వెటెల్ నిరీక్షణ ముగిసె...
►27 రేసుల తర్వాత తొలి విజయం
►ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
మెల్‌బోర్న్: ఒకటా... రెండా...మూడా... ఏకంగా 27 రేసుల నిరీక్షణ ముగిసింది. హామిల్టన్, రోస్‌బర్గ్ దాటికి ఏడాదిన్నర కాలంగా ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయిన నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 2017 ఫార్ములావన్ సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వెటెల్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన 57 ల్యాప్‌ల ఈ రేసులో వెటెల్ గంటా 24 నిమిషాల 11.670 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2015 సెప్టెంబరులో సింగపూర్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన తర్వాత వెటెల్ ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే కావడం విశేషం. ఓవరాల్‌గా వెటెల్ కెరీర్‌లో ఇది 43వ టైటిల్. మరోవైపు 2007 తర్వాత ఫెరారీ జట్టు డ్రైవర్‌కు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి టైటిల్ లభించడం గమనార్హం.
వరుసగా నాలుగో ఏడాది ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. హామిల్టన్ గంటా 24 నిమిషాల 21.645 సెకన్లలో గమ్యానికి చేరుకున్నాడు. 17వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్న హామిల్టన్ టైర్లు మార్చుకోవడానికి విరామం తీసుకోగా... రెండో స్థానంలో ఉన్న వెటెల్ ముందుకు దూసుకెళ్లాడు. అక్కడి నుంచి వెటెల్‌ను అందుకోవడంలో మిగతా డ్రైవర్లు వెనుకబడ్డారు. మెర్సిడెస్ జట్టుకే చెందిన బొటాస్ మూడో స్థానాన్ని, ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ నాలుగో స్థానాన్ని పొందారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో, ఒకాన్ పదో స్థానంలో నిలిచి పాయింట్ల ఖాతా తెరిచారు. మొత్తం 20 మంది డ్రైవర్లు బరిలోకి దిగగా... ఏడుగురు డ్రైవర్లు రేసును పూర్తి చేయలేక మధ్యలోనే వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు చైనా గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 9న జరుగుతుంది.
గమ్యం చేరారిలా (టాప్–10): 1. వెటెల్ (ఫెరారీ; 1గం:24ని:11.670 సెకన్లు), 2. హామిల్టన్ (మెర్సిడెస్; 1:24:21.645), 3. బొటాస్ (మెర్సిడెస్; 1:24:22.920), 4. రైకోనెన్ (ఫెరారీ; 1:24:34.063), 5. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్; 1:24:40.497), 6. మసా (విలియమ్స్; 1:25:35.056), 7. పెరెజ్ (ఫోర్స్ ఇండియా; +1 ల్యాప్), 8. సెయింజ్ (ఎస్టీఆర్; +1 ల్యాప్), 9. క్వియాట్ (ఎస్టీఆర్; +1 ల్యాప్), 10. ఒకాన్ (ఫోర్స్ ఇండియా; +1 ల్యాప్).