
ఎదురులేని వెటెల్
యోన్‌గామ్ (దక్షిణ కొరియా): ఊహించిన ఫలితమే వచ్చింది. క్వాలిఫయింగ్‌లోనే కాదు ప్రధాన రేసుల్లోనూ సెబాస్టియన్ వెటెల్ తన సంపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన కొరియా గ్రాండ్‌ప్రిలో ఈ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. వరుసగా నాలుగో విజయం సాధించడంతోపాటు ఈ సీజన్‌లో ఎనిమిదో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 55 ల్యాప్‌ల కొరియా గ్రాండ్‌ప్రి రేసును గంటా 43 నిమిషాల 13.701 సెకన్లలో పూర్తి చేసిన వెటెల్ వరుసగా నాలుగో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌కు చేరువయ్యాడు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 13న జరుగుతుంది.
అద్భుతాలు జరిగితే తప్ప ఈసారీ వెటెల్‌కే ప్రపంచ చాంపియన్‌షిప్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 19 రేసుల ఈ సీజన్‌లో ఇప్పటికి 14 రేసులు పూర్తయ్యాయి. వెటెల్ మొత్తం 272 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.... అలోన్సో 195 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య 77 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం వెటెల్ జోరు చూస్తుంటే తదుపరి ఐదు రేసుల్లో అతణ్ని సమీప ప్రత్యర్థులు అలోన్సో, రైకోనెన్, హామిల్టన్ నిలువరించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. వచ్చేవారం జపాన్ గ్రాండ్‌ప్రిలో వెటెల్ గెలిచి అలోన్సో టాప్-8లో లేకపోతే ఈ జర్మన్ డ్రైవర్‌కు టైటిల్ ఖాయమవుతుంది.
వరుసగా మూడో రేసులోనూ ‘పోల్ పొజిషన్’తో దూసుకెళ్లిన వెటెల్‌కు ఏ దశలోనూ ప్రతిఘటన ఎదురుకాలేదు. ఆద్యంతం ఆధిక్యంలో ఉన్న వెటెల్ నాలుగు సెకన్ల తేడాతో విజయాన్ని దక్కించుకొని వరుసగా మూడో ఏడాది కొరియా గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
ఈ రేసులో 22 మంది డ్రైవర్లు బరిలోకి దిగగా... ఐదుగురు రేసును పూర్తి చేయలేకపోయారు. వెటెల్ సహచరుడు వెబెర్ కారులో మంటలు చెలరేగడంతో అతను 36వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకున్నాడు. సాంకేతిక సమస్యలతో జీన్ వెర్జెన్ 53వ ల్యాప్‌లో... రికియార్డో (ఎస్టీఆర్) 52వ ల్యాప్‌లో వైదొలిగారు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు నిరాశ ఎదురైంది. 24వ ల్యాప్‌లో నియంత్రణ కోల్పోయిన పాల్ డి రెస్టా ట్రాక్ నుంచి పక్కకు వెళ్లిపోగా... కారులో సమస్య తలెత్తడంతో 50వ ల్యాప్‌లో సుటిల్ రేసును నిలిపివేశాడు.