వెటెల్‌దే విక్టరీ
హంగేరి గ్రాండ్‌ప్రిలో టైటిల్ కైవసం
బుడాపెస్ట్ (హంగేరి): తొలి ల్యాప్ నుంచి చివరి ల్యాప్ వరకు సాధికారికంగా డ్రైవ్ చేసిన ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని సాధించాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో ఈ జర్మనీ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 70 ల్యాప్‌లను వెటెల్ గంటా 39 నిమిషాల 46.713 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెటెల్‌కు తన జట్టు సహచరుడు కిమీ రైకోనెన్‌తో గట్టిపోటీ ఎదురైనా... ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా గమ్యానికి చేరాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే వెటెల్ ఆస్ట్రేలియన్, బహ్రెయిన్, మొనాకో గ్రాండ్‌ప్రి రేసుల్లో టైటిల్స్ సాధించాడు.
రైకోనెన్‌కు రెండో స్థానం లభించగా... మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు బొటాస్, లూయిస్ హామిల్టన్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. సెర్గియో పెరెజ్ ఎనిమిదో స్థానంలో, ఎస్టెబన్ ఒకాన్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. మొత్తం 20 మంది డ్రైవర్లు రేసులో పాల్గొనగా... నికో హుల్కెన్‌బర్గ్ (రెనౌ), పాల్ డి రెస్టా (విలియమ్స్), గ్రోస్యెన్ (హాస్), రికియార్డో (రెడ్‌బుల్) మధ్యలోనే వైదొలిగారు. మొత్తం 20 రేసులున్న ఈ సీజన్‌లో ఇప్పటివరకు పదకొండు రేసులు పూర్తయ్యాయి. ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో వెటెల్ (202 పాయింట్లు), హామిల్టన్ (188 పాయింట్లు), బొటాస్ (169 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి ఆగస్టు 27న జరుగుతుంది.