ఎఫ్1కు వేళాయె..!
నేటి నుంచి కొత్త సీజన్ షురూ
మెల్‌బోర్న్: డిఫెండింగ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) మళ్లీ టైటిల్ నిలబెట్టుకుంటాడా... నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచి గతేడాది విఫలమైన సెబాస్టియన్ వెటెల్ కొత్త జట్టు ఫెరారీతో మళ్లీ గాడిలో పడతాడా... ఈసారైనా ఎలాంటి ప్రమాదాలు లేకుండా అంతా సాఫీగా సాగుతుందా... భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ మరింత మెరుగైన ప్రదర్శన చేస్తుందా... ఈ సందేహాల నడుమ 2015 ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌కు శనివారంతో తెరలేవనుంది. ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగే ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రితో మొదలయ్యే కొత్త సీజన్‌కు నవంబరు 29న అబుదాబి గ్రాండ్‌ప్రి రేసుతో ముగింపు లభిస్తుంది.
శనివారం ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్ జరుగుతుంది. ఈ సెషన్ ఫలితాల ఆధారంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును ఆయా డ్రైవర్లు ఏ ఏ స్థానం నుంచి (గ్రిడ్ పొజి షన్స్) ప్రారంభించాలో నిర్ణయిస్తారు. తొమ్మిది నెలలపాటు సుదీర్ఘంగా సాగే ఈ సీజన్‌లో మొత్తం 20 రేసులు ఉంటాయి. అత్యధిక పాయింట్లు సాధించిన వారికి ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్... అత్యధిక పాయింట్లు నెగ్గిన జట్టుకు ‘కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్ అందజేస్తారు.