వెటెల్‌కు ‘పోల్’
సింగపూర్: ఇటలీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో తన ఆధిక్యాన్ని లూయిస్ హామిల్టన్ (238 పాయింట్లు)కు కోల్పోయిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ (235 పాయింట్లు)కు మళ్లీ ఆధిక్యంలోకి వచ్చే అవకాశం వచ్చింది. సింగపూర్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో వెటెల్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 39.491 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ సాధించాడు.
ఆదివారం జరిగే ప్రధాన రేసును వెటెల్ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), రికియార్డో (రెడ్‌బుల్) రెండు, మూడు స్థానాల నుంచి... రైకోనెన్ (ఫెరారీ), హామిల్టన్ నాలుగు, ఐదు స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు. సింగపూర్ గ్రాండ్‌ప్రిలో గత ఎనిమిదేళ్లలో ఏడుసార్లు ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన వారికే విజయం దక్కడం విశేషం.