వెబెర్‌కు తొలి ‘పోల్’
సుజుకా (జపాన్): తన సహచరుడు సెబాస్టియన్ వెటెల్ విజయాల నీడలో వెనుకబడిపోయిన మార్క్ వెబెర్ (రెడ్‌బుల్) ఈ సీజన్‌లో తొలిసారి ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాడు. శనివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో వెబెర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 30.915 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ఈ ఏడాది తొలిసారి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. ఈ ఏడాది తర్వాత ఫార్ములావన్‌కు వీడ్కోలు చెప్పనున్న ఈ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ ప్రస్తుత సీజన్‌లో ఒక్క విజయాన్నీ నమోదు చేయలేకపోయాడు. మరోవైపు వెబెర్ సహచరుడు వెటెల్ క్వాలిఫయింగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు.
ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ల ద్వయం వరుసగా తొలి రెండు స్థానాల నుంచి ప్రారంభించనుంది. వెబెర్ ‘పోల్ పొజిషన్’ సాధించినా... వరుసగా నాలుగు విజయాలతో జోరుమీదున్న వెటెల్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో 272 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న వెటెల్ ఆదివారం జరిగే రేసులో విజయం సాధించి.... 195 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఫెర్నాండో అలోన్సో (ఫెరారీ) టాప్-8లో నిలువకపోతే.... సీజన్‌లో మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే వెటెల్‌కు డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమవుతుంది.
సుటిల్‌పై పెనాల్టీ
క్వాలిఫయింగ్ సెషన్‌లో భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు నిరాశ మిగిలింది. పాల్ డి రెస్టా 12వ స్థానంలో... సుటిల్ 17వ స్థానంలో నిలిచారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా సుటిల్ గేర్ బాక్స్‌ను మార్చడంతో అతనిపై ఐదు గ్రిడ్‌ల పెనాల్టీని విధించారు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును సుటిల్ చివరిదైన 22వ స్థానం నుంచి మొదలుపెడతాడు.