సుజుకా (జపాన్): సర్క్యూట్ మారినా... పోల్ పొజిషన్ దక్కకపోయినా... డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మాత్రం తన జోరు కొనసాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి రేసులో వెటెల్ విజేతగా నిలిచాడు. గత ఏడాది కూడా ఈ టైటిల్ నెగ్గిన వెటెల్‌కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. 53 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 26 నిమిషాల 49.301 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన మార్క్ వెబెర్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలిచాడు. లోటస్ జట్టు డ్రైవర్ గ్రోస్యెన్‌కు మూడో స్థానం లభించగా... ఫెర్నాండో అలోన్సో నాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు నిరాశ మిగిలింది. పాల్ డి రెస్టా 11వ స్థానంలో, సుటిల్ 14వ స్థానంలో నిలిచారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ రేసులో ముగ్గురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. తొలి ల్యాప్ మలుపులో బియాంచి (మారుసియా), గియెడో గార్డె (కాటర్‌హమ్) పరస్పరం ఢీకొట్టుకొని రేసు నుంచి నిష్ర్కమించారు. ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ కారు పంక్చర్ కావడంతో అతను ఏడో ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకున్నాడు.
తాజా విజయంతో వెటెల్ వరుసగా నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలువడం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం వెటెల్ 297 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 207 పాయింట్లతో అలోన్సో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య 90 పాయింట్ల వ్యత్యాసం ఉంది. సీజన్‌లో మరో నాలుగు రేసులు మిగిలి ఉన్నాయి. అలోన్సోకు టైటిల్ దక్కాలంటే మిగిలిన నాలుగు రేసుల్లో అతను కనీసం మూడింటిలో గెలిచి, మరో రేసులో రెండు లేదా మూడో స్థానంలో నిలువాలి. మరోవైపు ఈ నాలుగు రేసుల్లో వెటెల్‌కు ఒక్క పాయింట్ కూడా దక్కకూడదు. ప్రస్తుతం వెటెల్ జోరు చూస్తుంటే ఈనెల 27న భారత్‌లో జరిగే ఇండియన్ గ్రాండ్‌ప్రి రేసులో అతనికి అధికారికంగా ప్రపంచ టైటిల్ ఖాయమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
వెటెల్ జోరు
Published Mon, Oct 14 2013 12:32 AM | Last Updated on Mon, Sep 17 2018 5:59 PM
Advertisement