ఎదురులేని వెటెల్
మోంజా: క్వాలిఫయింగ్ సెషన్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈ సీజన్‌లో ఆరో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి రేసులో ఈ జర్మన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 53 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 18 నిమిషాల 33.352 సెకన్లలో పూర్తి చేశాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెటెల్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. మొదట్లో గేర్ బాక్స్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ ‘ట్రిపుల్ వరల్డ్ చాంపియన్’ ఆ తర్వాత అన్ని అడ్డంకులను అధిగమించి గమ్యానికి సాఫీగా చేరాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన వెటెల్ సహచరుడు వెబెర్‌కు మూడో స్థానం దక్కింది.
ఫెరారీ డ్రైవర్ అలోన్సో రెండో స్థానంలో నిలిచాడు. 12వ స్థానం నుంచి రేసును ప్రారంభించిన హామిల్టన్ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు నిరాశే మిగిలింది. ఆ జట్టు ఇద్దరు డ్రైవర్లలో సుటిల్ 16వ స్థానంలో నిలువగా... పాల్ డి రెస్టా తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 22న జరుగుతుంది.