హామిల్టన్‌కు బ్రేక్
మోంజా: వరుసగా గత నాలుగు రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సాధించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ జోరుకు డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ కళ్లెం వేశాడు. శనివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెటెల్ దుమ్మురేపాడు. అందరికంటే వేగంగా ఒక నిమిషం 23.755 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ఈ సీజన్‌లో నాలుగోసారి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసు ఈ రెడ్‌బుల్ డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. వెటెల్ సహచరుడు మార్క్ వెబెర్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు.
మరోవైపు హామిల్టన్ పేలవ ప్రదర్శనతో ఆశ్చర్యకరంగా 12వ స్థానంలో నిలిచాడు. గత 67 రేసుల్లో అతను క్వాలిఫయింగ్ మూడో సెషన్‌కు అర్హత పొందకపోవడం ఇదే తొలిసారి. ‘మరీ మూర్ఖంగా డ్రైవ్ చేశాను. చాలా కాలం తర్వాత ఇంత చెత్తగా డ్రైవ్ చేసినందుకు జట్టు సిబ్బందికి క్షమాపణలు చెబుతున్నాను. ప్రధాన రేసులో సాధ్యమైనంత మెరుగైన స్థానం దక్కించుకునేందుకు కృషి చేస్తాను’ అని హామిల్టన్ అన్నాడు.
ఇక ఈ సీజన్‌లో ఐదుసార్లు విజేతగా నిలిచిన వెటెల్ క్వాలిఫయింగ్ సెషన్‌లో సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచాడు. తొలి రెండు క్వాలిఫయింగ్ సెషన్స్‌లో అందరికంటే వేగంగా ల్యాప్‌లను పూర్తి చేసిన అతను చివరిదైన మూడో సెషన్‌లోనూ దూసుకుపోయాడు. గతంలో రెండుసార్లు ఇటలీ గ్రాండ్‌ప్రిలో టైటిల్ నెగ్గిన ఈ జర్మన్ డ్రైవర్ మూడో విజయంపై విశ్వాసంతో ఉన్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు టాప్-10లో నిలువలేకపోయారు. సుటిల్ 14వ స్థానం నుంచి... పాల్ డి రెస్టా 16వ స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు.