పొజిషన్’తో దూసుకెళ్లిన వెటెల్‌కు ఏ దశలోనూ ప్రతిఘటన ఎదురుకాలేదు. ఆద్యంతం ఆధిక్యంలో ఉన్న వెటెల్ నాలుగు సెకన్ల తేడాతో విజయాన్ని దక్కించుకొని వరుసగా మూడో ఏడాది కొరియా గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ రేసులో 22 మంది డ్రైవర్లు బరిలోకి దిగగా... ఐదుగురు రేసును పూర్తి చేయలేకపోయారు. వెటెల్ సహచరుడు వెబెర్ కారులో మంటలు చెలరేగడంతో అతను 36వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకున్నాడు. సాంకేతిక సమస్యలతో జీన్ వెర్జెన్ 53వ ల్యాప్‌లో... రికియార్డో (ఎస్టీఆర్) 52వ ల్యాప్‌లో వైదొలిగారు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు నిరాశ ఎదురైంది. 24వ ల్యాప్‌లో నియంత్రణ కోల్పోయిన పాల్ డి రెస్టా ట్రాక్ నుంచి పక్కకు వెళ్లిపోగా... కారులో సమస్య తలెత్తడంతో 50వ ల్యాప్‌లో సుటిల్ రేసును నిలిపివేశాడు. -
‘హ్యాట్రిక్’పై వెటెల్ గురి
సింగపూర్: గత ఏడాది మాదిరిగా ఈసారీ ఆసియా సర్క్యూట్ రేసులలో తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ సిద్ధమయ్యాడు. ఆదివారం జరగనున్న సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసును ఈ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించనున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన వెటెల్ అనుకున్న ఫలితాన్ని సాధించాడు. ఈ జర్మనీ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 42.841 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ఈ సీజన్లో ఐదోసారి ‘పోల్ పొజిషన్’ను దక్కించుకున్నాడు. ట్రాక్‌కు అనుగుణంగా సూపర్ సాఫ్ట్ టైర్స్‌తో డ్రైవ్ చేసిన వెటెల్ తన ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచాడు. రోస్‌బర్గ్ (మెర్సిడెస్) రెండో స్థానం నుంచి... గ్రోస్యెన్ (లోటస్) మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. సింగపూర్ గ్రాండ్‌ప్రిలో 2012, 2011లలో టైటిల్ సాధించిన వెటెల్ వరుసగా మూడోసారి నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు నిరాశే మిగిలింది. సుటిల్ 15వ స్థానం నుంచి... పాల్ డి రెస్టా 17వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. -
ఎదురులేని వెటెల్
మోంజా: క్వాలిఫయింగ్ సెషన్లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈ సీజన్లో ఆరో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి రేసులో ఈ జర్మన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 53 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 18 నిమిషాల 33.352 సెకన్లలో పూర్తి చేశాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెటెల్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. మొదట్లో గేర్ బాక్స్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ ‘ట్రిపుల్ వరల్డ్ చాంపియన్’ ఆ తర్వాత అన్ని అడ్డంకులను అధిగమించి గమ్యానికి సాఫీగా చేరాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన వెటెల్ సహచరుడు వెబెర్‌కు మూడో స్థానం దక్కింది. ఫెరారీ డ్రైవర్ అలోన్సో రెండో స్థానంలో నిలిచాడు. 12వ స్థానం నుంచి రేసును ప్రారంభించిన హామిల్టన్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు నిరాశే మిగిలింది. ఆ జట్టు ఇద్దరు డ్రైవర్లలో సుటిల్ 16వ స్థానంలో నిలువగా... పాల్ డి రెస్టా తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 22న జరుగుతుంది. -
హామిల్టన్‌కు బ్రేక్
మోంజా: వరుసగా గత నాలుగు రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సాధించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ జోరుకు డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ కళ్లెం వేశాడు. శనివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెటెల్ దుమ్మురేపాడు. అందరికంటే వేగంగా ఒక నిమిషం 23.755 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ఈ సీజన్లో నాలుగోసారి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసు ఈ రెడ్‌బుల్ డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. వెటెల్ సహచరుడు మార్క్ వెబెర్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. మరోవైపు హామిల్టన్ పేలవ ప్రదర్శనతో ఆశ్చర్యకరంగా 12వ స్థానంలో నిలిచాడు. గత 67 రేసుల్లో అతను క్వాలిఫయింగ్ మూడో సెషన్‌కు అర్హత పొందకపోవడం ఇదే తొలిసారి. ‘మరీ మూర్ఖంగా డ్రైవ్ చేశాను. చాలా కాలం తర్వాత ఇంత చెత్తగా డ్రైవ్ చేసినందుకు జట్టు సిబ్బందికి క్షమాపణలు చెబుతున్నాను. ప్రధాన రేసులో సాధ్యమైనంత మెరుగైన స్థానం దక్కించుకునేందుకు కృషి చేస్తాను’ అని హామిల్టన్ అన్నాడు. ఇక ఈ సీజన్లో ఐదుసార్లు విజేతగా నిలిచిన వెటెల్ క్వాలిఫయింగ్ సెషన్లో సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచాడు. తొలి రెండు క్వాలిఫయింగ్ సెషన్స్‌లో అందరికంటే వేగంగా ల్యాప్‌లను పూర్తి చేసిన అతను చివరిదైన మూడో సెషన్లోనూ దూసుకుపోయాడు. గతంలో రెండుసార్లు ఇటలీ గ్రాండ్‌ప్రిలో టైటిల్ నెగ్గిన ఈ జర్మన్ డ్రైవర్ మూడో విజయంపై విశ్వాసంతో ఉన్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు టాప్-10లో నిలువలేకపోయారు. సుటిల్ 14వ స్థానం నుంచి... పాల్ డి రెస్టా 16వ స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు.