హామిల్టన్ హవా...
► చైనా గ్రాండ్‌ప్రి టైటిల్ కైవసం
► కెరీర్‌లో 54వ టైటిల్ సొంతం
షాంఘై: క్వాలిఫయింగ్ సెషన్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 37 నిమిషాల 36.160 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందా డు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్‌లో ఇది 54వ టైటిల్.
‘పోల్ పొజిషన్’తో ఈ రేసును ఆరంభించిన హామిల్టన్‌కు ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయితే హామిల్టన్ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా తన ఆధిక్యాన్ని కాపాడుకుంటూ అందరికంటే ముందు గమ్యానికి చేరాడు. వెటెల్‌కు రెండో స్థానం లభించగా... వెర్‌స్టాపెన్ మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఒకాన్ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. హామిల్టన్ గమ్యం చేరే సమయానికి ఎనిమిది మంది డ్రైవర్లు చివరి ల్యాప్‌ను ఇంకా పూర్తి చేయకపోవడం గమనార్హం. మరో ఐదుగురు డ్రైవర్లు రేసును పూర్తి చేయకుండానే మధ్యలోనే వైదొలిగారు. సీజన్‌లోని మూడో రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 16న జరుగుతుంది.