వెటెల్ వచ్చేశాడు!
మలేసియా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
సెపాంగ్ (మలేసియా): ఏడాది కాలంగా హామిల్టన్, రోస్‌బర్గ్ జోరులో వెనుకబడిపోయిన ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ కొత్త సీజన్‌లో దూసుకొచ్చాడు. విఖ్యాత ఫెరారీ జట్టు తరఫున బరిలోకి దిగిన ఈ జర్మన్ డ్రైవర్ 20 రేసుల తర్వాత తన ఖాతాలో తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అంతేకాకుండా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత డీలా పడిన ఫెరారీ జట్టుకు 35 రేసుల తర్వాత టైటిల్‌ను అందించాడు. ఆదివారం జరిగిన మలేసియా గ్రాండ్‌ప్రి రేసులో వెటెల్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసును రెండో స్థానం నుంచి మొదలుపెట్టిన వెటెల్ గంటా 41 నిమిషాల 05.793 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ప్రపంచ చాంపియన్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. హామిల్టన్ సహచరుడు రోస్‌బర్గ్‌కు మూడో స్థానం లభించింది. 2010 నుంచి నాలుగేళ్లపాటు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన వెటెల్‌కు గత ఏడాది కలసిరాలేదు. బరిలో దిగిన 19 రేసుల్లో అతను ఒక్కదాంట్లోనూ గెలువలేకపోయాడు.
ఈ సీజన్‌లో జట్టు మారిన అతను తొలి విజయాన్ని దక్కించుకొని మున్ముందు రేసుల్లో హామిల్టన్, రోస్‌బర్గ్‌లకు తన నుంచి గట్టిపోటీ తప్పదని సంకేతాలు పంపించాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు ఈ రేసు నిరాశను మిగిల్చింది. ‘ఫోర్స్’ డ్రైవర్లు సెర్గియో పెరెజ్ 13వ, హుల్కెన్‌బర్గ్ 14వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. సీజన్‌లోని తదుపరి రేసు చైనా గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 12న జరుగుతుంది.