‘హ్యాట్రిక్’పై వెటెల్ గురి
సింగపూర్: గత ఏడాది మాదిరిగా ఈసారీ ఆసియా సర్క్యూట్ రేసులలో తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ సిద్ధమయ్యాడు. ఆదివారం జరగనున్న సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసును ఈ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించనున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన వెటెల్ అనుకున్న ఫలితాన్ని సాధించాడు. ఈ జర్మనీ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 42.841 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ఈ సీజన్‌లో ఐదోసారి ‘పోల్ పొజిషన్’ను దక్కించుకున్నాడు. ట్రాక్‌కు అనుగుణంగా సూపర్ సాఫ్ట్ టైర్స్‌తో డ్రైవ్ చేసిన వెటెల్ తన ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచాడు.
రోస్‌బర్గ్ (మెర్సిడెస్) రెండో స్థానం నుంచి... గ్రోస్యెన్ (లోటస్) మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. సింగపూర్ గ్రాండ్‌ప్రిలో 2012, 2011లలో టైటిల్ సాధించిన వెటెల్ వరుసగా మూడోసారి నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు నిరాశే మిగిలింది. సుటిల్ 15వ స్థానం నుంచి... పాల్ డి రెస్టా 17వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు.