వెర్‌స్టాపెన్ సంచలనం
పిన్న వయస్సులో ఎఫ్1 టైటిల్ నెగ్గిన డ్రైవర్‌గా రికార్డు
బార్సిలోనా: ఫార్ములావన్‌లో ఆదివారం పెను సంచలనం నమోదైంది. స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టుకు చెందిన 18 ఏళ్ల మాక్స్ వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. తద్వారా ఫార్ములావన్‌లో పిన్న వయస్సులో టైటిల్ సాధించిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. దాంతో వెటెల్ (21 ఏళ్ల 74 రోజులు; 2008లో ఇటలీ గ్రాండ్‌ప్రి) పేరిట ఉన్న ఈ రికార్డు తెరమరుగైంది. 66 ల్యాప్‌లు ఉన్న స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్ గంటా 41 నిమిషాల 40.017 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా నిలిచాడు.
రైకోనెన్ (ఫెరారీ), వెటెల్ (ఫెరారీ) వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లలో పెరెజ్ ఏడో స్థానాన్ని సంపాదించగా... హుల్కెన్‌బర్గ్ 20వ ల్యాప్‌లో వైదొలిగాడు. మెర్సిడెస్ జట్టు స్టార్ డ్రైవర్లు హామిల్టన్, రోస్‌బర్గ్ తొలి ల్యాప్‌లోనే పరస్పరం ఢీకొట్టుకొని తప్పుకున్నారు.